Wednesday, November 4, 2020

సూక్తిసుధ (2)

 

సూక్తిసుధ (2)



రచన

పి. సుబ్బరాయుడు

42/490, ఎన్.జి. కాలనీ

కడప - 516002

సెల్ – 9966504951


విషయసూచిక

1.కృతజ్ఞత                                3

2.పునర్జన్మ                               4

3.మాటపై నిలకడ                        5

4.అపాయానికో ఉపాయం               7

5.పాలకుపాలు నీళ్ళకునీళ్ళు               8

6.కృష్ణుడు – భీష్ముడు                    10

7.ధర్మరాజు – అర్జునుడు                 14

8.బసవేశ్వరుడు                          21

9.లల్లయోగేశ్వరి                         24

10 .చైతన్యమహాప్రభువు                  27

11.అక్కమహాదేవి                         37

12.కనకదాసు                            41

13.ఏక్‍నాథ్                              47

14.భర్తృహరి                             58

15.జాబాలి                               65

16.జాజలి-తులాధారుడు                  70

17.దైవీయశక్తులు                         76

18.యుయుత్సుడు                        80

19.కుచేలుడు                             85

20.సంజయుడు                          92

21.తెలుగువారి కారాలు                  100

1.కృతజ్ఞత

 

1. నీవొక మంచి ఉద్యోగంలో స్థిరపడ్డావు. అందుకునీ యోగ్యత, తెలివితేటలే కారణమనుకుంటున్నావు. కానీ నీవంటి యోగ్యత, తెలివితేటలు వుండికూడా ఉద్యోగం దొరక్క అవస్థలుపడుతున్నవారూ వున్నారు. దైవం నీపై చూపించిన దయకు కృతజ్ఞత కలిగి యుండుము.

 

2. నీవలెనే ప్రార్థించినా నీవనుగ్రహింపబడినట్లు చాలామంది ఇంకనూ అనుగ్రహింపబడలేదు. అందులకు నీవు కృతజ్ఞుడవై యుండుము.

 

3. నీవు ప్రతిదినం నడిచే రహదారి నీకుసౌకర్యంగానేవుంది. కానీ అదే బాట కొందరిని ఆపదలకు గురిచేసి విలువైన ప్రాణాలను హరించింది. అందుకునీవు కృతజ్ఞుడవై యుండుము.

 

4. ఆసుపత్రిలో నీవు పడుకున్న మంచంపరుపు మీదే, చాలామంది ముందో వెనుకో పడుకున్నారు. నీజబ్బు నయమై నీవు క్షేమంగా యిల్లు చేరుకున్నావు, కానీ కొందరు అక్కడే తుదిశ్వాస విడిచారు. కనుక నీవు కృతజ్ఞుడవై యుండుము.

 

5. ఒకవర్షం వల్ల నీపైరు పుష్కలంగాపండి, మంచి ఫలితాన్నిచ్చింది. కానీ అదేవర్షం మరొకరి పైరును విధ్వంస మొనర్చింది. కనుక నీవు కృతజ్ఞుడవై యుండుము.

 

6. నీవు కృతజ్ఞుడవై యుండడం అవసరం. ఎందుకంటే నీవు పొందినవన్నీకూడా నీ శక్తి, బలము, తెలివి లేక అర్హతతోనే సమకూరినవి కావు. అవన్నీ భగవదనుగ్రహములు. ఆయనే సర్వప్రదాత. కనుక కలిగిన వాటికన్నిటికీ కృతజ్ఞుడవై యుండుము.

 

v   

 

2.పునర్జన్మ

     

నేను మరణించి ఎరువునై, మొక్కకు సత్తువగామారి, వృక్షాన్నైనాను.

నేను వృక్షంగా దూడకు గ్రాసాన్నై జంతువుగా రూపుదిద్దుకున్నాను.

నేను పశువునుండి తిరిగీ మనుషినైనాను,

 

నాకింక భయమెందుకూ,

చావెప్పుడూ నన్ను కించపరచలేదు. అయినా..

నేను మహోన్నతులైన దేవతలతో కలసి ఎగిరిపోవడానికి,

మరోసారి మనిషిగా చావాలి.

 

ఆ దేవతలస్థాయినిసైతం నే నధిగమించాలి.

ఆ స్థాయినిసైతం నేను త్యజించినా! దైవంతప్ప సర్వం నశించినా!

నేను భావాతీతమై వెలుగొందుతాను. ...  .................. . ............  జలాలుద్దీన్‍రూమీ

 

( ఆంగ్లం నుండి తర్జుమా)

 

3.మాటపై నిలకడ

 

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం యేమంత సులువైన విషయం కాదు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రున కిచ్చిన మాటకు కట్టుబడి భార్యాకుమారుణ్ణి అమ్ముకున్నాడు. తాను కాటికాపరికి దాసుడైనాడు. బలిచక్రవర్తి "తిరుగన్నేరదు నాదుజిహ్వ " అని వామనునికి అడిగిన మూడడుగుల దానమిచ్చి తన నాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. కడకు రసాతలానికి త్రొక్కివేయబడ్డాడు. ఇలాంటి పౌరాణిక పాత్రల్లో తప్ప మరెక్కడా మాటపై నిలబడే మనుషులు కానరారు. ఉంటే యేనూటికో కోటీకో ఒకరుండవచ్చు నంతే.

 

కానీ లోకంలో ఒక నానుడి వుంది. అది "త్రాగుబోతు మాటమీద నిలబడతాడు" అని. సరే చూద్దాం! ఇదెంతవరకు నిజమోనని ప్రకృతిమాత అనుకొంది. ఇంతలోనే ఒక కట్టెలుకొట్టుక జీవించే సోమరి దానయ్య ఒక కుంటవద్ద నిలబడి గొడ్డలి నేలపై బెట్టి, "ఈ కుంటలోని నీళ్ళన్నీ కల్లుగా మారిపోయి గట్టునున్న గుండ్రాళ్ళు మాంసపుముద్దలైతే యెంత బాగుణ్ణు, కల్లు లెస్సగా త్రాగి, మాంసం కాల్చుకొనితిని, సంతృప్తిగా తేన్చి, మరుక్షణం యీ చెట్టుకు ఉరివేసుకొని చచ్చి పోతాను. మాటంటే మాటే..ఆ" అని శపథం చేశాడు. ప్రకృతిమాత చూద్దాం యీ త్రాగుబోతు దానయ్య శపథమని వాడు కోరుకొన్నట్లే కుంటలోని నీళ్ళు కల్లుగాను, గుండ్రాళ్ళు మాంసంగాను మార్చేసింది. "ఆహా యేమి నా వాక్శుద్ధి!" అని తననుతానే అభినందించుకొని, తనవీపును తానే తట్టూకొని, భళిరా దానయ్య!" అనుకుంటూ, బాగాత్రాగి తిని చెట్టుక్రింద నిద్రపోయాడు. ప్రకృతిమాత "త్రాగి, తిని చస్తానన్నాడే! చచ్చేపని వదలి నిద్రపోయాడే!" అనుకొని "చూద్దాం, నిద్రలేచి చస్తాడేమో" అనుకొనింది. వాడు సాయంత్రం తాపీగా నిద్రలేచి, పైపంచె విదిల్చి భుజానవేసుకొని, గొడ్డలి చేతబట్టుకొని, సరాసరి యింటికి దారితీశాడు. ఇక వుండబట్టలేక ప్రకృతిమాత దానయ్యదారి కడ్డునిలచి "యేం దానయ్య! చస్తానన్నావుకదా! మరచిపోయావా?" అన్నది. అప్పుడు దానయ్య నవ్వి " ఓహో! యిది నీ మహాత్మ్యమా తల్లీ! యెంత వెర్రిదానవమ్మా? నమ్మక నమ్మక యీ త్రాగుబోతుమాటలే నిమ్మినావా? అని తనదారినతాను వెళ్ళిపోయాడు. ప్రకృతిమాత నిశ్చేష్ఠురాలై నిలిచిపోయింది.

 

త్రాగుబోతూ అందునా సోమరి యీ దారినబోయే దానయ్య. ఇటువంటివారు భూమి కేభారం. ఎవరినైనా బాగుపరచవచ్చునుగానీ సోమరిపోతును బాగుపరచడం బ్రహ్మతరంకూడాకాదు. అది నాటికినేటికీ కూడా అక్షరసత్యం. ఇంకొందరు త్రాగుబోతులున్నారు. వారు త్రాగందే రంగస్థలం మీద పాడలేమంటారు. మరికొందరు త్రాగందే యేపని చేయలేమంటారు. అట్టివారు త్రాగుడువల్ల బలహీనపడినవారని గుర్తించాలి. అదిఒక సాకుగాతీసుకొని త్రాగుడు కొనసాగించరాదు. త్రాగుడు వ్యసనంనుండి బయటపడడానికి యత్నించాలి. వారినివారు బాగుపరచుకోవాలి.

 

 

v   

 

భగవంతుని ఇచ్ఛానుసారమే జగమంతా నడుస్తున్నది. అయనే అన్నింటికి కర్త, కాని అదంతా మన‍ఇచ్ఛ, మనశక్తి, మనకృషి ఫలితంగా జరుగుతున్నదనుకోవడమే వచ్చినచిక్కు. ఈకారణంచేతనే మనం విజయాలకు ఉప్పొంగిపోవడం, అపజయాలకు కృంగిపోవడం జరుగుతున్నది. ఇదే మనల్ని బంధమునకు గురిచేస్తున్నది.

 

                                        ..........  మహాత్మా శ్రీరామచంద్ర. షాజహాన్‍పూర్ 

 

 

4.అపాయానికో ఉపాయం

 

పూరం ఒక మూర్ఖుడైన రాజుండేవాడు. అదృష్టంకొద్ది ఆరాజు కొలువులో ఒక తెలివైన మంత్రి వుండేవాడు. రాజు తన మూర్ఖత్వంతో చిక్కులు కల్పించేవాడు. మంత్రి ఆచిక్కులనుండి తప్పించేవాడు. ఈరాజ్యం రాజధాని నానుకొని ఒకనది ప్రవహిస్తూవుంది. అది తూర్పుదిశగా ప్రవహిస్తూవుంది. రాజుకు కోడిపందాలాడే వ్యసనముండేది. ఆయన తమకు తూర్పునుండే రాజుగారితో కోడిపందెమాడి ఓడిపోయాడు. ఓటమి కోపంతెప్పించింది. కోపంతో చిర్రుబుర్రులాడాడు. ఆకోపంలో అతనికి ఒక తెలివితక్కువ ఆలోచనవచ్చింది. వెంటనే మంత్రినిపిలిచి మననదిలోనినీళ్ళు క్రిందికి పారడానికి వీల్లేదు. నదికి అడ్డం కట్టకట్టేయండి. నన్ను కోడిపందెంలో ఓడించి మీసంమెలివేస్తాడా ఆరాజు. వాడు వానిప్రజలు నీళ్ళులేక చావాలి. రేపేపని ప్రారంభించండి, అన్నాడు. రాజా! కాస్తా ఆలోచించండి, తొందరపడకండి, అన్నాడు మంత్రి. రెండోఆలోచనే లేదు. వెళ్ళి నాఆజ్ఞను అమలుపరచండి! అని గద్దించాడు రాజు. ఇకనేముంది నదికి అడ్డం కట్టకట్టేశారు. దాంతో నీళ్ళు వెనక్కుదన్ని లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంప్రారంభించింది. ప్రజలు ఇబ్బందిపడసాగారు. మొండిరాజు ప్రజలమొర పెడచెవినబెట్టాడు.

 

ఇక మంత్రి ఆలోచనలో పడిపోయాడు. మూర్ఖుడైన రాజుకు యేదోఒక ఉపాయంతో కనువిప్పు కలిగించాలనుకున్నాడు. మంత్రికో మంచి ఉపాయం తట్టింది. వెంటనే అంతఃపురంలో గంటలు కొట్టేవాడిని పిలిపించి, గంటన్నా! నీవు యీరోజు సాయంత్రం ఆరుగంటలకు ఆరుగంటలూ మామూలుగానేకొట్టు. తర్వాత అరగంటకే యేడుగంటలుకొట్టు. ఇలా ప్రతి అరగంటకు యెనికిది, తొమ్మిది, పది యీ ప్రకారం కొడుతూపో, నీవేమి ఆలోచించకుండా నేనుచెప్పినట్లు రేపు తెల్లారేవరకు చెయ్యి అన్నాడు. అలాగేనని గంటన్న గంటలు కొట్టసాగాడు. అర్థరాత్రి పన్న్రెండున్నరకు యేడు గంటలు మ్రోగాయి. రాజు నిద్రలేచి తెల్లవారి యేడైనా వెలుతురేలేదే? ఎందువల్ల? అని ఆలోచించి ఆలోచించి, మంత్రిని పిలిపించాడు. మంత్రి వచ్చిరాగానే, ఏమిటీ చిత్రం. ఇంకా తెల్లవారలేదెందుకూ? ఏడు దాటిపోతున్నదిగదా? అని ప్రశ్నించాడు. మంత్రి లోలోపల నవ్వుకొని యేమాత్రం తడబాటు లేకుండా రాజా! యీ విషయమై నేనూ ఇప్పుడే  విచారించి కనుగొన్నాను, అదేమిటంటే....అని అంటుండగానే అదేమిటో వెంటనే చెప్పవయ్యా, అనిగద్దించాడు రాజు. రాజా! మనం క్రిందికి నది నీళ్ళు వదలలేదు. ఆ తూర్పుదిశ నుండే రాజు కోపగించుకొని సూర్యుణ్ణి మనదేశంపైకి రాకుండా పట్టేశాడు. అందుకే మనకు సూర్యోదయం కాలేదన్నాడు మంత్రి. గొప్పచిక్కే వచ్చిందే? మనం చీకట్లో యెలాగయ్యా వుండేది? ఇప్పుడేంచేద్దాం అన్నాడు మూర్ఖపురాజు. ఏంలేదు మహారాజా! మనం నీళ్ళు వదిలేస్తే వాళ్ళు సూర్యుణ్ణి వదిలేస్తారు అన్నాడు మంత్రి. రెండుసార్లు అటూఇటూ తిరిగి జుట్టు పీక్కుంటూ, యేంచేద్దాం? వదిలేయండి నీళ్ళు అన్నాడు రాజు. మంత్రివెళ్ళి కట్ట తెగ్గొట్టించి నీరు క్రిందికి పారేట్లుచేశాడు. ఇంతలో నిజంగానే తెల్లవారింది. సూర్యుడుదయించాడు. మంత్రి తెలివితో ప్రజలు కష్టాలనుంచి గట్టెక్కారు. మూర్ఖులతో వాదించి ప్రయోజనంలేదు. వారితో పనిని ఉపాయంతోనే చేయించుకోవాలి.

v      

              

5.పాలకుపాలు నీళ్ళకునీళ్ళు

కోటయ్య తన పాలవ్యాపారాన్ని లాభసాటిగా మలచుకొన్నాడు. సగంపాలూ సగంనీళ్ళు కలిపి సంపాదించటం అలవాటు చేసుకున్నాడు. బాగ సంపాదించి, ఇంకో రెండు ఆవులుకొని సంపాదన రెండింతలు చేసుకోవాలనుకున్నాడు. డబ్బులు సంచిలో మూటగట్టిపెట్టుకొని, ఆవులు కొనడంకోసం సంతకు బయలుదేరాడు. డబ్బుతోపాటే దారిలో తినడానికి అన్నంమూటకూడా వెంట తెచ్చుకున్నాడు. దారిలో ఒకయేటిగట్టున చెట్టుకొమ్మకు డబ్బుసంచి తగిలించి కాళ్ళుమొగంకడుక్కొని, అన్నంమూటవిప్పి హాయిగా భోంచేశాడు. ఏట్లో దిగి చేయికడుక్కొని, నీళ్ళుత్రాగి గట్టుకు వచ్చాడు. డబ్బుమూటవైపు చూశాడు. అది కనిపించలేదు. అటూయిటూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. పైకిచూశాడు. చెట్టుపైన ఒక కోతిచేతిలో డబ్బుసంచి కనిపించింది. సంతోషించాడు. కోతిని అదిలించాడు. అది మరింతపైకెక్కి కూర్చొంది. ఏంచేయాలబ్బా! అని ఆలోచిస్తుండగా ఆకోతి మూటవిప్పి అందులో రూపాయలుచూసి, తినేవస్తువులు కానందువల్ల చీకాకుపడి, ఆ రూపాయలను ఒకటిగట్టుపైనా ఒకటినీళ్ళాలో వేస్తూ ఆనందపడసాగింది. కోటయ్య యెంత ప్రయత్నించినా ఆకోతి కోతిచేష్టలు మానలేదు. ఒకటిగట్టునా ఒకటినీళ్ళలో వేస్తూ, కొమ్మనుండి కొమ్మకు గెంతుతూనేవుంది. దానిచేతిలోని రూపాయలు అయిపోయాయి. కోటయ్య గట్టునపడిన రూపాయలు యేరుకున్నాడు. లెక్కచూసుకుంటే, తెచ్చినడబ్బులో సగం మాత్రమే దొరికింది. ఏట్లోదిగి మిగిలినడబ్బుకోసం వెదుకుదామనుకున్నాడు. దిగి కొంతలోతుకు పోయి చూశాడు. ఒరవడి యెక్కువగావుంది. లోతూ చాలావున్నట్లు గ్రహించాడు. ముందుకుపోతే యేట్లో కొట్టుకపోతాననే భయంతో, గట్టుకుచేరుకొని చాలాబాధపడ్డాడు. అన్యాయంగా డబ్బులు పోయాయని రోదించాడు. ఇక చేసేదిలేక సంతలో రెండావులకు బదులు ఒకఆవు కొందామని బయలుదేరాడు. ఇక్కడ అన్యాయంగా డబ్బులుపోలేదు. పాలడబ్బు మిగిలింది నీళ్ళడబ్బు నీళ్ళలోనేపోయింది. కోటయ్యకు అర్థమయిందోలేదో కానీ, మనకుమాత్రం అన్యాయంగా సంపాదించినడబ్బు నిలవదనిన్నీ, అది బాధపెట్టిపోతుందనిన్నీ అర్థమయింది. హిందీలో ఒకసామెతుంది, అది "దూద్‍కా దూద్ పానీకపానీ" అనే ఆసామెత యిటువంటి కథవల్లే వచ్చి వుంటుంది. 

v     

 

   తినుటకొఱకు జీవించువాడు బద్ధుడు. జీవించుటకొఱకు తినువాడు ముక్తుడు.

 

                                                                                        .....సద్గురు మళయాళస్వామి

 

6.కృష్ణుడు – భీష్ముడు

 

కృష్ణుడు, భీష్మపితామహుడు మనకు భారతభాగవతాల్లో మహనీయులుగా కనిపిస్తారు. ఇద్దరూ ద్వాపరయుగంలో ఒకేకాలంలో జీవించారు. అందులోనూ భీష్ముడు వయస్సులో పెద్దవాడు, రాజనీతిజ్ఞుడు, తిరుగులేని యుద్దవీరుడు, బ్రహ్మచారి, భీషణప్రతిజ్ఞచేసి, జీవితాంతం దానికి కట్టుబడి కఠోరజీవితం గడిపినవాడు, జ్ఞాని, జీవితచరమాంకంలో ధర్మరాజుకు అనేక ధర్మసూక్ష్మము లెరింగించినవాడు. చూడటానికి కృష్ణునికన్న తక్కువవాడు కాదనిపిస్తుంది. అయినా కృష్ణుని మనం భగవంతునిగా, అవతార పురుషునిగా గుర్తిస్తాం. భీష్ముని అలా యెప్పటికీ భావించలేము. కారణ మేమిటి? గ్రంథాలలో యెలావ్రాశారో అలానే గ్రహిస్తున్నాం, అనుకుంటే సరిపోతుందా? లేక పురాణాలాలలో అలా వ్రాయడానికికూడా సమంజసమైన కారణం వుండాలికదా! అంటారా? అయితే ఆకారణాలేమిటో పరిశీలిద్దాం.

 

శ్రీకృష్ణుడు పుట్టినప్పటినుండి అనేక మహత్తులు చూపించాడు. అవన్నీ కృష్ణలీలలుగా వర్ణింపబడ్డాయి. అయినా అయన దేవుడని ఆకాలంలో కొందరే నమ్మారు. కానీ చాలమంది అయన తప్పులనే యెత్తిచూపారు. దొంగ, కొంటెవాడు, టక్కరి, మాటనిలకడలేనివాడు, స్త్రీలోలుడు అని నిందించారు. ఆయన చర్యలన్నీ భక్తపరిపాలన, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మపరిరక్షణ లక్ష్యముగా సాగినవని గుర్తించినవారు దేవుడని నమ్మారు. భీష్ముని విషయం వేరు. అయన పరమనిష్టాగరిష్టుడేకానీ, దేవుడుకాదు.

 

భీష్ముడు కర్మానుగతమైన ఫలితమనిభవించడానికి భూమిపై పుట్టిన ప్రభాసుడనే వసువు. ఒకనాడు అష్టవసువులు తమతమభార్యలతో బ్రహ్మర్షివసిష్ఠుని ఆశ్రమసందర్శనానికి వెళ్ళారు. అక్కడ కోరినవెల్ల ప్రసాదించగల హోమధేనువున్నది. ప్రభాసునిభార్య ఆధేనువును భూలోకవాసియైన తన స్నేహితురాలికి బాగుండునని తెలిపి, వసువులనంగీకరింపజేసి, తనభర్త ప్రభాసుని సహాయమున గోవును భూలోకమునకు తరలించెను. విషయము తెలిసిన వసిష్ఠుడు వసువులను మానవులుగా జన్మించుడని శపించెను. అందులో ప్రభాసుడే మఖ్యకారకుడని గ్రహించి, అతనినిమాత్రము పూర్తిజీవితము నరుడై గోచోరత్వపాపఫలము ననుభవించునట్లునూ, మిగిలిన యేడుగురు పుట్టినవెంటనే మరణించి తిరిగి వసువులుకాగలుగుదురని వరమిచ్చి అనుగ్రహించెను. ఈ వసువులే గంగాశంతనులకు పుట్టిరి. మొదటియేడుగురిని గంగ నదిపాలుగావించి, విగత జీవులజేసెను. వారు తిరిగి వసువులైరి. ప్రభాసుడుమాత్రము దేవవ్రతుడై (భీష్ముడై) చిరకాలము జీవించి, గోతస్కరపాపఫలము ననుభవించెను. కనుక భీష్ముడు మనవమాత్రుడయ్యును నడవడివల్ల కఠోరనియమనిష్టాపాలనమువల్ల గొప్పవాడయ్యెను.

 

శ్రీకృష్ణుడట్లుకాదు. ఆయన కర్మఫలములనుభవించుటకు వచ్చినవాడు కాదు. ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు, శిష్టరక్ష్ణకు అవతరించిన మహావిష్ణువు. వక్రమార్గముపట్టి చరించు రాజులను మహాభారతయుద్ధనెపమున దండించవచ్చిన అవతారపురుషుడు. రాజలోకము హద్దుమీరి ప్రవర్తించుచున్నది. కులకాంతను సభకుయీడ్చి వలువలువిప్ప యత్నించు నంతవరకు వెళ్ళినది. వారు సరిదిద్దుకొనుటకు ఇచ్చిన అవకాశములన్నింటిని దుర్వినియోగపరచుకొనిరి. కనుక వారు దండనార్హులు. వారిని దండించుటకే వచ్చిన దైవావతారము కృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుని కృత్యములన్నియు అవతారకార్యమైన ధర్మసంరక్షణ లక్ష్యముగా సాగినవేగానీ, అందులకై యెంచుకొన్న మార్గమేదన్నది ఆయనకు ముఖ్యముకాదు. కార్యము సానుకూలముకావడమే ఆయనకు ముఖ్యం. అందుకే ఆయుధము పట్టనని మాటయిచ్చికూడా, భీష్ముని ప్రతాపాగ్నికి తాళలేని అర్జునుని విజయంకోసం చక్రంధరించి భీష్మునిమీది కురికాడు. ద్రోణునివధ నిమిత్తం ధర్మరాజుచేత ద్రోణపుత్రుడైన అశ్వద్ధామ మరణవార్త అబద్ధమని తెలిసికూడా చెప్పించి ద్రోణునిప్రాణాలు తీయించాడు. రథం భూమిలోక్రుంగిపోగా  దాన్ని బయటకుతీసుకొనే యత్నంలో వుండగా చంపమని అర్జునుని ప్రోత్సహించి కర్ణుని చంపించాడు. ఇటువంటి అనేకకార్యాలు తగనివని అనిపించినా కృష్ణుడు చేశాడు. అవన్నీ ధర్మరాజును రాజునుచేసి భూమిపై ధర్మాన్ని నిలపడానికి, ధర్మమార్గాన్ని వీడిన, అధర్మంవైపు నిలబడిన వారిని శిక్షిండానికి చేశాడు. అందుకు అవసరమైన మార్గాలన్నీ అనుసరించాడు. తన అవతార కార్యమైన ధర్మసంరక్షణ గావించాడు. ఎటుదిరిగి ధర్మం రక్షీంపబడాలన్నదే కృష్ణుని విధానం.

 

దేవవ్రతుని (భీష్ముని) కథవేరు. తనతండ్రి ద్వితీయవివాహం నిమిత్తం భీష్మప్రతిజ్ఞచేసి భీష్ముడైనాడు.పినతల్లికొడుకులకోసం రాజ్యాధికారాన్ని వదలుకొన్నాడు. పినతల్లి కొడుకులతో పోటీపడువారుండరాదని తనకు పిల్లలుకలిగే అవకాశమే లేకుండా వివాహం మానుకున్నాడు. ఆజన్మబ్రహ్మచర్యం పాటించాడు. సింహాసనమధిష్టించిన పినతల్లిసంతానాన్ని, వారిసంతానాన్నికూడా యేఆపదాకలుగకుండా రక్షిస్తానని మాటయిచ్చి నిలబెట్టుకున్నాడు. త్యాగపురుషుడై నిలిచాడు. ఒకదశలో తనపినతల్లి కొడుకులిద్దరూ మరణించారు. ఒకడు యుద్ధంలో మరొకడు రోగంతో చనిపోయారు. ఆదశలో తనుగానీ, తనకొడుకులుగానీ పినతల్లికొదుకులకు అడ్డుకాదుగదా! అసలువారు బ్రతికిలేరుగదా! అయినా వివాహంచేసుకోలేదు. ఈ పరిస్తితులలో నీప్రతిజ్ఞ అర్థంలేనిదని యెందరు వివరించినా వినలేదు. మాటంటే మాటేనన్నారు. కులస్త్రీలకు సంతానం కలగడానికి యితరన్యాయాల నవలంభింపజేశారు గానీ, తానుమాత్రం మాటతప్పలేదు. అందువల్ల యెన్నో అనర్థాలు జరిగాయి. అయినా తనపట్టు సడలించుకోలేదు. ఇచ్చిన మాటకోసం అధర్మపరులైన కౌరవుల తరపున యుద్ధం చేశారు. ఫలిత మనుభవించారు. ఆఖరుకు భీష్మప్రతిజ్ఞ మొండితనానికి ప్రతీకగా నిలిచిందేగాని ధర్మంకోసం ఉపయోగ పడకుండా పొయింది. తనకుమాత్రం నిష్టాగరిష్ఠుడన్నపేరు తెచ్చింది. అధర్మంవైపు నిలిచి శిక్షార్హుడు కూడా అయ్యాడు భీష్ముడు.

 

శ్రీకృష్ణుడు ధర్మంకోసం యేపనైనా చేశాడు. భీష్ముడు తనమాట నిలుపుకోవడంకోసమే పాటుబడ్డాడు. ఏకార్యమైనా ధర్మరక్షణకుపయోగపడాలిగానీ తనఘనత చాటుకోవ డానికికాదు. కృష్ణుడు తనను నిందిస్తారన్న విషయాన్ని కూడా లెక్కచేయక ధర్మరక్షణకు పాటుబడ్డాడు. కార్యనిర్వహణచేసి లక్ష్యాన్ని సాధించారు. ధర్మసంస్థాపనజేశారు. అందుకే అయన దేవుడు.

 

ఏపనైనా ధర్మరక్షణ కొఱకై వుండాలి. ధర్మహాని కలిగించే యేపనైనా ఆచరణీయము కాదు. ఈ సత్యాన్ని శ్రీకృష్ణుడు, భీష్ముని జీవితాలద్వారా మనపురాణాలు తెలియజేస్తున్నాయి. "ధర్మోరక్షతి రక్షితః" ఎట్టిపరిస్థితులలోను ధర్మాన్ని నీవు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది.

 

v  

మానసికస్థితిని చక్కబరచి కుదుటపరచుటయందే మహదానందముయొక్క రహస్యము దాగియున్నది.

                                      ... మహాత్మా రామచంద్ర (లాలాజి) –ఫతేఘడ్

      

 

7.ధర్మరాజు – అర్జునుడు

 

ధర్మరాజు, అర్జునుడు కుంతీదేవి కుమారులు. వీరిలో పెద్దవాడు ధర్మరాజు (యుధిష్టరుడు). శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజుచేత రాజ్యపాలన చేయించాలనుకున్నాడు. కారణం అతడు ధర్మానికే ప్రతీక. శాస్త్రం అతనికి శిరోధార్యం. శాస్త్రసమ్మతమైన పనులు రాజు చేయలి. అప్పుడే ప్రజలు అంగీకరిస్తారు. రాజు జవాబుదారిగా వున్నాడని భావిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు రాజ్యపాలనకు ధర్మరాజే తగినవాడని నిర్ణయించుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అతనికి విజయం ప్రాప్తించేట్లు చేశాడు. అర్జునుని విషయం అట్లుకాదు. అతనికి కృష్ణుడే సర్వస్వం ధర్మాధర్మవిచక్షణ సహితం భగవానునికే అర్పించిన ధీశాలి. అందుకే అతనికి భగవానుడు గీత బోధించాడు. మోహవిచ్ఛేదం గావించాడు. ధర్మరాజుకు మాత్రం శ్రీకృష్ణుని మాటచాలదు. అతనికి శాస్త్రంలోని వాక్యముల సాక్ష్యం చూపించాలి. అప్పుడుగాని అతని ఆత్మశాంతించదు.

 

కురుక్షేత్రయుద్ధం సమాప్తమయింది. ధర్మరాజు యిక రాజుకావలసియున్నది. విజయుడైన ధర్మరాజును మునులూ, తమ్ములూ, ప్రజలూ అందరూ అభినందించారు. కానీ ధర్మరాజు సంతోషించలేదు. సరికదా మీదుమిక్కిలి దుఃఖించాడు. అందుకు కారణం వివరిస్తూ-

 

సీ: కృష్ణుండు మామీద గృపజేయుటయు బ్రాహ్మ

         ణానుగ్రహంబున ననిలపుత్ర

    పార్థుల పటుబహుబలమున మేదిని

         యంతయు జేకురునట్టిదయ్యె

    నైనను నతిఘోరమగు నఖిలజ్ఞాతి

         వధమొనరించుట వలన నధిక

    గుణుని సౌభద్రుని గులవిభూషణము బాం

         చాలతనూజపంచకము గోలు

 

తే: పోకజేసియు గెల్పుగ మదీయ

    బుద్ధి కైకొన దయ్యెడు సిద్ధముఖ్య

    యదియుగాక వేరొక్కండు మదిగలంచు

    చున్నయది దానినేర్పడ విన్నవింతు.--శాంతి-1-6.

 

నంటూ కర్ణుని చంపమంటూ తాను అర్జునుని రెచ్చగొట్టి పంపించిన విషయం తలచుకొని, కర్ణుడు తన‍అన్న అనితెలిసి బాధపడ్డాడు. అన్నింటికీ తానే కారణమని వాపోయాడు. ఏదో కృష్ణుడు మాపై దయచూపడంవల్ల నాతమ్ములు భీమార్జునుల బాహుబలంవల్ల బ్రాహ్మణుల దీవెనలవల్ల యుద్ధంగెలిచాను. కానీ ఘోరమైన బంధువధచేసి తప్పుచేశాను. అందుకు ప్రతిగా గుణవంతుడైన అభిమన్యుకుమారునీ, కులభూషణులైన ద్రౌపదిపుత్రులనూ యుద్ధంలో కోల్పోయాను. ఇదినాకు నిజమైన గెలుపుగా, అనిపించడంలేదు. అని వ్యధజెందాడు. పెద్దలందరూ అతనిఆలోచన సరికాదనీ జ్ఞానబోధ చేశారు. దుర్యోధన కర్ణాదులు వారి దుష్కార్యములకు శిక్షగా యుద్ధంలో చచ్చారు. అంతేగానీ నీవు ప్రత్యేకంగా చేసిందేమీలేదు, విచారింపకుమని యెంతచెప్పినా, ఆయన మనసు కుదుటపడలేదు. పాపకార్యంతో పొందిన యీరాజ్యం భీమునకిచ్చి, పాపపరిహారర్థం అడవులకెళ్ళి ప్రశాంతంగా మునులసన్నిధిలో గడుపుతానని, అదేతనకు తగిన ప్రాయశ్చిత్తమని తలచాడు.

 

సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి రాజా! శరీరంలో వాతపిత్తశ్లేష్మాదులు సమతదప్పితే వ్యాధి సంప్రాప్తిస్తుంది. మనస్సులో సత్వరజస్తమోగుణాలు సమత్వం కోల్పోతే మానసికరోగియై క్షోభిస్తాడు. అట్టి క్షోభకు నీవు గురికావద్దు. నీవు జయించింది బాహ్యశత్రువులను మాత్రమే. అది యుద్ధమేకాదు. ద్రౌపదిపరాభవము, నీవనవాసక్లేశము, కర్ణదుర్యోధనాధుల వధ, భిష్మద్రోణుల యుద్ధతంత్రములు వాటివల్ల గలిగిన మేలు కీడు, యిదంతా మనసునుండి తుడిచేయ్. ఎందుకంటే అదంతా మిథ్య. అంతఃశత్రువులపై విజయమే అసలైన విజయం. ఆయుద్ధంలో ఆత్మేతోడు. మనస్సును నిర్మలీకరించుకోవడమే పోరాటం.

 

తే: అంతరంబగు నిక్కయ్య మధిప! గెలువ

    కిట్ల యేగతి బోయెదో యెరుగ, దీని

    నీవ కనుగొని సద్బుద్ధి నిశ్చయ ప్ర

    వీణుడవు గమ్ము. మాటలు వేయునేల.    -అశ్వ-1-120

 

అంతరంగంలో జరిగే యీయుద్ధం గెలువకుండా మీరు అకారణక్షోభకు గురౌతున్నారు. మీరే యెలాగైనా యిందుండి బయటపడాలి. వివేకంగలిగి ప్రవర్తించండి. సద్బుద్ధితో సరైననిర్ణయం గైకొని తరించండి. ఎంతజెప్పినా యింతే! మీరు గ్రహించడమే ముఖ్యం. అని వివరించాడు. ఇంకా చెబుతూ రాజా! "మమ" "నమమ" అని రెండున్నాయి. "మమ" అంటే నాది,నేను అనేభావం. నేనుచేశాను, నావల్లజరిగింది అనేమాట మృత్యువుతో సమానం. "నమమ" అంటే నాదేమీలేదు, నావల్లనయిందేమీలేదు అనే భావనే బ్రహ్మం. ఈ రెండింటికీ మనయెఱుకకు రాకుండానే పోరాటం సాగుతూ వుంటుంది. కనుక నీవు "నమమ" భావాన్ని గైకొని తరించు. అని హితబోధచేశాడు. కానీ ధర్మరాజు శ్రీకృష్ణునిబోధను సంపూర్ణంగా గ్రహించలేకపోయాడు. వ్యాసాదిమునులూ శ్రీకృష్ణపరమాత్మ అతని స్థితిని గ్రహించి, శాస్త్రసమ్మతమైనది, పాపనాశిని యగు అశ్వమేధయాగం చేయమన్నారు. ఇది శాస్త్రంలో లిఖింపబడి యున్నది గనుక ధర్మరాజు నమ్మి, అశ్వమేధంచేసి, తదనంతరం రాజ్యాన్ని వ్యాసభగవానునికి దానంచేసేశాడు. వ్యాసుడుకూడా సమ్మతించి, దానం స్వీకరించి తదుపరి ఆ రాజ్యాన్ని నాప్రతినిధిగా ధర్మరాజునే పాలించమన్నాడు. ఈవిధంగా కృష్ణుడు, మునులు ధర్మరాజుచేత పరిపాలనసాగేట్లు చేశారు. అందుకు యెన్నో ఉపాయలు పన్ని శ్రమపడ్డారు.

 

ధర్మరాజుది యుద్ధానంతర శోకం. దానినుండి ఆయన్ను విముక్తున్ని చేయటానికి వ్యయప్రయాసలతోగూడిన అశ్వమేధయాగం చేయించాల్సివచ్చింది. అర్జునుని విషయం వేరు. ఇతనిది యుద్ధానికిముందే కలిగిన విషాదం. ఆ విషాదం కృష్ణుడు గీతాబోధతో అప్పటికప్పుడే నివారించి జ్ఞానసంపన్నునిచేసి యుద్ధకార్యన్ని నిర్వర్తింపజేశాడు. అర్జునుడు-

 

ఉ: తాతల మామలన్ సుతుల దండ్రుల దమ్ముల నన్నలన్ గురు

   వ్రాతము శిష్టకోటి సఖివర్గము దుచ్ఛజనానురూప దు

   ర్నీతి వధించి యేబడయు నెత్తుటదోగిన రాజ్యభోగముల్

   ప్రీతియొనర్చునే యశము పెల్లొడగూర్చునే పెంపొనర్చునే?  -భీష్మ-1-183

 

ఇంతమంది బంధువులను జంపి, రక్తంతో తడిసిన రాజ్యం సుఖముగానీ, కీర్తిగానీ చేకూర్చదుగదా కృష్ణా! అన్నాడు. అందుకు కృశ్ణుడు –

 

క:  పురుషుడు సెడునను వాడును

    పురుషుడు సెఱచు నని పలుకు పురుషుడును న

    య్యిరువురు నవివేకుల య

    ప్పురుషుడు సెఱుపండు సెడడు భుజవీర్యనిధీ. -భీష్మ-1-198

 

ఇదంతా విధికృతం. ఎవరినిఎవరూ చెఱుపలేరు చంపలేరు. నావల్ల యిది జరుగుతున్నదనుకొనువాడు అవివేకి. అందునా క్షత్రియుడవైన నీకు యుద్ధమే కర్తవ్యము-

 

క: సమరంబు రాజులకును ను

   త్తమకర్మం బది యపావృత స్వర్గ ద్వా

   రము సుమ్ము. లెమ్ము దగ గ

   య్యము సేయుము దీనికేల యనుమానింపన్. -భీష్మ-1-201.

 

క: ఫలముయెడ బ్రహ్మార్పణ

   కలనపరుండగుచు గార్యము నడుపన్

   వలయుం దత్త్వజ్ఞానము

   తలకొనినం గర్మవశము దానై కలుగున్. -భీష్మ-1-202

 

నీకర్తవ్యము నీవు నెరవేర్చడమనేది స్వర్గమునకు సింహద్వారమువంటిది. ఫలితమదేదియైనా బ్రహ్మార్పణగావించి ముందుకుపద. పనులన్నీ కర్మవశత యెలా జరగాలో అలా జరుగుతూపోతాయి. లే! నీ కర్తవ్యమైన యుద్ధంచేయడానికి సన్నద్ధుడవుకా! ఇందులోనీవు సందేహించాల్సింది యేమీ లేదని కర్తవ్యబోధచేసి, తగిన స్థితి, దివ్యచక్షువుల నొసగి విశ్వదర్శనము కలిగించి -

 

తే:  క్రందుకొను సర్వధర్మ వికల్పములను

      నెడల విడిచి దృఢంబుగ నేనొకండ

      శరణముగ నాశ్రయింపుము సకలదురిత

      ములకు దొలగింతు నిన్ను బ్రమోదమలర. -భీష్మ-1-224

 

నీవు చేయబోయే కార్యములోని సర్వధర్మాధర్మాలనూ నాకు వదలి, నన్ను పూర్తిగా శరణుజొచ్చి, నీవు నిమిత్తమాత్రుడవై ముందుకు నడువుము. నీకిక యేపాపమూ అంటదు. అన్నింటినీ సంతోషంగా నేనే తొలగిస్తాను. అన్నాడు భగవానుడు. ఇక అర్జునుడు యీ మాటే మంత్రముగా సర్వం కృష్ణార్పణమని యుద్ధకార్యనిర్వహనకు బూనికొని- 

 

ఉ:  మోహతమంబువాసె దుదిముట్టిన నీదు ప్రపత్తి వీత సం

       దేహుడనైతి గాఢపరిదీప్త మహాకృతిగాంచి బోధ న

       న్నాహనిరామయ స్థిరమనస్థితి బొందితి సర్వలోక ని

       ర్వాహవినోద! నీ విమలవాక్యము చొప్పున నెల్ల జేసెదన్. -భీష్మ-1-228.

 

దేవా! నామోహం నశించింది. నిన్ను శరణుజొచ్చిన నా సందేహాలన్నీ నివృత్తమైనాయి. విశ్వరూపదర్శనంతో నాలో దివ్యమైన ఆధ్యాత్మికస్థితి నెలకొంది. నీ మాటొక్కటేచాలు, తదనుగుణంగా నా కర్తవ్యములన్నీ నెరవేర్చుకుంటూపోతానని, అర్జునుడు యుద్ధంచేసి విజయుడైనాడు.

 

ధర్మరాజుకు శ్రీకృష్ణుడైనా, యితర మునులైనా శాస్త్రంలోని వ్రాతలను చూపించి ఒప్పించాలి. అప్పుడే ఆయన సంతృప్తిపడతాడు, దాన్ని ఆచరిస్తాడు. అందుకే ఆయనచేత శాస్త్రసమ్మతమైన అశ్వమేధయాగం చేయించి ఆయనలోని అనుమానాన్ని పోగొట్టారు. రాజుగా నిలిపారు. అర్జునునికి అవతారపురుషుడైన శ్రీకృష్ణుని మాటే సర్వస్వం. అందుకే ఆయన అతిసులువుగా దైవాన్ని పొందగలిగాడు. శ్రద్ధ (విశ్వాసం) గల భక్తుడు భగవంతునికి శరణాగతుడై సూక్ష్మంలో మోక్షం సాధిస్తాడు. అట్లు కానివానికి మోక్షం ప్రయాసయుక్తమౌతుంది. కర్మకాండకన్నా ఆత్మార్పణమే మిన్న. అందుకే గీతాబోధకు శ్రీకృష్ణుడు ధర్మరాజునుగాక అర్జునుని యెన్నుకున్నాడు. ఎవరినెలా ఉద్దరించాలో భగవంతునికెఱుక.

ఓంతత్సత్.

 

v 

 

 

ఆధ్యాత్మిక మార్గమున పయనించు వారికి, అధ్భుతశక్తులు సిద్ధించుననుటకు సందేహములేదు. కానీ అవివారి ప్రాపంచిక లాభమునకు, సుఖప్రాప్తికి ఉపయోగించుకొని, ఆశయము నెరవేరినట్లు తలంతురు. కాని వాటిని లెక్క చేయక, నేరుగా గమ్యంవైపుకు సాగితే ఆత్మసాక్షాత్కారమునకు అనుకూల మేర్పడి, తద్వార శాశ్వతానందానుభవమును పొందుదురు. 

                                                                       .....శ్రీరామచంద్రాజీ - ఫతేఘడ్

 

 

  

8.బసవేశ్వరుడు

 

మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దిన మహాత్ములకు పుట్టినిల్లీ భరతావని. అట్టివారి యందగ్రగణ్యుడు శ్రీబసవేశ్వరుడు. బసవన్న, బసవడు, విశ్వగురువుగా ప్రసిద్ధికెక్కిన యీ మహనీయుడు క్రీ.శ 1134 వ సంవత్సరం కర్ణాటకలోని బీజాపూర్‍జిల్లా బాగేవాడీ గ్రామం లో బ్రాహ్మణదంపతులకు జన్మించాడు. తండ్రి శిలాదుడు, తల్లి మాదయాంబ. బసవన్న చిన్న

తనంనుండి మానవతావిలువలుగల విప్లవాత్మక ఆలోచనలు గలవాడు. తన యెనిమిదవ యేటనే ఉపనయనసంస్కారమును తిరస్కరించి కృష్ణ, మలప్రభనదీ సంగమ ప్రదేశమున

గల సంగమేశ్వరుని వద్దకుజేరి, పన్న్రెండు సంవత్సరములు శిక్షణ పొందినాడు. గురువును సాక్షాత్తు దైవముగా భావించి సేవించినాడు. కర్మకాండపై విశ్వాస మిసుమం తైనా లేని

వాడుగా మెలగినాడు.

 

కల్యాణీరాజ్యాధినేత కలచురి బిజ్జలమహారాజువద్ద బసవన్న యువకుడుగానుండగనే చిన్న ఉద్యోగిగా చేరినాడు. రాజు యీతని విజ్ఞతకు, తెలివితేటలకు మెచ్చి అనతికాలములోనే భాండాగారాధికారిగాను, తదుపరి మహామంత్రిగానూ నియమించుకున్నాడు. బసవన్న తనమంత్రిపదవిని ప్రజాక్షేమమునకు తనభావజాలవ్యాప్తికి సక్రమముగా ఉపయోగ

పెట్టుకున్నాడు. "అనుభవ మంటప " మనుదానిని స్థాపించి, అందులో జాతి, కుల, మత. లింగ భేదములు లేకుండా సర్వజనుల సాంఘిక న్యాయ ధార్మిక సమస్యలనన్నింటినీ పరిష్కరించినాడు. ఇది నేటి పార్లమెంటుసభలను పోలియుండినదని చెప్పవచ్చును.

 

బసవన్న సూక్ష్మమైన పారమార్థికవిషయములను సులువైన వచనములుగా రచించి, సామాన్యులకు సైతం అందుబాటులో నుండునట్లు చేసినాడు. అంతేగాక అవి ఆచరణయోగ్యములైయుండుట విశేషము. ఆయన 64 లక్షల వచనములు వ్రాసెనని ప్రతీతి. అందులో కొన్ని వేలుమాత్రమే యిప్పుడు లభ్యమగచున్నవి. ఆయన ప్రతిరోజూ లక్షాతొంభైయారువేలమంది భోంచేసిన తర్వాతే ముద్దముట్టేవాడని చెబుతారు. కులమతజాతి భేదములు పాటింపకుండుటేగాక ఒకబ్రాహ్మణకన్యను దళితునకిచ్చి వివాహము జరిపించెను. మతదురభిమానులకిది కంటకముగా మారెను. ఆగ్రహమున వారు బసవేశ్వేరునిపై పగబూనుటేగాక, ఆయన కూర్చిన కొత్తజంటను హతమార్చిరి. బసవడు మనసునొచ్చుకొని తనమంత్రిపదవిని విడిచిపెట్టి, కూడలసంగమేశ్వరముజేరి, నిరాడంబర జీవనము గడుపుచు, అక్కడే తనువుచాలించినాడు. భాగల్కోట్ కూడలసంగమం వద్ద బసవేశ్వరసమాధి వున్నది. అశ్వారూఢుడైయున్న బసవేశ్వరుని విగ్రహం బెంగుళూరులోకూడా ఉన్నది.

 

కొందరు అయనను క్రీ.శ 1168 లో హత్యచేసిరని చెప్పుదురు. కానీ ఆయన క్రీ.శ 1196 వరకు జీవించెనని కొన్నిశాసనములను ఆధారముగా చూపువారునూ వున్నారు. 12 వ, శతాబ్ధిలోనే బసవేశ్వరుడు అత్యంతముందుచూపుగల సంఘసంస్కర్తగా, మానవతనూ, సమతనూ వ్యాపింపజేసినాడు.

 

ఆయన బోధనలలోని అతిముఖ్యాంశములైన కొన్నిటినైనా జ్ఞాపకము చేసికొనుట మనకర్తవ్యమని భావింతును. 

 

బసవేశ్వరుని మతానుసారము శివుడే దైవము. శివుడన, అది కనిపించని దివ్యశక్తి. శివుని విగ్రహరూపమున పూజించుట సరైన పద్ధతికాదు. శివునిపేరగల పురాణములు అసత్యం. వాస్తు జ్యోతిషం నమ్మదగినవికావు. దైవమునకు భక్తులకు మధ్య పూజారులు అనవసరం. మనిషి దీక్షబూని జ్ఞానికావాలి. అంతేకానీ పుట్టినవంశాన్నిబట్టే జ్ఞానికాలేడు. వైద్యునిపుత్రుడు వైద్యుడు కావాలంటే అతడుకూడా వైద్యవిద్య నేర్వాలికదా! ఇదీఅంతేనంటారాయన. యజ్ఞయాగాదికర్మలు, వేదాలూ, స్వర్గం, నరకం మూఢనమ్మకాలు. ఆహారం, ఇల్లు, బట్ట, వైద్యం అందరిహక్కు. శ్రమకు మించిన సౌందర్యంలేదు. భక్తికంటే సత్ప్రవర్తన మిన్న. పరనిందతగదు. ప్రతిఒక్కరి దేహమూ దేవాలయమే. సర్వులూ సమానులే, ఇందు ఆడ మగ భేదంకూడాలేదు. ఇలా సాగిందాయన బోధ.

 

కర్నాటకముఖ్యమంత్రిగా పనిజేసిన నిజలింగప్పగారు, బసవేశ్వరుని బోధలు అంబేద్కర్‍గారికి వివరింపగా, అంబేత్కర్ విని, ఇంతటి మహనీయుడు కర్ణాటకకే పరిమితమైయున్నాడే! అని చింతించారట.

 

 సాక్షాత్తు శివుని వహనమైన నందియే బసవేశ్వరుడుగా అవతరించి వాస్తవతత్త్వమును లోకమునకు తెలిపెనని నమ్మువారెందరో వున్నారు. వీరశైవాచారవిధానంలోని లింగాయతధర్మ సంస్థాపకునిగా బసవేశ్వరుని అంగీకరిస్తారు. హిందూమతావలంబనకు కొంతభిన్నంగా బసవేశ్వరధర్మాలుండుటవలన "కలబర్గి" వంటి పరిశోధకులు, యీ ధర్మాచారులను హిందువులలోని ఒకశాఖగాగాక ప్రత్యేకముగా చూడాలన్నారు. ఈవాదం రానురాను బలం పుంజుకుంటున్నదికూడా.

 

 

v  

 

9.లల్లయోగేశ్వరి

 

లల్లయోగేస్వరి క్రీ.శ 1320-1392 మధ్యకాలంలో, కాశ్మీరదేశంలో జీవించిన శైవసాంప్రదాయ యోగిని. ఈమె లల్లేశ్వరి, లల్లాదేవి, లాల్‍దీదీ, లల్లయోగేశ్వరి, లలిశ్రీ, మదర్‍లల్లా, లాల్‍డెడ్ అనే పేర్లతో గూడా పిలువబడేది. ముస్లింలు లల్లా‍అరీల్రీఫా అని పిలుచుకొనేవారు. శ్రీనగర్‍కు ఆగ్నేయదిశలో నాలుగుమైళ్ళ దూరంలోని పండ్రేన్దన్ గ్రామంలో కాశ్మీరీపండిత కుటుంబంలో యీమె జన్మించింది. 12 వ, యేట యీమెకు వివాహమయింది. అదేరోజున పురోహితునకు తన గతజన్మల విషయాలన్నీ యీమె తెలిపింది. ఇప్పుడు తనను వివాహమాడిన వరుడు పూర్వజన్మలో తనకుమారుడని, ఇప్పటి మామగారే తన పూర్వజన్మలో భర్త, అన్నవిషయంకూడా తెలియజెసింది. పెండ్లి తర్వాత యీమెఅత్తగారు యీమెను అనేకవిధాల బాధించారు. భర్త అమాయకుడు. తల్లిమాటలు విని భార్యను వేధించాడు. అత్త, పళ్ళెరంలో ఒకరాయివుంచి, ఆరాయిపై కొంత‍అన్నంపెట్టి రాయి కానరాకుండాచేసి కోడలికిచ్చేది. లల్ల ఆకొద్దిఅన్నం తిని మళ్ళీ పళ్ళెరంతోపాటు రాతినికూడా కడిగి అత్తకిచ్చేది. ఇంట్లోవాళ్ళు మాత్రం అత్త కోడలికి కడుపునిండా అన్నం పెడుతుం దనుకునేవారు. లల్ల అర్థాకలితో కాలంగడుపుతూవుండేది. ఒకరోజు కడవతో నీళ్ళు తెస్తుండగా లల్లభర్త కట్టెతో కడవ పగులగొట్టాడు. కడవ పగిలిపోయిందిగానీ, లల్లకడవలోని నీళ్ళుమాత్రం నేలపాలు కాలేదు. అట్లే ఆమె తలపై నిలిచివుండడమేగాకుండా, ఆనీళ్ళతో యింట్లోనిపాత్రలన్నీ లల్ల నింపేసింది. మిగిలిననీళ్ళు బయట పారబోసింది. ఆనీళ్ళతో ఒకకుంట యేర్పడింది. దాన్నే తర్వాత లల్లాట్యాంక్ అంటున్నారు. అత్త, యీవింతజూచి విస్తుపోయింది. మామగారు లల్లకష్టాలు జూచి జాలిపడ్డారు, కానీ భార్యనోటి దురుసు తనానికి భయపడి వూరకుండిపోయారు. లల్ల కుటుంబజీవనంతో సర్దుబాటుకాలేక, బయటపడి సన్యసించింది. జీవితం శివార్పణమొనరించింది. తన తలవెండ్రుకలే ఆచ్ఛాదనగా జేసుకొని దిగంబరియై జీవించింది.

 

ఈమెకు తొలిగురువు తండ్రి. పంపూర్‍లోని అత్తగారిల్లు వదలినతర్వత, సిద్ధశ్రీకాంత్ (సెడ్‍బాయు) వద్ద ఆధ్యాత్మికవిద్య నభ్యసించింది. స్వామీ పరమానందతీర్థ వద్దకూడా విద్యనభ్యసించిందని చెబుతారు. అనతికాలంలోనే యీమె గురువునధిగమించిన యోగినిగా గుర్తింపు పొందింది.

 

స్త్రీకి చదువుకునే స్వాతంత్ర్యం కల్పించాలనే ఉదారభావం గలిగిన ఆధ్యత్మికవేత్త యీమె. ఈమెరచించిన ఆధ్యాత్మికకవితలు వాట్సన్ (వాఖ్సా) అన్న నూతనశైలిని సంతరించికొని, కాశ్మీరీసాహిత్యంలో ప్రత్యేకస్థానాన్ని పొందాయి. కాశ్మీర్‍సూఫీల ప్రేరణకూడా యీమె పొందినట్లు యీ కవితలవల్ల తెలుస్తున్నది.

 

యీమె గొప్పతనాన్ని అర్థంచేసుకొని, భర్త యింటికిరమ్మని పిలిచాడట. అప్పుడామె " దేవుని వెలుగువంటి వెలుగు లేదు. ఆయనతో సహవాసంవంటి తిర్థసేవనం మరొకటిలేదు. ప్రభువే బంధువు, ఆయనకు మించిన బంధువు మరొకరుండరు. ఆనందానికి ఆయనకుమించిన మూలం (ఆధారం)మరొకటుండబోదు. కనుక ఆదైవాన్ని అతుక్కొని జీవించు. ఆయనను ప్రేమించు. అదే సర్వదా శ్రేయస్కరం. నీ-నా శారీరకబంధం యింతటితో సమాప్తం". అనిచెప్పి తన పూర్వజీవితాల సంగ్రహావలోకనం కల్పించి, అతన్ని జ్ఞానసంపన్నునిజేసి పంపించిందట.

 

భక్తితన్మయత్వంతో ఆమె వీధులలో పాడుతూపోయేది. ఆమెకవిత్వంలో సామెతలూ, ప్రాంతీయనుడులు ధారపాతంగా దొర్లేవి. " నా నగ్నత్వాన్ని యెందుకు చూస్తారు, నేనైతే యేమగాడిని చూడటంలేదు. ఓదేవా! నువ్వేస్వర్గం, నువ్వేభూమి, నువ్వేపగలు నువ్వేరాత్రి, నువ్వేగాలి. పుట్టిన ప్రతిదానిలోనూ నువ్వున్నావు. నేనూ నాలోనినువ్వూ ఒకటే. మనిద్దరకూ మృత్యువులేదు. అంటూ ఆమె గానంచేసేది. ఇంకా అమెచెబుతూ నేనేదిచేసినా అది దైవకైంకర్యమే ఔతుంది. ప్రభూ! నేనేది పలికినా అది నీప్రార్థనే ఔతుంది. నా యీశరీరం అనుభవించిందంతా శైవతంత్రమేయై పరమశివమార్గాన్ని తేజోమయం చేస్తుంది. ముక్తికోసం పాపం యీసన్యాసులు తీర్థాలుపోతారు. ముక్తి చిత్తసాధ్యంగాని, తీత్థసాధ్యంకాదు. దూరపుకొండలు నునుపు. అప్పుసొప్పులు తీర్చుకోవడం ఒక తీర్చుకోవడంకాదు. తిండి, బట్టల భ్రమ తీర్చుకోవాలి. ఓయోగీ! నీకు జలస్థంభన, అగ్నిస్థంభన యెందుకు? అకాశగమనమెందుకు? కొయ్యావు పాలుపితకడమెందుకు? ఇదంతా బడాయికాదా? అంతాతెలిసి మొద్దులావుండు. అంతావిని చెవిటివికా. అంతాచూచి గ్రుడ్డివవు. ఇదే తత్త్వాభ్యాసం. చిత్తంఅనే అద్దం నిర్మలమైంది. ప్రతిభిజ్ఞకలిగినది. దైవం నాస్వరూపంగానే కనిపించింది. నేనూ హుష్, నువ్వూ హుష్, ఈప్రపంచమూ హుష్". ఇలాసాగేవి ఆమె తత్త్వాలు. తెలిసినవారు పూర్వపు కాశ్మీర్ మార్మిక "త్రిక" మార్గదర్శిగా లల్లేశ్వరిని గుర్తించారు. తెలియనివారు అల్లాటప్పా లల్లాయిపదాలుగా తృణీకరించారు.

 

చిన్మయశరీరిగా తత్త్వవేత్తలు లల్లేశ్వరిని గుర్తించారు. తన 72 వ, యేట శ్రీనగర్‍కు 25 మైళ్ళదూరంలోని బ్రిజ్‍బీహార్‍లో దేహాన్ని కాంతిగామార్చి లల్లేశ్వరి అదృశ్యమైందని భక్తులు విశ్వసిస్తున్నారు.  

//ఓం తత్ సత్//

 

 

10 .చైతన్యమహాప్రభువు

chaitanya mahapraBhu కోసం చిత్ర ఫలితం

సంకీర్తనాచార్యులుగా, రాధాకృష్ణుల ప్రేమతత్త్వం బోధామృతంగామార్చి, భక్తి సాంప్రదాయాన్ని పరాకాష్టకు చేర్చిన మహనీయుడు చైతన్యమహాప్రభువు. పశ్చిమ బెంగాల్ నవద్వీపం (ప్రస్తుత నదియా జిల్లా) ప్రాంతంలోగల శ్రీథామ మాయాపురంలో క్రీ.శ 1486  ఫిబ్రవరి 18 న జన్మించారాయన. తల్లిదండ్రులు శచీదేవి, జగన్నాథమిశ్ర. ఈదంపతులకు ఎనిమిదిమంది సంతానం కలిగి భాల్యంలోనే చని పోయారు. తొమ్మిదవవాడుగా విశ్వరూపుడు జన్మించాడు. ఈతని తర్వాత చైతన్యమహాప్రభువు జన్మించాడు. ఈయన మొదటిపేరు విశ్వంబరుడు. ఈయన ఫల్గుణమాసం పౌర్ణమినాటి సంధ్యాసమయంలో 13 నెలల మాతృగర్భవాసంవీడి చంద్రగ్రహణ సమయంలో జన్మిం చుటచేత మాతామహుడైన నీలాంబరచక్రవర్తి జాతకంచూచి, ఈతడు మహాపురుషు డౌతాడని గ్రహించి, విశ్వంబర నామం సూచించాడు. బాలుడు అందంగానూ తెల్లటి సరీరచ్ఛాయతో వుండటంవల్ల తల్లి "గౌరాంగుడు"అని పిలచుకొనేది. వేపచెట్టు క్రింద జన్మించడంచేత "నిమాయి" అనికూడా పిలుచుకొనేవారు. పువ్వుపుట్టగనే పరిమళం వెదజల్లినట్లు, నిమాయ్ బాలుడైయుండగనే అతనియందు భక్తిసూచనలు కనిపించెను. ఈబాలుడు యేడుస్తూ వుంటే, తల్లి "హరిబోల్" "హరిబోల్" అనగానే యేడుపు మానే సేవాడు. బాలుని సముదాయించే నెపంతో అందరినోటా హరిస్మరణ అలవాటై, ఆయింట్లో హరినామం ప్రతిధ్వనిస్తూ వుండింది.

 

బాలుడు చాలాచురుకైనవాడు. ఐదవయేట పాఠశాలకు పంపారు. అక్కడ బెంగాలీ అతిత్వరగా నేర్చుకున్నాడు. ఎనిమిదవయేట మాయాపురం దగ్గరగల గంగానగరంలో గంగదాసపండితునివద్ద రెండేళ్ళలో సంస్కృతవ్యాకరణంలో దిట్టయయ్యాడు. తర్వాత తండ్రి గొప్పపండితుడు గనుక ఆయన గ్రంథాలను చదువుతూ స్మృతులు, న్యాయతర్క శాస్త్రాలు అధ్యయనంచేసి నిష్ణాతుడయ్యాడు. తన పదవయేట అన్నగారైన విశ్వరూపుడు సన్యసించాడు. తల్లిదండ్రులను ఓదార్చి నేనున్నాను, మిమ్ములసేవించుకుంటానని ధైర్యం చెప్పాడు. ఐనా తండ్రి ఒకసంవత్సరంతర్వాత మరణించాడు. తర్వాత తన 15 వ యేట లక్ష్మిప్రియను వివాహమాడాడు. 16 వ యేట స్వగ్రామంలోనే పాఠశాలతెరచి సంస్కృతం, బెంగాలీ నేర్పాడు. నిమాయి తన 23 వ యేట తండ్రిశ్రాద్ధకర్మల నిమిత్తం గయ వెళ్ళాడు. ఆక్కడి విష్ణు మందిరంలో ధ్యానంచేసుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయాడు. అతని భక్తిపారవశ్యతకు మెచ్చి ఈశ్వరపురి యను సాధువు కృష్ణమంత్రోపదేశం చేశాడు.

 

గయనుండి తిరిగిరాగానే తన పాఠశాలను మూసేశాడు. నిరంతరం కృష్ణధ్యానం, సంకీర్తనలలో మునిగిపోయాడు గౌరాంగుడు. ఒకసారి కార్యర్థం ఊరువిడచివెళ్ళి, తూర్పుబెంగాల్‍నుండి తిరిగివచ్చేసరికి భార్య చనిపోయిందని తెలిసింది. తల్లి బలవంతం తో "విష్ణుప్రియ"ను రెండవవివాహం చేసుకున్నాడు. గౌరాంగునకు సంసారం యెడ విరక్తి రోజురోజుకు మిక్కుటమైంది. తన 25 వ యెట భార్యను, నవద్వీపాన్ని వదలి "కేశవభారతి" యను స్వాములవద్ద సన్యాసం స్వీకరించి, కొంతకాలం జగన్నాథక్షేత్ర మైన పూరీలోనూ, బృందావనంలోనూ నివసించారు. తరచూ ఆయనకు తన్మయత్వస్థితి కలిగేది. ఆయన జీవితంలోని చివరి 12 సంవత్సరాలు సగం సగం సమాధిస్థితి, జాగృత స్థితి అనుభూతి చెందారు. సమాధిలో కృష్ణయోగసుఖం, జాగ్రదావస్థలో కృష్ణవిరహ సుఖం అనుభవించేవారాయన. సన్యసించినతర్వాత ఆయన్ను శ్రీచైతన్యమహాప్రభువని పిలువసాగారు. ఆయన తన 48 వ యేట పూరీలో క్రీ.శ 1534 వ సంవత్సరం జూన్14వ తేదీన జగన్నాథాలయంలో ప్రవేశించి అంతర్థానమయ్యాడని, అంటే పరమాత్మలో ఐక్య మయ్యడని చెబుతారు. కానీ కొందరు ఆయన నదీస్నానం చేయుచుండగా తన్మయత్వ స్థితికి జేరుకొని, జలసమాధి యయ్యాడని అంటున్నారు.

 

శ్రీచైతన్యమహాప్రభు జీవితంలో, చిన్నతనంనుండే అనేక అద్భుతాలు జరిగాయి. అవి గమనించే ఆయన్ను శ్రీకృష్ణుడే మళ్ళీ భక్తునిరూపంలో అవతరించాడని విశ్వసించారు. ఆయన నాలుగేండ్ల బాలుడుగావున్న సమయంలో వారింటికి ఒక అతిథి వచ్చాడు. ఆయన స్వయంపాకం వండుకొని తినడానికిముందు కృష్ణార్పణమని కళ్ళుమూసుకొని ప్రార్థన చేసుకున్నాడు. అంతే ఆభోజనాన్ని యీ చిన్నిగౌరాంగుడు భుజించేశాడు. తదనంతరం ఆ అతిథి మళ్ళీ వండుకొని కృష్ణునికి నివేదించగానే బాలుడు వచ్చి మళ్ళీ తినేశాడు. మూడవ సారి మళ్ళీ వండుకొనేసరికి రాత్రి ప్రొద్దుపోయింది. కృష్ణునకు నివేదించగానే యీసారి ప్రత్యక్షంగా బాలకృష్ణుని రూపంలోనే బాలుడు కనబడి నాకేగదా! నివేదిస్తున్నావ్ అందుకే ఆరగిస్తున్నానని నవ్వుతూపలికి, ఆ అతిథిని అనుగ్రహించి మాయమయ్యాడు. అతిథి ఆనందానికి అవధులులేకుండా పోయాయి. ఇంకొకసారి బాలుడు మట్టితింటూ తల్లికి కనిపించాడు. ఆమె బాబూ మిఠాయిలిస్తే తినకుండా మట్టితినడం తప్పుగదా! అని మందలించింది. దానికాబాలుడు అమ్మా! మిఠాయిలు కూడా మట్టినుండే కదా!వచ్చాయని వాదించాడు. తాను సాక్షాత్తు భగ

వానుడనని తనకు సమస్తమూ సమానమని చెప్పకనే చెప్పాడు. తల్లి బాబూ! నీవు చెప్పినది నిజమేగానీ, అదే మట్టితో కుండలుచేస్తే వాటిలో నీరునింపుకోవచ్చు. కానీ ఇటుకలుచేస్తే నీరునింపడానికి పనికిరావు గదా! ఇటుక ప్రయోజనంవేరు, కనుక నీవు తినాలంటే మిఠాయిగా తయారైన మట్టినే తినాలి, నేరుగా మట్టి తినకూడదని బుద్ధి చెప్పింది. ఒకసారి బాలునిపైనున్న నగలకాశపడి దొంగలు పిల్లవాడికి మిఠాయిలిచ్చి లాలించి యెత్తుకపోయారు. కానీ వారిని వైష్ణవమాయ ఆవహించి వారికితెలియ కుండానేవారు తిరిగి తిరిగి సరిగ్గా బాలుని యింటిదగ్గరికేవచ్చి, ఇదేమిచిత్ర మని వారు తికమకపడి బాలుని వదలి వెళ్ళిపోయారు. ఒకరోజు యింట్లో ప్రసాదానికై వండివాడేసిన కుండపై గౌరాంగుడు కూర్చొన్నాడు. తల్లి ఆకుండలు వండివాడేసినవి, అపవిత్రాలు, వాటిపై కూర్చోవద్దన్నది. బాలుడు అమ్మా! ఈవిశ్వంలో అపవిత్రమైనదేదీలేదు. అన్నిటిలో ఆ పరమాత్మ వున్నాడు సుమా! అన్నాడు. తల్లి బాలుని మాటలకు ఆశ్చర్యపోయింది.

 

బాలుడు ఇంతింతై శాస్త్రాధ్యయనంచేసి అందరూ మెచ్చుకుంటున్న సమయంలో "కేశవ కాశ్మీరీ" అన్న పండితుడు అహంకారపూరితుడై, నన్ను మించినవాడులేడు. వెళ్ళిన ప్రతిచోటా నాదే విజయం. నాకే సన్మానం. మీవూళ్ళో నాతో పోటీపడగల వాళ్ళెవరైనా వున్నారా? అని సవాలు విసిరాడు. గౌరాంగుడు సవాలు స్వీకరించి, గంగా ప్రవాహము పై కవిత్వం చెప్ప మన్నాడు. నీవెంత? బాలుడివి, అని వెంటనే ఆశువుగా గంగావర్ణన చేశాడు పండితుడు. గౌరాంగుడు కవితవిని, అయ్యా మహాకవీ! మీకవిత్వం విన సొంపైనదే కానీ అందులో వ్యాకరణదోషాలు మెండుగా ద్రొల్లినవని ఆక్షేపించి నిరూపణ కూడా చేసినాడు. ఆరాత్రికి బాలుని యెలా యెదుర్కోవాలా? అని ఆలోచిస్తూ పండితుడు నిదురించాడు. కలలో సరస్వతి కనిపించి, బాలుడు సాక్షాత్తూ కృష్ణభగవానుడు, నీవు బేషజానికి పోకుండా ఓటమి నంగీకరించమన్నదట. అతడు మరునాడు సభలో యేవాదనా చేయకుండానే ఓటమినంగీకరించెనట.

 

సన్యసించి శ్రీచైతన్యమహాప్రభువై సామూహిక హరినామసంకీర్తనం చేస్తూ తిరుగుతున్న కాలంలో ఒకసారి యేటిలో బట్టలుతుకుతున్న చాకలిని పలుకరించి, హరిబోల్ అన్నాడట. ఆచాకలి దానంకోసం వచ్చిన సన్యసిగా భావించి, అయ్యా! పేదవాడిని, నాదగ్గర డబ్బులులేవన్నాడట, పరవాలేదు హరిబోల్ అన్నాడట చైతన్యులు. నేనీ బట్టలు వుతుక్కోవాలి నాకు తీరుబడిలేదు, నన్నొదిలేయండి అన్నాడట చాకలి. ఆబట్టలు నేనుతుకుతాను నువ్వు హరిబోల్ అంటూ చాకలిచేతిలోనున్న బట్టలు తీసుకున్నాడట చైతన్యమహాప్రభువు. చాకలి హరిహరి అన్నాడోలేదో వెంటనే తన్మయుడై నృత్యంచేయడం మొదలుబెట్టాడట. చాకలిభార్య భయపడి, తనభర్త హరీహరీ అంటూ పిచ్చిపిచ్చిగా యెగురుతున్నాడంటూ వూరివారిని పిలుచుకొని వచ్చింది. వారిలో ఒకబలవంతుడు, చాకలిని పట్టూకొని ఆపబోయాడు. అతడూ తన్మయుడై హరినామంజపిస్తూ చాకలి తోపాటూ నృత్యం చేయసాగాడు. అతని మాదిరే వచ్చినవారందరూ వారిని ఆపడానికి ప్రయత్నించి, తన్మయులై హరిభజన చేయ సాగారు. ఏటిగట్టు హరిస్మరణతో మారు మ్రోగిపోయింది. ఆదశలో చైతన్యులవారు వారిని శాంతింపజేసి యిళ్ళకు పంపించారట.

 

ఒకసారి జగన్నాథాలయంలో స్వామిని కీర్తిస్తూ కీర్తిస్తూ చైతన్యమహాప్రభువు తన్మయత్వంలో క్రిందపడిపోయాడు. ఆసమయంలో ఒడిస్సా ప్రభువు ప్రతాపరుద్రుని మంత్రి సార్వభౌమ భట్టా చార్య అక్కడేవున్నారు. ఆయన చైతన్యుని సేదదీర్చి పంపించారు. చైతన్యమహాప్రభువును ఆయన తక్కువ‍అంచనా వేశారు. అతనికి హితబోధ చేయదలచి, తొమ్మిది వాక్యాల నుపదేసించారు. దానికి బదులుగా చైతన్యమహాప్రభు అరవైఒక్క వాక్యాలతో వేదాంత విషయ వివరణలిచ్చారు. సార్వభౌమభట్టాచార్య ఆశ్చర్యపోయి చైతన్యమహాప్రభువు మహాత్ముడని గ్రహించాడు.

 

పూరీజగన్నాథాలయ సమీపంలో కూర్మాలయమున్నది. దానిచెంత వాసుదేవుడను మహాభక్తుడు కుష్టువ్యాధితో బాధపడుచుండెను. శరీరమున పుండ్లుపడి, అందులోని పురుగులు క్రిందపడిపోతే, పాపం వాటిఆహారం నాశరీరం , తిననీ యని, వాటిని మళ్ళీ పుండుపై వదిలేవాడు. మహాసాత్వికుడు. చైతన్యమహప్రభువు జగన్నాథాలయానికి వచ్చాడని, దర్శించి తరించాలని త్వరత్వరగా వచ్చాడు. కానీ అప్పటికే అయన వెళ్ళి పోయాడని తెలిసి బిగ్గరగా యేడ్చాడు. తిరుగుప్రయాణంలోనున్న చైతన్యమహాప్రభువు వెంటనే తిరిగివచ్చి వసుదేవుని కౌగలించుకున్నాడు. అద్భుతం, వాసుదేవుని కుష్టురోగం నయమైపోయింది. ప్రభూ! నేను మీదర్శనమభిలషించానేగాని వ్యాధినయంకావాలని కోరలేదని విన్నవించుకున్నాడు. ఇలాంటి సంఘటనలు చైతన్యమహాప్రభువు జీవితంలో చాలాజరిగాయి.

 

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే! హరేరామ హరేరామ రామరామ హరేహరే! అన్న మంత్రమే చైతన్యమహాప్రభు సామూహిక హరినామకీర్తనములో ప్రధాన్యత వహించి యుండెను. ఆయన బాదరాయణ వేదాంతసూత్రములు రచించినారు. ఆయనశిష్యులు గురువుగారి మార్గాన్ననుసరించి బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడమే గాక చైతన్య బోధలకు విశిష్టస్థానమిచ్చి చైతన్యమతంగా తీర్చిదిద్దారు. దీన్నే గౌడీయవైష్ణవమనికూడా పిలుస్తారు. వీరిమతం ప్రత్యేకంగా "అచింత్య భేదాభేదతత్త్వం" బోధిస్తుంది. అంటే కృష్ణతత్త్వం చింతనకు అందనటువంటిది. శ్రీకృష్ణపరమాత్మ శక్తులు అనేకం. అవి వేరువేరుగా వున్నప్పటికీ కృష్ణపరమాత్మయందే యిమిడియున్నవి. అందు వలన పరమాత్మకు శక్తులకు భేదములేదు. అంతటికీ మూలం కృష్ణపరమాత్మయే. చైతన్య మహా ప్రభు శిష్యులైన రూపగోస్వామి "భక్తి రసామృత సింధువు" "ఉజ్వలనీలమణి" యను గ్రంథములు వ్రాసినారు. సనాతన గోస్వామి "వైష్ణవతోపిని" అను గ్రంథాన్నీ, జీవ గోస్వామి "సత్సందర్భం" "భాగవతటీక" "భక్తి సిద్ధాం తాలు" "ఉపదేశామృతం" అను గ్రంథాలు వ్రాశారు. యివన్నీ చైతన్యమహాప్రభు తత్త్వాను సారం వ్రాయబడి, పేరు గడించాయి. చైతన్యమహాప్రభు జ్ఞానమీమాంస మరియూ ధార్మిక బోధనలను "దశమూల బోధనలుగా " పేర్కొని వాటిని శిష్యులు శ్రద్దతో పాటిస్తారు. వాటిలో శ్రీమద్భాగవతం, భగవద్గీత సత్యమార్గదర్శకాలుగా పేర్కొన్నారు. శ్రీకృష్ణుడే ’మహా" "అనంత సత్యమం" అనీ, ఆయనే దివ్యజీవనమునకూ, మరియు భౌతికశక్తులకు మూలమని నిర్ధా రించారు. కృష్ణుడు రససముద్రుడని, సర్వజీవులకు మూలమని తేల్చారు. కొన్నిజీవులు భౌతికశక్తులకు లోబడతాయనీ, మరికొన్ని యితరజీవులు దివ్యశక్తులకు, శక్తులకు, భౌతిక విధానాలకు అతీతంగా వుంటాయని నమ్మారు. శ్రీకృష్ణునిపై పరిపూర్ణభక్తి మాత్రమే ముక్తికి మార్గమనీ, కృష్ణపరమాత్మపై అవ్యాజ్యమైన ప్రేమయే మానవులకు అత్యున్నతలక్ష్యమై యుండాలని వివరించారు. చైతన్యమహా ప్రభువును జనులు రాధపేమలో మునిగియున్న శ్రీకృష్ణుని అవతారమని భావించారు, సేవించారు. ఆయన తను తలపెట్టదలచిన కార్యా చరణననుసరించి ఎనిమిదిశ్లోకాలు జగతికిచ్చారు. వాటిని శిష్టాకమంటారు. వాటినొకసారి చూద్దాం. ఆయన భక్తితత్త్వం, బోధ మనకు సంపూర్ణంగా అర్థమైపోతాయి.   

 

 

     

                                       శిష్టాకం

చేతో-దర్పణ-మార్జనం భవ-మహా--దావాగ్ని-నిర్వాపణమ్

శ్రేయః-కైరవ-చన్ద్రికా-వితరణమ్ విద్యా-వధూ-జీవనమ్                                             ఆనన్దామ్బుధి-వర్ధనం ప్రతి-పదం పుర్ణామృతాస్వాదనమ్

సర్వాత్మ-స్నపనం పరం విజయతే శ్రీ-కృష్ణ-సంకీర్తనమ్....1

 

చిత్తమనే మలినదర్పణాన్ని నిర్మలమొనరించేది, భవరూప భయంకరాగ్నిని చల్లార్చేది, కరుణారసానంద వెన్నెలలు వర్షించేది, శారదాకటాక్ష జ్ఞానప్రదాయిని, పూర్ణామృతానందవచన సాగరమున నోలలాడించి, సర్వాత్మలను పవిత్రముగావించి, పరమాత్మనుజేర్చెడిది ఆ శ్రీకృష్ణసంకీర్తనమే.

 

నామ్నామ్ అకారి బహుధా నిజ-సర్వ-శక్తిః

తత్రార్పితా నియమితః స్మరణేన కాలః

ఎతాదృశీ తవ కృపా భగవన్ మమాపి

దుర్దైవం ఈదృశమ్ ఇహాజని నానురాగః....2

 

ప్రభూ! మీనామాలన్నింటిలో మీ చైతన్యశక్తి సంపూర్ణముగ నింపబడియున్నది. మీ నామసంకీర్తనకు నియమిత సమయమన్నదేదీ లేదు. సర్వకాలసర్వావస్థలలో మిమ్ము స్మరించవచ్చును. ఓ దేవా! నీకృప అపారమైయున్నది. ఐనా నాదౌర్భాగ్యవశమున నాకు మీనామంపై  ప్రేమ కలుగకున్నది. 

 

తృణాద్ అపి సునీచేన

తరోర్ అపి సహిష్ణునా

అమానినా మానదేన

కీర్తనీయః సదా హరిః...3

 

తననుతాను తృణప్రాయునిగా భావించుకొని, వృక్షమువలె సహనభావమును పెంపొందించుకొని, దురభిమానమును పూర్తిగా వదలి, ఇతరుల గౌరవిస్తూ, శ్రీహరిసంకీర్తన కొనసాగించవలెను.

 

న ధనం న జనం న సున్దరీమ్

కవితాం వా జగద్-ఈశకామయే

మమ జన్మని జన్మ నీశ్వరే

భవతాద్ భక్తిర్ అహైతుకి త్వయి...4

 

ఓ జగదీశ్వరా! నాకీలోకమున సంపద, శిష్యగణము, స్త్రీజనము, కవిశేఖరుడన్న యశము వలదుగాక వలదు. ఓ ప్రభూ! నాకు జన్మజన్మాంతరములందునూ నీపై అవ్యాజమైన ప్రేమ కలిగియుండ గోరుదును.

 

అయి నన్ద-తనుజ కింకరమ్

పతితం మాం విషమే భావాంబుధౌ

కృపయా తవ పాద-పంకజ-

స్థిత-ధూలీ-సదృశం విచింతయ...5

 

ఓ నందనందనా! నేను సదా నీ పాదదాసుడను. ఐనప్పటికినీ నేనెట్లో యీ జననమరణసాగరంలో చిక్కుకున్నాను. నన్నుద్ధరించి నీ చరణపద్మములపై నొక రేణువునై పడియుండు భాగ్యము దయసేయుము.

 

నయనం గలద్-అశ్రు-ధారయ

వదనం గద్గద-రుద్ధయా గిరా

పులకైర్ నిచితం వపుః కదా

తవ నామ-గ్రహణే భవిష్యతి...6

 

ఓ ప్రభూ! నీనామస్మరణ సాగుచుండగా నా కన్నుల నీరొలికి యెప్పుడు ధారగా ప్రవహిస్తాయో? ఎప్పుడు నాస్వరం గద్గదమైపోతుందో? ఎప్పుడు నాశరీర రోమాలు పులకాంచితమై నిక్కబొడచుకుంటాయో గదా!

 

 

యుగాయితం నిమేషేన

చక్షుషా ప్రావృషాయితమ్

శున్యాయితం జగత్ సర్వం

 గొవింద-విరహేణ మే..............7

 

స్వామీ! కృష్ణపరమాత్మా! నిను మరచిన ఒక్కక్షణం నాకొక్కయుగం. కనులను వర్షఋతువావహించినట్లై అశ్రుధారామయ మైనవి. నీ విరహంలో నాకు విశ్వంమొత్తం శూన్యమై తోచుచున్నది ప్రభూ!

 

 

ఆశ్లీష్య వా పాద-రతాం పినష్టు మాం

అదర్శనాన్ మర్మ-హతాం కరోతు వా

యథా తథా వా విదధాతు లంపటో

మత్-ప్రాణ-నాథస్తు స ఏవ నాపరః ......8

 

కృష్ణమరమాత్మ నన్ను తనచరణ దాసునిగా బిగికౌగిలిలో బంధించనీ, బంధించకపోనీ, ప్రత్యక్షమై నాకాయన దర్శనభాగ్యం కలిగించనీ, కలిగించకపోనీ. నన్నాయన తనవానిగా అంగీకరించనీ, అంగీకరించకపోనీ. అది ఆయనిష్టం. ఎట్లైన గానీ నాకా చిలిపి కృష్ణుడే ప్రాణనాధుడు. నేనింకొకరిని ఎఱుగనుగాక ఎఱుగను.

v      

 

11.అక్కమహాదేవి

 

శివునిపట్ల ఆరాధన, ప్రకృతిపట్ల నమ్మకం, ఐహికసుఖాలపట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తూ ఆధ్యాత్మిక రహస్యాలు, గూఢార్థాలూ ధ్వనిస్తున్న తన వచనసాహిత్యాన్ని కన్నడభాషలో వెలువరించిన భక్తశిఖామణి అక్కమహాదేవి. ఈమె నాలుగు వందలకుపైగా వచనాలు వ్రాసినట్లు తెలియుచున్నది. ఈమె అసలుపేరు మహాదేవి. కర్నాటకరాష్ట్రం శివమొగ్గజిల్లా లోని ఉడుతడి గ్రామస్తులైన సుమతి, నిర్మలశెట్టిగార్ల అందాలకుమార్తె మహాదేవి. ఈమె క్రీ.శ 1130-1160  మధ్యకాలంలో జీవించింది. బాల్యంనందే కుటుంబసాంప్రదాయం ప్రకారం శివపంచక్షరీమంత్రదీక్షను గైకొని జీవితాన్ని శివార్పణగావించిన ధీశాలి యీ మహదేవి.

 

ఒకనాడు రాకుమారుడైన కౌశికుడు గ్రామపర్యటనలు జేయుచుండగా, మహాదేవిని చూచి ఆకర్షితుడై, యీమెనే వివాహమాడెదనని పట్టుబట్టాడు. తేజశ్శాలియైన మహాదేవి సాక్షాత్తు పార్వతీదేవి అంశయేయని నమ్మిన తల్లిదండ్రులు రాజునకు మహాదేవినివ్వడానికి నిరాకరించారు. కౌశికుడు బలవంతముగానైనా మహాదేవిని వివాహమాడటానికి నిశ్చయించి, ఆమె తల్లిదండ్రులను పీడించడానికి సిద్ధపడ్డాడు. తల్లిదండ్రులకు బాధకలు గరాదని, మహాదేవి రాకుమారుని ఇష్టములేకున్నా పెండ్లాడింది. రాజు యీమె నిరంతర శివభక్తికి విసిగిపోయాడు. బలాత్కరించబోయాడు. ఆమె తిరుగబడింది. శివుడన్నవాడే తనభర్త. నాకూనీకూ సాంసారికబంధం కుదరదని తెగేసి చెప్పింది. ఒకనాటిరాత్రి గురు లింగదేవుడు వచ్చి శంఖంపూరించాడు. వెనుకముందు చూసుకోకుండా గురుదర్శనం కోసం మహాదేవి బయటికివచ్చింది. అప్పుడామె వివస్త్రయై యున్నది. గురువామెను వస్త్రముధరించి రమ్మనెను. వెళ్ళి ఆమె వస్త్రము ధరించుచుండగా భర్తవచ్చి వస్త్రము లాగివైచెను. వస్త్రముకన్నా గురుదర్శనమే ముఖ్యమని మహాదేవి తన తలవెండ్రుకలను పొడవుగా తక్షణమే పెంచి, వాటితో శరీరమును కప్పుకొని బయటకు నడచెను. భర్త కోపించి "ఇక్కడి వస్త్రములు, నగలు నావి, నీవేమియులేవు. నీవిక తిరిగి రానవసరము లేదని కర్కషముగా పల్కెను. అంతే, ఆమె గురుదర్శనానంతరము యీ విశాల ప్రపంచమున అడుగిడెను. ఆవిధంగా బయటపడిన మహాదేవి వీరశైవసాంప్రదాయానికి కేంద్రమైన "బసవ కల్యాణ్‍" చేరుకొన్నది.

 

కల్యాణనగరమున అప్పటికే బసవేశ్వరుడు, అల్లమమహాప్రభువను మహాభక్తులు వీరశైవాచారభక్తికి పట్టముగట్టి జనులలో గొప్పగా ప్రచారము చేయుచుండిరి. వారేర్పరచిన అనుభవమంటపమును మహాదేవి ప్రవేశింపగా, అక్కడి బసవేశ్వరాదులు యీమె తేజస్సునూ అచంచలశివభక్తిని గుర్తించి "అక్క" అను బిరుదమిచ్చి గౌరవించిరి. ఆనాటినుండి మహాదేవి అక్కమహాదేవిగా మారిపోయినది. తనభర్త పరమశివుడే నని నిష్కర్షగా ప్రకటించినందున, ఆమెను శ్రీశైలంవెళ్ళి తపమాచరించి అక్కడి కదళీవన వాసి యైన పరమశివుని కలియుమని బసవేశ్వరుడు సూచించెను. ఆప్రకారమే అక్క మహా దేవి క్లేశముల లెక్కచేయక, దిగంబరముగా అడవుల, క్రూరమృగముల, కొండల, గుట్టల దాటు కొనివెళ్ళి శ్రీశైలకదళీవనము చెంతగల గుహలో తపమాచరించి, కడకు శివైక్యము చెందినది. శ్రీశైలములో యిప్పటికినీ ఆమె తపమాచరించిన గుహను మనము దర్శించ వచ్చును.

 

 అక్కమహాదేవి వచనాలు యేవిధంగా సాగుతాయో కొన్నయినా చూద్దాం-

 

" ఈప్రపంచమంతా ఆదేవుడే నిండిపోయియుండగా తమ అంగవస్త్రం తొలిగితే సిగ్గుపడతారెందుకో జనులు"

 

" ప్రతిచోటా అదేవుడి నయనమే వీక్షిస్తున్నప్పుడు నీవు దేనిని దాచగలవు"

 

" ఆకలివేస్తే భిక్షాపాత్రలో అన్నమున్నది. దాహమేస్తే బావులూ, చెఱువులు, నదులూ వున్నాయ్. నిద్రముంచు కొస్తే శిధిలాలయాలూవున్నాయి. నాతోడు నువున్నావుగదా!

చెన్నమల్లికార్జునా!

 

" మట్టిపెల్లలవలె కరిగి కరిగి, ఇసుకదిబ్బలవలె జరిగి జరిగి, కలలో కలవరపడి, నేను వెఱగొందితే, ఆవములోని నిప్పులు నన్ను చుట్టుముట్టి నేను కందిపోతే, ఆపదలో ఆప్తుల నెవ్వరినీ కాననైతి. నీవే నావిభుడంటిని"

 

" వెదికినా కానని తనువును కలిసినా కూడని సుఖమును నాకు కరుణించుమో! చెన్నమల్లికార్జునా!

 

"చావులేని, కీడులేని, రూపులేని అందగణ్ణి నేనువలచాను. ఎడంలేని, కడయులేని, తెరవులేని, గురుతులేని అందగాణ్ణి నేవలచితి నమ్మలారా! భవములేని, భయములేని నిర్భయుడైన అందగాణ్ణి నేవలచాను. ఊరులేని, పేరులేని వాణ్ణి నేవలచాను. మల్లికార్జునుడను మగని యెక్కెక్కువగా నేవలచితి నమ్మలారా!"

 

" కాయదింపిన తర్వాత తరుపత్రములు యెవరుదులిపితేనేమిటి? నీకు అక్కరలేని స్త్రీ యెవరితో వుంటే యేమిటీ? నీవు వదిలేసిన పొలం యెవరు దున్నితే యేమిటి? దైవం తెలిశాక దేహం కుక్కతింటే నేమి? నీళ్ళలో ఊరితేనేమి?

 

ఇలా సాగుతాయీమె వచనాలు. రేకళిగె మఠంవీరయ్య, దీవి సుబ్బరావు వంటివారు అక్కమహాదేవి వచనాలను తెనుగుజేశారు.

 

తను నమ్మిన భక్తిభావముల కనుగుణముగా జీవించడానికి సంఘమునొక గడ్డిపోచగా నెంచి, త్యజించిన విప్లవయోగిని అక్కమహాదేవి. కన్నడభాషలో " చెన్న మల్లికార్జునా! " అన్న మకుటంతో వచనరచనలు చేసి వ్యాప్తిజేసిన ధన్యజీవి అక్కమహదేవి.

 

v 

12.కనకదాసు

 

భగవదన్వేషణ భక్తుని విధిగా భావిస్తాము. కానీ భగవంతుడే ఒక వ్యక్తిని యెన్ను కొని భక్తునిగామార్చి తత్త్వజ్ఞానప్రసారము చేయుటకు వినియో గించుట చాలా అరుదుగా జరిగే సంఘటన. కనకదాసు యీకోవకు చెందిన భక్తుడు. ఈ మహ నీయుడు, కవి, తత్త్వవేత్త సంగీతకారుడు, స్వరకర్త. ఆధునికభావాలతో అలరారే కీర్తనలు, ఉపభోగాలు కన్నడ భాషలో వ్రాసి, గానంచేసి, సాధరణప్రజలకు సైతం సన్నిహితుడై సరళ భాషకు పట్టం గట్టారు. నలచరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామ ధ్యానచరిత్ర, మోహనతరంగిని వంటి ఉత్తమ గ్రంథములను రచించారు. అగ్ర, నిమ్నకులవర్గాల మధ్య అంతరం నశిం చాలని అరుదైన పోరాటం సాగించారు.

 

కనకదాసు మొదటిపేరు తిమ్మప్పనాయకుడు. కురబకులానికి చెందిన బీరప్ప, బాచమ్మ దంపతులకు శ్రీవేంకటేశ్వరుని కృపవల్ల కలిగిన కుమారు డీయన. కీ.శ 1509  నవంబర్‍ 6 న కర్ణాటక రాష్ట్రంలోని హవేరిజిల్లా పిగ్గావ్ సమీపంలోని బాద్‍గ్రామంలో జన్మించారు. తండ్రి సైనికాధికారి కావడంవల్ల తిమ్మప్పనాయకుడు యుద్ధవిద్యలు నేర్చి, గొప్పయోధు డయ్యాడు. గ్రామాధికారిగా నియమింపబడి, మంచిపేరు తెచ్చుకున్నాడు. తండ్రిమరణం తర్వాత తనూ సైనికధికారి యయ్యాడు. పెళ్ళిచేసుకొని సుఖజీవనం గడపసాగాడు. ఒక సారి తనపొలంలో బావి త్రవ్విస్తుండగా నిధి బయటపడింది. తిమ్మప్పనాయకుడు మరింత ధనవంతు డయ్యాడు. అందరూ అతన్ని కనకనాయకుడని పిలువసాగారు. ఇలాజీవితం హయిగా సాగుతుండగా కేశవస్వామి కలలో కనబడి, "కనకనాయకా! నీవు నాదాసుడవు కా!" అని ఆనతిచ్చాడు. కనకనాయకుడు ఆఁ యేదో పిచ్చికలయని నిర్లక్ష్యము చేసినాడు. కానీ భగవానుడు మాత్రం విడువకుండా మీదమీద కలలో కనబడుతూ "నీవు నాదాసుడవు కా!" అని అడుగుతూనే వున్నాడు. కనకనా యకుడు, నేనెందుకు నీదాసుడను కావాలి? నాకేంతక్కువ? అందునా నేను రణ విద్యానిపుణుణ్ణి. నాకెందుకీ భక్తి, గిక్తి? ఈ కేశవుడు నన్నెందుకు కలలోకనబడి విసిగిస్తున్నాడు. అని చీకాకుపడసాగాడు. కాలచక్రం గిరగిరా తిరుగుతూంది. కనకనాయకుడి భార్య చనిపోయింది. కొంత దిగులుపడ్డాడు. మరి కొన్నాళకు తల్లీ మరణించింది. మానసికంగా మరింత క్రుంగిపోయాడు. స్వామి మళ్ళీ కలలో కని పించాడు. ఈ చరాచర జగత్తుకు నేనే ఆధారభూతుడను. నా ఆజ్ఞ లేనిదే తృణమైనా కదలదు. నీవు నన్నాశ్రయించు. నాదాసుడవై తరించుమని కోరాడు. కానీ కనక నాయకుడు, స్వామీ! నీవెంతటి వాడ వైతేనాకేమి? నేనీ భోగభాగ్యాలు వదలుకొని నీ దాసుడ నెందుకు కావాలి? నన్ను విసిగించకుమని అసహనం ప్రదర్శించాడు. ఆతర్వాత స్వామి కనిపించలేదు. అప్పుడు కనకనాయకునికి చింత కలుగసాగింది. ఎన్నాళ్ళకు స్వామి కలలో కనిపించకపోయేసరికి యేదో తెలియని ఆవేదనకు గురయ్యాడు. లోలోపల అవ్యక్తారాటం మొదలైంది. ఇంతలో విజయనగర రాజ్యా నికీ పొరుగు రాజ్యంతో యుద్ధం సంభవించింది. ఆయుద్ధంలో కనకనా యకుడు పాల్గొని, వీరోచితంగా పోరాడాడు. కానీ తుదకు శత్రుసైనికుల చేతిలో బాగా గాయపడ్డాడు. నేలకొరిగిన కనక నాయకుడు చని పోయాడనితలచి శత్రు సైనికులు యుద్ధభూమిలో వదలి వెళ్ళిపోయారు. కానీ కనక నాయకుడు కొన ఊపిరితో మృత్యువుతో పెనుగులాడుతున్నాడు. ఆక్షణంలో కేశవస్వామి మానవ రూపంలోవచ్చి, శైత్యోపచారాలుచేసి సేదదీర్చాడు. కనకనాయకుడు కొంతతేరు లొని, యెవరునీవు? నన్నెందుకు కాపాడావు? అని అడిగాడు. అప్పుడు స్వామి తన నిజరూపంచూపి, నేను నీస్వామి కేశవుడను, యిప్పటికైనా నా మాట విని నా దాసుడవు కా! పూర్వజన్మలో నీవు గొప్పపండితుడవు, నా భక్తుడవు. జన్మజన్మల కర్మఫలం కొంత మిగిలియుండి, యీజన్మలో బీరప్పనాయకుని కొడుకుగా పుట్టావు. కర్మఫలం తీరి పోయింది. లే! యికనైనా మేల్కొని, నన్నాశ్రయించు, అన్నాడు. స్వామీ! యీ గాయాల బాధ భరింపలేకున్నాను, ముందు నాబాధల నుపశమింపజేయి, అని చేతులెత్తి నమస్కరించాడు కనకనాయకుడు. స్వామి తన అభయ హస్తముతో కనకనాయకుని శరీరాన్ని స్పృసించగానే, సంపూర్ణ స్వస్తత నొంది లేచి కూర్చొన్నాడు. ఈ హటాత్పరిణామం తో కనక నాయకుడు కేశవ స్వామి దాసుడైపోయాడు. కనకదాసుగా మారి పోయాడు. కాగినేనిలో ఆదికేశవ స్వామి ఆలయం నిర్మించి, భజింప సాగాడు. స్వామి తిరిగి కలలో దర్శనమిచ్చి, హంపీవెళ్ళి వ్యాసరాయల శిష్యరికంలో బ్రహ్మవిద్యాగరుష్ఠుడవై నాసంకీర్తన చేయి అన్నాడు.

 

హంపివెళ్ళి కనకదాసు తన్నుతానెఱిగించులొని, నమస్కరించి, వ్యాస రాయల వారిని మంత్రోపదేశమర్థించాడు. వ్యాసరాయలు కృష్ణదేవ రాయల గురువు. పేరుప్రతిష్ఠలు గల వాడు. కురవకులస్తునికి మంత్రోప దేశమా? అని ఆలో చిస్తుండగా, యెదురుగా దున్న పోతు కనిపించింది. సరే వీనికి యీ దున్నపోతు మంత్రం చాలుననుకున్నాడు. కన్నడంలో దున్నపోతును "కోణ" అంటారు. కనక దాసూ! విను మని "కోణ" అని మంత్రోపదేశం చేశాడు. మహత్భాగ్యంగా తలచి మంత్రోపాసన శ్రద్ధగా చేశాడు కనకదాసు. సాక్షత్తూ యమమహిషమే ప్రత్యక్ష మైంది. వరంకోరుకోమంది. నాకేవరమూ అవసరంలేదు, మా గురువు వద్దకురా! ఆయనేదైనా కోరుకుంటే యివ్వమని ప్రార్థించాడు. వ్యాసరాయలు శిష్యుని వెంట వస్తున్న యమునిదున్నను చూచి, ఆశ్చర్యపోయడు. ఈ యమ వాహనం మీ కోరిక తీరుస్తుంది అడగండి అనగానే దారికడ్డంగవున్న ఒక గండశిలను చూపి దాన్నీ తొల గించమని కోరాడు. ఆ మహిషం తన కొమ్ములతో ఆ బండరాయిని కుమ్మేసి దూరంగా నెట్టేసి మాయమై పోయింది. కనకదాసు శ్రద్ధాభక్తులకు విస్మయు డయ్యాడు గురువు. ఒక సారి గురువు శిష్యులను పరీక్షీంపనెంచి, అందరికీ పండ్లు పంచిపెట్టి, మీరు వెళ్ళి యెవ్వరూ చూడకుండా భుజించిరమ్మన్నాడు. అందరూవెళ్ళి చాటుగా పండ్లుతినేసి వచ్చారు. ఒక్క కనకదాసు మాత్రం చేతిలో అలాగే పండు పట్టు కొని గురువుచెంతకు వచ్చి, గురువర్యా! నాకు అంతటా భగవంతుడు గోచ రిస్తున్నాడు. ఎవరూలేని ప్రదేశం లేనేలేదు, అంతటా భగవంతు డున్నాడు. కనుక పండు తినలేకపోయానన్నాడు. కనకదాసు అనుభూతిని, వ్యాసరాయలు శిష్యులందరికి అర్థమయ్యేట్లు ప్రశంశించాడు. ఒకసారి గురువు శిష్యు లందరూ కూర్చొనివుండగా వచ్చి, మనలో యెవరైనా మోక్షానికేగగలమా? అని ప్రశ్నిం చాడు. ఎవ్వరూ నోరు మెదపలేదు. కనకదాసుమాత్రం లేచి "నేనుపోతే పోవచ్చు స్వామీ" అన్నాడు. గురువుతోసహా అందరూ కినుకవహించారు. కనకదాసు, అయ్యా! నేనంటే కనకదాసనబడే నేనుకాదు, నేననే అహం, గర్వం యెవరిలో తొలగిపోతుందో అతడు

 మోక్షానికర్హుడని నాభావం, అని వివరించి చెప్పగానే అందరూ సంతోషించారు. వ్యాస రాయలు రానురాను కనకదాసులోని మహత్తును గుర్తించసాగాడు. ఒకసారి కనక దాసును పిలిచి తనకు దైవదర్శనం చేయించమని అడిగాడు. కనకదాసు వినయంగా తమరికి దైవదర్శనం కలగక పోవడమేమిటి, తప్పక కలుగుతుంది, రేపే కలుగుతుం దన్నాడు. మరునాడు ఒకకుక్క గురువుగారి మందిరంలో ప్రవేసించి, గురువుగారి చెంత నిలబడింది. శిష్యులు దాన్ని బయటికి తరిమేశారు. కనకదాసు గురువుగారి దగ్గరకొచ్చి, తమరు దైవాన్ని శిష్యులతో బయటికెళ్ళగొట్టించారుగదా! అన్నాడు. అక్కడున్న శిష్యులు కోపగించుకొని, కుక్కరూపలోకాదు, యేదైనా పవిత్రరూప ధారియై భగవంతుని రప్పించు, చూద్దాం! అని సవాలుచేశారు. సరే! అట్లే కానిమ్మని వెళ్ళిపోయడు కనకదాసు. మరునాడు గురువర్యులు పూజ చేయుచుండగా, అక్కడకు ఒకపాము విచ్చేసింది. శిష్యులు భయంతో పారిపోయారు. గురువు మాత్రం వాస్తవము గ్రహించినవాడై, ఆ సర్పానికి నమస్కరించి, పాలుత్రాపి పంపించాడు. దైవదర్శనం జరిగిందని ఆనంద పడ్డాడు. ఇంకొకనాడు గురువు, దేవునియెదుట కళ్ళూమూసుకొని ధ్యానంలో వుంటూనే, మానసికంగా పూజ చేస్తున్నాడు. దేవునివిగ్రహానికి పూలమాల వేస్తున్నట్లూ, కిరీటం పెద్దదిగా వుండటం వల్ల, పూలమాల వెయ్యలేక యిబ్బంది పడుతున్నట్లూ, మనసులోనే మదనపడు తున్నాడు. ప్రక్కనేవున్న కనక దాసుకు గురువుమనస్సులోని భావమంతా అర్థమై పోయింది. వెంటనే గురువర్యా! అంత గా శమపడతారెందుకూ! ఆ పూమాల స్వామి పాదములచెంత వుంచవచ్చుగదా! అన్నాడు. గురువు ఆశ్చర్యపోయారు. కనకదాసు యెదుటివ్యక్తి మనసులోని భావాన్నిసైతం గ్రహించ గల మహాభక్తుడని తెలుసుకున్నాడు. కనకదాసు ఒకసారి తిరుమలకు వెళ్ళాడు. స్వామి, ఆలయ ప్రధానపూజారికి, తనభక్తుడొస్తు న్నాడు, అతనిని సాదరంగా ఆహ్వానించు, అంటూ హెచ్చరించాడు. కానీ పూజారి కనకదాసును నిమ్నజాతివానిగానెంచి, మందలించి, బయటకు గెంటించాడు. చలిలో ఆరాత్రికి వణుకుతూ గుడిబయటే వుండిపోయాడు కనక దాసు. అదే రాత్రి శ్రీవేంకటేశ్వరస్వామియే స్వయముగావచ్చి తన పట్టుశాలువా కప్పి చలి నుంచి కాపాడారు. పూజారి స్వామివారి శాలునా, నగలూ దొంగిలింపబడ్డాయని, మరు నాడు కనకదాసును అనుమానించి, కొరడాతో కొట్టించాడు. కనకదాసు తొల్లింటి యుద్ధ వీరుడైనా, మౌనంగా దెబ్బలు తిన్నాడు. శ్రీవేంకటేశ్వరుని కీర్తించాడు. పూజారి గుడిలోనికి వెళ్ళి స్వామిపై కొరడా దెబ్బలవాతలు చూచి, భయపడి కనకదాసు మహిమా న్వితుడని గుర్తించి, క్షమాపణచెప్పి, గుడిలోనికాహ్వానించాడు. ఇంతలోనే పోయిన స్వామివారి నగలు భద్రంగావున్నాయని వార్తవచ్చింది. అందరూ విభ్రమానికి లోనయ్యారు. ఇలాంటి సంఘటనలు కనకదాసు జీవితంలో అనేకం జరిగాయి.

 

ఒకసారి కనకదాసు గురువుగారి అనుమతిగైకొని ఉడిపి కృష్ణాలయం వెళ్ళాడు. గురువు అక్కడిపూజారులకు, కనకదాసు మహాభక్తుడని, ముందుగానేతెలిపి, దైవదర్శనం చేయిం చండని తెలియపరచాడు. కానీ ఆలయపూజారులు నిమ్నజాతి వానికి దైవదర్శనం కుదర దంటే కదర దన్నారు. కనకదాసు వినయంగా వేడు కున్నాడు. కానీ వారువినలేదు. గుడి బయట కనకదాసు తన ఏకతారాపై గానం చేస్తూ, " కులంకుల మంటూ ఒకరినుండి ఒకరు విడిపోతారెందుకు. పుట్టేదందరూ ఒకలాగే, తినేది అదే అన్నమే. త్రాగేదానీరే . ఏఒకడూ యితరులకంటే అధికుడు కాదు గదా దేవా! అని రోదించాడు. కొన్నివారాలపాటు అక్కడే వండుకొని తింటూ, శ్రీకృష్ణకీర్తనజేస్తూ కాలంగడిపాడు. పరమాత్మ ఆయన మొర లాలకిం చాడు. ఉన్నటుండి గుడి పడమటిగోడ పడిపోయింది. గుడిచుట్టూ కట్టబడిన ప్రాకారపు గోడ, బీటలువారింది. ఆ బీటలువారిన గోడసందు లోంచి కనకదాసుకు దైవదర్శనమైంది. అదికూడా స్వామి పడమటివైపుకు ముఖంత్రిప్పి నేరుగా కని పించాడు. కూలిపోయిన గోడను, ప్రహరీని పునఃనిర్మించారు. కానీ ఆవైపు కిటికీని వుంచారు. అదే కనకదాసుకిటికి. ఆ కిటికీనుండే నేటికీ భక్తులు దైవదర్శనం చేసు కుంటూవుంటారు. మహా ద్వారం యెట్లుండే దట్లేవున్నా, ఉడిపికృష్ణయ్య మాత్రం పడమటికి తిరిగే వుండిపోయాడు. మహాభక్తుడైన కనక దాసుచరిత్రకు సాక్ష మిస్తూనే వున్నాడు.

 

కనకదాసు నిండునూరేళ్ళూ జీవించి క్రీ.శ 1606 లో పరమపదించారు. ఆయన జీవిత కాలంలో " సకలప్రాణికోటిలో, నిఖిలవిశ్వంలో, చరాచర జగత్తులో, అణువణువునా భగవంతుని పరివ్యాప్తిని నిరూపించాడు. కులాలకుల్లును కడిగిపారేశాడు. సంఘ సంస్కరణలు చేపట్టినాడు. ఈయన భావపరంపర నేటికీ అధునాతనంగా వుండటంచేత కర్ణాటక ప్రభుత్వం గుర్తించి, కనకదాసుజన్మదినాన్ని సెలవుగా ప్రకటించి నివాళు లర్పిస్తున్నది. 

 

v     

 

తనఆచరణలోలేని గొప్పభావములను యితరులకు చెప్పిన, వారనుష్ఠింతురని భ్రమపడకుము. అది లోపల జీవములేని విత్తనముల విత్తినట్లుండునని తెలిసికొనుము. 

 

                                                          ....సద్గురు మళయాళస్వామి

13. ఏక్‍నాథ్

 

ప్రాపంచిక విషయలోలత్వమునకు లోనుగాక, భవబంధములకు చిక్కక, నిష్కామభక్తికి ప్రతిరూపముగా జీవించిన మహనీయుడు సంత్ ఏక్‍నాథుడు. ఈ మహనీయుడు క్రీ.శ 1533-1599 మధ్యకాలంలో జీవించియుండెను. ఈయన స్వగ్రామము నిజాంసంస్థానములోని ఔరంగాబాద్ జిల్లా లోవున్న పైఠాన్ (ప్రతిష్టానపురం). వార్కరీ సంప్రదాయ బ్రాహ్మణులైన సూర్యనారాయణ రుక్మిణీ బాయ్ దంపతులకు జన్మించిన యేకైక పుత్రుడీయన. ఈయన పితామహుడు చక్ర పాణి, ప్రపితామహిడు భానుదాసులు గొప్ప పేరుప్రతిష్టలుగల పండితులు. ఏకవీర వీరి కులదైవము.  ఏక్నాథ్ బాల్యమునందే తల్లిదండ్రులు మరణించుటచే పితా మహులే యీయనను పెంచుకొనిరి. చిన్నతనంనుండే ఏక్‍నాథ్ పండరి నాథునియందు మిక్కిలి భక్తిగలిగి యుండెను.

 

దౌలతాబాద్ వాస్తవ్యుడైన జనార్థనస్వామి సద్గురువని విని ఆయనశిష్యరికము చేయవలెనని, అతనిదగ్గరకు ఏక్‍నాథ్ వెళ్ళెను. ఏమికోరి నాదగ్గరకు వచ్చితివని యడుగగా, ప్రాపంచిక లాభనష్ఠములు కర్మానుసారము లభించునవి. వాటితో నాకుపనిలేదు. భగవదన్వేషణయే నాలక్ష్యము. అది మీశిష్యరికమున సుసా ధ్యమని వచ్చితిననెను. ఏక్‍నాథ్ సమాధానమునకు మిగుల సంతృప్తినొంది, బాలుడు తనవద్ద క్షేమముగనున్నాడని ఏక్‍నాథ్‍కుటుంబమునకు కబురంపి, శిష్యునిగా చేర్చుకొనెను. జనార్థనస్వామి రాజయోగి, 40 గ్రామముల కధిపతి, దత్తాత్రయోపాసకుడు. ఋగ్వేదదేశస్థ బ్రహ్మణుడు. ఈయన కఫరోగి. రాత్రులు దగ్గుఆయాసముతో బాధపడుతూ గళ్ళలు యెక్కువగావచ్చి నేల మలినమగు చుండును. ఏక్‍నాథ్ గురువుపాదములచెంతనే పరుండి, యేమాత్రము విసుగు లేక నేల శుభ్రముచేసి, గురువుకు కావలసినవన్నీ సమకూర్చుచు సేవలుచేయు చుండెను. గురువు తనగ్రామములకు సంబంధించిన లెక్కలువ్రాయుపని ఏక్‍నాథ్ కప్పగించెను. ఒకసారి ఆపద్దులలో ఒకపైసా తేడావచ్చెను. ఏక్‍నాథ్ గురుసేవ ముగించుకొని లెక్కతేలేవరకు రాత్రంతా మేల్కొని పద్దులు సరిజేసి, లెక్కతేలి నందుకు సంతోషముతో యెగిరి గంతులువైచెను. గురువు అదిగమనించి

 ఏ క్‍నాథా! ఇదేపట్టుదల, ధ్యాస జీవనవిధానమందలి కర్మలపద్దులుకూడా సరిచూచుకొనవలెనని సూచించి, అందుకు తగినయోగ్యత గలవాడని మెచ్చి శ్రీకృష్ణమంత్రోపదేశము చేసెను. గురువు, తనదైవమైన దత్తాత్రేయస్వామి దర్శనము శిష్యునకుసైత మిప్పింపదలచి, ఏక్‍నాథా! బాగాగుర్తుంచుకో! దత్తాత్రేయస్వామి అప్పుడప్పుడు నావద్దకు వచ్చుచుండును, నేనాయనను కౌగలించుకొందును. అది గుర్తుగా నీవాయనను గుర్తించి అర్చించుము. అని వివరముగాచెప్పెను. ఒకరోజు దత్తాత్రేయస్వామి ముస్లింయోధునిరూపు ధరించి, అశ్వారూఢుడై వచ్చి జనార్ధనునితో  కలిసి ఒకే మట్టిపాత్రలో భోంచేయుటకు సిద్ధామయెను. జనార్థనస్వామి శిష్యునకు చెప్పినట్లు ఆయోధుని కౌగలించుకొని సంజ్ఞచేసెను. కానీ ఏక్‍నాథుడు మ్లేచ్ఛునితో భోజనమా? తగదని దూరముగా తొలగిపోయెను. మరొకసారి గురుశిష్యులు అడవిలో విహరించుచుండగా, కామధేనువును కుక్కగామార్చి తానొక ఫకీరై దత్తాత్రేయుడు యెదురువచ్చెను. జనార్థనస్వామి దత్తాత్రేయుని గుర్తించి, కౌగిలించికొనెను. ఏక్‍నాథ్ దూరము జరిగి ఒకచెట్టుక్రింద కూర్చొండెను. గురువు, ఫకీరు కుక్కను దగ్గకుతీసుకి పాలు ఒక పిడతలోనికి పిండుకొని, ఫకీరు జోలెలోని రొట్టెలు తీసి తుంటలుగావిరిచి జనార్థనస్వామికి సగమిచ్చెను. ఇద్దరూకలిసి ఆకుక్కపాలలో ముంచుకొని రొట్టె ముక్కలు తినసాగిరి. కాసేపటితర్వాత ఫకీరు జగన్నాథా! నీ శిష్యునికూడా పిలు, తింటాడనెను. ఏక్‍నథ్ పిలిచినాపోలేదు. జగన్నాథుడు శిష్యునిపై ప్రేమతో  కొన్ని రొట్టెముక్కలు పాలలోముంచి శిష్యునివైపు విసిరినాడు. కానీ ఏక్‍నాథ్ వాటిని తినక గురువుగదా యిచ్చెనని పైపంచలో మూటగట్టి యుంచెను. తర్వాత దత్తా త్రేయస్వామి దయదలచి, ఏక్‍నాథ్ దగ్గరకువచ్చి. నీవు జగన్నాథస్వామి శిష్యుడవు, కనుక నాకూ నీవంటే యిష్టం. గొప్పవాడవౌతావు. లోకానికి నీవలన మేలు జరుగుతుందని దీవించెను. అప్పుడు ఏక్‍నాథ్‍ను గురువు ఫకీరు కాళ్ళపై పడునట్లు చేసెను. ఫకీరు వెళ్ళిపోయెను. గురువు ఏక్‍నాథా! యేల నేను సైగచేసిననూ దత్తాత్రేయస్వామిని గుర్తించలేదు. పొరపాటుచేసితివిగదా! అనగా మీరే నాకు గురువు, దైవము, సర్వస్వము. వేరొకరితో నాకేమిపని? యనెను. శిష్యా! అతడు నాగురువు. నాగురువును గౌరవింపవా? అని మందలించెను. తక్షణం తప్పొప్పు

కొని ఏక్‍నాథ్ తను దాచియుంచిన రొట్టెముక్కలు హాప్రసాదముగా స్వీకరించెను. నాటినుండి జాతి, కుల, మత, వర్గ భేదములు విడనాడి సకల జీవులయందు హరిని జూచుచుండెను. ఏక్‍నాథ్ భక్తితత్పరతను  గమనించినవాడై గురువు, యీతనిచేత సేవలుచేయించుకొనుట తగదని, మంచిమాటలుచెప్పి, యింటికి వెళ్ళి పెళ్ళిచేసుకొని ఆదర్శజీవనము గడుపుమని దీవించిపంపెను. గుర్వాజ్ఞ దైవాజ్ఞగా భావించి ఏక్‍నాథ్ యిల్లుజేరుకొనెను. గిరిజాబాయి అను ఉత్తమ

కన్యను వివాహమాడి సుఖజీవనుడై యుండెను. వారికి గోదూబాయి, గంగా

బాయి, హరిపండితుడను బిడ్డలుగలిగిరి. వారి కుటుంబము హరిభక్తికి నిలయమై విలసిల్లుచుండెను.

 

ఒకనాడు ఏక్‍నాథ్ గోదావరిలో స్నానమాచరించి గట్టుకురాగానే సిద్ధీఆలీబాబా అనే సూఫీమస్లింగురువు, ఏక్‍నాథ్ సహనాన్ని పరీక్షింపనెంచి మీద ఉమ్మివైచెను. ఏక్‍నాథ్ కోపగించుకొనక తిరిగి గోదావరిలోనికి దిగి స్నానమాచరించి వచ్చెను. కానీ ఆసూఫీ తిరిగీఉమ్మివైచెను. ఏక్‍నాథ్ సహనము వహించి మళ్ళీ స్నాన మాచరించి వచ్చెను. మళ్ళీ సూఫీ అదేపని. ఇట్లు యిరువదియొక్కమార్లు జరిగెను. ఇక ఆ ముస్లిం నోరెండిపోయి ఉమ్మివేయలేకపోయెను. ఏక్‍నాథ్ కాళ్ళపైబడి మన్నింపమని వేడుకొనెను. ఏక్‍నాథ్ అతనిని ప్రేమతో యింటికిగొనిపోయి, పానీయములిచ్చి అలసటదీర్చెను. సూఫీ తనపాపమునకు పాయశ్చిత్తము తెలుపుడని, కాళ్ళావేళ్ళాబడెను. సరి, మనము కాలముదీరి ఒకనాటికి వెళ్ళి పోవుదుము. కానీ లోకము మనలను జ్ఞాపకముంచుకొనును. నాపేరుజెప్పి ప్రజలు ఉత్సవములు జరుపుకొను రోజులుచచ్చును. ఆప్రజల కాలిదుమ్ము నీసమాధిగల దర్గాపైబడును. నీఅనుయాయులు అందులకాగ్రహింపకుమనుము, చాలు వెళ్ళుము, అల్లాపై ధ్యాస విడువకుము, శుభం. అని చెప్పి పంపించెను. సూఫీ సంతోషముగా అంగీకరించి వెళ్ళెను.

 

దాసానుదాసుడను బిరుదుగలిగిన శ్రీహరి, ఆబిరుదము నిలుపుకొనుటకై స్వయముగా శ్రీఖండ్వా అను పేరుగల యువకునిరూపమున వచ్చి ఏక్‍నాథ్ గృహమున సేవకునిగా పనిలోజేరిపోయెను. శ్రీఖండ్వా ఆయింటిలో తలలోని నాలుకవలె యిమిడిపోయి, యింటిపనులన్నియు జేయుచు, ఏక్‍నాథ్ కు ప్రీతి పాత్రుడుగా మెలగుచుండెను. ఒకరోజు ఏక్‍నాథ్ పితృదేవుళ్ళకు శ్రాద్ధము పెట్టుటకు, ఊరిలోని బ్రహ్మణులను భోజనమునకు పిలిచి,శ్రీఖండ్వాను వంట చేయుమనెను. శ్రీఖండ్వా చేసిన వంటల వాసన ఘుమఘుమ లాడు చుండెను. వారి యింటి వెనుక తోటలో పనిచేయు దళితకుటుంబమునకు వంటలవాసనతో నోరూరు చుండెను. బాహ్మణభోజనానంతరము పారవేయు యెంగిలివిస్తరల లోని మిగిలిన పదార్థముల తిందమనుకొనిరి. కానీ అది శ్రాద్ధదినముగాన, యెంగిలి విస్తర్లు భూస్థాపితము చేయుదురని తెలిసి నిరాశజెందిరి. వారి పిల్లవాడు మాత్రము తనకు లడ్డుకావలెనని మారాముచేయుచుండెను. అదివిని ఏక్‍నాథ్ మనసుకరిగి, ఆకుటుంబమునేకాదు, దళితవాడనంతయూ రమ్మని, ముందుగా వారికి తృప్తిగా భోజనముపెట్టి పంపించెను. బ్రాహ్మణులదితెలిసి కోపగించుకొని భోజనముచేయమని వెళ్ళిపోయిరి. కానీ పితృదేవతలు ఏక్‍నాథుడు చేసినపనిని మెచ్చుకొని స్వతహాగా వారే దిగివచ్చి, భోజనమారగించి దీవించి వెళ్ళిరి. ఇది గమనించిన ఊరి బ్రాహ్మణులు తమతప్పును కప్పిపుచ్చుకొనుటకు అనునయము నటించి, ఏక్‍నాథుని క్షమించి ప్రాయశ్చిత్తము చేయుదమని, నదికి ఏక్‍నాథుని గొనిపోయి, విభూది, గోమయమును అతనికి పట్టించి శుద్ధిచేయు ప్రయత్నము చేయుచుండిరి. ఇంతలో త్రయంబకము నుండి ఒకకుష్టురోగ బ్రాహ్మణుడు వచ్చి నేను శంకరుని ఆజ్ఞమేరకు ఎక్‍నాథ్‍మహశయుని దర్శింపవచ్చితిని. ఆయన దళితులకు చేసిన అన్నదాన ఫలములోని సహస్రాంశము నాకుధారపోసిన నావ్యాధి నయమగును. అనగానే, నదిలోనున్న ఏక్‍నాథుడు పిలిచి, నేనే ఏక్‍నాథుడను. నీకు మేలుజరుగునన్న, నాపుణ్యము ధారపోయుటకు అభ్యంతర మేమియూలేదు. ఇదిగో ధారపోయుచున్నానని, నదీజలము గైకొని, రమ్మని పిలిచి, తక్షణమే ధరపోసెను. అందరూ చూస్తుండగనే కుష్టువ్యాధి నయమై పోయెను. వచ్చిన బ్రాహ్మణులు ఏక్నాథ్ మహిమను గొనియాడి, శుద్ధికార్య క్రమము మాని పదాభివందనము జేసిరి. ఏక్‍నాథ్ యింటజరుగు హరి సంకీర్తనలకు దళితులు వచ్చి పాల్గొనుటేగాక, తనూ దళితవాడలకేగి కీర్తనలను పాడుచుండెను.

 

ఏక్‍నాథ్ సహనశీలతకు, ధర్మాచరణకు నిలువెత్తు నిదర్శనమని లోకమున పేరువడసెను.  కొందరసూయాపరులు పరుల నీతి నిబద్ధతలనుకూడా తప్పు పట్టుచుందురు. అది వారి పైశాచికానందము. ఒక పొరుగూరి బ్రాహ్మణుడు తనకుమార్తె వివాహనిమిత్తము ఓ రెండువందల రూప్యములు తక్కువయి పైఠానుకు యాచించవచ్చెను. ఈ కుల్లుబోతుమనుష్యులు, అతనిని బిలిచి మావూరి ఏక్‍నాథ్‍కు  కోపముదెప్పింపుము చాలు, నీకు రెండువందలు మేమిత్తుము, అదే ఆయెదురిల్లే, వెళ్ళి ప్రయత్నింపుమనిరి. అదెంతపని యిదిగో చూచుచుండుడని, అతడు సరాసరి చెప్పులకాళ్ళతోనే ఏక్‍నాథ్ నట్టింటికి నడిచివెళ్ళెను. ఏక్‍నాథ్ అతనినాహ్వానించి అయ్యా! తమరు నన్నుకలుసుకొన వలెనను తొందరలో పాదరక్షలు పెరటిలో విడచివచ్చుట మరచితిరని వినయము గా విన్నవించి, తనే ఆతని పాదరక్షలు విప్పి బయటవుంచివచ్చెను. కాళ్ళుకడిగి కొనుటకు నీళ్ళిచ్చి త్రాగుటకు మంచినీళ్ళిచ్చి, గౌరవించి, కొంతసమయమునకు, భోజనసమయమైనది, వచ్చికూర్చొండుడని పిలిచెను.  ఆఅతిధి, భోజనము వడ్డించుచున్న ఏక్‍నాథ్ భార్య వీపుపైకెక్కి కూర్చుండెను. ఏక్‍నథ్ యేమాత్రము కోపపడక, జాగ్రత్త! అతిధి పడిపోవునేమో నని భార్యను హెచ్చరించెను. ఆమె కూడా అమితసహనముతో పర్వాలేదు, నాబిడ్డలను వీపునెక్కించుకొని  ఆడించిన అలవాటున్నదిలెమ్మననెను. అతిధి వెంటనేదిగి, తానట్లు ప్రవర్తించుటకు కారణము తెలిపి. క్షమింపుడని కాళ్ళపైబడెను. ఏక్‍నాథుడు బాధపడకుమని ఓదార్చి, ఇప్పటికీ మించిపోయినదిలేదు. నేనునిన్ను కోపగించుకున్నట్లు నటించుచూ బయటికి వత్తును. బయటివారు నాకోపముజూచి నీకు పైకములిత్తురు రమ్మని, వెంటనిడుకొని బయటికివచ్చి అతనికి సహాయపడెను. ఏక్‍నాథునకు యితరుల మెప్పు అవసరములేదుగదా! నాకోపము వలన పరులకు సంతోషముగలిగిన కలుగనిమ్మనుకొనెను. మరొకసారి బాగాముసురుపట్టి వర్షముపడుచుండెను. ఎక్కడా స్థానముదొరకక కడకు ఏక్‍నాథ్ యింటికి ముగ్గురు బాటసారులు వచ్చి చేరిరి. ఏక్‍నాథ్‍యింటిలో కూడా సరైన సౌకర్యము లేదు. ఐనా ఏక్‍నాథ్ వారిని లోపలికి సాదరంగా ఆహ్వానించెను. కట్టెలు బాగా తడిసిపోయి పొయ్యి వెలిగించ డానికి యేమాత్రము అనుకూలముగాకుండెను. అప్పుడు ఏక్‍నాథ్ తనమంచము విరగగొట్టి వంటచెఱకుగా మార్చి వారికి వేడినీళ్ళు, భోజనము సకాలములో అందునట్లు యేర్పాట్లుచేసెను. ఇట్లు ఏక్‍నాథుడు చేయు సత్కా ర్యములకు పరిమితులేలేకుండెను.

 

ఏక్‍నాథ్ హరిభక్తిలో మునిగి మూడువందలకుపైగా మరాఠీభాషలో గ్రంథములు వ్రాసెను.  వాటిలో శ్రుతిశాస్త్రసారము, భాగవతము, భావార్థరామయణము, శంకరాచార్యుల హస్తామలకము, సుఖాష్టకము, స్వాత్మసుఖా, ప్రేమానంద లహరి, చిరంజీవపథ్, గీతాసారము, ప్రహ్లాదవిజయము మొదలైన గ్రంథములు ప్రసిద్ధములు. ఇవిగాక చతుశ్లోకీభాగవతమునుకూడ రచించెను. సరళభాషలోనే  ఆయనరచనలన్నీ సాగినవి. వాటిలో అభంగములే కాకుండా భహత్ అను క్రొత్తసాహిత్య విధానమునూ ఆయన ప్రవేశపెట్టెను.

 

ద్వారకాక్షేత్రమున ఒకభక్తుడు హరిసాక్షాత్కారమునకై తపముచేయుచుండెను. అతనికి రుక్మిణీదేవి ప్రత్యక్ష్షమై భక్తా! శ్రీహరి పండ్రెండుసంవత్సరములనుండి పైఠాన్‍లోని ఏక్‍నాథ్‍గృహమున సేవకుడై పరిచర్యలు చేయుచున్నాడు. నీవక్కడికి వెళ్ళిన హరిదర్శనమగునని చెప్పినది. వెంటనే అతడు పైఠాన్‍లోని ఏక్‍నాథ్‍గృహముచేరి, విషయము తెలిపి, తనకు హరిదర్శనము చేయింపుమని ఏక్‍నాథ్‍దంపతులను వేడుకొనెను. వారశ్చర్యచకితులైరి. హరిచే సేవలు చేయించుకున్నందుకు చింతించిరి. ఇంతలో నదినుండి కావడితో నీళ్ళుతెచ్చిన శ్రీఖండ్వా అతిథియై వచ్చిన భక్తునిచూచి, తనరహస్యము బయల్పడినదని తెలిసి, వారందరూ చూచుచుండగనే అంతర్థానమయ్యెను. వారి రోదనతోగూడిన ప్రార్థనను మన్నించి, హరి వారికి పునఃదర్శనమిచ్చి సంతృష్టమానసులగావించి వైకుంఠమేగెను.

 

జ్ఞానేశ్వర, వామదేవుల తర్వాతితరంవారైన తుకారామ్, సమర్థరామదాసుల భక్తిమార్గాన్ని సుసంపన్నంచేసి ముందుకు తీసుకెళ్ళిన మహనీయుడు ఏక్‍నాథ్. ఒకసారి జ్ఞానేశ్వరుల సమాధి, రావిచెట్టువేళ్ళవల్ల పాడైపోతున్నదని కలలో జ్ఞానేశ్వరులే స్వతహాగా వచ్చిచెప్పగా, వెళ్ళి తనూ తనశిష్యులు సమాధిని వెతికి కనుగొని ఆవృక్షమును దక్షిణప్రాంతమునకు సురక్షితముగా తరలించి, సమాధి బాగుచేయించెను. ఒక వ్యాపారి రూపమున పాండురంగడే అక్కడ దుఖాణము తెరచి, వారికి తగినన్ని సరకులు సమకూర్చి, ధర తర్వాత చెల్లింతురులెమ్మని చెప్పి, పనిపూర్తికాగానే మాయమైపోయినాడట. ఆవ్యాపారి హరియేయని తర్వాత గుర్తించి, గురుశిష్యులు ఆ దేవదేవుని మరీమరీ కీర్తిస్తూ యిల్లు చేరు కున్నా రట. కాశీలోని ఒక పెద్దమఠాధిపతి, మణికర్ణికాఘట్టమున ఏక్‍నాథ్‍భాగవతం పఠించుచున్నారనివిని, సంస్కృతపవిత్రగ్రంథమును మరాఠీలోనికి అనువదించి చదవటం దోషమని కోపించి, ఏక్‍నాథ్‍ను వారణాశికి పిలిపించి, ఏక్‍నాథ్

 ముఖముగూడా చూడకుండా తెరచాటునుండి మూడువందలమంది యితర మఠాధిపతుల సమక్షమున  విచారించి, మరఠీభాగవతాన్ని గంగపాలు చేయ మన్నాడట. గంగలోవేయగనే ఆభాగవతాన్ని గంగామాత అందుకొని కళ్ళకద్దు కొని తలపైధరించివచ్చి, గట్టునబెట్టినదట. వచ్చిచూస్తున్న యితరమఠాధిపతులకు ఏక్‍నాథ్ చతుర్బాహుడైన హరిగా కనిపించాడట. అదితెలిసి పెద్దమఠాధిపతి తనతప్పుతాను తెలుసుకొని, ఏక్‍నాథ్‍కు క్షమాపణలుచెప్పి, మరాఠీభాగవతాన్ని ఏనుగుఅంబారీపై కాశీపట్టణమంతా ఊరేగించి, అందుకొని కళ్ళకద్దుకున్నాడట.

 

ఏక్‍నాథ్ కుమారుడైన హరిపండితుడు తండ్రియనుసరించు భక్తిమార్గముకన్నా కర్మానుష్టానమే ఘనమనినమ్మి, గొప్పపాండిత్యము నభ్యసించి, కాశీకి వెళ్ళి పోయినాడు. అక్కడ మంచిపేరు ప్రతిష్టలు  సంపా దించుకున్నాడు. తండ్రి గొప్ప తనాన్ని, గుర్తించలేకపోయాడు.  తండ్రివెళ్ళి పైఠాన్‍ రమ్మని కొడుకును బ్రతిమ లాడాడు. కొడుకు, తండ్రివెంటరావడానికి రెండుషరతులు పెట్టాడు. అందులో ఒకటి మరాఠీలో భాగవతప్రవచనాలు చేయకూడదు. రెండు, పరాన్నభోజనం చేయకూడదు. రెండునిబంధనలూ ఒప్పుకొని కొడుకును పైఠన్‍ తీసుకెళ్ళాడు ఏక్‍నాథ్. అప్పటినుండి కొడుకే సంస్కృతంలో ప్రవచనాలు చేయసాగాడు. ఏక్‍నాథ్ మిన్నకుండిపోయాడు.

 

పైఠన్లో ఒక ధనికురాలుండేది. కాలక్రమంలో అమె పెదదైపోయింది. ఆమె మొదటి నుండి గొప్పఅన్నదాత. కనుక వెయ్యిమందికి అన్నదానంచేయ సంకల్పించింది. పరమాత్మ కలలోకనబడి, ఇప్పుడు పేదరికంలో వెయ్యిమందికి అన్నదానం చెయ్య లేవు, కనుక ఒక్క ఏక్‍నాథ్‍కుబెట్టు, వెయ్యిమందికి బెట్టినట్లే నన్నాడు. వెళ్ళి ఏక్‍నాథ్‍కు విషయం విన్నవించి, భోజనానికి ఆహ్వానించింది. అది కొడుకు రెండవ నిబంధనకు విరుద్ధం. వెళ్ళి కొడుకునడిగాడు. కుమారా! ఆ ముసలమ్మ కోరిక తీరుద్దాం. నీవే వంటచెయ్యి, వడ్డించు అని చచ్చజెప్పాడు. అట్లే కొడుకు వచ్చి వంటజేసి వడ్డించాడు. తనూ తండ్రితోపాటు కూర్చొని బోంచేసినాడు. భోజనానంతరం విస్తరినికూడ కొడుకునే తియ్యమన్నాడు. ఆశ్చర్యం, తీస్తుంటే విస్తర్లు వస్తూనేవున్నాయి. అలా వెయ్యివిస్తర్లు తీశాడు ఏక్‍నాథ్‍కొడుకు. అందుకే ఆమెకు వెయ్యిమందికి అన్నదానంచేసిన పుణ్యం లభించింది.

 

ఒకసారి పైఠన్‍బ్రాహ్మణులు కాశీనుండి కావళ్ళతో గంగాజలంతెచ్చి, రామేశ్వరం లో శివునికి అభిషేకం చేయాలని సంకల్పించి, జలం మోసుకవస్తున్నారు. ఇక రామేశ్వరం కొద్దిదూరంలో వుండగా దారిమధ్యలో ఒకగాడిద దాహంతో అలమ టిస్తూ కనబడింది. ఏక్‍నాథ్ వెంటనే కొడుకుకావడిలోని గంగాజలం గాడిదకు త్రాపి సేదదీర్చాడట. అందరికీ కోపంవచ్చింది. గాడిద, శివుడు ఒకటేనా? అని ఏక్‍నథ్‍ను నిందించారు. అనరానిమాటలన్నారు. ఏక్‍నాథ్ మౌనంగా వారి మాటలు భరించాడు. కానీ రామేశ్వరంవెళ్ళి మిగిలిన గంగాజలంతో శివునికి అభి షేకంచేయగానే, యేదో అవ్యక్తదివ్యానుభూతి అందరిలో కలిగిందట. అప్పుడు యిది ఏక్‍నాథ్‍వారి జలదానఫలమేనని అర్థమైందట. అందరూ యాత్రాఫలం దక్కడానికి ఏక్నాథ్‍మహాశయులే కారణమని శ్లాఘించారట.

 

ఒకరోజు ఉన్నటుండి ఏక్నథ్‍మహాశయుడు, తను మరునాడు పరమపదించ నున్నానని తెలిపి, భక్తుడైన ఉద్దవుని పిలిచి, భజనకేర్పాట్లు చేయమన్నాడు. మరు నాడు భజనజరుగుచుండగనే ఏక్‍నాథులవారు ప్రాణంవిడిచాడు. తండో పతం డాలుగా భక్తులు తుదిదర్శనానికి రాసాగారు. కొందరు నచ్చనివారు, శవ దర్శ నానికి వీరికెందుకీతొందర? వీరికి వెఱ్ఱిపట్టిందని చులకనజేసి మాట్లాడ సాగారు. అలా మాట్లాడుతుండగానే ఏక్‍నాథ్‍మహాశయుడు తిరిగి జీవించి, లేచినిలబడి ఏక్‍తారనందుకొని నగరసంకీర్తనకు బయలుదేరారు. అందరూ ఆశ్చర్యపోయి, ఆయనవెంటే భజనచేస్తూ కదిలారు. అలా వెళ్ళివెళ్ళి, తుదకు గోదావరీతీర యిసు కతిన్నెపైజేరి, కడసారి సంకీర్తనజేసి, అందరికీ నమస్సు లర్పించి, "రామకృష్ణహరి" యని హరినామస్మరణజేస్తూ గోదావరిలో మునిగి తుడిశ్వాసవిడిచారు ఏక్నాథులవారు. కుమారుడు పార్థివశరీరాన్ని గట్టుకుచేర్చి అగ్నికర్పించాడు. మరునాడు చితివెలిగించినచోట రావిమొలక కనిపించింది. దాన్ని జాగ్రత్తగా ఉత్తరదిశన నాటారు. అస్తికలు కలశంలో నిక్షిప్తంచేసి పూజించి, చుట్టూ తులసిబృందావనం నిర్మింపజేసినాడు కుమారుడు. ఏక్‍నాథ్ మహాశయుడు వికారినామసంవత్సరం ఫాల్గుణమాసం బహుళషష్టి ఆదివారం అపరాహ్ణవేళ వైకుంఠయానము చేసినారు గనుక మరాఠాదేశములో, ముఖ్యంగా పైఠాన్‍వాసులు యీ దినాన్ని ఏక్‍నాథ్‍షష్ఠిగా, ఒక పండుగదినంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

ఓం తత్ సత్.

 

మనిషి తనఆత్మ నావరించుకొనియున్న పొరలను  నిర్మూలించికోవాలన్న ధృఢనిశ్చయాని  కొచ్చినట్లైతే, అతన్ని యీభూమిపైనున్న  యేశక్తి ఆపలేడు. అధ్యాత్మికపురోభివృద్ధికి  మనిషికవసరమైనది ఒక ఉక్కు(దృఢ) సంకల్పమే. ఇదుంటే గమ్యం కనుచూపుమేరలో వున్నట్లే.

 

                                                     ...శ్రీ రామచంద్రజీ -  షాజహాన్ పూర్

 

 

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

                                                                               ........  స్వామీ వివేకానంద

 

 

 

   14.భర్తృహరి

Image result for bhartruhari in telugu

 

రాజ్యాధికారము, సిరిసంపదలు, పరిజనము, పద్మాక్షులపొందు గలిగి, వైభవో పేతమైన జీవితముగడుపు సౌజన్యుడు, వివేకమంతుడగునేని, అతడు యేదో ఒకనాడు, ఒకానొక ఘటనచే యీవిశ్వము అశాశ్వతమనియు, అను బంధం ఆత్మీయతలన్నీ భూటకమనీ, భగవదన్వేషణయే కర్తవ్యమని గ్రహించి తీరుతాడు.  అది యాలంబనగా అతనిలో వైరాగ్యము నెలకొని సర్వమును పరిత్యజించి తన జీవితలక్ష్యమైన పరబ్రహ్మతత్త్వమును తెలుసుకుంటాడు. తన జీవితా నుభవ ము లను ప్రపంచానికందిస్తాడు. ఈ కోవకు జెందినవాడే రాజాభర్తృహరి.

 

భర్తృహరి జీవితకాలము, మాతాపితలు, ఇల్లాండ్ర విషయములు వివాదా స్పదములు. వీటిపై పలువిధములైన కథలు వ్యాప్తిలోనున్నవి. కానీ సారాంశము మాత్రము ఒక్కటేయై యున్నది. ప్రస్తుతము కొంత సమంజసమనిపించిన జీవన వృత్తాంతమును గ్రహింతము. ఈతడు చంద్రశర్మ (చంద్రగుప్త) అను బ్రాహ్మణుని కుమారుడు. తండ్రి చంద్రశర్మ ఆనాటి వర్ణధర్మానుసారము, వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహమాడి, వారియందు భర్తృహరి, విక్రమా ర్కుడు, భట్టి, వరరుచి యను కుమారులను గనెను. కాలక్రమమున భర్తృహరి ఉజ్జయనీ ప్రభువయ్యెను. ఈతడు క్రీ.ఫూ ఒకటవశతాబ్దమువాడని కొందరూ, కాదు క్రీ.శ. ఐదవశతాబ్దమువాడని మరికొందరూ అభిప్రాయపడుచున్నారు. ఏదియేమైననూ, భర్తృహరి తేజోవంతుడై ధర్మప్రభువను కీర్తిగాంచి రాజ్యము నేలుచుండెను. అట్టిసమయమున ఒకవిప్రవర్యుడు రాజువద్దకు వచ్చి, రాజా! నేను భువనేశ్వరీదేవి ఉపాసకుడను. నా పూజాఫలముగా దేవి, నాకీ దివ్య ఫలము (పండు) నిచ్చినది. ఇది భుజించినవారికి దీర్ఘాయువు గలిగి, జరావ్యాధి బాధలు దరిజేరవు. నాకంటే ధర్మప్రభువులైన మీరు దీనిని భుజించిన లోక కల్యాణమగునని తలచి మీకు సమర్పించుచున్నాను, గైకొనుడనెను. భర్తృహరి ఆఫలమును గైకొని, బ్రాహ్మణునకు సంభావనలిచ్చి పంపెను. రాజు ఆఫలమును తానుదినక తనకమితప్రీతిపాత్రురాలైన తనభార్య అనంగసేనకిచ్చెను. కానీ అనంగసేన తనప్రియుడైన సాహిణి యను అశ్వపోషకునకిచ్చెను. అతడు తన కిష్టమైన అంతఃపురదాసికిచ్చెను. ఆదాసి తనప్రియుడైన ఒక గోపాలునకిచ్చెను. అతడు తనతో సఖ్యతగామెలగు గోశాల శుభ్రముచేయు వనితకిచ్చెను. ఆమె గోశాలశుభ్రముచేసి, పేడతట్టలో పండునుంచుకొని, ఆతట్ట తలపైనిడుకొని, వీధిగుండా యింటికి బయలుదేరెను. అదేసమయమున రాజు మేడపై పచార్లు చేయుచూ వీధిలో పోవుచున్న స్త్రీ తలపైనున్న తట్టలో పండు మెఱయుచూ కనబడెను. రాజు వెంటనే భటులనుపంపి ఆ స్త్రీని లోపలికి పిలిపించి, తట్టలోని పండు తనకు బ్రాహ్మణుడిచ్చినదేనని గుర్తించి, విచారణ మొదలుపెట్టి కూపీ లాగగా, ఆపండు యెన్నిచేతులు మారినది అర్థమైపోయినది.

 

భర్తృహరి పండును తన ఉత్తరీయమున దాచుకొని, రాణివద్దకు వచ్చి, ప్రియా! నేను నిన్న నీకిచ్చిన పండునేమిజేసితివని యడిగెను. ఆమె అప్పుడేభుజించితినని జెప్పెను. వెంటనే రాజు ఉత్తరీయమున దాచిన పండును బయటకుదీసి మరి యిదెక్కడిది? అని ప్రశ్నించెను. రాణి దొరికిపోయెను. ఇక తప్పించుకొను మార్గము లేదని తెలిసి, నిజమునొప్పుకొనెను. ప్రాణభిక్ష పెట్టుమని కాళ్ళపై బడెను. రాజు మిగిలిన రాణివాసము నంతటిని పిలిపించి, తను మోసపోతినని మనసులోనిమాట అందరికీ చెప్పి, అందరినీ క్షమిస్తున్నాను. మీకుస్వేచ్ఛను ప్రసా దిస్తున్నాను. మీరు మీకుకావలసినంత ధనమును తీసుకొని వెళ్ళండి, మీ కిష్ట మైన జీవనం సాగించండనిచెప్పి, తక్షణం సన్యసించి, రాజ్యము తమ్ము డగు విక్రమార్కునకప్పజెప్పి, భట్టిని మంత్రిపదవిపై నిలిపి, ఆ పండునుకూడా విక్ర మార్కునకిచ్చి, తా నడవిబాట పట్టెను. విక్రమార్కుడు భువనేశ్వరీదేవి భక్తు డైన బ్రాహ్మణుని పిలిపించి, యీ పండువల్ల ధర్మాత్ముడైన తన అన్న విరాగి యయ్యె నని దుఃఖించి, పండును బ్రాహ్మణునకే యిచ్చివేసెను.

 

భర్తృహరి పుట్టుకతోనే జ్ఞాని, వివేకవంతుడు. ఒక్క సంఘటనతో జీవితము మలుపుదిరిగి విరాగియై తపమాచరించి, యోగియాయెను, తుదకు దైవీయ శక్తులు సైతము అతని వశమాయెను. ఒకనాడు భర్తృహరి నిరామయుడై ఒక జీర్ణ దేవాలయమున కటికనేలపై తనచేతిని దిండుగాజేసుకొని తలక్రింద బెట్టు కొని, పరుండి యుండెను. ఆ సమయమున దేవతాస్త్రీలు అటుగా వెళ్ళుచూ, ఇతనిని జూచి, అన్నీవదలినవితనిని, బంధరహితుడైనాడు, కానీ...అని అంటుండగానే భర్తృహరి అదివిని, తలగడగాచేసుకున్న తనచేతిని ప్రక్కకుదీసి తలను నేలపైనే వాల్చినాడు. అప్పుడది గమనించిన దేవతాస్రీలు, అయ్యో! ఇతనికి పోనిది ఒకటే ననుకున్నాము, కానీ యింకొకటికూడావుందే? అంటూ వెళ్ళిపోయారు. భతృహరి ఆలోచించాడు. నిజమే! అన్నీ త్యజించాను. తపమాచరించాను, అయినా అభిమానం పోలేదుకదా? దేవతాస్త్రీలు చేసిన సూచనను గ్రహించి, ఉన్న ఒకచిన్న సుఖాపేక్ష (తలక్రింద దిండుగా చేయి నుంచు కొనుట) ను క్రమము గా వదిలించుకొనక, అప్పుడే చేతిని తలక్రిందినుండి తొలగించుకొని, వారి మెప్పుకొఱకు ప్రయత్నించితిని. ఔరా! ఇదియూనొక దోషమేగదా! యని గ్రహించి, కాలక్రమమున తన్నుతాను సవరించుకొని, నిర్దోషుడై, తన అనుభవములను శ్లోకములుగా మలచి, ప్రజలకందించి, లోకోపకారము చేసినవాడై, భగవత్ప్రాప్తికి అర్హుడై, తరించినాడు.

 

భర్తృహరి సుభాషిత త్రిశతి (సుభాషిత రత్నావళి) యనుపేర నీతి, శృంగార, వైరాగ్య భావాలను సంస్కృతమున వెలువరించినారు. సంస్కృత లఘుకావ్య రచయితగా పేరుగడించినారు. అనేకభాషాలలోనికి వీరి రచనలు అనువదింప బడ్డాయి. తెనుగున ఎలకూచిబాలసరస్వతి, పుష్పగిరితిమ్మన, ఏనుగులక్ష్మణకవి వీటికి పద్యరూపమిచ్చారు. తెలుగునకూడా యివి భర్తృహరిసుభాషితాలుగానే పేరుగడించాయి. వాక్యపదీయమను సంస్కృతభాషాతత్త్వశాస్త్రాన్ని కూడా భర్తృహరి రచించెనని ప్రతీతి.

 

ఏనుగులక్ష్మణకవి తెనుగించిన భర్తృహరిసుభాషితాలు బహుళప్రచారాన్ని పొందాయి. వాటిలో భర్తృహరిహృదయం చక్కగా ఆవిష్కరించబడిందన్నది పండితుల అభిప్రాయం. మచ్చున కొకటిరెండు భర్తృహరిశ్లోకాలు, ఏనుగు లక్ష్మణకవి తెనుగుసేతలు (పద్యాలు) గమనిద్దాం.

 

బర్తృహరి సుభాషితాన్నిగురించి యిలా అన్నారు

 

 శ్లో:     బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః ।
             అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్‌ ॥

 

ఏనుగులక్ష్మణకవి  శ్లోకాన్ని యిలా తెనుగించారు

 

తే: బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు

      ప్రబల గర్వవిభూషితుల్ ప్రభువులెన్న

     నితరమనుజు లబోధోపహతులు గాన

     భావమున జీర్ణమ య్యె  సుభాషితంబు

 

అంటే, పండితులు అసూయాపరులయ్యారు. రాజులు గర్విష్టులయ్యారు. సామన్యులకు అవసరమనిపించలేదు. తత్కారణంగా మంచిమాట యెవరికీ ఉపయోగపడక అంతరించిపోయింది. అంటున్నారు భర్తృహరి.

 

           మూర్ఖుని చిత్తము తెలిసికొనుట యెవరికీ సాధ్యముగాదంటూ భర్తృహరి యిలా అన్నారు. 

 

శ్లో:  ప్రసహ్య మణిముద్ధరేన్మకరవక్త్ర దంష్ట్రాతరాత్

       సముద్రమపి కోపి సంతరేత్ప్రచల దూర్మిమాకులమ్

      భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్

      నతు ప్రతినివిష్ట మూర్ఖజనచిత్త మారాధయేత్.

 

ఏనుగులక్ష్మణకవి పైశ్లోకాన్ని అనువదిస్తూ..

 

 

చం: మకరముఖాంతరస్థమగు మానికమున్‍ బెగలింపవచ్చు బా

         యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ

        స్తకమున బూలదండవలె సర్పమునైన భరింపవచ్చు మ

        చ్చికఘటియించి మూర్ఖజనచిత్తము దెల్ప నసాధ్యమేరికిన్.

 

అంటాడు. అంటే మొసలిదంతముల మధ్యగల మాణిక్యాన్ని బెకలించి గ్రహించ వచ్చు. మహోగ్రమైన అలలుగల సముద్రాన్నైనా దాటుకోవచ్చు. తలపై పూమాల వలె పామునైనా ధరించి భరించవచ్చు గానీ, యెంతసన్నిహితంగా మెలగినా మూర్ఖుడైనవాని మనస్సును తెలుసుకోవడం సాధ్యంకాని పని, అంటున్నాడు భర్తృహరి.

 

ఇక సాధుసంగమ ప్రయోజనాన్ని వివరిస్తూ భర్తృహరి..

 

శ్లో:  జాడ్యం ధియో హరతి సిఞ్చతివాచి సత్యం

        మనోన్నతిం దిశతి పాప మపాకరోతి

        చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిమ్

        సత్సజ్గతిః కథయకిం నకరోతి పుంసామ్.

 

అంటారు. అంటే సాధుపుంగవులతో కలసిమెలసి వుండటంవలన సత్యం ఫలిస్తుంది. బుద్ధిమాంధ్యం తొలగిపోతుంది. పపాలునశించిపోతాయి. గౌరవంపెంపొందుతుంది. కీర్తి వ్యాపిస్తుంది. మనసు వికసిస్తుంది. సాధు సంగమంతో సకలప్రయోజనాలూ కలుగుతాయన్నారు భర్తృహరి. దీనిని తెలుగుజేస్తూ ఏనుగులక్ష్మణకవి

 

తే: సత్యసూక్తి ఘటించు ధీజడిమమాన్చు

    గౌరవమొసంగు జనులకు కలుష మడచు

    కీర్తిప్రకటించు చిత్తవిస్పూర్తి జేయు

    సాధుసంగమంబు సకలార్థ సాధనంబు.

 

అన్నారు. ఇంకాచెబుతూ మనిషికి తాను చేసే పన్నీటిస్నానాలు, ధరించే నగలూ,  చందన పుష్పాదులవల్ల ఘనతచేకూరదు. మనిషి తాను పలికే మంచిమాటలే అతనిని గొప్పవాణ్ణి చేస్తాయి. అవే అతనికి నిజమైన భూషణములని చెబుతూ భర్తృహరి...       

 

  శ్లో ।।    కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
               న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
               వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
               క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥

 

అంటారు. ఈశ్లోకాన్ని యిలా తెలుగుజేశారు ఏనుగులక్ష్మణకవి

            

   ఉ॥     భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
             భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
            భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా
            గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్ .

 

ఇలా ఎన్ని హృద్యమైన శ్లోకాలు, పద్యాలనైనా  ఉదహరించవచ్చును. అంతటి మహత్తు గలిగినవి  భర్తృహరిసుభాషితములు.

 

v 

15.జాబాలి

 

 

జ్ఞానసముపార్జనా జిజ్ఞాస, శ్రద్ధ, పట్టుదల, గురువునందు విశ్వాసము, భక్తి, లోకోపకారబుద్ధి గలవారందరూ విద్యాభ్యాసమునకు అర్హులే. అంతేగానీ, జాతి, మతము, కులము విద్యాభ్యాసమునకు అర్హతలుగావు. ఇది యిప్పటిమాటకాదు. ఛాందోగ్యుపనిషత్తులోని జాబాలి వృత్తాంతమే తెలియుజేయుచున్నది.

 

హరిద్రుమతుడనే గౌతమగోత్రీయుడగు గురునునొద్ద కొకబాలకుడు వచ్చి గురువర్యా! జ్ఞానికే అంతిమం బ్రహ్మజ్ఞానం. అదినే నభ్యసించదలచాను. నన్ను దయతో మీ శిష్యునిగా అంగీకరించి నాకు జ్ఞానదానం చేయండని ప్రార్థించాడు. గురువు, బాలకా! నీకు విద్యనేర్పవలెనన్న, నీవెవరో? మాతాపితలెవరో? నీదే గోత్రమో? ఉత్తమకులజుడవో! కవో! నాకు తెలియవలెను, వాటిని ముందుగా నాకెరిగింపుమని అడిగెను. దానికాబాలకుడు, స్వామీ! అవేవీ నాకు తెలియవు. మాతల్లినడిగి తెలిసికొని వచ్చెదనని చెప్పి, వెళ్ళిపోయెను. అలా వెళ్ళినవాడు, తల్లిదగ్గరకు వెళ్ళి, గురువుగారడిగిన ప్రశ్నలకు జవాబుచెప్పమని యడిగెను. అందుకామె, కుమారా! నీపేరు "సత్యకామ్" నేను జాబాలను ఇంతవరకే నాకు తెలియును. మిగిలినవేమియూ నాకు తెలియవు. ఎందరినో సేవిస్తూ జీవితము గడిపినదానను. నీవెవరివల్ల జన్మించినదీ నేనెఱుగను, యిక కులగోత్రముల విషయములు నాకసలే తెలియవనిచెప్పి, గురువుదగ్గరకు వెళ్ళి, వాస్తవము ఉన్న దున్నట్లుచెప్పి, సత్యకాముడని నీకు నేనుబెట్టిన పేరు సార్థకముచేయుము. విద్య యేకాదు, మరిదేనినాశించియు, వంచనమాటలాడకుమని చెప్పిపంపెను. సత్యకాముడు గురువువద్దకు తిరిగివచ్చి, ఉన్నదున్నట్లుచెప్పి, నాతల్లి జాబాల నేను సత్యకాముడను. కనుక నన్ను "జాబలి సత్యకామ్" గా గుర్తించండి, నాకు విద్యాదానము చేయండని సాష్టాంగదండప్రణామము లాచరించెను.

 

బాలుడు యేమాత్రము జంకుగొంకు లేక నిర్భయముగా సత్యమువచించిన తీరుజూచి, గురువు పరమానందభరితుడై, యేమాత్రము వంచనలేని సత్య వాక్కునకు మించిన అర్హత మరియొకటుండదని గుర్తించి, జాబాలి సత్యకాముని తనశిష్యునిగా చేర్చుకొనెను. ఉపనయనాది అర్హకార్యములన్నీ గురువే నిర్వర్తించి, శిక్షణలో భాగముగా తొలుత, నాలుగువందల బలహీనమైన ఆవులను యెద్దులను అప్పజెప్పి, వాటిని అడవికిదీసుకొనివెళ్ళి, సంరక్షించి, ఆరోగ్యవంతములైన వెయ్యి ఆవులు యెద్దులుగా వృద్ధియైనపిదప తిరిగి రమ్మనెను. గోసంరక్షణాబాధ్యతను సత్యకామ్‍ స్వీకరించి, అడవిలో అనువైన ప్రదేశమునకు వాటిని తరలించుకపోయి, కంటికిరెప్పలావాటిని కాపాడెను. అవి దినదినాభివృద్ధికాజొచ్చెను. అడవిలో సచరిస్తూ జాబాలిసత్యకామ్ ప్రకృతిలోని అణువణువునుండి స్పందనలరూపమున జ్ఞానసముపార్జనము చేయజొచ్చెను. లేచిగుళ్ళు జీవనములోని సౌకమార్యాన్ని జూపించాయి. ఆకులు లయత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వాన్ని జెప్పాయి. సెలయేళ్ళు సతోషానికి శబ్దాన్ని సమకూర్చాయి. ఇలా కాలంగడుస్తుండగా, ఒకఆంబోతును వాయుదేవుడావహించి, జాబాలీ! గోసంతతి నేటికి వేయికిజేరింది. ఇకనీవు మీగురువు చెంతకు వెళ్ళవచ్చు. ఇంతలో నీకు బ్రహ్మజ్ఞానములోని తొలిపాదాన్ని వివరిస్తాను విను, ఈవిశ్వములోని నాలుగుదిక్కులూ బ్రహ్మంలోని భాగమే. పరిశీలించు. గుర్తించు. నేను వాయుదేవుడను, నీకీ బోధచేయుటకే యీ‍ ఆబోతును ఆవహించితినని తెలియజేసెను. జాబాలి కృతజ్ఞతలు తెలిపి నమస్క రించెను. ఇక జాబాలి ఆవులమందను ఆశ్రమమువైపు మరలించి, తిరుగు ప్రయాణము ప్రారంభించెను. సాయంత్రమునకు మందనునిలిపి వాటి సేవా నంతరము అగ్నికార్యము నిర్వర్తించెను. ఆజ్వాలనుండి అగ్నిదేవుడు, వత్సా! నీకు బ్రహ్మజ్ఞానముయొక్క రెండవపాదము వివరించిచెప్పెద వినుము, జగత్తు లో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు అన్నీకూడా బ్రహ్మంలోని భాగాలే. గమనించి, గ్రహించుమని బోధించెను. జబాలి కృతజ్ఞతాభావముతో చేతులు జోడించెను. తెల్లవారి ఆవుల మరలించునంతలో, సూర్యభగవానుడు హంస రూపములో ప్రత్యక్షమై, జాబాలీ! అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు బ్రహ్మ ప్రతిరూపాలే. ఇది బ్రహ్మజ్ఞానంయొక్క మూడవపాదం. గ్రహింతువుగాక! అన్నాడు. చిత్తముదేవా! అని మ్రొక్కినాడు. యిక ఆఖరుగా ప్రాణదేవత "మద్గు" అనే నీటిపక్షిరూపమున దర్శనమిచ్చి, మనిషిఉనికికి ఆధరభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సుకూడా బ్రహ్మలోలి అంతర్భాగాలే. ఇది బ్రహ్మంలోని నాల్గవభాగం. గ్రహించమని బోధించింది. దాన్నీ కృతజ్ఞతతో గ్రహించాడు జాబాలి.

 

వెయ్యికి వృద్ధిజెందియున్న గోసంపదతో ఆశ్రమం ప్రవేశించిన శిష్యుని జూచి గురువు ఆనందపడి, శిష్యుని ముఖవర్చస్సు గనుగొని, నాయనా! జబాలీ, నీవు యిప్పటికే జ్ఞానసంపన్నుడివయ్యావు. ధన్యుడవని దీవించాడు. జబాలి నమస్కరించి, గురుదేవా! జ్ఞనమపారముగదా! నేను నేర్చినది కొంతమాత్రమే. మీనుండి గ్రహించిన విద్యతోగాని సంపూర్ణముగాదని వినయవిధేయతలతో పూజించి, గురువుయొక్క అనుగ్రహమును పొంది, గురూపదేశమున పూర్ణవిద్యావంతుడయ్యెను.

 

గుర్వాజ్ఞనుసారం జాబాలి నర్మదానదీతీరాన (నేటి జబ్బల్పూర్‍ప్రాంతాన) తపమచరించి గృహస్థాశ్రమం స్వీకరించి సరస్వతీతీరాన ఆశ్రమం స్థాపించు కొని, గురుకులం నెలకొల్పాడు. ఈయన గురుకులంలో విద్యతోపాటు సత్ప్రవర్తన, సహనం, సాధుసేవ ముఖ్యగా అభ్యసింపజేసేవాడు. జాబాలి పిప్పలాదమహర్షికి చేసిన ఉపదేశము జాబాల్యోపనిషత్తుగా ప్రసిద్దిగాంచినది. ఇంద్రియనిగ్రహము, సమాహితచిత్తము గలిగిన వివేకవంతుడు తననేత్రములో వుండే దివ్యపురుషుణ్ణి చూడగలుగుతాడన్నాడు జాబాలిమహర్షి. ఇంకా చెబుతూ, ఆదివ్యపురుషుడే ఆత్మ, ఆత్మ భయరహితము. మరణములేనిది. అదే బ్రహ్మముగూడా. నేత్రంలోపడ్డ నెయ్యిగానీ నీరుగానీ తామరాకుమీది నీటి బొట్టులా అంటుకోకుండా రెప్పలలోనికి జారుకుంటుంది. నిస్సంగత్వమునకు యిదే మంచి ఉదాహరణ. జాబాలిమహర్షి బోధననుసరించి, నేత్రపురుషుడే "సంయద్వామ". అంటే ఆకర్షణీయమైన అభ్యుదయములకు లక్ష్యము. ఆపేక్ష నీయములైన సమస్తశుభాలూ అన్నివైపులనుండి వచ్చి యితన్ని చేరుతాయి. ఈవిషయం అవగతమైనవానిని "వామని" అంటారు. సమస్తపుణకర్మల ఫలితాన్నీ యితడు పొందనారంభిస్తాడు. అన్నిలోకాలలో యితడు భాసమానుడై మెలగు తాడు. ఇతడే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మపురుషుడుకూడా. బ్రహ్మజ్ఞానికి అంత్య

క్రియలు చేసినా, చెయకపోయినా తేజోమార్గన్నిపొంది, ఆదిత్య, చంద్ర, విద్యుత్‍ను పొందుతాడు. విద్యుల్లోకాన్నిచేరిన ఉపాసకుడిని, దివ్యబ్రహ్మ

లోకవాసులు వచ్చి సత్యలోకం తీసుకపోతారు. ఇది మళ్ళీతిరిగిరాని మార్గం. ముఖ్యంగా జాబాలి మహర్షి చక్షురంతర్గత జోతిర్మయపురుషునిగా పరబ్రహ్మోపాసన చేయ మంటారు. జాబాలి అనితరసాధ్యమైన గొప్పమహర్షి. గోత్రమేలేని ఒకదాసీ పుత్రుడు, అత్యున్నత ఆధ్యాత్మికస్థితులనందుకొని, తననామమే మహనీయు లెందరికో గోత్రముగా భాసిల్లజేసినాడు.

 

కొన్నిపురాణాలలోకూడా జాబాలిముని పేరున్నట్లుతెలియుచున్నది. రామయణ కావ్యంలో జాబాలి నాస్తికుడుగా కనబడతాడు. భరతుడు అడవికివెళ్ళి, రాముని అయోధ్యకు తిరిగిరమ్మని, రాజ్యాధికారము చేపట్టమని వేడుకుంటాడు. జబాలి మహర్షి భరతుని సమర్థిస్తాడు. ఎక్కడి తండ్రిమాట? లోకమునకు, నీకూకూడా లాభములేని మాటలకేల కట్టుబడెదవు. తిరిగివెళ్ళి రాజ్యమునేలుకొమ్మని సలహా నిచ్చెను. పెద్ద ఉపద్రవము కలుగునప్పుడు, దానిని తప్పించుకొనుటకు ధర్మమును తప్పవచ్చునని వాదించెను. కానీ శ్రీరాముడు జాబాలి మాటలను తృణీకరించి, వనవాసమునకే సిద్ధపడెను. కొందరు జాబాలి ఆదిభారతీయముని యని, తమదేశాన్ని ద్వంసంచేయవచ్చిన ఆర్యఋషులతో పోరాడి, పూర్వపు తమ ఉనికిని రక్షింపనెంచిన సాహసియని చెబుతారు. ఈ ఋషి సామజిక సాంస్కృతిక విప్లవకారుడని, నిజాలుచెప్పే నాస్తికుడుగావుంటూ, అసత్య విషయాలనూ, నమ్మశక్యముగాని ఊహాజనిత విషయలనూచెప్పే కుహనా ఆస్తికులను యెదిరించినవాడని కొందరు నమ్ముతారు. వీటన్నిటినీ గమనిస్తే జాబాలి పేరుతో  ఒకరుగాక కొందరు ఋషులున్నట్లును, వారు యేకాభిప్రాయులు కారనియు తెలియుచున్నది.  

v  

మనగృహము, ఓర్పు మరియు సహనములకు శిక్షణాస్థలము. మనగృహస్థ జీవితములోని విపత్తులను మౌనముగా సహించుట గొప్ప ప్రాయశ్చిత్తము. ఇది అన్నితపస్సుల కన్నా గొప్పది.

                                              .... మహాత్మా శ్రీ రామచంద్ర-షాజహాన్‍పూర్.   

16.జాజలి-తులాధారుడు

 

 

నియమనిష్టలతో మెలగుచూ, అహింసాపరులై తపమాచరించేవారికి సహితం ఒక్కొక్కప్పుడు గర్వం ఆవహిస్తుంది. తానెంతో గొప్పవాడననుకుంటాడు. అంతటితో అతని ఆధ్యాత్మికపురోభివృద్ధి ఆగిపోతుంది. తనదారికి తానే అడ్డు గోడ నిర్మించుకున్నవాడైపోతాడు. ఆస్థితిలో భగవంతుడే వారికి యేదో ఒక రూపంలో, వారినివారు సరిదిద్దుకొనే మార్గాన్ని సూచిస్తాడు. అది గమనించు కొని వారు బాగుపడతారు. లేనివారు చెడిపోతారు. భగవంతుడుమాత్రం అవకాశంమీద అవకాశం కల్పిస్తూనే వుంటాడు. దాన్నందిపుచ్చుకొని మేల్కొని బాగుపడవలసింది మాత్రం మనమేసుమా! ఇటువంటి నీతిదాయకమైన కథే మహాభారతంలోని జాజలి-తులాధారుని వృతాంతము.

 

జాజలి గొప్ప అహింసావాది. తపస్సంపన్నుడు. అతడు నిశ్చలంగా కూర్చొని తపస్సు చేసుకుంటూవుంటే రెండు కళింగపక్షులు అతని తలపైని జుట్టులో గూడుకట్టుకొని గుడ్లుపెట్టి పొదిగి పిల్లలుకూడా లేపాయి. జాజలి ఆ పక్షులకు అసౌకర్యం కలగకుండా కుదురుగా మసలుకుంటూ వాటికి తనతలపై నీడ నిచ్చాడు. వాటి సంతోషాన్ని జూచి తనూ ఆనందించాడు. ఉన్నట్టుండి అతనికో భావన కలిగింది. ఆహా! నేనెంత దయాపరుడను. అసలు అహింసకు నేనే పర మావధిని. నాయంత గొప్పముని యెవరుంటారు? ఈ పక్షులను సురక్షితంగా నేను నాతలపై నివసింపజేయడం యెంతగొప్ప? అనుకున్నాడు. రానురాను ఆభావం ముదిరి గర్వంగా మారిపోయింది. అప్పుడు భగవానుడు, ఆకాశవాణి రూపంలో ఒక హెచ్చరికజేశాడు. ఓజాజలీ! నీగొప్ప ఒకగొప్పకాదు. కాశిలో తులాధారుడనే వ్యాపారియున్నాడు. అతడు నిజమైన గొప్పవాడు. వెళ్ళి అతన్ని కలుసుకుంటే నీకు మేలుకలుగుతుంది అని పలికింది ఆకాశవాణి. నాకన్నా గొప్పవాడా! అదీ ఒకవర్తకుడా! వెళ్ళి చూడవలసిండేనని, కాశికి బయలుదేరి, వెళ్ళి తులాధారుని అంగడి యెక్కడో విచారించి తెలుసుకొని అతన్ని చూడ బోయాడు. జాజలి తనవద్ధకు రావడం గమనించి, యెదురుబోయడు తులా ధారుడు. నమస్కరించి, రండి జాజలిమహాశయా! రండి, అని అహ్వానించి, మీ గొప్పదనం యింతాఅంతగాదు, ఆహా!

 

తే:   పిచ్చికలు గూడు శిరమునబెట్టి తారు

       బిల్లలును సుఖలీల వర్తిల్లు చుండ

       చిత్తవికృతిలేకెట్టుల సేయుదయ్య

       తపము సంభావనీయ వర్తనుడవీవు.               శాంతి-5-226..

 

తలపై గూడుకట్టుకొని పిచ్చికలు జీవిస్తున్నా యేమాత్రం చీకాకుపడకుండా, తపస్సు కొనసాగిస్తున్నావుగదా! నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవలసిందే! నన్నాడు తులాధారుడు. జాజలికి అశ్చర్యమేసింది. తాను చెప్పకుండానే తన విషయ మంతా యితనికి తెలిసిపోయిందే! ఆకాశవాణి   చెప్పినట్లు యితడు నాకంటే యెంతో గొప్పవాడని గ్రహించినవాడై, పుణ్యాత్మా! మీరు చాలాగొప్పవారని ఆకాశవాణివల్ల తెలుసుకొని, మీ దర్శనంకోరి వచ్చినాను. మీరుచూస్తే సామాన్య వర్తకులుగా కనిపిస్తున్నారు. మీ కింత ఆధ్యాత్మికోన్నతి కలగటానికి హెతువేమి? మహాత్మా! నాయందు కృపజూపి వివరించండి, అన్నాడు. సరే! అడిగినవారికి చెప్పడం నాధర్మం. చెబుతాను, రండి, మా ఆతిథ్యం స్వీకరించండని యింటికి తీసుకబోయి, గౌరవించి, అన్నపానాదులైనతర్వాత, సుఖాసనమున కూర్చుండ నిచ్చి తనజీవన విధానాన్ని వివరించాడు తులధారుడు.

 

సీ:   విలచుట నమ్ముట నొలయదు వంచన

            యర్హలాభాంబున యనుభవింతు

      సరిసిద్ధ్యసిద్ధులు సమలోష్ట కాంచన

            మైయుండు మనసు నిందాభినుతులు

      హింసయు నాత్మప్రశంశయు లేవు భూ

             తంబులయందెల్ల దయఘటిల్లు

      నభయదక్షిణమగు నంచిత సత్యయా

            గము సెల్లు గోర భోగమును యశము

 

తే:    నెవ్వరికి మేలుసేసిన నింతసేసి

        నాడ ననుబుద్ధి మమత యెన్నండు నాకు

        గలుగదేమిట నేనియు వలపు నొల్ల

        మియును బుట్టదు నిక్క మింతయు మహాత్మ.         శాంతి-5-228.

 

నేను సామాన్యమైన వ్యాపారిని. అమ్మకంలోనూ కొనడంలోనూ మోసం చేయను. న్యాయమైన లాభాన్ని స్వీకరిస్తాను. నష్టాలకు వెరవను. బంగారమైనా, మట్టిగడ్డైనా నాకొక్కటే. నిందించినా, ప్రేమించినా నేనొక్కటిగానే భావిస్తాను. హింసచేయను. నన్నునేను ఘనుడని యెప్పుడూ అనుకోను. అన్నిజీవులపట్ల నాకు సానుభూతికలదు. నేను సత్యాన్నే యాగంగా భావించి దానివలన భీతిలేని గుణాన్ని దక్షిణగా పొందుతున్నాను. భోగభాగ్యాలు నాకవసరంలేదు. కీర్తి నాశించను. చేసినమేలును గొప్పగాభావించను. కర్తవ్యంగా తలచి చేస్తాను. మమకారం చేరనివ్వను. ఎవరిమీదా, దేనిమీదనాకు యిష్టంగాని ద్వేషంగానీ లేవు. ఇదీ నా వర్తనము, అన్నాడు తులాధరుడు. అయ్యా! మీరు గొప్పవని చెప్ప బడిన యజ్ఞయాగాదులుగానీ, తీర్థయాత్రాసేవనముగాని చేసినట్లు చెప్పడం లేదు. అవి అవసరంలేదనుకున్నారా? అడిగాడు జాజలి. అందుకు ప్రత్యుత్తరంగా తులాధారుడు, స్వామీ!

 

:  లోకంబెల్లను నే జి

      త్రాకారముగాగజూతు నట్లగుట మనం

      బేకార్యములం దగలదు

      కోకనద దళాంబుబిందు గుణమొనరంగన్.       శాంతి-5-229.

 

ఆవె:   నిత్యతృప్తుడైన సత్యయజ్ఞునియెడ

           దేవతలును నధికతృప్తు లగుదు

           రమరతృప్తి వలన నవ్యయానందంబు

           సంఘటిల్లుజూవె సంయమీంద్ర.                       శాంతి-5-233.

 

లోకాన్నంతానేను ఒకచిత్రంగా చూస్తున్నాను. కనుక నేను యేకార్యమునందు గూడా తగనిరీతి తగులుకోవడంలేదు. చెంగల్వపూరేకుమీది నీటిబిందువువలె నే నుండగలుగుతున్నాను. సదా తృప్తితో సత్యమే యజ్ఞంగా భావించి ఆచరించే వాని నడతను దేవతలు మెచ్చుకుంటారు. అటువంటి వారినిజూచి సంతోషిస్తారు. అందువల్ల నిత్యానందాన్ని పొందగలమని వివరించి, యింకా యిలా చెప్పారు.

 

:  ధర్మారాముడు సంతత

     ధర్మసఖుడునై యసంగతా నిష్టమతిన్

     నిర్మలుడగువానికి ని

     ష్కర్మత్వానంద సిద్ధి గలుగు మునీంద్రా.        శాంతి-5-235.

 

ద్తర్మానురక్తి గలవాడు, అనునిత్యం ధర్మమునకనుకూలుడైనవాడు, యితరముల యందు అనాసక్తిగలిగి స్వచ్ఛమైనజీవితం గడుపుతాడు. అట్టివానికి కర్మఫల రహితమగు ఆనందస్థితి కలుగుతుంది. మునీంద్రా! నాకు కనిపించే కొండలూ, నదులూ ఒకటేమిటి సర్వప్రకృతీ పవిత్రంగనే గోచరిస్తున్నవి. ప్రత్యేకంగా వున్న పవిత్రస్థలం అంటూ నాకేదీలేదు. సర్వం పవిత్రమే. అందుకే నాకేతీర్థసేవా, అవసరమనిపించలేదు. నాకు తెలిసిన విషయాలు తెలియజేశాను. అంతెందుకూ, నీతలపైని పక్షులు నీకు ధర్మోపదేశం చేయగలవు. వాటినే అడుగుమనెను. జాజలి పిలవగనే అవి ఆకాశమునకెగిరి నిలిచి, మునీంద్రా! మేము ధర్మదేవత పంపగా నీ సహనము పరీక్షింప వచ్చితిమి. ఈ తులాధారుడు చెప్పినది అక్షరసత్యము. నీవు అయనననుసరింపుము, ముక్తిపొందెదవు. ఓ మునీ! నీవు మాత్సర్యం విడనాడుము. స్పర్థ దుర్గుణముగా మారవచ్చును. దాని యెడల జగరూకుడవై మెలగుమని హితవుజెప్పి, పక్షులు యెగిరిపోయెను.

 

తులాధారుడు జాజలిలోని వినయవిధేయతలు, అతనిలోకలిగిన మార్పునూ, గమనించి బ్రహ్మగీత నుపదేశించెను. బ్రహ్మగీత శ్రద్ధ, శుచి గురించి వివరించి చెప్పును. యజ్ఞమనగా తులాధారుని భావమున నిస్వార్థ లోకోపకార సత్కార్యము. అట్టి యజ్ఞమునకు శ్రద్ధ ముఖ్యము. శుచి లేకున్నా శ్రద్ధతో చేసినపని సత్ఫలితాన్నిస్తుంది.

 

ఆవె:   వినుము శ్రద్ధగలుగు మనుజుండు పాపంబు

           దొలగద్రోవ నేర్చు దోలుడిగ్గ

           నూడ్వ వెరవుగలుగు నురగంబు చాడ్పున

           గాన మేలు శ్రద్ధధానుడగుట.                                      శాంతి-5-251.

 

శ్రద్ధయనగా అచంచల విశ్వాసము. దానివలన కార్యసిద్ధి గలిగితీరుతుంది. అంతేగాదు పాము అతిసహజంగా సులువుగా తన కుబుసాన్ని వదిలివేసినట్లు, మనుజుడు శ్రద్ధాసక్తుడై పాపన్ని వదిలించుకుంటాడు. శ్రద్ధవల్ల మనసు యితరములపై పోనొల్లదు. అందుచేత మాత్సర్యం మటుమాయమై మోక్షానికి దారి సుగమం చేస్తుందని తెలియజెప్పాడు తులాధారుడు. జాజలిముని విషయములన్నీ శ్రద్ధగావిని వివేకవంతుడై, తులాధారమహానుభావా! ముందుగా నేను సద్గురువులనాశ్రయించి, సరియైన సత్యాన్వేషణ చేయనైతిని. నేడు మీవలన నా మనసునకంటిన మలినము తొలగిపోయినది. అహం కారము నశించినది. నిర్మలహృదయుడనైతినని కృతజ్ఞతాపూర్వకముగా నమస్కరించి జాజలిముని తన నిజస్థానమునకరిగెను.  

 

 

 

 

 

17.దైవీయశక్తులు

 

ఆధ్యత్మికసాధనా మార్గంలో అనేక దివ్యశక్తులు మనిషికి లభిస్తాయంటారు. కానీ చాలామంది సాధకులు మాకలాంటి శక్తులు లభించలేదని వాపోతూవుంటారు కూడా. ఏశక్తులూ లేకున్నా, ఉన్నాయని యితరులను మోసగించే కుహనా స్వాములూ ఉన్నారు. ఇంతకూ ఎవరికి యీ దైవీయశక్తులు లభిస్తాయో ఆలో చించాలి. దైవీయశక్తులు లభించడంవల్ల సాధకునిలో గర్వంపెంపొంది, ఆధ్యా త్మికసాధన కుంటుబడుతుంది. అందుకనే సద్గురువులు తమశిష్యులలో అటు వంటిశక్తులు పొడసూపకుండా అవతలికి దాటించి, ఆధ్యాత్మికమార్గంలో శిష్యులను గమ్యంచేరుస్తుంటారు. దివ్యమైనశక్తులుగల మహాపురుషులూ లేక పోలేదు. వారికెందుచేత అవి లభ్యమైయుంటాయన్నది ప్రశ్న. నిజానికి దివ్య శక్తులు హస్తగతమైన వారిస్థితి వేరు. వారు అహంకారం పూర్తిగా తొలగి పోయినవారై వుంటారు. స్వపరభేదభావం లేనివారైవుంటారు. ప్రేమమయు లై వుంటారు. క్షమాగుణానికి మారుపేరైవుంటారు. ప్రకృతికార్యకలాపాలలో సాధ్య మైనంతవరకు హస్తక్షేపం చేయనివారైవుంటారు. తనవారనుకున్నవారికి సైతం కలిగే కష్టనష్టాలను తీర్చగలిగికూడా సంయమనంతో చూస్తూవుండగల వారై వుంటారు. దైవాజ్ఞానుసారం లోకకల్యాణకారకులను తమకేమీ సంబంధం లేక పోయినా కాపాడుతూవుంటారు. అవసరమైతే అట్టిపరోపకారులకు తమ ఆయుష్సునుసైతం ధారపోసి జీవింపజేస్తుంటారు. తమకోసం ప్రత్యేకంగా యే అవకాశాన్ని వినియోగించుకోరు. తప్పుదారిన నడిచేవారికి అనేక అవకాశాలు కల్పించి, వారు బాగుపడటానికి సహకరిస్తారు. అంతేగానీ సులభంగా ఆగ్రహనికి గురై శపింపబోరు. ఒకవేళ వారికి యెవరైనా కోపము తెప్పించినా, అది క్షణికమే, మరుక్షణంలో వారు శాంతస్వరూపులైపోతారు. ఆ క్షణికకోపం కూడా యెదోఒక మేలు సమకూర్చిపెడుతుంది. ఎంతకూ తమనితాము సరిదిద్దు కొనక, బాగుపడడానికి సమ్మతించనివారిని శిక్షించడానికి వెనుకాడరు. అది కూడా అ దూర్తులు సజ్జనులను పీడిచడానికి పూనుకున్నపుడే శిక్షిస్తారు. అప్పుడు కూడా వారిలో యే కోపతాపాలువుండవు. చెడ్డవారిని సరిదిద్ధడానికే ఆ శిక్షలు ఉద్దేశించబడివుంటాయి. ఇన్నీ వారుచేస్తున్నా యేమాత్రం పేరుప్రతిష్టలకోసం ప్రాకులాడరు. సంపదకుబ్బిపోరు. లేమికి చించించరు. సమతనువీడి చరించరు. సాధనద్వారా యిన్ని గొప్పగుణాలను సాధించినవారు గనుకనే వారిచేతికి భగవంతుడు దివ్యశక్తులనిస్తాడు. ఒకమాటలో చెప్పాలంటే అట్టిమహనీయుని ద్వారానే భగవంతుడు లోకాలను పాలిస్తున్నాడు. మరోమాటలో చెప్పలంటే అతడే భగవంతుడు. భగవంతుడే అతడు. "దైవం మానుషరూపేణ" అంటే యిదే కాబోలు. ఇట్టి మహనీయులు వారిగొప్పదనం వారు చెప్పుకోరు. ఇతరులూ వారిని గమనించలేరు. అందుకే మహాత్ముడంటే "అందరిచేతా నిరాదరింప బడినవాడు" అని నిర్వచించారు శ్రీరామచంద్రజీ మహరాజ్‍వారు.

 

ఒకసారి శ్రీమళయాళస్వామివారు ఆశ్రమంలో కూర్చొనివుండగా, ఒకశిష్యుడు ఆయన దగ్గరగావచ్చి, స్వామీ! అడుగో! అశ్రమంలోనికి వస్తున్న ఆవ్యక్తి నాస్తి కుడు. అతనితో మీరు యెక్కువసేపు మాట్లాడకండి. అతడు మనల్ని విమర్శిస్తూ వుంటాడు. ఓమాట మాట్లాడి పంపేయండి, అన్నాడు. ఓహో!  అలాగా అతడు దేవుడులేడని వాదిస్తాడా!  సరే దానిదేముంది, అదీఒక భావనే గదా! ఆభావనా వుండవలసిందే! మనం దేవుడున్నాడు అంటూన్నాం. ఇదీ ఒకభావనేమరి. రానీలే, దేవుడులేడని వాదించి వాదించి అలసిపోయాడుపాపం. మన ఆశ్రమం లో కాస్తా విశ్రాంతితీసుకొని వెళతాడు. రానీలే, అన్నాడట, మళయాళస్వాముల వారు. అదీ వారి సహనం, సంయమనం. ఏదైనా హద్దుల్లో ఉన్నంతవరకే, హద్దు లుమీరితే పడేశిక్ష పడితీరుతుంది. దుర్మార్గానికికూడా ఒకహద్దు ఉంటుంది. ఈవిషయాన్నే శ్రీరామచంద్రజీ వారు ఒకసందర్భములోచెబుతూ “మొక్కకు ముల్లు గట్టిగా పొడవుగా పెరిగిందంటే, దాన్ని కత్తిరించి వేయాల్సిందే, తప్పదు. అసలు గుర్తుంచుకోవలసిన  విషయమేమిటంటే, స్వార్థం యింతోఅంతో అందరిలోనూ వుంటుంది. కానీ అది హద్దుమీరితేనే దోషమౌతుంది. జాగ్రత్తా! స్వార్థం కాసింత హద్దు మీరినా ఆధ్యాత్మిక జీవనం దోషభూయిష్టమౌతుంది. ఇది బాగా గుర్తుంచుకోవలసిన ముఖ్యవిషయం.”  అందుకేయెప్పుడూ మహాత్ములు తొందరపడరు. సమయం, సందర్భం గమనించే వారు స్పందిస్తారు.

 

ఈవిషయాన్ని  విషదపరచే ఒక సూఫీ గురుశిష్యులకథవుంది. అదేమిటో తెలుసు కుందాం. ఒకరోజు గురువుదగ్గరికెళ్ళి శిష్యుడు, గురువర్యా! మీరు చాలాశక్తి మంతులు. అదినాకు బాగాతెలుసు. దయచేసి నాకూ ఆశక్తులు వశమయ్యేట్టు చేయండి. వాటితోనేను లోకోపకారం చేస్తాను అన్నాడు. ఆసూఫీగురువు ఒక నిముషం ఆలోచించి, ఈవిషయం రేపుసాయంత్రం మాట్లాడుకుందాం. రేపు నీవొకపని చెయ్యి, మట్టమధ్యాహ్నం శ్మశానానికి వెళ్ళు. ఒకసమాధిచాటున యెవ్వరికీ కనబడకుండా కూర్చొని నిశ్శబ్దంగా అక్కడజరిగే సంఘటన చూడు. ఏమాత్రం అక్కడజరిగే సంఘటనలో జోక్యంచేసుకోకు, వచ్చి, యేంజరిగిందో చూసింది చూసినట్లు నాకుచెప్పు అన్నాడు. సరేనని శిష్యుడు గురువుచెప్పినట్లు సమాధిచాటున దాక్కొని గమనిస్తున్నాడు. ఇంతలో ఒక పండుమసలాయన తన గాడిదపై కట్టెలమోపు నుంచుకొని శ్మశానందారిన ప్రయాసపడుతూ వస్తు న్నాడు. ఇంతలో ఒక బలిష్టుడైన దొంగ వచ్చి ముసలాయన్ను క్రిందపడ దోసి, తిట్టికొట్టి కట్టెలమోపును యెత్తుకపోసాగాడు. ముసలాయన తనకట్టెలు తన కిమ్మని బ్రతిమలాడుకొంటున్నాడు. కానీ ఆ దొంగ వినలేదు, యింకోరెండు తన్నులు ముసలయన్ని తన్ని వెళ్ళిపోయాడు. పాపం ముసలాయన దుమ్ము దులుపుకొని చిన్నగా గాడిదనుతోలుకొని యింటిదారిపట్టాడు. సమాధిచాటునున్న శిష్యుడికి చాలాకోపంవచ్చింది. ముసలాయన కష్టపడి తెచ్చుకున్న కట్టెలమోపును తీసికెళ్ళిన ఆ దొంగను ఉతికిపారేయాలన్నంత ఆవేశంతో ఊగిపోయాడు. కానీ గురువాజ్ఞ మీరలేక ఊరకుండిపోయాడు. సాయంత్రం గురువుదగ్గరికెళ్ళి, చూచిందిచూచినట్లు చెప్పి, గురువర్యా! నాకే మీరు శక్తిప్రసాదించివుంటే ఆ దొంగవెధవను అక్కడికక్కడే భస్మంచేసివుందును. అంత కోపమొచ్చిందినాకు అన్నాడు. నాయనా శిష్యా! ఆముసలాయన యెవరో తెలుసా? అని అడిగాడు గురువు. శిష్యుడు తెలియదు గురూ! అన్నాడు. అప్పుడు ఆ గురువు నెమ్మదిగా, "ఆయన మా గురుదేవులు, ఆయన చలువవల్లనే నే నింత వాడనయ్యాను. నాకున్నాయనుకుంటున్న శక్తులన్నీ ఆయన ప్రసాదమే సుమా!" అన్నాడు. శిష్యుడు ఆమటవిని అవాక్కయ్యాడు. అప్పుడర్థమైంది, ఆ పరమ గురువు శక్తిమంతుడైవుండి కూడా యెందుకంత శాంతివహించాడో. తను సాధనద్వారా యింకాయెంత శాంతం, సహనం వృద్ధిచేసుకోవాలో, అహం యింకాయెంత నశించాలో అర్థమై, గురువుకాళ్ళపై బడ్డాడు. శక్తులు మనం కోరుకోవడంకాదు, భగవంతుడే యోగ్యతను గుర్తించి ప్రసాదిస్తాడు.  

 

v 

 

సత్యతత్త్వం సాధించాలంటే, ఒకబలమైన యిచ్ఛాశక్తి అవసరం. దృఢ సంకల్పంతో రంగప్రవేశంచేస్తే సగందూరం దాటినట్లే. అతనినింకేశక్తి అడ్డగించలేదు. కనుక నావల్లకాదన్న నిరాశను వదిలేయండి.

 

                                                     .......   శ్రీ రామచంద్రజీ- షాజహాన్‍పూర్  

 

18.యుయుత్సుడు

 

లోకంలో అనేకమనస్తత్త్వాలుగల మనుషులుంటారు. మహాభారతంలో అన్ని మనస్తత్త్వాలకూ ప్రతీకలుగా పాత్రలున్నాయి. కొన్నిపాత్రలు మనకు విశేషంగా కనబడినా, కొన్నిమాత్రం వెతికి కనుగొనవలసి వస్తుంది. అటువంటిదే "యుయుత్సుని" పాత్ర. యుయుత్సుడు ధృతరాష్ట్రుని కొడుకే కానీ గాంధారి పుత్రుడు మాత్రంకాడు. ఆ కారణం చేతనే చిన్నచూపు చూడబడ్డాడు. గాంధారి గర్భంధరించి రెండేళైనా ప్రసవించలేదు. ధృతరాష్ట్రుడు కొంతనిరాశకులోనై, తన దాసీలలో ఒకరైన "సుఖద" అనే వైశ్యకన్యను వివాహమాడి యుయుత్సుని గన్నాడు. యుయుత్సుడు, భీముడు, దుర్యోధనుడు యీ ముగ్గురూ ఒకేదినమున జన్మించారు. వీళ్ళకంటే ముందుపుట్టినవాడు ధర్మరాజు.

 

క:   అనిలజు పుట్టిన దివసము

        ననయట దుర్యోధనుండు నరనుత ధృతరా

       ష్ట్రునకున్ గంధారికి న

       గ్రనందనుడు ఘనుడు పుట్టె గలియంశమునన్......   భార-ఆది-5-105.

 

వ: మఱియు దుర్యోధన జన్మాంతరంబున ధృతరాష్ట్రునకు వైశ్యాపుత్రుండైన యుయుత్సుండు పుట్టె, నంత గాంధారికి నొక్కొక్క దివసంబున నొక్కక్క రుడుగా దుశ్శాసన, దుస్సహ...... పుట్టిరి.  (భార-ఆది-5-106 ).

 

ఈ భారతవచనాన్ని బట్టి దుర్యోధనుని తర్వాతే యుయుత్సుడు పుట్టినా డను కోవాలి. కొందరు యుయుత్సుడే పెద్దవాడన్న వారూ లేకపోలేదు. ఏదియేమై నప్పటికీ యితణ్ణి కౌరవులు దాసీపుత్రునిగనే చూశారు. తమతో సమానమైన గౌరవమివ్వలేదు. అయినా యుయుత్సుడు యేనాడూ నిరాశానిస్పృహలకు లోనుకాలేదు. సకలవిద్యలు, సకలధర్మాలు ఔపోసనపట్టాడు. అతిరథ మహా రథస్థాయి వీరులకు తీసిపోని రణవిద్యాపారంగతుడైనాడు. అసలు యుయుత్సుడు అంటేనే పోరాటానికి సిద్ధంగావుండేవాడని అర్థం. ఒకేసారి పదివేలమంది యోధులతో పోరాడగల శక్తిమంతుడితడు. అంతేకాదు అన్యాయాన్ని చూస్తూ ఊరకుండడం యితని చరిత్రలో లేనేలేదు. భీమునిపై కౌరవులు చేసిన విషజల ప్రయోగం విఫలంకావడానికి యుయుత్సుడే కారణం. అంతేగాదు ద్రౌపదివస్త్రాపహరణ వేళ వికర్ణునితోపాటు యితడూ తగదని వాదించినాడు.              

 

రాజకుటుంబంలో తగిన ప్రాధాన్యత లేనందువల్ల, తల్లినుండి వ్యాపార లక్షణాలను గ్రహించినవాడై వాణిజ్యమునందు సహితము ఆరితేరినాడు యుయుత్సుడు. వస్తువుల యెగుమతి దిగుమతుల కొఱకు బిడారులు నడిపి నాడు. వాటి రక్షణనిమిత్తం లక్షమంది సైన్యాన్ని పోషించాడు. కరువు కాటకాల సమయంలో హస్తినాపురరాజ్యానికే ఋణాలిచ్చి అనేకగ్రామలను తాకట్టూగా గ్రహించాడు. పాండవులకు అవసరమైనప్పుడు మెరికల్లాంటి సైనికులను అద్దె కిచ్చాడు కూడా. ఇతని వ్యవహారశైలి అత్యంతనీతివంత మైనందువల్ల భీష్మ ద్రోణాదులకు సైతం దుర్యోధనుడు రగద్వేషాల నంటగట్టెనేగానీ యుయుత్సుని యెన్నడూ నిందించలేదు.

 

కురుక్షేత్రసంగ్రామం ప్రారంభమయ్యే ముందు ధర్మరాజు కౌరవసైన్యము నుద్దేసించి యీవిధంగా పలికాడు...

 

తే: మమ్మునెమ్మిమై గలయ చిత్తమ్ముగలుగు

    వారలెవ్వరు గలిగిన వచ్చి కలయు

    డట్టివారిని నాతమ్ములంత వారి

    గాగ బాటింతు నెంతయు గారవమున ..    భార-భీష్మ-167.

 

 వ:  ....యుయుత్సుండేను వచ్చెద, నన్నుంగలిపికొమ్మని పలికిన దానికిం బాండవాగ్రజుండు ప్రియంబందిన పలుకులు పలుకుటయును, నతండు దుర్యోధనాదుల దుశ్చేష్టితంబు లుగ్గడించుచు, గౌంతేయుల గుణంబు లగ్గించుచు, నిజసేనాసమేతంబుగా నిస్సణాదిరావంబులు సెలంగగంజని, ధర్మనందను బలంబులం గలసె.... (భార-భీష్మ-168)

 

ఎవరైనా మావైపునకు వచ్చి మాతోకలసి కౌరవులతో యుద్ధంచేయదలిస్తే వచ్చేయండి. అలా వచ్చిన వారు నాతమ్ములతో సమానమైన గౌరవం పొందుతారనగానే, యుయుత్సుడు కౌరవులయెడ న్యాయంలేదని, పాండవులే ధర్మపరులని బహిరంగంగా పలికి తన సైన్యంతోసహా వచ్చి పాండవసైన్యంలో కలసిపోయాడు. కౌరవుల కుటిలమర్మములనెల్ల పాండవులకు తెలియజెప్పి, ధర్మయుద్ధంచేసి పాండవవిజయానికి శాయశక్తుల సహయపడ్డాడు. ఆభిమన్యు వధతో క్రుంగిపోయిన పాండవులకు ధైర్యంచెప్పి, తిరిగిపోరడేవిధంగా వీరత్వం నూరిపోశాడు. కడకు యుద్ధంలో అటు పదునొకండుఅక్షోహిణీలు, యిటు యేడక్షోహిణీలు మొత్తం పద్దెనిమిది అక్షోహిణీల సైన్యం నశించిపోగ, పంచ పాండవులూ, కృష్ణుడు, సాత్యకి, కృతవర్మ, కృపాచర్యులు, అశ్వద్ధామతోపాటు యుయుత్సుడు మాత్రమే మిగిలారు. అంటే ధృతరాష్ట్రునకు ఒకకొడుకు బ్రతికే యుండెననుట మనం గమనించదగ్గ విషయము.

 

యుయుత్సుతునియందు ధర్మరాజుకు అపారమైన విశ్వాసమున్నది. ధర్మరాజు రాజైనతర్వాత కొన్నాళ్ళకు ధృతరాష్ట్రుడు తపోవనాలకు వెళ్ళిపోయడు. అతని వెంట గంధారేకాదు పాండవమాత కుంతికుడా వెళ్ళింది. వాళ్ళను చూడటానికి ధర్మరాజు తనతమ్ములు మరియు పరివారసహితంగా ధృతరాష్ట్రుని అశ్రమానికి వెళ్ళారు. వెళ్ళివచ్చేవరకు రాజ్యభారం వహించమని యుయుత్సుని నియమించి వెళ్ళాడు. అదీ యుయుత్సునిపై ధర్మరాజుకున్న నమ్మకం. అంతేకాదు పాండవులు ద్రౌపదితోసహా రాజ్యంవిడచి మహాప్రస్థానం (తిరిగిరాని ప్రయాణం) జేసే సమయంలో బాలుడైన పరీక్షిత్తును (అభిమన్యు పుత్రుని) రాజునుచేసి, రాజ్య సంరక్షణాభారం మొత్తం యుయుత్సునికే అప్పజెప్పాడు ధర్మరాజు. కుటుంబ వ్యవహారాలతోసహా సర్వాధికారాలూ ఆయనకే యివ్వబడ్డాయి.

 

చ: .. దెలివగ్గలింప నెఱిగించె యుయుత్సునకవ్విశేషమున్. . ( భార-మహా-1-7)

 

క:   ఎఱిగించి రాజ్యతంత్రము

       తెఱగుపరచి నడపువెరవు తేటపడంగా

       గఱపి గృహాంతశ్చరితము

       నెఱి నుపదేశించె నధిప నెయ్యంబలరన్......      భార-మహా-1-8.

 

క:   ఆయనుజుని నట్ల మహా

       నాయకుగాజేసి భటజనము గూర్చి మహీ

       నాయకు డార్యులు కీర్తన

       సేయ బరీక్షితుని రాజుజేసె ధరణికిన్...        భార-మహా-1-9.

 

ఆసమయంలో అనుకునుంటే యుయుత్సుడు రాజ్యన్ని కబళించి యుండవచ్చు. కానీ యుయుత్సుడు మాత్రం ధర్మరాజు అప్పజెప్పిన కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించాడు. అప్పుడేకాదు పరీక్షీన్మహారాజు కూడా తాను శాపగ్రస్తుడై తక్షక సర్పంకాటువల్ల మరణిస్తానని తెలిసినప్పుడు కేవలం పదమూడేళ్ళ కొడుకు జనమేజయుని రాజునుజేసి రాజ్యపరిపాలనాభారం యుయుత్సునికే అప్ప జెప్పాడు.  యుయుత్సుడు  రాజుకాకపోయినా సుదీర్ఘకాలం రాజ్యపాలన గావించి హస్తినాపురవైభవాన్ని సంరక్షించాడు. మహోదాత్తచరితుడుగా మహాభారతంలో యుయుత్సుడు నిలచిపోయాడు.  

         

v 

 

నీ ప్రవర్తనలో యిసుకరేణువంత పాపమున కీదినము అవకాశమిచ్చినచో రేపటికదియే  మహామేరువంత యగును

                                                                         ........సద్గురు శ్రీమళయాళస్వామి

19.కుచేలుడు

 

 

కుచేలుడంటే మంచివస్త్రములు లేనివాడని అర్థం. అంటే చిరిగిపోయిన దుస్తులు గలవాడన్నమాట. ఇది అతని పేదరికమును తెలుపు మాటే యైనా, అధ్యాత్మి కముగ యిందుకు మంచి అర్థమున్నది. భగవద్గీత దేహమును వస్త్రముతో పోల్చి, అది సిధిలమైతే ఆత్మ దాన్నివదలి, నూతనవస్త్రము   ధరించినట్లు మనిషి చచ్చి క్రొత్తవస్త్రము (క్రొత్త దేహము) తో మళ్ళీపుట్టుచున్నాడనెను. అంటే యీ దేహము ఆత్మను అవరించియున్న ఒకతొడుగన్నమాట. కుచేలునిలో ఆతొడుగు పుర్తిగా సిధిలమై లోపలి ఆత్మవెలుగును దాచలేకపోవడంవల్ల, ఆవెలుగు బహిర్గతమౌతున్నదన్నమాట. ఆత్మవెలుగు బయటికి కనబరచుచున్నవాడు కుచేలుడని మనమర్థంచేసుకోవాలి. నిజానికి అతనిపేరు సుధాముడు. మంచికి నెలవైనవాడు. ఇతడు నిరుపేదబ్రాహ్మణుడు. అధికసంతానంగలవాడు. బిడ్డలు ఆకలితో అలమటించడం చూడలేక, భార్యవామాక్షి కలుగజేసుకొని స్వామీ! మీకు శ్రీకృష్ణుడు మంచిమిత్రుడుగదా! ఆయనసహాయంతో మనమీ పేదరికం నుండి బయటపడలేమా? ఆలోచించండి. ఆయన దీనజనబాంధవుడని విన్నాను. అంతేగాదు...

 

మ:   కలలోనం దనను మున్నెఱుంగని మహాకష్టాత్ముడైనట్టి దు

         ర్బలు డాపత్సమయంబునన్ నిజపదాబ్జతంబు లుల్లంబులో

        దలపన్నంతన మెచ్చి యర్తిహరుడై తన్నైన నిచ్చున్ సుని

        శ్చలభక్తిన్ భజియించువారి కిడడే సంపద్విశేషోన్నతుల్?

                                                                    ....   భాగ-10-2-971.

 

కలలోకూడా ఆయన్ను తలవనివాడైనా, ఆపదకువెఱచి కృష్ణా! అన్నాసరే పొంగిపోయి తన్నుతాను సమర్పించుకొనైనా కపాడతాడని కీర్తింప బడు తున్నాడు. మీరు నిశ్చలమైన భక్తితో ఆయన్ను కొలుస్తున్నారు. మీకు ఆయన తప్పక సహాయపడతాడు. ఒకసారి ఆయనదగ్గరకు వెళ్ళిరండి అన్నది. అర్థించడం అంతగా యిష్టంలేనివాడైనా, పరిస్థితులకు తలయొగ్గి, కృష్ణుడున్న కుశస్థలికి బయలుదేరడానికి సిద్ధపద్దాడు. వెళుతున్నసమయంలో ఉత్తచేతులతో వెళ్ళడం బాగుండదని భార్య అటుకులు ఆయనపైపంచలో మూటగట్టింది. ఆమె ఆ చిరుగులవస్త్రాన్ని మూడుమడతలు వేస్తేనేగానీ అటుకులు జారిపోకుండా మూట కట్టలేకపోయింది. అంతటి కుచేలుడీ సుధాముడు. ప్రయాణమైతే అయ్యడుగాని, దారిలో అనేకసందేహాలు అతనిమనసులో మెదలుతున్నాయి. నన్నక్కడ రానిస్తారోలేదో? ద్వారపాలకులకు యేదైనా కానుకగాయిచ్చి, వారిని మంచి జేసుకొని వెళదామంటే, చేతిలో కాసుగూడాలేని బికారిని. ఏంచేద్దాం? అనుకుంటూవెళ్ళాడేగాని అక్కడ అటువంటి చిక్కులేమీ యెదురుగాలేదు. దీనుని కిటువంటి ఆలోచనరావడం సహజం, భగవంతుని సన్నిధిలో యేచిక్కులూ లేక పోవడం వాస్తవం. శ్రీకృష్ణుడే యితనిరాకను గమనించి యెదురొచ్చి అంతఃపురం లోనికి సంతోషంగా పిలుచుకపోయాడు. స్నానపానాదులను సైతం తనే దగ్గరుండిచేయించి, తానుశయనించే తల్పంపైన కూర్చొండబెట్టాడు కృష్ణుడు. ఇంతలో కృష్ణసతిరుక్మిణీదేవి విషయంతెలిసివచ్చి, భర్తస్నేహితుడొచ్చాడని ఫలహారాలుసమకూర్చి, తనే వీవనతోవీస్తూ సేదదీర్చింది. కృష్ణుడు సంతోషంగా అతనితో ముచ్చటిస్తున్నాడు. అదిగమనించి అంతఃపురస్త్రీలు ఆశ్చర్యపోయి తమలోతాము యిలా అనుకున్నారట.

 

ఉ: ఏమితపంబు జేసెనొకొ యీధరణీ దివిజోత్తమండు తొల్

       బామున! యోగివిస్ఫురదుపాస్యకుడై తనరారు నీ జగ

      త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవా

      డీ మహనీయమార్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్

                                                                                         ...భాగ-10-2-985.

ఆహా! ఈ బ్రాహ్మణుడు తొలిజన్మలో యెంతోతపస్సు జేసివుంటాడు. లేకుంటే మహయోగులచేత పూజలందుకొనే కృష్ణపరమాత్మ, తనతల్పంమీద కూర్చో బెట్టుకొని సేవలుచేస్తున్నాడు. ఇతడెంతటి మహత్ముడో? అనుకున్నారు. ఇంతలో కృష్ణపరమాత్మ కలుగజేసుకొని యోగక్షేమాలు విచరిస్తూ..

 

సీ: బ్రాహ్మణోత్తమ! వేదపాఠన లబ్ద ద

         క్షతగల చారువంశంబు వలన

    బరిణయంబైనట్టి భార్య సుశీల వ

         ర్తనములదగ భవత్సదృశ యగునె?

    తలప గృహక్షేత్ర ధనదార పుత్రాదు

         లందు నీచిత్తంబు సెందకుంట

    తోచుచున్నది; యేనుదుది లోకసంగ్రహా

         ర్థంబు కర్మాచరణంబు సేయు

 

తే:  గతి మనంబుల గామమోహితులుగాక

      యర్ఠిమై యుక్తకర్మంబు లాచరించి

      ప్రకృతిసంబంధములు వాసి భవ్యనిష్ఠ

      దవిలి యుందురు కొందఱుత్తములు భువిని  ...భాగ-10-2-990.

 

విప్రోత్తమా! సద్వంశసంజాత యైన భార్య అనుకూలవతియేగదా? నీవుమాత్రం యిల్లు, యిల్లాలు, పిల్లలను అట్టే పట్టించుకున్నట్లు లేవు. నాకూ నీకూ పెద్దతేడా యేమీలేదు. (అంటే కృష్ణుడు కలిమిని, కుచేలుడు లేమిని ఒకటిగానే చూశారు) లేమిలో, కలిమిలో కృంగిపోకుండా, ఉబ్బిపోకుండా వుండటం ధర్మకార్యల యందే అనురక్తిగలిగి, ప్రాపంచికవిషయాలలో భ్రమకులోనుగాకుండా ఉత్తమ జీవనం యెవరోగాని సాగించలేరుగదా? (ఆంటే నీవుసాగిస్తున్నావని చెప్పక నేజెప్పి). అదిసరే! నీవు నాకోసం యెమీ తేలేదా? నీకు తెలుసుగదా!..

 

క: దళమైన పుష్పమైనను

    ఫలమైనను సలిలమైన బాయని భక్తిం

    గొలిచిన జనులర్పించిన

    నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్.   ..భాగ-10-2-1009.

 

నేను భక్తిప్రేమలతో అర్పించినది స్వల్పమైనా యిష్టంగా గ్రహిస్తాను. అది పత్ర మైన, పుష్పమైనా, ఫలమైనా కడకు యిన్నినీళ్ళైనా సరే. నాకు వస్తువుయొక్క విలువగాదు, అర్పించిన భావంముఖ్యం. అనగానే కుచేలుడు యెంతైన అటుకులు అత్యల్పంగదా! యని సంకోచిస్తుండగా, కృష్ణుడే పైపంచలోని అటుకులమూట లాక్కొని, చాలాబగున్నాయంటూ ఒకపిడికెడు యిష్టంగా తిన్నాడు. తింటూ అనుకున్నాడు. ఇతడు పూర్వజన్మలో ధనమదంతో నన్నువిస్మరించాడు. కనుకనే యీజన్మలో దారిద్ర్యమనుభవించాడు. ఇంతటితో యితని పేదరికం అంతమయింది, అంటూ రెండవ పిడికెడు తినబోయుండగా, రుక్మిణీదేవి తనమనసులో..

 

క:  సొంపారగ నాతని బహు

       సంపదలందింప నివియ చాలు నికభ

       క్షింపగ వలదు త్రిజగ

       త్సంపత్కర! దేవదేవ! సర్వాత్మహరీ!..    భాగ-10-2-1014.

 

స్వామీ! మీరు తృప్తిజెందారంటే, లోకాలన్నీ సంతృప్తిజెందినట్లే. ఇప్పుడితని కనుగ్ర హించిన సంపద చాలు, అనుకున్నది. ఆమె ఉద్ధేశ్యంలో యింతకుమించిన సంపద మనిషిని అహంకారిని జేయవచ్చుననుకొని, మీరు ఆరగించిన యీ పిడికెడు అటుకులవల్ల గలిగిన సంపదే యెక్కువ. ఇక రెండవ పిదికెడు వలదని వారించింది. అవి మాకివ్వండని అడిగింది. ఇక్కడ కుచేలుడు అటుకులు ప్రసాదం గా కృష్ణునకర్పించడంలో కూడా ఒకగొప్ప ఆధ్యాత్మికరహస్యమున్నది. వడ్లు ఉడికించడంతో వాటిలో మొలకెత్తేగుణం పోతుంది. అంతేగాదు ఆతర్వాత అవి అటుకులుగా మారడానికి మరోదెబ్బ వేయవలసివస్తుంది. అంటే యిక మొలకెత్తే అవకాశ మసలేవుండదు. దీనివల్ల ఓస్వామీ! మాకు యీఅటుకులవలె పునర్జన్మ లేకుండా జేయమని ప్రార్థించడమే యీ అటుకుల ప్రసాదసమర్పణమన్నమాట.

 

ఆదినం హాయిగా గడచిపోయింది. గురువు సాందీపని ఆశ్రమంలో గడచిన సంఘటనలన్నీ జ్ఞాపకంచేసుకున్నారు. కలసిభోంచేశారు. రాత్రిగడచి తెల్ల వారినతర్వాత కుచేలుడు కృష్ణునివద్ద సెలవుగైకొని యింటికి బయలుదేరాడు. అసలు వచ్చినపనే మరచిపొయాడు. ఏమైనా అడిగి యిప్పించుకున్నామనే ఆలోచనేచేయలేదు. నిజమే దైవసన్నిధిలో స్వార్థ ప్రాపంచికవిషయాలు గుర్తుకురావు. అసలు తనకేమికావాలోకూడా తెలియనిస్థితి అది. అక్కడ సర్వంజగన్నాథమేమరి. దారిలో వస్తూవుండగా తనపరిస్థితి మనసులో మెదలింది. అలోచిస్తూ..

 

ఉ: శ్రీనిధియిట్లు నన్నుబచరించి ఘనంబుగ విత్తమేమియు

      న్నీని తెఱంగు గానబడె నెన్న దరిద్రుడు సంపదంధుడై

      కానక నన్నుజేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాం

      భోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నను జేయకుండునే....భాగ-10-2-1019.

 

మిత్రునిజూచిన ఆనందంలో నేనేమీ అడగలేదు. సరే! నా కుచేలముల జూచి యైనా నాపేదరికం అర్థమైయుండదా? ఏమీ నాకివ్వలేదే? అనుకొని, భక్తుడు గనుక, అదీ నామంచికే అయివుంటుంది. పేదవానిని అనాయససంపద గర్వి ష్టుని జేస్తుంది. నడమంత్రపుసిరి దైవానికి దూరంజేస్తుంది. అందుకే కృష్ణుడు నామేలుగోరే నాకెమీ యివ్వకుండాపంపాడు. అంతామనమంచికే! అను కుంటూ, సంతృష్టాంతరంగుండై యిల్లుజేరుకున్నాడు. ఇల్లుజేరిచూస్తే తనగుడిసె స్థానంలో మేడ వెలసివుంది. భార్యాబిడ్డలు కుచేలములతోగాక సుచేలములతో సంతోషంగా స్వాగతంపలికారు. సుధామునికి శ్రీకృష్ణుడు చేసినమేలు అర్థమై పోయింది. సర్వసంపదలు సుధామునకబ్బాయి. అతడు నిజమైనభక్తుడు, కనుక సంపదలకు పొంగిపోలేదు. ఆసంపదలకతడు ధర్మకర్తగా మెలగుతూ...

 

వ:.... అప్పుండరీకాక్షుని యందుల భక్తితాత్పర్యంబునందవిలి పత్నీసమేతుండై, నిఖిలభోగంబులయందు నాసక్తింబొరయక, రాగాదివిరహితుండును, నిర్వి కారుండునునై, యఖిల క్రియలందు ననంతుని యనంత ధ్యానసుధా రసంబు జొక్కుచు విగతబంధనుండై మపవర్గప్రాప్తినొందె... (భాగ-10-2-1031)

 

ధనమెచ్చిన మదమెచ్చుటనునది సుధామునిలో జరుగలేదు. అతడు భగవంతుని నిరంతరస్వ్మరణలో సత్కార్యములజేసి, రాగానురాగములకు జిక్కక, యే వికారములకు లోనుగాక సమతాస్థితిలో సజ్జనుడై జీవించి, హరిస్మరణతో తనువుచాలించి ఉత్తమగతిప్రాప్తినొందినాడు. భగవంతునిప్రేమకు, భక్తుని తీరుకు, సుస్నేహమునకు యీకథ ఒక మంచి ఉదాహరణ.

ఓం తత్ సత్.

 

v 

 

 

సంసారంలోని ఒడిదుడుకులను పరిష్కరించడానికి మీరు శాంతంగాను, నెమ్మదిగాను, సహనంతో మెలిగితే, అవి ఓకొలిక్కి వచ్చేస్తాయి. పరిష్కారం భగవదిచ్ఛకు వదలి, మీపని మీరు కర్తవ్యపరంగా నిర్వహిస్తూ, భగవదర్పితంగా ముందుకు కదలండి, ఇదే దివ్యజీవన సుధామాధుర్యమును మీ కందజేస్తుంది.   

 

                                                                          .... శ్రీ రామచంద్రజీ- షాజహాన్‍పూర్

 

 

20.సంజయుడు

296

ఉ.

302

 

ఆగమశక్తితో తనకుతాను సాక్షీభూతమై పరీక్షించుకుంటూ వుండడమే సంజయత్వం. సమ్యక్‍యోజయతీతి సంజయః అంటే సమయోచిత బుద్ధి గలవాడని అర్థం. చక్కగా అలోచనచేయగల సమర్థుడు, అందరినీ మిత హితవాక్యములతో సంతృప్తిపరచు నైపుణ్యము గలవాడనికూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా పేరుకుదగ్గ వ్యక్తిత్వం గలవాడు సంజయుడు. ఇతడు సూతకులసంజాతుడు. కనుక ధృతరాష్ట్రమహారాజుకు రథసారధిగా నియమింపబడ్డాడు. సారధికర్తవ్యమునకే పరిమితముగాక యితడు, ధృతరాష్ట్రునకు మంత్రిగా, మంచి సలహాదారుడుగా మెలిగాడు. సంజయుడు సర్వధర్మవిధుడని, నీతివంతుడని, సత్యవాదియని, నిర్భయుడని ధృతరాష్ట్రుడు నమ్మినాడు గనుకనే, సంజయుని మాటకు విలువిచ్చి అతని మందలింపులను సైతం ఓపికతో విన్నాడు. సంజయుడు నిజమేచెబుతున్నాడని నమ్మినప్పటికీ ధృతరాష్ట్రుని పుత్రవాత్సల్యం హితవాక్యాలను అమలుపరచనియ్యలేదు. అందుకే కడకు దుఃఖభాజనుడయ్యాడు. " అప్రియస్యచ పథ్యస్య శ్రోతా వక్తాచ దుర్లభః" అన్నది ఆర్యోక్తి. వినేవాడికి హితవచనం నచ్చకపోయినా నిర్భయంగా ముఖ స్తుతిమాని చెప్పగల సలహాదారుడు దొరకడం కష్టం. అలాగే చేదైనా, హిత వాక్యాన్ని విని ఆచరించగల ధీమంతుడు దొరకడమూ కష్టమే. అయితే సంజయుడు మాత్రం చేదైనాసరే! హితమే పలికాడు. వినడమా? వినక పోవడమా? అన్నది ధృతరష్ట్రునికే వదలివేశాడు. వేదవ్యాసుడే స్వయంగా సంజయుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ధృతరాష్ట్రునకు వివరించి, యితనిద్వారా జననమరణచక్రభ్రమణం నుండి ఆవలకు దాటుకోమన్నాడు. భగవానుని యధార్థప్రభావం తెలిసినవాడని, యితడుచూపిన దారిలో నడవడం శ్రేయస్కరమని తెలియజేసినాడు.

 

శ్లో:    యత్రయోగేశ్వరఃకృష్ణో

          యత్రపార్థో ధనుర్థరః

          తత్ర శ్రీర్విజయో భూతి

          ర్ద్రువా నీతిర్మతిర్మమ.               భ.గీ-18-78.

 

కృష్ణపరమాత్మ తోడై అర్జునుడు ధనుర్ధారియై యెక్కడనిలుస్తారో అక్కడ సంపద విజయం తథ్యం. అని సంజయుడు యేమాత్రం మొగమాటంలేకుండా చెప్పిన మాట మనం పైశ్లోకంలో చూడవచ్చు.

 

ఏదియేమైనా సంజయుని మాటలపొందిక, నిజాయతీపై నమ్మకంగలవాడు గనుకనే ధృతరాష్ట్రుడు పాడవులచెంతకు యితన్ని రాయబారిగా పంపాడు. పాండవులకు మేము రాజ్యభాగమివ్వకుండా, ధర్మరాజు యుద్ధానికి రాకుండా వుండేటట్లు మంచిమాటలతో పని సరిజేసుక రమ్మన్నాడు గ్రుడ్డిరాజు. అంటే శుష్కప్రియాలు. శూన్యహస్తాలన్న రీతిలో పని నెరవేర్చుక రమ్మన్నాడన్నమాట. పర్యవసానమేమైనప్పట్టికిని యీ పనిని సమర్థవంతంగా నిర్వహించాడు సంజయుడు. అందుకే సంజయరాయబరం మహభారతంలో ప్రముఖస్థానం వహించింది.

 

ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం రథంలో ఉపప్లావ్యనగరంవెళ్ళి సంజయుడు తొలుత కృష్ణార్జునులున్న మందిరం ప్రవేశించి, వారికి తనప్రణామాలు తెలిపి, మరునాడు ధర్మరాజు కొలువుదీర్చిన సభలో తన సంధివాక్యాలు వినిపించాడు. ధృతరాష్ట్రుని చూపు, మాట యితడేననట్లు చాకచక్యంగా వ్యవహరించాడు. ధృతరాష్ట్రుని దూతగా పాండవుల యోగక్షేమలు విచారించాడు. ధృతరాష్త్రుని దోషాలు కప్పిపుచ్చి, ధర్మరాజును పొగిడి, సానుకూలవైఖరి ప్రదర్శించాడు. అక్కడివారి దొక్కకరిదొక్కొకమాట, వారిమాటలటుంచి, ధర్మరాజా! నీవు ధర్మాత్ముడివి, శాంతికాముకుడివి. నీతమ్ములు నీమాట జవదాటరు. నీవూనీతమ్ములూ అజేయులే, నీవద్ధనున్న విరట, ద్రుపద, సాత్యకి వంటియోధులు సామాన్యులు గారు. అట్లని  అక్కడి భీష్మ, ద్రోణ, కర్ణులు, దుర్యోధనాది కౌరవులు మాత్రం తక్కువవారా? కాదు. అయినా నీవు భిక్షాన్నంతోనైనా సరిపెట్టుకుంటావుగాని నెత్తుటికూటికాశపడవు. అంతేకాదు...

 

చ:     అఖిల జనక్షయంబయి, జయాపజయంబులు రెండునుం దుదిన్‌
           సుఖములు గాని యీ పనికిఁ జొత్తురె యుత్తము? లట్లుఁగాక యా
            నిఖిలసుఖంబు లేమిటికి నీవని వృద్ధజనంబు బాలురన్‌

            సఖులను బంధులన్‌ గురులఁ జంపితయేని దయాపయోనిధీ!

                                                                                                    భార-ఉ-1-283.

 

యుద్ధంలో జయాపజయలు రెండుకూడా దుఃఖాన్నే మిగులుస్తాయి. నీలాంటి ఉత్తములు యుద్ధంకోరుకోరు. బాలురను, వృద్ధులను, మిత్రులను, బంధువులను రాజ్యంకోసం ప్రాణాలుతీస్తావా? అది నీనైజం కాదు. నీవుశాంతివహిస్తే అందరూ బ్రతికిపోతారు. ధర్మరాజా! మీకు ఆగ్రహం తగదు. అది అనర్థదాయకం

 

ఉ:     మ్రొక్కెద వాసుదేవునకు, మోడ్చెదఁ జేతులు సవ్యసాచికిం,
           దక్కటి మిత్త్ర బాంధవ హిత ప్రియమంత్రి వయస్య కోటికిన్‌
           స్రుక్కుచు విన్నవించెద నసూయలు దక్కి యనుజ్ఞ సేయుఁడీ
          యిక్కరుణాకరున్‌ శరణ మే నిదె వేఁడెదఁ గ్రోధశాంతికిన్‌.

                                                                                  భార-ఉ-1-302

అంటూ అక్కడున్నవారి నందరిని ప్రసన్నులను జేసుకోవడానికి ప్రయత్నించాడు. అన్నీవిన్న ధర్మరాజు ధృతరాష్ట్రుని మనోగతం సంజయుని మాటలద్వారా అర్థమై, సంజయా!

 

క:       మును మమ్ముఁ బొగడి, పదపడి

                     య ని వారల గెలువ నరిది యని పొత్తుగఁ జె
                     ప్పిన మాటకు నే నొడఁబడ;

                     విను సంజయ! పక్షపాత వృత్తి విడువుమీ!.. భార-ఉ-1-322.

 

మందు మమ్ములను ప్రస్తుతించావు. తర్వాత అక్కడివారితో నేను పోరాడలేనని భయపెట్టజూచావు. నీమాటలు సమ్మతిగాలేవు. ఈ నీతివాక్యాలు, శాంతి వచనాలు అక్కడివాళ్ళకూ తెలియజెప్పాలి. మాకు ఇంద్రప్రస్థమో మరొకటో యిచ్చి మామేలు కోరవచ్చుగదా? అని అనగానే శ్రీకృష్ణుడు కల్పించుకొని, యిక నేనేవచ్చి అక్కడివారితో మాట్లాడతాన్నాడు. అందుకు సంజయుడు, అంతకన్నా కావలసిందేముంది. కృష్ణా! నీవేవచ్చి సంధిజెస్తానంటే, చాలసంతోషం. అనిజెప్పి హస్తినపురనికి తిరిగివచ్చాడు. వచ్చి ధృతరాష్ట్రమహారాజుతో రాజా!

 

ఉ.

దేవర పంపఁగాఁ జని యుధిష్ఠిరునిం గని వచ్చినాఁడ; నా
 
భూవిభుఁ డప్రమేయ గుణపూజ్యుఁడు మీకు నమస్కరించె; సం
భావనసేసె నా; కిచటి బంధుల నెల్లఁ దలంచె; మీ సుఖ
శ్రీ విభవంబులున్‌, సుతుల సేమము నన్నడిగెం బ్రసన్నుఁడై.

                                                                                                          భార-ఉ-2-3.

 

నీఆజ్ఞమేరకు వెళ్ళి పాడవులను శాంతపరచజూచాను. వాళ్ళుకూడా మీయందు గౌరవంప్రదర్శించారు. ఇక్కడిపెద్దలకు, బంధువులకు వందనాలు సమర్పిం చారు. అయినా మహారాజా! ధర్మరాజు సామాన్యుడుకాడు. అతన్ని తక్కు వ‍అంచనా వేయడానికి వీల్లేదు.

 

చ:   అనయము వుట్టె జూదమున యప్పుడ; యెంతయుఁ జిచ్చువెట్టి కా
        ల్చినయది నీ యుపేక్షయ; వశీకృతచిత్తుఁడు ధర్మసూతి మె
       త్తని పులి; యెల్లవారలు నధర్మము నీపయిఁ బెట్టునంతకు
       న్వినఁడును గానఁడుం, బిదప నీకును నాకు మరల్పవచ్చునే?

                                                                                            భార-ఉ-2-14.

 

అతడు మెత్తనిపులి, నీవు సరైననిర్ణయం తీసుకోకపోతే, అందరు నిన్నే తప్పుపట్టేట్లుచేసి, ఆతర్వాత దండిస్తాడు. నీయెడల కడకు సానుభూతిచూపే వారుకూడా లేకుండా చేస్తాడు. మహారాజా! మీరు కొడుకుల్ని అదుపులో పెట్టకుండా అన్యాయాన్ని ఆపకుండా వూరకున్నారు. జూదమువలన నీకుమారులు చేటు కొనితెచ్చుకున్నారు. నేనేపాపము యెరుగనంటే కుదరదు. ధర్మాన్ని నిలపడం రాజుగా నీబాధ్యత. పాండవులను దగ్గరికితీసుకో, తగిన న్యాయంచెయ్యి. లేకుంటే నాశనం తప్పదు. చేయిదాటిపోకుండా చూసుకో అని హెచ్చరించాడు.

 

సంజయుని భార్యబిడ్డలూ కుటుంబజీవం గురించి మనకు తెలియడంలేదు. కానీ సంజయరాయబారానంతరం యింటికి సాగనంపుతూ అర్జునుడు..

 

క:  బాలసఖుడవు నాకును

      నీ లెస్సదనంబు నేమునీతివిడచి దు

      శ్శీలురమగుటయు శైశవ

      లీల మొదలుగాగ మునుదెలియదే నీకున్.. ..భార-ఉ-1-378.

 

అంటాడు. దీన్నిబట్టి అర్జునుడు సంజయునికి చిన్ననాటినుండి మంచిమిత్రుడని, ఒకరిమంచితనం మరొకరికి బాగాతెలియుననీ అర్థమౌతున్నది. మరికొంత లోతు గా పరిశోధిస్తే, యితనితండ్రి "గావల్గాని" కుడా హస్తినాపురరాజ్య సలహా దారుడని, కౌరవపండవులతోబాటు సంజయుడూ ద్రోణుని వద్ద విద్యనభ్యసించి నాడని తెలియుచున్నది. ఇతడు వ్యాసమహర్షివల్ల ప్రత్యేకవిద్యను పొంది, కురుక్షేత్రంలోని రణాన్నంతా తనదివ్యనేత్రాలతో చూచివచ్చి ధృతరష్ట్రునకు వివరించిచెప్పాడు. వ్యాసుని వల్లపొందిన వరంవల్ల రణంలోని అణువణువూ యితడు చూడగలిగాడు. ఆయుధాలు యితన్ని గాయపరచజాలవు. శరీరం పారదర్శకమై యితనినుండి బాణాలు యే ఆటంకం లేకుండా దూసుకొని పోగలవు. వీరులమనస్సులోని మర్మాలు సైతం యితని కర్థమైపోతుంటాయి. ఇతడు ఒకచోటవుంటే, మరోచోట జరిగే యుద్ధంకూడా యితనికి గోచరమౌతుంది. కృష్ణపరమాత్మ అర్జునునికి చేసిన గీతాబోధ యితడూ అదేసమయంలో విన్నాడు. విశ్వరూపసందర్శనంకూడా చేసుకొని ధన్యు డైనాడు. రణవార్తావివరణలేకాదు, కొడుకుల మరణవార్తలను తెలియజెసే సమయంలో ధృతరష్ట్రునకు ఓదార్పుతో కూడిన పలుకులతో స్వాంతనము చేకూర్చినాడు. సాత్యకి (కృష్ణునితమ్ముడు) కి యుద్ధం కడపటిదినాన సంజయుడు తారసపడ్డాడు. సాత్యకి చంపబోతుండగా వ్యాసమహర్షి వచ్చి

సంజయుని విడిపించి, యితడు శత్రువుకాదు, హితుడని, జ్ఞానియని చెప్పి కాపాడినాడు.

 

యుద్ధానంతరం ధర్మరాజు రాజైనతర్వత ధృతరాష్ట్రుడు, గంధారి, పాండవమాత కుంతి అడవులకువెళ్ళి అశ్రమవాసంచేసినారు. అప్పుడుకూడా సంజయుడు ధృతరాష్ట్రునివెంట వెళ్ళి ఆశ్రమవాసంలో తోడుగావున్నాడు. రాజ్యాధికారం వున్నా, లేకున్నా సంజయుడుమాత్రం ధృతరాష్ట్రునికి సేవలుచేసినాడు. ఆఖరుకు అడవిలో ధృతరాష్ట్రుడు కార్చిచ్చు మధ్యలో చిక్కుకున్నాడు. గాంధారి, కుంతి, సంజయుడుకూడా అయనతోనే వున్నారు. ఆసమయంలో, అదితన అంత్యకాల మని గ్రహించి ధృతరాష్త్రుడు సంజయునితో ..

 

సీ: ఒక్కింతతెఱపి నీవెక్కడనైనను

           గనుగొని పొమ్మగ్ని దనుకకుండ

    ననిచెప్పి తలగిపోదనకు గాంధారికి

           గుంతిభోజాత్మకును నశక్య

    మగుటయు జెప్పిన నడలొంది యాసూత

           సుతుడు మీరును నొకచోట వెడలి

 

    పోవుటగలిగిన బోదుగాకే దవా

           గ్నికి మిమ్ము నెరచేసి యకటపోదు

 

ఆ.వె:  నే మహాత్మ యనుడు నిలువాసి యిట్లున్న

           జనులకివ్విధమున సమయుటెగ్గు

           గాదు నీకు బోవగావచ్చి యుండగ

           బోవకునికి పాపమునకు బట్టు...               భార-ఆశ్ర-2-153.

 

సంజయా! నీవు తప్పించుకొనేమార్గం చూచుకొని వెళ్ళిపో. నేనూ, గాంధారి, కుంతి బలహీనులమై యుండుటచేత యీ దావగ్నినుండి తప్పిచుకొనలేము. నీవుమాత్రంవెళ్ళిపో! అన్నాడు. మహారాజ! మీకూ యేదోఒక దారిదొరికితే, అందరం తప్పించుకోవచ్చు. అంతేగాని మిమ్మల్ని వదలివెళ్ళలేనన్నాడు. ధృతరాష్త్రుడు సంజయా! నీవూమాతో కాలిపోతే, మాకు పాపం చుట్టు కుంటుంది. ఆఖరుదశలోనూ నన్ను పాపినిజేయకు, వెళ్ళమని బ్రతిమాలి, ఒప్పించాడు. ధృతరాష్ట్రుని తూర్పుమొగమై పద్మాసనంలో ధ్యాననిష్ఠలో కూర్చొండబెట్టి, సంజయుడు వారిని వదలి దావానలంనుండి బయటబడ్డాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి దవానలానికి ఆహుతైపోయారు. సంజయుడు హిమా లయాలకు వెళ్ళి తపోనియమాలతో కాలంగడిపాడు. మహాభారతంలో ధన్యజీవిగా సంజయుడు గుర్తించబడ్డాడు. 

v  

 

 ఆధ్యాత్మికరంగంలో మనం, గమ్యాన్ని చేరుటకు సహాయపడే చుక్కాని, మన ధృడసంకల్పమే 

                          .... మహాత్మా  శ్రీ రామచంద్ర-షాజహాన్‍పూర్.

 

 

21.తెలుగువారి కారాలు


1.మొదలు పెట్టే కారం -- శ్రీకారం
2.
గౌరవించే కారం ----సంస్కారం,
3.
ప్రేమ లో కారం --- మమకారం 
4.
పలకరించేకారం ----నమస్కారం,
5.
పదవి తో వచ్చే కారం ---అధికారం,
6.
అది లేకుండా చేసే కారం--- అనధికారం,
7.
వేళాకోళం లో కారం ---- వెటకారం
8.
భయం తో చేసే కారం --- హాహాకారం,
9.
బహుమతి లో కారం --- పురస్కారం,
10.
ఎదిరించే కారం --- ధిక్కారం
11.
వద్దని తిప్పికొట్టే కారం--తిరస్కారం,
12.
లెక్కల్లో కారం --- గుణకారం,
13.
గుణింతం లో కారం -- నుడికారం
14.
గర్వం తో వచ్చే కారం -- అహంకారం,
15.
సమస్యలకు కారం ----- పరిష్కారం,
16.
ప్రయోగశాల లో కారం--- ఆవిష్కారం,

17. సంధులలో కారం --- ''కారం,
18.
సాయం లో కారం --- సహకారం
19.
స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
20.
మేలు చేసే కారం ----ఉపకారం,
21.
కీడు చేసే కారం ---- అపకారం
22.
శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
23.
విష్ణువు లో కారం ----శాంతాకారం,
24.
ఏనుగులు చేసేది --- ఘీంకారం
25.
మదం తో చేసే కారం --- హూంకారం,
26.
పైత్యం తో వచ్చే కారం --వికారం,
27.
రూపం తో వచ్చే కారం --ఆకారం
28.
ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం,
29.
ఒప్పుకునే కారం --- అంగీకారం,
30.
చీదరించుకునే కారం ---చీత్కారం
31.
పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
32.
మిత్రులందరికీ -----నమస్కారం

 


 

No comments:

Post a Comment

స్త్రీ, శిశు వ్యాధులు హోమియో చికిత్స

    స్త్రీ , శిశు వ్యాధులు హోమియో చికిత్స       డా || శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్య ప్రదాత)   రచన పి.సుబ్బరాయుడు కెంట్ హ...