వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
రచన
పి. సుబ్బరాయుడు
42/490, ఎన్.జి.ఓ కాలనీ
కడప - 516002
సెల్ - 9966504951
కృతజ్ఞతలు
ఈపుస్తకం మొదట 16 పేజీలతో వ్రాయించి
ముద్రించి బ్రహ్మంగారి మఠంలో స్వామిపాదములచెంత సమర్పించి వెయ్యి కాపీలు పంచిపెట్టారు, శ్రీ పడిగల బ్రహ్మానందము, హైదరాబాదువారు. వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ (ర.భ) గా పనిజేసి పదవీవిరమణ జేసినారు. వారి వద్ద నేను సీనియర్
అసిస్టెంటుగా కడపలో పనిజేసినాను. ఆవిధంగా మా మధ్య సాన్నిహిత్యం యేర్పడింది. ఈ
పుస్తకం యీ రూపంలో రావడానికి ఆయనే కారకులు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
రచయిత
పి. సుబ్బరాయుడు
శ్రీశ్రీశ్రీ
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
అవతారం
శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారు
అవతార పురుషులు. అవతార పురుషులు అకారణముగా జన్మింపరు. ధర్మము క్షీణించి. అధర్మము
పెచ్చుపెరిగి సజ్జనులు పీడింపబడుచున్నప్పుడు, అట్టి
సజ్జనుల ఆర్తనాదములు మిన్ను ముట్టి సర్వేశ్వరుని భూమిపై అవతరింపజేయును. ఆ
దిగివచ్చిన అవతార పురుషుడు, దీనుల
రక్షించి, దుష్టులకు
బుద్ధిగరిపి సమతను స్థాపించి అవతారము చాలించును. కొన్ని యవతారములు దుష్టశిక్షణ
ద్వారా సజ్జనుల రక్షించును, కొన్ని
యవతారములు తమ బోధనల ద్వారా మానవులలో పరివర్తన దెచ్చును. ఇదంతయూ ఆనాటి కాలాను గుణముగా, అవతారమూర్తి
తగుచర్య గైకొనును. ఇట్టి వారిలో సుబోధా చార్యులైన కపిలమహర్షి తర్వాత
చెప్పుకోదగినవారు శ్రీవీరబ్రహ్మేంద్ర స్వాములవారు. మూఢనమ్మకాలు, మతోన్మాదాలు
జాత్యహంకారము మితిమీరిన 17వ
శతాబ్దమును సరిదిద్దుట కవతరించిన మహావిష్ణువే శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి.
పుట్టుక
సరస్వతీనదీ తీరమున
అత్రిముని ఆనందాశ్రమము అలరారు చున్నది. ఒక శుభోదయమున అత్రిముని సంధ్యావందనాది
కార్యక్రమములు ముగించుకొని గృహోన్ముఖుడైనాడు. నదిగట్టున ఒక స్త్రీ తన బిడ్డను
ఒడిలోనుంచుకొని రోదిస్తున్నది. ముని ఆమె దాపునకువెళ్ళి, ఆమెనోదార్చి ఆమె బాధకు
కారణమడిగాడు. ఆమె మునికి నమస్కరించి స్వామీ! మాది బ్రహ్మాండపురం, నాపేరు ప్రకృతాంబ.
భర్త పరిపూర్ణయాచారి. మేము సంతానాభిలాషులమై తీర్థయాత్రలు చేస్తూ వారణాశి
చేరుకొన్నాము. దైవనుగ్రహమున నేను గర్భముదాల్చి కాశిలోనే యీ శిశువును కన్నాను. కానీ
దురదృష్టవశమున నాభర్తకు అకస్మాత్తుగ శిరోవేదన కలిగి భరిచలేని బాధకు గురై మరణించినాడు. నేను
సహగమనము చేయవలె
నన్న,
ఈ
బాలునకొక సురక్షితస్థానము చూపవలసి యున్నది. దైవమే మిమ్ములను నావద్దకు పంపినాడు.
స్వీకరించండి, అంటూ బాలుని ముని
చేతులలోబెట్టి, తటాలున ఆమె
నదీప్రవహమున దుమికి ప్రకృతిలో కలసిపొయినది. ఇదంతా దైవసంకల్పంగా భావించి అత్రిముని
బాలుని ఆశ్రమంలో పెంచుకోసాగాడు. ఒకనాడు
వీరపాపమ్మ, వీరభోజయాచార్యులను
విశ్వబ్రాహ్మణదంపతులు ఆనందాశ్రమము చేరుకొన్నారు. వారు స్వామిని దర్శించి పాదాభి
వందనంచేసి, మహర్షీ! మాది
కన్నడదేశంలోని నందికొండల్లోఉన్న పాపాగ్నిమఠం. మాకు సంతానంలేదు, ఒకనాటి తెల్లవారుఝామున
జగందేవర శంఖం ఊది పిలిచి, తీర్థయాత్రలకు
బయలుదేరండి, పండంటి
బిడ్డతో తిరిగిరండని ఆశీర్వదించినారు. అది దైవాజ్ఞగా తలదల్చి శ్రీశైలాది
పుణ్యస్థలాలుసేవించి, సరస్వతీనదిలో
మునకలిడి మీ దర్శనార్థం ఆశ్రమమున
అడుగిడినామని విన్నవించు కొన్నారు. అప్పుడు అత్రిముని ఓ లిప్తకాలము
కళ్ళుమూసికొని తన దివ్యజ్ఞాన
మున సర్వమెరింగి, తను
పెంచుకొనుచున్న బాలుని వారిచేతులలో పెట్టి, మీరు వచ్చినది యీ
బాలుని కొఱకే, సంతోషముతో
తీసుకెళ్ళండి. ఈ బాలుడు దైవాంశసంభూతుడు. మీకేగాక ఆస్తికజన
బాహుళ్యానికితడు కరదీపికనుబట్టి దారిచూపగల దేశికోత్తముడు కాగలడని
దీవించి పంపెను.
కౌమారదశ
అలా పాపాగ్నిమఠంలో వీరనారాయణ పేరున బాలుడు దినదిన
ప్రవర్ధమానుడై
ఉపనయనాది జాతకర్మలు పూర్తిగావించుకొని విద్యాబుద్ధులు గడించుచుండగా తండ్రి
వీరభోజయాచార్యులు యోగనిష్టలో కూర్చొని పరమపదించినారు. కాలముగడచి వీరనారయణ 12 వ యేడు గడచి
పోవుచుండగా ఒకనాడు తల్లిసమీపమున కూర్చొని, మాతా! మనిషి కర్మజీవి
తను మునుపటి జన్మలందుజేసిన పాపపుణ్యముల ననుభవించడానికే పుడతాడు. ఆత్మ, పరమాత్మను దీనంగా
వేడుకొని తగినచోట జన్మిస్తాడు. కానీ, జన్మించినతర్వాత
మాయలోబడి పాపపుణ్యముల ననుభవించి బంధవిముక్తుడయ్యే బదులు తిరిగి కర్మలుచేసి
మళ్ళీమరొక జన్మకు కారకుడౌతాడు. ఇలా చర్విత చరణుడై జననమరణ చక్రములోబడి
కొట్టుమిట్టాడుతూనే వుంటాడు. అమ్మా! పిండోత్పత్తి క్రమంలో జీవియొక్క వివిదావస్థలు
తెలియజేస్తాను వినుమని తల్లికి యివిధంగా తత్త్వాన్ని వినిపించాడు వీరనారయణుడు.
ముట్టు ముట్టనియేరు
ముట్టరాదనియేరు
ఈ ముట్టురక్తంబు యీ శరీరంబూ... // ముట్టు//
కమలమున యిముట్టు
కమలమని వెలిసింది
కమలమ్ములోపలా కాంతిగా
దుమికెన్...
//ముట్టు//
మూన్నాళ్ళ ముచ్చటలు
ముట్టంచు తొలగుంటె
ముట్టులోపల
ముట్టుగుట్టేల సమయున్
//ముట్టు//
నెలకొక్క దినమాయె నేర్పుతో యీ మట్టు
పాదుతెలియక ముట్టు
పారాడసాగెన్
//ముట్టు//
రెండునెలలొకదినము
ఆండబాయక రాత్రి
శ్రీహరిని వెదుకుటకు
చిలుకవలె దిరిగెన్
//ముట్టు//
మూడునెలలొకదినము
మురికిగర్భములోను
మూలస్థానంబందు ముద్దేరుపరచెన్
//ముట్టు//
నాల్గునెలలొకదినము
నాగకంఠుడు వచ్చి
మలమూత్రద్వారముల
క్రమమేరుపరచెన్
//ముట్టు//
ఐదునెలలొకదినము ఆ
సదాశివుడొచ్చి
కంఠస్థానము శిరసు క్రమమేరుపరచెన్ //ముట్టు//
ఆరునెలలొకదినము ఆ
రుద్రు డా బ్రహ్మ
అభయహస్తములిచ్చి
ఆయుస్సు బోసెన్
//ముట్టు//
ఏడునెలలొకదినము
యెఱుకాయె జీవునకు
మదిలోన నూకొట్టి
మనసుతాదెలిసెన్
//ముట్టు//
ఎనిమిదీనెలలకూ యేర్పడీ
పిండంబు
కాంతగర్భము నందు
కదలుచూనుండెన్
//ముట్టు//
తొమ్మిదీనెలలకూ
తొలిద్వారముల వీడి
పూర్ణస్వరూపుడై
పుడమిపై బడియెన్
//ముట్టు//
ఈ పిండవచనము యీ పిండ
శాస్త్రమ్ము
కాని పిండముచేత
కలినీళ్ళు జల్లన్
//ముట్టు//
మాయమంత్రాసాని మన
పోతులూరయ్య
మంత్రములు చదువుతూ మరి
బొడ్డుగోసెన్
//ముట్టు//
అలా బోధచేసి
జననమరణవిచ్ఛేదకమైన మార్గముపదే శించి , తల్లి పాపమ్మను మఠం
ఆధారంగా కాలము గడుపుచుండుమని నియమించి, తను
కాషాయ వస్త్రధారియై దేశాటనము బయలు దేరినాడు. కంచిచేరి తపమాచరించినాడు.
అప్పుడప్పుడే దైవీయ లక్షణములతనిలో పొడసూపసాగినవి. ఆయన ముఖవర్ఛస్సును చూసి
దీనవస్థలోనున్న ఆనందభైరవరాజు ఆయన దరిచేరి దుఃఖితవదనుడై యిలా విన్నవించు కున్నాడు.. అయ్యా!
నేను క్షత్రియుడను. ఒకనాడు అడవిలో పులి ఆవును తరుముచుండగా చూచి గోరక్షణార్థం
బాణముసంధించి విడచితిని. అది గురితప్పి పులికిగాక ఆవుకుతగిలి ఆవు అంభాయని యరచి
మరణించినది. పుణ్యమునకు పొయి పాపము మూటగట్టు
కుంటిని. గోవధ చేసి
నిష్కృతిలేని పాపినైతిని. నాకు ప్రాయశ్చిత్తము తెలియబరచి పాపవిముక్తికి
దారిచూపుడని బ్రతిమలాడెను. వీరనారాయణుడు, అతనితో
రాజా! నీవు సాక్షాత్తు శివుడవు, నేను
హరిని, జరిగినదేదో జరిగినది, నీవు నేటినుండి
తపమాచరించి నిర్మలచిత్తుడవై తనువు చాలించుము. తిరిగినీవు దూదేకుల కులమున సిద్ధయ్య
యను నామమున జన్మింతువు. నన్ను వెత్తుకుంటూ వచ్చి నా శిష్యులలో అగ్రగణ్యుడవగుదువు.
ఆజన్మలో నీ సర్వపాపములూ దగ్ధమై
దేశికోత్తముడుగా ప్రఖ్యాతిగాంతువని దీవించి పంపెను.
ఇక
కంచివదలి దేశాటనజేస్తూ కర్నూలుజిల్లా లోని బనగానిపల్లె చేరుకొన్నాడు. తనపేరు
వీరప్పని చెప్పుకొని, గరిమిరెడ్డి
అచ్చమ్మ, వెంకటరెడ్డిగార్ల
యిల్లుచేరుకొని తన మృదు భాషణములతో వారిని మెప్పించి వారింట అవులకాపరిగా పనికి
కుదిరినాడు. గరిమిరెడ్డి అచ్చమ్మ మహాసాధ్వీ మణి
కావడంవల్ల వీరప్పను వాత్సల్యభావన తో ఆదరించింది. వీరప్ప ప్రతిరోజూ రవ్వలకొండకు
గోవులను తోలుక పోయి, అక్కడ
వలయాకారంగా తన చేతికర్రతో గీతగీసి, గోవులను
మొత్తం ఆ వలయం లోపలికితోలి, అక్కడనుండి
ఒక గుహవైపునకు బయలుదేరేవాడు. అలా వెళుతుండగా దారిలోని తాటిచెట్టు రివ్వున
వంగిపోయేది. వీరప్ప ఆ తాటిచెట్టును స్వహస్తములతో దీవించి తనకు కావలసిన తాటియాకులనుత్రెంపుకొని
చక్కగా గుహలోనికి వెళ్ళేవాడు. తనతోడి గోపాలబాలురు వీరప్ప గోవులను గమనింపగా అవి
యేనాడూ గీతదాటివచ్చి మేతమేయలేదు. ఇలాగైతే యెలా? అని గరిమిరెడ్డి అచ్చమ్మకు విషయం తెలియజేశారు. ఆమె నమ్మ
లేదు. కారణం గోవులు బాగా పచ్చికమేసినట్లు నెమరువేస్తున్నాయి. పాలు సమృద్ధిగా
యిస్తున్నాయి. కాని పశుకాపరులు మాటిమాటికీ ఇదేవిధమైన ఫిర్యాదుచేయడంతో అచ్చమ్మ
వాస్తవం తెలుసు కోవాలని నిశ్చయిం చుకొంది. ఒకరోజు వీరప్పకు చెప్పకుండా, వేషం మార్చుకొని
కానరాకుండా వెన్నంటివెళ్ళింది. నిజమే! గోవులు కుదురుగా వలయంలోనే పడుకొని
నెమరువేస్తున్నాయి.
క్రూరమృగాలు ఆవలయం దాటిరాక వెనక్కి
వెళ్ళి
పోవడం గమనించింది.
తదనంతరం వీరప్పవెళ్ళినదారినే వెళ్ళిగుహలో ప్రవేశించిచూచి ఆశ్చర్యపడింది. వీరప్ప
పద్మాసనాశీనుడై యేదో వ్రాస్తున్నాడు. పడగలపై మణులు మెరుస్తున్న శేషసర్పం పడగలు
విప్పి ఆయనకు గొడుగుగా అమరియున్నది. అచ్చమ్మ నిశ్చేష్టురాలై కాసేపునకు తేరుకొని, వెనుదిరిగి
యిల్లుచేరుకొనింది.
తను కళ్ళారా చూచిన విషయం భర్తకుతెలిపింది. వారు వీరప్ప సామాన్యుడు
కాడనీ, దైవాంశసంభూతుడని
నమ్మినారు. సాయంత్రం గోవుల తోలుకొని
వీరయ్య ఇంటికి రాగానే ఆ
దంపతులు కాళ్ళపై బడి క్షమాపణ కోరినారు. సేవించవలసిన మహానుభావునితో సేవలు
చేయించుకొన్నందుకు పశ్చాత్తాపపడ్డారు. వీరప్ప వారిని మెచ్చి తనను పనిలో
పెట్టుకొన్నందులకు, పోషించినందులకు
వారికి ధన్యవాదములు
తెలుపడమే గాకుండా, తాను లిఖిస్తున్న
కాలజ్ఞానము కొనసాగించుటకు మంచి అవకాశము లభించినందులకు సంతసించి ఆ పుణ్యదంపతులను
ఆశీర్వదించినాడు.
మహిమా
ప్రదర్శనారంభం
అచ్చమ్మ కోరికమేరకు
వారిని తనశిష్యులుగా చేర్చుకొని వారికి దీక్షనొసంగినాడు. వారి యేకైక అంధకుమారుడు
బ్రహ్మానందరెడ్డికి కళ్లొసగి మొదటిసారిగా ప్రపంచము గుర్తించునట్లు తన అద్భుత మహిమ
జూపినాడు. అచ్చమ్మ బనగానిపల్లెలో నేలమఠంగట్టించి వీరప్పయ్య స్వామివారికర్పించి
కాలజ్ఞానరచనకు తోడ్పడింది. స్వామివారి మహిమలు క్రమేణా వెల్లడికాజొచ్చాయి. వార్త
బనగానిపల్లె నవాబు వరకూ చేరింది. ఆయన స్వామివారిని తనకొలువునకు పిలిపించాడు. హిందూ
సాధువులపై నవాబుకు నమ్మికలేదు, కనుక స్వామిని
పరీక్షింప
నెంచి, పళ్ళెరంలో మాంసాహారం పెట్టించి దానిపై గుడ్డకప్పి స్వామికి నివేదింపజేసినాడు.
స్వామి పైనకప్పిన వస్త్రం తొలగించగనే అవి పరిశుద్ధమైన తాజా పళ్ళూ, ఫలహారాలుగా
మారిపొయాయి.
సభలోని వారంతా
ఆశ్చర్యపోయారు. నవాబు గర్వం నశించి పోయింది. స్వామిని మనసారా భజించి తరించినాడు.
కాలజ్ఞాన
వివరణ
ఆనాటి బనగానిపల్లె
నవాబువారి సభాముఖంగా స్వామివారు తన కాలజ్ఞానాన్ని తెరచి యిలా వివరించారు.
బనగానిపల్లె పట్నమౌతుంది. స్త్రీలు విద్యావంతులై రాజ్యాలేలుతారు. వితంతువులు
ముత్తైదువులౌతారు. తల్లీబిడ్డలకు తగవులేర్పడతాయి. తెల్లదొరలు మనకు పరిపాలకు లౌతారు.
ప్రజలు బహువిధముల పీడింపబడతారు. నన్నునమ్మిన నాభక్తులు క్షేమంగా వుంటారని
సభలోనివారిని దీవించి అచ్చమ్మ
యింటికి
తిరిగివచ్చారు. అచ్చమ్మయింటనే పాతరతీయించి అందులో కాలజ్ఞానగ్రంధాలను
నిక్షిప్తంచేసి, పాతరపైన చింతమొక్కనాటి, ఇది
మల్లెపూలుపూస్తుంది. అది వీరభోగవసంత రాయుడనై నేను మరలి వచ్చుటను సూచిస్తుందని
తెలియజేసి నాడు.
అట్లుండగా
ఒకనాడు వెంకటాద్రికుమారుడైన అన్నాజయ్య యను బ్రహ్మణుడు వచ్చి స్వామికి శరణుజొచ్చి
శిష్యుడైనాడు. అతడు తనకార్యములందు సహాయపడుటకై
వచ్చిన చతుర్ముఖ బ్రహ్మ యని జనులకు తెలియజెప్పి ఆదరించినాడు. స్వామివారు ఆ తర్వాత
తన కాలజ్ఞానమును ప్రవచనరూపములుగను గేయతత్త్వ రూపములుగను అనేక వేదికలనుండి
వినిపించి లోకమున వ్యాపింపజేసినారు. ఆ విషయములను వేరుగా ప్రస్తావించుకొందము.
ప్రస్తుతము స్వామివారి చరిత్రను కొనసాగింతము.
వీరభద్రస్వామి
ప్రతిష్ఠ
ఒకనాడు వీరప్ప
తనచేతులతో వీరభద్రస్వామి విగ్రహమును చెక్కి జుర్రేటినీటిలో విడిచినాడు. అది
నదీప్రవాహముతోపాటు ముందుకు సాగి కడప మైదుకూరు వద్దగల అల్లాడుపల్లె చేరింది.
స్వామివారి కరస్పర్శతో ప్రాణప్రతిష్ఠ పొందిన ఆ విగ్రహము పగలు బాలునిరూపుధరించి
కుముద్వతిగట్టుకుచేరి, ఆడుకొను
పల్లెబాలుర గలసి, ఆడుకొని, రాత్రికి తిరిగి
శిలావిగ్రహమై యేటి నీటిలో మునుగియుండెను.
బనగానిపల్లెలో
స్వామి మరికొంతకాలముండినాడు. తదనంతరం నేలమఠం అన్నాజయ్యకప్పగించి, అచ్చమ్మదంపతుల నుండి
సెలవు గైకొని బయలుదేరినాడు. ఇలా స్వామి బయలుదేరగానే అల్లాడుపల్లెలోని వీరభద్రుడు
వూరిపెద్దలకు కలలోకనపడి
స్వామిరాకనెరింగించి స్వామి అల్లాడుపల్లె వచ్చుసరికి నాకొక గుడినేర్పరచి
యేటిలోనున్న నన్ను దెచ్చి
అందు ప్రతిష్ఠింపజేయుమని ఆజ్ఞాపించినాడు. అన్నట్లే వీరప్పయ్య అల్లాడుపల్లెకురావడము, వూరి
పెద్దలు వీరభద్రుని గుర్తించి
స్వామివారిచేత గుడిలో
ప్రతిష్ఠించడము జరిగి పోయినది. ప్రతిష్ఠిత
వీరభద్రస్వామికి
పూజాదికము లొనరించి నేరుగా కడపజిల్లా కందిమల్లయపల్లె జేరినాడు. స్వామి అచ్చట
కొయ్యతో వ్యవసాయ
పనిముట్లు మరియు
కొలిమి బెట్టి కమ్మరిపని జేయుచూ జీవనము సాగిస్తూ, ఆస్తికజనాళికి బోధ
చేస్తూ కాలము గడప సాగాడు.
వివాహము
కమ్మరి
వృత్తిని చేపట్టి బ్రతుకుబాటలో ముందుకు సాగుతున్న స్వామికి పెండ్లి ఆవశ్యగత తెలిసివచ్చింది. సాంసారికజీవనం గడపాలనుకున్నారు స్వామి.
ఆనాటి ఆచారం ప్రకారం వరుడు యేవయసు వాడైనా వధువుమాత్రం పుష్పవతికానిదై వుండాలి. ఈ
దురాచారాన్ని యెదిరించి స్వామి తనవయస్సుకుదగిన కన్యనే వివాహమాడ దలచాడు. రజస్వలయైన
అమ్మాయే తనకు తగినదని నిశ్చయించుకొన్నాడు. తనదివ్యదృష్టితో కన్యను కనుగొని, పెదకొమెర్లగ్రామము
వెళ్లి అక్కడి చావిడి లో కూర్చొన్నాడు. అదేసమయంలో ఒక శవయాత్ర ఆదారిగుండా
సాగివచ్చింది. స్వామి ఆ శవయత్రను ఆపి
బ్రతికినవాడికి
పాడెగట్టితి రెందుకు దించుడనెను. దించినవెంటనే శవము లేచి కూర్చొనెను.
అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయిరి. ఈస్వామి యెవరోకాని చచ్చినవానిని బ్రతికించెనని
కొనియాడిరి.
ఇంతలో ఒక అల్లరి గుంపు, ఇదంతా మోసమని ముందేకూడ
బలుక్కొని చేసిన కుతంత్రమని తలచి, ఈతని
గుట్టు రట్టుచేతము రమ్మని ఒకనిని పాడెపై పరుండబెట్టి మోసుకొనుచూ దొంగ యేడ్పులు
యేడుస్తూ అదేదారిన వచ్చినారు. స్వామి వారిని చూసి, పాపము కాలముదీరినది.
ఎవరేమిచేయగలరు? అని పెదవివిరిచెను.
వారు వెంటనే స్వామిని హేళన చేయదలచి పాడెదించి పాడెపైనున్న వానిని లేవమనిరి. కానీ
నిజముగనే వాడు చచ్చియుండెను. లబోదిబోమని యేడ్చి స్వామి కాళ్ళపైబడిరి. స్వామి
వారికి బుద్ధిగరిపి చచ్చినవానిని బ్రతికించిరి. అక్కడుండి గమనించుచుండిన ఊరివారు
స్వామిని మహోన్నత శక్తిమంతుడైన దైవాంశసంభూతునిగా స్తుతించిరి. ఇదంతయూ గమనించిన
శివకోటయ్య స్వామిని తనయింటికి అతిధిగా ఆహ్వానించి గొంపోయెను. భోజనమునకు కూర్చొండగా
తన సద్దిసంగటినే తనకు వడ్డించమని తనసద్దిమూటవారి చేతికిచ్చెను. వారు మూటవిప్పి
ఆసద్దిసంగటి వడ్డించుటకు మొగమాటపడిరి. కానీ స్వామి గట్టిగా
చెప్పడంతో చేయునది లేక
వడ్డించిరి. వెంటనే ఆ చద్ది పంచభక్ష
పరమాన్నముగా మారినది.
భోజనానంతరము శివకోటయ్య తన కూతురు గోవిందమ్మను స్వామికిచ్చి వివాహముచేయనెంచి, పెద్దమనుషులతో
మాట్లాడించినాడు. స్వామి సంతోషముగా అంగీకరించినాడు. పెండ్లి నిరాడంబరముగా
జరిపించమనినాడు. పెండ్లి అట్లే జరిపించినారు. ఆనాడు స్వామిచేయితగులగనే వంటపాత్రలన్ని అక్షయపాత్రలై జనులను ఆశ్చర్యచకితులను
గావించినవి. అదివిని జనము తండోపతండములుగా వచ్చి, వివాహవిందునారగించి
ఆనందభరితులయ్యారు. అలా సామాన్యంగా మొదలైన వివాహము వైభవోపేతంగా సంపూర్ణమైంది.
శివకోటయ్య
కూతురూ, అల్లుణ్ని
కందిమల్లయపల్లెకు సాగనంపెను. మార్గమధ్యమున స్వామి భార్యతోకలిసి అల్లాడుపల్లె వీరభద్రస్వామిని
సేవించి యిల్లుచేరుకొని సుఖసంతోషములతో కులవృత్తి కొనసాగించుచుండెను.
ఇంతలో
కందిమల్లయపల్లె పోలేరమ్మ జాతర ప్రకటింపబడెను. ఊరిలో ఇంటింటికి తీరువా (చందా) వసూలు
చేసినారు. స్వామి మాత్రం తీరువా యివ్వలేదు. ఊరిపెద్దలు పోలేరమ్మగుడివద్ద పంచాయితీ
బెట్టి కందిమల్లయ్యపల్లెలో వీరయ్యగా పిలువబడుతున్న స్వామిని పిలిపించారు.
స్వామివచ్చి నిలబడ్డారు. ఊరిపెద్ద స్వామివైపు జూస్తూ చుట్టవెలిగించు
కోదలచి అగ్గికోసం
అటూయిటూ జూశాడు. అప్పుడు స్వామి, శాంతంగా పోలేరమ్మ గుడివైపుజూసి " పోలేరీ కాస్తా
నిప్పుతే రెడ్డిగారు చుట్ట
వెలిగించుకొంటారు" అన్నాడు. అన్నదేతడవుగా పోలేరమ్మ నిప్పులున్న మూకుడు
చేతబట్టుకొని ఘల్లుఘల్లున నడచివచ్చింది.
ఊరిపెద్ద నిర్ఘాంత పొయాడు.. చూస్తున్న వారికి
నోటమాట రాలేదు. ఇకనేముంది తీరువామాటే యెత్తలేదు. అందరూ స్వామికాళ్ళపైబడి క్షమాపణ
కోరినారు.
మరొకసారి
పోలేరమ్మ ఊరేగింపుకు రథం చేయమన్నారు వీరయ్యస్వామిని. కానీ రథంపని
అసలేమొదలుపెట్టలేదు స్వామి. ఊరిపెద్ద కోపగించుకొన్నాడు. కోపమెందుకూ రేపుగదా!
ఊరేగింపు అన్నాడు స్వామి. ఆ రేపూ వచ్చేసింది. కానీ రథంపని మాత్రం స్వామి
మొదలేపెట్టలేదు. ఊరిపెద్దలు స్వామిని పిలిపించారు. స్వామి గుడిదగ్గరికొచ్చి యేమే
పోలేరీ నీవు రథంలేదని
నడచిరాలేవటే? అన్నారు. అంతే పోలేరమ్మ గునగున నడచివచ్చింది. అందరూ
ఆశ్చర్యచకితులయ్యారు. స్వామి తన్నుతాను వీరబ్రహ్మేంద్రస్వామినని ప్రకటించారు. జీవుని
యెదలో దేవుడు కొలువైయున్నాడు. లోని దైవము మాట వినుట నేర్వండి. నేర్చి జన్మధన్యత
గావించుకొనుడని బోధించి, యిల్లుచేరుకున్నాడు.
స్వామివారికి
తొలిసంతానం కలిగింది. పేరు సిద్ధలింగయ్య. మామ శివకోటయ్య కోరిక ప్రకారం
సిద్ధలింగయ్యను దత్తతగా యిచ్చారు. కొడుకులులేని శివకోటయ్య సిద్ధలింగయ్యను దత్తత
తీసుకొని పరమానందభరితుడయ్యాడు. ఆపైన స్వామివారికి నలుగురు కొడుకులు ఒక కుమార్తె
కలిగారు. వారే గోవిందయ్య, శివరామయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య, వీరనారయణమ్మ
గార్లు. వారందరిని స్వామివారు పెద్దజేసి పెండ్లిండ్లు చేసినారు.
శిష్యుడైన
సిద్ధయ్య
ముడుమాల గ్రామంలొ దూదేకుల కులస్తులైన ఆదంబీ,పీర్‍సాహెబ్ దంపతులకు లేకలేక మగబిడ్డ గలిగాడు. వారు ఆ బాలునికి సైదులు అని పేరు పెట్టుకున్నారు. పిల్లవాణ్ని గారాబంగాపెంచుకొన్నారు. బాలుడు చిన్నతనంనుండి భక్తిప్రపత్తులుగలిగి సాధువులు గురువులంటే గౌరవభావంగలిగి వారి దరిచేరి తత్త్వవిచారణ చేస్తూవుండేవాడు. అతడు ఆనోటా యీనోటా విని కందిమల్లయపల్లెలోని వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించటానికివెళ్ళి, ఆయన బోధలకు ఆకర్షితుడై అక్కడే స్వామివారి శిష్యుడై పోయాడు. ఎన్నాళ్ళకూ పిల్లవాడు తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు సరాసరి కందిమల్లయపల్లె మఠం వచ్చి కొడుకును ఇంటికిరమ్మన్నారు. స్వామి వెళ్ళమన్నారు. అమ్మగారైన
గోవిందమ్మ,కొడుకులు
గోవిందయ్య, శివరామయ్య
పోతులూరయ్యాదులు, నీవు
ముసల్మానువు మామఠంలో వుండొద్దు పొమ్మన్నారు. ఐనా సైదులు (సిద్ధయ్య) వెళ్ళనంటే
వెళ్ళనని తెగేసి చెప్పినాడు. స్వామి సిద్ధయ్య పట్టుదలచూసి మఠంలో వుండటానికి
అంగీకరించారు. ఇక చేసేదిలేక పీరుసాహెబ్ నేరుగా సిద్ధవటం నవాబు వద్దకువెళ్ళి
బ్రహ్మంగారిపై ఫిర్యాదు చేసి, తన
కుమారుని తనకిప్పింపమని వేడుకున్నాడు. నవాబు మఠానికి తాఖీదు పంపాడు. సిద్ధయ్య
నేనేవెళ్ళి నవాబును దర్శించి తాఖీదుకు బదులిచ్చి వస్తానన్నాడు. స్వామి సరేనన్నారు.
సిద్ధయ్య సిద్ధవటం వెళ్లి
నవాబు దర్బారులో సలాముచేయకుండా నిలబడ్డాడు. నవాబు అగ్రహోదగ్రుడయ్యడు. మర్యాద
తెలియదా? ఇదేనా నీ గురువు నీకు
నేర్పినది, అని గద్దించాడు.
సిద్ధయ్య అందులకు శాంతంగా, నెమ్మదిగా
యిలాఅన్నాడు. నవాబ్‍సాహబ్! నాస్ సలాం గ్రహించటానికి మా గురువుగా
రొక్కరే తగినవారు.
ఇతరులు భరించలేరు. మీ మేలుగోరియే మీకు సలాము చేయలేదు. అంతేగాని మీమీద
గౌరవములేకకాదని వివరించెను. అందులకు నవాబు మరింత మండిపడి, అట్లైన నీసలామ్ శక్తి
చూడవలసినదే కానిమ్మనెను. అందులకు సిద్ధయ్య ఒక రాతిగుండును తెప్పించండి, దానికి తొలుత
సలాముచేసెద. ఆ తర్వాత తమరి యిచ్ఛానుసారం నడచుకొందుననెను. నవాబు వెంటనే ఒక
పెద్దనల్లరాతి గుండును తెప్పించి సభమధ్య పెట్టించి సిద్ధయ్యను సలాముచెయ్య మనెను. సిద్ధయ్య దానికి సలాముచేసిన
మరుక్షణమే "ఢమాల్" మని పగిలి ముక్కలుముక్కలాయెను. నవాబు భయపడిపోయి
సిద్ధయ్యను వారిగురువులను మహాత్ములుగా అంగీకరించి, కందిమల్లయపల్లెకు
సగౌరవముగా పంపించివైచెను. ఆ విధంగా బ్రహ్మంగారి శిష్యులలో సిద్ధయ్య ముఖ్యుడై
పోయెను. ఈసందర్భములో గురుశిష్యుల అనుబంధాన్ని గురించి కొంత చర్చించుకోవలసిన
అవసరముంది. గురుశిష్యులబంధం
అత్యంత పవిత్రమైనది. అదితల్లీబిడ్డలబంధమునకన్నా,అన్నదమ్ములబంధమునకన్నా.
తల్లీబిడ్డలబంధమునకన్నా, అన్నదమ్ములబంధమునకన్నా.
భార్యభర్తలబంధమునకన్నా
గొప్పది. సంపాదించిన ఆస్తిని బిడ్డలు పంచుకుంటారు. అందుకు
తండ్రి ఇష్టాయిష్టాలతో పనిలేదు. వారసత్వంగా ఆస్తి బిడ్డలదైపోతుంది. కానీ
ఆధ్యాత్మికసంపద అట్లు కాదు. భార్యాబిడ్డలు,అన్నదమ్ములు, బంధువులు యెందరున్నా
అది ప్రియశిష్యునికే సంప్రాప్తమౌతుంది. దీనినడ్డుకొనేశక్తి యెవ్వరికీ వుండదు.
కులమత రక్తసంబంధముల కిది అతీతము. ఇది యోగబంధము. యోగమనగా కలయిక (వియోగమనగా యెడబాటు)
ఈ కలయిక అనన్యసామాన్య మైనది. ఇందులో గురువుశిష్యునిలోను శిష్యుడుగురువులోనూ
ఐక్యమైయుంటారు. ఇద్దరిమధ్య తేడానే వుండదు . చాలామంది
గురువును సేవించుకొని వెళుతుంటారు. వాళ్ళంతా తమను తాము ఆ గురువర్యుని శిష్యులమని చెప్పుకు0టారు.
అది గొప్పకాదు. నిజానికి ఆ గురువు దృష్టిని శిష్యుడు తన వైపున కాకర్షింప
జేసుకోవాలి. అప్పుదే అతడు నిజమైన శిష్యుడౌతాడు. అదీ శిష్యుని యోగ్యత. వాస్తవానికి
అట్టి శిష్యుని కొఱకు గురువూ అన్వేషిస్తాడు. నిజమైన గురువుకోసం శిష్యుడు, యోగ్యుడైనశిష్యుని
కోసం గురువు అన్వేషిస్తారు. ఇది లోకకల్యాణం కోసం పరస్పరం జరిపే అన్వేషణ. తన ఉద్ధరణ
కని శిష్యుడనుకోవచ్చు, కానీ
తన తదనంతరం తనవిధానాన్ని ముందుకు తీసుకపోవడం కోసం గురువు శిష్యున్ని
యెన్నుకొంటాడు. పెద్దలు యీ పరస్పరానుబంధాన్ని కొన్ని న్యాయాలతో (ఉదాహరణలతో)
సామాన్య జనులకర్థమయ్యేట్లు వివరించారు. అవి,
1. మార్జాలకిషోర
న్యాయం:- పిల్లి తనపిల్లను అతిలాఘవంగా నోటితో పట్టుకొని సురక్షిత ప్రదేశానికి చేరుస్తుంది. అదేసమయంలో పిల్లిపిల్ల అటూ యిటూ కదలకుండా
తల్లికి సహకరిస్తుంది. ఇక్కడ పిల్లి గురువు, పిల్ల శి ష్యుడు. ఈ
పద్ధతిలో గురువు శక్తి ప్రాధాన్యత వహిస్తుంది. శిష్యుడు మాత్రం కేవలం తనగురువు సహాయాన్ని గుర్తెరిగి సకరించవలసి వస్తుంది.
2. మర్కటకిశోర న్యాయం:-
కోతి తనకై తాను ఒకకొమ్మనుండి మరోకొమ్మకు దాటుకుంటూ వెళుతుంది. అదేసమయంలో కోతిపిల్ల
తల్లిపొట్టను గట్టిగా పట్టుసడలకుండా హుషారుగా పట్టుకొని తల్లి చేర్చిన గమ్యం చేరుతుంది. ఇక్కడ తల్లికోతి స్థానంలో గురువుంటాడు, కానీ పిల్లస్థానంలో
వున్న శిష్యుని వివేకానిదే ప్రాధాన్యత. అలా శిష్యుడు గురువు సహాయం పొంది
తరిస్తాడు.
3. భ్రమరకీటక న్యాయం:-
తుమ్మెద ఒక పురుగును తీసుకొనివచ్చి తనగూటిలో వుంచి, నిరంతరం పురుగును
వేదిస్తూ రొదచేసి గీపెట్టి భయపెడుతుంది. పురుగు వేదనను భరిస్తూ కొన్నాళ్ళకు అదే
తుమ్మెదగా మారిపోతుంది. ఇక్కడ గురువు తుమ్మెద. శిష్యుడైన కీటకమునకు కఠినంగా
శిక్షణనిచ్చి తనవలె పరిపూర్ణుని చేస్తాడు. ఇక్కడ యోగ్యుడైన శిష్యుని యెన్నుకోవడం
దగ్గరనుంచి, శిష్యుని తనంతవాణ్నిగా
చేసేవరకూ గురువే భాధ్యతవహిస్తాడు. ఇలా గురువు శిష్యుని తీ యోగ్యతనుబట్టి
పై మూడున్యాయలను అవసరానికి తగ్గట్టు చేపట్టి శిష్యుని ఉద్ధరిస్తాడు.
గురుశిష్యుల
సంబంధమునుగూర్చి మరో మాటలో పెద్దలిలాచెప్పారు. పరుసవేది
దేన్ని తగిలితే అది బంగారమై పోతుంది. అంతే. కానీ, పరుసవేది స్పర్శతో
పరుసవేది తయారుకాదు. కానీ గురువు మాత్రం శిష్యుని గురువుగా మార్చేస్తాడు. అదీ
గురువు మహాత్మ్యము. దీనిని బట్టిచూస్తే గురువు శిష్యుని నుండి సేవలు పొంది
దీవించడమేకాదు, గురువు తనుసాధించి పొందిన ఆధ్యాత్మికస్థితులన్నిటిని
ధారబోసి శిష్యునిచేయి పట్టుకొని దారిచూపి వెంటనడిచి, గమ్యముచేర్చి
తననుమించినవానిగా తీర్చిదిద్దుతాడు. అతడే సద్గురువు. ఈవిషయం వివరించే కథ ఒకటుంది.
అది యిలాసాగుతుంది. శిష్యుడు ధ్యానంలో ఒక విచిత్రానుభూతిని పొందాడు. గురువు
శిష్యుడు నదిఒడ్డున ముందుకు సాగుతున్నారు. తనపాదముద్రలూ గురువు పాదముద్రలూ
శిష్యుడు ఇసుకలో గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒకజతపాదముద్రలే కనబడసాగాయి. వెంటనే
శిష్యుడు ఆ పాదముద్రలు తనవిగా భావించి, గురుదేవా!
మీరెక్కడున్నారు! నన్నేల విడిచి వెళ్ళారని రోదించినాడు. వెంటనే గురువు, శిష్యా! అవి
నాపాదముద్రలు, నీవికావు, నీవు నా
భుజంపైవున్నావు. ఈ దారిన నడచు శక్తి నీకు లేకపోవడంవల్ల నేనే నిన్ను నా
భుజంపైయెక్కించు కొని ముందుకువెళుతూ నిన్ను గమ్యం చేర్చేపనిలోవున్నా నన్నాడు. అదీ
గురువు బాధ్యత. అంత గురుతర బాధ్యత వహించిన గురువు బ్రహ్మంగారైతే, విడువక గురుసేవలో
నిమగ్నమై తన ఆధ్యాత్మికప్రయాణంలో గురువుకు సంపూర్ణసహకారమందించి, పన్నెండు సంవత్సరాలు
శారీరకంగానూమానసికంగానూ, తదుపరి జీ వితాంతం మానసికంగా
గురుసేవలో తరించి, భగవదైక్యం
పొందిన శిష్యుడు సిద్ధయ్య.
గురుశిష్యుల
అనుబంధానికి సంబంధించిన ఉదాహరణలు మనపురణాలలోనూ అనేకమున్నాయి. ఏకలవ్యుడు గురువుచే
తిరస్కరింపబడినా, తన
శ్రద్ధాభక్తుల గరిమతో ద్రోణాచార్యులప్రతిమపై మనసు నిలిపి అనితరసాధ్యమైన విలువిద్య
నభ్యసించినాడు. అర్జునుడు కఠోరసాధన, గురుభక్తివలన
జగదేకవీరుడయ్యాడు. గురువుకు ప్రీతి
పాత్రుడైన
గురుపుత్రుడు అశ్వద్ధామ కంటే మిన్నగా గురువు నుండి రణవిద్యల
నేర్చినాడు. గురువు శ్రద్ధగలశిష్యునికి తెలియకుండా యేమీ దాచుకోజాలడు. ఆ ప్రేమ
అట్టిది. అయితే వీరి విద్యలు రణవిద్యలు. ఆధ్యాత్మికవిద్యయే అసలైనవిద్య. అసలు
విద్యంటే అదే. ఆ విద్యలో గురువుగా బ్రహ్మంగారూ శిష్యుడుగా సిద్ధయ్యా ఆరితేరినవారు.
వారికిసాటివారేనని లోకప్రతీతి.
కక్కయ్య
కందిమల్లయపల్లె తలారి
కక్కయ్య. సజ్జనుడు. కులమునకు పంచముడేగానీ. శ్రద్ధాభక్తులుగలిగిన భాగవతుడు.
గ్రామంలో దొంగతనాలూ, అరాచకాలూ
జరగకుండా రాత్రిళ్ళు గస్తీ తిరిగేవాడు. అతడు ఆ రాత్రులలో స్వామివారు తమభక్తులకు
చేయు బోధలన్నీచాటుగా కూర్చొని విని
ఆకలింపుజేసుకోవడానికి సతమతమౌతూ వుండేవాడు. బ్రహ్మంగారు కుండలినీశక్తినీ షట్(6)
చక్రములను వాటి అధిష్టాన దేవతలను వారు మానవ శరీరమున నుండు
స్థానములనూ వివరించు
చుండగావిని, అంతాతెలిసినదని
ఆనందపడి, పరుగు పరుగున
యింటికివెళ్ళి నిద్రించుచున్న తనభార్య ముత్యాలమ్మను సూరకత్తితో ఖండఖండములుగాకోసి స్వామిచెప్పిన తావులలో దేవతలకై
వెదుకసాగెను. కక్కయ్యకు రక్తమాంసములుతప్ప మరేమీ కనిపించలేదు. దేవతలమాట అటుంచి
భార్య శవమై మిగిలింది. కక్కయ్యకు దుఃఖమాగలేదు. ఆ స్వామిమాయమాటలు విని అన్యాయముగా
తనభార్య ముత్యాలమ్మను చేజేతులా చంపుకొంటినని రోదించసాగెను. స్వామి దివ్యదృష్టితో
యిదెల్ల గమనించి, చక్కగా
కక్కయ్యయింటికి వచ్చిచేరి, తన
కమండలువులోని నీటినిచల్లి ముత్యాలమ్మనుబ్రతికించి, కక్కయ్యను మందలించి, కొంతశాంతించి, కక్కయ్యను
పద్మాసనాసీనుని గావించి, దీక్షనొసగి, దృష్టిని
అంతర్ముఖము గావింపజేసి షట్చక్రములను కక్కయ్యలోనే జూపి వాటి అధిష్టానదేవతలనూ
దర్శించునట్లు జెసెను. ఆ తర్వాత కక్కయ్యను బ్రహ్మజ్ఞానిని చేసి తన శిష్యులలో
ముఖ్యునిగా బ్రహ్మంగారు చేర్చుకొనెను. ఇలా ఒకరొకరే చేరుతూ కులమతాలకతీతంగా
వీరబ్రహ్మేంద్రస్వాముల వారి శిష్యపరంపర పెరిగిపోయింది.
సిద్ధయ్య
గురుభక్తి
బ్రహ్మంగారి
శిష్యులు చాలామంది సిద్ధయ్యను తక్కువగా చూసేవారు. అతన్ని ముసల్మానుడని
నిరాదరించేవారు. ఇది గమనించిన స్వామి ఒకరోజు దేశసంచారములో నుండగా దారిలో
ఒకకుక్కశవం చూశారు. అది పురుగులుపడి దుర్వాసన గొడుతున్నది. స్వామి ఆ కుక్కశవాన్ని
చూపి శిష్యులను తినమన్నారు. శిష్యులు అసహ్యించుకొని తమవల్ల కాదన్నారు. అట్లే
స్వామి తనకొడుకులనూ కోరాడు. వారూ విముఖత జూపించారు. ఇక ఆఖరుగా సిద్ధయ్యా నీవు
తినవయ్యా అన్నారు. గురునాజ్ఞ శిరోధార్యమంటూ కుక్కచెంత కూర్చోగానే ఆ కుక్క షడ్రసో
పేత
మైన వంటకములు
విస్తరిలో వడ్డించినట్లైపోయాయి.
ఇకనేముంది,
సిద్ధయ్య కడుపారా
భోంచేశాడు. అప్పుడు సిద్ధయ్యను యితరశిష్యులకూ, కొడుకులకూ
జూపి, ఇందుకే వీడునాకు
ఇష్టుడు.
మీరు యీతనిపై
మాత్సర్యం మానండి. తమ్మునిగా
అదరించండని హితవు
పలికారు.
స్వామి
ఆ త ర్వా త
అనేకసార్లు దేశసంచారం చేశారు. బోధామృతాన్ని వర్షించారు. సిద్ధవటంనవాబును
కలిసికొన్నారు. నవాబు సిద్ధయ్య ద్వారా మున్నే స్వామిఘనత తెలిసినవాడు గనుక
ఘనసత్కారము గావించినాడు. ప్రజానురంజకుడవై పేరు గడింతువని దీవించి, కడప
నవాబూను కలుసుకొన్నాడు.
అతనిచే గౌరవించబడి, కులమతాల
కతీతంగా ప్రజలను
చక్కగా పాలించి కీర్తిమంతుడవుకమ్మని దీవించినాడు. స్వామి పుష్పగిరి వెళ్ళారు.
అక్కడి విప్రులు స్వామిఅధికారాన్ని ప్రశ్నించి పల్లకీ దిగి వెళ్ళమన్నారు. స్వామి
వారికి యెంత నచ్చజెప్పినను వినలేదు. స్వామి కళ్ళెర్రజేసినాడు. అంతే అగ్రహారం
తగలబడి పోయింది. బ్రాహ్మణులు దిగివచ్చి స్వామికి క్షమాపణలు చెప్పినారు. స్వామి
శాంతించి కరుణార్ద్రదృక్కులు ప్రసరింపజేసినారు. అగ్నిజ్వాలలు మాయమై అగ్రహారం మళ్ళీ
మామూలుగా కనిపించింది. అక్కడి బ్రాహ్మణులకు జాత్యహంకారము పతనహేతువని బుద్ధిగరిపి
ముందుకు సాగారు.
నంద్యాలవిశ్వబ్రాహ్మణులుస్వామిని ధిక్కరించి, మాయమాటలతో
హస్తలాఘవముతో జనులను మోసగిస్తూ కులమునకు చెడ్డపేరు తెస్తున్నావని నిందించారు.
చేతనైతే మాపరీక్షకు నిలవమన్నారు. పుట్టెడు బియ్యం అన్నంగా వుడికించి తినుమని
నిర్భందించినారు. స్వామి చిరునవ్వునవ్వి యీ పనికి నాదాకాయెందుకు మా సిద్ధయ్యచాలడా? అంటూ సిద్ధయ్యవైపు
చూశాడు. సిద్ధయ్య సంసిద్ధమయ్యాడు. స్వామి ఒకముద్ద చేతిలోనికి తీసుకొని ఇక
కానీమన్నడు. సిద్ధయ్య అన్నంమొత్తం తినేసి ఇంకా
కావాలన్నాడు.
విశ్వబ్రాహ్మణులు విస్తుపోయారు. స్వామిని శరణువేడి,
క్షమించమన్నారు.
స్వామి తనచేతిపిడచ సిద్ధయ్యకిచ్చి యిక తృప్తిపడు, లే అన్నారు. ఆ
ముద్దతిని కడుపునిండినదని త్రేన్చి లేచినిలబడ్డాడు సిద్ధయ్య. అలావారి గర్వమణచి
స్వామి కర్నూలు బయలుదేరారు.
మళ్ళీ ప±¿°µ
కర్నూలునవాబు స్వామికి
స్వాగతంపలికాడేకాని, ఆయన్ను
దైవాంశ
సంభూతునిగా నమ్మలేదు.
నవాబు తనవద్దనున్న నిండుచూలాలైన గుఱ్ఱాన్ని చూపించి, ఇది ప్రసవవేదనతోవుంది
ఇంకాసేపటిలో ఈనవచ్చు కనుక స్వామీ! మీరు నిజంగా దైవాంశసంభూతులే అయితే, దీనికి పుట్టే పిల్ల
ఆడో, మగో చెప్పండి చూద్దాం
అన్నాడు. స్వామి ఒక్కనిముషం కనులు మూసి తెరచి మగపిల్ల పంచకల్యాణి పుడుతుందని
చెప్పడమేగాకుండా,
దాని వన్నెచిన్నెలన్నీ
చెప్పినారు. గుఱ్ఱం ప్రసవించింది. అచ్చం స్వామిచెప్పి
నట్లే జరిగింది. నవాబు
ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామిని నమ్మాడు.
ఒకసారి
స్వామి, సిద్ధయ్యా శ్రీశైలం
వెళ్ళి తిరుగుప్రయాణంలో వున్నారు. అది మంచి యెం డాకాలం. దూరప్రయాణం కావడంవల్ల గురుశిష్యులు అలసిపోయారు.
బాగా దప్పికయింది. సొరకాయబుర్రలో తెచ్చుకొన్న నీళ్ళు అయిపోయాయి. దారిలోని పల్లెకు
చేరుకొన్నారు. ఒకయింటిముంగిట స్వామి నిలబడ్డారు. సిద్ధయ్య లోనికివెళ్ళీ కొలిమివద్ద
కూర్చొని బంగారునగలు చేస్తున్న ఆచారిని చూశాడు. అయ్యా బహు
దూరం నుండి వస్తున్నాం, మా గురువర్యులు
శ్రీశ్రీవీరబ్రహ్మేంద్రస్వాముల
వారికి దాహంగావుంది.
దయచేసి కాస్తా మంచితీర్థమివ్వండి. అని వినయంగా అడిగాడు. దానికి ఆ ఆచారి
అగ్రహోదగ్రుడై అంతా దొంగస్వాములు, పనీపాటాలేక
వూళ్ళుపట్టుక తిరుగుతుంటారు. వెళ్ళండి, వెళ్ళండి.
నీళ్ళులేవు గీళ్ళూలేవు వెళ్ళండని కసురుకొన్నాడు. అయ్యా! తమరు పొరబడుతున్నారు, మాస్వామి సాక్షాత్భగవత్స్వరూపులు. వారు మీయింట జలపానం చేయడం మీరు చేసుకున్న పుణ్యం.
దయచేసి నీళ్ళివ్వండి, వారు
దప్పికతోవున్నారు. అని సౌమ్యంగాఅడిగాడు. ఆ ఆచారిమరింత కోపోద్రిక్తుడై ఏమన్నావ్
మీస్వామి అంత ఘనుడా! అయితే రమ్మనండి యీ కాగే బంగారు పోస్తాను త్రాగుతారు. రమ్మనండి
అని గద్దించాడు. ఆమాటవింటూనే స్వామి లోనికి వచ్చి చేయిచాచాడు. ఆచారి రవ్వంతైనా
ఆలోచించకుండా ఆ కాగే బంగారమున్న మూసను పట్టకారుతో పట్టితెచ్చి స్వామిచేతిలో
పోశాడు. స్వామి దాన్ని గుటుక్కున తాగేశాడు. ఇకనేముంది ఆచారి గుడ్లుతేలేశాడు. నా
బంగారు నా బంగారమంటూ యేడ్వసాగాడు. స్వామి కాళ్ళపైబడి క్షమింపుడని
బ్రతిమలాడుకున్నాడు. స్వామి కరుణించి వాని దోసిటిలోకి బంగారాన్ని తననోటినుండి
జారవిడిచి, వెనుదిరిగాడు. అతడు
స్వామి కాళ్ళుపట్టుకొని ప్రార్థించి వేడుకొని త్రాగుటకు మంచినీళ్ళేకాదు, అర్ఘ్యపాద్యములొసగి
పంచభక్ష్యపరమాన్నములతో భోజనముపెట్టించి ఆశీర్వాదముపొంది,
స్వామిని సిద్ధయ్యను
సాగనంపినాడు. నాడుమొదలు ఆ ఆచారి కందిమల్లాయపల్లెమఠం, తీరికదొరికినప్పుడల్లా
సందర్శిస్తూ వుండేవాడు.
ఆనాటి
ముస్లిం పాలకులను తన మహిమలచేతా, కాలజ్ఞానం
చెప్పడంద్వారా తనవైపున కాకర్షించి, వారికి
హితోపదేశంచేసి వారిని సక్రమమార్గంలో నడిపి పరపీడనమునుంచి సామన్యప్రజలను
కాపాడినాడు. మరికొంతమందికి వారి యోగ్యత ననుసరించి సూక్ష్మతరమైన ఆధ్యాత్మిక
విద్య బోధించి, వారు
పరతత్వమెరుగునట్లుచేసి ఉత్తమోత్తమ దేశికోత్తము
లై వెలుగొందినారు.
లోకము బ్రహ్మముగారంతటి గురువు, సిద్ధయ్యవంటి
శిష్యుడు లేడని వేనోళ్ళ శ్లాఘించింది.
అవతార
సమాప్తి
స్వామివారికి
యెనుబదియైదు సంవత్సరాల వయస్సు పైబడింది. అవతారము చాలించాలని స్వామి
నిర్ణయించుకున్నారు. తాను జీవసమాధి కావడానికి భార్యాబిడ్డలను, శిష్యులను
ఒప్పించినారు. జీవసమాధికి శ్రీముఖనామసంవత్సరం (1693) వైశాఖశుద్ధదశమి మధ్యాహ్నం ముహూర్తంగా నిర్ణయించబడింది.
అనేకప్రాంతములలోని తన శిష్యులకు నవాబులకూ ఉత్తరాలు వ్రాయించారు స్వామి. నవమినాటి
రాత్రి స్వామి సిద్ధయ్యను పిలిచి, బనగానిపల్లె
అడవికి వెళ్ళి దేవదారుపూలు తెమ్మన్నాడు. తెల్లవారకముందే పూలకు బయలుదేరమన్నాడు
స్వామి. సిద్ధయ్య అలాగే బయలుదేరాడు. శక్తినంతా కూడదీసుకొని నడిచాడు సిద్ధయ్య. కానీ
సమయానికి తిరిగిరాలేకపోయాడు.
స్వామి
అనుకున్న సమయానికి స్నానసంధ్యాదులు ముగించుకొని భార్య గోవిందమ్మనుపిలిచి, నేను
శాశ్వతుడను. నాకునాశములేదు. నాసమాధినుండి నేను నాభక్తులను యెల్లవేళలా కాపాడుతూనే
వుంటాను. కనుక నీవు పసుపుకుంకములు తీయవద్దు. నిత్యసుమంగళిగా జీవించమని
ఆజ్ఞాపించినారు. పెద్దకొడుకు గోవిందయ్యను పిలిచి మఠం జాగ్రత్తగా చూచుకో, నీ
తర్వాత నీ చెల్లెలు వీరనారాయణమ్మ సంతతి యీ మఠం బాధ్యతలు వహిస్తారని చెప్పి, స్వామిని
కడసారి దర్శించుకోవడానికి వచ్చిన సమస్తజనాన్ని దగ్గరకు పిలిపించుకొని దీవించారు.
తమకుమారు
డైన గోవిందయ్య
కుమార్తె ఈశ్వరమ్మ తనవలెనే మహిమలు జూపి భక్తుల రక్షిస్తుందని తెలిపి, కడసారి
భాషణముగా మరొకసారి కాలజ్ఞానం యిలా వినిపించారు.
నాయనలారా!
జాతులన్నీ యెవరికివారై విడిపోయి కలహాలకుదిగుతారు. జాతి బలహీనమై పరదేశీయులు
పాలకులౌతారు. గ్రంధి యనువాడొకడు ఉత్తరమునబుట్టి యేకు మేకైనట్లు జనబలంతో తిరిగీ
స్వరాజ్యాన్ని తెస్తాడు. ఐదువేలపైన కలిలో జాతులన్నీ ఒకటైపోతాయి. తల్లీబిడ్డలు
తగవులాడతారు. ముండమోపులు ముత్తైదువులౌతారు. శ్రీశైలంపై నిప్పులు కురుస్తాయి.
వీరభోగవసంతరాయుడనై నేను తిరిగి జన్మిస్తాను. ధర్మాన్ని స్థాపిస్తాను. దూర్తులను
దండిస్తాను. పాపులు నశించిపోతారు. కృతయుగ ధర్మం నిలిపి పరిపాలిస్తాను. నా
భక్తులుచెడరు. అనిచెప్పి స్వామి నిర్ణయించుకొన్న ముహూర్తానికి సమాధిలో
ప్రవేశించినారు.
సిద్ధయ్య
ప్రయాణంలో వుండగానే తెల్లవారిపోయింది. చకచకా సూర్యుడు ఆకాశానికెగబ్రాకాడు. కానీ
తాను బనగానిపల్లె దరిదాపులకు కూడా పోలేదు. అప్పుడొక పండువృద్దుడు యెదురుపడి, సిద్ధయ్యా!
ఇదిగో ఇక్కడి చెట్ల ఆకులూ, పూలూ
తొందరగా కోసుకొని జోలెలోవేసుకొని తిరిగి వెళ్ళు, మీ
స్వామి మరుగుపడేసమయ మాసన్నమైంది, అంటూ
అంతర్ధానమయ్యాడు. సిద్ధయ్య తేరుకొని ముసలాయనమాటలు గురువాక్యములుగాతలచి. చకచకా
ఆకులలుములు దూసి జోలెలో పోసుకొని
చుసుకొనేసరికి అవి దేవదారుపూలయ్యాయి. సిద్ధయ్య పరుగుపరుగున కందిమల్లయపల్లె చేరుకొన్నాడు. కానీ అప్పటికే
స్వామి సమాధిలోకి వెళ్ళిపోగా, వచ్చినవారందరూ తీర్థప్రసాదాలు అందుకొని, తిరుగు ప్రయాణంలోవున్నారు. సిద్ధయ్యకు దుఃఖమాగలేదు. సమాధి
చెంతచేరీ స్వామీ!
ఎంతపని చేసినావయ్యా! తల్లిదండ్రులనూ, వున్న
వూరు విడచి ఇన్నేళ్ళు నీ పంచనబడి సేవచేసితినే, కడసారి
ఒక్కమాటైనా చెప్పకుండా సమాధిలో కూర్చొన్నావే? ఇదేమి
ధర్మం స్వామీ! ఇకనేను బ్రతికి ప్రయోజనమేమి? అంటూ
సమాధిరాతికి తలమోదుకొన్నాడు. తలపగిలి రక్తంస్రవించింది. ఐనా సిద్ధయ్య
తలబాదుకుంటూనేవున్నాడు. హృదయ విదారకంగా
రోదిస్తూనేవున్నాడు. అప్పుడు సమాధిలోని స్వామి కనికరించి సమాధిపైనున్న బండను
తొలగించుకొని బయటికివచ్చి, సిద్ధయ్యనోదార్చి. సిద్ధా! నీపేరు యీ లోకము మరువకుండుటకే
నేనింతపనిజేసితిని. దుఃఖించకు. నీవేనాకు నిజమైన వారసుడవు. అందుకు గుర్తుగా ఇవిగో
నా పాదుకలు, యోగదండం, చేతిబెత్తం శిఖాముద్రిక తీసుకో. వెళ్లి ముడుమాలలో మఠం
నిర్మించుకో తల్లిదండ్రులు నిర్ణయించిన కన్యను వివాహమాడి, హాయిగా
జీవిస్తూ నా ప్రియశిష్యునిగా నాకు ప్రతినిధిగా నా అనుయాయులకూ, నీభక్తులకూ
మార్గదర్శివై యశోవిరాజితుడవై వర్ధిల్లమని దీవించి స్వామి తిరిగీ సమాధిలో ప్రవేశించినారు.
బ్రహ్మంగారి
కుమారుడైన పోతులూరయ్య, స్వామి సమధిలో
ప్రవేశించేసమయంలో అక్కడలేడు. కనుక విషయాలు సంపూర్ణంగా ఆయనకు తెలియవు. మఠం
నిర్వహణకోసం గ్రామలకు వెళ్ళి ఆయన సహాయమర్థించినపుడు, కొందరు
గ్రామస్తులు ఆయన్ను నిందించి,
మీతల్లి గోవిందమ్మ ముత్తైదువుగా
తిరగడం తప్పన్నారు. పోతులూరయ్య బాధపడ్డాడు. మఠంచేరుకొని నిజనిర్ధారణకోసం
తండ్రిసమాధిపైబండను తొలగించి సమాధిస్థితిలోనున్న స్వామిని తట్టిలేపాడు. స్వామి
కళ్ళుతెరచి,
తప్పుచేశావు, వెళ్ళి
పదురెండేండ్లు వనవాసంచెయ్యి. పాపప్రక్షాళణచేసుకో వెళ్ళూ అన్నారు. పోతులూరయ్య
పశ్చతాపపడి సమాధి పైబండను యధా
విధిగామూసి, తనతల్లి
పసపుకుంకుమలతో ముత్తైదువుగావుండటం సబబనీ, తనతండ్రి
అనునిత్య సజీవుడని గ్రహించి, తండ్రి
ఆజ్ఞానుసారం పదురెండేళ్ళు వనవాసంచేసి తరించాడు.
ముడుమాల సిద్ధగురుడు
స్వాములవారి
ఆనతిని తలదాల్చిసిద్ధయ్య అచ్చాంబీ యను కన్యను వివాహమాడి రాజయోగిగా విరాజిల్లుతూ
ముడుమాలలో మఠం నిర్మించు
కొని తనగురువుగారి
భావనలను లోకవ్యాప్తంగావించినారు. తాను మతా
తీత ఆధ్యాత్మికవాదిగా
నిలచి, ఆధ్యాత్మికస్థితివరకూయెదగని
మత
ఛాందసులకు గట్టిగానే
సమాధానం చెప్పినాడు.
ఏకులమని నను
వివరమడిగితే
ఏమని
తెలుపుదు లోకులకు-పలు
గాకులకు
దుర్మార్గులకు, యీ
దుష్టులకు."
అని తనను దూదేకుల
కులస్తునిగా చిన్నచూపు చూచిన వారి నుద్దేశించి, తనకులం
కాదు జనులుచూడవలసింది, తను ఆధ్యాత్మిక
రంగంలో సాధించిన
స్థాయి చూడమని మందలించినాడు.
తను
గురువువద్ద నేర్చిన విద్యను శిష్యులకు బోధించి, వారిని
సాధకులుగామార్చి గమ్యము చేర్చినారు. సిద్ధగురుని కుమారుడు పెద్దపీరయ్య కూడా
తండ్రియంతటి సాధకుడై గురుపదమలంకరించినాడు. అంతేగాదు సిద్ధగురునకు అనేకమంది
శిష్యులు కూడా యేర్పడి,
బ్రహ్మంగారి
శిష్యపరంపరను కొనసాగించినారు. వారిలో పలుగురాళ్ళ
పల్లెగోవిందస్వామి, మాధవరం
వాస్తవ్యులైన భీమిశెట్టికొండయ్య, కడప
సమీపగ్రామస్తుడైన మామిళ్ళపల్లె నారాయణరెడ్డి కమ్మేటిపల్లె పాపులమ్మ,
బుగ్గలేటిపల్లె
తిమ్మారెడ్డి ముఖ్యులు. పలుగురాళ్ళపల్లె తిమ్మారెడ్డి పాము కరచి మరణిస్తే,
అతన్ని బ్రతికించి శిష్యునిగా చేసుకొన్నాడు సిద్ధగురుడు.
సిద్ధగురుడు
కూడా దేశసంచారంచేసి తత్త్వబోధగావించి తన గురువుగారు యేర్పరచిన మార్గమున లోకకల్యాణం
కొఱకు పాటుబడి
నారు. గురువువలె తానూ
అనేక మహాత్మ్యాలు చూపి తన స్థాయిని నిరూపించుకొన్నారు. మచ్చు నకొక సంఘటన జ్ఞాపకము
చేసుకొందాం.
ఒకసారి
ముడుమాలలో ఆధ్యాత్మికకూటమి జరుగుతూవుంది. సిద్ధగురుడు అనేక తత్త్వరహస్యాలు విప్పి
చెబుతూ మధ్యలో ఉన్నట్టుండి "దశా దశా" అని రెండుమూడుసార్లు గద్దించెను.
సభలోని గ్రామపెద్దలు సిద్ధగురుని అపార్థముచేసుకొని మమ్ములను కించపరచుటకే, మమ్ముల
నుద్దేశించే అట్లు
గద్దించెనని అలిగి కన్నెర్రజేసి అక్కడనుండి
లేచి "ఈ
దూదేకులవాడొక గురువు. ఇతనిదొక బోధా! " యని అహంకరించి చులకనజేసిమాట్లాడి వె ళ్ళిపోయినారు.
సాయంత్రం ఆవులమందలు అడవినుండి గ్రామంచేరినవి. గోపాలకులు ఊరివారితో నేడు మమ్ములనూ గోవులనూ సిద్ధయ్యస్వామి పులిబారినుండి కాపాడి
నారని చెప్పిరి. ఆయన
సమయానికివచ్చి "దశా" అని పులిని గద్దించి తరిమివేసెననీ, లేకుంటే
చచ్చియుందుమని చెప్పిరి. ఇక్కడ సిద్ధగురుడు "దశా" అన్నసమయమూ, అక్కడ
అడవిలో గోపాలురకు కనబడి పులిని గద్దించిన సమయమూ ఒకటేనని పోల్చికొని, సిద్ధగురుని
గొప్పదనమును,
మహిమనూ జనులు
కొనియాడిరి. అలిగివెళ్లిన ఊరిపెద్దలు సిద్ధగురునికి క్షమాపణలు చెప్పి, నాటినుండి
ఆయనపై గౌరవమర్యాదలు చూపసాగిరి.
సిద్ధగురుడు
అలా సంపూర్ణసార్థకజీవనము గడిపి పరమ
పదించారు. ఆయనను
ముడుమాలమఠంలో సమాధిచేశారు. ముడుమాలసిద్ధగురుని మఠాన్ని ఇప్పటికీ చిన్నమఠమని
పిలుస్తూ, బ్రహ్మంగారి
భక్తులు పెద్దమఠంగాపిలువబడే బ్రహ్మంగారిమఠం తర్వాత యీ మఠాన్ని సందర్శిస్తున్నారు.
ముడుమాల
సిద్ధగురుని మఠంలో యిప్పటికీ పదకొండు తాళపత్రగ్రంధాలు చెక్కపెట్టెలో భద్రపరుచబడి
వున్నాయి. అందులో కాళీకాంబపద్యాలు, సౌజన్యపత్రికలు.
వేమనపద్యాలు, పరతత్త్వ రసాయనం, వివేకసింధువు
మరియు యోగలక్షణం వంటి గ్రంధాలున్నాయి. ఇవి కాక బ్రహ్మంగారు సిద్ధయ్యకు ప్రసాదించిన
పాదుకలు, యోగదండం, శిఖాముద్రిక
కూడా భద్రపరుచబడియున్నాయి. సందర్శకులు నేటికీ వాటిని దర్శించి ఆనందిస్తున్నారు.
తిరుపతి
ప్రాచ్యలిఖిత పరిశోధనా సంస్థలో కొన్ని సిద్ధయ్య వచనములు, మరియు
కడప సి.పి బ్రౌన్ గ్రంధాలయంలోనూ కొన్ని సిద్ధయ్య వ్రాసిపెట్టుకొన్న
తాళపత్రగ్రంధములు లభించుచున్నవి.
శ్రీమద్విరాట్‍పోతులూరి
వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాలజ్ఞాన రచయితయేగాక పుష్పవతియైన గోవిందమ్మను
వివాహమాడి సంఘ
సంస్కర్తగానూ, కులమత
తారతమ్యాలు లేకుండా శిష్యవర్గమును స్థాపించుకొని, మతసామరస్యమును
కాపాడినారు. అంతేగాక సంసార
జీవనము గడుపుతూ, కులవృత్తిసాగిస్తూ, రాజర్షియై
వెలుగొందినారు. స్వామివారి కుమార్తె వీరనారాయనమ్మ కర్నూలుజిల్లా నొస్సం
వాస్తవ్యులైన తిరుమలాచార్యుల ధర్మపత్ని. వారి సంతతిలోని వారే ప్రస్తుత పీఠాధిపతి
శ్రీశ్రీవెంకటేశ్వరస్వాములవారు. వీరు బ్రహ్మంగారికి యేడవతరంవారు. కందిమల్లాయపల్లె
గ్రామమే ప్రస్తుత మండలకేంద్రమైన బ్రహ్మంగారిమఠం. దీని సమీపంలోనే బ్రహ్మంసాగర్ అను
తెలుగుగంగ ప్రాజెక్ట్ వెలసినది. ఈశ్వరమ్మమఠం, కక్కయ్యమఠం, పోలేరమ్మగుడి
బ్రహ్మంగారిమఠం సమీపంలోనేవున్నవి. సిద్ధయ్యగారిమఠం బ్రహ్మంగారిమఠానికి సుమారు
పదునైదు కి.మీ దూరంలో ముడుమాల గ్రామంలో
వున్నది. ముడుమాల మఠానికి
సిద్ధయ్య వంశస్తులే పీఠాధిపతులు.
ఆరాధనోత్సవములు
బ్రహ్మంగారిమఠం
కడపజిల్లా మైదుకూరుకు ముప్పదియైదు కి.మీ దూరములో యున్నది. మైదుకూరు నుండి గానీ అటు
బద్వేలు నుండిగాని విరివిగా బస్సు సౌకర్యము కలదు. కడపనుండిగానీ నెల్లూరునుండిగానీ
నేరుగా బ్రహ్మంగారిమఠానికి బస్సులోవెళ్ళవచ్చును.
ప్రతిసంవత్సరము
బ్రహ్మంగారి ఆరాధనోత్సవములు వైశాఖశుద్దదశమి రోజున జరుగును. ఆరాధన రోజున మఠాధిపతి
కమండలువు, పాదుకలూ, ఛత్రమూ
ధరించి, భక్తులకు
దర్శనమిస్తారు. ఆరోజున జనులు తండోపతండములుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని
ధన్యులౌతారు.
శ్రీవీరబ్రహ్మేంద్ర
గురు బోధ
సద్గురు సేవ
సకలశ్రేయోదాయకము. ఐతే బ్రహ్మంగారి వలె అందరూ సద్గురువులు కారు. బోధగురువులేకాదు, బాధ
గురువులూ వుంటారు. వ్యక్తిగత సేవలు పొందటానికి, ధనార్జనకూ
శిష్యులనాకర్షించి వారికి
లేనిపోని ప్రాపంచిక లాభముల ఆశ జూపి లోబరచుకొనువారు బాధగురువులే కానీ బోధగురువులు
కారు. ఈ విషయాన్ని తేటతెల్లంచేస్తూ బ్రహ్మంగారు..
ఆ:వె. వేనవేలు
శిష్యవిత్తాపహారకుల్
కలరు
గురులు భరతఖండమందు
యెంచలేరు
శిష్య హృత్తాపహారకుల్
కాళికాంబ
హంస కాళికాంబ.
అంటారు.ఈలోకంలో వేలాది
మంది గురువులమనిచెప్పుకొనే వారున్నారు. వారు శిష్యులడబ్బు కాజేయటానికే
వేషాలువేస్తారు. అంతేకానీ శిష్యుని హృదయంలోరేగిన ఆధ్యాత్మిక తపనను చల్లార్ఛగల వారు
యెంత వెదికినా కానరారు. అంటే అట్టివారు చాలా అరుదుగాకానీ లభించరని అర్థం. కానీ...
తేగీ: సత్యసూక్తి ఘటించు, ధీ
జడిమ మాన్పు
గౌరవమొసంగు, జనులకు
గలుషమడచు
కీర్తిప్రకటించు
చిత్తవిస్ఫూర్తి సేయు
సాధుసంగమంబు సకలార్థసాధకంబు.---భర్తృహరి.
అన్న సూక్తికి దివ్య
నిదర్శనమే బ్రహ్మంగారు. అటువంటి మహాత్ములతో అనుబంధ మేర్పరచు కున్నవారికి
సత్యవాక్కలవడుతుంది. బుద్ధికి సోకిన మాలిన్యాలు తొలగిపోతాయి. సంఘంలో
గౌరవమేర్పడుతుంది. పాపాలు తొలగిపోతాయి. మంచిపేరొస్తుంది. మనస్సువికసిస్తుంది.
ఇంతకంటే ఇక కావలసిందేముంటుంది. ప్రాపంచిక వస్తుసముపార్జన మన్నామా?
అది కర్మావుగతంగా వస్తుంది పోతుంది. దాన్నిగూర్చి
ఆలోచించేవారికి దైవమూ, ఆధ్యాత్మికమూ పట్టవు.
ఒకవేళ పట్టిందనుకుంటే అది పచ్చిఅబద్దం.
నిజమైన
ఆధ్యాత్మికత అంతసులువుగా ఒంటబట్టబట్టదని కొందరి అభిప్రాయము. కానీ అది
సద్గురువుద్వారా సుసాధ్యము. అయితే వారికైవారే ఆధ్యాత్మికశిఖరాలనందుకొన్న మహాత్ములూ
లేకపోలేదు. కా నీ
అది కష్టసాధ్యము.
అందుకే బ్రహ్మంగారు...
ఆ:వె. పుస్తకములు చదువ
పూర్ణత్వమబ్బదు
హృదయసంపుటములు
చదువవలయు
పారిశుధ్యమొకటె
పరమాత్మ జేర్చును
కాళికాంబ
హంస కాళికాంబ.
అన్నారు. కేవలం
గ్రంధాలలోని కొన్ని మంత్రాలు శ్లోకాలు కంఠస్థం చేసి వల్లించినంత మాత్రాన
ఆధ్యాత్మికత అలవడినట్లు కాదు. నిజానికది హృదయము నిర్మలమైన తర్వాత హృదయపద్మాసీనుడైన
సర్వేశ్వరుని ఎరుకకలిగినప్పుడే సాధ్యమౌతుంది. అలాసాసధ్యం కావాలంటే అట్టి
హృదయపరిశుద్ధత నొంది హృదయేశ్వరుని యెఱిగినవాని అనుబంధమువల్లనే సుసాధ్యమౌతుంది.
కారణం ఆధ్యాత్మికత హృదయం నుండి హృదయానికి ప్రవహించే దివ్య ధార. అది గురువు
యిచ్చేది శిష్యుడు గ్రహించేది. కనుకనే ఈ విషయమున కేవలం పుస్తకములు
నిరర్థకములన్నారు.
ఇంతకూ
గురువు శిష్యునియెడ చేసేదేమిటి? శిష్యుడు
పొందేదేమిటి? అన్న
ప్రశ్న ఉత్పన్నమౌతుంది. దీనికి సమాధానంగా బ్రహ్మంగారు...
ఆ:వె తనువులోనివాడు
తానాడినట్లుండు
కాని
పోని లేని క్రమముదప్పి
గురునిదీక్ష
గొన్న కుదురును రోగమ్ము
కాళికాంబ
హంస కాళికాంబ -------అన్నారు.
పుట్టిన ప్రతి జీవికీ
ఒక రోగమున్నది. అదే భవరోగము. అది యీ శరీరములోని వాడనుభవిస్తున్నాడు. వాడు తన
యిష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. ఒకదారి తెన్నూ అంటూ లేదు. అంటే మనస్సు క్రమముతప్పి చరిస్తూ, భగవంతునికి
మరీమరీ దూరమై పోతున్నాడు. ఇక దారికిరావాలంటే, క్రమబద్ధీకరించబడాలంటే
సద్గురువువద్ద దీక్ష గైకొనవలసిందే. ఆ తర్వాత గురుని దివ్యజ్ఞానప్రసారంవల్ల మనస్సు
నిలకడకలిగి, క్రమబద్దమైన
యోచనలతో దైవంవైపుకు సాగిపోతాడు. గురుని ఆవశ్యగత అంతముఖ్యమైనది. అందుకే గురువులేని
విద్య గుడ్డివిద్య అన్నారు.
బ్రహ్మంగారు
సూక్ష్మమైన యోగవిధానము నవలంభించి ప్రోత్సహించినారు.
ఆ:వే. సాటిమానవులకు
సాయమ్ము పడబోక
నల్లరాళ్ళుతెచ్చి
గుళ్ళు కట్టి
మ్రొక్కులిడిన
బ్రతుకు చక్కబడంబోదు
కాళికాంబ
హంస కాళికాంబ.
అని నిర్మొగమాటంగా
చెప్పినారు. కులాలకుళ్ళును కడిగిపారేశారు. స్త్రీఔన్నత్యాన్ని చాటిచెప్పారు.
ఆ:వె. కులము కులమటంచు గొణిగెడు
పెద్దలు
చూడరైరి
తొల్లి జాడలెల్ల
మునులపుట్టువులకు
మూలంబు లేదండ్రు
కాళికాంబ
హంస కాళికాంబ.
కులానికి విలువనిచ్చే
పెద్దలు కాస్తా ఆలోచించాలి.
మునిశ్రేష్టులైన వాల్మీకి, వ్యాస, వశిష్ఠ
సూతమహర్షులు యేకులంలో పుట్టారో తెలియవలసివుంది. వారి పుట్టుకలు గొప్పకులాల్లోలేవు.
దీన్నిబట్టి కులానికెట్టి ప్రాధాన్యతా లేదని తేలిపోయింది. అట్లే స్వామి తన్నుతాను
తెలుపుకుంటూ,
ఆ:వె. కులమతాల జాడ్యముల లోన
దపియించు
దీనజనుల
సేద దీర్చువాడ
మానవుండె
ధరను మాధవుండనువాడు
కాళికాంబ
హంస కాళికాంబ. -------అన్నారు.
అగ్రవర్ణముల
ధిక్కారములకు కుదేలైపోయిన దీనజనుల సేదదీర్చడానికే నేనొచ్చానన్నారు. మనిషే మాధవుడని
నొక్కిచెప్పి కులదురహంకారాన్ని యెదిరించారు స్వామి. పుష్పగిరి అగ్రహారస్థుల వాదనల
నెదుర్కొని వారికి సరియగు సమాధాన మిచ్చి
నోరుమూయించారు. సిద్ధయ్యను, కక్కయ్యను
దరిజేర్చుకొని నిజజీవితంలో
తానన్నమాటను ఆచరించిచూపారు. ఇకమతంవిషయమైతే మరీ తెగేసి పలికారు గమనించండి.
ఆ:వె. మతము మత్తుగూర్చు
మార్గమ్ముగారాదు.
హితముగూర్పవలయు
నెల్లరకును
హితముగూర్పలేని
మతము మానగవలె
కాళికాంబ
హంస కాళికాంబ.
మతం హితంగూర్చడానికా? లేక
హింసను ప్రొత్సహించడానికా? దేనికి
మతం. హితంగూర్చలేని మతంతో మనిషికేంపని? దాన్ని
వదిలేయడం మంచిదని,
ఆనాడే
ఖండితంగా చెప్పారు స్వామి. స్త్రీలవిషయం మాట్లడుతూ....
ఆ:వె. వెలదులకును
వేదవిద్యాధికారమ్ము
లేదటంచు
బ్రహ్మలిఖితమంచు
నోరుతెరచి
మరచి నారు వాణినినిన్ను
కాళికాంబ
హంస కాళికాంబ.
అన్నారు
స్వామి.చదువులదేవత సరస్వతి స్త్రీ కాదా? ఒక
మొరటు మనిషిని రాత్రికి రాత్రే కాళిదాసుగా మార్చిన కాళికాంబ స్త్రీ కాదా? ఓ
పండితులారా! గార్గి, అరుంధతి, అనసూయలను
మరచారా! మీది పసలేనివాదమని నిరసించి. ఎలా మీరు స్త్రీకి విద్యాధికారము
లేదంటున్నారు, అని
గద్దించి, స్త్రీవిద్యావికాసానికి
తోడ్పడ్డారు. అందుకే తనకు యీడైన గోవిందమ్మనే తనకు భార్యగా యెన్నుకొని ఆమెకు
తనమఠంలో తగిన మర్యాద గల్పించి, ఆమెపేరున
"హరిగోవింద గోవింద" "శివగోవింద గోవింద!"అంటూ తత్త్వాలు
రచించారు. అంతేగాదు....
ఆ:వె. స్త్రీలలోన గలుగు
శీలసంపదలతో
సత్యపథములోన
జగము నడచు
స్త్రీలమనసులోనె
శివుని వాసమ్మగు
కాళికాంబ
హంస కాళికాంబ.
అంటూ శివుని అర్ధనారీశ్వరాన్ని
కూడా జ్ఞాపకంచేస్తూ యెనలేని ప్రాధాన్యత నిచ్చారు స్వామి స్త్రీజనానికి. ఇలాతన
"కాళికాంబ సప్తశతి"లో అనేకమైన అభ్యుదయభావాలను వెలిబుచ్చారు
వీరబ్రహ్మేంద్రస్వాములవారు.
సిద్ధయ్యకు
బోధచేసే నెపంతో సిద్ధిపొందిన, పొందదలచిన
జిజ్ఞాసువులందరిని దృష్టిలోపెట్టుకొని "సిద్ధగురుబోధ" యనెడి
సిద్ధార్థశతకమొకదానిని చెప్పారు బ్రహ్మంగారు. అందులో రాజయోగ వైశిష్ఠ్యాన్ని
తెలియజేస్తూ...
కం: సంసారమునందుండియు
సంసారము
మిథ్యజేసి సర్వముతానై
సంసారమందు
నిలచిన
సంసారే
రాజయోగి సత్యము సిద్ధా!
అన్నారు. అంటే సంసారం
యోగసాధనకు అడ్డంకి కాదని, సంసారంలో
వుండికూడా సంసారాన్ని ఒక విధిగా గ్రహించి, సర్వత్రా
నిండియున్న పరబ్రహ్మ తనకంటే వేరు కాదని తెలిసి, యోగిని
సంసారికజీవనం పతనంగావింపలేదని, సంసారమే
తనవల్ల పవిత్రమౌతుందని బ్రహ్మంగారు విశదపరిచారు.
అంతేగాదు, ఇంకా
ముందుకెళ్ళి, సాధనద్వా రా మాయ
నధిగమించి
పంచభూతాత్మకమైన, నవద్వార
నిర్మాణమైన ఈ దేహమునే దేవాలయమొనర్చి అందు పరబ్రహ్మను దర్శించుటే సిద్ధియని
తెలియజేశారు. అట్లు దర్శించిన వాడే దేవుడన్నారు.
దేవుని దర్శించడ మంటే
దేవుడైపోవడమే. ఉప్పుబొమ్మ
సముద్రాన్ని కొలవ
డానికి, వెళ్ళి
ఆసముద్రంలో కరిగి (లీనమై) పోయి సముద్రమేతానైపోయింది. ఇదీ అంతే. దైవాన్ని
సాక్షాత్కరింపజేసుకున్నవాడు ఆ దైవమే తనై పోతాడు.
వేదవిద్యతెలిసి
నీ స్వానుభూతులను వాటితోసరిపోల్చుకొని చూచుకొనుటకుపయోగపడు సాక్షీభూతములేకానీ కేవలం
చదివి, విని
ఆనందపడడంకాదు. నిజానికి పరిణామక్రమమున
మనిషే మాధవుడు. అలాకాక బాహ్యములైన రాళ్ళు రప్పలు దేవుళ్ళని మనకన్యముగా, వేరుగా
భగవంతున్ని జీవితాంతం భావిస్తూపోతే యెలా? సూక్ష్మమైనపద్దతులకు
మారకుంటే, మళ్ళీమళ్ళీ
పుడుతూ చస్తూ వుండక తప్పదు కదా! గుళ్ళు తిరుగుతున్నావు సరే! యేమైనా అనుభవానికి
వచ్చిందా?
గురుతు దొరికిందా? నిన్ను
నీవే ప్రశ్నించుకో. అంతర్మధనం జరుపు వాస్తవం గ్రహించు. అంటారు స్వామి. గమనించండి
.ఆ:వె...
సకలవేదములును సాక్షి మాటేగాని
మానవుండె
దేవుడౌను దలుప
రాయి
దేవుడైన రావలె పోవలె
గుళ్ళుతిరుగ
నేమి గురుతు సిద్ధ....
అంతేకాదు
కం: శ్రుతివాక్యము
విని కనరో
సతతమ్మేజాతియైన
సద్గురు సేవన
బ్రతికిన
బ్రహ్మణ వరుడగు
సతమీ
సత్యమ్ము దెసల చాటర సిద్ధ.
అన్నారు. శ్రుతి
(వేదము) ధ్వనించునదేదో (ఓంకారము) వినండి. తెలుసుకోండి. ఈ పని చెయ్యటానికి జాతి
యేదైనా అభ్యంతరం కాదు. ఆ ధ్వని నీ స్వానుభవమ్ములోనికి రావడానికి
గురుసహాయమత్యంతావశ్యకం. అదే మనకున్న యేకైక మార్గం. ఇది గ్రహించి అనుసరించినవాడే
బ్రాహ్మణుడు.
ఇంకా
సద్గురువు సేవజేయుటవల్ల, ఆయన
కాత్మార్పణ గావించుకొనుటవల్ల కలుగు ప్రయోజనాలు వివరిస్తూ....
ఆ:వె.. గురుని
మీదమనసు గూడి గట్టిగనున్న
శత్రువులకు
జనక శక్తి గలదె
శత్రు
శిఖలబట్టి సమయింప గురుడుండె
భయమదేల
పరుల వలన సిద్ధ.
అంటారు స్వామి.
గట్టిగా గురునిపై మనసు లగ్నముచేసి విడదీయరాని బంధమేర్పరచుకుంటే ఇక నీవు దేనికీ
భయపడ నక్కరలేదు. నీలోని అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు)
నిర్వీర్యమై పోతాయి. నీవు స్వేచ్ఛను పొందుతావు. ఈ విషయాన్ని మరింత దృఢపరుస్తూ ....
ఆ:వె. అంతరంగ మడచి
యమనస్కుడైయున్న
చింత
గురునిమీద చిక్కి యున్న
ఆత్మనంటియున్న
అనురాగబంధాలు
తెగును.
వాడె ముక్తుడగును సిద్ధ.
అంటారు స్వామి. నీ
స్వంత ఆలోచననేది యేదీలేని అమనస్కుడవై మనస్సంతా గురుని కప్పచెబితే, యింకేముంది, ఆత్మచుట్టూ
చుట్టుకొనియున్న అనురాగబంధాలు త్రెంచివేయబడతాయి. తక్షణం బంధవిముక్తుడవై స్వేచ్చననుభవవిస్తావు. అదే మోక్షం. అదే తన్నుతాను తెలియడం.
అంటే తానుగాక దైవం అన్యంగాలేదని తెలియడమన్నమాట. ఇట్టి స్థితిని సాధించాలంటే
ఇదొక్కటే మార్గం. ఇతరత్రా యిది అసాధ్యమంటూ...
కం: జలనిధు
లీదగ వచ్చును
కులగిరుల
నెగురవైచి గొబ్బున చేతన్
నిలుపగ
వచ్చును తనుదా
గలనైనను
తెలిసికొనగ కష్టము సిద్ధా.
అన్నారు. సముద్రాలనైనా
యీదవచ్చట, కులపర్వతాలను
బంతులజేసి చేతులతో ఆడుకోవచ్చట. కానీ తానెవరో తనకు తెలియటం కలలోనైనా జరగని పనియట.
అట్టిది జరగాలంటే, గురువు గాక వేరు
దిక్కు లేనేలేదని తేలిపోయింది.
కం: అంతా బ్రహ్మమయంబని
సంతసమున
తిరుగువారు సర్వజ్ఞులు శ్రీ
కాంతుని
కృపచే వారికి
చింతలు
లేవయ్య వారు సిద్ధులు సిద్ధా!
ఇలా గురుకృపచే తనతోసహా
సర్వం బ్రహ్మమయం. బ్రహ్మంగాని పదార్థం అన్యంగా లేనేలేదని యెరిగిన వారికి ఇక
చింతలెక్కడివి? ఇట్టి
స్థితినందుకొంటే సర్వజ్ఞత్వం లభిస్తుంది. అదే భగవత్కృపకు పాత్రుడవ్వటం. అలాకాక
వేషభాషలు మార్చి డాంబికంచూపించి గురువులమని తమ అనుభవంలోలేని బోధలు చేసేవారు
మోసగాళ్ళు మాత్రమేనని
హెచ్చరిస్తూ స్వామి...
కం: దర్భాసనాలువేసుక
దుర్భాషల
నెపుడు నొకరి దూషించు మహా
నిర్భాగ్యు
లేమిగాంతురు
దౌర్భాగ్యులె
తలచిచూడ ధరణిని సిద్ధా!
అంటారు. కేవలం ఇతరులు
చూడటానికి దర్భాసనాసీనులై బాహ్యప్రదర్శనలతో జనులను మోసంచేస్తూ, వికృతచేష్టలతో
మాటలతో పరదూషణ చేస్తూ బ్రతికే దరిద్రపు మనుషులు సాధించేదేమీవుండదు. వారు
వారినేమోసం చేసుకొంటూ యితరులనూ భ్ర ష్టుపట్టిస్తారు. అంతేగాదు...
కం: ఆకలిచంపియు
కొందరు
ఆకులుతిన, మోక్షమైన.
నడివిన తిరిగే
మేకల
కెల్లను మోక్షము
రాకేలను
పోయెనయ్య రయమునసిద్ధా!
కేవలం అడివిలో
తిరుగుతూ ఆకులలుములుతిని ఆకలినరికట్టి నంతనే మోక్షము సిద్ధించేటట్లయితే
అడవిమేకలన్నీ మోక్షము పొందినట్లేగదా! కనుక కేవలం శరీరాన్ని శుష్కింపజేసి
అడవికిబోయి కూర్చొన్నంతనే మోక్షము రాదు. అదే యోగమంటే పొరపాటు. గురుబోధ ననుసరించి
ఇంటనుండి కూడా యోగాభ్యాసము చేసి విజయము పొందవచ్చునని స్వామివారి ఉవాచ.
ఇంకాచెబుతూ...
ఆ:వె: ముక్కు నొక్కి పట్ట
మోక్షమ్ము రాబోదు.
వెన్ను
నిక్కిపట్ట వెతలు బోవు
కర్మశతములెల్ల
కాలు సుజ్ఞానాన
కాళికాంబ
హంస కాళికాంబ.
అంటారు. గురుబోధతో సుజ్ఞాని
కావలె గానీ ముక్కులు మూసుకొని శ్వాసను బంధించి, వెన్నువంగని
రీతిలో నిటారుగాకూర్చొని శరీరాన్ని శ్రమపెట్టడంవల్ల, ఒరిగేదేమీ
లేదు. జ్ఞానసముపార్జనవల్ల నీలో వివేకవైరాగ్యాలు పెంపొంది వాటినమలులోపెట్టి
ఆత్మనంటియున్న కర్మానుగత మాలిన్యములను జ్ఞానాగ్నిలో దగ్ధము చేసి విడుదల కావాలంటారు
స్వామి. అంతేగాదు...
ఆ:వె: తీర్థయాత్రలందు
దేవుడొక్కడెగదా!
మంచితీర్థము
మన పంచనుండె
దివ్యతీర్థ
మిదిగొ దేహమందున్నది
కాళికాంబ
హంస కాళికాంబ
ఆ:వె: ఉత్తమంబు తీర్థ
మొడలందె యున్నది
మధ్యమంబు
గలదు మనసు నందు
మంచితీర్థ
మెల్ల మనలోనె యున్నది
కాళికాంబ
హంస కాళికాంబ
అన్నారు స్వామి. దేవుడొక్కడేకదా? ఎన్ని
తీర్థాలలో వెతకాలి దేవుణ్ని? నిజానికి
స్వచ్చమైన తీర్థం మనచెంతనేవున్నది. అదేక్కడో దూరంలోలేదు. ఉత్తమమైన తీర్థం
మనదేహంలోనే వున్నది. అంతకంటే కాస్తా తక్కువ తీర్థం మన మనస్సులోనేవుంది. (బహుశా
మనస్సులోని మలినపు ఆలోచనలవల్ల దాని స్థాయి తగ్గి వుండ వచ్చును) ఏది యేమైనా
గొప్పతీర్థాలన్నీ మనలోనే నిక్షిప్తమై యున్నాయి. హృదయంలో అన్వేషించి అంతర్గత తీర్థయాత్ర చెయ్యి. బాహ్యవెంపర్లాటవల్ల అట్టే ప్రయోజనముండదని హితవుపలికారు
స్వామివారు. ఇలా అనేకమైన బోధలు చేయడమేగాక స్వతహాగ వాటిని తన రాజయోగ సాధనద్వారా
సాధించి చూపి, సాంఘికసత్పరిణామాలను
ఆహ్వానించి వాటిని తన నిజజీవితంలో ఆచరించి ప్రచారముచేసిన దేశికోత్తములు
బ్రహ్మంగారు.
మొత్తముమీద
స్వామివారి బోధవలన గ్రహించదగ్గ విషయమేమంటే, మొదట
సత్యాన్వేషకులు సద్గురువును వెతకాలి. ఆయనద్వారా సిద్ధిని పొందుట సుసాధ్యము.
సాధుసంగమము సకలార్థసాధకము. వెదుకువారికి దొరుకుట తథ్యము. నీలోసత్యముయెడ ఆకాంక్ష తీవ్రతరమైతే గురువును నీ
వద్దకు పంపుట భగవంతుని కర్తవ్యమై పోతుంది. మరోమాటలో చెప్పాలంటే భగవంతుడే
గురురూపమున నీకు తారసపడి మోక్షమార్గముపదేసించితీరుతాడని దానర్థము. నీవు ఒకడుగు
ముందుకేస్తే
భగవంతుడు నీవైపుకు పదడుగులేస్తాడనడం అక్షరసత్యం.
షట్చక్ర
నిరూపణము- కుండలినీవిద్య
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు, యేవో
నాలుగు మంచిమాటలు చెప్పడం నీతిబోధచేయడమేకాదు సాధనద్వారా శరీరములోని షట్చక్రములను
విచ్చుకొనునట్ల చేయడము, కుండలినీశక్తిని
మేల్కొల్పడమూ వంటివి తాను సాధించి సిద్ధులను హస్తగతం
చేసుకోవడమేగాక వాటినితన ప్రియశిష్యులకు సైతం సాధనద్వారానూ, తన
అంతర్గత దివ్యశక్తులను వారిలోనికి ప్రసరింపజేయుటద్వారానూ వారిని గూడా
సిద్ధులనుగావించినాడు. అవి మనవశంలో లేకున్నా, విషయ
పరిజ్ఞానముకొరకు కొంతకు కొంతైనా తెలుసుకొంటే స్వామివారంటే యేమో? ఆయనెంతటి
మహనీయులో మనకు తెలుస్తుంది.
మన శరీరమంతా
నాడుల (నరముల) అల్లికతో కూడికొని
యున్నది. వీటిలోకొన్ని
మన అధీనమున
నుండి, మనం అనుకొన్నప్పుడు
అనుకొన్న పనులు చేయగలుగుతున్నాం. ఉదాహరణకు కాళ్ళుచేతులు కదిలించి పనులు చేసుకోవడం.
అనుకొన్నచోటికి వెళ్ళడం. మాట్లాడడం వంటివి. మరికొన్ని నరములు మన అధీనంలో వుండవు.
వాటిని ఆసన, ప్రాణాయామ, ధ్యాన,
యేకాగ్రతలద్వారా
చైతన్యపరచి, మేల్కొలిపి
సిద్ధులను పొందుతారు. శరీరంలో డెబ్బదిరెండువేల నాడులున్నాయి. వాటిలో
పరిశుద్ధనాడులు పది. అవి ఇడ, పింగళ, గాంధారి, హస్తి,
జిహ్వ, ఆలంబ, పుష, క్రుకురు, దేవదత్త, ధనంజయ
మరియ
సుషుమ్న. వీటిలో ఇడ, పింగళ, సుషుమ్న
నాడులు బహుముఖ్యమైనవి. సుషుమ్న వెన్నుబాములో గుదస్టానం నుండి నడితలలోని సహస్రారం
వరకు వ్యాపించి వుంటుంది. అది యోగ
సాధనద్వారా చైతన్యవంతమై ఉక్కుతంతివలె బిరుసై విజృంభింపజేస్తే కుండలినీశక్తి మేల్కొన్నదని
అర్థము. మామూలుగానైతే అది బొడ్డు
స్థానమువెనుక వెన్నుబాములో నిద్రావస్థలో వుంటుంది. మనందరిలోనూ సామాన్యంగా యీ స్థి తిలోనే వుంది. అందుకే
దానిశక్తి మనయెఱుకలోలేదు.
ఈ సుషుమ్నకు
కుడివైపు పింగళనాడి సాగుచుండును. ఇది మూలాధారచక్రం (గుదస్థానం)నుండి కపాలంవరకు
వ్యాపించి సూర్యమండలం (మండలాలు తర్వాత చెప్పబడినవి) గుండా పయనించి యెడమ
నాశిక(ముక్కు) వరకు చేరుతుంది. ఇడనాడి సుషుమ్నకు యెడమవైపునవుంటూ మూలాధారం నుండి
కపాలంచేరి అక్కడ నుండి చంద్రమండలంద్వారా కుడినాశిక చేరుతుంది. సుషుమ్ననాడి నేరుగా
అగ్నిమండలంద్వారా తల పైభాగం వరకు
వ్యాపించివుంటుంది. ఈ నాడి కొసలో ఒక చిన్న
రం ధ్రం వుంటుంది.
అదే బ్రహ్మరం ధ్ర ము.
ఈ సుషుమ్ననాడి పొడవునా వెన్నుబామువెంట ఆరుచోట్ల సుషుమ్ననాడిశాఖలు వలయములుగా ఏర్పడి
చక్రములని పిలవబడుచున్నవి. ఇవి...
1..
మూలాధారచక్రము :- గుదస్థానమున
"వ" ఆకారముగా నుండి నాల్గురేకులుండును. వాటిపై వ, శ, ష, స
అక్షరములుండి పసుపు వర్ణముతో "భూ" ముద్రగల్గి గణపతి అధిదేవతగా వుండును.
2..
స్వాధిష్ఠానచక్రం :-
మూలాధారానికి రెండంగుళముల పైన పక్షి ఆకారములోగల ఆరు దళముల కేంద్రమిది. ఆ రేకులపై
బ, భ, మ, య, ర,ల అక్షరములుండి
తెల్లని వర్ణములో జల ముద్రగలిగి సరస్వతీసహితుడైన బ్రహ్మ అధిదేవతగా నుండును.
3..
మణిపూరకచక్రం:- స్వాధిష్టానానికి యెనిమిదంగుళములపైన నాభివద్ద డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ
అను అక్షరములుగల పదిరేకుల కేంద్రమిది. గుడ్డు ఆకారంలో రక్త వర్ణంలో వుండి
అగ్నిముద్రగలిగి విష్ణువు అధిదేవతగా వుంటుంది.
4..
అనాహతచక్రం :- మణిపూరానికి పది అంగుళములపైన
హృదయస్థానంవద్ద క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఞ, ట.
ఠ అను అక్షరములుగల పదిరెండురేకులుండి, బంగారువర్ణం
గలిగి వాయు ముద్రలోనున్న కేంద్రమిది. దీనికి అధిదేవత పరమేశ్వరుడు.
5..
విశుద్దచక్రం :- అనాహతానికి
పదిరెండంగుళములపైన కుత్తుకస్థానంలో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, లు, లూ, ఏ, ఐ, ఓ, ఔ.
అం, ఆః
అను అక్షరములుగల పదియారురేకుల కేంద్రమిది. నీలివర్ణంతో ఆకాశముద్రగలిగి
మత్స్యాకారంలో వుంటుంది. దీనికధిదేవత జీవుడు.
6..
ఆజ్ఞాచక్రం:- విశుద్దానికి పదిరెండంగుళములపైన భ్రూమధ్యస్థానంలో హం, క్షం
అను రెండక్షరముల రేకులతో మాణిక్యవర్ణంగలిగి ప్రకాశ ముద్రలో పరమాత్మ అధిదేవతగా
నుండును.
ఈ
ఆజ్ఞాచక్రం దాటితే చివరగా కపాలపర్యంతం సహస్రార ముండును. దీనికి వెయ్యి
రేకులుండును. వీటి మీద అ, వ, ర, వ లను
అక్షరములుండును. ఈ సహస్రారాన్నే
మేరుశిఖరం అని కూడా అంటారు. ఆకాశముద్రగలిగి గురుడు అధిదేవతగా వెలుగులు నిండి వుంటుందీ కేంద్రం.
ఇంతకు
ముందు సందర్భవశమున ఉటంకించిన అగ్ని, సూర్య, చంద్ర మండలాలను గూర్చి కూడా కొంత ఆలోచిద్దాం..
1..
అగ్నిమండలం :- ఇది నాల్గుదళాల
పద్మాకార మండలం నాల్గుదళాలపై ఓం, హ్రీం, హ్రాం, సం
అను అక్షరాలుండును. భూమీ, నీరు
కలిసిన తత్త్వంతో నలుచదరంగావుండి, దానిపై
త్రికోణాకృతి గల్గి వుంటుంది. దీని
స్థానం వాసాగ్రమై సుషుమ్ననాడి
సరస్వతీనదికి అనుసంధింపబడి
వుంటుంది.
2. సూర్యమండలం :-
ఇది యెనిమిది దళాల పద్మాకార మండలం. అరటిమొగ్గవలె క్రిందికి
వ్రేలాడుతున్నట్లుంటుంది. దళాలమీద య, ర,
ల,వ,శ, ష, స, హ
అక్షరాలుండి, బంగారువర్ణమై, మెరుస్తూ
మనోన్మణిమయశక్తి గలిగి కుడినాశిక స్థానమై పింగళనాడితో యమున అనుసంధింపబడి వుంటుంది
3.
చంద్రమండలం :-
చంద్రాదిత్యులకాంతిగలిగి అమృతము వర్షిస్తూవుంటుందీ మండలం.
ఈ అమృతజల్లులు అగ్నిమండలాన్ని శాంతపరుస్తూవుంటాయి. ఇచ్చట పరాశక్తి ప్రకాశమానమై
వుంటుంది. ఎడమనాశికలోని ఇడనాడితో గంగ అనుసంధింపబడి వుంటుందీ మండలంలో.
మనోనిగ్రహంతో
ఒకదానితర్వాత ఒకటిగా యీస్థానములన్నీ అధిగమించి, సహస్రారంలో
వెన్నెలవెలుగు చూడగలడు యోగి. అంతేగాక ఖేచర, భూచర, మధ్యమ, షణ్ముఖి, శాంభవీ
ముద్రలను సైతం వరుస
క్రమంలో సాధిస్తారు
వారు. ఖేచరిలో ఊర్ధ్వదృష్టి, భూచరిలో
నాశికాగ్ర
దృష్టి, మధ్యమంలో
భ్రూమధ్యదృష్టి, షణ్ముఖిలో
నవరం ధ్రా లు మూసిన నాదబిందు కళాదృష్టి, శాంభవిలో
చిదాకాశ సందర్శనదృష్టి గలిగి వుంటారు.
ఈ
చక్రములు, మండలములపై
సంపూర్ణాధికారం సాధించిన యోగి ద్రష్టయై యుంటాడు. ఈ భూమిపై జరిగే ఉత్పాతాలన్నీ
ముందుగా బ్రహ్మాండమండలంలో రూపుదాల్చుకుంటాయి. వీటిని ద్రష్టలు ముందుగానే
తెలుసుకోగలుగుతారు. కనుకనే బ్రహ్మంగారు ద్రష్టలై భవిష్యత్తును చెప్పగలిగారు.
అంతేగాదు, ఇట్టి
మహనీయులు విశేషమైన శక్తులను హస్తగత మొనర్చుకొని, అణిమాది
సిద్ధులు తమ అధీనమైనందున అద్భుతములు చేయగలరు. వారు గాలిలోతేలిపోగలరు, నీటిపై
యదేచ్ఛగా నడువగలరు, అగ్నిమధ్యమున హాయిగా
నిలువగలరు. పంచభూతములపై వీరు సర్వాధికారములు గలిగియుందురు. అందుచేతనే బ్రహ్మంగారు
నీటితో దీపములు వెలిగించెను. మాంసాహారమును దివ్యఫలపుష్పాదులుగా మార్చెను.
పుట్టబోవు గుర్రపుపిల్ల రూపురేఖలు చెప్పగల్గెను. చచ్చినవానిని బ్రతికించెను. కొలది
ఆహారమును అక్షయమొనర్చి జనబాహుళ్యమునకు పంచిపెట్టెను. పుట్టెడన్నమును
శిష్యునొక్కనిచేత ఆహారింపజేసెను. కనుచూపుమాత్రమున ధిక్కరించినవారి అగ్రహారమును
దహించివైచి, తిరిగి
శాంతించి పునఃస్థాపించెను. మతాంతరులచేత సైతం సలాము లందుకొనెను.
ఇవన్నీ
బ్రహ్మంగారు గర్వమూ, దర్పమూ చూపించుకొనుటకు
చేయలేదు. కీర్తి గడించుకొనుటకు ప్రాకులాడలేదు. సర్వమానవాళికి సముడై మెలగి, గర్వాంధకారులకు
బుద్ధి గరుపుటకూ, భక్తులలో విశ్వాసము
పెంపొందించుటకూ, సామాన్యులలో
ఆధ్యాత్మికభావనలు పొటమరింపజేయుటకూ ఉపయోగించెను. ఆయన నిరంతరమూ జనశ్రేయస్సునే
కోరుకొనెను. ఇట్టి అద్భుతశక్తులు స్వామివారి శిష్యులకునూ వుండెడివి. వారియందు
గర్వమంకురించి యోగ
భ్ర ష్టులుకాకుండా, నేతి, నేతి
(న-ఇతి, న-ఇతి)
అన్న వేదవాక్యానుసారం వారు ఇదేకాదు, ఇంతేకాదు
ఇంకా ముందెంతో ఉన్నది, అన్నవిశాల భావనతో
ముందుకు సాగునట్లు వారికి సరియగు మార్గదర్శకులై, శిష్యజన కల్పవృక్షమై నిలచినారు.
అయితే
మనలాంటి సామాన్య భక్తుల గమ్యము ఆత్మోద్ధరణమే. అందులకు అతీతశక్తులనవసరము. అంతేగాక
మనము ఆ శక్తుల ఆకర్షణ, మహిమల గరిమలకు లోనై
గర్వమున దైవమును విస్మరించు ప్రమాదమున్నది. అంతేగాక కీర్తికండూతికి లోనై ఆత్మలో
నెఱుకకు దూరమైపోవుటయూ జరుగవచ్చును. కేవలం ఆత్మోద్ధరణకేగాక లోకోద్ధారణ కొఱకు
అవతరించిన శ్రీవీరబ్రహేంద్రస్వాములవారికే అవియెల్ల తగును. కనుక మనకు స్వామియందు
అచంచలభక్తి, వారిబోధనలపై
గురి యుండిన చాలును. అదే
మనలను కైవల్యము జేర్చును.
శ్రీ
ఈశ్వరీదేవి
శ్రీఈశ్వరీదేవి
బ్రహ్మంగారి కుమారుడైన గొవిందయ్య కుమర్తె యని ముందుగాతెలుసు కొన్నాం. ఆమె మఠం
స్వామివారి మఠనికి ఆనుకొనే తూర్పుదిక్కునవుంది. అంటే ఈశ్వరమ్మ మఠం మీదుగానే వెళ్ళి
స్వామి మఠం ప్రవేశించాలన్నమాట. ప్రస్తుతం యీ మఠధిపతిగా శ్రీ చెరువుపల్లి శివకుమార
స్వామివారు వ్యవహరిస్తున్నారు. బ్రహ్మం గారి మఠం దర్శించు
కొన్న వారంతా యీ మఠం సందర్శిచే వెళుతుంటారు.
బ్రహ్మంగారి జీవసమాధి తర్వాత
పదిసంవత్సరములకు గోవిందయ్యా గిరియమ్మల ముద్దుబిడ్డగా ఈశ్వరమ్మ జన్మించింది.
చిన్నతనంనుండే తత్త్వజ్ఞాన సంపన్నురాలిగా మెలిగింది. ఒకరోజు తండ్రి గోవిందయ్య ధ్యానసమాధిలో మునిగిపోయి యెంతటికీ
లేవకపోగా, అందరూ
ప్రాణములు విడిచినారని చింతించసాగారు. కానీ బాలికగానున్న ఈశ్వరమ్మ,
విషయాన్నర్థంచేసుకొని, సాంబ్రాణి
పొగలు బట్టి, తండ్రిని
మేల్కొలిపింది. అంటే ఆమెకప్పటికే యోగమంటే యేమో తెలుసునన్నమాట.
ఈశ్వరమ్మకు
యుక్తవయస్సొచ్చింది. నరరిపాడు (చిత్తూరు జిల్లా) జగ్గరాజు కుమారుడు రంగరాజు ఆమెను వివాహమాడదలచాడు.
ఆయన బ్రహ్మంగారి వరమున జన్మించినవాడు. ఆయన కందిమల్లయపల్లెకువచ్చి గోవిందయ్యను, ఆయనతమ్ముడు
పోతులూరయ్యనూ కలిసి తన యిష్టం తెలియజేశాడు. వారు కులాంతర వివాహానికి వెనుకంజవేశారు. ఈ విషయమై ఒకనిర్ణయం తీసుకోవడానికి రంగరాజు వారిని పిలుచుకొ
ని బనగానిపల్లె లోమఠం వెళ్ళి అక్కడ భద్రపరచియున్న కాలజ్ఞాన
గ్రంథాలను
పరిశీలించి అందులోని అర్థం రంగరాజు గ్రహించి వెంటనున్న
వారికి
చూపి, ఈశ్వరమ్మతో
యీజన్మలోగాకుండా రాబోయే జన్మలో తనకు
వివాహ మౌతుందనీ, తాను
త్వతలోనే అగ్నిప్రవేశం జేసి తనువు చాలించా
లనీ, కాలజ్ఞానం
చెబుతోందని వివరించి, ఆయన నగరిపాడుకు వెళ్ళి, కేసారపు మారయ్య (మదిగ) తనయింటి వెనుక కేటాయించిన స్థలంలో
అగ్ని గుండం
వేయించి అందులో ప్రవేశించి ప్రాణత్యాగం చేశాడు.
ఈశ్వరమ్మ
అవివాహితగానే జీవితం గడిపింది. ఒకయేడాది కఠినమైన దీక్షగైకొని తపస్సు చేసింది.
దివ్యతేజస్సుతో వెలిగిపోయింది. దేశాటనజేసింది. బ్రహ్మంగారితత్త్వాలను బోధించింది.
విడమరచి అర్థంచెప్పింది. శిష్యులనాదరించింది. అనేక మహాత్మ్యాలను చూపింది.
తనబోధలు వినడానికి
వచ్చిన పగడాలవ్యాపరులు కామదృష్టి తో ఆమెను
చూచి చులకనగా మాట్లాడినారు. వారికి
కనుచూపుపోయింది. వారు క్షమించమని ప్రార్ధించగా, వారిచే
బ్రహ్మంగారి మఠంలోసేవ చేయించి తిరిగీచూపు ప్రసాదించింది. తనుకాదన్నా వివాహమాడతా
నని వేధించిన
మేనమామకు కుష్టురోగం
సంక్రమించింది.
చాటకొండు చెంగన్న, యోగిసుబ్బయ్య, బంగారయ్య, గడ్డంమద్దయ్య.
బ్రతుకుదెరువుకు వీధినాటకాలాడుకొనే తుపాకుల వెంకటనారాయణ వంటి పరమభక్తులు ఆమెను
సాక్షాత్తు జగదీశ్వరిగా సేవించారు. ఆమె సమాధియైనతర్వాత ఒకరోజు చాటకొండు చెంగయ్య
విస్తర్లు
కుట్టు కోవడానికి ఆకులకోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒకబిళం
లో ఈశ్వరీ దేవిని చూచి
ఆశ్చర్యపోయాడు. ఆమెవద్దనుండి ప్రసాదం స్వీకరించాడు. ఈవిషయం యెవరితోనూ చెప్పవద్దని
అమ్మ చెప్పడంతో చాలాకాలం ఊరికేవుండిపోయాడు. కానీ ఈశ్వరీదేవి మహాత్త్యం అందరికీ
తెలియాలి, నాకేమైన
పరవాలేదని అందరిముందూ ఈశ్వరీదేవి
పలానచోట బిళంలో
దేదిప్యమనంగా వెలిగిపోతూ నాకు దర్శనమిచ్చిది. అని చెప్పెశాడు. వేటనే అతడు
శిరోవేదనతో మరణించాడు. వన్నూరమ్మ అనే విప్లవమహిళ, ఈశ్వరమ్మకు
పగడాలవ్యాపారులు బహూకరించిన కోటకొమ్మంచులచీరను దొంగిలించింది. జగదీశ్వరికి కోపం
తెప్పించింది. శిక్షననుభవించింది. ఆమె శత్రువులకుచిక్కి కొర్రు వెయబడి ప్రాణాలు
విడిచింది. ఒకరోజు ఈశ్వరమ్మ వెలగచెట్టు క్రింద కూర్చొనియుండగా ఒక పండు తలపై బడింది. వెంటనే దేవి
"ఓసినీకడుపుడకా!" అనింది, అంతే,
చెట్టు కాయల్లోని
గుజ్జుడికి నల్లబడి పొయింది. ఇక అచెట్టుకు ఉడికిన నల్లగుజ్జు కయలేగాని మంచికాయ
కాయనేలేదు.ఇలా యెన్నో మహిమలు
చూపి పితామహుని కీర్తికి వన్నెదెచ్చి, ఆఖరుకు
ఈశ్వరీదేవి కూడా బ్రహ్మంగారి వలెనే జీవసమాధిలో ప్రవేశించింది. మరుజన్మలో రంగరాజు, కుమారవీరధర్మజుడుగా
అవతరించేవరకూ సమాధిలో దీక్షలోవుండి, ఆయనకు
భార్యకావడానికి అవతరించనుంది. ఈవిషయం స్వయంగా ఈశ్వరీదేవి సమాధిలో ప్రవేశీంచే
సమయంలో తెలియజేసింది.
కాలజ్ఞానబోధ
బ్రహ్మంగారు
చేసిన కాలజ్ఞానబోధ తెలుగునాటనేగాక. ప్రపంచ వ్యాప్తమైన దనుట నిర్వివాదాంశము. మయాన్‍క్యాలెండర్
జోస్యము, నోస్టర్‍డామస్ వంటి పాశ్చాత్య కాలజ్ఞానుల కంటే మిక్కుటముగా
బ్రహ్మంగారి కాలజ్ఞానమునే నమ్ముచున్నారు. ఉదాహరణకు కులధర్మాలు కనుమరుగవటం, అన్యాయం
రాజ్యమేలటం. ముండమోపులు ముత్తయిదువులవటం, అట్టివారే
రాజ్యాలేలటం. కడజాతివారుఅధికారం చేపట్టడం. ప్రజారాజ్యమేర్పడటం, తెల్లదొరలు
యేలికలవ్వడం. బిడ్డలుగన్న తల్లిని నిరసించడం, అప్పులెగగొట్టడం
తప్పుగాదనడం. కొండలన్నీపిండిగొట్టబడటం, మనుధర్మం
మంటగలసిపోవడం, నీళ్ళవలన
దీపాలు వెలగటం, ఇనుపకమ్ములపైన
ఆవిరిబండ్లు నడవడం వంటివి అంచనావేసి చెప్పడం ఒకెత్తయితే, చిత్రాతిచిత్రాలు
భవిష్యత్తులో జరుగుతాయని ద్రష్టయై చెప్పడం మరోయెత్తు. అవి ఇలాచెప్ప
బడ్డాయి, పందికడుపున
యేనుగు, యేనుగు
కడుపున పంది పుడతాయి. శిలలు కండలుగ్రక్కుతాయి, అవికాకులు
తింటాయి, యీచిత్రంజూచి
ప్రజలకు వెర్రి పుడుతుంది. పగలేచుక్కలు గనబడి నేలరాలుతాయి. బండినెక్కి ఒకకోడి
ఊరేగి, కూతగూసి
జనులను జంపుతుంది. దానిరెక్కగాడ్పులకూ మనుషులుచస్తారు. తిరుపతిలో మ్లేచ్ఛులు (ఇతర
మతస్తులు, ప్రత్యేకముగా
ముసల్మానులు) జొరబడుతారు. వెంకటేశ్వరుని కుడిభుజ మదురుతుంది. కాశి నలువదిదినాలు
పాడుబడిపోతుంది. పాతాళగంగమ్మ శ్రీశైలమల్లికార్జునుని పాదాలుతడిసేట్లు ఉప్పొంగి
పారుతుంది.
మల్లికార్జునస్వామి మనుషులతో మాట్లాడతారు. బెండ్లు మునిగి గుండ్లుతేలుతాయి.
వెంపలిచెట్లకు దోట్లేసే జనులు పుడతారు. ఉదయగిరిలో ఓతల్లి ఒకేకాన్పులో ఐదు మందిని
కంటుంది. బంగారు యెల్లలు దాటివెళ్ళి దానిస్థానంలో యిత్తడిచేరి మెరుస్తుంది.
శ్రీశైలంలో మొసళ్ళు జొరబడుతాయి. ఒకరెండుతలల మొసలి స్వామిలో ఐక్యమై పొతుంది.
తిరుపతి నాల్గురోజులు మూతబడుతుంది. ఆరేళ్ళ బాలిక బిడ్డనుగంటుంది. తెరమీదిబొమ్మలు
రాజ్యాలేలుతాయి. యేడేళ్ళబాలుడు పూర్వజన్మవృతాంతం జెపుతాడు. యాగంటి బసవన్న పెరిగి
పెరిగి కలియుగాంతాన రంకెలేస్తాడు. కృష్ణ దుర్గమ్మ ముక్కుపుడకను
తాకు తుంది. హంపి
హనుమంతుడు కేకలేసి జనులను
జంపుతాడు. శ్రీశైలం
బసవన్న కాలుదువ్వి రంకేస్తాడు. ఒకబాలయోగి అన్నాహారాలు లేకనే హాయిగా బ్రతికేస్తాడు.
చింతచెట్టుకు మల్లెలు పూస్తాయి. నేను తిరిగి వీరభోగవసంతరాయుడనై పుట్టి ధర్మాన్ని
రక్షిస్తానని, అప్పుడు
మరిన్ని చిత్రాలు జరుగుతాయని భవిష్యత్తును తెలియజేశారు బ్రహ్మంగారు. వీటన్నిటిని
స్వామివారు, చిలకమ్మ
పలుకవే పలుకు"
“చెప్పలేదంటనక
పొయ్యేరు" "చిళ్ళరరాళ్ళకు మొక్కుతువుంటే చెడిపోదువురా ఒరే ఒరే"
"హరిగోవింద గోవింద" అనెడి తత్త్వాల రూపంలో వివరించారు. ఇవన్నీ ఎక్కువగా
తన శిష్యకూటములలోను, నవాబుల
దర్బారులలోను వినిపించి, బహుళజనాన్ని
తన వైపుకుత్రిప్పుకొని
వారిలో చైతన్యాన్ని రేకెత్తించాడు. హితవుపలికాడు. చిత్రాతిచిత్రమైన భవిష్యత్తును
వినడానికి యెవరైనా ఇష్టపడతారు. కుతూహలంకనబరుస్తారు. అవన్నీ దివ్యదృష్టితో చెప్పిన
వాస్తవాలే యై నా, ఆ
మిషతో జనులను తనవైపున కాకర్షించుకొని వారిని ధర్మమార్గగాములను జేశారు స్వాములవారు.
నన్నునమ్మండి మీకు నాశముండదు. లేకపోతే కలిప్రభానికి లోనై చెడిపోతారని హెచ్చరించి
ప్రజలలో మార్పుదెచ్చి, వారి
జీవనవిధానాన్ని చక్కబరచారు. ఈనాటికినీ ఇంకా స్వాములవారు జనులను ప్రభావితం
చేస్తూనేవున్నారు. దయా, సత్యము, ధర్మము
వైపునకు మనుష్యులను నడిపిస్తూనేవున్నారు.
స్వాములవారు
చెప్పిన కాలజ్ఞానతత్త్వాలలో సంక్షిప్తంగా కొన్నిటినైనా చూద్దాం, పాడుకొందాం, తరిద్దాం.
శివగోవింద
గోవింద
1. గోవిందుడన
గాను భావించి చూచితే
ఆనందబ్రహ్మమం
దాడంగనూ
ఏమందు
నేనింక చాముండి ముందరా
శివగోవింద
గోవింద - హరిగోవింద గోవింద.
2.. కల్లలాడెవార్ని
కిర్రుగానుగలలో
మర్లించి
పొర్లించి గూల్ఛేరుమా
తొల్లిచెండీదేవి
శనివద్ద జేరింది
కల్లయుగమున
వింత గల్గీనుమా.......శివగో//
3.. ఈశాన్యముననుండి
విషగాలివచ్చియూ
విపరీత
నరులంత జచ్చేరుమా
కపట
కిరాతుల ఖండించి వేయను
కలికావతారుడూ
వచ్చీనిమా............శివగో//
4. పొగరుబోతూలంత
భవిషత్తు యంతయూ
భూటకంబని
పల్కు చుండేరుమా
కాగలాకార్యముల్
కనురెప్పపాటులో
జాగులేకా, వేగ
జరిగేనుమా.......శివగో//
5.. భారతాభూమిని
పరిపాలనముజేయ
పరదేశవాస్సులూ
వచ్చెరుమా
ఆరువత్సారంబు
లేకరీతిగ అంబ
ఒక్కతే
యీ యవని నేలూనుమా......శివగో//
6.. ఉల్లిగడ్డాలాకు
ఉపదేశమిచ్చేటి
కల్లగురువులు
కలిలొ నుండేరుమా
కల్లగురువులనెల్ల
కాలదన్నును యముడు
కల్లలేనీ
నరుల కరుణించుమా......................శివగో//
7.. బాగుగా
ఆనంద వత్సరంబందునా
నాగుమల్లే
నశియించూనుమా
నగుమల్లేరీతి
నరులంతజచ్చేటి
యోగంబు ముందింక వచ్చూనుమా........శివగో//
8.. బహుధాన్య
విక్రమ వత్సరంబులలోన
బహుగ
యుద్ధంబులూ జరిగేనుమా
రాహుకేతువులవలె
రారాజులుద్దరూ
రణరంగమునకూ
కాల్‍దువ్వేరుమా.....శివగో//
9. ఉత్తరాదేశమున
వైశ్యకులమందునా
ఉత్తమ
గ్రందొకడు బుట్టీనిమా
హత్తుగానన్నియూ
దేశములవారంత
సత్తుగా
పూజలూ జేసేరుమా.....................శివగో//
10.. లోకమంతాయూను
ఏకంబుగాజేసి
యేకు
పట్టెడువాడు వచ్చీనుమా
ప్రాకటంబూగాను
లోకంబులోతాను
మేకై
జనుల మేలెంచూనుమా..............శివగో//
11.. పల్నాటిసీమకూ
బాటసారొకడొచ్చి
పల్నాటి
ద్రవ్యమూ దోచేనుమా
పల్నాటినరులంత
పచ్చిఆకంతయూ
మేకలా
రీతిగా మేసేరుమా.................శివగో//
12..
అద్దంకిసీమలో బీదయాదవునింట
బుద్ధునంతటీ
వాడు బుట్టీనుమా
ఇద్ధర
జనులకూ భవిషత్తునంతయూ
ఐదేండ్ల
ప్రాయమున దెల్పూనుమా.........శివగో//
13.
తల్లులా బిడ్డలా తగవులూ నడచీని
తల్లడిల్లే
దినము లొచ్చీనిమా
కల్లగాదీమాట
యుల్లమ్ము సాక్షిగా
గద్దనొడిసీ
కాకి దన్నీనుమా........శివగో//
14. ముండమోపూలెల్ల
ముత్తయిదులయ్యేని
ముందొచ్చె
గతిమీకు దెలిసీనుమా
బండాట
లాడేటి పాపిష్టి నరులంత
పండాకురీతిగా
రాలేరుమా..........................శివగో//
15 ఆలంపురీలోన
ఉత్పాతములు బుట్టి
జోగులాంబా
ఆవలించూనుమా
వెనకాల
బడియున్న భూదేవి లేచేని
కులుకు
కుచముల పాలు గురిసేస్నుమా.........శివగో//
16. ఆనందగురువుల
అనుమతీ చేతాను
అహోబిళమూ
జేరవచ్చేరుమా
ఆనందగురువులా
అనుమతీచేతాను
అన్నసత్రము
లచట గట్టేరుమా.........శివగో//
17. హంసరూపముచేత
హరిసంచరించీని
సంశయములెల్లనూ
సమసేనుమా
కంసమర్ధానూడు
కమలాలయము వెడలి
కలిదోషముల
నణచివేసేనుమా.....................శివగో//
నందామయా
గురుడ నందామయా
నందామయాగురుడ
నందామయా
ఆనంద
దేవికి నందామయా-----నంద//
1.. ఇంతింతపిల్లలూ వివరాలుచెప్పంగ
జ్ఞానులగు పెద్దలూ వింటారయా----నందా//
2.. వరికూడు దినువారు వరుసలూ దప్పంగ
పెనిమిటిని పేరెత్తి పిలిచేరయా
నున్నంగ దువ్వేరు కొప్పులూ బెట్టేరు
కొప్పుకూ పావలా తప్పాదయా-----నందా//
3. ఒకొక్క పురుషునికి
యేడగురు భార్యలు
వెంటబోయేకాలమొచ్చేనయా
అత్తకూ పీటలు కోడలికి మంచాలు
మామనెత్తిన మొద్దు పెట్టేరయా----నందా//
4.. ఆలుచెప్పినమాట అరటిపండౌతాది
తల్లిదండ్రీమాట త్రాచుపామవుతాది
ఇల్లాలు విడిపోవ ఇంటిలోచొరబడి
రంకుముండలు రచ్చకెక్కేరయా-----నందా//
5.. పతివ్రతలు పంచన బడిపోయి యుండంగ
రంకుముండలు రాజ్యమేలేరయా
ములగ చెట్లకు లేని ముల్లులేమొలవంగ
ముసలి వాండ్లకు మనుము లొచ్చేనయా----- నందా//
6.. ముండమోపూలంత ముత్తైదులవ్వంగ
ఏడాది కిద్దరిని కంటారయా
తాటిచెట్టూమీద తాబేలు పుట్టంగ
తల్లడిల్లీ మతులులు తప్పేరయా----నందా//
7. ఇకపుట్టె వారంత
ఇకపెరిగెవారంత
వెంపలీ చెట్లకు నిచ్చెనేసేరయా
బాలోజి అవతల బాలకచేరీకాడ
బర్రెకడుపున గొర్రె పుట్టేనయా----నందా/
చెప్పలేదంటనకపొయ్యేరు
చెప్పలేదంటనకపొయ్యేరు
నరులార గురుని
చేరిమ్రొక్కితె బ్రతకనేర్చేరు.----చెప్ప/
1.. చెప్పలేదంటనకపొయ్యేరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పుదోవల బోవువారల
చప్పరించి మింగు శక్తులు----చెప్ప//
2. మొప్పెతనమున మోసపోయేరు
అదిగాక కొందరు
గొప్పతనమున గోసు మీరేరు
ఇప్పుడప్పుడనగరాదు
ఎప్పుడో
యేవేళనోమరి
గుప్పుగుప్పున
దాటిపోయేరు
గుర్రపడుగులు
వేరు పడిపోవు......చెప్ప//
3. తాకు తప్పులు
తలచకున్నారు
తార్కాణమైతే
తక్కువెక్కువ తెలియ నేర్తూరు
జోకతోడుత తల్లిపిల్లలు
జోడుబాసి అడవులందు
కాకిశోకము జేసి ప్రజలు
కాయకసరులు నమలి చత్తూరు....చెప్ప//
4. కేకవేసియు
ప్రాణమిడిచేరు
రాకాశిమూకలు
కాకబట్టి కలవరించేరు
ఆకసమ్మది ఎఱ్ఱబారూను
ఆరు మతములు ఒక్కటౌను
లోకమందలి జనములందరు
నీరు నిప్పున మునిగి పోయేరు.....చెప్ప//
5. అగలువిడిచీ పొగలు
దాటేరు
అదిగాక పట్ట పగలు
చుక్కలను- చూసి బ్రమసేరు
భుగులు భుగులు ధ్వనులు మింటను
పుట్టియేగిన పిమ్మటానూ
దిగులుపడుచూ ప్రజలు చాలా
దిక్కులేనీ పక్షులౌదూరూ.....చెప్ప//
6. పాతకులు ఆపదల బడియేరు
పుణ్యాత్ములైనా
సాధకూలూ సంతసించేరు.
భుతలంబున ఇట్టివింతలు
పుట్టియణగిన పిమ్మటాను
నీతి కృతయుగ ధర్మ మప్పుడు
నిలిచి నిలకడ మీదదెలియూనూ...చెప్ప//
7. ఏదియేమో తెలియకున్నారు
ఎందెందుచూచిన
యముని పురికే నడచు చుండేరు
భుమిమీద ధూముధాములు
పుట్టిపెరిగిన పిమ్మటానూ
రామరామా యననివారలు
రాలిపోదురు కాలిపోదురు.......చెప్ప//
8. ముందువెనుకలు
గానకున్నారు
మూర్ఖాళి
భువిలో
ముందుగతినే
యెన్నుకున్నారు
కందువాతో
పిన్నపెద్దల
కన్నుగానక
గర్వములచే
మందెమేలము లాడువారిని
బందుబందుగ గోతు రక్కడ.....చెప్ప//
9.. కీడెయైనను
కూడదనరూ
ఒనగూడినప్పుడు
ఏడజూచిన వాడుకొందూరు
వేడుకతొ శ్రీపోతులూరి
వీరభోగవసంతరాయలు
ఏడుదీవుల యేకచక్రము
ఏలునూ బ్రహ్మండమంతయు.....చెప్ప//
ఓం
తత్ సత్
No comments:
Post a Comment