Saturday, September 4, 2021

 ఉపన్యాస త్రయి-1

(నెలనెలా బ్రౌన్ లైబ్రరీలో కడప కవులపై జరుగుతున్న సదస్సులలో సుబ్బరాయకవి చేసిన మూడు ప్రసంగములు)

 

 Gonnnere Hardy White Water Lily | White Water Lilies - Hydrosphere Water  Gardens

 ప్రసం గ కర్త

పి.సుబ్బరాయుడు.

42/490 ఎన్.జి.  కాలనీ

కడప -516002

సెల్-9966504951

 

 

 

 

 

 

తొలిలుకులు

            సెప్టంబర్ 2011 నుండి యోగి నేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లో "నెలనెలా మనజిల్లా సాహిత్యం" అను పేరుతో కార్యక్రమాలు జరుగు చున్నవి. అందులో నాకు అయ్యలరాజు రామభద్రుడు, కాండూరు నరసింహాచార్యులు మరియూ పుట్టపర్తి నారాయణాచార్యుల మీద ఉపన్యసించే  అవకాశం లభించింది. కార్యక్రమ నిర్వాహకులకు  నా హృదయపూర్వక ధన్యవాదములు.

 

యీ ఉపన్యాస పాఠాలను భద్రపరిచే సదుద్దేశ్యంతో పుస్తక రూపమివ్వడం జరిగింది. ఇవి విద్యార్థులకు ఉపయోగపడగలవని నా నమ్మిక. అది జరిగితే సంతోషమే..... నమస్తే!

 

                                                                                     --  సబ్బరాయకవి

 

 

 

 

 

 

 

 

 

అయ్యలరాజు రామభద్రుడు

 కావ్యకళా సౌందర్య మాధుర్యముల వెదజల్లు సత్కవివరేన్యుడు, భాషామర్మ జ్ఞుడు, హృదయపద్మాదిష్ట శ్రీరామభధ్రడు, పరమభావుక పట్టభద్రుడు, సరసవైచిత్రీ వైదగ్ధ్య సముద్రుడు, పుత్తేటి వంశస్థుడు, ఆపస్తంబసూత్రుడు, కౌండిన్యగోత్రుడు, శ్రీమదొంటిమిట్ట రఘువీర శతకకర్త తిప్పయ ప్రపౌత్రుడు, పర్వతన్న పౌత్రుడు, అక్కయ పుత్రుడు, ముమ్మడి వరదాచార్య శిష్యుడు రామభద్ర కవీంద్రుడు. "రెట్టమత శాస్త్ర" కర్త అయ్యల భాస్కరుడు, "హంసవింశతి" కర్త నారాయణ కవి వీరి తర్వాతి వంశీయులు.

 

రామభద్రుడు శ్రీమదొంటిమిట్ట కోదండ రామానుగ్రహ సంపన్నుడని, సాక్షాత్తూ సీతమ్మ స్తన్యము గ్రోలి వరకవియైనాడని ప్రతీతి. ఒకనాడు బాలరామభద్రుడు తప్పిపోయి దేవాలయములోనే వుండిపోగా ఆ బాలునకు రాత్రి సీతాదేవి తనపాలనిచ్చి సముదాయించినదట. ఇట్టి కథలు రామభద్రుని జీవితమున అనేకములు కలవు. వీటిని బట్టి, రామభద్రుడు గొప్ప రామభక్తుడై యుండునని గ్రహింపనగును.

 

ఈ కవి తన "రామాభ్యుదయమును" అళియరామరాజు మేనల్లుడగు గొబ్బూరి నరసరాజునకు అంకితమిచ్చినాడు. అది క్రీ.శ 1550-1555 మధ్య జరిగిన సంఘటన. ఇట్టి ఆధారములవలన ఈకవి శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజములలో యువకవిగా నుండెననియూ, అళియ రామరాజు కాలమున ఫలితకేశుడైన కవియని పలువురి భావన.

 

రామాభ్యుదయుముగాక ఈ కవి "సకలకథాసార సంగ్రహము" ను, రాయల అభ్యర్థన మేరకు వ్రాసెనని ప్రతీతి. కానీ గ్రంథము పరిశీలించిన పండితులు అది చాలా పేలవమైన రచనయని, తప్పులతడకేగాక గ్రంథమున తెలిపిన గోత్రనామము "కాశ్య ప"మగుటవల్లనూ రామభద్రుడను వేరొక కవి వ్రాసియుండునని తేల్చిరి.

 

క్రీ.శ 1840 అక్టోబరులో బ్రౌన్‍దొర, మెకంజీ లైబ్రరీ నుండి ఈ "సకలకథాసారసంగ్రహము" ను తెప్పించి శుద్ధప్రతి వ్రాయించిరి. గ్రంథము అసంపూర్ణము. చివరి ఆశ్వాసములు అలభ్యమగుటచే అసలీ గ్రంథము యెన్ని పుటలు గలిగినదో, యెంతటిదో తెలియదు. బ్రౌన్‍దొర జూలై 1883 లో యిలా యీ గ్రంథంపై ఒకనోట్ వ్రాశారు.

"This is an illiterate poem of no merit. What ever parts are superior are stolen from better authors"

 "సకలకథాసారసంగ్రహ" గ్రంథ పరిస్థితి యిది  . ఇక పోతే రామాభ్యుదయమే రామభద్రుని ప్రజ్ఞను తెలుపు గ్రంథమై నిలిచినది.

రామాభ్యుదయం" ప్రబంధశైలిలో నున్న రామాయణము. శ్లేషలు, వర్ణనలూ, అచ్చతెనుగూ మరియూ జ టి ల సంస్కృతపదప్రయోగ పద్యములతో పండితారాధ్యమైనదేగానీ మామూలు రామాయణ పాఠకుల నాకర్షింపలేకపోయినది. దీనికి తోడు అవాల్మీకములు సైతము యీ రామాభ్యుదయమున కాస్తా యెక్కువే దొర్లినవి. అవి దశరథుడు భార్యసహితుడై వనవిహారం చెస్తాడు. వాల్మీకిరామయణం లో అతడొక్కడే వేటకువెళతాడు. మునికుమరుడైన శ్రవణుని వధానంతరంకూడా భార్యలతో కలిసి హాయిగా దశరథుడు వనవిహారంచేయడం రామభద్రుడు చేసిన అనౌచిత్య మనిపిస్తుంది. ఇక్కడ దశరథుడే ఋష్యశృంగుని, పుత్రకామేష్టి  చేయడానికి అరణ్యాలనుండి పిలిపిస్తాడు. కానీ వాల్మీకిరామయణంలో రోమపాదుడు రప్పించుకొని తన రాజ్యంలోని కఱువు పోగొట్టుకుంటాడు.

 

పుత్రకామేష్టియజ్ఞంలో లభించిన పాయసం దశరథుడు భార్యలకు పంచుతూ కౌసల్యాకైకలకు చెరిసగంయిస్తే వారు వారికిచ్చినదానిలో సగం సగం సుమిత్రకిస్తారు. వాల్మీకి అలాచెప్పలేదు. పాయసం మొత్తంలో సగం కౌసల్యకిచ్చి మిగిలినదానిలో సగం సుమిత్రకిచ్చి ఆతర్వత మిగిలిన దానిలో సగం కైకకిస్తాడు. కైకకివ్వగా మిగిలినది తిరిగీ రెండవసారి సుమిత్రకిచ్చేస్తాడు.

 

విశ్వమిత్రుడడుగగానే  రామలక్ష్మణులను యాగరక్షణకు పంపించేస్తాడు. వాల్మీకంలోవలె వ్యథజెందడు. అహల్య యితర రామాయణాలలో వలెనే శాపవశమున రాయిగా మారుతుంది. వాల్మీకంలోవలె వాయురూపంలో ధూళిదూసరి యై పోలేదు. మంథర పాత్ర రామభ్యుదయంలో లేనేలేదు. సీతకు మాటమాత్రంకూడా ముందుగా చెప్పకుండా రాముడు వనవాసానికి తీసుకొని పోతాడు.  రామాభ్యుదయంలో శబరి నామమాత్రం. లంకనుండి అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు పుష్పకవిమానం నుండి శబరిఆశ్రమం చూపి ఒకమాటచెబుతాడంతే. హనుమ సముద్రలఘన సమయంలో యెదురైన మైనాక, సురస, సింహిక కథలూ, లంకిణికథా రామాభ్యుదయంలో లేవు.

 

ఈ ప్రబంధము 299 వచనములు 1526 పద్యములతో కలిసి మొత్తం 1825 పద్యగద్యములతో 8 అశ్వాసముల విస్తారమై యున్నది. రచన ప్రౌఢమై యున్నది. ఆనాటి ప్రౌఢ ప్రబంధముల కేమాత్రమూ తీసిపోక నిలచినది.  అంతేగాక అన్నివిషయములలో రామాభ్యుదయమే మెఱుగై నిలచినది.

 

అల్లసాని వారి అల్లిక జిగిబిగి మూడశ్వాసములతో ముగియుచున్నది. కళాపూర్ణోదయకర్త కల్పనాచమత్కృతి ఆరశ్వాసములతో సరిపెట్టుకున్నది. రామరాజభూషణుని ప్రకృతాప్రకృత శ్లేషప్రయోగ వైదగ్ధ్యము విసువు గలిగించునంతటి విస్తృతి నందినది. ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకులు మొదటి అశ్వాసమునకే తుదముట్టుచున్నవి. కానీ రామాభ్యుదయము ఒక్కదోరణిలోనే రచింపబడి అల్లికలోని జిగిబిగి, కల్పనాచాతుర్యము, గ్రంథమంతటా కనబడుతూ, పండితులకు పండువ చేసినది.

 

ఇక రామాభ్యుదయ రచనలోని కవి కౌశలమును ఒకింత పరిశీలింతము. ఈయన శ్లేషలద్భుతములు. ఈ పద్యము గమనింపుడు.

 

        కం:  గిరికార్ముక నిర్గతమై

                   హరిశర మపుడసుర పురవరాభి ముఖంబై

                   సురగరుడ దురవలోకన

                   త్వరతో జనెనొక మహారవం బుదయింపన్.

 

ఇది హనుమ సముద్రలంఘన ఘట్టములోనిది. ఇందులో ప్రస్తుతాప్రస్తుత విషయములు రెండు స్పష్టముగా గనపడు చున్నవి. కొండ అనే విల్లునుండి కపి యనే బాణము వెలువడి రాక్షసపురమైన లంకవైపునకు సురగరుడులకు సైతం అంచనాకందని వేగంతో గొప్ప శబ్దం పుట్టగా దూసుకపోయిందన్నది ప్రస్తుతార్థం. ఇకపోతే త్రిపురాసుర సంహారం కోసం శివుడు మేరుపర్వతం విల్లుగాగైకొని హరిని శరముగా జేసికొని త్రిపురాసురులపై ప్రయోగింపగా అది సురగరుడులకు సైతం అంచనాకందని వేగంతో గొప్ప శబ్దంచేస్తూ దూసుకెళ్ళీందని స్పష్టంగా అర్థమౌతున్నది. ఇందులో శివుడు త్రిపురాలను దహించివేశాడు. కనుక అసురపురమైన లంకకూడా దహించుక పోతుందన్న ధ్వని యిమిడి యుండుట గమనార్హం. అట్లే  రాముడు పంపాసరోవరమును తిలకించి పలికిన యీ పద్యము జూడుడు.

 

తే.గీ:        మత్య్య కూర్మావతార సామాగ్రి గాంచి

          యహి మకర వంశమున బొల్చి యహరహంబు

          లక్ష్మణాన్విత గతి దనలాగు దొరయు

          నట్టి పంపాసరోవరం బపుడు గాంచె.

 

పంపాసరోవరము రామునివలె నున్నదట. రాముడు హరియవతారము. గనుక మత్య్యకూర్మావతారములు ఆయనవే. అహిమకర వంశమనగా సూర్యవంశము. అట్టి సూర్యవంశమున వెలుగొందిన రాముడు యెల్లవేళల లక్ష్మణునితో కలిసి యున్నాడు. ఇక సరోవరపరంగా చూస్తే అందు చేపలూ, తాబేళ్ళూ వున్నాయి. పాములూ ముసళ్ళతెగలూ వున్నాయి. ఎప్పుడూ ఆసరస్సు నాశ్రయించుకొని లక్ష్మణలు అనగా నీటిబెగ్గురుపక్షు లున్నాయి. అంటే సరస్సూ రాముడు ఒకేలక్షణములతో భాసిల్లుచున్నారని అర్థము.  కవి శ్లేషచమత్కారమునకు యింకొక్క పద్యం గమనించి ముందుకు సాగుదము.

 

 

తే.గీ:        పంటపూబోడి గారాపు బట్టికౌను.

                మాయ యా మానవతి సూక్తి మధుర యవ్వె

              లంది కటిసీమ కాంచీస్థలంబు గాన

             సార్థ మయ్యెను బుర సంజ్ఞ యంగలతకు.

 

పంటపూబోడి యనగా భూదేవి ఆ భూదేవి పుత్రి సీత నడుము మాయ యనగా ఉన్నట్లు కనబడుతుందేగాని అసలు లేదని భావము. ఇది ఉత్ప్రేక్ష. చాలా సన్ననడుమని అర్ఠము. ఆమె మాట మధురం. ఆమె మొలనూలు చే అలంకరింపబడినది. ఈ పద్యంలో మాయా. మధుర, కాంచీ వంటి పురనామములు వాడుటవలన సీతాదేవి అంగలతకు పుర సంజ్ఞ సార్థకమైనదట. ఇట్టి శ్లేషచమత్కృతులు రామాభ్యుదయమున కోకొల్లలు.

 

కవి గీర్వాణా0ధ్ర గిరాందురంధరుడే గాక అచ్చతెనుగున ముచ్చటగా పద్యము లల్లగల సమర్థుడు. మచ్చునకొక అచ్చతెనుగు పద్యము చూతము.

 

        సీ:    తొవతమ్మివిందు గన్దోయి మించినవాడు

                             జాళువా మిసిమి పచ్చడమువాడు

                   కన్నువీనులసెజ్జ నున్న వన్నియవాడు

                             తపసిడెందపు టిండ్ల దనరువాడు

                   కలిమిచేడియ బంట వలతినేలినవాడు

                             పుడమివేల్పులకు జేపడనివాడు

                   తొంటి జేజేమూక దూలింపగలవాడు

                             ముజ్జగంబులచూలు బొడ్డువాడు

 

 

        తే.గీ:        సొగసి నవ్వక నవ్వు నెమ్మొగమువాడు

                   కలుము లీనెడు తళుకుగ్రేగంటివాడు

                   పేదసాదల బ్రతికించు పెంపువాడు

                   పాలమున్నీటిలోన జూపట్టె నపుడు.

 

అచ్చతెనుగు గదా! వివరించవలసిందే మరి. పాలకడలిలో మహావుష్ణువు దర్శన మిచ్చినాడు. ఆయన కనుదోయి తొవతమ్మి విందు. తొవ అనగా కలువ తమ్మి యనగా కమలము. వీటికి విందొనర్చువారు శశి సూర్యులు. అనగా సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు. ఆయన జాళువామిసిమి పచ్చడమువాడు. అనగా బంగారుమెఱుపు గల పట్టు వస్త్రము గట్టినవాడు. కన్నువీనుల సెజ్జ నున్న వన్నియవాడు. అనగా కన్నులే చెవులుగా గల సర్పము పానుపుగా వెలుగొందువాడు. తపసిడెందపుటిండ్ల దనరువాడు అంటే, మునిహృదయమే నివాసమై వెలయువాడు. కలిమిచేడియ పంటవలతి అంటే లక్ష్మి.  ఆ లక్ష్మినేలుకొనుచున్నవాడు. తొంటి జేజేమూక యనగా పూర్వదేవతలనబడు రాక్షసులు. ఆ రాక్షసాంతకుడు. ముజ్జగంబులచూలు బొడ్డువాడు అనగా ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మను తననాభిన నుత్పన్నము చేసినవాడు. ఇలా ముచ్చటైన తెలుగు పదాలను ధారళముగా ప్రయోగించి పద్యమల్లినాడు. అందునా "వాడు వాడు" అంటూ అంత్యప్రాస నందముగా నతికినాడు.

 

ఇక సంస్కృతభూయిష్ట దీర్ఘసమాసాలతో గూడిన పద్యాన్నీ గమనించండి కవిప్రజ్ఞ విదితమౌతుంది.

 

        సీ:    సింహనఖాంకురచ్ఛిన్న వారణకుంభ

                             జనిత ముక్తాఫల శర్కరిలము

                   సమదసూకర పరస్పర భీకరాఘాత

                             శిధిల దంష్ట్రాచూర్ణ సికతిలంబు

                   గంధసింధుర ఘటాకట కటాహస్రవత్

                             బంధురదానాంబు పంకిలంబు

                   దవగంధవహ బంధు దహ్యమానానేక

                             కౌశికాగరు ధూప గంధిలంబు

 

        తే.గీ:        పృధుల షడ్జస్వరోద్గీత భిల్లు పల్ల

                   వాధరా గీతికాకర్ణనాతిభీతి

                   పరవశాత్మ పటీర కోటర కుటీర

                   లీనఫణి యగు నక్కాన కాననయ్యె.

 

ఇది అరణ్య వర్ణనం. అక్కడ సింహాలు యెగసి మదగజకుంభస్థలాలను చీల్చగా బయటపడిన ముత్యాలు గులకరాళ్ళుగా పడివున్నాయి. క్రొవ్వి పోరాడటంవలన అడవిపందుల కోరలు నలిగి యిసుకవలె పొడిపొడియై పడివుంది. బలిష్టమైన యేనుగుల మంద గండభాగాలనుండి స్రవించిన మదజలం కడవలతో పోసినట్లు నేల తడిసివుంది. అడవి దావానలానికి గురికావడంవల్ల అందలి అగరు, గుగ్గిలం చెట్లు కాలి సువాసనలు వెదజల్లుతున్నవి. అక్కడున్న భిల్లుజాతి మనుజులు షడ్జమంలో వేణువులూదటం వలన భయపడి నాగులు చందనపుచెట్ల తొఱ్ఱల్లో దా క్కు క్కు న్నాయి. ఈ పద్యము నాధారము చేసుకొని ఒక చిత్రమైన కథ ప్రచారములో నున్నది. రామభద్రుడు తనప్రబంధము దోషరహితమనీ, అందులో యెవరైనా తప్పుచూపితే వారు తమకాలితో తనతల తన్నవచ్చుననీ, అట్లు రంగమునదిగి తప్పు చూపలేకపోయినవానితల తాను తన్నెదననీ సవాలు విసిరెనట. ఆ సవాలు స్వీకరించి రామరాజభూషణుడు యీ పద్యమును చూపి యిందు పెద్దతప్పున్నది. భిల్లుల గానమునకు పాములు సంతసమున పడగలువిప్పి ఆడవలెగానీ, భయమున చెట్లతొఱ్ఱలలో యెందుకు దాగికొనునని తప్పుజూపెను. దానికి రామభద్రుడు ఒప్పుకొనక, రామరాజభూషణుడు పద్యమును సరిగా చదివి అర్థము చేసుకొనలేదనీ, తాను భిల్లులు షడ్జమములో మురళుల నూదిరని వ్రాసితిననీ, షడ్జమము నెమలిశబ్దము గనుక నాగులు భయపడినవనీ సమాధానముచెప్పి నోరుమూయించెను. పందెము ప్రకారము రామభద్రుడు తనకాలిని రామరాజభూషణుని శిరమునకానించెనని చెప్పుదురు. ఇది నమ్మరాని కథ. కవులింత కఠినులు కాజాలరు. దీనికి భిన్నమైన మరొక కథా ప్రచారమున నున్నది. వీరిరివురూ మంచి మిత్రులనీ రామరాజభూషణుని సహాయముననే రామభద్రుడు రాయల భువనవిజయమున స్థానము దక్కించుకున్నాడని, వారిద్దరి స్నేహమునకు గుర్తుగా రామభద్రుడు రచించిన "మోహాపదేశ తమోముద్రితములైన కనుదమ్ముల హిమాంబులునుపరాదు" అన్న విరహిణి మూర్చానంతర నిషిద్ధోపచర్యల సూచించు నొక పద్యమును తన వసుచరిత్రనందుంచుకొనెననీ చెప్పుదురు. ఇదియూ నమ్మ శక్యముగాని కథే. రామరాజభూషణుడు ఒకరి పద్యమును తనదిగా గ్రహించు నంతటి  బలహీనుడు కాదు. ఒకవేళ ముచ్చటపడి సరదాకు అలా చేసియుండిన చేసియుండవచ్చును. ముక్కుతిమ్మన వ్రాసిన "నానాసూన వితాన వాసనల" పద్యంకూడా యిలానే రామరాజభూషణుడు తన వసుచరిత్రలో కొని వాడుకొనెననియూ ఒక కథ వాడుకలోనున్నది. ఇదియు నొక సరదాకావచ్చును.

 

ఇక ప్రస్తుతాంశమునకు మరలివత్తుము. రామభద్రుడు సంస్కృతములోనూ అచ్చతెనుగులోనూ గుంభనముగా పద్యము నడుపుటేకాదు, ఒకే పద్యమున రెందువిద్యలూ చూపగల ఘనుడు. అందుననూ ఔచిత్య పోషణమద్భుతము. సీత అశోకవనంలో రక్కసి వలయంలోవున్నది. ఒకవైపు రాక్షసస్త్రీల కాఠిన్యమూ  మరోప్రక్క సీత దీనవస్థలోని మెత్తదనమూ యీ రెండు భావాలనూ, ఒకటి కఠిన సంస్కృత పదప్రయోగముతోను, రెండవది మృదుల తెలుగుపద ప్రయోగముతోనూ నడిపి చూపినతీరు చూడండి.

 

        సీ:    ఘూకకుటుంబినీ కోటిలో నడిరేయి

                             జక్కవ జవరాలు చిక్కినట్లు

                   జరఠ బిడాలికా జాలంబులోపల

                             చిలుక ముత్తైదువ మెలగినట్లు

                   మత్తశిఖండినీ మాలిక లోపల

                             పాపకన్నియ దగుల్పడినయట్లు

                   కితవ మృగాదన గృహిణి గణంబున

                             లేడి యిల్లాలుమ్మలించి నట్లు

 

        తే.గీ:        వేషభీషణ దానవ వితతిలోన

                   దల్లడంబుల బెదవులు దడుపుచున్న

                   సాధ్వి రఘువీర గేహిని జక్కజూచి

                   యవునొ కాదొ కదా యని యనిలసుతుడు.

 

హనుమంతుడు తొలుత గాంచిన సీతాసాధ్వి స్థితి యెట్లున్నదంటే,  గుడ్లగూబలగుంపు మధ్య రాత్రి చిక్కిన చక్రవాకపక్షి వలె నున్నది. గండుబిల్లుల మధ్య చిక్కిన చిలుకముతైదువ వలె నున్నది. క్రొవ్విన నెమళ్ళమధ్య నాగకన్యక చిక్కువడినట్లున్నది. సింగముల మధ్య ఆడులేడి చిక్కినట్లున్నది. చక్కని ఉపమానములతో పద్యము నడచినది.

 

ప్రబంధమున రామభద్రుని ప్రయోగములు పండితజన స్తవనీయములు. మచ్చునకీ యమకము జూడుడు.

 

        కం:  పులుగా నీకొలది తలం

                   పులు గావివి. నాకు నాలమున సమము  నిలిం

                   పులుగారు. వలవ దియ్యఱ

                   పులు. గాసిలనేల తొలగి పొమ్మావలకున్. 

 

సీతనపహరించి వెళుతున్న రావణుని జటాయువడ్డగించింది. అప్పుడు రావణుడు పల్కిన మాటలివి. నాల్గుపాదాలూ "పులుగా" యనే ప్రారంభించినాడు. మొదటి పులుగాకు పక్షీ యనియర్థం. రెండవది "తలంపులుగావు" మూ డవది "నిలింపులుగారు". ఇకనాల్గవది "వలవదియ్యఱపులు గాసిలనేల" యని ముందూవెనుకా అక్షరములు జోడిస్తూ విరుస్తూ వివిదార్థముల రాబట్టి చక్కని పద్యము నల్లినాడు.  యిక యీ పద్యము గమనింపుడు. ఇది ప్రఖ్యాత పద్యము. వాడిన పదాన్నే మళ్ళీ వాడుతాడు, గానీ అర్థము పూర్తిగావేరు.

 

        సీ:    కానకగన్న సంతానంబు గావున

                             కానకగన్న సంతానమయ్యె

                   నరయ గోత్రనిధానమై తోచు గావున

                             నరయ గోత్రనిధాన మయ్యెనేడు.

                ద్యిజకులాదరణ వర్దిష్ణుండు గావున

                             ద్విజకులాదరణ వర్దిష్ణుడయ్యె

                   వివిదాగమాంత సంవేద్యుండు గావున

                             వివిదాగమాంత సంవేద్యుడయ్యె

 

        తే.గీ:        కటకటా దాశరథి సనుత్కట కరీంద్ర

                   కటకలిత దాన ధారార్ధ్ర కటక మార్గ

                   గామి యెట్లు చరించు నుత్కట కరీంద్ర

                   కటకలిత దాన ధారార్ధ్ర కటక తటుల.

 

అడవికి వెళ్ళిన రామునిపై మమకారముతో దశరథుడు పడిన పరితాపమిది. సీసములోని ప్రతిపాదములోని ప్రథమార్ధంలోనూ ద్వితీయార్ధంలోనూ ఒకేపదం అర్థభేదంతో వాడబడింది. మొదటి కానకగన్నసంతానము, లేకలేక గలిగిన సంతానము. తర్వాతి కానకగన్న సంతానము అడవికోసమే గనిన సంతానమైనది. అలానే అవతలి పాదాలలో గోత్రనిధానం మొదట వంశానికేమూలమై తర్వాత అడవికే ఆధారమైంది. ద్విజకులాదరణ మెదట విప్రకులాదరణ తర్వాత పక్షిజాతికాదరణ మయింది. వివిధాగమాంత సంవేద్యుడు మొదట వివివేదాంత సంవేద్యుడై  తర్వాత చొరరాని వివిధారణ్యసంవేద్యుడయ్యాడు. (వివి +అగమ). తర్వాతి తేటగీతలోని మొదటి,తర్వాతి జత పాదాలలోని "ఉత్కట కరీంద్ర కటకలిత దానదారర్ధ్ర కటకము" మొదట, వేదండముల మదజలంచే తడిసిన రాజమార్గమైతే తర్వాత అడవియేనుగుల మదజలంచే తడిసిన కొండలోయ యయింది.

 

విషయము చెప్పుటలో రామభద్రుడు కడు చతురుడు. కౌసల్య రాముణ్ని కడుపులో మోస్తున్నది. ఆమె హరిమధ్యయట. చూడుడు.

 

        కం:  హరిమధ్య యనుట వర మం

                   దరగామినులందు వర్ణనామాత్రమగున్

                   బరమార్థము గౌసల్యాం

                   బుర హాక్షికి విష్ణు గర్భమున బూనుటచేన్

 

హరి యన సింహము కూడా యగును గనుక భామినులను హరిమధ్యలని వర్ణించటం పరిపాటి, కానీ కౌసల్య విషయం అట్లుగాదు. ఆమె నిజంగా హరిమధ్యయే. ఎందుచేతనంటే ఆమె హరిని తన గర్భమున ధరించియున్నది. ఇట్టి చతుర వర్ణనలు రామభ్యుదయమున ననేకములున్నవి. కవి రావణుని విరహవేదనను యెంత రమ్యముగా వర్ణించెనో చూడుడు.

 

        ఆ.వె:        చలము దనకుజెల్లి జాబిల్లి యంచునన్

                   బెట్టి మిగుల వాడిపుట్ట నూరి

                   నల్లగలువ తూపు నాపై ప్రయోగించె

                   చించె మరుడు ధైర్య కంచుకంబు.

 

అంటాడు. కసితో మన్మథుడు నల్లకలువబాణాన్ని చంద్రునిఅంచుపై సానబట్టి మరీ ప్రయోగించి తన ధై ర్య కవచాన్ని భేదించినాడట. ఇంకాయిలా వ్రాస్తాడు.

 

 

చం: వెడవిలుకాడు నెమ్మనము వేమరు గేదగి రేకు వంకిణిన్

          బొడువగ మేను పానుపున బొందక నిన్నభయప్రదాన మే

          నడిగెద నంచురా కఠినమై యిటు వెన్నెల వేడి వెన్కొనన్

          గొడుగులనీడ వచ్చితి జకోర విలోచన యేమి చెప్పుదున్.

 

సీతా నన్ను మారుడు మొగలిరేకు రంపపుకత్తితో మాటిమాటికి పొడిచి హృదయన్ని గాయపరిచాడు. పడక కుదరక నీదయకోసం బయలుదేరిన నాకు వెన్నెలకూడా వేడియై భరింపరానిదైంది. ఇక వీలులేక గొడుగులు పట్టించుకొని ఆ నీడలో నీదరి చేరినానని వాపోతాడు. ఇదివింటే, అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము గాక యీ మొగలిరేకు కఱకుకత్తి నెప్పుడు రామభద్రుడు మన్మథుని కిచ్చెనా? అనిపిస్తుంది. ప్రతినాయకుడైతేనేమి, రావణుని విరహవేదన మనకునూ జాలిగొల్పు చున్నదిగదా!

 

రామభద్రుడు కవిత్వాన్ని ప్రకృతితో పోల్చి వర్ణించడానికి చాల యిష్టపడతాడు.

 

శా:  ధారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘనశబ్ద స్ఫూర్తి వర్థిల్లగా

          దోరంబైన రసస్థితిన్ దరళ విద్యున్మాలికా లక్షణో

          దారంబై కవి సేవ్యమై వనమయూరారూఢి బ్రాపించి 

          ర్షారంభంబు ప్రబంధమట్లఖిల పద్యాక్రాంతమయ్యెన్‍దగన్!

 

అంటారు.వర్షారంభం ప్రబంధం వలె నున్నదట. ఇందు అటు ర్షారంభానికీ యిటు ప్రబంధానికీ సరిపోయే పదాలు గమనించండి. ధారాశుద్ధి, ఘనశబ్ధస్ఫూర్తి, దోరంబైన రసస్థితి , తరళ విద్యున్మాలికలు, అంటే వర్షారంభమున గలుగు మెఱుపులూ మెఱుపుదీవెలూ, అదే ప్రబంధమైతే తరళ విద్యున్మాలికా ఛందస్సులు. కవిసేవ్యమంటే అటు నీటికాకసేవ్యమూ, యిటు కవులసేవ్యమూ. యిక వనమయూరూఢి అంటే  అడవి నెమళ్ళ విలాసము యిటు వనమయూరాది వృత్తరూఢి యై  రెంటికీ అన్వయము సరిగ్గా కుదిరి ఆనందమును గూర్చినది. అట్లే మరొకచోట వ్యాకరణము యజ్ఞమువలె వుందంటాడు.

 

  తే.గీ:      వ్యంజన విభక్తి చాతురి నందమంది

          కర్మకారక గుణవృద్ధి గరిమనొంది

          యుత్తమాగమ పురుషాగత్త మగుచు

          గ్రతుభుజక్రియ మించె వ్యాకరణ సరణి.

 

ఇందులోగూడా వ్యాకరణ పరంగా, క్రతుపరంగా సరిపడే పదాలు గమనించండి. వ్యంజన విభక్తులు, ఒకవైపు శబ్ద వృత్తికి సంబంధిస్తే మరొకవైపు యజ్ఞసమయ సంతర్పణల్లో వండి వార్చే కూరలూ పచ్చళ్ళు. కర్మకారక గుణవృద్ధులు, ఒకవైపు క్రతుకర్మానుగత సద్గుణవృద్ధి, మరొకవైపు వ్యాకరణ విషయమైన కర్మకారకములు. మరియూ గుణ, వృద్ధి సంధులు, ఉత్తమాగమ పురుషాగత్తములు, ఒకవైపు దివ్య వేదాంత వేద్యుల మహిమోపేతములు మరొకవైపు ఉత్తమములై కుదురు సంధిగత ఆగమములూ మరియూ ఉత్తమపురుషాదులు. ఇలా వ్యాకరణం యజ్ఞంతో అద్భుతంగా పోల్చబడింది.

 

ఇట్టి వర్ణనలేకాదు, వ్రాస్తున్నది రామాయణం గనుక పురాణపాకంలోనూ పద్యములల్లి మెప్పించినాడు రామభద్రుడు.  ఆంజనేయుని బంధించి సభలో ప్రవేశపెట్టినాడు మేఘనాథుడు. ఆ సందర్భమున

 

మ: కొడుకున్ మెచ్చి దశాననుండనిలజు గోపమ్ముతో జూచి యే

 యడవిన్ ద్రిమ్మరుచుండు కోతివిర, రారా! యెవ్వరంపగ  ని

 క్కడికిన్ వచ్చితి వేల జొచ్చితివి లంకారాజధానిన్, నిజం

 బడుగన్ జూచెద నంతయున్ దెలియ నొయ్యన్ జెప్పరా నావుడున్

 

చం: అనిలజుదోరి  రావణుడ అల్లన నేటికి బెట్టు, చెప్పెదన్

     విను రఘురాముదూత, నరవిందహితాత్మజు మంత్రి నే బ్రభం

     జనుని తనూజుడన్ జనకజన్ వెదుకన్ జనుదెంచి కాంచితిన్

     నను హనుమంతుడండ్రు భవనంబులు మాకిల నెల్లకానలున్.

 

అంటూ యిలా పురాణపక్కీలో యిక్కడ కథ నడుస్తుంది. గ్రంథమంతా యిలా నడిచియుంటే, యిది పౌరాణికులకూ పట్టుబడి యుండెడిది. కానీ పండితాగ్రేసరుల మెప్పు బడయదుగదా! రామభద్రుడు తానన్నింటా సమర్థుడనని తెలుపుటకే కొన్నియెడల యిట్లు వ్రాసెను. ఈ కవి కఠినశ్లేషలూ, సంస్కృతపద గుంభనలూ మనకు అందుబాటులోలేని అచ్చతెనుగుపదాలతో గ్రంథము నడిపినాడా? అంటే అదేమీకాదు, సరళ ద్రాక్షాపాకముననూ పద్యములల్లి చూపినాడు. కవి సీతను గురించి చెబుతూ..

 

        తే.గీ:        గుణము గలిగినచో, రూపు కొదువ యెందు

                   గుణమురూపులు గల్గిన గులము కొదువ

                   కులముగుణమును రూపును గలుగు ధన్య

                   జనకకన్యయ సుమ్ము రాజన్యమాన్య.

 

అలాగే రావణచారులైన శుకసారణులు లక్ష్మణుని గురించి  రావణునికి చెబుతూ..

 

        తే.గీ:        చిఱుతప్రాయంబువాడు పసిండిఛాయ

                   మేనుగలవాడు విలుకాండ్ర మేటివాడు

                   వీరరస మిట్టిరూపమై వెలయువాడు

                   రాముతమ్ముడయా వాడు రాక్షసేంద్ర

 

అంటారు. ఇక కవి రాముని గురించి చెబుతూ..

 

        తే.గీ:        శిల చిగురుబోడియై యుల్లసిల నొనర్చి

                   యెత్తిపోయిన గౌతము నిల్లు నిలిపె

                   నడుగు కెందమ్మి కమ్మ పుప్పొడినయింక

                   నేమని నుతింప వచ్చు శ్రీరాముమహిమ.

 

అంటాడు. ఇంకొక్క విషయాన్ని మాత్రంచెప్పి విరమిస్తాను. శివధనుర్భంగం భయంకర శబ్ధజనితంగా వర్ణించారు కవులందరూ. కానీ రామభద్రుని వర్ణన మాత్రం సందర్భోచిత కల్యాణ రాగాన్ని వినిపించింది. వినండి.

 

        కం:  ఆ రమనీయ ధనుష్టం

                   కారము సీతాకుమారికా కల్యాణ

                   ప్రారంభ వాద్యనిరవ

                   ద్వారవమై యెసగె సకల హర్షప్రదమై.

 

ఆ ధనుర్భంగరవము సంయమీంద్రులకు నాద బ్రహ్మమైనదట. రామప్రభువు బ్రహ్మకు బ్రహ్మ. తనే పరబ్రహ్మమూనట.

 

 

        కం:  బ్రహ్మకు బ్రహ్మయును బర

                    బ్రహ్మముదానైన దాశరథి విలువిరువన్

                    బ్రహ్మాండచయము  నాద

                    బ్రహ్మచయంబయ్యె మునివర ప్రియకరమై.

 

రామభద్రకవి వరేణ్యుని కవితాపోకడలన్నీ చేప్పటానికి సమయమూచాలదు నాశక్తియూ చాలదు కనుక యింతటితో చాలిస్తున్నాను.  ఓం తత్ సత్.           

 

(నెలనెలా మనజిల్లా సాహిత్యం, 3, సదస్సు18-02-2011 ఆదివారం సాయంత్రం 6.౦౦ గంటలకు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రం, ఎర్రముక్కపల్లె, కడపనందు చేసిన ప్రసంగము)

 

 

 

         

 

 

 

 

శ్రీకాండూరు నరసింహాచార్యులు

 

కాండూరు నరసింహాచార్యులు బహుగ్రంథకర్త. రామరాజ్యము, మోహన విజయము, పూలతోట, రంగథామ శతకము, వినోద బహిష్కరణములు వంటి పద్యకావ్యములు రచించినారు. మహాశ్వేత, పరివర్తనము, అనే నవలలు వ్రాశారు. హర్షుడు, భీష్ముడు, నీతిలత, కలభాషిణి, చంద్రాపీడుడు, వంటి వచనకావ్యాలూ వ్రాశారు. మృచ్ఛకటికము నాటకము కూడా వ్రాశారు. ఈయన  తన  అశోకరాజ్యమును మాత్రము చారిత్రక ప్రబంధముగా పేర్కొనెను. కారణము అనేక చారిత్రకాంశములను యీ గ్రంథమున చర్చించెను. ఇది కవికి గొప్ప పేరుతెచ్చిన రచన. కథ ప్రబంధరీతిలో అనేకానేక వర్ణనలతో నడిపెను. అటు చరిత్ర యిటు వర్ణణాత్మక ప్రబంధశైలి కలిసి యీ అశోకరాజ్యము చారిత్రకప్రబంధమైనది. ఈ కవి కవితావైదుష్యరసాస్వాదనముకొఱకు, స్థాలీపులాకన్యాయముగా అశోకరాజ్యమును పరిశీలింతము. ఇందు చారిత్రక విషయములను కవి నేరుగా తాను చరిత్ర చెప్పుతున్నట్లే చెప్పివైచెను.

 

 

కం:          ఇప్పటి గజాం మండల

          మప్పటి మాహేంద్రపర్వతావృతమయి సొం

          పొప్ప గళింగము నాఁ జను

          చొప్పడ తనరూపురే సొగసుల కిరవై.

 

అంటూ కళింగరాజ్య మేదో తెలిపెను. అట్లే

 

 

 

గీ:    క్రీస్తు పుట్టకమున్ను చరిత్ర బట్టి

          మూడువందల యిరువది యేడు వత్స

          రంబు లందున దండయాత్రలను గడగి

          సలిపె నాతడు సర్వదిగ్జయము గొనగ.

 

అంటూ అలెగ్జాండరు (ఎపిరసు రాజు) దండయాత్ర సమయము పద్యములోనే చెప్పివైచెను.

గీ:    క్రీస్తునకు మున్ను చరిత్ర ప్రశస్తమైన

          రెండు వందల యరువది రెండు వత్స

          రంబులను సాగె గాళింగ రణము మనసు

          చెదరి యంత నశోకుడు చింతమునిగె.

 

అని కళింగయుద్ధ సమయంకూడా పద్యంలోనే దొర్లించెను. అంతేగాక, వివాదాస్పదమైన చరిత్రక విషయములను గూడా చర్చించి తన అభిప్రాయమును స్పష్టముగా తెలిపి నారు. సింహళములో మతవ్యాప్తి చేసిన మహేంద్రుడు అశోకచక్రవర్తి కొడుకు కాడను విషయమును తెలుపుతూ,

 

గీ:    సింహళమునందు మతవృద్ధి చేయబూని

          నట్టివాడు మహేంద్రుడె యతడశోక

          భూపతికి బంధువయ్యెడు బుత్రుడగునె

          యతడె మఠముల గట్టించె మతముబెంచె.

 

నని జెప్పినాడు. ఈ విధంగా గ్రంథం మొత్తం నిర్వచనమై సాగింది. ఈ విధంగా పద్యములలో అనుకొన్న విషయం చొప్పించటం యింతసులువా! అనిపించాడు కవి. ఏ చందస్సులో విషయం యిముడుతుందో తెలియాలిగాని పద్యమల్లడం కష్టంగాదని నిరూపించినారు. భావప్రకటనకు పద్యం అడ్డంకి కానేకాదని సోదాహరణంగా నిరూపించినాడు కవి.

 

కథ చాలచిన్నది. కనుక అశోకుని తండ్రి తాతల చరిత్రలను గూడా స్పృజించినారు. వీరు మౌర్యవంశ చక్రవర్తులు గనుక ఈ "మౌర్య" యను వంశనామ మెట్లేర్పడినదో చెబుతూ..

 

 

 

 

చం:మురయగు శూద్ర;యారమణి ముద్దుల బిడ్డడే మౌర్యుడయ్యె భా

     సురమగు వంశమూల పురుషుండగు నాతడే చంద్రగుప్తుడా

     సురుచిర సద్గుణాకరుని శూరుని నందుడు సంశయించి భీ

     కరుడితడంచు, నిందు గొఱగాడని రాజ్యము వెళ్ళగొట్టినన్

 

గీ:    తరలి పాంచాల ప్రాంత కాంతారసీమ

          తిరుగు చుండెను, దిక్కరి పరితపించి

          ఆదరములేని యతిధియై యటమటించి

          నిర్జనాటవి గాయు వెన్నెల విధాన

 

చంద్రగుప్తుడు దిగ్దంతి యంతటి వాడు. కానీ ఆదరము లేకపోవడంతో అడవులపాలై మర్యాదలేని అతిధియైనాడు. గీతము ముగిస్తూ "నిర్జనాటవి గాయు వెన్నెల విధాన" అని చక్కని జతీయంతో చంద్రగుప్తుని జీవితాన్ని పోల్చి పద్యమునకు సొబగుగూర్చినారు. కథ ముందుకు సాగిస్తూ యిట్లు శూద్రసంతానమైన మౌర్యవంశం మొదలై, చంద్రగుప్తుడు చాణుక్యుని అండతో రాజ్యాధికారం పొందుతాడు. నందరాజులు చాణుక్యుని అవమానించడమూ ఆపగ తీర్చుకొనుటకు చంద్రగుప్తుని యెన్నుకొని అతన్ని వీరునిగా తీర్చిదిద్దడమూ, ఆఖరుకు సింహాసన మెక్కించడమూ జరుగుతుంది.

 

చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు. ఇతని కనేకమంది కొడుకులు. వారిలో ఒక విప్రస్త్రీకి పుట్టినవాడు అశోకుడు. బిందుసారుడు తనభార్యయైన బ్రాహ్మణస్త్రీకి "నీకుపుట్టిన కొడుకునే రాజునుచేస్తానని" మాటయిచ్చి తప్పినాడు. ఆవిషయం తెలుపుతూ

 

ఉ:    చక్కగ కాలమప్పగిది జాలగ సాగగ నంత్యకాలమం

          దక్కపటాత్ముడౌ జనకు డాదరమేది సపత్ని పుత్రులం

          దొక్కని బెద్దవాని తనయుంగని మెప్పునుజూపె, జిత్రమౌ

          నెక్కడి ప్రేమలీజగతి, నెప్పటి యక్కర లప్పుడేగదా!

 

అంటాడు. ఇందులో "ఎప్పటి యక్కర లప్పుడేగదా!" యను నానుడిని వాడి రాజుల నిలకడలేని చిత్తమును చక్కగా ఆవిష్కరించినాడు కవి.

 

అశోకుడు రాజుకావడానికి తన యన్నల నందరినీ చంపి క్రూరుడై హింసా ప్రవృత్తితో రాజైనాడని వ్రాసియున్న పూర్వకథలను ఆధారరహితములని కవి త్రోసిపుచ్చి, యోగ్యుడుగనుక అయోగ్యుడైన అన్నను ప్రధానులే తొలగించి, యెదురు తిరిగిన వానిని చంపి అశోకుని రాజును చేసినట్లు వ్రాసెను. అంతేగాదు కళింగయుద్దముకూడా అశోకుడు రాజ్యవిస్తరణ కాంక్షతో చేయలేదు. తప్పనిసరి పరిస్థితులలోనే యీ యుద్ధము చేసినట్లు కవి కథను సమంజసముగా నడిపినాడు.

 

కళింగమల్లుడు థూర్తుడు. దక్షిణప్రాంతరాజ్యములనేకముచేసి తన ఆధిపత్యము లోనికి తీసుకొని మహాబలవంతుడు కాదలచును. అందుకు తోసలిరాజు ఇంద్రవర్మ సకరించడని తెలిసి, అతని కూతురు నాగవల్లిని వివాహమాడి వియ్యమున పని సానుకూలము గావించుకొనదలచును. కానీ వృద్దుడైన కళింగమల్లునకు తన బిడ్డనిచ్చుటకు ఇంద్రవర్మ యిష్టపడడు. దీనితో తనకు సంభవించనున్న ఆపదను గుర్తించి అశోకుని సాయమర్థించును. యువకుడైన అశోకునకు బిడ్డనియ్య సిద్ధపడును. అయితే యింతలోనే తోసలిపై దాడిచేసి కళింగమల్లుడు రాజ్యమునాక్రమించును. ఇంద్రవర్మ కుటుంబసమేతముగా రహస్యద్వారమున తప్పించుకొనిపోయి అడవిలో తలదాచుకొనును. అట్టి విపత్కర సమయములో ఇంద్రవర్మకు సహాయము చేయుటకు అశోకుడు కళింగునిపై యుద్ధము ప్రకటించెను. ఈ విధముగా తన కథానాయకుడైన అశోకునిపై దుర్మార్గుడను ముద్ర పడకుండా కథ నడినాడు కవి.

 

అశోకుడు కళింగయుద్ధము తర్వాత, మారువేషమున రాజ్యములో సంచరించి, యుద్ధమువల్ల కలిగిన ప్రజాబాధను గమనించి, మనసు చలించి అహింసాధర్మమును పాటించి, బౌద్ధము స్వీకరించెను, బౌద్ధము వ్యాప్తిజేసెను. ఇదీ స్థూలముగా యితివృత్తము. కథలో మనకు అశోకుడు యెక్కువగా కనిపించడు. మూడశ్వాసముల యీ ప్రబంధములో తొలుత ప్రధమాశ్వాసమున వేటకు వెళ్ళిన అశోకుడు కనిపిస్తాడు. రెండశ్వాసములు పూర్తిగా కళింగరాజ్యచరిత్రకే సరిపోయినవి. ఇక ఆఖరుదైన మూడవ ఆశ్వాసంలో కళింగయుద్ధము చేయు అశోకుడూ, బౌద్ధము స్వీకరించి బోధకుడైన అశోకుడూ కనిపిస్తాడు. ఆఖరున అశోకుని రాజ్యపాలనావిధము, శిలాశాసనములు కవి మనయెదుట బెట్టినాడు.

ఇక యీ ప్రబంధమున కవి కనబరచిన సారస్వత విషయముల పరిశీలింతము. కవి మంచి వ్యుత్పత్తి సంపన్నుడు, బహుచక్కని వర్ణనలు చేయ సమర్థుడు. వర్ణనలన్నీ కన్నులకు గట్టినట్లుండును. ఈ వసంతఋతువర్ణన జూడుము.

 

చం: లలితరసాల పల్లవములన్ మృదుకంఠము చక్కజేసి ని

          ర్మల శుభవృత్తముం దెలుపు మంగళగీతిక పాడుచుండె గో

          కిలము వసంతశోభ గిలిగింతలుపెట్టు వనాంగనమ్ములం

          గలికి తనంపు బెండ్లికొడుకైన మనోభవు ఠీవి చాటుచున్.

 

ఉ:    ఆకులు రల్చి క్రొత్త చిగురాకులు పూవు లలంకరించి బి

          బ్బోకము చొప్పడం బ్రకృతి ముద్దియవెల్గె వసంతలక్ష్మి నా

          పోకడ నా విలాసములు పొందిక నందునె యందునేని అం

          జోకను ముగ్ధమై జగము సుందరరూపము జుచి చొక్కగన్

 

లలితరసాలమనడంతో పోతన మనకు జ్ఞాపకం వస్తాడు. కలికితనంపు పెండ్లికొడుకైన మన్మథుని ఠీవిని, చిరురాకులు మేసి కోయిల మంగళ గీతం పాడి వసంత శోభల వైభవంతో చాటిందట. వసంతఋతు సుందరరూపము జూచి జగము ముగ్ధయై చొక్కినదట. ఎంత చక్కని భావప్రయోగము. ఇక గ్రీష్మఋతు వర్ణన గమనింతము.

 

సీ:    పాపకర్ముల బర్వు భరియింపజాలక

                   యుర్వితావిడచు నిట్టూర్పులనగ

          దుర్వారదుర్భర దుస్తంత్రముల బన్ను

                   శత్రుపన్నగ విషజ్వాలలనగ

        ధర్మగతుల్బాయ ధార్మిక బ్రువులపై

                   కుపితుడౌ దినకరు కోపమనగ

          గతిలేని నరుల దుర్గతుల పాలొనరింప

                   నావరించెడు బడబాగ్నులనగ

 

గీ:    నాలుకలు సాచి జంతువుల్నాల్గుదిశల

          బరుగు వారుచు నీటికై పరితపింప

          గ్రిందు మీదుల మాడ్చెడు గ్రీష్మఋతువు

          నెండగాడ్పులు దిశలందు మెండుకొనియె.

 

గీ:    తాపముల మేతమాని యుత్తాలవృక్ష

          జాలముల నీడల బరుండి డీలుపడుచు

          నెమరు వేయుచు నెగరొప్పు నీరువట్టు

          గలిగి జంతువు లెండమావులకు బారు.

 

అబ్బో! పద్యము చదువుచున్నంతనే యెండసెగలు అనుభవమునకు వచ్చుచున్నవి. కవి కడప వాడుగదా! తన సీమ గ్రీష్మ తాపాన్ని మనకొకసారి జ్ఞప్తికి దెచ్చి, యెండ క్రింద మీద మాడుస్తున్నదని స్వాభావోక్తితో తన ప్రతిభను చాటినారు. ఇక సూర్యోదయ వర్ణన చూదుడు.

 

సీ:    శ్రీహరి తనయింటి శిఖరంబుపై నిల్పి

                   దేశాలవెలిగించు దీపమనగ

          భారతజాతీయ భావపూరిత కర్మ

                   చోదకమగు పెద్ద జ్యోతి యనగ

 

        ఆశావధూటి నిత్యానంద సౌభాగ్య

                   దీర్చు కుంకుమ బొట్టు తీరనంగ

          స్రష్ట జగద్రష్ట తుష్టుడై యాడించు

                   బంగారు రంగుల బంతి యనగ

 

గీ:    భాస్కరుండగుచు బ్రభవించి పరిఢవించి

          యించుకించుక యుదయ గిరీంద్ర శృంగ

          తటిని బొంగుచు గర్మతత్పరత గఱపు

          కరణి నుదయించె విశ్వంపు గర్మసాక్షి

 

ఆహాఁ పద్యము మృదుమధుర ఉపమానాలతో హృద్యమగా సాగినది. ప్రబంధమన్నాక పురవర్ణన తప్పదుగదా! తోసలి పురవర్ణన జూడుడు. మనకు అల్లసాని పెద్దన హిమాలయ వర్ణన జ్ఞప్తికి రాకమానదు.

 

చ:    అటజనిగాంచె నద్భుత మహానది తీరమునందు భాసిలన్

          గటక చరత్కరేణు కరకంపితసాల మహేంద్రశైల సో

          ద్భట నికట ప్రదేశ బలవద్వరణావృత సౌధజాల స

          ద్భట నటనానుకూల పటువైభవ శోభితమైన తోసలిన్.

 

"మహేంద్రగిరికటక చరేత్కరేణు కరకంపిత సాలములూ", "సద్భట నటననుకూల పటువైభవ శోభిత తోసలిని మనకు జూపి మైమరపించినాడు. ఇక యుద్ధవర్ణనాగాంభీర్యమద్భుతము. వీర కరుణార్ద్ర రసముల చక్కగా పోషించినాడు కవి. ఇది ఆయన ప్రతిభకు అద్దము పట్టుచున్నది.

 

సీ:    కొమ్ముల వడిగ్రుమ్మి చిమ్ము నేన్గులదొమ్మి

                   పమ్మిన కోపానలమ్ము రేప

          ధారా గతుల్ఖడ్గ ధారాహతుల్మీరి

                   తురగ రణోద్ధతి తొందరింప

          బాకులీటెలు మేటిబల్లెముల్కత్తులు

                   జోకమై వీకమై గేకలుడుప

          బ్రవిముక్త శరపరంపరలు ప్రజ్ఞలువల్క

                   నరివీర కంఠాల కతుకు త్రెంప

 

 

         గీ:      ఘోరరావము లెల్లెడ బోరుకొనగ

                   ధీరులకు నేని హృదయవిదారకమ్ము

                   పోరు మీరెను నెత్తుటియేరు లడర

                   బ్రలయతాండవమా యన్న పగిది నొప్పి.

 

అట్లే ఒక వీరుని వీరమరణవర్ణన గనుడు. మనముందుంచిన పదచిత్రము పగిది యెంత సమంజసముగానున్నదో..

 

ఉ:    మీసముతీడి కేకలిడి మించగ, రోసముజూపునంత నా

          యాస మదేలరా యనగ నాతని రొమ్మున  నీటె దూఱ నా

          కాశము వంకజూచి రుచి గన్గొని విస్మిత చిత్తుడట్టు లా

          రోసము తూల నిల్వు మిడిగుడ్లను దూలుచు నేలపై బడెన్

 

ఈ కవి జాతీయములూ, నానుడులూ తనకనుకూలముగా మార్చి ప్రయోగించుటలో దిట్ట. చూడుడు "వెదుకబోయిన మూలికల్కనులకున్వేగమె" కన్పించెనట. కౌటిల్యుడు అవమానము పాలైనాడు.

 

మ:   మదిలో నెక్కొను దుర్విపాకకృత సమ్మర్ద ప్రతప్తాంగి కౌ

          ముంగోరుచు దిర్గు నాకు నటవీ సంచార మూఢాత్మకుం

          బదిలమ్మైన భవత్ప్రతాప విభవ ప్రత్యక్షవీక్షారుచుల్

          వెదుకంబోయిన మూలికల్కనులకున్వేగంబ కాన్పించుటల్.

 

తన మానసిక రుగ్మతకు చంద్రగుప్తుడు తటస్థించుట వెదుకంబోయిన మూలికట కౌటిల్యునకు.

 

నేనేమైనా చేయగలనని కవి తన స్వరమును చాణుక్యుని పాత్రలో చొప్పించినతీరు అద్భుతం. "పట్టి గిరగిర లాడింతు బ్రహ్మనైన" అంటారు.

 

                   విష్ణుగుప్తుడ నాకేమి వెలితి యింక

                   పట్టి గిరగిర లాడింతు బ్రహ్మనైన.

 

అని తన ఆత్మవిశ్వాసాన్ని, సత్తానూ చాటినాడు కవి.

 

ఇక తనరచనలో అన్యదేశ్యములు పాఠకులకిబ్బంది లేకుండా యధేచ్ఛగా ఉపయోగించుకొన్నాడు కవి. పసందు, బరాబరి, స్టేషను వంటి పదాలు యెంత ఒద్దికగా పద్యంలో ఒదిగాయో గమనించండి.

 

ఉ:    పల్లెలు పట్టణంబులును బంటల వృత్తుల నోలలాడి సం

          పల్లలితంబులై యొసగు భంగిని దిట్టములై తలిర్పగం

        గొల్లగ దీర్పు జేసి తనకున్ సరిసాటి యొకండు లేడనం

          జల్లగ రాజ్యమేలెను బసందు పసందని మెచ్చ భూజనుల్

 

అదీ కవిమాటలలో పసందైన అశోకరాజ్యము.

 

ఉ:    బారులు తీర్చి బెత్తముల వారు బరాబరి సేయుచుండ దై

          వాఱగ వాద్యఘోషములు ప్రాకి దివంబును బోరుకొల్ప శృం

          గారిత చత్వరంబుల నఖండములై జయఘోష లొప్ప నా

          భూరిపరాక్రముండు గుణపూజ్యుడశోకుడు నాల్గువీధులన్.

 

మెఱవణి కేగుదెంచె - అంటూ ఇప్పటి బ్యాడుమేళపు బెత్తమునూపి బరాబరి చేయు మ్యూజిక్‍డైరెక్టరు నప్పుడే జూపించినాడు కవి.

 

చం: తలప కళింగమల్లునకు దంతపురంబది రాజధానియై

          వెలసె నశోకునాటికిది విశ్వసనీయమ. నేడు దిబ్బయై

          తలరెడు నాచికాకొళము దాపున స్టేషనుచెంత గాంగరా

          జులు తరలింపగా గటకు చోటికి, రూపఱి పాడుబడ్డదై.

 

అని స్వస్వరముతో చరిత్ర చెబుతూ సాదాసీదాగా స్టేషనుచెంత అనేశారు.

ఈ గ్రంథమున కవి చాలా ప్రాధాన్యమును గల్పించిన విషయము బౌద్ధబోధ. అందులో అహింస పరమతసహనము స్పష్టముగా కనిపిస్తుంది. జీవహింస తగదంటూ శ్రమణకమౌని జింకను కొట్టిన అశోకునికి చేసిన బోధ చూడండి, హృదయము తాకుచున్నది.

 

ఉ:    తిట్టెనెనిన్ను, నెప్పగిది దెప్పగజూచెనె నిన్నెదిర్చెనే

          కట్టడి కార్యముల్నెఱప గైకొని శత్రుపథంబు ద్రొక్కెనే

          పట్టి ప్రజాప్రభుత్వవిభవంబునకై ప్రజరెచ్చగొట్టెనే

          యిట్టి విశుద్ధ సాధుమృగ మేగతి నీకు విరోధి యయ్యెనో.

 

చం: తలచెనె హింసనేరికి నెదం తలపోసెనె కార్యఘాతముం

          దలకొనెనే దురాశలు మనంబున గోరెనె యన్యవిత్తముల్

          పలువతనంబునం బ్రజకు వంచనగోరెనె యేమిసేసె నీ

          విలబడనేయ? సాధువిది యేగతి నుండెనొ చూడు పార్థివా!

 

ఈ పద్యాలలో నేటి రాజకీయాలలోని కుట్రలూ, కుతంత్రాలూ శిక్షింపదగిన దూర్తకార్యాలన్నీ యెఱుకజెప్పినట్లు  చెప్పివైచి, యివేమీ యెఱుగని సాధుప్రాణుల ఉసురుదీయటం యేమి న్యాయమని ప్రశ్నించి అహింసాబీజము రాజుయెద నాటినాడు ముని. ఈ బోధకు తక్షణఫలితమా యన్నట్లు అశోకుడు వేటచాలించి మరలిపోయినాడు. ఇక యుద్ధములనర్థదాయకము లంటూ  అశోకుడు చింతించిన విధము చూడుడు. పాఠకుల హృదయము సైతము ద్రవింపక మానదు.

 

ఉ:    నమ్మిన ఇంద్రవర్మ యయినం గృతకృత్యుడు గాకపోయె గో

          పమ్మున శత్రుమిత్రులు నభమ్ము శుభమ్మని లక్షలాది ప్రా

          ణమ్ముల గొల్లబెట్టుచు రణమ్ముల బెక్కుర నేడిపించి నే

          నిమ్మెయి విఱ్ఱవీగి గడియించినదేమొ యెఱుంగనైతిగా!

 

ఉ:    చేతులు కాళ్ళుపోయి తమ జీవితముల్కడనీదలేక దు

          శ్చేతనులౌ ధరాధిపుల చేష్టలదూరుచు జీవితాంతమున్

        వీతశుభోదయుల్జనులు వేగగ నిచ్చలు స్వార్థబుద్ధిచే

          నీతికి బాహ్యులైన ధరణీశులు నింద్యులు గాక పూజ్యులే!

 

యుద్ధమువల్ల నే నేప్రయోజనమూ పొందలేకపోయాను. నన్ను నమ్మి శరణమన్న ఇంద్రవర్మా చనిపోయాడు. బాధలకు గురై ప్రజలు అనుదినం నన్ను దూషిస్తున్నారు. ఇదా నేను పొందిన మేలు? యుద్ధం సర్వదా అనర్థదాయకం. అంటూ వాపోయాడు. బౌద్ధం స్వీకరించి బౌద్ధధర్మముల బోధించెనేగానీ, యితర మతముల దూషించలేదు, వేధించలేదు.

 

ఉ: పోయినచోటనెల్ల దలపుల్తను ముందుకు లాగుచుంటచే

     బాయక బౌద్ధధర్మ మది పావనమంచు ప్రబోధచేసి ని

    శ్చాయకుడై జగంబునకు సద్గతి జూపగ నెంచె గాని దు

    ర్మాయలు పన్నడయ్యె బహుమాన్యములౌట మతమ్ములన్యముల్.

 

బౌద్ధములోని హేతువాద దృక్పదమును, కార్యకారణ విచారణనూ తేటపరచిన యీ పద్యములను చూడుడు, యెంత సమంజసము

గనున్నవో. ఫాలము నిండుగా ఊర్ధ్వపుండ్రములు ధరించిన వైష్ణవకవి నరసింహాచార్యులెంతటి పక్షపాత రహితులో తెలుస్తున్నది. చెప్పేది బౌద్ధం గనుక బౌద్ధమే నిర్మొగమాటంగా చెప్పివైచినారు.

 

ఉ:  మానవజాతి యుద్ధరణ మానవసంఘము తప్ప నీశ్వర

      ధ్యానము కాని జాతికృతధర్మ విభేద ముగాని చేయ వ

     జ్ఞానులు కార్యకారణ విచార విదూర కుకల్పనమ్ముల

     న్మౌనులు మాయలున్ శ్రుతులు మంత్రములన్న సహేతుకమ్ములే?

 

ఉ:    యాగములందునేని పశుహానియు హింస యధర్మమై తగన్

          భోగము కోసమై సమరభూముల జంపుట హింసకాదె హా

          బాగుగ యోజచేసి పరిపక్వతనంది, స్వయం కృషిన్మదిం

          జాగొనరింపరాదు సువిచారులు దుఃఖవిముక్తి నందగన్.

 

అని యాగములపేర, యుద్ధములపేర జరుగుచున్న హింసను మత

విశ్వాసములతో సమర్ధించక ఉన్నదున్నట్లు బౌద్ధమేమి చెప్పిందో అదే నిష్కర్షగా చెప్పివైచారు కవి.

 

ఇక తనకథానాయకుడగు అశోకుని కీర్తించిన విధము జూడుడు.

 

 

 

సీ:    ఆయాసముల బాపు ఛాయాద్రుమమ్ముల

                   యందచందమ్ముల పొందికలర

          ఆతిథ్యములకు రమ్మను కుల్కులను జిల్కు

                   ఫలవృక్షరాశి సౌభాగ్య మడర

          స్నానపానీయ విశ్రాంతి సాధకమంచు

                   తెరువుల బావుల తీరుతెలుప

          రాచబాటల యందు రాజమానంబులు

                   విడిదిగృహాల్చలివేంద్ర లమర

 

గీ:    మూలమూలల నౌషద మూలికలను

          బెంచు తోటలు బాటలు పేట లడర

          జంతు మానవ పశువైద్య శాలలెంతొ

          చాటుచుండె నశోక సామ్రాటు ప్రతిభ

 

ఉ:    సత్యము ధర్మరక్షణము సజ్జనసేవయు దోడుగాగ స

          ద్భ్రుత్యులు ధర్మపాలకులు పేదల రక్షణ లక్ష్యమై తగన్

          గృత్యములందు నేమఱక కీరితి యెల్లెడ బ్రాక రాజ్యమున్

          సత్యపథమ్మునన్నడుపు జాణ యశోకునకెన్న సాటియే!

 

గీ:    ప్రజల పీడించి హింసించి పరిభవించు

          గర్వితాత్మనృపాలుర గణము నందు

          రామరాజ్యంబు తరువాత రాజితండె

          ముండ్లపొదలను బూచిన మొగలి పూవు.

 

ఇతర రాజులు ముండ్ల పొదలట తన అశోకుడు అందులో పూచిన మొగలి పూవట. ఇట్లు కీర్తించుటేకాదు, కథాగమనమున అతని పాత్ర నుదాత్తముగ నట్లేనడిపి ధీరోదాత్తునిగా నిల్పినాడు. రచన చారుతరంపు సొంపులతోడనూ, సరసంపు పదప్రసరంపు జాడలతోడనూ, ఒయ్యారపు కుల్కు తళ్కులతోడనూ, మృదుహాసములొల్కెడు భావగౌరముతోడనూ సాగించినాడు కవి.

 

కవి యీ అశోకరాజ్యములో చూపిన చారిత్రకాంశములకు పుస్తకము చివర అనేక ఆధారములను చూపడమేగాకుండా, వాటి పాఠములను సైతము సేకరించి జతచేసినారు. చంద్రగుప్తుని తల్లి "ముర" శూద్రకాంతయని, ఆమెపేరుననే వంశనామము "మౌర్య" యైనదనిన్నీ, మరియూ నందరాజులచేత అవమానింపబడిన చాణుక్యుడు, నిరాదరనకులోనై అరణ్యవాసంచేయుచున్న చంద్రగుప్తుని చేరదీసి, యోగ్యునిగావించి, నందులను తొలగించి రాజ్యాధికార మిప్పించెనన్న విషయమూ, అంతేగాక అశోకుడు కళింగయుద్ధము తర్వాత ధర్మత్ముడై ప్రజానురంజక పాలనము, ధర్మవ్యాప్తి చేసిన విషయము లన్నింటినీ శ్రీ విన్‍సెంట్ . ఏ . స్మిత్ వ్రాసిన  "ది అర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా" గ్రంథమునుండి సేకరించి వాటి పాఠములను పొందుపరచినారు.

 

క్రీ.పూ ౩౦౩లో సెల్యూకస్ కూతురితో చంద్రగుప్తుని వివాహమూ, చంద్రగుప్తుని రాజ్యాభిషేకమూ మరియు అశోకుని కళింగయుద్ధ నష్టము, అశోకుని పశ్చాత్తాపము వంటి విషయాలకాధారంగా శ్రీకె.వి రంగస్వామి అయ్యంగార్ రచించిన "ఎ హిస్టరీ ఆఫ్ ఇండియా" 1,వ భాగం ప్రీ ముసల్మాన్‍పిరియడ్ లోని పాఠాన్ని జతచేశారు. అట్లే కౌటిల్యుని అర్థశాస్త్రరచనకు ఆధారంగా ప్రొఫెసర్ శ్రీ ముఖర్జీ వ్రాసిన "హిస్టరీ ఆఫ్ ఇండియా హిందూ పిరియడ్" పాఠాన్ని పొందుపరచారు.

 

చంద్రగుప్తుని రాజ్యవిస్తరణ, దక్షిణాపథమున కళింగదాటి మైసూరు వరకూ చేరిన విషయమూ, ఇప్పటి శ్రీకాకుళం రైల్వేస్టేషన్ దగ్గర నున్న పాడుబడిన మట్టిదిబ్బకోట దంతవక్రుని కోటయనీ, అదే దంతపురమనీ అక్కడనుండి రాజధానిని కటకమునకు అనంతవర్మచోడగంగుడు మార్చగా దంతపురం పాడుబడి పోయిందనీ, యీ దంతపురమే కళింగమల్లుని రాజధానియనీ, ఇక "తోసలి" పూరీజిల్లాలోని భుననేశ్వరమునకు యేడుమైళ్ళ దూరములోని "ధేలి" గ్రామమనీ, మరియూ చంద్రగుప్తుడు తన తుది దినములలో జైనమతము స్వీకరించెనను విషయములు శ్రీ రాళ్ళబండి సుబ్బారావుగారి "కలింగదేశ చరిత్ర" నుండి సేకరించి వాటి పాఠములు జతపరచినారు.

 

అశోకుడు తక్షశిల నుండి ఉజ్జయినికి వచ్చి వైశ్రాయి పదవి నలంకరించడమూ, అంతేగాక రాజవంశమునకు చెందని "దేవి" యను సుందరిని వరించడము అందుకు తండ్రియగు బిందుసారుడు అంగీకరించి పెండ్లిచేయడమూ, ఉజ్జయినిలో వుండగనే దేవీఅశోకులకు మహేంద్రుడను కుమారుడు, సం మిత్ర యను కుమార్తె కలగడమూ వంటి విషయాలన్నీ శ్రీమతి హిల్డాసెలింగ్‍మాన్ వ్రాసిన "వెన్ పీకాక్స్ కాల్డ్" గ్రంథ పాఠాన్ని సేకరించి జతపరచినారు.

 

చం: నరుడగు పూజనీయుడిల జ్ఞానమె పూజ్యతకాకరంబు వా

నరుడగు జ్ఞానహీనుడయి, జ్ఞానవిహీనుల జీవితమ్ములుం

బరువగు, శాశ్వతమ్మయిన భాగ్యము శాంతియ, దానికోసమై

గురువుల నాశ్రయింపనగు, గోర్కులు త్రెంపక సౌఖ్యమున్నదే?

 

యని అశోకుడు విచారించి తనఆలోచనలో మార్పును సంతరింపజేసుకొని వాటిని స్వతహాగా పాటించి, రాజ్యములో పాలనాపరంగా అమలు జరిపిన విషయములకు ఆధారంగా శ్రీ స్టీఫెన్‍సౌట్‍వల్డ్ రచించిన "మ్యాన్స్ గ్రేట్ అడ్వెంచర్ " గ్రంథపాఠాన్ని అందించారు. అంతేగాకుండా బౌద్ధసూత్రములు బుద్ధునికి ముందే అనగా క్రీ.పూ ఆరవశతాబ్దానికి ముందునుంచే వున్నవనిన్నీ, అవి బుద్ధుడు గ్రహించి వ్యాప్తిజేసెననిన్నీ, వాటినే బౌద్ధమత సూత్రములుగా స్వీకరించి అశోకుడు..

 

గీ:    ధర్మశ్రవణమ్ము జేయుచు గర్మపరత

          రెండు వర్షములార్నెలల్నిండువరకు,

          నందు మీదట నాఱేండ్లు డెందమలర

          బట్టుదలతో నుపాసనా పరుడనైతి.

 

గీ:    స్తంభములమీద శిలలపై జాలచోట్ల

          ధర్మమభివృద్ధి సేయ బోధమ్ము లెసగ

          వ్రాసి యుంచితి బొరుగు రాష్ట్రములవారు

          నేర్చుకొందురు గాక నా నీతి బోధ.

 

అంటూ పై పద్యములలో చెప్పినట్లు శిలాశాసనములు వేయించినాడు. అంతేగాక బౌద్ధధర్మాలనూ, అహింసాసూత్రాలనూ ప్రబోధిస్తూ

 

సీ:    చిలుకలు కొంగలు చిన్నతాబేళ్ళును

                   బాతులు గబ్బిలాల్పక్షిగములు

          చీమలు రొయ్యలు చేపలు పందులు

                   దుప్పులాబోతులు దొడ్డమీలు

          బల్లులు నుడుతలు బలుఖడ్గమృగములు

                   గ్రామకపోతముల్కౌజుపిట్ట

          లాడుమేకలు వానియార్నెల్ల పిల్లలు

                   పాలిచ్చు చూల్కొను పందిగుంపు

 

గీ:    చంపనర్హము కానట్టి జంతువులివి

          తినగ గొఱగాని, దేనికి బనికి రాని

          జంతువుల నెప్పుడైనను జంపరాదు

          జంతువునకంచు జంతువు జంపరాదు.

 

అంటూ చంపనర్హముగాని దీన జంతువులను, ఒకజంతుపోషణకని మరొక జంతువునూ, చంపరాదను హితవాక్యముల నెన్నిటినో స్తంభశాసనములుగా చెక్కించాడు. యిట్టి స్తంభశాసనాలు పదునాల్గు, షాబాజ్‍ఘర్, మన్‍సిరా, కాల్సీ, సోపార, గిరినగరం, ధాలీ, జౌగద, ప్రాంతాల్లో వున్నాయని, అంతేగాక మరిన్ని కళింగ శాసనాలనూ, నూటముప్పది స్థూపాలనూ గట్టించినాడని హుయాంగ్‍సాంగ్ అను చైనాయత్రికుడుకూడా వ్రాసియున్నాడని, విటికన్నిటికీ శ్రీ బేతపూడి లక్ష్మీకాంతరావు రచించిన "అశోకచరిత్ర" పాఠాలను చూపించినారు. అశోకుని శాసనపాఠాలన్నీ కవి పద్యాలుగా తన అశోకరాజ్యము తృతీయాశ్వాసములో రచించినారు. ఈ విధంగా కవితన అశోకరాజ్య చారిత్రక ప్రబంధమునకు మూలాధార గ్రంధములలోని పాఠములను యథా తదంగా ముద్రింపించడమేగాక, వాటికి మూలములోని పుటసంఖ్యలు కూడా చుపించి తన గ్రంథమునకు ఒక సాధికారతను సంతరింపజేసినాడు.

 

మందడి వాస్తవ్యులూ భరద్వాజ గోత్రోద్భవులూ అయిన యీ కవి

15-06- 1909 నుండి 24-01-1972 వరకు జీవనయానాన్ని సాగించి

బ్రతుకుబండిని భారంగానే నడుపుకొచ్చారు. కానీ తన కలం బలంచేత కవిరాజుగా వెలుగొందారు. శ్రీరామచంద్ర కరుణాకటాక్షలబ్ద కవితా విస్ఫురణగల వాడినని చెప్పుకొన్నారు. క్రాంతదర్శిగా యదార్థవాదిగా పేరొందారు. తన ఖండకవ్యమైన "పూలతోట" లో రాయలసీమను గూర్చి చెబుతూ, ఇది రాయల్‍సీమ. సీమ రాయల్, రాయలేలిన  రతనాలసీమ కానీ..

 

ఉ:    చూడగ నెందుగన్న మనసున్ రగిలించెడి రాలగుట్టలన్

          బాడరియున్న భూములును బ్రాతవి కొంపలు, నీటికై సదా

          గోడులుజెందు పౌరులును గూటికి గుడ్డకు బ్రాకులాడ నే

          జాడను రాలసీమ విలసద్గతి రాయలసీమ యయ్యెనో!

 

యని వాపోయినారు. ఈ యన వర్ణనలు సందర్భశుద్ధివిలసితములు. "మృచ్ఛకటిక" నాటకములో వర్షవర్ణన జూడుడు.

 

గీ:    కరిగిపోసిన వెండి తీగలనుబోలి

          వర్షధారలు వేగాన పడుచునుండె

          మెఱుపుదీపాల వెలుగున మించి చించు

          వస్త్రముల చింపురులటు నభంబు నిండె.

 

వర్షధారలు కరగిపొసిన వెండితీగలట. వస్త్రములు చించి రిబ్బనులు చేసి మెఱుపుదీపాల వెలుగులో ఆకాశంనుండి వ్రేలడదీయబడి మెఱయుచున్నవట. అందమైన ఊహ. అట్లే తన మోహనవిజయంలో అల్లిన మరొక సూర్యోదయ వర్ణన చూడండి.

 

ఉ: బంగరుబంతియో కడగి పన్నిన జేగురు పూలబంతియో

రంగులనీను వజ్రమణిరాజమొ లేక ప్రజాసుఖంబులన్

భంగముసేయు పాతకుల భంగముదెల్పు ప్రతిజ్ఞయో యనన్

రంగుగ దూర్పుకొండపయి రంజిలె సూర్యుడు రాగమూర్తియై.

 

సుర్యోదయం ప్రజాసుఖాన్ని భంగపరిచే పాతకుల పనిబడతానని చేసిన ప్రతిజ్ఞలా వుందని శుభంపలికాడు కవి.

 

కడపజిల్లా జమ్మలమడుగు పౌరులీ కవికి "కవిరాజ" బిరుదమిచ్చి సత్కరించారు. ఈయన పతంగిరామన్న బోర్డ్‍హైస్కూల్ జమ్మలమడుగులో ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశారు. ప్రోద్దుటూరు వసంతపేటలో నివసించినారు. మళయాళస్వామి ఓరియంటల్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసినారు. వీరిని "సాహిత్య శిరోమణి" "ఉభయభాషాప్రవీణ" బిరుదములు సైతము వరించినవి. ఈయన ప్రతిభను మెచ్చి శ్రీ శ్రీమహామహోపాధ్యాయ  శ్రీపాద కృష్ణమూర్తి గారు ప్రస్తుతిస్తూ..

 

కం:  కవులకు రాజువటంచును

          సవిమర్శముగాగ బుధులు జమ్మలమడకన్

          కవిరాజ బిరుద మొసగిరి

          శివమగునది నీకు నారసింహాచార్యా.

 

అన్నారు. శ్రీశ్రీ మహాకవి కవిసింహ గడియారం వేంకటశేషశాస్త్రిగారు ప్రశంశిస్తూ..

 

మ:    నిపుణప్రజ్ఞను సంసృతాంధ్రముల పాండిత్యంబు సాధించి భా

         వ పదార్థౌచితి మీఱ హృద్యముగ కావ్యమ్ముల్ నిబంధించి స

        త్యపథంబున్ వెలయించు సత్కవి నృసింహాచర్యు లేతత్సభా

        భ్యుపపాద్యత్కవిరాజ సద్బిరుదమున్ భూషించి రాణించుతన్

 

అని శ్లాఘించారు. ఇలాయెందరో ఉద్దండ పండితుల నభినందనల నందుకొన్న శ్రీ కాండూరు నరసింహాచార్యులు ధన్యులు.

 

(నెలనెలా మనజిల్లా సాహిత్యం, 35, సదస్సు 20-09-2014 ఆదివారం సాయంత్రం 6.౦౦ గంటలకు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రం, ఎర్రముక్కపల్లె, కడపనందు చేసిన ప్రసంగము)

 

 

 

 

 

డా|| పుట్టపర్తి నారయణాచార్యులు

 

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు అనంతపురం జిల్లా పెనుగొండవద్దగల చియ్యేడు గ్రామంలో1914 మార్చ్ 28న అంటే ఆనందనామసంవత్సర చైత్రశుద్దవిదియ రోజున కొండమ్మ శ్రీనివాసాచార్య దంపతులకు జన్మించారు. మాది శ్రీకృష్ణదేవరాయల ఆధ్యాత్మిక గురువైన తాతాచార్యుల వంశమని వారే తెలియజేశారు. అంతేగాదు మావారందరూ గొప్ప పండితులని శ్రీనివాసప్రబంధ తొలిపలుకులలోనే యిలా చెప్పుకొన్నారు.

 

సీ:    నాతల్లి భక్తి సామ్నాయ్య జీవిత సంస్కృ

                   తాంధ్రభాషా వచనాభిరామ

          నాతండ్రి రసజగన్నాథుండు, నాదృష్టి

                   నఖిలేశ్వరునకు రూపాంతరమ్ము

          మద్భార్య వాల్మీకి మాకంద మాధుర్య

                   రచనావిశేష విశ్రాంతహృదయ

          వైష్ణవాగమ సమభ్యాస సాంగంధ్య ని

                   ష్ణాధష్ణులుభయ వంశములవారు.

 

 

 

గీ:    వివిధవా ఙ్మ య చర్వణా వితతకీర్తి

          పరమవైష్ణవపాద సేవకుడ నేను

          శ్రీనివాస ప్రబంధ సంసృష్టిసేతు

          చారు ఫణితి నారాయణాచార్య సుకవిఁ.  

 

ఒకసారి యీయన శబ్దమంజరి చదువుకుంటూ తప్పుచదివితే, తల్లి ఇల్లుతుడుస్తూ ఆతుడిచే గుడ్డతోనే యితన్ని కొట్టిందట. అంతటి విద్యావంతురాలామె. ఆయన చిన్నతనంలో యెంతటి స్ఫురద్రూపియో అంతటి అల్లరీచేసేవాడట మశీదులపైనుండు పావురాళ్ళను పట్టడం, అమరకోశం చదివి ఇవే పెళ్ళిమంత్రాలని జరిపించటం వంటివెన్నో చేసేవాడట. అదేసమయంలో తండ్రి ప్రవచనంచెబుతుంటే, ఆ ప్రవచనానికి తండ్రి సూచించిన భారత భాగవతపద్యాలు తానే శ్రావ్యంగాచదివేవాడట.

 

అలా తాను చదివేవాటిలో ప్రహ్లాదచరిత్ర తనకెంతో యిష్టమని చెప్పు

కొన్నాడు. చాలా చిన్నవయస్సులోనే రచనలు ప్రారంభించాడాయన. అప్పుడు వ్రాసిన ఇందుమతీపరిణయం, శచీపురంధరవిలాసం తనకే నచ్చక చించిపారేశారట. 14వ యేట తను అల్లరిచిల్లరగా తిరుగుతూనే నిశితంగా గమనించిన దృశ్యాలన్నీ పెనుగొండలక్ష్మిగా అల్లికచేసి మొదటి గ్రంథంగా వెలువరించారు. అప్పుడే ఆయనలోని కవి తొంగిచూచాడు. కల్పనాపటిమ బయటపడింది.

 

ఈవిషయం యెందుకు చెబుతున్నానంటే, ఒకనాడు కమ్యునిష్టు ఆఫీసు (హొచిమిన్ భవన్) లో కమ్మూసాహెబ్ వ్రాసిన "వేమన" నాటకాన్ని చర్చిస్తూ అక్కడివారు మహాకవివేమన అన్నారు. నారాయణాచార్యులు వేమన యోగి, తాత్వికుడు, సంస్కర్త అంతేగానీ మహాకవి అనడం సరికాదన్నారు. అలా యెందుకన్నారో తర్వాత నాకర్థమైంది. శిల్పాలుచెక్కడమనే ఒకేవిషయం మీద పుట్టపర్తివారు తన బాల్యరచనలోనే..

 

 

మ: ఉలిచే రాలకు క్కిలింతలిడి ఆయు ష్ప్రాణముల్ బోయు శి

    ల్పుల మాధుర్య కళాప్రపంచము లయంబున్ జెందె పాతాళమున్

   గలసెన్ పూర్వకవిత్వ వాసనలు నుగ్గైపోయె ఆంధ్రావనీ

   తలమంబా యికలేవ ఆంధ్రులకు రక్తంబందు మాహాత్మ్యముల్.

 

అన్నారు. అదే వేమన, యోగి, తాత్వికుడు, సంస్కర్త కాబట్టి కట్టెవిరిచినట్లు

 

ఆ:వె:        కట్టరాళ్ళు తెచ్చి కాలుసేతుల త్రొక్కి

          కాసెయులుల సేత గాసిచేసి

          దైవమంచు మ్రొక్క తప్పది గాదొకో

          విశ్వదాభిరామ వినుర వేమ.

 

అన్నారు. కవిహృదయంలో ఉలి రాళ్ళకు చక్కిలింత లిడితే, సంస్కర్త మానసంలో అదే ఉలి రాళ్ళను చిల్లులుబొడిచింది. అదిగదా వారిద్దరి మధ్యనున్న తేడా అనిపించింది.

 

నారాయణాచార్యుల వారు తన చిన్నతనంలోనే ఒకసారి

 

కం:  అలకవితాలోకమునకు

          కలిమికి వైరంబదేల గలిగెను చెపుమా?

 

అని సగం పద్యంతో ఆగిపోయారట. అపుడు వారి తండ్రిగారు

 

 

 

        కలికాలమహిమ సద్గుణ

          కలితుల నృపసింహములను గనకుండుటయే.

 

అని పూరించి నవ్వి, పూరించలేని పద్యమల్లడ మెందుకని చిరుకోపం జూపించాడట.

 

నారాయణాచార్యులవారు బుక్కపట్నం అన్నమాచర్యవద్ద సంస్కృత కావ్యపఠనమభ్యసించారు. రంజకం మహాలక్ష్మమ్మ వద్ద నాట్యాధ్యయనం చేశారు. పిట్స్ దొరసాని శిష్యరికంలో మిల్టన్, బైరన్, షేక్స్‍పియర్ చదువుకున్నారు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదువుకోవడానికి పోగా ప్రిన్సిపాల్ చులకనగా మాట్లాడారు. ఆయన కపిస్థలం దేశికాచార్య పుత్రుడైన కృష్ణమాచార్యులవారు. ఘనాపాటి. నారాయణాచార్యులు బయటికి నడుస్తూ ఆశువుగా పద్యాలు వినిపించాడట. వెంటనే ప్రిన్స్‍పాల్ వెనక్కు పిలిచి సీటిచ్చాడట. అంతేగాకుండా యీ కళాశాలలో నీకిష్టమొచ్చిన క్లాసులో చేరమన్నాడట. అదీ వారి ప్రతిభ. అంతేగాదు పుట్టపర్తివారి పెనుగొండలక్ష్మి యే ఆయనకు విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశమైందట. తనవిద్యర్థిదశలోనే అనగా 19వ యేట "షాజీ" వ్రాస్తే అప్పుడేఅది ప్రింటై ఇంటర్మీడియేట్‍కు పాఠ్యపుస్తకమైందట. ఇది తన జీవితంలో ఒక మరచిపోలేని సంఘటనగా చెప్పుకొనేవారాయన. ఒకనాడు భారతి పత్రికా ఆఫీసుకు వెళితే, మా పత్రికకు వ్యాసాలు వ్రాసిన నారాయణాచార్యులు మీరా? ఇంత చిన్నవయసువారా? అని మొదట అనుమానించి తర్వాత ఆయన పాండిత్యము విని ముగ్ధులయ్యారట.

 

నారాయణాచార్యులవారు మాగధి, అర్థమాగధి, శౌరసేని, పైశాచీ భాషలతోసహా 14 భాషలు నేర్వడమేగాక వాటిలో కవిత్వంకూడా చెప్పగల ధీమంతులు.

 

అగ్నివీణ, షాజీ, సాక్షాత్కారం, శివతాండవం, పండరీభాగవతం, పాద్యం, మేఘదూతం, శ్రీనివాసప్రబంధం, విమలాదిత్యుదు, జనప్రియరామాయణం వంటి గ్రంథాలు నూటికి పైబడి వ్రాశారు. "Leaves in the wind" అనే ఆంగ్లకవితలు. "Hero”అనే ఆంగ్లనాటకం వ్రాశారు. సరస్వతీ సంహారం నవల కన్నడంనుండి తెనుగు జేశారు. సంఘర్షణ, గాడీవాలా నవలలు హిందీనుండి తెనుగు జేశారు. ఉషఃకాల్ అనబడే మహారాష్ట్ర జీవనప్రభాతం నవలను మరాఠీ నుండి తెలుగు జేశారు. విశ్వనాథ వారి ఏకవీరను మళయాళం లోనికనువదించారు. హరిదాసి, అభయప్రధానము, ప్రతీకారం వంటి స్వతంత్రనవలలూ వ్రాశారు. వాదవిజయం వచనంలో వ్రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి  భాగవత సుధాలహరి పేరుతో వ్యాస పోతనల తులనాత్మక రచనాశైలిని వివరిస్తూ వ్యాసాలు వరుసగా పంపారు. తను వ్రాస్తూ వుండిన "అస్తసామ్రాజ్యం" కుందూనదిలో కొట్టుక పోవడంతో ఆ రచన అంతటితో ఆపేశారు. ఆసమయంలో ఆయన కుందూతీరంలో కుటీరవాసం చేస్తుండినారు.

 

నారాయణాచార్యులవారు బెంగుళూరులో స్వర్ణమూర్తి బిరుద మందుకొన్నారు. కేరళగవర్నర్ బూర్గుల రామకృష్ణారావుగారిచే బ్రహ్మభూషణ బిరుదు, మదర్‍తెరిస్సా (1952) చేతులమీదుగా కళాభారతి బిరుదు నందుకోవడమే గాకుండా, ఆంధ్రరత్న, మహాకవి, కవిసార్వభౌమ, అభినవపోతన, ప్రాకృతకవితాసరస్వతి వంటి బిరుదులెన్నోపొందారు. బిల్లాణ పురస్కారాన్ని శ్రీనివాస ప్రబంధానికిగాను భారతీయ భాషాపరిషత్ కలకత్తా వారిచ్చారు. శ్రీకృష్ణా యూనివర్సిటి గౌరవడాక్టరేట్ నిచ్చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ నిచ్చింది.

 

ఈ పద్మశ్రీ కోసం ఢిల్లీ బయలుదేరారు నారాయనాచార్యులవారు. రైల్లో ఒక మళయాళ పండితుడు కనబడి పుట్టపర్తి వారికి సాష్టాంగపడ్డాడు. అతడు పద్మశ్రీ అందుకోవడానికి వెళుతున్నానని, దీవించమని అడిగాడు. ఢిల్లీలో దిగగానే  ఆ పండితుణ్ని మళయాలీలు మంగళవాయిద్యాలతో గౌరవంగా గొంపోయారు. కానీ పుట్టపర్తివారు బిక్కు బిక్కుమంటూ తనబసకు ఒంటరిగా చేరుకున్నారు. అదీ తెలుగువారి పండితప్రేమ భాషాభిమానం.

 

నారయణాచర్యులు యెంతటి సనాతనవాదియో అంతటి ప్రగతిశీలి. వేదోపనిషత్తులనుండి మార్క్స్ వరకు చదువుకున్నావారు. అరవింద మార్క్స్ సిద్ధాంతాలను సమన్వయపరచుకొన్నవారు.

 

ప్రొద్దుటూరు మునుసిపల్‍హైస్కూల్‍లో జూనియర్ తెలుగుపండితుడుగా పనిచేసేటప్పుడు, అక్కడి పండితులలో విభేదము గలిగి తుదకు కమ్యునిష్టుల సహాయంతో గట్టేక్కానని చెప్పుకున్నారు. అందుకే కమ్యునిష్టుభావజాలంతో మెలిగే వై.సీ,వి రెడ్డీ, గజ్జల మల్లారెడ్డీ, శివరామిరెడ్డీ, శ్వర్‍రెడ్డీ, రారా, వెంకట్రామిరెడ్డి గా ర్లతో సన్నిహితంగా వుండేవారు. వై.సీ.వీ రెడ్దిగారిని అమిత గౌరవంతో చూసేవారు. ఆయన్ను గురించి చెబుతూ..

 

మ:  అనుగా! చల్లని కైతవాడ! నొకనాడైనన్ మదీయోపకా

 ర నిరీక్షామతినుంటివో సతమునా వ్రాతల్ ప్రశంశించుటే

        పని మాధ్వీక రసానుమేయమతి, ఓ వైసీవిరెడ్డీ! భవ

 జ్జని నా మేలునకయ్యె, నిన్ను మరువన్‍జాలన్ దివారాత్రముల్.                                                  

అంటూ ఆప్యాయతను చూపించారు. తెలుగుపండితునిగా కడప శ్రీరామకృష్ణా హైస్కూల్ లో పనిచేసి ఉపాధ్యాయ వృత్తిని పూర్తిచేశారు.

 

ఆయన విపరీతమైన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి హృషీకెశ్ మంచిదని వెళ్ళాడట. అక్కడ శివానందస్వాములవారు వారిని వారించి ఆశీర్వదించి "సరస్వతీపుత్ర" బిరుదముచ్చి పంపారట. ఆబిరుదే ఆయన యిష్టంగా వాడుకున్నారు.

 

గడియారం వేంకటశేషశాస్త్రిగారి శివభారతాన్ని వీరు శ్రావ్యంగా సభల్లో చదివేవారట. కానీ వీరి శ్రేయోభిలాషులు "అలా ఒకరి కావ్యగానం వల్ల నీవు పైకిరాలేవు నీదైనముద్ర నీవు శ్రోతలపై వెయ్యగలగాలి" అన్నారట. అందుకే ఆయన హిందూపురంసభలో గడియారంవారి శివభారతం చదవకుండా వచ్చేశారు. అప్పటినుండి యీ గురుశిషులమధ్య విభేద మేర్పడిందని ప్రతీతి.

 

సంసారం పెద్దది కావడంవల్ల ఆర్థికయిబ్బందులకులోనై ప్రవచనాలు హరికథలూ చెప్పి దక్షిణలు సంపాదించేవారట. ఈయన హరికథ కూర్చొనే వినసొంపుగా చెప్పేవారు. మోచంపేట విశ్వేశ్వరాలయంలో వరుసగా భారత భాగవత ప్రవచనాలు చేశారు. అతులిత శేముషీ విభావతుడైన వక్తగా పేరు గడించారు.

 

ఆయనకు తులసీదాసు హిందీ రామయణం కంఠతావచ్చు. సూర్‍దాస్, రసాఖాన్. మీరా, విద్యావతి, తుకారామ్, జ్ఞానేశ్వర్, ఏక్‍నాథ్, సమర్థరామ్‍దాస్, బసవేశ్వర్, అక్కమహాదేవి, సర్వజ్ఞకుమారవ్యాస, ఎళుత్తచ్చన్. వంటి కవులంటే అభిమానం. అలాగే జిళ్ళెళ్ళమూడి అమ్మ బోధలను మెచ్చుకొనేవారు.

 

1954 లో రాష్ట్రపండిత మహాసభలు కడపలో జరిగాయి. ఆ సభల్లో నారాయణాచార్యులను తక్కువచేసి మాట్లాడినారు. అప్పటికి రెండు రోలులు గడిచాయి. విషయంతెలిసి మూడవరోజు పుట్టపర్తివారు సభకువెళ్ళి "నాకు పదునాల్గు భాషలు రావన్నారట, రండి, దమ్ముంటే యెదుర్కోండి" అని సవాల్ విసిరారట . ఆ సభలో జమ్మలమడక మాధవరాయశర్మ అడిగిన కొన్ని ప్రశ్నలకు శాస్త్రోక్తంగా సాధికారంగా జవాబులుచెప్పి తనను తక్కువచేసి మాట్లాడిన వారి నోరుమూయించారు. అప్పుడు కడప విద్యార్థులు పుట్టపర్తివారికి జేజేలు గొట్టి సభదద్దరిల్లేట్లు చేశారు.

 

ధారావేగానికి రసానికీ అడ్డువచ్చేచోట ఛందస్సును నేను లెక్కచేయను, కనుక నా శ్రీనివాసప్రబంధాన్ని భుతపురి సుబ్రహ్మణ్యశర్మను చూడమన్నాను. ఆయనా గొప్పకవి, జ్యోతిష, వాస్తువిద్యానిపుణుడు కనుక తీరుబడి తక్కువ. అయినా నన్ను గురుభావంతో గౌరవించి సవరణలుచేసి ప్రూఫులు దిద్దినారని ఆయన్ను ప్రస్తుతించారు. అట్లే శ్రీనివాసప్రబంధం సరిచూసి సవరించి గౌరిపెద్దిరామసుబ్బశర్మ సప్తగిరిమాసపత్రికలో వేయించారని వారికీ కృతజ్ఞతలు తెలిపారు పుట్టపర్తివారు.

 

ఒకసారి కేశవకుమార్ "చెన్నకేశవ సూక్తావళి" పుస్తకం అవిష్కరించడానికి సభకు వచ్చారు పుట్టపర్తివారు. అప్పుడు మాట్లాడుతూ వీడు కేశవ మనవాడు. అందుకే నేనొచ్చినాను. కానీ మనవాడు పుస్తకంపేరే తప్పుగా పెట్టుకున్నాడు. "సూక్తి +ఆవళి సూక్త్యావళి గదా కావాలి, సూక్తావళి కాదుగదా! అయితే మనమే మనవాణ్ని తప్పుపడితే యెలా?" అని, ఇదీ సరైనదే సంస్కృతంలోని సూక్తః, ఆవళి కలిసి సూక్తావళే ఔతుంది సవర్ణదీర్ఘసంధి సరిపోయిందన్నారు. అలా మిత్రతతో సమర్థించడం అందరికీ చాలాసంతోషమైంది. అలాగే ప్రొద్దుటూరులో మేడసానిమోహన్ చతుర్ధాష్టవధాన సభకు అధ్యక్షత వహించి "మేడసానీ నీకు తిరుపతివెంకటకవులకున్నంత ధారణవుంది నీకు తిరుగులేదు" అని దీవించారు. పుట్టపర్తివారిది అంతటి సహృదయం మరి.

 

ఈయన యెంత గంభీరుడో నవ్యభావాలు గలవాడో అంత సున్నితహృదయుడు, అమాయకుడు కుడా. ఒకసారి వీధిలో పిల్లనగ్రోవు లమ్ముకొనేవాడు దారిన మురళి ఊదుకుంటూ పోయాడు. ప్రక్కనేవున్న టి.వి శ్రీనివాసరావుతో "అరే శ్రీనివాసా అదిగో శ్రీకృష్ణపరమాత్మ మురళీరవం వినిపిస్తూ పిలుస్తున్నాడురా!" అని లేచి వీధిలోకిపోయి ఆపిల్లనగ్రోవులమ్మేవాడు కానరాక దిగాలుగా తిరిగివచ్చి "శ్రీనివాసరావ్ కృష్ణపరమాత్మను కనుక్కోలేక పోయినారా" అని చింతించడం మొదలు పెట్టాడట. ఇప్పుడాశ్చర్యపోవడం  శ్రీనివసరావ్ పనైంది. ఇటువంటి సున్నితమైన భక్తిప్రపత్తిగల హృదయావిష్కరణ ఆయన రచనల్లో అక్కడక్కడా కనబడుతుంది. నైరాశ్యంప్రతిధ్వనిస్తుంది. ఈ పద్యం చూడండి.

 

సీ:    ఏమికొరంత! యింకేమి గావలయునీ

                   కంచును బ్రశ్నించు నట్టులున్న

          శారదచంద్రికా సంపదున్మేష వి

                   కాసి విస్మేరంబు కన్నుదనుప

          దరిసెనంబొసగిన తల్లి! నీ దయకన్న

                   నింకేమి గావలె నెచ్చునాకు

          నడిగిననే యిచ్చు నమరగవీ సుర

                   భూజంబు లడుగకమున్న యొసగు

 

గీ:    దీవు సంపదున్మాదమ్ము లెడదగ్రమ్మి

          ధర్మమును దప్పకుండగా దయ గలుగుము

          తల్లిదండ్రులు నాకు బద్మాముకుందు

          లనెడు తలపు దప్పింపకుమమ్మ దేవి.

 

శా:   స్వామీ! యెంతటివారినైన మఱిపింపంజాలు కాంతాకటా

      క్షామోదమ్ములు, భర్మసంపదలు పంకాతంక మూలమ్ము లి

      చ్ఛా మోహమ్ములు, వానినుండి నను నశ్రాంతమ్ము రక్షింప వ

      య్యా! మిథ్యాభవబంధ! దాన కరుణావ్యాకోచ! నారాయణా.

 

అని తనదోషమ్ము లొప్పుకొని దీనంగా వాటినుండి కాపాడమని వేడుకున్నాడు తన శ్రీనివాసప్రబంధంలో.

 

చెన్నురులో ఒకడాక్టర్‍గారింట్లో హరికథ చెప్పి వస్తుండగా "స్వామీ శ్రీనాధుని వలె మీరూ మా వూరిపై ఒకచాటువు చెప్పండి"  అని అడిగితే వెంటనే పుట్టపర్తివారు

 

గీ:    తమలపాకులనిత్తువో తమల పాకు

          వంటి పెదవి నందిత్తువో పలుకవేమి?

          పొగరు చూపులు పొంపిరివోవుదాన

          కోరనవ్వుల దా! చెన్నూరు దాన

 

అనగానే "యీ కోరచూపులేమిటిస్వామీ" అని ఒకరన్నారట. అయితే "చిర్నగవు జిందు చెన్నూరి చిన్నదాన" అని వేస్కో అన్నారట. అలా ఆశువుగా శృంగారరసాన్ని ఆవిష్కరించారు. అంతేగాదు నేటివిద్యార్థుల, విద్యాలయాల దుస్థితికి స్పందిస్తూ..

 

ఉ:    కాలినవత్తులట్టుల వికారములై కనిపించు శుష్క వి

          ద్యాలయముల్ మనస్సను పదార్థమెలేని గురుల్ విశీర్ణ కం

          కాళము లైన పిల్లలును గానగ కన్నులు గుట్టు నాకు తం

          డ్రీ లయకాలనృత్యము ఫలించినదేమిర దేశమందునన్

 

అని వాపోయారు. అట్లే తన పరిస్థితిని వివరిస్తూ..

 

                ఒకనాడు కృష్ణరాయకిరీట సుమశేఖ

                             రంబైన అభయహస్తమ్ము మాది

                   ఒకనాడు గీర్దేవతా కమ్రకంకణ

                             స్వనమైన మాధురీ ప్రతిభ మాది

                ఒకనాడు రామానుజ కుశాగ్రబుద్ధికి

                             చదువు నేర్పినది వంశమ్ము మాది 

                   ఒకనాడు సకలకళలకు తానకమైన

                             దండిపురమ్ము పెన్గొండ మాది

 

        తల్లిదండ్రుల మేధ విద్యానిషద్య

          పాండితీశోభ పదునాల్గు భాషలందు

          బ్రతుకునకు బడిపంతులు భాగ్యమునకు

          చీడపట్టిన రాయల సీమ మాది

 

అని అక్కసు వెళ్ళగక్కినారు. వీరి కావ్య పరిశీలనలోనికి వెళ్ళి గమనిస్తే. భావానికి తగిన గంభీరత, శైలి సంతరించుకొన్న పటుతర పదప్రయోగం చేయగల సమర్థుడాయన. ఆయనకు యెక్కువ పేరు గడించి పెట్టినది "శివతాండవం" అదీ తను వైష్ణవుడై వ్రాసిన శివతాండవం. అసలాయన దృష్టిలో దైవానికి నిర్వచనమే వేరు.

 

  ఏమానందము భూమీతలమున

 శివతాండవమట శివలాస్యంబట

  అలలై బంగరు కలలై పగడపు

పులుగులవలె మబ్బులు విరిసినయవి   |శివ|

 

  వచ్చిరొయేమొ వియచ్చరకాంతలు

 జలదాంగనలై విలోకించుటకు   |శివ|

 

 

 ఏమానందము భూమీతలమున

 పలికెడునవె పక్షులు ప్రాబలుకులొ

 కల హైమవతీ విలసన్నూపుర

నినాదములకున్ ననుకరణంబులొ

  కొమ్మల కానందోత్సాహమ్ములు

  ముమ్మరముగ మనముల గదలించెనొ

  తలనూచుచు గుత్తులు గుత్తులుగా 

  నిలరాల్చును బువ్వుల నికరమ్ములు

  రాలెడు ప్రతి సుమమేలా నవ్వును

  హైమవతీ కుసుమాలంకారము లందున

  తానొకటౌదు నటంచునొ||

 

ఇది ఆయనేపాడి శ్రోతలను మైమరిపించేవారు. ప్రస్తుతం ఆయన ననుకరించగల సమర్థులు  శ్రీ ఎన్. సి రామసుబ్బారెడ్డిగారున్నారు. నారాయణాచార్యులేచెప్పుకొన్నట్లుగా తనకు అంతే పేరుతెచ్చిన కావ్యం మేఘదూతం మాత్రాఛందస్సులో అదిఒక లయ.

 

          తెలుగు చిన్నదేవి - లలిత పదములలోని

          పారాణి చిహ్నములు జూచి - దయ్యాలు

          పారాడు నంతిపురినీ జూచి - ఏడ్చికొను

          కోటకొమ్మలపైన - కూర్చొందువేమో

          నిట్టూర్పు సెగలతో  - నీవె పొగలయ్యేవు.

 

          తిట్లలో తిమ్మయ్య - దీవెనల బ్రహ్మయ్య

          భీమకవి పారాడినాడు - రాజునే

          బిచ్చగానిగ జెసినాడూ - ఒకనాడు

          కవుల వాక్యమ్ములే - కామధేనువు పొదుగు

          కవుల వాక్యమ్ములే - కవిసికొను ప్రళయాగ్ని

 

          అదిగదిగొ కదలుచున్నది - నీడవలె నొకటి

          ఆదరంబంకించి చూడూ - తిమ్మరుసు

          నన్నదో కన్నీటి గూడూ - ఉపకార

          మపకారమై బ్రతుకు - హతమార్చె నొకరాజు

          అతడు సామన్యుడా - ఆంధ్రజాతికి పొగరు.

 

అలా సాగిపోతుంది మేఘదూతం. యెదియేమయినా అన్నీ అందరినీ

 పరవ శింపజేయలేవు. ఎవరి అభిరుచి, యెవరి భావము వారిది. మేము అప్పట్లో సర్పయాగ మని ఒక యానాది హీరోగా వుండే నాటిక ప్రదర్శించేవాళ్ళం. అందులో భార్య యింతపొద్దుబోయిందెందుకని ఆ యనాది నడుగుతుంది. అందుకు వాడు, ఆడ ఓఅరవాయన పాటలు

 బె ట్టిండ్రు, ఆ ఆ ఆ.. అని రాగాలు దీస్తానే వున్నాడు, ఆడున్న

నాయాడ్లు తోండలమాదిరి తలలాడిస్తూనే వుండారు. ఒక్కనికి గూడా ఆకలైనట్లులేదే, అంటాడు,తన ఆలస్యానికి జవాబుగా. అంటే అక్కడ జరిగే సంగీతకచ్చేరి వానికి నచ్చలేదన్న మాట. వాడి దృష్టి, తిని పారేయబోయే విస్తరాకుల మీదేవుంది. అంతేకాదు వాని టేస్టేవేరు. వాడు జానపదాలు పాడతాదు ఆడతాడు ఆనందిస్తాదు. ఆందులోని భావం పుట్టపర్తివారి షాజీ లోని పద్యంచూచి ఓహో ఇది గదా! అనుకొన్నను.

 

గీ:    నవ్యతరమైన యొక్క గానస్రవంతి

          కొకడు తలయూచు మరియొక డోసరించు

        వీణదే దోషమా? లేక వినెడి వారి

          తప్పిదమ? కాదు భావ భేదములె సుమ్ము.

 

మన కవితలూ భావాలూ కొంతమందికి నచ్చకపోవడం సహజమే అదేం తప్పుకూడా కాదు. అందుకు బాధపడవలసిన అవసరమేమీ లేదనిపిస్తుంది.

 

కొప్పరపు సుబ్బయ్య పుట్టపర్తిఅభిమాని. ఆయన మరణవార్త నారయణాచార్యులను కలచివైచింది. ఆ బాధ "బాష్ప తర్పణం" గా వెలువడింది. అందులో

 

గీ:    మృత్యుదేవత నిప్పురెక్కలార్చి

          కప్పికొనుటయె చావు లోకమందు

          గాని సుబ్బయ్య యెడనిది గనక రథము

          దన్ను కొనిపోయె మోక్షసౌధమ్ము కొఱకు.

 

అంటారు. మృత్యుదేవత నిప్పురెక్కలార్చి కప్పికోవడమే చావు. కానీ మా సుబ్బయ్య విషయంలో మాత్రం యిది బంగారురథం. మోక్షభవనం చేర్చడానికది ఆయనకోసం ప్రత్యేకంగా వచ్చిందని తలపోశారు. చితిమంట లాయనకు కనకరథ మనిపించింది.

 

అగ్నివీణ ఆయన తొలిరచనల్లోనిదే. అది అచ్చయ్యేటప్పటికి నాభావాలే మారిపోయా యని ఆయనే తొలిపలుక్కుల్లో  వ్రాసుకొన్నారు.

 

        కనులలో రుధిరాగ్ని - కణములుద్ధతి గూడ

          మనసులోమిన్నాగు - ఫణమెత్తి పారాడ

          సవరింతునా - అగ్నివీణ

 

అన్నారు.

 

        పన్నగీనిశ్వాస - పటలభీకరముగా

          పాడకే నాసఖీ - ప్రిదిలి పోవును మనసు

          తేనెబండిన కోర్కె - లాను నీలపు కళ్ళ

          చూడకేనావైపు - మ్రోడు పడునాతలపు

          చిందుద్రొక్కు తుపాను - చెరగు జార్చినయట్లు

          చెదరునా జీవితము - చిలువకన్నెల విసము

          చిలికించు ప్రేమతో - పలుకరింపకె నన్ను

                             ఉలికిపడు నాఆత్మ

 

          కొండలో కోనలో - క్రొందలిరుటాకులో

          నీనటనలే దోచు - నీమాయలే పూచు

          మనసులో తలపులో - మర్మరధ్వనులలో

          నీ పాటలే తోచు - నీ పాటలే పూచు

          రక్తబిందువులలో - రసికగీతములలో

          నీ విభ్రమమె తోచు - నీమాయలే పూచు.

 

అంటూ నిగూడ భావాలను వెలిబుచ్చారు. జనప్రియ రామాయణంపై శ్రీశ్రీగారు తన అభిప్రాయం వ్రాస్తూ " నాకు రామాయణ భారతాలంటే సరిపోవు, కానీ యీ రచన చూస్తే చదువుదామనిపిస్తున్నది" అన్నారు. ఎందుకా అని ఆలోచనజేస్తే, అందలి ప్రకృతి వర్ణనలేనేమో ననిపిస్తుంది

 

 

        చూడు లక్ష్మణా! చూపుల నీడ్చెడు

          పంపాసతి సౌభాగ్యములెట్టివొ

          తేటలొలుకు నా నీటిని జూడుము

          పచ్చల ఛాయల ప్రతియగునా?

 

          ఎక్కడజూచిన జిక్కని పువ్వులు

          గ్రుక్కిదమగు నా కొండకొమ్మలను

          పుష్పితాగ్రముల పొలపుదీవెలూ

          పోడిమి గులుకగ బెనచినవీ

 

          అంతలపొంతల నవె తీరమ్మున

          నడవులు కన్నుల కానందమ్ములు

          చెట్లుజూడు ఘనశిఖరంబులతో

          జెలగెడు కొండల బోలినవి

 

          రాలినపువ్వులు రాలెడుపువ్వులు

          రాలక కొమ్మల గ్రాలెడు పువ్వులు

          అన్నిటి తోడను నాడచునున్నా

          డనుజా మరుతుం డటుజూడూ

 

అంటూ పంపానదీతీరప్రాంత సుందర వర్ణన సాగుతుంది. అట్లే శరదృతు వర్ణన జేస్తూ..

 

        ఏఱులు చెఱువులు పూరించీ జనమ్ముల

          హృదయమ్ముల మోదము బెనచి కృ

        తార్థ జీవనములై జలదమ్ములు

          కాలము చెల్లిన గతించెన్

 

          తేరినజలములు తీరిన కౌంచ

          మ్ముల రవములు వగదొలకు కుముదములు

          పండినవరి మృదువాయువు లలరిం

          చెడుశశి యిది శరదంబనియెన్

 

          నువుగ విరిసిన నల్లగోరటలు

          వేగిసలును గల విపిన వనంబులలో

          చెఱకువింట మధుకరగుణ మెక్కిడి

          మదనుడు మొనగాడయి తిరిగెన్

 

          ఆడుతేంట్లు వెన్నంటిరాగ తా

          మరసరేణు పింజరములు భ్రమర

          మ్ములు వనముల దేనెలకై దిరిగెను

          గాలివాటమున కనుగతిగన్

 

          ఏఱులరవళి మయూరబృంద కే

          కలు భేకమ్ముల కంఠతాళములు

          జంఝూ ఘోషలు జలదరముల గ

          ర్జలతోపాటుగ నత్తమిలెన్

 

          కర్ణమ్ముల ఘనగర్జలు పడినదె

          తడవుగ పుట్టల నొడలు సేర్చికొని

        పలునుపవాసమ్ములతో గృశియిం

          చిన మేనులతో బడియుండీ

 

          వానలు వెలిసిన వచ్చెవెలికి ఫూ

          త్కారమ్ములతో ఘోరవిషమ్ములు

          గల వింతల వన్నెల పాములు కడు

          పులాకలికి నకనకలాడన్.

 

          పాలగింజలుగల వరియెన్నులు

        ముక్కులగొని యవె బెగ్గురుపక్షులు

          సాగెన్ సొగసగు వరుసలుగా గగనమ్మున

          దివిదాల్చిన పూలదండలవోలెన్.

 

          జయయాత్రకు దగు సమయంబిది నృప

          కులమునకు. సుఖమ్ములలో మునిగిన

          సుగ్రీవునియెడ జొప్పడదేయత్నము

          దరిశనమే కఱువయ్యెన్

 

అని కథలోనికి ప్రవేశిస్తారు. అందుకే శ్రీశ్రీకి రామాయణమైనా చదవాలనిపించింది.

 

ఇక ఆయన "leaves in the wind"లో వ్యక్తపరచిన స్వానుభవాలను ఒకసారి పరిశీలిద్దాం.

 

         

       

          I dipped my head in

        sacred waters and

        caught cough and cold

 

        I bent my head at the

        feet of beard men who

        smeared it with dust.

 

        I shouted to clouds

        expecting a reply but

        my nerves became week

 

        I prostrated before idols

        but they didn’t open their eye.

        I red the sacred books

        days and nights and lost

        my sleep over them.

 

        The words are good but

        where is the God? I turned

        to my heart and I saw in it

        a sharp ray of light flickering

        I  was ecstatic. I said to my self

        you are the light

        the others a fantasy.

 

 

 

ఈ కవితలను శ్రీఅన్నవరం ఆదిశేషయ్యగారు "గుండె గులాబీలు" పేరుతో అనువదించి ప్రచురించారు. ఆపాఠం యిలావుంది.

 

        నేను పవిత్ర తీర్థాలలో మునక వేశాను

          దగ్గూపడిశం పట్టుకున్నాయి.

 

          నా శిరస్సును స్వామీజీల పాదాలపై

          అవనతంచేశాను. వారి విబూది జల్లులకు

          ముగ్గుబుట్టలా మారింది నా శిరస్సు.

 

   ఆకాశంవైపు చూసి చేతులెత్తి

     మొరపెట్టుకొన్నాను. నాగళం

     బొంగురుబోయింది

 

        విగ్రహాలముందు మోకరిల్లాను

          అవి కన్నెత్తి నన్ను

          చూడనైనాలేదు.

 

          నిద్రకు విడాకులిచ్చి

          రత్రింబవళ్ళు పవిత్ర గ్రంథాలు

        పఠించాను. సందేశసారం

          రసమయంగనే వుంది కానీ

          పరమాత్మ ధ్వనించలేదు. పరంజ్యోతి

          వెలుగులు కనిపించలేదు.

 

          నా నేత్రాలను అంతర్ముఖంచేసి

          హృదయన్ని అవలోకించాను,

          ఓవివేక జ్యోతి మిణుకు మిణుకు

          మంటున్నది.. నేను నిశ్చలుడనై

          మనసుకు నివేదించాను "మనసా"

          నీవే పరంజ్యోతివి నీవు వినా

          మరేదీ సత్యంకాదు, అన్నీ కల్పనలే

          అహం బ్రహ్మస్మి, అహమాత్మాన్.

 

ఇక తెలుగువాణి పంచిన ఆహ్లాదాన్ని. మాధుర్యన్నీ, ఘనతను నారాయణాచర్యులవారు కీర్తించిన విధానాన్ని ఒకసారి గమనిద్దాం

 

        గీ:    పలుకువెలది విహారముల్ సలుపు కొఱకు

                   మాధవుని బూజ సేయ సుమముల కొఱకు

                   మునులు నిశ్చలయోగాన మునుగు కొఱకు

                   నలరుచును బెంచినార మీ తెలుగు తోట.

 

చం: తెనుగు మిటారి పల్కు నన తేనియ సోనలు గాల్వగట్టి

          నునుదెరువందు పారెనిట నోళుల నూటలు గ్రమ్మనిచ్చటం

జినుకులు బొట్టుబొట్టులుగ జిల్కుచిలుక్కున జిందె డెందముల్ దనియగ నానగాదలచు ధన్యులు కోరికదీఱ గ్రోలుడీ

 

ఆఖరుగా నారాయనాచర్యులవారిని డా|| సి. నారయణరెడ్డిగారు ప్రశంశించిన కవితను విని చాలిద్దాం.

 

          ఎవనిపదమ్ములు శివతాండవలయాది రూపమ్ములు

          ఎవని భావమ్ములు సుందర శివలాస్య రూపమ్ములు

          అతడు పుట్టపర్తి సూరి అభినవ కవితామురారి

          అతని చతుర్ముఖతకు విస్మితులుకాని విజ్ఞులేరి

          ఒకటి రెండు బాసలు నాలుకపై తిరుగుట గగనము

          ఒకటి రెండు కబ్బమ్ములు పెకలించుట అబ్బురమ్ము

          పదికి మించు బాసలలో పసిడి నిగ్గులేరుకొన్న

          పుట్టపర్తి దిషణకు జేకొట్టగ మనసాయెనాకు

          కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు

          వెలితి యెఱుగలేని కడలి పొలుపు దెలుపు అతని తలపు

          వ్యవహారజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు.

          రక్తికీ భక్తికీ సేతువు రచించిన రసికుడతడు.

 

సినారేకు జ్ఞానపీఠ అవార్డ్ వచ్చింది. కానీ పుట్టపర్తికి రలేదని, ఆయనకూ వచ్చుంటే బాగుందేదని, అసలాయనకు యిచ్చి వుండవలసిందని ఆయన అభిమానులు యెంతగానో చింతించిన విషయం అందరికీ తెలిసిందే. సరస్వతీపుత్ర శ్రీమన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు సెప్టంబర్ ఒకటి 1990న పరమపదించారు.  ఓం తత్ సత్.

 

 

        (నెలనెలా మనజిల్లా సాహిత్యం. 56వ సదస్సు. 26-06-2016 ఆదివారం సాయంత్రం 6.౦౦ గంటలకు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రం, ఎర్రముక్కపల్లె, కడపనందు చేసిన ప్రసంగము)

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment

స్త్రీ, శిశు వ్యాధులు హోమియో చికిత్స

    స్త్రీ , శిశు వ్యాధులు హోమియో చికిత్స       డా || శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్య ప్రదాత)   రచన పి.సుబ్బరాయుడు కెంట్ హ...