1.భాగవతం – భగవంతుడు 3
2.తాపత్రయం 10
3.పుణ్యపలం 13
4.సత్యవచనం 18
5.పరోపకారం 23
6.వివేకం-వైరాగ్యం 27
7.పొదుపు 30
8.మతం 35
9.సత్యసంధత 38
10.జ్ఞాని 42
11.స్నేహం 45
12.కృతఘ్నత- మిత్రద్రోహం 49
13.ప్రార్థన 53
14.ధర్మం
58
15.రాజదండ-యమదండన 61
16.అహింస 63
17.మాయ 66
18.ప్రాప్తం 68
19.గుప్తదానం 71
20.సుఖదుఃఖాలు 73
21.గురుశిష్యులు 76
22. యోగం 79
23. శ్రీకృష్ణతత్త్వం 83
24. భగవద్గీత-ఒకఆలోచన 87
25. మీరాబాయి 93
26. డొక్కాసీతమ్మ 101
v
తనను
తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత,
తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన
వ్యక్తికి పతనం తప్పదు.
స్వామీ వివేకానంద
1.భాగవతం
– భగవంతుడు
భాగవతం, భగవంతుడు, భక్తుడు ఒకటేనని ఆర్యోక్తి. భాగవతం అక్షర
రూపంలో దివ్య శక్తి ప్రకంపనలను వ్యాపింపజేస్తున్నది. భగవంతుడు ఆ ప్రకంపనలలో
నిక్షిప్తమై యున్నాడు. ఆ నిక్షిప్త భగవత్‍ప్రకంపనల రూపమే భక్తుడు. అందుకే భాగవతం
చదివినవాడు భక్తుడయ్యి తీరుతాడంటారు. అంత శక్తివంతమైనది భాగవతం. ఈ భాగవతం
అన్నింటికంటే భగవంతుని నిర్వచించిన అత్యుత్తమగ్రంథం. భాగవతంలో భగవంతుని గురించి
చెప్పిన విషయాలూ, విషదీకరణలు ఒకసారి మనకు తెలిసి నంతలో
పరిశీలిద్దాం. ప్రధమస్కందంలోనే పోతన భీష్ముని చేత చెప్పిస్తూ-
సీ: కుప్పించి
యెగసిన కుండలంబులకాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
జగములు వ్రేగున జగతి గదల
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ
తే: గరికి
లంఘించి సింహంబుకరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు
విడువుమర్జున యనుచు మద్విశిఖవృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ....... భాగ-1-222.
అన్నాడు. ఇందులోని రెండవపాదంలో కృష్ణుడు రథంనొగలపై నుండి యెగిరిదూకి భీష్ముని
పైకి చంపుతానని చక్రం చేతబట్టి వెళ్ళే సమయంలో, ఆ వేగానికి
ఆయన ఉదరంలోనున్న లోకాలన్నీ అటూ యిటూ కదిలాయట. గమనించారుగదా! భువనభాండాలన్నీ
పరమాత్ముని కడుపులో యిమిడి వున్నాయి. అంటే మనమంతా ఆయన గర్భములోనేవున్నాము. ఇదేభావం
చిన్నికృష్ణుడు తల్లికి తాను మన్ను తినలేదని నోరుతెరచి చూపించే ఘట్టంలో కనబడుతుంద
మ: కలయో వైష్ణవమాయయో, యితర సంకల్పార్థమో, సత్యమో,
తలపన్ నేరక యున్నదాననో, యశోదాదేవిగానో పర
స్థలమో? బాలకుడెంత?
యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమైయుండుట కేమి హేతువో? మహాశ్చర్యంబు
చింతింపగన్.
భా-10(పూ) 342.
ఇది కలా? వైష్ణవమాయా?
లేకయేదో యోచిస్తూ పొరబడ్డానా? లేకనిజమేనా?
అర్థంచేసుకోలేకపోతున్నానా? అసలునేను యశోదనా?
కానా? ఇదేమైనా పరస్థలమా? ఇంతచిన్న బాలకుని నోటినుండి చూస్తే బ్రహ్మాండభాండాలన్నీ వెలిగిపోతున్నాయి.
నాకిదంతా మహాశ్చర్యంగా వుంది. అని యశోదాదేవి విభ్రమానికి గురైంది. ఇక్కడగూడా లోకా లన్నీ
పరమత్ముని లోపలే యిమిడియున్నాయన్నది స్పష్టమైంది. ఇక ప్రహ్లాద చరిత్రము లోచూస్తే
మ: కలడంభోధి, కలండు
గాలి, గలడాకాశంబునం, గుంభినిం
గలడగ్నిం, దిశలం,
బగళ్ళ, నిశలం ఖద్యోత చంద్రాత్మలం
గలడోంకారమునం, ద్రిమూర్తుల
ద్రిలింగవ్యక్తులందంతటం
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగానేల నీయా
యెడన్.
... భాగ-7-274.
కం: ఇందుగల, డందులేడని
సందేహమువలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకిచూచిన
నందందే కలడు దానవాగ్రని వింటే? .. భా-7-275.
సముద్రం, గాలి,
ఆకాశం, భూమి, అగ్ని,
దిక్కుల్లో, రాత్రింబవళ్ళ లో, చంద్రాదిఆకాశచరులలో, ఓంకారశబ్దంలో, ఘనజలవాయు పదా ర్తాలలో, మగ ఆడ నపుంసకులలో అంతటా
భగవానుడున్నాడు. ఇక్కడ అక్కడ అనే సందేహమే లేకుండా, అంతటా
వ్యాపించియున్నాడు. ఎక్కడికో వెళ్ళి వెదకాల్సిన అవసరమేలేదన్నాడు. దీన్ని బట్టి
చూస్తే భగవంతుని ఉదరంలో లోకాలుండటంకాదు, లోకంలోని
ప్రతివస్తువు లోనూ, ప్రతిజీవిలోనూ, చొచ్చుకొనిపోయి
భగవంతు డున్నాడని తెలుస్తున్నది. అన్నట్లుగానే స్తంభంనుండి నరసింహుడై అవతరించాడు
భగవంతుడు. ఇప్పుడు మనకు ఒక సందేహంకలుగుతున్నది. ఇంతకూ మనమూ, మనలోకాలూ
భగవంతునిలో ఉన్నాయా? లేక భగవంతుడే మనలోనూ, మనబయటిప్రపంచములోని ప్రతివస్తువులోనూ వున్నాడా? యని.
ఇక తృతీయస్కందములో కర్దమప్రజాపతికి దైవము ప్రత్యక్షమై-"....నీవు మదీయ
శాసనంబునుధరించి మదర్పితాశేష కర్ముండవగుచు నైకాంతిక స్వాంతనంబున భూతాభయదానదయాచరిత
జ్ఞానివై నాయందు జగంబులు గలవనియూ నీయందు నే గలననియూ నెఱింగి సేవింపుము. చరమకాలంబున
ననుంబోందగలవు.... (భాగ-3-759.) అనిచెప్పడం జరిగింది. కర్దమా! నీవు నా
ఆజ్ఞానుబద్ధుడవై కర్మఫలాలన్నీ నాకర్పించి, యేకాంతచిత్తంతో
జీవులయెడ కరుణగలిగి, వాటి భయాన్ని బాపి జ్ఞానివై సర్వజగములూ
నాయందున్నాయి. నేను నీలోవున్నాను. అను యీ సత్యాన్ని తెలుసుకొని నన్ను సేవించు.
కడకు నీవు నన్నే పొంద గలవు అన్నాడు. అంటే జగాలన్నీ తన ఉదరంలోవున్న ఆ గొప్పదేవుడు
నీలో అంటే కర్దమునిలో ఉన్నాడట. ఇది అగమ్యగోచరంగావుంది. ఈవిధంగానే –
కం: విశ్వాత్ముడు
విశ్వేశుడు
విశ్వమయుండఖిలనేత విష్ణుడజుం డీ
విశ్వములోదానుండును
విశ్వము దనలోన జాలవెలుగుచు నుండున్. ..... భాగ-2-100.
విశ్వమునకు
విష్ణువే ఆత్మ (మూలము),
ఆయనే విశ్వమునకు ప్రభువు. విశ్వమంతా ఆయనే, సర్వానికీ
ఆయనే అధిపతి. ఆయనకు పుట్టు కనునదే లేదు. ఆయన విశ్వమంతా నిండియున్నాడు. అంతేగాదు యీ
విశ్వమంతా ఆయనలో విరాజమానమైవుంది అంటారు. అంతేగా కుండా శ్రీకృష్ణనిర్యాణ సమయంబులో
భాగవతం యిలాచెబుతున్నది. "కంటకంబునం కంటకో న్మూలనంబుచేసి కంటకంబుల రెండింటినీ
పరిహరించు విన్నాణి తెరంగున యాదవరూపశరీరంబునంజేసి ఈశ్వరుండు లోకకంటక శరీరంబుల సంహ
రించి
నిజశరీరంబు విడిచె. సంహారంబునకు నిజశరీర పరశరీరంబులు రెండు నీశ్వరునకు సమంబులు.
నిజరూపంబున మెలంగుచూ రూపాంతరములు ధరియించి క్రమ్మఱ అంతర్ధానంబు నొందు నటునికైవడి
లీలాపరాయణుడైన నారాయణుడు మీనకూర్మాది రూపంబులు ధరియించు
బరిహరించు..."(భాగ-1-382.) ప్రపంచమనే ముల్లు గ్రుచ్చుకుంటే మరోముల్లు సహాయంతో దాన్ని ధరియించు తొలగించిన
తర్వాత తెలి వైన
వాడు
గ్రుచ్చుకొన్నముల్లును,
దాన్ని తీసినముల్లునూ రెండింటినీ పారేస్తాడు. లోకాన్ని పీడిస్తున్న
దూర్తరాజ శరీరాలు,అవతారమూర్తుల దేహాలూ రెండూ దైవానికి
సమానాలే, రెండూ అప్రధానములే రెండూ వదిలేయవలసినవే.
రంగస్థలంమీద వేషంతో నటించిన నటుడు రంగస్థలం దిగిన తర్వాత తన నిజ స్వభావంలోనికి
వచ్చినట్లే, భగవంతుని అవతారరూపములూ అంత మత్రమే. వాటికి
ప్రాధాన్యత లేదని గ్రహించవలసి యున్నది. అట్లే కుంతీదేవి శ్రీకృష్ణపరమాత్మను
ద్వారకకు యుద్ధానంతరం సాగనంపుతూ-"...
నీవు మూఢదృక్కులూ, కుటుంబవంతులూనగు మాకు
నెట్లు దర్శనీ యుండవయ్యదవని"...(భాగ-1-187) పలికింది. ఆమె తనయెదుట నున్న కృష్ణరూపమునకే దైవము పరిమితుడుకాడని
తెలుసుకొన్నది.
కనుక
భగవంతుని భావిచడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం. పైన పేర్కొన్న లక్షణాలన్ని సరిపోవాలంటే, భగవంతుడు
ఒకస్థితియై యుండాలి. అది బాహ్యాభ్యంతరాలలో, అంటే బయటా లోపలా
అంతటా ఆస్థితి వ్యాపించి వుండాలి. ఆస్థితి స్వచ్ఛమై, దివ్యమై,
అన్నింటికీ మూల కారణమై యుండాలి. అంతేగానీ యేదో ఒకరూపానికీ
కొన్నికొలతలకు లోబడియుండుననుటలో అర్థములేదు.వర్ణనలకు లోబడి వుండేవాడు, అంటే నల్లనివాడు, ఆజాను బాహుడు, శంఖ చక్రధారి, కమలనయనుడు వంటి రూపాలలో ఆ మహత్తర
దివ్యశక్తి నిండి వుండడంవల్ల మనం ఆరూపాన్ని భగవంతుడుగా భావిస్తున్నాం.అంతేగానీ
ఆరూపముమాత్రమే భగవంతుడుగాదు. అందుకే మరోచోట పోతన-
మ: అణువో కాక కడున్ మహావిభవుడో యచ్ఛిన్నుడో
గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ గుంఠీభవ
త్తత్త్వ మా
ర్గణులై యేవిభు పాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ
వీ
క్షణముం జేసెద రట్టి విష్ణు బరమున్ సర్వాత్ము
సేవించెదన్. ........భాగ-2-99.
అంటారు.
వివేకవంతులైన మునులే యిదమిద్దమని తేల్చలేకపోయారట. ఆయన అణువా? (సూక్ష్ముడా?)లేక విశ్వరూపుడా? విభాగించదగిన
వాడా? లేక
విభాగించలేమా? గుణములు గలిగినవాడా? యేగుణములూ
లేనివాడా? యేదీ అర్థముగాక, నిర్వచనానికే
అందని ఓ దేవా! నీ తత్త్వ మిట్టిదని తెలియదు మాకు, అట్టి
నిన్ను భజిస్తున్నానని తెలుపుకున్నాడు. నిజమే భగవంతుడు అనిర్వచనీయుడు.
నిర్వచనానికి అందేదేదీ భగవంతుడు కానేకాదు. అందుకే యేదో మనకర్థమైనంతవరకు
చెప్పగలమంతే. మనమెంత? పోతనామాత్యుడే-
ఆ.వే: భాగవతము
తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన దమ్మిచూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియవచ్చినంత దేట పఱతు. ... భాగ-1-19.
అన్నాడు.
భాగవతం చదివేకొద్దీ మన స్థాయి పెరుగుతూపొతుంది. రానురానూ ఉన్నతమైన, మహోన్నతమైన
భావాలు మన మదిలో మెదులుతాయి. ఆధ్యాత్మికంగా ఉత్తమోత్తమ పురోభివృద్ధి సాధ్యమౌ తుంది.
కడకు కైవల్యం సిద్ధిస్తుంది.
v
ఒక దారి మూసుకుపోయినప్పుడు,
తప్పకుండా మరో దారి తెరిచి
ఉంటుంది.
దాన్ని గుర్తించగలగడమే, విజయానికి మార్గం.
.......అలెగ్జాండర్ గ్రహంబెల్
2.తాపత్రయం
సర్వసామాన్యంగా తాపత్రయమంటే అందనిదానికోసం అర్రులుచాచడం.
అర్హతకు మించి ఆసించడం. తగనిరీతిలో వ్యామోహానికి గురికావడ మనుకుంటాం. దాని కోసం
యెందుకురా అంత తాపత్రయపడతావు? అంటుంటాం. నిజానికి ఆధ్యాత్మిక పథంలో
దీని అర్థం వేరు. తాపత్రయ మంటే మూడుతాపాలని అర్థం.
మొదటితాపం
దేహానికి సంబంధించింది. దేహం అన్నింటికంటే పైనున్న స్థూలకోశం. తొడుగు. ఇది
తపిస్తుంది. దీని తపనను శాంతింప జేయా లంటే వేళకు ఆహారం తీసుకోవాలి. రుగ్మతలకు
ఔషదసేవనం చేయాలి. తద్వారా దీనితాపం శాంతిస్తుంది. అయితే క్రమజీవనం గడపాలనుకొనే వాడు
యీవిషయంలో జాగ్రత్త వహించాలి. శరీరపోషణకు సాత్వి కాహారమే గ్రహించాలి.
హింసాయుతభోజనం,
అక్రమ సంపాదనతో సమకూర్చుకొన్న తిండి మనకు మేలుచేయదు. ఈవిషయం
భగవద్గీతలో కూడా విపులంగా వ్రాయబడింది. ఇలా శరీరానికి కలిగే తాపాన్ని " ఆధి భౌతికం
" ఆంటారు.
ఇక
రెండవతాపం " ఆదిదైవికం ". ఇది మనస్సు పడే తపన. దీనిని శాంతింప జేయడానికే
సంగీతం,
సాహిత్యం నాటకం, నృత్యం మొదలైన కళలున్నాయి.
వీటి ద్వారా శరీరానికంతరంలోనున్న మనోమయ కోశం లో యేర్పడ్డ తాపం చల్లారుతుంది. అంటే
మనోక్లేశములుతొలగి మనస్సు కానందం కలుగుతుంది. ఈవిషయంలో కూడా జాగ్రత్త అవసరమే.
సంగీతం, సాహిత్యం,
నృత్యం పేరిట అశ్లీలాన్ని ప్రేరేపింపజేసి రాక్ష సానందాన్ని పొందడం
తగనిపని. దానివల్ల ఆధ్యత్మికపయనం కుంటు వడుతుంది. తననూ తనచుట్టూవున్నవాళ్ళని
చెడగొడుతుంది. కనుక సున్నిత ఆహ్లాదకర కళలే శ్రేయస్కరం.
ఇక
మూడవతాపం " ఆధ్యాత్మికం ". ఇది అంతరంతరాళాల్లోని కారణ శరీరం (ఆత్మ) పొందే తపన. ప్రాణంతోవుండే జీవులలో వున్న ఆత్మను
జీవుడని,
శరీరంవీడి బయటపడిన జీవుడు ఆత్మ యని పిలువబడతాడు. ఇది మానవులలో
చైతన్యవంతమై ప్రజ్ఞాయుతమై వుంటుంది. అందుకే మానవజన్మ ఉత్తమమైనది. ఆధ్యాత్మికమైన
తపన మానవులలోనే ప్రకటిత మౌతూ వుంటుంది. పశు,పక్షి,వృక్షాదులలో ఇది నామమాత్రం. కనుక మనవులకిది మహదావకాశం. ఈతాపన్ని
శాంతింపజేయడానికి, ఆరాధన, పూజ, ధ్యానం అవసరం. వీటివల్ల ఆత్మశాంతి కలుగుతుంది. మానవజీవితలక్ష్యమైన
భగవదైక్యం సుసాధ్యమౌతుంది. ఇక్కడా జాగ్రత్త పడాల్సిన అవసరం లేకపోలేదు. ఆధ్యాత్మికత
పేరున అనేక మూఢ నమ్మ కాలకు మనల్ని గురిచేయడం జరగవచ్చు. పూజలపేరున హింసా పూరిత
బలులను ప్రొత్సహించేవారుంటారు. భుతప్రేత పిశాచాలు మనకు మేలు చేస్తాయని
క్షుద్రపూజలు మనపై రుద్దేవారూవుంటారు. కనుక అట్టి వారి వలలో పడకుండా సద్గురువుల
చెంతజేరి ఆధ్యాత్మికదీక్షను గైకొని, సక్రమ మార్గంలో
యోగాభ్యాసముచేసి తరించాలి. ఇలా మనకున్న మూడు తాపాలూ అంటే తాపత్రయాన్ని శాంతపరచి
జన్మధన్యం చేసుకోవాలి.
తాపత్రయాభీల
దావాగ్నినార్పే సలిలవృష్టి భాగవతమన్నారు విబుధులు. నిజమే అందులో జీవాత్మ కైవల్యం
జేరుకొనే మార్గం చూపబడింది. మనస్సుకానందం కలిగించే అమృతోపమానాలైన పద్యాలిందులో
వున్నాయి. తెలుగు భాగవతంలో పోతనామాత్యుడు భక్తిలహరులను పద్యాలలోనికి చొప్పించి మన
కందించాడు. ఇక ఆకలిదప్పుల వంటి ఆదిభౌతికతాపం తీరడానికి కృష్ణపరమాత్మ
భక్తులకొకమార్గం చూపించి తీరుతాడు. అదియెలా? అంటే ఒక భాగవతుడిలా స్థూలంగా
జవాబు చెప్పాడు. ఎవ్వరూ తెలియని ఒకవూరి రామాలయంలో నాకైనేనే భాగవతపఠనం
మొదలుపెట్టాను. అంతే, అన్నంవేళయ్యేసరికి ఒకరైతు వచ్చి,
రండి, యీపూట మాయింట భోజనంచేయండి. సంతోషిస్తాం
అన్నాడు. అంటే భాగవతం ఆదిభౌతికతాపాన్ని తీర్చినట్టే గదా? ఇలాగని
ఖచ్ఛితంగా చెప్పలేముగాని భాగవతం అర్థవంతంగా శ్రద్ధగా విన్నా చదువు కొన్నా
భక్తుడైతీరుతాడు. భక్తుని భగవంతుడెప్పుడూ వదిలిపెట్టడు. తనను చేరుకొనే సరైన మార్గాన్నీ,
మార్గదర్శకుణ్ని ఆయనే చూపుతాడు. అంతెందుకూ, అన్నీతానేయై
మనల్ని ఆయనలో లీనంచేసుకుంటాడు.
ఓం
తత్ సత్.
3.పుణ్యఫలం
చేసినపుణ్యము
చెడని పదార్థమన్నది ఆర్యోక్తి. కాలగమనంలో మనిషి జీవించేది అత్యంత స్వల్పకాలం.
మొత్తంకాలం సముద్రతీరము నగల యిసుకైతే, మనిషి జీవితకాలం ఆయిసుకలోని
ఒక రేణువంత మాత్రమే. అయితే రేణువంతకాలంలో చేసిన పుణ్యాలకుమాత్రం గొప్ప గణింపున్నది.
అందుకే పెద్దలు బ్రతికుండగానే యేదోఒక ఘనకార్యం చేసిపెట్టి పొమ్మం టారు.
మరణానంతరంకూడా జీవితమున్నదని, ఆ మరణానంతరజీవితం మరణానికి
ముందుచేసిన పుణ్యకార్యలపైనే ఆధారపడి వుంటుందని వారి నమ్మకం. అందుకేకాబోలు మన
పూర్వీకులు తటాకాలూ, బావులూ, చెఱువులూ,
సరోవరాలూ, గుళ్ళూ, గోపురాలూ
స్థిరంగా నిలిచివుండేటట్లు నిర్మించి, వాటి సంరక్షణకు
కొంతఆస్తిని వాటి పేర వ్రాసివెళ్ళేవారు. కేవలం వారి సంతతికే సంపాదించిందంతా ధార పోయకుండా,
లోకోప కారార్థం కూడా
కొంతమేలు చేసేవారు. అది వారి మరణానంతర జీవితా నికి చేసుకొన్న పొదుపు. అది
తరగని సంపదైవుంటే మరీమంచిది. మన పెద్దలు అనుసరించిన విధానం మనకు ఆదర్శం.
శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన ఆముక్తమాల్యదలో కూడా యీవిషయం స్పష్టంగా వుంది. పాండ్య రాజు
భోగినీ సంగతికేగుచూ ఒకవిప్ర గృహము నుండి ఒకసుభాషితశ్లోకం విన్నాడు. దానిఅర్థం వర్షఋతువు
నాటికి ముందే ధాన్యం సమకూర్చి పెట్టుకోవాలి. రాత్రిభోజనానికి పగలే సంబా రాలు
తెచ్చిపెట్టుకోవాలి. ముసలితనానికి వయసులోవుండగనే కొంత దాచిపెట్టుకోవాలి.
పరలోకసౌఖ్యంకోసం బ్రతికుండగానే పుణ్యాలు చేసుకోవాలి. ఇదీ ఆశ్లోకార్థం. వెంటనే
పాండ్యరాజు అంతఃపురానికి మరళివెళ్ళి పరలోకప్రయోజనం కోసం ప్రయత్నించాడు. ఈవిషయమై మనమూ ఆలోచించాలి.
మహాభారతంలో యీవిషయమై ఒక విపులమైన కథవుంది. అదేమిటో చూద్దాం.
అది
పాండవవనవాసకాలం. ధర్మరాజు దగ్గరకు ఒకరోజు మార్కండేయ మహర్షి వచ్చాడు. తనజీవితంలో
జరిగిన ఒకసంఘటనను వివరించాడు. ఇంద్రద్యుమ్నుడనే రాజు చాలకాలం స్వర్గంలో హాయిగా
సుఖాలనుభ వించాడు. ఒకరోజు ఇంద్రుడు ఆరాజును పిలిచి రాజా! మీపుణ్యఫలాన్ని యీనాటికి
మీరు పూర్తిగా అనుభవించారు. ఇకమీరు భూలోకం తిరిగి లెళ్ళక తప్పదు, అన్నాడు.
దేవేంద్రా! నాకొక అవకాశం యిప్పించు నిజంగా నాపుణ్యమంతా వ్యయమయిందో లేదో
భూలోకంవెళ్ళి తెలుసు కుంటా నన్నాడు. సరేనన్నడు దేవేంద్రుడు. రాజు సరాసరి
చిరంజీవియైన మార్కం డేయమహర్షి దగ్గరకువచ్చి, మీరు
బహుకాలమునుండి జీవించియున్నారు గనుక ఇంద్రుడు చెప్పినట్లు నాపుణ్యం నిజంగనే
వ్యయమైపోయిందా? ఈ భూలోకంలో నేనుజేసిన యేపుణ్యకార్యమూ మిగిలిలేదా? అని అడిగి నాడు. ముని, అయ్యా! నీవెవరో నాకసలే
తెలియదు. ఇక నీపుణ్యాలు నాకెలా తెలుస్తాయి? తెలియవన్నాడు.
ఇంద్రద్యుమ్నుడు నిరాశచెందాడు. అయినా ముని ఆలోచించి నాకంటే వృద్ధుడైన
ప్రావారకర్ణుడనే గుడ్లగూబ హిమాలయాల్లో వున్నాడు, అతనికేమైనా
తెలుసేమో అడుగూ అన్నాడు. రాజు, స్వామీ! మీరూ నావెంట రండి అని
బ్రతిమలాడాడు. ముని, నేను వయస్సు మీదపడి బలహీనముగా వున్నాను,
రసాయన సేవనంతో యీ
మాత్రం
తిరుగుతున్నాను,
రాలేనన్నాడు. వెంటనే రాజు గుఱ్ఱమై తనపై యెక్కించుకొని
మార్కండేయుణ్ని గుడ్లగూబ దగ్గరికి తీసుకెళ్ళాడు. కానీ అదికూడా ఇంద్రద్యుమ్నుడు
నాకు తెలియదన్నది. కానీ నాకంటే పెద్దవాడు నాళీకజంఘుడనే కొంగ ఒకటుంది, పదండి దాన్ని ఆడుగుదాం అని ముగ్గురూ కలసి దాని దగ్గరకు వెళ్ళారు. కానీ ఆ
కొంగా నాకు తెలియదు, అయినా వుండండి నాకంటే చాలాపెద్దవాడు
ఆకూపారుడను తాబే లున్నాడు, అతడిక్కడే యీ సరస్సులోనే వున్నాడు,
పిలుస్తానుండం డని అతన్ని కేకేసి పిలిచింది కొంగ. ఆ తాబేలు
వచ్చింది. మార్కండేయుడు తన్నుతాను పరిచయంచేసుకొని ఇంద్రద్యుమ్నమహరాజు నెఱుగుదువా?
అని అడిగాడు. తాబేలు కాస్తా ఆలోచించి జ్ఞాపకంచేసుకొని కంటనీరిడి
బహుకాలము నాటి విషయము. అయినా ఆ మహారాజును గురించి నాకు బాగాతెలుసు.
ఉ: అక్కట
నేనెఱుంగనె మహాగుణభూషణు నమ్మహాత్ము న
న్నిక్కడ బెక్కుమాఱులు ననేకభయంబుల బొందకుండగా
నక్కటికంబుతోడ దగ నాతడు గైకొని గచెగాదె పెం
పెక్కిన యన్నరోత్తముని నెన్నటికిన్ మఱువంగ
వచ్చునే.
భాగ-అరణ్య-4-366
తే:గీ: అమ్మహాత్ముడు బహువిధయజ్ఞ
దక్షి
ణార్థముగ విప్రవరులకు నర్థినిచ్చు
గోగణంబుల గొరిజల గ్రొచ్చియయ్యె
గాదె యీ సరోవరము జగన్నుతముగ. .. భాగ-అరణ్య-4-357.
అని
వివరంగా చెప్పింది. రాజును ముని పరిచయంచేశాడు. దండంపెట్టి తాబేలు, యీ
మహారాజు ధర్మాత్ముడు. నన్ను దయతో చాలాకష్టాల నుండి కాపాడాడు. ఈయన అనేకయజ్ఞాలుచేసి
గోదానం మందలు మందలుగా విప్రుల కిచ్చాడు. ఆ మందల గిట్టలతొక్కిడికే యీ సరస్సు
యెర్పడింది. దీని పేరుగూడా ఈంద్రద్యుమ్నసరస్సని యీయన పేరుననే వెలిసింది. ఇప్పటికీ
యీ సరస్సు అనేక జీవరాసులకు ఆధారభూతంగా వుంది. అని చక్కగా సాక్ష్యంచెప్పింది.
వెంటనే దేవతలు విమానంలో వచ్చి రాజుచెంతదిగి, ఓరాజా!
కం: తనకీర్తి
యెంతకాలము
వినబడునిజ్జగమునందు వెలయగ నందా
కను పుణ్యలోక సౌఖ్యం
బున నెంతయు నుల్లసిల్లు బురుషుం డనఘా.
భార-అరణ్య-4-367.
ణ్యకార్యాలవల్ల
లభించినకీర్తి భూమ్మీద యెంతకాలంవుంటుందో అంతకాలం అతడు
పుణ్యలోకసౌఖ్యాలననుభవిస్తూనే వుంటాడు. కనుక
రాజా! వచ్చి విమానమధిరోహించండి మీరింకా స్వర్గలోకసౌఖ్యాలనుభ వించాల్సివుంది.
రండి!
పోదామని దేవతలు పలికారు. కానీ ఇంద్ర ద్యుమ్నుడు తనకు సహాయంచేసిన వారందరినీ
వారివారి స్థానాల లో దించి,
స్వర్గానికి విమానంలో మరలిపోయాడు.
మహాభారతంలోని
యీ కథలోని పాత్రలూ,
సంఘటనలూ చిత్రంగా కన బడినా, సారాంశంమాత్రం
స్పష్టం. పరోపకారకార్యాలే మన మరణా నంతర పరలోకసౌఖ్యానికి కారణం. ఈ కథ యింతమాత్రమే
చెబుతున్నది. కానీ ఆధ్యాత్మికశాస్త్రం మరింతముందుకువెళ్ళి, నీకు
సంప్రాప్తమైన సంపద దైవదత్తంగ భావించి, నీపై ఆధారపడినవారిని
నీ పోషణలోవుంచిన దేవుని బిడ్డలుగా తలచి కర్తవ్యభావనతో జీవించు. సమకూరిన సంపదకు
నీవు ధర్మకర్తవలె మెలగి సద్వినియోగపరచు. సర్వం కృష్ణార్పణం చేసి తరించు.
కర్మఫలాలనుండి విడుదలపొందు. అప్పుడు స్వర్గాదిపుణ్య లోకాల నధిగమించి నీ
ఉనికినిసైతం పోగొట్టుకొని సాయుజ్యస్థితిని పొందుతావు. అంటే భగవంతునితో లయమై
పోతావు. అప్పుడు జనన మరణలంపటటములు నీ
కంటవు. "యద్భావం తద్భవతి" ఉత్తమమైన యోచననేచేద్దాం. ఉత్తమమైన ఫలాన్నే
పొందుదాం.
ఓం
తత్ సత్.
అందం ముఖంలో
ఉండదు సహాయంచేసే మనసులో ఉంటుంది.
.....A.P.J. అబ్దుల్ కలాం.
4.సత్యవచనము
సత్యమంటే, చూచింది
చూచినట్లు విన్నది విన్నట్లు చెప్పడమేనని సర్వసామాన్యంగా మనమనుకుంటాం. నిజానికది
సరికాదు. అలా చెప్పడంవల్ల ఆపద సంభవించవచ్చు. దుర్మార్గం జరగవచ్చు. అనవసర మైన
చిక్కులూ కలగవచ్చు. ఒకస్త్రీ దూర్తులచేత తరుమబడి శీలరక్షణ కోసం ఒకసాధువు
నాశ్రయించింది. ఆయనామెను కుడివైపుకు వెళ్ళమని దూర్తులువచ్చి యడుగగా యెడమవైపు
దారిచూపించాడు. అంటే ఆ సాధువును అసత్యవాది అన్నామా? కాదు
అతడు అలాచెప్పి ఒకస్త్రీ శీలాన్నికాపాడాడు. మంచిపని చేశాడు. కనుక సత్యం యెప్పుడూ
యెవరికీ హానికలిగించరాదన్నది మనం గ్రహించాల్సిన ముఖ్యవిషయం.
మహభారతంలో
యిదే అర్థాన్నిచ్చే అనేకసందర్భాలున్నాయి. భృగువనే బ్రాహ్మణుడు
అగ్నికార్యంనిర్వహిస్తూ కొన్ని సమిధలకోసం బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయనభార్య
పులోమ ఒక్కటే యింట్లోవుంది. అది అదనుగా పులోముడనే రాక్షసుడు యింట్లోనికి
ప్రవేశించి,
వెలుగు తున్న అగ్నిదేవుని యెదుటనిలచి, నాపేరు
పులోముడు. ఈ యింతిపేరు కూడా పులోమ కావడంవల్ల యీమెను మెచ్చి వివాహమాడదా మను కొన్నాను.
ఇంతలో యీమె భృగుడనేవాణ్ని వివాహమాడింది. ఇంతకూ యీమె పులోమేకదా! నిజంచెప్పూ
అన్నాడు. అగ్ని సందేహమనస్కు డయ్యాడు. సత్యంచెబితే రాక్షసుడు యీ ఇల్లాలిని
చెఱబడతాడు. విప్రశాపంతప్పదు. అబద్ధంచెబితే అనృతదోషం అంటుకుంటుంది. సరే విప్ర శాపమనుభవిద్దాం.
అసత్యదోషం భరించడం కష్టం, అని నిజమే చెప్పే శాడు. ఇంకేముంది
రాక్షసుడు బల వంతంగా లాక్కొని వెళ్ళబో యాడు. అప్పుడామెగర్భంనుండి బిడ్డ జారిపడి
కన్నువిచ్చిచూసేసరికి రాక్ష సుడు దగ్ధమైపోయాడు. భృగువు తిరిగివచ్చి జరిగినసంగతి
తెలిసి అగ్నిపై కోపించి సర్వభక్షకుడవుకమ్మని శపించాడు. నేను అనృతదోషానికి వెఱచి
నిజంచెప్పితినని విన్నవించినా శాపం అనుభ వించకతప్పదు, హాని కలి
గించుమాట యెన్నటికీ సత్యమనిపించుకోదని భృగువు తెలియ జెప్పాడు. ఆతర్వాత
సర్వభక్షకుడైనా అందువల్లకలిగే పాపం అగ్నికంటదన్న దేవతల వరంతో అగ్ని ఊరటజెందాడు.
అది వేరేవిషయం. సత్యమంటే యేమిటో మనకర్థమైందికదా!
మహాభారతంలో
సత్యవాక్పరిపాలకుడు ధర్మరాజు. ఆయన సర్వదా సత్యమే పలికాడా? పలికాడనేదే
విబుధుల ఉవాచ. ఆవిషయాన్ని మనకు తెలిసినంతలో మనమూ పరిశీలిద్దాం. అరణ్యవాసంతర్వాత
అజ్ఞాత వాసా నికి ఉపక్రమిస్తూ తమ ఆయుధాలను శ్మశానభూమిలో జెమ్మి చెట్టు మీద
దాచిపెట్టి-
చం:
ఇది శతవృద్ధ మాజనని యిప్పుడు మృత్యువుబొందె నట్లుసే
యుదుము కులప్రయిక్తమగుచున్న సనాతనధర్మ
మిత్తెర
గ దహన కర్మమొల్ల మదిగా మును నిశ్చయించి
మా
మొదలిటి వారొనర్చు విధముం గొనియాడితి
మేము నియ్యెడన్.
విరా-1-179.
తత్ప్రదేశవర్తులైన
గోపాది క్షుద్ర జనంబులకు మరుగువెట్టందలచి వారల కభిముఖులై పాండునందనులందరూ పైవిధంగా
పలికారు. మాతల్లి ముసలిదై చనిపోయింది. మా కులాచారం ప్రకారం మేము శవాన్ని చెట్టు పై
వుంచుతాము. అని ధర్మరాజుతోపాటు పాండవులందరూ పలికారు. ఇక్కడ ధర్మరాజు నిజంచెప్పలేదు.
ఆయనతల్లి కుంతి హస్తినాపురంలో క్షేమంగా వుంది. అంతేగాకుండా శవాన్నిచెట్టుపైవుంచడం
మా ఆచార మనికూడా అసత్యమాడాడు. అంతేగాదు విరటునివద్ద తనపేరు కంకుడని బ్రాహ్మణుడనని, ధర్మరాజుకు
మిత్రుడనని, ఆయనవద్ద పనిచేశానని, అపద్ధం
మీద అపద్ధాలు చెప్పాడు. కానీ యివేమీ చిత్రగుప్తుని చిట్టాలోని కెక్కలేదు. కారణం యీ
అసత్యాలవల్ల యెవరికీ కీడు కలగలేదు. కేవలం తమ ఆయుధాల భద్రతకోసం, తమక్షేమంకోసమే చెప్పారు. అందుకే అవి దోషాలుగా పరిగణింపబడలేదు. కానీ
మహాభారతయుద్ధంలో ద్రోణా చార్యుని చావుగోరి
కం:
అనృతభయము నాజిజయము
గొనియెడు తమకంబు పెంఫు గుదియింపగ బాం
డునరేంద్రు నగ్రతనయుం
డనుమానము వాయబెట్టి యస్త్రగురునితోన్. భార-ద్రోణ-5-314.
తే:గీ: వలయు
కొలది యెలుగెత్తి వర్ణసమితి
యచ్చుపడగ "నశ్వత్థామ" సచ్చె
ననియె
నది పదంపడి యల్లన యతని చెవికి
వినగరాకుండ గుంజర మనియె నధిప... భార-ద్రోణ- 5-315.
ధర్మరాజును
అసత్యదోషభయము,
రణవిజయము రెండూ మనస్సును కలవరపరచాయి కడకు తన ఘనతను దిగజార్చుకొని,
చింతనువదలి, గట్టిగా "అశ్వాత్థామ
హతః" అని అరచిచెప్పి , గురునికివినబడనంత హీన స్వరంలో
"కుంజరః" అన్నాడు. ధర్మరాజు నిజమేచెప్పినాడనుకున్నా, అతని హృదయంలో గురుడు చావాలన్న కుల్లువుంది. లోపలదోషంపెట్టుకొని పైకి
సత్యమే పలికినానని తన్నుతాను సమర్ధించుకున్నా అది సత్యం కాలేదు. చిత్రగుప్తుని
చిట్టాలో పాపంగా నమోదైపోయింది. దాని ఫలితంగా ధర్మరాజు నరకం దర్శించాల్సివచ్చింది.
కనుక యిప్పుడు మనకు సత్యవచనమంటే యేమిటో అర్థమైంది.
మహాభారతంలో
అనేకచోట్ల యిదేఅర్థంతో సత్యంయొక్క గొప్పతనం నొక్కివక్కాణించబడింది.
కం: వినుసత్కాలాపమునక
మనుజేంద్ర శతాశ్వమేధ మహితఫలంబుల్
గొనగొని చూచిన సరిగా
వనయంబును నిట్లు పలుకు నాగమఫణితుల్. భార-ఆది-4-95.
నూరుఅశ్వమేధ యాగముల ఫలితముగూడా సత్యవాక్కునకు
సరిగావని తన్ను అన్యాయముగా తిరస్కరించిన దుష్యంతమహారాజుతో శకుంతల పలికింది.
తే:గీ: సర్వ
తీర్థాభిగమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుగావ
మెఱుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన
మునులు. భార-ఆది-4-96.
సర్వతీర్థస్థల
దర్శనము,
నాల్గువేదముల అధ్యయనము కూడా సత్యము నకు సరిగావని ధర్మజ్ఞులైన
పెద్దలు నిశ్చయించినారని అదే సందర్భములో శకుంతల చెబుతుంది.
కం: వగవగ సాంగోపాంగము
లగు నాలుగువేదములయు నధ్యయనము ప
ల్పుగ నొకసత్యముతో నెన
యగునే యెవ్వియును బోలవటే సత్యమున్. భార-అరణ్య-2-83.
యోచించగా
సర్వాంగసమేతంగా నాలుగువేదముల చక్కని అధ్య యనము, నిజానికి ఒక్కసత్యవాక్యమునకు
సరిపోలవుగదా! నాథా! పెళ్ళినాటి ప్రమాణాలు మరచి నన్ను అడవిలో ఒంటరిగా విడచివెళ్ళినా
వెందుకని వాపోతుంది దమయంతి.
సత్యహరిశ్చంద్రనాటకంలో
కూడా హరిశ్చంద్రుడు అబద్ధం మాట్లాడ నందుకుగాదు కష్టాలనుభవించింది. ఇచ్చినమాట
నిలుపుకొనేందుకు. నిజమేనయ్య! నీకు ధనమిస్తానన్నాను. కానీ యిప్పుడు నాదగ్గర లేదు, అనివుంటే
సరి . అది నిజం చెప్పినట్లేఔతుంది. కానీ యిచ్చినమాట నెరవేర్చడానికే అతడు
భార్యాబిడ్డలను అమ్ముకొని కాటికాపరియై నానాబాధల ననుభవించాడు. కనుక సత్యమన్న
పదానికి విస్త్రుతమైన అర్థమున్నదని గ్రహించాలి.
v
5.
పరోపకారం
శ్లో: శ్లోకార్థేన ప్రవక్ష్యామి
యదుక్తం
శాస్త్రకోటీషు
పరోపకారః
పుణ్యాయ
పాపాయ పరపీడనమ్.
నీతులు చెప్పిన శాస్త్రాలు చాలానేవున్నాయి.
అంతొద్దు. ఒకమాటలో చెప్ప మంటే అయితేవినుమని, అర్థశ్లోకంలో అంతాచెప్పేశారట
ఒక మహాను భావుడు. అదే పరోపకారం పుణ్యం. పరపీడనం పాపం. ఈమాత్రం అర్థమైతే అంతా
అర్థమైనట్టే. ప్రకృతిలోనే యీ పరోపకారం అంతర్లీనంగావుంది. చెట్లూచేమలూ కొండలూ
గుట్టలూ పశుపక్ష్యాదులూ వాటికైఅవే పరోపకారం నిర్వహిస్తూనేవున్నాయి. మనిషేతన్నుతాను
సవరించుకోవలసి వుంది.
శ్లో: పరోపకారాయ ఫలన్తి వృక్షాః
పరోపకారాయ వహన్తి నద్యః
పరోపకారాయ దుహన్తి గవః
పరోపకారార్థమిదమ్ శరీరమ్.
వృక్షాలుఫలాలనూ, నదులునీటిని,
గోవులు పాలను వాటినైజంగా మనకిస్తూ పరోపకారం చేస్తున్నాయి.
శరీరంకలిగివున్నందుకు మనమూ ఆపని చేయాలి
ఆందుకే సుమతి శతకకర్త
కాస్తాగట్టిగానే హెచ్చరిస్తూ-
కం: ఉపకారికి
ఉపకారము
విపరీతము గాదు సేయ
వివరింపంగా
అపకారికి ఉపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి
సుమతీ.
అన్నాడు.
మేలుచేసినవానికి తిరిగీ మేలుచేయడంలో విశేషమేమీ లేదుగానీ కీడుచేసినవానికిసైతం
వానితప్పులు యెత్తిచూపకుండా మేలుచేయడం గొప్ప అన్నాడు. అంతకూడావద్దు. చేసినమేలుకూడా
మరచిపోయి కీడుచేయకుంటే అదేచాలనే పరిస్థితిలో మనుషులున్నారు. అందుకే గురజాడఅప్పారావుగారు
తగ్గివచ్చి "సొంతలాభము కొంతమానుక పొరుగువారికి తోడుపడవోయ్" అన్నారు. ఆయన, మీలాభం
కనీసం కొంతైనా తగ్గించుకొని పొరుగువానికి సహాయపడమన్నాడు. కాలాన్నిబట్టి ఆయనలా
చెప్పవలసివచ్చింది. ఏది యే మైనా పరోపకారిని మనం మరచిపోరాదు. శ్రీకృష్ణదేవరాయల
కాలంలో అలా గుర్తుంచుకోదగ్గ ఒక సంఘటన జరిగింది. అదేమిటోచూద్దాం-
రాయలవారు
ఒకవేసవిలో,
పెనుగొండలో విశ్రాంతి తీసుకొంటున్నాడు. ఉన్నట్లుండి విజయనగరం
వెళ్ళాలన్నరు. గుఱ్ఱంసిద్ధంచేయబడింది. సయంత్రంకావస్తున్నా యింకా
యెండకాస్తూనేవుంది. ఆనవాయితీప్రకారం గొడుగుపోలుడు రాజుగారికి గొడుగుపట్టి గుఱ్ఱం
వద్దకు వెంటవచ్చాడు. ఇక రాజు చెతితోసైగచెసి గొడుగుపోలుని ఆగమని సంజ్ఞచేసి
బయలుదేరాలి. కానీ రాజు యేదోఆలోచనలోవుండి గొడుగుపోలునికి సైగచేయడం మరచి పోయి
గుఱ్ఱాన్ని పరుగుతీయించాడు. సుమారు 120 మైళ్ళు స్వారీచెసి రాయలు విజయనగరం
చేరుకున్నారు. గుఱ్ఱందిగిచూసేసరికి గొడుగు పోలుడు ఆయాసపడుతూ యెదురుగావున్నాడు.
నిలబడలేక రాజు చూస్తూ వుండగానే క్రిందపడిపోయడు. రాజు ఆశ్చర్యపోయాడు. తను
పెనుగొండలో ఆగమని సైగచేయకపోవడంతో గుఱ్ఱంతోపాటే గొడుగుపోలుడూ పరిగెత్తు కుంటూ
యింతదూరంవచ్చడని అర్థమైంది. వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స చేయించాడు.
ఓవారనికి పోలుడు కోలుకున్నాడు. రాయలు అతడిని సభకుపిలిపించి అతనిప్రభుభక్తిని
మెచ్చుకున్నాడు. నీకిష్టంవచ్చిన వరం కోరు కొమ్మన్నాడు. పోలుడు మహరాజా! మీసేవే నాకు
గొప్పవరం, యికోవరం యెందుకుపభూ! అని వినయంగా సమాధానమిచ్చాడు.
లేదు, నీవు కోరు కొనితీరవలసిందే ఊ! అడుగూ అన్నాడు రాయలు.
అయితే ఒకరోకు రాజరికం నాకప్పజెప్పండిప్రభూ! అన్నాడు. సభలోని మంత్రులూ సామంతులూ
ఆగ్రహంతో లేచినిలబడ్డారు. రాయలు వారిని శాంతపరచి, సరే రేపే
నీవు సింహసనమదిష్టించి ఒకరోజుపలనసాగించు, అని ఆజ్ఞజారీ చేసి
తను పెనుగొండకు బయలుదేరాడు. గొడుగుపోలుడు వేకువజామునే స్నానమచరించి పూజాదికాలు
పూర్తిచేసుకొని సభా మంటపంలో ప్రవేసిం చాడు. రాజుగారిసింహాసనంప్రక్కన ఒక పీఠం
వేయించుకొని ఆసీనుడై దస్త్రా లన్ని తెప్పించుకొని రాజోద్యోగులను పురమాయించి,
యెక్కడెక్కడ ఖాళీ స్థలాలూ, బంజర్లూ.
ప్రభుత్వభూములూ వున్నయోచూచి పట్టిక తయారు చేయమన్నాడు. ఇంకొంతమంది ఉద్యోగులను
ప్రత్యేకముగా నియమించి, తయారుచేసిన పట్తికప్రకారం తను
చెప్పిన, పేదకులవృత్తులూ, రైతులందరికీ
భూములు కేటాయిస్తూ ఇనాముపత్రాలు వ్రాయమన్నాడు. ఇలా రెండునుండి ఐదెకరాల వరకూ దానఇనాముపత్రాలు
రోజంతావ్రాయించి సతకంపెట్టి రాజముద్ర వేయించాడు. తనకోసం ఒకజానెడుభూమికూడా
వ్రాసుకోలేదు. మరుదినం రాయలు సభకురాగానే పీఠందిగి నమస్కరించి ఒకవారగా నిలబడ్డాడు.
గొడుగుపోలుడు చేసినపనిచూసి రాయలు "ఎంతమంచి పనిచేశాడు. నాకిట్టి ఆలోచనే
రాలేదే! భళా పోలయ్యా నేటినుండి నీపేరు భూమానాయుడుగా మారుస్తున్నాను. రా! వచ్చి
యింకోరోజు దొరతనం స్వీకరించు. అన్నాడు. చాలు ప్రభూ! చేయాలనుకున్న ఉపకారం ప్రజలకు
చేశేశాను. నమస్కారం అంటూ చేతులు జోడించాడు. అదీ పరోపకారి భూమానాయుని చరిత్ర.
ఇప్పటికీ భూమాయపల్లెలు, భూమానాయుని ఇనాము భూములూ రాయలసీమలో
అక్కడక్కడా కనిపిస్తూనేవున్నాయి.
పరోపకారి జీవితం
బహుధన్యం
6.వివేకము
– వైరాగ్యము
ఆధ్యత్మికరంగమున
వివేకము,
వైరాగ్యములనునవి సాధనచతుష్టయము లోని మొదటి రెండుఅంగములుగా
భావిస్తారు. వివేకమంటే నిర్ణయాత్మక మైన జ్ఞానము. ఏదిమంచో యేదిచెడో, ఏది తగునో యేది తగదో, ఏదిమేలో యేదికీడో తనకై తానే
సందర్భమునుబట్టి నిర్ణయించుకొని వ్యహరింపగల సామర్థ్యము. ఇది మనిషిలో
సిద్ధించిననాడు, అతనికి యీ ప్రాపంచిక విష యములు, వస్తువులు, సంబంధములు అశాశ్వతమనీ, వీటికై ప్రాకు లాడుట నిరర్థకమని గ్రహిస్తాడు. అంతటితో వాటికై ఆరాటపడటం
తగ్గుముఖం పడు తుంది. శాశ్వతమైన పారమార్థికవిషయములపై ఆసక్తి పెరుగుతుంది.
ఇక
వైరాగ్యమంటే నిరాసక్తత. వస్తువ్యామోహం నసించటం. వివేకవంతుడై విచక్షణాజ్ఞానం
కలిగినతర్వాత యీతత్త్వం మనిషిలో యేర్పడుతుంది. నిరా సక్తత, విరక్తి
రావడానికి కొన్నితర కారణాలుకూడా వుండోచ్చు. కొన్ని వస్తువులు ఉపయోగించి ఉపయోగించి,
వాటిపై వ్యామోహంతగ్గి నిరాసక్తత రావచ్చు. కొన్ని యెంతప్రయత్నించినా,
ఆశించి శ్రమించినా లభ్యంకాక పోవచ్చు. అప్పుడుకూడా విసుగుజెంది
వాటిపై విరక్తి కలగవచ్చు. "అందని ద్రాక్ష పుల్లన" అన్న సామెత
వుండనేవుందికదా. ఇంకా పెద్దలు యీ వైరాగ్యం రావడానికి మరోమూడుకారణాలు చెబుతారు.
అందులో ఒకటి ప్రసూతి వైరాగ్యం. స్త్రీ పురిటినొప్పులకు తాళలేక, యికచాలు యీ సంసారిక జీవన మని వైరాగ్యానికి లోనౌతుంది. మరొకటి
శ్మశానవైరాగ్యం. తనకు దగ్గరి బంధువులూ, ప్రియులూ, కావలసినవారూ మరణించినప్పుడు నైరాశ్యానికి గురైపోతారు. ఇంతేగదా జీవితం.
ఇంతదానికి యెందుకింత ఆశ, ఆతృత వెంటగట్టికొని పోయేదేమీ
లేదుగదా! యని వైరాగ్యానికి లోనైతారు. ఇంకొందరు అదృష్టం కలిసిరాక నష్టాలకులోనై
ఉన్నది పోగోట్టుకొని నిరాశపడతారు. యెమున్నదీలోకంలో అన్నీ అందినట్లేవుంటాయికానీ
అందవు. అంతామాయ, భ్రమ అని నిరుత్సాహపడి వైరాగ్యానికి
గురౌతారు. నిజానికి జాగ్రత్తగా లోతుగా పరిసీలిస్తే మెదటచెప్పిన వివేక, విచక్షణా జ్ఞానసంపన్నతతో కలిగిన వైరాగ్యంతప్ప మిగిలినవన్నీ
తాత్కాలికమైనవే. ప్రసవించినతర్వత స్త్రీ క్రమేణా వైరాగ్యం క్షీణించి మళ్ళీ
సంసారంలో మునిగిపోతుంది. చనిపోయినవానిపైగల మమకారం అంత్యక్రియల అనంతరం రోజురోజుకూ
నైరాశ్యంతగ్గి మళ్ళీ ప్రాపంచికజీవనంలో కొట్టుక పోతాడు. మహాభారతంలో యక్షప్రశ్నలని
వున్నాయి. అవి అరణ్య వాసం లోవున్న ధర్మరాజుకు యక్షునిరూపంలోవున్న యముడు వేసిన
ప్రశ్నలు. వాటిలో ఒకటి ప్రపంచంలో అతి చిత్రమైన విషయమేమిటీ? అని.
దానికి ధర్మరాజు, యెదురుగా మనుషులు చస్తున్నా ఆఁ..
నాకుగాదులే యని నిర్లక్ష్య భావనతో మనుషులుండటమే నని జవాబిచ్చారు. కనుక చనిపోయిన
వారి వల్ల కలిగే వైరాగ్యం తాత్కాలికమే. ఇక కష్టనష్టాలన్నామా? అదృష్టం కలసి వచ్చి అవి యే క్షణాన్నయినా తొలగిపోవచ్చు. అంతటిటో వైరాగ్యమూ
వదలిపోతుంది.
ఇక
మరికొందరున్నారు,
మాకు జ్ఞానోదయమయ్యింది, యీసంపదా యీ బంధాలూ,
అనుబంధాలూ భూటకం సన్యసిస్తున్నామని, వెళ్ళేటప్పుడు
తమ ఆస్తిపాస్తులన్నింటిని కొడుకులకూ అయినవారికి మాత్రమే అప్పజెప్పుతారు. అవసరమై
అన్నానికి అలమటించేవారికి ఒకరూపాయికూడా యివ్వరు. పైగా సన్యాసియై కూడా యేదోవిధంగా
కొంత సంపాదిస్తారు. అదికూడా సరాసరి తమబిడ్డాలకే పంపుతారు. ఇది వైరాగ్యమా? కాదు వారికి వారిబిడ్డలపై మమకారం యేమాత్రం తగ్గలేదు. ఇంకొందరున్నారు,
వారు సాంసారిక సమస్యల నెదుర్కొనలేక బేలలై తప్పించుకపోవడం కోసం
సన్యసిస్తారు. అయినా తమబిడ్డలపై చింతమాత్రం వదలరు. ఇటువంటివారు సంసారం నుండి
శారీరకంగా దూరమైనారేగాని మానసికంగా కాదు.
కనుక
అసలువైరాగ్యం వస్తువులు కలిగివుండకపోవడం, తనపైన ఆధార పడినవారిని
కష్టములపాల్జేసి దూరంగా వెళ్ళిపోవడం కానేకాదు. వస్తువులపైనా, బిడ్డలపైనా తగని వ్యామోహం పెంచుకోకపోవడమే వైరాగ్యం. కుచేలునిజూచి
కృష్ణపరమాత్మ నువ్వునేను ఒకేస్థితిలో ఉన్నా మన్నాడు. అంటే నీకు ధనములేకున్నా నాకు
యెన్నిసంపదలున్నా మనిద్దరి స్థితి ఒకటేనని దానర్థం. కుచేలుడు పేదరికంలో
క్రుంగిపోలేదు, కృష్ణ పర మాత్మ సంపదలకు పొంగిపోలేదు. అదీ
అసలు వైరాగ్యం.
నిజానికి
మనిషిలో వివేకంగలగడం,
తద్వారా వైరాగ్యస్థితి నెలకొనడం ఊరికే జరగదు. ముందుచెప్పుకొన్నట్లు
యివి సాధనలుకావు, సద్గురు శిక్షణలో సరైన యోగసాధన
చేయడంద్వారా సంపాప్తమయ్యే ఫలాలు. వివేకం
తనలో నెలకొన్నతర్వాత సాధకుడిక మతగ్రంధాలలో యేమి లిఖించారో చూచులొని తదనుగుణంగా
నడచుకోవలసిన అవసరం వుండదు. తనే సందర్భాను సారంగా సక్రమంగా విచక్షణతో వ్యవహరిస్తాడు.
అతడు దారితప్పి చరించడం జరగనే జరగదు. ఇటువంటివారిలో యేర్పడ్డ వైరాగ్యం నిజానికి
ఒకగొప్ప మానసికస్థితి. ఈ స్థితి నందుకొన్నవాడే పరిపూర్ణుడు. అతడే నిజనికి సరైన
మార్గదర్శకుడు.
7.
పొదుపు
పొదుపు
చేయడమంటే యేమిటో తెలియనివారుండరు. సంపాదించు కొనేప్పుడు, అందులో
కొంతభాగం, రాబోయేకాలంలో వచ్చే శుభాశుభ కార్యాలలో వ్యయం
చేయడంకోసం, వైద్యంకోసం, ముసలితనం లో
సంపాదన లేనప్పుడు వాడుకోవడంకోసం కొంతడబ్బును పొదుపుచేసు కోవడం అవసరం. ఈ పొదుపు
కూడా మనిషి కొంతవిచక్షణతో చేసు కోవాల్సి వుంది. కొందరు సరిగ్గా తిండికూడా తినకుండా
దాచిపెడు తుంటారు. అదీ తప్పే. అట్టివారిని పిసినారియని లోకం నిందిస్తుంది. అట్లని
కొందరు మరీదుబారాగా ఖర్చుచేసి లేనినాడు అప్పులుచేసి, అప్పుల
ఊబిలో కూరుకపోయి, బయటపడలేక అవస్థలు పడుతూవుంటారు. అదీ తప్పే.
"పొదుపు" అనే పదం మరోఅర్థంలో కూడా వాడుతుంటాం. ఏదైనా పొదుపుగా వాడుకోవాలి
అంటూంటాం. అంటే తగినంతగా, అటుయెక్కువ తక్కువ గాకుండా సమంగా
వాడుకోవడమన్నమాట. ఇక్కడ దాచుకోవడం అన్న అర్థంరాకపోయినా, విషయం
దాదాపు సమానమే. ఈ దాచుకోవడ మనే గుణం ఒక మనిషికి మాత్రమేవుంది. పశుపక్ష్యాదులలో
లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తిరుపతి వెంకటకవులు తమ "పాండవోద్యోగం "నాటకంలో
"ఉన్నదిపుష్టి మానవులకో యదుభూషాణా ఆలజాతికిం తిన్నది పుష్టి" అన్నాడు.
పశువులకు యేరోజుకారోజు తిన్న గ్రాసమే పుష్టి. మానవులకు మాత్రం సంపాదించి
వెనకేసుకొన్నదే బలం. ఎంత కండపుష్టిగలవాడైనా పహిల్వానైనా ధనవంతునిముందు చేతులు
గట్టుకొని నిలబడవలసిందే. అందుకే యీగుణం మనుషుల్లో వ్యత్యాసాన్ని పెంచింది. కనుక
కొందరు తానుతిని యితరులకింతపెట్టాలిగానీ దాచుకోవడం దోషమనికూడా అంటున్నారు.
కవితాపితామహుడు అల్లసానిపెద్దన దీనికి వత్తాసు పలుకుతూ
కం: కలనాటిధనము లక్కర
గలనాటికిదాచ కమలగర్భుని వశమా
నెలనడిమినాటి వెన్నెల
అలవడునే గాదెబోయ అమవస నిశికిన్.
అన్నాడు.
ఉన్నప్పుడు తినకుండా దాచుకుంటానంటే కుదరదు. ఎందుకంటే పున్నమినాటి వెన్నెల
అమావాస్యనాటికి దాచివుంచాలంటె అవుతుందా? అవ్వదుగదా?
అంటారు. వాదన యెలావున్నా కొంతపొదుపు పాటించ వలసిందే, కొంతదానధర్మాలూ చేయవలసిందే, కొంత తానూ అనుభ వించాల్సిందే.
దేంట్లోనైనా మితం పాటించడం ముఖ్యమని జీవితానుభావాలు తెలియజేస్తున్నాయి. నాకుతెలిసీ
యీ పొదుపుకు సంబంధించిన ఒక కథ వున్నది తెబుతా వినండి.
ఒకగ్రామంలో
రామయ్య యింటి ప్రక్కలో వీరయ్య వుండేవాడు. ఇద్దరూ మంచి యిరుగు పొరుగు. రామయ్య
కాస్తానెమ్మదస్తుడు. ఉన్నవాడు. వీరయ్య సంసారం యేపూటకాపూటే . వీరయ్య తన సమీప
బంధువుల పెళ్ళికివెళ్ళాల్సి వచ్చింది. భార్యాభర్త కలిసేవెళదామనుకున్నరు. కానీ
భార్య రానన్నది. మగ వాళ్ళు యెలావెళ్ళినా పరవాలేదు. ఆడవాళ్ళు సొమ్ములు లేకుండా
వెళితే చిన్న చూపుచూస్తారు. వద్దులెండి, మీరువెళ్ళిరండి
చాలు అన్నది. రామయ్య భార్య యీ మాటలన్నీ విన్నది. వీరయ్యభార్యను పిలచి తన చంద్రహారం
యిచ్చి, పెళ్ళికివెళ్ళిరా! వస్తూనే తిరిగిచ్చేద్దువులే.
ఇరుగుపొరుగూ అన్నాక యీమత్రం సాయం చేసుకోకుంటే యెలా? సంతోషంగా
వెళ్ళిరా! అన్నది. వీరయ్యభార్య సరేనని పెళ్ళికివెళ్ళి సరదాగా బంధువులతో
కలిసితిరిగి యింటికివచ్చింది. కానీ చంద్రహరంమీద మోజు తీరలేదు. రేపిచ్చేద్దాంలే
అనుకుంది. అట్లే రాత్రికి నిద్రపోయింది. తెల్లరేసరికి మెడలో హారంలేదు.
ఇల్లంతావెదికింది. లాభం లేదు. చాలాచాలా బాధపడింది. ఇక చేసేదిలేక తొలుత భర్తకు
తర్వాత రామయ్యభార్యకూ చెప్పేసింది. రామయ్యబార్య పాపం యేంచేస్తుంది, తనే పిలిచి మరీ హారమిచ్చిందిగదా! ఇంతలో వీరయ్య రామయ్యను కలిసి, మీరేం బాధపడకండి. ఓసంవత్సరం సమయమివ్వండి, యేదోవిధంగా
మీకు కొత్తహారం కొనిస్తామని నచ్చజెప్పాడు. చేసేదేముంది. సరేలెమ్మన్నాడు రామయ్య.
ఆరోజునుండీ
మహాపొదుపు మెదలైంది వీరయ్యింట్లో. ఒకపడుగ, పబ్బం యేమీలేదు.
తిండీతిప్పలుగూడా ఆడికాడికి అయిందంటే అయిందని పించ సాగారు. మర్యాదకాపాడుకోవడంకోసం
తపనబడిపోయారు. తక్కువఖర్చు అధికశ్రమ వల్ల యెలాగైతేనేం సంవత్స రానికి కావలసిన డబ్బు
సమకూరింది. రామయ్యను వెంటదీసుకొని బోయి పోగొట్టుకొన్న చంద్రహారంతూకం రామయ్యచెప్పగా,
కొత్తచంద్రహరం కొనిచ్చాడు వీరయ్య. కొద్దిగా డబ్బు మిగిలింది.
ఆడబ్బుతో కొడుకు చాల రోజులుగా అడుగుతున్న రంగుపెన్సిళ్ళు కొన్నాడు. అవిచూసి
వీరయ్యకొడుకు చాలా సంతోషపడిపోయాడు. వెంటనే తెల్లకాగితం తీసుకొని బొమ్మలేసు కోవడం
మొదలుపెట్టడు. ఇంతలో ఒక యెలుక, క్రింద మెరుస్తున్న ఒక రంగు
పెన్సిలు లాక్కొని కలుగులోనికి దూరింది. పిల్లవాడు అదిగమనించి నాన్నా నన్నా అని
యేడవడం మొదలు పెట్టాడు. వీరయ్యవచ్చాడు. పిల్లవాడు ఎలుక బొరియ చూపించాడు.
రంగుపెన్సిలు కొద్దిగా కలుగులో కనబడుతూవుంది. వేళ్ళతో బయటికి తీయడానికి
ప్రయత్నించాడు వీరయ్య. కానీ అది మరింతలోతుకు జారి పోయింది. పిల్లవాడు యేడుపు
లంఘించుకున్నాడు. ఇక చేసేదిలేక ఒకచిన్నపలుగు తీసుకొనివచ్చి ఎలుకబొరియను తవ్వాడు.
లోపలచూస్తే రంగురంగులకాగితాలూ, కొత్తచంచాలూ, పెన్సిళ్ళు, వాటితో పాటే పోయిందనుకొన్న చంద్రహారం కనిపించాయి. ఆశ్చర్యం ఆనందం కలిగాయి
వీరయ్యకు. ఎలుక మెరిసేవస్తువులన్నీ లక్కూపోయి తనకలుగులో పెట్టుకొందన్నమాట.
చంద్రహరం భార్యకుచూపించి తీసుకపోయి రామయ్యకు యిచ్చి జరిగిన విషయం చెప్పాడు. రామయ్య
ఆచంద్రహరం భార్యకిచ్చి కొత్తచంద్రహారం వీరయ్యకిమ్మన్నాడు. వీరయ్య, కొత్తచంద్రహారం బాగుంటే మీరే వుంచుకోండన్నడు. లేదులేదు. కొత్తహరం నీ
కష్టార్జితం నీవేతీసుకొమ్మని, భార్య కొత్తహారం తేగానే వీరయ్య
చేతికిచ్చాడు రామయ్య. ఇస్తూ ఒకమాటచెప్పాడు "వీరయ్యా నీవు పొదుపుచేసి చంద్రహరం
కొనుక్కోగలిగావు". పొదుపంటే అర్థమైందికదా!
పొదుపుచేయడం మానకు. కానీ మరీ యిలా కడుపుమాడ్చుకొని దాచకు. అనగానే
వీరయ్యనవ్వుతూ సరేసరే పొదుపుప్రభావం కళ్ళారాచూచి, అనుభవపూర్వకంగా
తెలుసుకున్నవాణ్నిగదా! అంతా నామంచికే జరిగింది. ఆంటూ యింటికి బయలుదేరాడు.
v
8.మతము
ప్రపంచములోని
మనుషులంతా యెదో ఒక మతంలో పుట్టినవారే. జీవన యానంలో కొందరు మతాన్నీ విశ్వసించక
వదిలిపెట్టివుండవచ్చు. లేదా మతంమారివుండవచ్చు. అది వేరేవిషయం. వాస్తవానికి
మతాలన్నీ మనిషిని ఉత్తమునిగా తీర్చిదిద్దడానికే యేర్పడ్డాయి. ఏ జీవికీలేనిది, మనిషికిమాత్రమే వున్నది యీ మతమే.
నిజానికి ప్రతిమతం ఒకమహనీయుని బోధతోనే పుట్టు కొచ్చింది. హిందూమతంమాత్రం
అపౌరుషేయం. అంటే దీనికి పలానా వ్యక్తి మూలపురుషుడని చెప్పలేం. అసలు హిందూమతం
ఒకమతమే కాదని, ఒక జీవనవిధానమని చెబుతారు. చాలా మతాలు దేవుడు,
పరలోకమూ, స్వర్గ నరకాలను గురించి మాత్లాడతాయి.
వాటికి సంబంధించిన నిర్వచనాలు, వివరణలు, వర్ణనల విషయంలో తేడాలుండొచ్చు. అసలుదేవుడు, యితర లోకాల
ప్రసక్తిలేని మతాలూ వున్నాయి. ఉదాహరణకు చార్వాకము, బౌద్ధము
వంటి మతాలు యీ భూలోకపు మానవజీవిత విలువలనుగూర్చి మాత్రమే బోధిస్తాయి. మోత్తానికి
మతమంటే కొన్ని సూత్రాలు నియమ నిబంధనల సంపుటిగా మనం భావించవచ్చు. ఒక్కోమతానికి సంబంధిం చిన మూలపురుషుడు
తనచుట్టూవున్న సంఘమును సంస్కరించి జనులు ద్వేష రహితులై, నీతి,
నిజాయితీతో జీవించడానికి అవసరమైన నిబంధనలు, కట్టుబాట్ల
నేర్పరచి వారి ఉన్నతికి శ్రమించారు. అయితే యీ నిబంధనలు కట్టుబాట్లు
వేరువేరుగావుండటం తటస్థిస్తూవున్నది. అందుకు కారణం, మతమూలపురుషులు,
వారుజీవించిన కాలం, ప్రదేశం ఆ నాటిప్రజల
జీవనవిధానానికి అణుగుణంగా వారిమేలుకోసం యీ యేర్పాట్లుచేసి వుంటారనిపిస్తుంది. కాలం,
ప్రదేశం జనజీవనవిధానం ఒకటే కాకపోవడం వల్ల యీ తేడాలేర్పడ్డాయి.
అంతేతప్ప నిజానికి వాటి ప్రయోజనం మాత్రం మానవోద్ధరణే. ఒకకాలంలో, ఒకప్రదేశంలో జనులను ఉద్దరించిన ఆచారం మరొకప్రదేశంలో, మరోకాలంలో అది యేమాత్రం ఉపగయోగపడనిది కావచ్చు. అంతేగానీ మరేమీగాదు. మా
మతమూలపురుషుడు ఇప్పటి యీ పరిస్తితుల్లో వుండివుంటే యెలా ప్రవర్తించి వుండేవాడు.
యేమి బోధించి వుండేవాడు అనే దృక్పదంతో జనులు ఆలోచిస్తే ఆ మహనీయుని మూలోద్ధేశ్యం
అర్థమైవుండేది. మతఘర్షణలకు తావుండేదికాదు.
ప్రపంచంలోని
ప్రజలమధ్యదూరం మారినకాలంలో తగ్గిపోయింది. అనేక మతాచారాలకు యీ మారినకాలంలో
అర్థమేలేకుండాపోయింది. అవి కేవలం మూఢాచారాలుగా మిగిలిపోయాయి. కానీ మతఛాందసులు
మాత్రం వాటిని అత్యంతపట్టుదలతో ఆచరించాల్సిందేనంటున్నారు. ప్రయాణ సౌకర్యాలు, విద్య, జీవితంలో వస్తువినియోగంలో విప్లవాత్మక
మార్పులు రావడంతో, దేశానికీ దేశానికీ మధ్య దూరం
తగ్గిపోయింది. జీవనవిధానం లో అనేక మార్పులు వచ్చేశాయి. కానీ మతవిశ్వాసాలలో
సర్దుబాటుకు జనం ఒప్పుకోవడంలేదు. అంతేగాకుండా మతాచారాలలోని తేడాలు జనులమధ్య ఘర్షణల
రేపుతున్నాయి. అవి రానురాను జనులమధ్య దురభిపాయాన్ని పెంచి తీవ్రవాదానికి
ఉగ్రవాదానికీ దారితీస్తున్నాయి. ఒక్కప్పుడు మానవోద్ధరణకు యేర్పడిన మతాలు యిప్పుడు
విధ్వంసానికీ, హింసకూ ఆలవాలమై పోయాయి. అమృతంలాంటి ఔషదం
కాలంతీరినతర్వాత విషమైనట్లై పోయింది. ఆఖరుకు యీమతంపేరుతో రాజకీయాలుకూడా నడచి
మానవత్వం మంటగలసి పోతున్నది. చాలమందికి మతమంటేయేమో తెలియదుగానీ తమ మతమంటే
వీరావేశాంతో ఊగిపోతారు.
ఈ
సమయంలో జనం మేల్కోవలసివుంది. మతం, జాతి, తెగ, కులద్వేషం ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడాలి.
మతపరిధిని అర్థంచేసుకొని దాన్నిమించి మనిషి యెదగవలసివుంది. వాస్తవానికి యెవరిమతం
వారు పటిస్తే యిబ్బంది లేదు. ఎదుటిమతంలోని లోపాలను వెదికి వారిని దూషించడం ద్వారా
తమ మతం గొప్పదనాన్ని చాటుకోవాలనుకోవడం తప్పు. నిజానికి తమమతం లోని మంచిని గ్రహించి
ఆచరించడానికే మనిషికి సమయం సరిపోదు. అటువంటిది యితరమతాలలోని నెరసులను వెతకడానికి
సమయ మెక్కడిది? అందుకు వెచ్చించే సమయం వృధాచేసుకోవడమేనని
మనిషి గ్రహించాలి. అలా సమయంవృధాచేసుకొననివారు ఆధ్యాత్మికంగా యెదిగి యింకా యింకా
ముందుకుపోయి ఋషులౌతారు. వారు అందరిలో దైవాన్ని కనుగొంటారు. ఈ విషయమై మహాత్మా రామచంద్రజీ యేంచెప్పరో చూడండి.
"మతముయొక్క
అంత్యమే ఆధ్యాత్మికోదయము. ఆధ్యాత్మికత అంత్యమే
సత్యోదయము. సత్యముయొక్క అంత్యమే వాస్తవానందోదయము. అది యునూ గతించిన మీదటనే
మన గమ్యస్థానము చేరుదుము. మాటలకలవికాని మహోన్నతస్థితి యిది"
దీన్నిబట్టి
చూస్తే మతపరిధిలోనే మనం కీచులాడుకోవడం అవివేకం. మనం మహోన్నతులం కావడానికి
మతపరిధినిదాటి మున్ముందుకు వెళ్ళవలసి వుంది. అప్పుడే మానవుడు మాధవుడౌతాడు. సమత, మమతలను వ్యాపింపజేస్తాడు.
v
9.
సత్యసంధత
మితస్వభావము, అప్రతీకారబుద్ధి, పెద్దలయెడ గౌరవము, దైవమునెడ భక్తివిశ్వాసములు, వినయసమ్మతమైన భాషణము
గలిగి, హితకరుడై జీవించువాడే సత్యసంధుడు. ఇట్టివాడు
ప్రపంచములో జీవింపజాలడని పలువురి నమ్మకము. కానీ అది సత్యదూరము. అనుభవరాహిత్యముతో
మాట్లాడేమాట. సత్యసంధుని దైవము సదారక్షించుచునేయుండును. ఎలా గన్నది మనము వివరింపజాలము.
అది దైవలీల. మనకర్థము కాదు. అర్థము
కావలసిన అవసరమూ లేదు. దైవము రక్షించునను దృఢవిశ్వాసమే చాలును. మనలను
గట్టెక్కించును. ఆచరణమున అది నిరూపితమై తీరును.
దీనికి
సంబంధించిన ఒక ఉదంతము మహాభాగవతము నవమస్కంద ప్రధమమున కలదు. కొంత పరిశీలింతము.
నాభాగుడను రాజ కుమారు డున్నాడు. అతడు బ్రహ్మచారిగానుండగా అతనిని విస్మరించి అన్నలు
రాజ్యమునూ సంపదనూ పంచుకొని హాయిగానుండిరి.
నాభాగుడు
వెళ్ళి అన్నలను తనభాగమడిగెను. అన్నలు సంపదపై ఆశచే " వెళ్ళి మనతండ్రి నడుగుము.
ఆయన మాటప్రకారము బోవుద" మనిరి నాభాగుడు తండ్రి నాశ్రయించెను. వానప్రస్థుడైన
తండ్రి విషయము గ్రహించి మీ అన్నల విషయము వదలివేయుము. వారు దురాశతో నున్నారు.
నీకుభాగమివ్వరు. అంగీరసులు సత్రయాగము చేయు చున్నారు. వారు మేధావులే. ఐనప్పటికినీ
ఆరవదినమునజేయు సత్ర యాగకర్మలు తెలియక సతమతమౌచున్నారు. వెళ్ళి వారికి వైశ్వదేవ
సూక్తంబులు రెండుతెలిపి వారికార్యము నిరాటంకము గా సాగునట్లు సహాయపడుము. వారు
సంతృప్తులై యాగము పూర్తియైన తర్వాత మిగిలినధనము నీకిచ్చెదరు, వెళ్ళుమనెను.
తండ్రియాజ్ఞను తలదాల్చి చెప్పినట్లు చేసినాడు నాభాగుడు. అన్నలఆస్తిని సద్బుద్ధితో
వదిలేశాడు. అంగీరసులు నాభాగుని సహాయమున యజ్ఞపరిసమాప్తిజేసి మిగులు ధనం
నాభాగునకిచ్చేసి "కవి" యనబరగుమని దీవించి స్వర్గం వెళ్ళి పోయారు.
నాభాగుడు అంగీరసులు విడిచివెళ్ళిన ధనం సేకరిస్తుండ గా, ఒకనల్లని
ఆజనుబాహుడైన పురుషుడేతెంచి యిది నాధనం. విడిచి వెళ్ళిపొమ్మని గద్దించాడు. నాభాగుడు,
అయ్యా అంగిరసులు యిదంతా నన్ను తీసుకొమ్మన్నారు. అందుకే తీసు కొంటున్నాననెను.
అట్లయిన వెళ్ళు, వెళ్ళి నీతండ్రినడుగు ఆయన
చెప్పినట్లుచేద్దామన్నాడు ఆ కృష్ణదేహుడు. నాభాగుడు తిరిగీ తండ్రిదగ్గరకువెళ్ళి
జరిగిన విషయం చెప్పాడు. తండ్రి ఆలోచించి, నిజమేకుమారా!
యజ్ఞమందిరగతంబైన యుచ్ఛిష్టంబగు(వదలి వెళ్ళిన) ధనంబు రుద్రునకు చేరునట్లు మునులు తొల్లి నియమంచేశారు. కనుక అది నీదికాదు అన్నాడు.
వెంటనే నాభాగుడు యాగశాలకువెళ్ళి, అయ్యా తప్పైనది. ఇది
రుద్రునకు చెందినది. మీరు కోరుచున్నారనగా మీరు రుద్రాంశ సంభూతులై యుందురు, మీరేగైకొనిడని వెనుదిరిగెను. వెంటనే ఆ నల్లని దీర్ఘ శరీరుడు నాభాగుని
నిలువుమని వెనుకకుపిలిచి, నాభాగా! అన్నలనుండి రావలసిన
ఆస్తిని వదలుకొంటివి. ఈ యజ్ఞపరిశేషిత
ధనమును నాకు వదలివేసితివి.
మరినీవెలా బ్రతుకుదువనెను. అన్నలు నా కేమియూ యివ్వరని తేలిపోయినది. వారిమనస్సును
నాభాగము పేరిట నొప్పింప దలచుకోలేదు. ఇక యీఈధనము మాతండ్రి నాకు చెందదని తెలిపినాడు.
నాదికానిదానిని నేనెట్లు ఆశింతును. ఆశించుట తప్పుగదా! ఇక నేనెట్లు బ్రతుకుదురనిగదా
అడిగితిరి. ఇప్పటికి నాకే దారియు కన్పించుటలేదు. అంతమాత్రమున న్యాయమునూ, ధర్మ ము నూ నతిక్రమింపరాదుగదా! చూతము దేవుడున్నాడనెను. తక్షణం
యెదుట నున్న కృష్ణదీర్ఘదేహుడు శివుడై యెదురుగానిల్చి, వత్సా!
నాభాగా! నీ సత్యసంధతకూ, నీతండ్రి ధర్మజ్ఞతకూ
ప్రసన్నుడనైనాను.
ఇదిగో
యీ ధనం నీవేతీసుకో. సంతృప్తితో జీవించు. నీకు"అంతర్దర్శితత్వము (హృదయాంతర్గత
దైవసాక్షాత్కారము) సనాతనంబగు బ్రహ్మజ్ఞానము సిద్ధించుగాక. అని దీవించి శివుడు
అంతర్హితుడైనాడు. ఇట్టి సత్యసంధుడైన నభాగుని కుమారుడే పరమభాగవతుడైన అంబరీషుడు.
అంబరీశుషుని చరిత్రము భాగవతములో సుప్రసిద్ధము.
భాగవతమున
చెప్పిన యీ నాభాగుని చరిత్రము మనకొక మేలుకొలుపు. సత్యసంధత మనకర్తవ్యము. ఆపై
మనభాద్యత ఆ భగవంతునిపైకి మారి పోతుంది. ఇందులో సంశయమునకు యిసుమంతైనా తావులేదు.
"సంశ యాత్మా వినశ్యంతి "అన్నది గీతావాక్యము. కనుక సంశయం వీడండి.
నాభాగుని చరిత్ర నమ్మండి. సత్యసంధతను ఆచరణలో పెట్టండి. మహాఫలన్ని పొందండి.
v
ఎంత గొప్పగా
జీవించావో నీ చేతలు చెప్పాలి..ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి ...మహాత్మా గాంధీ
10.జ్ఞాని
తెలిసిన
వాడు జ్ఞాని. తెలియనివాడు అజ్ఞాని. ఏమీతెలియనివాడుగాని, సర్వంతెలిసినవాడుగాని మనలో యెవరమూ వుండము. సర్వమెరింగిన వాడు
సర్వేశ్వరుడే. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు.
సకలజ్ఞాన సంపన్నుడు. భగవంతునెరింగితిని, సాయుజ్యము పొందితిని
అని యన్నవాడు. భగవంతునివలె సర్వజ్ఞుడైవుండవలెను. అట్టివారు అరుదు. వారు
జీవన్ముక్తులు. వరికొఱకే యింకనూ యీ ప్రపంచము
నిలచియున్నది. వారి వలననే జ్ఞానము వ్యాప్తిజెందుతున్నది. సత్పురుషులకు
ప్రసారము చేయబడుచున్నది.
ఏ జ్ఞానమైననూ కేవలమూ విని లేక పుస్తకములుచదివినంతనే
లభించునది కాదు. అది అనుభవమునకు వచ్చియుండవలయును. కేవలపుస్తకజ్ఞానము
ఉపన్యాసములిచ్చుటకే పనికివచ్చును. ఆత్మో ద్ధరణకు ఉపయోగపడదు. ఈ దృక్పదముతో గమనించిన
యెడల, యెవరు నిజమునకు జ్ఞాని? తెలిసిన వారు? అన్న సంశయము కలుగుతుంది. దీనికి జవాబు ఛాంద్యో గపనిషత్తు లో యీ విధంగా
వివరింపబడియున్నది. శ్వేతకేతుడు, అరుణియను మునికుమారుడు.
ఇతడు తండ్రి యాశ్రమమున వేదవేదాంగవిద్యలన్నియు నేర్చెను.
వాటికి గుర్తింపు రావలెనన్న రాజుల కొలువుకూటమున ప్రదర్శింప వలెను. పండితులు
మెచ్చవలెను. కనుక అతను ప్రవాహణజైవలి మహా రాజు చెంతకువెళ్ళి, తనవిద్యను
పరీక్షించి నిగ్గుతేల్చి గౌరవింపుమని కోరెను. రాజు అంగీకరించి మరుసటి దినము
సభదీర్చి, శ్వేతకేతువు ను పండితస్థానమున కూర్చొండనియోగించి,
యిట్లు ప్రశ్నించెను. బ్రాహ్మణోత్తమా! మీరు యీలోకమునకు
రాకముందుయెక్క డుంటిరో? అనగా యెక్కడనుండి యీ భూలోకమునకు
వచ్చిరో తెలియునా? యని అడిగెను. అందులకా మనికుమారుడు,
నిజాయితీ గలవాడు, ఉత్తముడు గనుక, రాజా! యీ విషయము నాకు తెలియ దని ఒప్పుకొనెను. మించి పోయినదిలేదు. పోనీ యీ
ప్రపంచ వ్యవ హారము ముగిసిన తర్వాత మీ రెక్కడికి వెళ్ళెదరో? తెలియునా?
అని రాజు ప్రశ్నించెను. దానికీ శ్వేతకేతుడు తెలియదనెను. తర్వాత దేవ యానమూ,
పితృయానమును గూర్చి తెలియునా యని అడిగెను. దానికీ మునికుమారునివద్ద
జవాబులేదు. అప్పుడు రాజు "అయ్యా! శ్వేతకేతూ మీకేమియూ తెలియదు. మీరిక
వెళ్ళవచ్చుననెను.
శ్వేతకేతువు
తన తండ్రి అరుణి దగ్గరకు తిరిగివెళ్ళి
జరిగిన విషయ మంతయూ చెప్పెను. అప్పుడు అరుణి కుమారా! యివి నాకునూ తెలియవు.
ఇవి తెలియని వాడు అసలు తెలిసినవాడే కదనిగదా! రాజుచెప్పెను. కనుక ఒప్పుకొందము. ఈ
జ్ఞానమును రాజువద్దకు వెళ్ళి తెలుసుకొందమని, రాజునాశ్రయించి,
వారు ఆజ్ఞానమును పొందిరి.
ఈ
విషయమై మనమొక్కింత ఆలోచింతము. ఈ భూమిమీదకు యెక్కడ నుండి వచ్చితిమో తెలియునా? తెలియదు. శరీరము వదలినతర్వత ఖచ్చి తముగా యెక్కడకు వెళ్ళుదమో తెలియునా?
తెలియదు. ఇక దేవయన, పితృయానముల విషయమసలే
యెఱుగము. కనుక యీ లెఖ్ఖన మనము తెలియని వారము. జ్ఞానులమసలేకాదు. చాలా మంది
స్వాములము, బాబాలము, పీఠాధిపతులము,
మహాత్ములమూ అని చెప్పుకొనువారు, యీ ప్రశ్నలను
తమకు తామై వేసుకొని తేల్చుకొనవచ్చును.
పై విషయములగూర్చి మనలో చాలామందిమి గొప్ప ఉపన్యాసము
లియ్య వచ్చును. కానీ అనుభవ విషయమున యెంత వెనుకబడియున్నామో మన కర్థమగుచున్నది. ఇది
అనుభవమునకు రావలెనన్న, తెలిసినమహాత్ముని అండ,
సాధన, శ్రద్ధ అవసరమని తేలుచున్నది.
ఇక
మన కుతూహలము దీరుటకు దేవయన, పితృయానములగూర్చి గ్రంథములు,
శాస్త్రములూ యేమిచెప్పుచున్నవో చూతము. మరణా నంతరము కిరణమునాశ్రయించి,
ఆత్మ సూర్యలోకం, అందుండి చంద్రలోకం, తర్వాత విద్యుల్లోకం వెళ్ళి అక్కడ ఒక విముక్తాత్మ సహాయమున బ్రహ్మలోకం చేరి,
బ్రహ్మమున లీనమగుదుము. ఇది
దేవయానము. ఈదారిన ఆధ్యాత్మిక సంపన్నులు వెళ్ళెదరు. ఉత్తరాయణమున మరణించినావారుకూడ
యీ దారిన వెళ్ళుదురని ప్రతీతి. ఇక పుణ్యత్ములు చంద్రలోకంవెళ్ళి అక్కడగల అనేక
స్వర్గాలలో సూక్ష్మదేహులై దేవతలవలె సుఖమయజీవితం గడుపుతారు. పుణ్యక్షయానంతరం తిరిగీ
కర్మఫలసంగ్రహనార్థం భుమిపై పుడతారు. ఇది పితృయానం. దక్షిణాయనంలో మరణించినవారు యీ
మార్గంలో వెళతారని ప్రతీతి. ఇక పాకకర్ములు చచ్చి భుమికీ చంద్రునకూ మధ్య
భుతప్రేతపిశాచము లై బాధలనుభవించి, నరులకు కీడుమేళ్ళుకూడా
చేస్తూ, తుదకు పక్షులుగా, జంతువులుగాపుట్టి
జీవించి, విడుదలై తిరిగీ మానవులుగా జన్మిస్తారు. ఇలా కథ
తిరిగి మొదటికే వస్తుంది. ఇదంతా చదివి తెలుసుకొన్నదేగానీ అను భవముకాదు. కారణం
తెలియనివాడనును గదా!. నమస్తే.
v
11.
స్నేహము
స్నేహమేరా
జీవితం స్నేహమేరాశాశ్వతం. అన్నాడొక సినీకవి. నిజమే యీ భూమ్మీదున్నంతవరకూ స్నేహమే
నిత్యమైనది. విలువైనది కూడా. మన సంపదలకూ ఔన్నత్యానికి సంతోషించేవాడు స్నేహితుడే.
బంధువులు ఈర్ష పడతారు. అంతేకాదు. ఆపదలో ముందు ఆదుకొనేవాడు స్నేహితుడే. స్నేహం
తారతమ్యాలను గణించదు. ఎంతపెద్దపదవిలోవున్నా, ఎంత
సంపన్నుడైనా, మిత్రుణ్ని "ఒరే" అని పిలిచే
చనువుంటుంది. అందుకే నీతిచంద్రికలో "మిత్రలాభం" మొదటిస్థానంలో నిలచింది.
జీవితంలో వీలైనంతమంది మిత్రులను సంపాదించుకొమ్మని హితవుపలికింది. మహాభారతమైతే
మిత్రుణ్ని మరింత గొప్పగా శ్లాఘించింది.
కం: మిత్రుండైహికములు, నా
ముత్రికములు
నైన భద్రములు తలకొలుపున్
మిత్రధనంబులలోనను
మిత్రుడ యెక్కుడను మాట మెత్తురు ప్రాజ్ఞుల్. భార-శాంతి-3-526.
మిత్రుడు
నీకు ఇహపరాలలో మేలుకలిగేందుకు సహయపడతారు.
మిత్రుడు,
ధనము రెండింటిలో మితుడే శ్రేష్ఠుడని వివేకవంతులు తేల్చి చెప్పినారు.
ఇదే భారతంలో మిత్రుడగు ద్రోణుని తృణీకరించి ద్రుపదమహారాజు, పడిన
అవ మానాన్ని గురించి చక్కగా వివరించి, మిత్రుని విలువను
తేటపరచడం జరిగింది. ద్రోణుడు పేదరికంలో కష్టపడుతూ బాల్యమిత్రుడు, సహధ్యాయి గదా యని ద్రుపదమహారాజును సహాయమర్థించాడు. ద్రుపదుడు చులకన జేసి
మాట్లాడుతూ నీకూనాకూ స్నేహమేమిటి? అర్థంలేకుండా మాట్లాడకు.
చ: ధనపతితో దరిద్రునకు దత్త్వవిదుండగు వానితో
మూ
ర్ఖునకు బ్రశాంతుతోడ గడుక్రూరునకున్ రణశూరుతోడ భీ
రునకు,
వరూధితోడ నవరూధికి, సజ్జనుతోడ గష్టదు
ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడగూడ నేర్చునే!
భార-ఆది-5-204.
అని
ద్రుపదుడు అర్థరహితంగా మాట్లాడాడు. ధనికునికిగానీ, తత్త్వవేత్తకు
గానీ, శాంతచిత్తునకుగానీ, రణశూరునకుగానీ,
కవచధారికిగాని, సజ్జ నునికిగానీ స్నేహం
అట్టివేగల సమానునితో సరిపోతుంది. నీవు నాకు యెందులోనూ సమానుడవుగావు.
నాస్నేహితుడవని చెప్పుకునే అర్హత నీకులేదు వెళ్ళిపో. అన్నాడు. తర్వాత ద్రోణుడు
కురుపాండవులకు గురువై విద్యానంతరము శిష్యులు గురుదక్షిణ కోరగా ద్రుపదుణ్ని
ప్రాణాలతో పట్టితెచ్చి తన యెదుట నిలుపమన్నాడు. ప్రియశిష్యుడైన అర్జునుడు తనవీరత్వం
జూపించి గురుదక్షిణ చెల్లించాడు. ద్రోణాచార్యులప్పుడు ద్రుపదునిచూచి
కం: వీరెవరయ్య! ద్రుపదమ
హారాజులె యిట్లు కృపణులయి పట్టువడన్
వీరికి వలసెనె యహహ మ
హారాజ్యమదాంధకారమది వసెనకో.
ఆ:వె:
ఇంకనైన మమ్ము నెఱుగంగనగునొక్కొ
యనుచు
నుల్లసంబులాడి ద్రుపదు
విడిచి
పుచ్చె గురుడు. విప్రులయలుకయు
దృణహుతాశనంబు
దీర్ఘమగునె. భార-ఆది -6- 90
& 91.
ఓహో!
ద్రుపదమహారాజులా! యిలాకట్టుబడిపోయారా? ధారుణి
రాజ్య సంపదమదం వదిలిందనుకుంటాను. ఇప్పటికైనా నేను నీ స్నేహితుడని గుర్తించారా,
లేదా? అని తన మిత్రత్వాన్ని గుర్తుచేసి
విడచిపెట్టారట. మిత్రుడు అందునా విప్రుడు గదా! అతని కోపం యెండుగడ్డిలో పడిన
అగ్నివలె భగ్గున మండి వెంటనే చల్లారిపోయిందట. సజ్జనులతత్త్వం యిలానేవుంటుంది మరి.
ఇదే
స్నేహాన్ని గురించి భాగవతమూ చెప్పింది. కుచేలుడనే పేదబ్రాహ్మణుడు కృష్ణుని
చూడవచ్చడు. కృష్ణుడు చిన్ననాటి సహాధ్యాయి, ప్రియమిత్రుడు
నైన కుచేలుని చూస్తూనే అమితానందంబొందాడు. ఊహించనంతగా గౌరవిం చాడు. సేవలుచేశాడు.
అంతఃపురస్త్రీలు అదిచూచి ఆశ్చర్యంతో యిలా అనుకొన్నారు.
ఉ: యేమితపంబు సేసెనొకొ యీ
ధరణీదివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫురదుపాస్యకుడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించియున్న
వా
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్
…
భాగ-దశ-ఉత్తర-985.
ఈ
పేదబ్రాహ్మణుడు పూర్వజన్మలో గొప్పతపస్సు జేసివుంటాడు కాబోలు. ఇదేమిటి? కృష్ణపరమాత్మ తన శయ్యపై కూర్చొండబెట్టుకొన్నాడు. అమిత మైన ఆప్యాయత
జూపిస్తున్నాడు. మహామహామునీశ్వరులు గూడా యితనికి సాటిరారేమో! అని అనుకున్నారు.
ఇక్కడ కృష్ణపరమాత్మ ఆదర్శమిత్రుడై నిల్చి నాడు. అంతేగాదు మిత్రుడు తనచెంతనుండగనే
అతని పరిస్థితిని అర్థంచేసు కొని గొప్పసంపదలు యింటివద్ద సమకూర్చినాడు. మిత్రుడడగనూ
లేదు, పరమాత్మ తనుచేసినది చెప్పనూలేదు. మిత్రుని సగౌరవంగా
యింటికి పంపించినాడు. అదీ స్నేహమంటే.
//మిత్రత్వం
సర్వత్రా వర్ధిల్లుగాక//
v
12.కృతఘ్నత
- మిత్రద్రోహము
మేలుచేసిన
వారికి తిరిగీ మేలు చేయలేకపోవచ్చును. ఆ అవకాశము కలుగకనూ పోవచ్చును. లేదా అంతటి
శక్తి లేకపోవచ్చును. మించిపోయినది లేదు. మనస్ఫూర్తిగా ధన్యవాదములు, కృతజ్ఞతలు
చెప్పినచాలును. అట్లుగాక చేసినమేలు మరచి, మేలుచేసినవాడికే
కీడుచేయడం దారుణం. అది మహా పాపం. దానికి నిష్కృతి లేనేలేదు. ధర్మశాస్త్రము,
నీతిశాస్త్రము, పంచమ వేదము నైన మహాభారతము యీ
విషయమై చాలాస్పష్టముగా వివరిం చింది. శాంతిపర్వం మూడవ ఆశ్వాసంలో ధర్మరాజునకు
శరతల్పగతుడైన భీష్ముడు యీ విషయాన్ని వివరిస్తూ, నాడీజంఘుడను
కొంగకథను చెబుతాడు. ఆ కథను పరిశీలిద్దాం.
గౌతముడనే పేరుగల ఒక బ్రాహ్మణుడు సోమరియై, చదువు
సంధ్యలు విడచి, బోయవనితను వలచి, వేటనేర్చి,
మాంసభక్షకుడై, దురలవాట్లకు లోనై డబ్బు చాలక,
ఒక వ్యాపారులగుంపుతో గూడి వారివలె తనూ ధనము సంపదించుటకు వారివెంట
బోయెను. వారు ఒక అడవిదారిన వెళుతూ ప్రొద్దుగ్రుంకగా ఒకచోట విశ్రమించిరి. రాత్రి ఒక
మదపుటేనుగు వారిపైబడి నానాబీభత్సమూ చేసినది. వ్యాపారులు ప్రాణములు దక్కించుకొనుటకు
దిక్కులకు పారిపోయిరి. బ్రాహ్మణుడు ఉత్తరదిశగా పరుగిడి పఎరుగిడి అలసిపోయి ఒక
మర్రిచెట్టునీడన నిలబడెను. ఆ పెనుమర్రి నాడీజంఘుడను కొంగనివాసస్థానము. భయపడియున్న
ఆ బ్రాహ్మణుని జూచి మంచి చెడ్డ విచారించి, అతని
ఆకలిదప్పులుతీర్చి, రాత్రి పరుండుటకు లేజిగుళ్ళు పూలతో
పాన్పునేర్పరచి ఆదరించెను. ఉదయమున అతనిని మేల్కొల్పి "ఇక్కడకు మూడు యోజనముల
దూరమున మధువ్రజపురమున్నది. దాని అధిపతి విరూపాక్షుడు. నాస్నేహితుడు. అది
రక్షసరాజ్యం. అయినా భయంలేదు. నాడీజంఘుడు నామిత్రుడని జెప్పుము. రాజు నిన్నాదరించి
ధనము నొసగును. అధనముతో సజ్జనుడవై జీవింపుము. వెళ్ళు మనెను. బ్రాహ్మణు నకు అన్నట్లే
ఆరాజు గౌరవించి ధనమునొసగెను. కానీ ఆ బ్రాహ్మణుడు చేసినమేలు మరచి కృతఘ్నుడై తిరిగి
మర్రివృక్షము వద్దకువచ్చి, నిద్రించుచున్న నాడీజంఘుని చంపి
ఈకలూ యెముకలూ అక్కడే పెరికివైచి, మాంసము మూటగట్టు
కొనిపోయెను.
నాడీజంఘుడు
ప్రతిరోజూ వాడుకగా తనమిత్రులైన బ్రహ్మదేవుని, విరూ పాక్షునీ దర్శించి
మచ్చటలాడి వచ్చేవాడు. కానీ నాడీజంఘుడు చనిపోయెను గదా! విరూపాక్షమహారాజు
నిరీక్షించి నిరీక్షించి, నాడీజంఘుని యోగ క్షేమములరసిరమ్మని
భటులనుబంపెను. వారు నాడీజఘుని యెముకల గూడు ఈకలు గుర్తించి, ఈతడు
చంపబడినాడని గ్రహించి, దోషిని గాలించి పట్టుకొనిరి.
అతడెవరోకాదు నాడీజంఘుని మిత్రుడననిచెప్పి తమరాజువద్ద ధనముగైకొన్న బ్రాహ్మణుడేనని
తెలిసికొని ఆశ్చర్యపోయిరి.
విషయము
తెలిసి రాజు చాలచింతించెను. మిత్రునిపైనున్న మమకారముతో వెళ్ళి యెముకలగూడు, ఈకలను
ఒకచోటచేర్చి చితిపైనుంచి అగ్నికి సమర్పించి కన్నీటితర్పణ మొనర్చెను. వార్త
బ్రహ్మలోకము చెరెను. బ్రహ్మ కామధేనువును మర్రిచెట్టుగల అటవీప్రాంతమునకు బంపెను.
ఆగోవు అక్కడి గడ్డిని సంతృప్తిగామేసి దూడకు పాలిచ్చెను. ఆదూడ కడుపార పాలు ద్రావు చుండగా
నోటినుండి పాలనురగ కారెను. ఆనురగ గాలికి కొట్టుకొని పోయి, నాడీజంఘుని
చితాభస్మముపై బడెను. వెంటనే నాడీజంఘుడు బ్రతికెను.
ఇది
యిట్లుండగా విరూపాక్షమహారాజు కోపోద్రిక్తుడై నాడీజంఘుని హంత కుడైన దూర్త
బ్రాహ్మణుని ఖండఖండములుగా నరికి తినిమని తన రాక్షస భటులనాజ్ఞాపించెను. వారు
మహారాజా! మిత్రద్రోహి మాంసము మేము ముట్టమని విన్నవించిరి. అట్లయిన వీని శరీరమున
గాట్లుపెట్టి కుక్కలను వదలడు అవి వీడిని చీల్చితినుననెను. భటులట్లు చేసిరిగాని
కుక్కలు సైతము వీని నసహ్యించుకొని దూరముజరిగినవి. అంటే కృతఘ్నుని మాంసము
కుక్కలుకూడా తిననొల్లకపోయెను.
ఇంతలో
ఇంద్రుడు విరూపాక్షరాక్షసేంద్రుని దగ్గరకువచ్చి, నాడీజంఘుడు
పునరుజ్జీవుడైన విషయమెరిగించెను. రాజు ఆనందపరవశుడయ్యెను. మరికొంతసేపటికి
నాడీజంఘుడే రాజుద్దగరకు వచ్చెను. రాజు, నాడీ జంఘుని
కౌగలించుకొని ఆనందోద్వేగమున తనమునకలాయెను.
కొంత సేపటికి తేరుకొని, యిక యీదూర్తబ్రాహ్మణుని
యేమిసేతమనెను. నాడీ జంఘుడు మృదుభాషణమున రాజా! వీనిని క్షమించి వదలివేయుడు. క్షమకు
మించిన గోప్పసుగుణము లేదు. అని రాజుకు నచ్చజెప్పి బ్రాహ్మణుని విడిపిం చెను. అతడు
బెరుకుబెరుకుగా మాటిమాటికీ తిరిగిచూచుచూ అచ్చటినుండి వెడలిపోయెను.
దీనితో
కృతఘ్నత యెంతటి నిష్కృతి లేని పాతకమో, మనకర్థమౌతున్నది.
దీనితోపాటు మిత్రత్వమెంతటి సుగుణమోకూడా
మనకెఱిగింపబడినది. వాటిని గురించి తెలుగు భారతకర్త తిక్కన యేమనెనో ఆయన మాటలలోనే
విందము.
కం:
మితుండైహికములు,
నా
ముత్రికములునైన భద్రములు తలకొల్పున్
మిత్రధనంబుల లోనను
మిత్రుడ యెక్కుడనుమాట మెత్తురు
ప్రాజ్ఞుల్. భార-శాంతి- 3-526
మిత్రుడు, ఇహపరముల
రెండింటియందునూ క్షేమకరుడు. స్నేహము, ధనము యీ రెండింటిలో
స్నేహమే ఉత్తమమని విబుధులు గొప్పగా చెబు తారు. అట్టి మితృనికి ద్రోహంతలపెట్టడం
తగనిపని.
కం: ఆరయ మిత్రద్రోహము
దారుణమగు పాతకము కృతఘ్నతకంటెన్.
వైరముగొని విడువవలయు
నారెండుతెరగుల వారి నాప్తులనైనన్. భార-శాంతి-3 -525.
మిత్రద్రోహము
దారుణమైన పాతకము. ఇక కృతఘ్నత దానికి మించిన పాతకము. ఈ రెండింటిని మదిరోసి, యిట్టి
దుర్గుణములు గలవారు ఆప్తులైనాసరే, వారిని వదిలేయాలి. ఇది
పంచమవేదమైన మహభారత నీతి.
13.ప్రార్థన
అర్థన అంటే అర్థించటం. యచించడం. అర్థనకు
"ప్రా" వేర్చడంవల్ల విశేషత సంతరించుకొన్నది. ప్రార్థన అంటే అక్కడో
ఇక్కడో యేదోఒకచోట అడుక్కోవడంకాదు. మహోన్నతుని దగ్గర అంటే, భాగవంతునిదగ్గర యచించడం. యీ యచించడం మహోన్నతుని దగ్గరకాబట్టి, యాచన
లోకూడా ప్రత్యేకత
వుండాలి. యేదంటే అది అడగటం సరికాదు. ఒక నవాబును దర్శించి ఓ రూపాయివ్వమని అడగగలమా? అడగలేం. అడగముకూడా. దాత గొప్పతనాన్నికూడా గణించి యచించాలి. అటునంటిది యిక
భగవంతుని, అతిసామాన్యమైన ప్రాపంచిక కోరికలు తీర్చమని అడగడం
యెంతవరకు సమంజసం. ఆలోచించాలి. అసలు మనలో చాలామందికి
మనకేంగావాలో మనకే
తెలియదు. ఏదిహితమో యేదిఅహితమో కూడా మనకు తెలియదు. కనుక భగవంతుని
ప్రార్థించేటప్పుడు,
"దేవా! నాకు యేదియిస్తే మంచిదో అదినాకు ప్రసాదించు." అనడం
శ్రేయస్కరం. అట్లే మనంకూడా కలిగిందల్లా దైవ ప్రసాదంగా స్వీకరించి కృతజ్ఞతతో
మెలగాలి. తుదకు కష్టాలైనా నామేలుకొరకేదైవం దయచేసినాడనుకోవడం విజ్ఞుని లక్షణం.
పాండవులు అలానే తలచి తరించారు. పాండవమాత కుంతి నాకు యేదోఒక కష్టం వుండనీ, అప్పుడే నిన్ను మరచిపోకుండా వుంటానని కృష్ణుని ప్రార్దించింది. ఐనా,
కష్టాలైనా సుఖాలైనా మనం తొల్లిజేసిన పాపపుణ్యాల కణుగుణంగా
కలుగుతాయిగాని దేవునికి ఒకరిపై అనురాగం గానీ మరొకరిపై ద్వేషం గాని వుండవు.
భగవంతుడు వైషమ్యరహితుడు. కష్టసుఖాలుమాత్రం మనంజేసిన కర్మయొక్క ఫలితాలే. అవి
యీజన్మవిగావచ్చు లేక గతించిన యెన్నోజన్మలవి గావచ్చు. వాటికి అసలు కారణం మనమే.
మనమేనని, కర్మసిద్ధాంతాన్ని నమ్మే హిందువులం అంగీకరించి
తీరాలి. వాటిని యెవరైనా శాంతింపజేస్తాం ,తొలగించేస్తామంటే
నమ్మడానికి వీల్లేదు. అది కర్మసిద్ధంతానికి విరుద్ధం. ఒకవేళ యెమైనా చేస్తేగీస్తే,
వాయిదా పడతాయేమోగాని, అనుభవించకుండ అవి
తొలగిపోవడం అసంభవమని స్వామీవివేకానంద ఘంటాపథంగా చెప్పారు. ప్రార్థన వల్ల
భగవదనుగ్రహం గలిగి మనము మన కర్మానుగతఫలితాలను సమ్మతితో స్వీకరించి అనుభవించగల
ధైర్యం, స్థైర్యం కలుగుతాయనడంలో సందేహంలేదు. ప్రహ్లాదునకు
తండ్రివల్ల కష్టాలు తప్పలేదు. కానీ ప్రహ్లాదుడు వాటిని భగవదనుగ్రహంవల్ల సులువుగా
యెదుర్కొన్నాడు. మనపరిస్థితీ అంతే. ప్రహ్లాదునుకి కలిగిన దైవానుగ్రహం మనకూ
కలగాలంటే, మనమూ ప్రహ్లాదునువలె మారాలి. భగవంతుడు అందరియెడలా
సమానుడే. అందరివాడేగదా! అసలు వాస్తవం శరభాంకలింగ శతకకర్త యిలా వివరించాడు.
ఉ: కోరినరావు
సంపదలు,
కోరకయుండిన మానవాపదల్
కోరిన కోరకున్న ననుకూలములై తనపూర్వకర్మచే
సారెకువచ్చుపోవు. అనిశంబును మీ
పదభక్తియుక్తినే
గోరుదుగాని యన్యములు గోరనయా శరభాంకలింగమా!
కోరితేధనమురాదు, కోరకుంటే
వచ్చేఆపదలు రాకుండా ఆగవు. అవి వాటి అనుకూలసమయంలో వస్తూపోతూ వుండవలసిందే. అవి
కర్మఫలాలు. తప్పవు. కానీ నేనుమాత్రం నీపదసేవమాత్రమే కోరుకుంటాను. ఇతరములతో నాకు
పనిలేదు, అన్నాడు. ఇదిగదా నిజమైన నిష్కామ భగవద్సేవ. కంసుని
పట్టణానికి కృష్ణుడు వెళ్ళాడు. అక్కడి ఒక ఉధ్యానవనంలో ప్రవేశించాడు. అక్కడి
తోటమాలి సుధాముడు అందమైన పూమాలతో కృష్ణుని సత్కరించాడు. కృష్ణుడు సంతోషించి,
వరంకోరుకోమన్నాడు. అతడీ వరం కోరుకొన్నాడు.
కం: నీపాద కమలసేవయు
నీపాదార్చకులతోటి నెయ్యమును, నితాం
తాపార భూతదయయు ను
తాపసమందార నాకు దయసేయగదే!
ఇదీ
ప్రార్థనంటే. నీపాదసేవా భాగ్యము, నీభక్తజనంతో స్నేహము, యితర జీవులయెడ అపారమైన దయ నాకు కలిగేట్లు చేయమన్నాడు. తనకోసం యేమీ
కోరుకోలేదు. తన అవసరాలు ఆయనకు తెలియవా? తెలిస్తేతీర్చడా?
అన్న ధీమా యీ ప్రార్థనలో అంతర్లీనమై యున్నదనిపిస్తున్నది. అట్లే
రబియా అనే ఒక సూఫీ భక్తాగ్రణి యిలా ప్రార్థించారు.
"ఓదేవా!
నాకు యీలోకంలోయేమైనా యివ్వాలనుకుంటే , అదినాపై పగ గలవారికివ్వు,
పరలోకంలో నకివ్వదలచుకొన్నది నామిత్రులకివ్వు, నేను
నరకానికి భయపడి నిన్ను ఆరాధించివుంటే నన్నా నరకంలో కాల్చెయ్. స్వర్గానికాశపడి
నిన్ను పూజించివుంటే ఆ స్వర్గానికి నన్ను దూరంచేసేయ్. కానీ స్వామీ! నేను నీకోసం
మాత్రమే ధ్యానించివుంటే నీ దివ్యమంగళ తత్త్వ స్వరూపం నా హృదయంనుండి తొలగించకు,
యిదే నా ప్రార్థన." ఎంతగొప్ప ప్రార్థన! ఈవిధంగా
ప్రార్థించగలిగిన సత్తా మనకుంటే, భగవంతుడు మన వాడుగాకుండా
పోగలడా? భగవంతుడే నీవాడైతే నీకిక కొదువేమిటి? ఆలో చించండి. పాశ్చాత్య భక్తవరేణ్యుడైన "బ్లాకే" చేసిన
ప్రార్థనా గమనించండి.
"ఓ
జగద్రక్షకా! నమ్రత,
ప్రేమను ప్రసాదించే నీదివ్యశక్తిని నాపై విరివి గా ప్రసరింపజేయుము.
నాలోని అహంకారాన్ని పెగలించివేయుము. కడ వరకూ దేవా! నీవు, నావాడవైయుండుము."ఇదీ
ఆ మహనీయుని ప్రార్థన. ఇక ఆఖరుగా శ్రీరామచంద్రజీ లోకానికందించిన ప్రార్థనకూడా
విందాం.
"ఓ
ప్రభూ నీవే మానవజీవనమునకు లక్ష్యము
మాకోరికలు ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి
నీవే మా యేకైకస్వామివి. ఇష్టదైవము
నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.
ఇందులో
దీనంగా మన అశక్తతను ప్రభువు యెదుట నివేదించి. నీవు తప్ప మాకు వేరుదిక్కు లేదని
శరణాగతిని ప్రకటించి సహాయమునకై వినయము తో నిరీక్షించడమే ప్రార్థనగా అర్థమౌతున్నది.
మన ప్రార్థనను యీవిధంగా మలచుకుందాం.
భగవదనుగ్రహాన్ని పొందుదాం.
v
14.ధర్మము
ధర్మము
అనే మాటకు అనేకార్థాలున్నాయి. అమ్మా! ధర్మంచెయ్యి అంటే దానముచెయ్యమని
అర్థం. మీరేధర్మం చప్పాలి ఆంటే న్యాయం మాట్లాడాలి అనిఅర్థం. మానవధర్మాలు అంటె
మానవలక్షణాలు,
గుణాలు అనర్థం. ఇంకా ధర్మమంటే విల్లుకు కట్టే తాడని, ఉపనిషత్తని, యజ్ఞమని, అహింసని,
సక్రమ మైనఆచారమని. వేదవిధానమనికూడా అర్థమున్నది. మహాభారతము ధర్మమే
దైవమని నిర్వచించింది. "ధర్మన్ని నీవు రక్షించు ధర్మం నిన్ను
రక్షిస్తుంది"అని ఘంటాపదంగా చెప్పింది. ధర్మాత్ముడెలా వుంటాడో మహాభారతమిలా
చెబుతున్నది.
కం: అలిగిన అలుగక యెగ్గులు
పలికిన మఱి విననియట్లు ప్రతివచనంబుల్
పలుకక బన్నమువడి యెడ
దలపక యున్నతడె చూవె ధర్మజ్ఞుడిలన్. భార-అరణ్య-5-60.
ధర్మాత్ముడు
యితరులు కోపగించుకున్నా తను కోపగించుకోడు. ఎవరైనా నిందిస్తే విననివానివలె
ఊరకుండిపోతాడు. తిరిగి తగవుకు దిగడు. తనను బాధించినవాడికి చెడుజరగాలని హృదయంలో
అనుకోనుకూడా అనుకోడు. మరి యిటువంటివాడిని యేమనాలి. దేవుడేయనాలి. కొందరున్నారు.
వారు తప్పుచేసినా మాదేధర్మమని వాదిస్తారు. శాస్త్రాలుకూడా తమది ధర్మమేయని
చెబుతున్నాయని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. అలా వాదించి ఒప్పించి నంత మాత్రాన
అది ధర్మం కానేరదు.
ఒక
బోధకుడు వారంరోలులు ధర్మబోధ గావించాడు. ఊరివారంతా మెచ్చు కొన్నారు.
బుద్ధిమంతులయ్యారు. ఒక దొంగమాత్రం తెలివిగా బోధకుని దగ్గరకువెళ్ళి, స్వామీ!
మీబోధనలతో బుద్ధివచ్చింది. నిజనికి నేను దొంగను. ఇప్పటికే యిక్కడ దొంగతనం చేశాను.
అని చేసంచితోసహా ఒక వస్తువును చూపాడు. స్వామి, పరవాలేదునయనా
ఆసంచిలో యెముందో అది యెవరి దైతే వారికి యిచ్చేయి, దోషం
పోతుందన్నాడు. మీరే తీసుకోండిస్వామీ ఓ పనై పోతుందన్నాడు. నాకెందుకు నయనా
వద్దన్నాడు స్వామి. సరే స్వామీ ఒక ధర్మ సందేహం. ఈవస్తువు దాని యజమానికిచ్చినా
తీసుకోకపోతే యేం చేయాలి. అనడిగాడుదొంగ. అటువంటప్పుడు నీవేవుంచుకో తప్పులేదన్నాడు
స్వామి. దొంగ వెళ్ళిపోయడు. స్వామి కాసేపటికి చూసుకొంటే, ఆయన
మర చెంబు లేదు. ఆ దొంగ చేసంచిలోవుంచి చూపింది యీ మరచెంబె. వాడు ఉపాయంగా ధర్మమే
పాటించాడు. వస్తువు కనబడనీకుండా మీరు తీసుకోండి స్వామీ అన్నాడు. స్వామి
తనవస్తువేనని తెలియక వద్దన్నాడు. సరిపోయింది. ఇక దొంగ చక్కగా తీసుకెళ్ళిపోయాడు.
ఈవిధంగా తన తెలివితేటలతో ధర్మానికి వక్రభాష్యంచెప్పి, నాదీ
ధర్మమేనంటే కుదరదు. అటువంటిది ధర్మమేకాదు. వాడు ధర్మత్ముడు కానేకాదు.
నాకు
తెలిసినవాడొకడుండేవాడు. అతడు వడ్డీతీసుకోవడం అధర్మ మనేవాడు. అది మాపెద్దలసలే
సమ్మతించరనేవాడు. కానీ తనుడబ్బు వడ్డీకిచ్చి, తిరిగి తీసుకొనేటప్పుడు,
అసలు చేతికితీసుకొని వడ్డీమత్రం గూట్లో పెట్టమంటాడు. తను డబ్బులు
సరిచూచుకొనేలోపల అతని భార్య గూట్లోనిడబ్బు తీసుకెళు తుంది. సరిపోయింది. నేను
తీసుకోలేదు వడ్డీ. నాభార్యా తీసుకోలేదు. ఆమె గూట్లోడబ్బు తీసుకొందంతే. ఇచ్చినవాడు
వడ్డీ మాచేతికివ్వలేదుగదా! కనుక తాను ధర్మంతప్పలేదనుకొనేవాడు. ఇది నిజంకాదు. అతడు
నమ్మినధర్మం అతడు పాటించనట్లే లెక్క. ఇలా తెలివితో మోసగిస్తే మోసపోయేదికాదు ధర్మం.
ఇలా
ధర్మనికి వక్రభాష్యంచెప్పి ధృతరాష్ట్రుడు మసలితనంలో కొడుకులందరినీ పోగొట్టుకొని
చింతించాడు. కడకు ధర్మమే జయించింది. ధర్మంవైపే భగ వానుడు నిలచి పాండవులను
గెలిపించాడు. మహాభారతం ఇంకా వివరిస్తూ
కం: క్షమలేని
తపసితనమును
బ్రమత్తు సంపదయు ధర్మబాహ్యుప్రభు రా
జ్యము భిన్నకుంభమున తో
యములట్టుల యద్రువంబులగు నివియెల్లన్.
ఓర్పు, సహనం
లేకుంటే ఋషిత్వం నిలువదు. అజాగ్రత్తగలవారిచెంత ధనం నిలువదు. ధర్మంపాటించని
రాజువద్ద రాజ్యం నిలువదు. ఎలాగంటే పగిలిన కుండలో నీరు నిలువదు కదా! అట్లే యిదీనూ.
కనుక ధర్మాత్ములై మెలగడం ధర్మాన్ని యధాతధంగా పాటించడం అత్యంతావశ్యకము.
15.రాజదండన
- యమదండన
ఈ
భూమిని కర్మభూమి అంటారు వేదాంతులు. పాపపుణ్యాలు అనుభవిచ డానికీ, భగవదైక్యము
సాధించడానికి యిదే అనువైన ప్రదేశమంటారు. మరి యిక్కడే పాపఫలం అనిభవిస్తున్నప్పుడు
మళ్ళీ నరకము, యముడు నరక యాతనలూ యెందుకు. ఇది ఆలోవించవలసినదే!
ఇదే ప్రశ్న నేనొక రోజు "సావిత్రోపాఖ్యానం" చెబుతుండగా ఒక శ్రోత అడిగాడు.
కొంచం తడ బడ్డాను. ఉపన్యాసము అయిపోయేలోగా నాకో జవాబు తట్టింది. అదిచెప్పి ఆ రోజుకు
తప్పించుకొన్నాను.అదికాస్తావివరిస్తాను.
బడినుండి
పిల్లవాడు సాయంత్రం యింటికి రాగానే మళ్ళి పిల్లవాణ్ని తయారు చేసి ట్యూషన్‍కు
పంపిస్తాం యెందుకు?
బడిచదువులు చాలలేదు. ఇంకా కొంత విద్యాభ్యాసం అవసరమనిపించి ట్యూషన్‍కు
పంపిస్తున్నాం. ఇదీ అంతే. ఈ కర్మభూములోని జీవితకాలంలో అనుభవించకుండా మిగిలి పోయిన
శిక్షల కోసమే నరకముంది. అన్నాను. ఆ రోజు శ్రోతలు నా సమా ధానంతో సంతృప్తి పడ్డారో
లేదో నాకు తెలియదుగాని, నాకు సంతృప్తి కలుగలేదు. సరైన
సమాధానంకోసం, ఆలోచిస్తూనే వుండిపోయాను.
నా
ఆలోచనకు తగిన సమాధానం భారత రామాయణాల్లో కనిపించాయి. ఆ రోజు నాకు చాలాసంతోషమైంది.
మొదట భారతంలోని కథచూద్దాం. శంఖుడు, లిఖితుడు అన్నదమ్ములు.
లిఖితుడు అన్నశంఖుని ఆశ్రమం వచ్చాడు. ఆకలిగావుండటంతో అక్కడిచెట్టునున్న పండ్లు
తిన్నాడు. అన్నవచ్చి తమ్ముడూ నీవు అనుమతి లేకుండా పండ్లు తిన్నావు. దొంగతనందోషం
నీకంటింది. తప్పుగదా! అన్నాడు. తమ్ముడు బాధపడ్డాడు. ఆకలితో మంచి చెడ్డా
ఆలోచించలేకపోయాను. వెళ్ళి రాజుతో తప్పుఒప్పుకొని శిక్షవేయించు కొంటానని వెళ్ళి
రాజుకు నివేదించాడు. ఆయన దొంగతనానికి శిక్ష చేతులుఖండించడమే, అయితే నీవే ఒప్పుకొన్నావు గనుక వదిలేస్తున్నాను. వెళ్ళూఅన్నాడు. కానీ లిఖితుడు పట్టుబట్టి
శిక్షవేయించుకొని చేతులు పోగొట్టుకొన్నాడు. సరాసరి అన్నవద్దకెళ్ళి అన్నా! నాకు
రాజదండన పడింది. ఇక యమదండనలేదు. సంతోషంగావుంది అన్నాడు. అన్న నిజమే రాజదండన
పడినవానికి యమదండనుండదు. రాజదండన తప్పించుకొని తిరిగేవాడికి యమదండన
మూడింతలుంటుంది. ఇక నీవువెళ్ళి నదిలో స్నానంచేసిరా! అన్నాడు. నదిలో మునగగానే
చేతులు వచ్చేశాయి తమ్మునికి. అది బాహువుల నిచ్చింది కనుక ఆ నది
"బాహుదానది" అయ్యింది.
ఇక రామాయణానికొద్దాం. వాలిని పడగొట్టాడు
రాముడు. అప్పుడు వాలి,
రామా! నేను మృగాన్నని నీవు రాజువని వేట రాజులకు తప్పుగాదని
అనుకున్నావేమో! కోతిని వేటాడేరాజులుంటారా! మాంసంకోసం యెవరైనా వేటాడుతారు. నేను
కోతిని కోతిమాంసంకూడా తింటారా! రామా! నేనువిన్న రాముడు ధర్మవీరుడు. కానీ
చూస్తున్నదివేరు. నీలో ధర్మంలేదు అని వాదించాడు. అప్పుడు రాముడు జవాబిస్తూ వాలీ!
నీవు ధర్మాధర్మ విచారణ చేయకుండానే తమ్ముడు సుగ్రీవుని వెళ్ళగొట్టీ అతని భార్యను
అపహరించి నావు. కనుక శిక్షార్హుడవు. ఎదురుగావచ్చి పోరాడేవాని శక్తిని నీవు గుంజేసు
కొంటావు. అటువంటి వరంనీకుంది. కనుక చెట్టుచాటునుండి కొట్టవలసి వచ్చింది. నీవుచేసిన
తప్పులకు భరతమహారాజు రాజప్రతినిధిగా నీకు రాజ దండన విధించాను. నిన్ను యమదండననుండి
తప్పించి వీరస్వర్గం పంపి స్తున్నాను. అన్నాడు. వాలికి వాస్తవం అర్థమైంది.
రామునికి నమస్కరించి ప్రాణాలువదిలాడు.
ఈ భుమిమీద ధనం, రాజకీయపలుకుబడి,
అబద్దపుసాక్షం, లంచం వంటి వాటితో శిక్షలు
తప్పించుకొని తిరగవచ్చు గానీ యమదండననుండి తప్పించుకోలేరు. ఇక్కడ తప్పించుకొన్న
వారికోసం నరకం అవసరమేగదా! అందుకే యమలోకంవుంది.
v
16.అహింస
అహింసయే పరమధర్మమన్నది పెద్దలమాట. ఒకరిని
అన్యాయంగా తిట్టడం,
మనస్సు నొచ్చుకొనేట్లు సూటిపోటి మాటలనడం, బలహీనుని
ఊరికే కొట్టడం, ఒకప్రాణిని చంపితినడం, యీనాలుగూ
హింసక్రిందికే వస్తాయని, శస్త్రం చెబుతున్నది. మరి
పరమధర్మమైన అహింసను పాటిం చడం సాధ్యమా? అన్నది ప్రశ్న.
దానికి జవాబుగా మహాభారతం యిలా చెబుతున్నది.
తే:గీ:
హింసచేయనివాడు లేడిజ్జగమున
నొక్కడైనను. తమతమ యోపినట్లు
హింస తెరవున కెడగల్గి యేగవలయు
నదియెచూవె యహింసనా నతిశయిల్లు. ఆరణ్య-5-60.
హింసచేయకుండా యీ
జగతిలో మనిషి బ్రతకలేడు. అయితే నిజమైన మనిషి, యిక యీమాత్రం హింసకూడా
చేయకపోతే ప్రాణాలు నిలవవు, అన్నంత వరకూ హింసను వీలైనంత కొసవరకు
అనగా నామమాత్రపు దశకు తగ్గించుకొని బ్రతకాలి. అదే అహింస. ఈ మాట ఆకుకూరలు కూడా
తినడం హింసేకదా? అని వాదించే వారికి జవాబిస్తుంది.
అలాస్కాలోని ఎస్కీమోలు చేపలు తినకుండా బ్రతకలేరు. వారికి అంతకంటే గత్యంతరములేదు.
కనుక ప్రదేశాన్నీ, వాతావరణాన్నీ బట్టి అహింసనిర్వచనం
మారుతుంది. ఏండ్ల తరబడి కఱువుతో కటకటలాడిన కాలంలో ప్రాణంనిలుపుకోవడానికి
విశ్వామిత్రుడు కుక్కమాంసంతిన్నాడని వేదంలోవుంది. కనుక యిటువంటివి హింసక్రిందికి
రావని, పంచమవేదమైన భారతం నిర్ధారించింది. అయితే యీమాత్రం
వెసులుబాటు కూడా తీసుకోని అహింసాపరులు మనపురాణాల లో కనిపిస్తారు. అందులో వేదవ్యాస
కుమారుడైన శుకయోగి ఒకరు. దూడలు ఆవుపాలు కడుపారాత్రాగి నోటినుండి పాలనురగ
కారుస్తాయి. ఆ నురగే ఆయన ఆహారం. అలాగే భాగవతంలోని జడభరతుడు జింకగాపుట్టి పూర్వ
జన్మస్మృతి గల్గియుండి, రాలిన యెండుటాకులు, పండుటాకులు, యెండిగడ్డి మాత్రమే తిని అహింసాజీవనం
గడిపారట. అటువంటి వారితో మనల్నిమనం పోల్చుకొని జీవించలేం. కనుక జీవించడంకోసం
తింటున్నమా? లేక తినడం కోసం జీవిస్తున్నామా? అన్న ప్రశ్నవేసుకొని, సాత్వికాహారంతో జీవించడం
శ్రేయస్కరం.
అదిసరేకానీ
యజ్ఞయాగాదుల్లో,
పిత్రుకార్యల్లో బలులూ, మాంసవినియోగం
శాస్త్రసమ్మతమేగదా? అని వాదించేవారూ వున్నారు. మహాభారతంలో
అందుకూ సమధానమున్నది.
ఆ:వె:
జంతుపదములెల్ల దంతి పదమ్ములో
నడుగుక్రియ, నహింసయందు
సకల
ధర్మములు నడంగు. గర్మసంత్యాగికి
నైన భూతదయ సమార్హగుణము. శాంతి-5-145.
నేలపై
యెన్నిజంతువుల పదముద్రలు పడినా, యేనుగు వాటిపై పాదం మోపితే, ఆ పాదముద్రక్రింద మిగిలిన అన్నిజంతువుల పదముద్రలూ తుడిచి పెట్టుక పోతాయి.
అలాగే యెన్నిధర్మాలున్నా అహింసాధర్మం పాటించేవారికి మిగిలిన ధర్మాలన్నీ
విలువలేనివై పోతాయి. కనుక అహింసావాది యిక యే యితర ధర్మాన్నీ పాటించనవసరంలేదు.
అహింసే గొప్పధర్మం. అంతకు మించిన ధర్మమేలేదు. మనదేశమే తీసుకుందాం. ఇక్కడ ధాన్యమూ,
ఆకు కూరలూ, కాయగూరలూ సమృద్ధిగా పండుతాయి. అవి
ఆరోగ్యానికి మంచి దని వైద్యులుకూడ చెబుతున్నారు. వాటితో జీవించడమే అహింసామర్గ మనుస
రించడమౌతుంది. ఒక్కటాలోచించండి, మనం జీవించడానికి తింటు
న్నామా? లేక రుచికోసం తింటున్నామా? జిహ్వచాపల్యం
కోసం తినేదంతా ఆధ్యాత్మికతకు విషతుల్యమని మహాత్ములు చెబుతున్నారు. భగవద్గీతకూడా
సాత్వికాహారంగురించి గొప్పగా చెప్పింది. సాత్వి కాహారమేతిందాం. ఆధ్యత్మికంగానూ,
ఆరోగ్యంగానూ హాయిగాజీవిద్దాం. సాటిజీవులయెడ దయతో మెలుగుదాం.
v
17.
మాయ
మాయ
అనేపదం ఆధ్యత్మిక బోధలో పలుమార్లు మనకు వినబడుతూ వుంటుంది. అంటే యేమిటి? అంటే, లేనిదీ, మనది కానిదీ
మనది అను కోవడం. భ్రమపడటం, "మాయ"అని చెబుతుంటారు.
అదెలా అనుకుంటాం ? ఎందుకు భ్రమకు లోనౌతాం? అని తర్కించుకొని మయంటే అర్థం కాకుండానే వదిలేస్తుంటాం. విషయాన్ని
ఉదాహరణలద్వారా, కథద్వారా చెబితే బాగా అర్థమౌతుంది. కనుక ఆ
ప్రయత్నంచేద్దాం.
ఒకవ్యక్తి
యేట్లో స్నానం చేస్తున్నాడు. ఎదురుగా ఒక బంగారు పొన్నున్న చేతి కర్ర
కొట్టుకొస్తున్నది. దాన్ని ఆవ్యక్తి పట్టుకొని పరిశీలించి యెంతలెదన్నా
పదితులాలుంటుందని సంతోషంతో దాన్ని గట్టుదగ్గరుంచి మళ్ళీ ఆనందంగా యీదులాడటం మొదలు
పెట్టాడు. ఇంతలో ఒక పెద్దఅలవచ్చి ఆ బంగారు పొన్ను చేతికర్ర కొట్టుకపోయింది.
ఇంకేముంది,
వాడు నా బంగారు నా బంగారు, అయ్యో
కొట్టుకపోయిందని యేడ్వడం మొదలు పెట్టాడు. కేవలం ఓ ఐదునిముషాలు తన చేతిలో వుండిందా
బంగరుపొన్ను చేతికర్ర. అంతే అది నాదని పోయిందని రోదిస్తున్నాడు. ఇదే మాయంటే. ఈ
పరిస్థితిలో సామాన్యుడెవడున్నా, తుదకు మనమున్నా యింతేకదా!
ఇలా మాయలో మనకు తెలియకనే కూరుకుపోతుంటాం.
ఇంకాబాగా
అర్థంకావడానికి మరోకథచూద్దాం. ఒక సాధువు పక్కింట్లో బోయవాడు నివసిస్తున్నాడు.
బోయవాడికి సాధువు హితబోధచేశాడు. వేట పాపమని, అమాయక పక్షులను వేటాడి చంపడం
తగదని చాల చాలా చెప్పి చూశాడు. కానీ వాడు వినలేదు. సరే వీడికిచెప్పి లాభంలేదు,
పక్షులకే బోధించి, వాటిని వీడివలలో పడకుండా
చేద్దామని, వెళ్ళి పక్షులకు బాగా నచ్చజెప్పాడు.
"వేటగాడు వాస్తాడు, నూకలుజల్లుతాడు, ఆశకుపోయి వాటిని తింటాం, వేటగాడు వలవిసిరి మనల్ని
పట్టుకొని చంపుతాడు" అని నేర్పాడు. పక్షులుకూడా అర్థమైనట్లు పఠంమాదిరి
అప్పజెప్పాయి. సాధువు సంతోష పడ్డాడు. కానీ మరుసటిరోజు వేటగాడు నూకలు చల్లగానే
పక్షులు " వేటగాడు వస్తాడు
నూకలుచల్లుతాడు. మనం ఆశకుపోయి తింటాం, వేటగాడు వలవిసిరి
పట్టుకొని మనల్ని చంపుతాడు" అంటూ పాటలా పాడుతూనే వేటగాని నూకలు తింటూ,
వలలో చిక్కిపోయాయి. వాడు వాటి కాళ్ళు కట్టేసి సంచిలో వేసుకొని పోతున్నాడు.
అయినా ఆ పక్షులు అదేపాట ఆ సంచిలో కూడ పాడుతూనే వున్నాయి. ఆఖరుకు చచ్చాయి.
కథ నిజంకాకపోవచ్చుగాని, విషయం
అర్థమైంది కదా! అన్నీ వింటాం. అర్థం చేసుకొన్నట్లు తలూపుతాం. కానీ మనం మన
తప్పిదాలను మానుకోం. తెలిసి తెలిసి మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తూనేవుంటాం. ఇదే మాయంటే.
మాయలో మనిషి యెలా సలభంగా చిక్కుకుంటాడో అర్థమైన దనుకుంటాను. తస్మాత్ జాగ్రత్త.
మాయ భగవదాధీనం-భగవద్భక్తులు మాయకు లోబడరు.
v
18.
ప్రాప్తం
మనం
యీ భూమ్మీద పాపపుణ్యాలను అనుభవించడానికే పుడతాం. అందు కేదీన్ని కర్మభూమి అంటారు.
కర్మానుగత ఫలితమనుభవించి శుభ్రమై తిరిగి మన అసలుస్థానమైన దైవంలో లీనమౌతాం. కనుక
ఇక్కడపొందే కష్టంగానీ సుఖంగానీ మనవెంటతెచ్చుకొన్నదే. ఇందులో లేని సుఖాలు రమ్మంటే
వచ్చేవి కావు, కష్టాలు పొమ్మంటే పోయేవీకావు. అంతా
కర్మనుసారమే లభిస్తుంది. అలా లభించేదే ప్రాప్తం.
ఈ విషయం ఒక ఉదాహరణ రూపంలూ కథగా చెబితే సులభంగా
అర్థమౌతుంది. గమనించండి. ఒక పెద్ద ధనవంతుడున్నాడు. అతడు యింత సంపదించాను, దేశంతిరిగి
హయిగా ఆనందిద్దాం. అని భార్యతోగలిసి ఒక మహానగరం చేరుకున్నాడు. పెద్దహోటల్‍లోదిగారు.
ప్రొద్దున్నే అల్పాహారంకోసం రెస్టారెంట్ వెళ్ళి కూర్చున్నారు. సప్లయర్ ఒకమెనూ
కార్డ్ చేతికిచ్చాడు. భాషరాదు గనుక గుంభనంగా ఒక ఐటందగ్గర టిక్కు పెట్టి యిచ్చాడు.
కాసేపటికి ఉప్మా తెచ్చిపెట్టాడు సర్వర్. మనవాడు నిరాశ చెందాడు. తన భార్యకు
ఉప్మాచేయడంతప్ప వేరేరాదు. కనుక రోజూ ఉప్మాతిని విసుగెత్తియున్నాడు. భాషరానందువల్ల
తను ఉప్మాకే తెలియక టిక్కుపెట్టాడు. గత్యంతరంలేక ఉప్మాతింటూ, ప్రక్కటేబుల్‍వైపు చూశాడు. వారు పూరీ జిలేబి తిని, తిరిగి
సప్లయర్ రాగనే రిపీట్ అన్నారు. ఓకే అంటూ
వెళ్ళీ వారికి పూరీలు జిలేబి తెచ్చి యిచ్చాడు సర్వర్. మనవాడు,
ఓహో రిపీట్ అంటే పూరీజిలేబి వస్తాయని తనూ సప్లయర్‍తో రిపీట్
అన్నాడు. ఇంకే ముంది, మళ్ళీ
ఉప్మానే వచ్చింది. ఇంగ్లీషు తెలియక తను మళ్ళీ అదే తెమ్మన్నానని తెలుసుకొని
పరువుకోసం మళ్ళీ ఉప్మానేతిని, వేరే తినే ప్రాప్తంలేదని
బయటపడ్డారు. ప్రాప్తమంటే అర్థమైందనుకుంటాను.
మరోకథ
చూడండి. ఇంకాబాగా అర్థమౌతుంది. ఒకరైతు కాడికట్టుకొని యెద్దులు తోలుకుంటూ పొలనికి
వెళుతున్నాడు. దారిలో ఒకచెట్టుక్రింద మట్టి పాత్ర కనిపించింది. వెళ్ళి మూతతీసి
చూశాడు. దానినిండా బంగారు కాసు లున్నాయి. ఇప్పుడెందుకూ యింటికి
తిరిగివెళ్ళేటప్పుడు తీసుకపోదాంలే, అని ఆ పాత్రనక్కడేవుంచి
పొలానికి వెళ్ళిపోయాడు. కానీ తిరిగివచ్చేటప్పుడు మరచిపోయి, వేరేదారిలోవెళ్ళి
యేట్లో యెద్దులను కడుక్కొని తనూ స్నానం చేసి, చక్కా యింటికి
పోయాడు. అన్నంతిని రాత్రి పడుకొనబోయేటప్పుడు బంగారు కాసులు గుర్తొచ్చాయి. విషయం
భార్యతో చెప్పాడు. ఆమె భర్త అమాయకత్వాన్ని నిందించి, ప్రొద్దున్నే
వెళ్ళితీసుకరా! యేమో మనదృష్టం, దొరుకుతాయో లేదోనని
బాధపడింది. అదేసమయంలో ఒకదొంగ వారి అటకపై దాక్కొనియున్నాడు. వీళ్ళు నిద్రపోతే
దోచుకపోదామని వాని ఆలోచన. రైతుచెప్పిన కాసులవిషయం విన్నాడు. ఈ అమయకుని యింట్లో
యేముంటుంది. వెళ్ళి ఆ కాసులు తెచ్చుకోవడం మంచిదని, వాడు రైతు
దంపతులు నిద్రపోగానే మెల్లిగా యింటినుండి బయటపడి, చెట్టుదగ్గరకు
వెళ్ళిచూశాడు. నిజమే మట్టిపాత్రవుంది. ఆ చీకటిలో బంగారుకాసులకోసం మూతతెరచి చీకట్లో
అందులో చేయిపెట్టాడు. చిటుక్కున తేలుకుట్టింది. మంటతోపాటు కోపం పెల్లుబికింది.
ఆరైతు నేను అటకపై నుండటం గమనించే, యీ తేళ్ళున్న పాత్రను
బంగారుకాసులపాత్రగా చెప్పి నన్ను నమ్మించి
మోసగించి పంపడని తిట్టుకుంటూ ఆ పాత్రను జగ్రత్తగా పట్టుకొని పోయి, రైతుయింటి గవాక్షంగుండా చావండి! అంటూ, యింటిలోనికి
విసిరేసి వెనుదిరిగిచూడకుండా వెళ్ళిపోయడు. మట్టిపాత్రగదా! పగిలినశబ్దం విని
రైతుదంపతులు లేచిచూచారు. తేలుదారిన తేలు పోయింది. ఇల్లంతా బంగారుకాసులే, రైతుభార్య ఆశ్చర్యపోయింది. అప్పుడు రైతన్నాడు, ప్రాప్తమే
ప్రాప్తం. ప్రాప్తముంటే నేనొదిలొచ్చినా అవినన్నొదుల్తాయా! చూశావుగదా! బంగారువర్షం
కురిసింది, చూడు అన్నాడు. ఇదీ ప్రాప్తమంటే.
v
జీవితంలో అన్నీ
కోల్పోయినా, భవిష్యత్తు మాత్రం మిగిలే వుంటుంది. దానిని జాగ్రత్తగా
నిర్మింకుకోవాలి
...... కృష్ణన్ బోలే
19.గుప్తదానం
దానగుణం
మెచ్చుకోదగ్గది. అందులో గుప్తదానం మరింతగా శ్లాఘించ దగ్గదని పెద్దలంటారు. ఎందుకూ
పదిమందికీ తెలిస్తే తప్పేమిటి అని మన కనిపించవచ్చు. అందుకే దాతలు, దానమిచ్చిన
వస్తువుపైన తమపేర్లు వ్రాయించు కొంటారు. వారు వద్దన్నా దానంస్వీకరించిన వారు మరచి
పోకుండా వ్రాస్తారు. అది వారి భాధ్యతగా భావిస్తారుకూడా. అందువల్ల యితరులలో
స్పందనకలిగి, వారూ యేమైనా చేద్దామనే మంచిబుద్ధి కలగ వచ్చు.
కానీ దాతకు యిందువల్ల కొంతయిబ్బంది కలగవచ్చు. ఇచ్చేవాణ్ని చూస్తే చచ్చినవాడు కూడా
లేచొస్తాడంటారు. అవసరంలేని వాళ్ళుసైతం సోమరులై దానం యిమ్మని యెగబడతారు. ఆవిధంగా
అది అపాత్రదానం అయిపోతుంది. కనుక యిచ్చేదానం సార్థకమవ్వాలంటే పుచ్చుకొనేవాడు
అర్హుడా కాదా చూసుకోవాలి. అది కొంత కష్టమైన పనే. కనుక దైన్యస్థితిలో నున్నవానికి
లేదా అవసరమున్నచోట రహస్యంగా యిచ్చేస్తే అందరికీ తెలియదు, గనుక
యెవరంటేవారు యెగబడరు. తద్వారా యిచ్చిన
దానం సద్వినియోగమౌతుంది. ఈ విషయంలో మరొక ఆధ్యత్మిక రహస్యం కూడా దాగివుంది. అదేమంటే
దానం ఒకపుణ్యకార్యం. పుణ్యమైనా పాపమైనా మరు జన్మకు కారణమే. పుణ్యాలనుభవించడానికి
మళ్ళీ పుట్టాలి. అందువల్ల జన్మ రాహిత్యం కలుగదు. అందుకే పెద్దలు, చేసిన పుణ్యకార్య ఫలితాన్ని ఆశించక, కేవలం అది తన
కర్తవ్యంగా, మనిషి తన బాధ్యతగా చేసి మరచిపోవాలి. అప్పుడది
భగవద్గీతలో చెప్పిన నిష్కమకర్మ అవుతుంది. దానివల్ల ఆత్మపై యే మలినమూ పడకుండా
స్వచ్ఛమై, అది మరుజన్మకు కారణంకాకుండా పోతుంది. అందుకే
గుప్తదానం శ్రేష్ఠతమమంటారు.
ఈ
గుప్తదాననికి సంబంధించిన ఒకకథ వుంది. అదేమిటో తెలుసుకొందాం. ఒకవూళ్ళో ఒకపెద్ద
ధనవంతుడుండేవాడు. ఏదో ఉన్నవాడుగదాయని అతన్ని యాచించడానికి జనం వెళ్ళేవాళ్ళు. అతడు
వారిని తిట్టి ఓపైసాకూడా యివ్వ కుండా యింటినుండి కసరి పంపేవాడు. కానీ అదే ఊరిచివర
చెప్పులు కుట్టు కొని జీవించే హరిజనుడున్నాడు. అతడు యెవరినీ లేదు పొమ్మనడు.
ఆశించిన దీనజనులందరినీ ఆదుకొనేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకలి గొన్న వారెవరైనా
భోంచేయకుండా పోనిచ్చేవాడుకాడు. కానీ అందరూ అతని దగ్గరకొచ్చేవారుకారు. ఆ
హరిజనునిదగ్గరనా?
చేయిచాచాలి, హీనం కదాయని అహంకారులు
దూరంగావుండేవారు. ఆ విధంగా అపాత్రాదానం అతనివల్ల జరిగేదికాదు.
ఒకరోజు
కాలంతీరి వూరిలోని షావుకారు చనిపోయారు. అందరూ పోతే పోయాడనుకొన్నారు. పిల్లికి
బిచ్చంవేసినవాడు కాదు. ఉన్నాపోయినా లోకానికి వెలితేంలేదనుకున్నారు. కానీ ఊరిచివర
అన్నదాతయైన హరి జనుడు వున్నటుండి దానాలు చేయడం మనేశాడు. ఏమయ్యా నీవిలా మారి పోయవు, యేమయిందినీకు.
అని అందరూ అతన్నడిగారు. అప్పుడత డన్నాడు. అయ్యలారా! ఇన్నాళ్ళూ యిన్నీదానాలూ,
ఆ మహాను భావుడు మనూరిషావుకారే చేయించాడు. నేను కేవలం
నిమిత్రమాత్రుడిని. ఇచ్చేవాడు పోయడు. బీదవాడిని నేనెక్కడినుండి తెచ్చివ్వగలను. అని
నిజం చెప్పేశాడు. అప్పుడర్థమైందందరికీ, ఆ షావుకారు
గుప్తదానవిషయం. తెలిసిందికదా! ఆ పుణ్యాత్ముడు తన దానలు అపాత్రాదానాలు కాకుండ
చేసుకోవడమేగా కుండా, నిష్కమకర్మనాచరించి జన్మధన్యంగావించు
కున్నాడు. అయినా వచ్చేటప్పుడు ఖాళీచేతులతో వచ్చాం. వెళ్ళేటప్పుడు ఖాళీచేతులతోనే
వెళతాం. జీవనపథంలోని కలిమిలేములన్నీ భగవంతుని అనుగ్రహమే. కనుక కలిగిన దానికి మనిషి
గర్వపడక, ఆ సంపదకు తాను ధర్మకర్తగా వ్యవహరించి, సద్వినియోగపరచి తరించాలి.
v
20.
సుఖదుఃఖములు
సుఖదుఃఖములు
మనం గతంలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా మన జీవితంలో సంభవిస్తుంటాయి. గతం అంటే కేవలం
యీజన్మలోనే అని కాదు. గడచిపోయిన యేజన్మలో చేసిన పాపమైనా, పుణ్యమైనా, యిప్పుడు మనం అనుభవిస్తూ వుండొచ్చు. అసలు వాటిననుభవించడానికే భగవంతుడు మనకీజన్మ ప్రసాదించాడు. అనుభవించకుండా
తప్పించు కోవడం యెవరికీ సాధ్యపడదు. అలా యెవరైనా తప్పిస్తామంటే అది తప్పు. ఒకవేళ
అలాజరిగిం దంటే , అది కేవలం వాయిదాపడటమేగానీ తప్పిపోవడం కానే
కాదు. వాటి ననుభవించడంకోసం మళ్ళీ జన్మించడం తప్పనిసరి. అసలు విషయం అర్థ మైతే
కర్మానుగతమైన సుఖదుఃఖాలను అనుభవించడానికే మనిషి సిద్ధప డతాడు. అలా సిద్ధపడినవాడు
తొలుత మరుజన్మకు కారణ మయ్యే కర్మలు చేయడు. అదే సమయంలో చేసిన పాపపుణ్యాల ఫలితాలను
ఓపికతో అనుభవిస్తూ పరిపూర్ణంగా శుద్ధిపొందుతాడు. తద్వారా యీ జననమరణ చక్రాన్ని
ఛేదించుకొని ముక్తుడౌతాడు. అతడిక భూలోకంలో జన్మించడు. ఆ అవసరం అతనికుండదు.
ఈ
విషయంలో మనకో సందేహంకలుగవచ్చు. పాపమంటే సరే! చెయ్య కూడదు. మరి పుణ్యంమాటేమిటి? పుణ్యఫలితాలైన
సుఖాలనుభ వించడానికి మళ్ళీపుట్టాలిగదా? మళ్ళీపుట్టడం అవసరమా?
యిది ఆలోచించ దగ్గ విషయ మేగదా? అంటే నిజమే!
గీతలో కృష్ణపరమాత్మ దీనికి సమాధాన మిచ్చాడు. నీవేకార్యంచేసినా అది నేనుచేసినాను,
నేనుకర్తను అనే ఆలోచన వదిలేయ్. ఆయనే యిదంతా నాతోచేయించాడు. అంతా
కృష్ణార్పణం. నేను కేవలం నిమిత్తమత్రుణ్ని. అని తలచి అంతా కర్తవ్యభావంతో చెయ్యి. ఆ
కార్యానికి సంబంధించిన ముద్రలు నీ ఆత్మపైబడవు. వాటి ఫలితం ప్రభావం నీపై వుండవు.
అహంభావం నీలో పొడసూపదు. కనుక అవేవీ మరుజన్మకు కారణం కావు. నీకు మోక్షం
కరతలామలకమౌతుంది.
అలాంతప్పుడు
పాపాలుసైతం అదే కృష్ణార్పణభావంతో చేస్తే దానిప్రభావం కూడా మనపై వుండదు కదా? అని
వాదించవచ్చు. కానీ ఒకమాట. అలాగే చేసిచూడండి. మీమీద మీకే అసహ్యమేస్తుంది. కృష్ణపరమత్మ
నాచేత యిటు వంటి నీచమైన పనులు చేయిస్తారా? చేయించరు. నేను
మటైతే కృష్ణార్పణ మంటున్నానుగాని, వాస్తవంగా నన్నునేను ఆయనకు
అర్పించుకోలేదు. అర్పించుకొనివుంటే యిలా చేయను. అని మీమనసుకు తప్పక తడుతుంది.
క్రమేణా మీలో మార్పుమొదలై, తప్పులుచేయడం మానేస్తారు. యిది
అనుభవ రీత్యా పెద్దలు చెప్పిన మాట. ఆలోచించండి. చేసిచూసి తర్వాత మాట్లాడండి.
పుణ్యాలైనా
పాపాలైనా నేను చేశాననే భావంవుండటంవల్ల, సుఖాలూ, కష్టాలూ మనకు కలుగుతున్నాయి గదా! పాపాలు వద్దు సరే! పుణ్యాలు
సుఖదాయకాలుకదా! ఉంటే మంచిదేకదా! అనుకోవచ్చు. కానీ, ఒకస్వామీజీ
యేమన్నారో తెలుసా! ఆ ధనికుని యింట్లోవున్న కుక్క ప్రత్యేకమైన సబ్బుతో
స్నానంచేయించుకొని, తూగుటుయ్యాలలో వూగుతూ ఖరీదైనబిస్కెట్లు
తింటూ, యజమానిపైనే ఖయ్ ఖయ్‍మని మొరుగుతున్నది. అది పూర్వ
జన్మలో పుణ్యాలుచేసిన మనిషే. తనపేరుమీద, సరిలేరు నాకెవ్వరూ
అంటూ అనేకపుణ్యాలుచేసి యిప్పుడు సుఖాలననుభవిస్తున్నది అన్నారు. అర్థమైంది
కదా!
పాపాలు చెయ్యొద్దు. మనిషిగా యితరులకు మేలుచేయండి. కృష్ణా ర్పణ భావంతో ఉన్నవాడు
సుఖాలలో పొంగిపోడు,
కష్టాలలో కృంగిపోడు. సదా సమస్థితిలో జీవిస్తాడు. అంటువంటి వాడే
భగవంతున కిష్టుడు. అతనికి భగ వంతుడు సాయుజ్యం ప్రసాదిస్తాడు. సాయుజ్యం పొందడానికే
యీజన్మ ఉప యోగపడాలి. కేవలం ప్రాపంచికలాభాలకై తపనపడి జన్మవృధా చేసు కోరాదు.
v
ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది
కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే
ముఖ్యం
......డా: బి.ఆర్. అంబేద్కర్
21.
గురుశిష్యులు
ఒక
శిష్యుడు తెల్లవారుజామున ధ్యానంచేస్తున్నాడు. ధ్యానంలో ఒక అను భూతికలిగింది. తనూ
తనగురువూ సముద్రతీరంలో ఇసుకలో నడుస్తున్నారు. రెండుజతల పాదముద్రలు స్పష్టంగా
కనబడుతున్నాయి. ఒకజత తనవి,
రెండవజత గురువువి అనుకున్నాడు శిష్యుడు. కొంతదూరం వెళ్ళిన తర్వాత
ఒకజత పాదముద్రలే కనబడసాగాయి. శిష్యుడు, గురువా! నన్ను వదలి
వెళ్ళి పొయావా? అని వాపోయాడు. వెంటంటనే గురువు ఆ పాదముద్రలు
నావి, నీవు నా భుజముపైనున్నావు. ఈ ప్రదేశంలో నీవు నడువలేవు.
నీశక్తి చాలదు, అందుకే నిన్ను నా భుజముపై యెక్కించుకొని
గమ్యంచేరుస్తున్నాను, అన్నాడు. శిష్యుడు కృతజ్ఞతతో
నమస్కరించాడు.
గురువుబాధ్యత
అత్యంత గురుతరమైనది. శిష్యుని కంటికిరెప్పవలె గాచి జీవిత గమ్యమును చేర్చుట
అతనిపని. శిష్యునకు యీ ప్రపంచములో గురువు నకు మించిన దేదియూ వుండదు. కేవలం
ఆధ్యాత్మికమేగాదు,
ప్రాపంచిక విషయా లకు కూడా ఆయనే మార్గదర్శి. వారిద్దరూ మానసికంగా
ఒకరిలో ఒకరు లీన మై వుంటారు. వారిద్దరిమధ్య బంధం యెలావుంటుందో, శంకరాచార్యకృత దక్షినామూర్తిస్తోత్రంలో యిలాచెప్పబడింది.
శ్లో: చిత్రం
వటతరోన్మూలే,
వృద్ధా శిష్య గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యనం శిష్యా
చ్ఛిన్నసంశయః
అంటే
ఒక మర్రిచెట్టు క్రింద చిత్రంజరుగుతూవుంది. అక్కడ గురు స్థానంలో అరుగుమీద యువకుడున్నాడు. క్రిందకూర్చొన్న శిష్యులేమో
గడ్డంనెరసిన వయోవృద్ధులు. శిష్యులమనస్సులో యేర్పడిన సంశయాలను యేంమాట్లాడ కుండా
గురువు వారిమనస్సుల్లోనే సమధానం దొరికేట్లు చేస్తున్నాడు. మాన సికంగా
గురుశిష్యులలా అనుబంధించి వుండాలన్నమాట. ఇక్కడ వయో భేధంకూడా అడ్డురావడంలేదు. మొదట
గురువు,
శిష్యునికీ భగవంతునికీ అనుసంధానకర్తగా కనిపిస్తాడు. తర్వాత భగవంతుడే
గురురూపంలో తారస పడి తనను కైవల్యపథం చేరుస్తున్నట్లు శిష్యుడు గుర్తిస్తాడు.
అందుకే గురువే దైవమని గ్రహించమన్నారు. మరి అటువంటి గురుశిష్యులుంటారా! అంటే వుంటారు.
శిష్యునిలో దృఢసంకల్పముంటే, గురురూపంలో దేవుడే దిగివచ్చి
దారిచూపుతాడు. అది భగవంతుని బాధ్యతౌతుంది.
ద్రువుడు
ఐదుసంవత్సరాల బాలుడు. విష్ణువునుగూర్చి తపస్సుచేయడానికి దృఢనిశ్చయంతో బయలుదేరాడు.
విషయం భగవంతునికి తెలిసిపోయింది. నారదమహర్షిని పంపి మంత్రోపదేశంచేసి నన్ను
చేరడానికి దారిచూప మన్నాడు. గీతలో చెప్పినట్లు నారదుడు దైవాంశయే. గీతాచార్యుడు
నారదుడను నెనే నన్నాడు. కనుక దృఢదీక్షవుంటే మిగిలినవన్నీ దానికైఅవే సమకూరిపోతాయి.
ఈ విషయంలో వేమన యిలా అంటాడు.
ఆ:వె: వెదుక
వెదుక దొరుకు వేదాంతవేద్యుండు
వెదుకువాని తాను వెదుకుచుండు.
వెదుకనేర్చినట్టి వెరువరుల్ గలరొకో
విశ్వదాభిరామ వినురవేమ.
నిజమైన శ్రద్ధవుంటే సద్గురువు
లభించితీరుతాడు. దానికి అన్వేషణ తప్పదు. అన్వేషించేవానికోసం గురువూ
అన్వేషిస్తూవుంటాడు. మొత్తంమీద వెదికేవానికి దొరికితీరుతాడు.
ఆ:వె: తేనెతెరలజాడ
తేనెటీగ యెఱుగు
సుమరసంబుజాడ భ్రమరమెఱుగు
పరమయోగిజాడ భక్తుడెఱుంగును
విశ్వదాభిరామ వినురవేమ.
సద్వస్తువుపై
భక్తి,
శ్రద్ధ వుండాలేగాని, తెలియదు, తెలుసుకోలేమన్న ప్రశ్నే ఉత్పన్నంకాదు. ఎందుకంటే తేనె యెక్కడుందో తేనెటీగకు
తెలియకుండా బోదు. మకరందమెక్కడుందో తుమ్మెదకు తెలియకుండాబోదు. అట్లే పరమ యోగిని
కనుగొనడం నిజమైన భక్తునికి సమస్యేకాదు. కారణం, మార్గదర్శి,
మార్గం, లక్ష్యం, సర్వంజగన్నాధం.
భక్తుని గట్టేకించడం భగవంతుని లక్షణం. కనుక అన్నియేర్పాట్లు తానేచేసి భక్తుని తనలో
లీనంచేసుకోవడం భగవంతుడే చేస్తాడు. అందువల్ల సంశయమనవసరం. సంశయమే మనకున్న పెద్దడ్డంకి.
నమ్మినవానికి
అంతావుంది
నమ్మనివానికి
యెమీలేదు
నమ్మీనమ్మనివానికి
అది దూరంగావుంది
నమ్మి
ముందుకు అడుగేయండి
ఆంతా మీ
చేతికందితీరుతుంది.
v
22.యోగం
వియోగమంటే మనలో చాలామందికి సులభంగా అర్థమౌతుంది. వీరయ్య
గారికి మాతృవియోగం జరిగింది అంటే ఆయన తల్లి చనిపోయింది అని వేరుగా చెప్పనవసరంలేదు.
వియోగమంటే "యెడబాటు" శాశ్వతంగా దూరమై పోవడం. ఇక యోగమంటే వియోగానికి
విరుద్ధార్థమని అర్థమై పోయింది. అంటే తనకు కలిసిరావటం, ఒకటైపోవడం, కలిసిపోవడం, మరొకదానితో
లీనమైపోవడం, దానిలో కరిగిపోవడం అని అవగాహన లోనికి వచ్చింది.
ఐతే దేనిలో లీనమైపోవడం? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ఈ ప్రశ్నకు జవాబుగా మహర్షులు మహోన్నత మైన
దానితో అని చెప్పారు. మనకు తెలిసి అన్నింటికంటే మహోన్నతమైనది "దైవం".
అంటే దైవంతో యేకమైపోవడం. దైవంలో లీనమైపోవడమే యోగమని స్పష్టమైంది. దీనినే
సాయుజ్యమని కూడా అంటారు. ఇందులో ప్రాపంచిక లాభముల ప్రస్తావన వుండదు.
సాధారణంగా
యోగాసనాలు వేసేవారు కూడా మేము యోగా చేస్తున్నా మంటారు. కానీ అవి దేహదారుఢ్యం కోసం, కొన్నిశారీరకరుగ్మతల నివారణకోసం చేసే వివిధరకాల శారీరకపరిశ్రమ ప్రక్రియలు.
శరీరం ఆరోగ్యంగా దృఢంగా వుంటేగదా, నిజమైన అర్థంలో యోగభ్యాసం
చేయ గలుగుతామంటే, సరే! ఒప్పుకోవలసిందే. అంతేగాని ఆసనాలు
మాత్రమే అసలుసిసలైన యోగం కాదు.
దైవంలో ఐక్యం, అదే
యోగంసాధించడానికి ధ్యానమే ముఖ్యమైన సాధనం. ఇక ధ్యానమంటే మన లక్ష్యమైన దైవాన్ని
మాటిమాటికీ జ్ఞాపకం చేసుకొంటూ అందులో లీనంకావడానికి ధృఢసంకల్పంతో చేసే తీవ్ర ప్రయత్నమే.
ఇందులో ఒకపెద్దసమస్య మనలక్ష్యమైన దైవాన్ని మనం చూచి యెఱుగము. కనుక భావించడమెలా?
అనేదే. అందుకే అనుభవజ్ఞుడైన గురువునాశ్రయిస్తాము. గురువులందరూ
యేకభిప్రాయులు కారు. వారివారి సంస్థల సూత్రములు, నిబంధనల
కనుగుణంగా వారు యోగం మనకు బోధి స్తారు. మనచే ఆ మార్గాన్ని అనుసరింపజేస్తారు. అన్నీ
ఒకేగమ్యానికి దారు లనుకోవడం క్షేమం. అయితే అనేకవిధానాలు గాకుండా, తనకు అనువైన ఒకవిధానాన్ని యెన్ను కొని ఆ మార్గంలో పయనించి విజయం
సాధించవలసి వుంటుంది. వివిధ మార్గాలు ఒకేసారి చేపట్టడం అపజయనికి దారితీస్తుంది.
మర్గాలెన్ని వున్నా ప్రయణం ఒకేమర్గంలో సాగాలి. భగవంతుడు అనంతుడు, సూక్ష్మము సులభమూనైనవాడు. కనుక యోగాభ్యాసులు తమదృష్టిలోగల అట్టివస్తువుల
నాధారముగాచేసుకొని యోగభ్యాసము ప్రారంభించి, రానురాను
సూక్ష్మస్థితుల కెగబ్రాకి ఉద్ధరింపబడుదురు. ఉదహరణకు కొందరు వారి గురూపదేశానుసారం
వెలుగుపైన, పుష్పముపైన, ఆకాశముపైన,
సముద్రముపైన, మంత్రముపైన, గురువురూపముపైన వీటిలో యేదో ఒకదాన్ని ముందుగా ఆధారంగా తీసుకుంటారు.
వీటిపైధ్యానం కాకుండా మరికొందరు హృదయాన్ని, భ్రుకుటిని(కనుబొమల
మధ్యస్థానం), ముక్కుకొసను, ధనుష్కోటి(వెన్నుపూస
కొస)ని. శ్వాసనూ కేంద్రంగా చేసుకొని యోగాభ్యాసంచేస్తారు. ప్రేమ, భక్తిని యీ అభ్యాసానికి జోడించి కృష్ణపరమాత్మ యోగవిద్యను మరింతసులభతరం
చేశారు. ఇనుప కచ్చడాలుగట్టి అడవులలో యెండ, వాన, గాలి ఆకలికి తపించే కఠిన విధానాలను కృష్ణపరమాత్మ సవరించి సర్వజనానుకూలం
గావించారు.
ఈ
విధంగా ధ్యానం ప్రారంభించినవారు, సాధనలో పురోగమిస్తూ సమాధి
స్థితికి చేరుకుంటారు. ఈ స్థితిలో వారు తొలుత చేపట్టిన వస్తువును, స్థానము ను మరచిపోతారు. ఆఖరుకు భౌతిక ప్రపంచాన్నే మరచి అలౌకి కానందాన్ని
పొంది, కడకు అనేక ఆధ్యాత్మిక స్థితుల నధిగమించి గమ్యమైన
సాయుజ్యాన్ని పొందుతారు. ఇది జీవించియుండగా కూడా సాధ్యమౌతుంది. అట్టి సాధకులే మనకు
కనబడే దేవుళ్ళు, స్వాములు, బాబాలు.
వారిని మనం శ్రద్ధతో ఆత్రుత తో వెదికి తెలుసుకొని, వారి
మార్గదర్శకత్వంలో తరించాలి. మోసగాళ్ళ బారినపడకుండా జాగ్రత్తపడాలి. ఏదియేమైన
నిస్వార్థుడైన అన్వేషికి తప్పక సరియైన దారి దొరికి తీరుతుంది. అలా దొరికేట్లు
చేయడం భగవంతుడు తనబాధ్యతగా భావిస్తాడు. శ్రద్ధతో వెదకడంమాత్రం మనపనే ఔతుంది.
నిజానికి యోగాభ్యాసం చేయడానికి
అనర్హులెవ్వరూలేరు. స్త్రీ, పురుష, జాతి, మత, కుల భేదాలేవీ
యోగానికి అడ్డురావు. ఏ ఆశ్రమంలోవున్నా, అంటే బ్రహ్మచారులు,
గృహస్తులు, వానప్రస్తులు, సన్యాసులు అందరూ అర్హులే. కానీ దీనికి కేవలం పుస్తకపఠనం, బోధలువినడంతో సరిపోదు. సాధన తప్పనిసరి. అదికూడా తెలిసిన సద్గురువుసహాయంతో
చేయడం అతిముఖ్యం. ఇది ఈత వంటి దనవచ్చును. ఎన్ని ప్రక్రియలు విన్నా చదివినా
నీటిలోదిగకుండా మరొక యోగ్యుని సహయంలేకుండా
ఈతరాదు. ఇదీ అంతే. కనుక లేవండి, మేల్కొ నండి
సద్గురువులనన్వేషించి, వారి పద కమలముల చెంతజేరి, వారి మార్గదర్శకత్వమున సాయిజ్యపదము నందు కోండి. ఇదే మన
వాస్తవజీవితలక్ష్యముగా భావించండి.
//శుభంభూయాత్ //
23.
శ్రీకృష్ణ తత్త్వం
"కృష్ణుడు"
అంటే నల్లనివాడు అని సామాన్యార్థం. కానీ నలుపు లోతును సూచిస్తుంది. అనంతాన్ని
వ్యక్తపరుస్తుంది. ఆకాశం అనంతం. అందుకేఅది నల్లన. సముద్రం కూడా నల్లగా కనబడుతుంది.
కారణం అది లోతైనది. నదీనదాలు, సరస్సులు లోతుంటే నల్లగా గోచరిస్తాయి.
శ్రీకృష్ణుని తత్త్వం చాలాలోతైనది, అది అనంతం. అందుకే ఆయన
నల్లన. "కృష్ణ"అంటే సంస్కృతంలో మరోఅర్థం వుంది. అది కర్షయతి కృష్ణః.
అంటే అకర్షించు వాడు కృష్ణుడు. తనే మనల్ని తనవైపుకాకర్షించి తనలో లీనంచేసుకొంటాడు.
అదే కృష్ణావతార విశేషం. విద్యాగంధం లేని గోపగోపీజనాన్ని సైతం ప్రేమ మాధ్యమంద్వారా
తనవైపున కాకర్షించి, మోక్షమొసంగిన మహాత్ము డాయన.
భక్తిమార్గంలో ప్రేమనుజొప్పించి. జనసామాన్యానికి మోక్షమార్గ మేర్పరచిన
పురుషోత్తముడాయన. లేకుంంటే ఇనుపకచ్చడాలుకట్టి
అరణ్యవాసంచేసి సీతోష్ణములకోర్చి ఘోరతపం చేయల్సివచ్చేది.
భగవత్ప్రాప్తికి
కృష్ణతత్త్వం సులువైనది.
శ్లో: ఏకస్తు కృష్ణాయకృతః ప్రణామః
శతాశ్వమేధావబృథేన తుల్యః
శతాశ్వమేధీ పునరేతి జన్మ
కృష్ణప్రణామీ నపునర్భవాయ.
ఒకసారి
"కృష్ణా" యని,
మనస్పూర్తిగా నమస్కరిస్తే, నూరుఅశ్వమేధాలు
పూర్తిచేసి తదనంతర అవబృథస్నాన మాచరించిన పుణ్యం లభిస్తుంది. అయితే శతాశ్వమేధపుణ్యం
యేదోఒకనాటికి వ్యయమైపోతుంది. మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. కానీ కృష్ణప్రణామ ఫలితం
తరిగిపోదు. మళ్ళీపుట్టే ప్రసక్తే లేదన్నారు విబుధులు. పొతనమాత్యుడు భాగవతంలోని
కుచేలోపాఖ్యానంలో
మ: కలలోనందును
మున్నెఱుంగని మహాకష్టాత్ముడైనట్టి దు
ర్బలు డాపద్సమయంబునన్
నిజపదాబ్జాతంబు లుల్లంబులో
దలపన్నంతన మెచ్చి యార్తిహరుడై
తన్నైన నిచ్చున్; సుని
శ్చలభక్తిన్ భజించువారికిడడే
సంపద్విశేషోన్నతుల్?
కృష్ణుడంటే
యెవరోకూడా తెలియని కష్టాత్ముడైనా, కేవలం ఆపదగలిగి యెవరో చెబితే, అప్పుడైనా సరే కృష్ణపదారవిందాలను మనసులోభావిస్తే చాలు, వానికి తన్నుతానే అర్పించుకొనైనా కాపాడతాడు. అట్టిది నిశ్చలమైన భక్తితో
సేవించినవారికి కొదువేముంటుంది. అంతటి భక్తసులభుడు కృష్ణుడు.
కృష్ణతత్త్వాన్ని చాలమంది అపార్థం
చేసుకొంటారు. ఆయన గోపికా లోలుడని నిందిస్తారు. అది తప్పు. ఆయన ఒక్కగోపికలవాడేకాదు
ఆ:వె: గోపజనములందు గోపికలందును
సకలజంతులందు సంచరించు
నా మహత్మునకు బరాంగనలెవ్వరు
సర్వమయుడు లీల సల్పెగాక.
అంటారుపోతన.
గోపికాజనాలేగాదు సమస్తజీవరాసులలోనూ అంతర్యామి గా వెలుగొందుతున్నాడు కృష్ణపరమాత్మ.
ఆయనకు ఇతరులనే వారే లేరు. గోపాంగనావిహరమొక లీల మాత్రమేసుమా! ప్రేమ, అభి
మానము, భక్తి, బంధుత్వము అన్నీకూడా మన
ప్రయోజనంకోసం ఆయనపై మనమేర్పరచు కొన్నవేగాని, ఆయనకటువంటి
బంధాలేమీలేవు. ఆయన సర్వులయెడ సమానుడైయున్నాడు. వైషమ్యరహితుడై వెలుగొందుచున్నాడు.
మనమే భావంతో తలిస్తే ఆభావంతో అయన
మనలనాదుకొంటాడు. ఈ విషయం నారదుడు ధర్మరాజుకు యెంత విషదంగాతెలిపాడో చూడండి.
ఆ:వె: బాంధవముననైన బగనైన వగనైన
బ్రీతినైన ప్రాణభీతినైన
భక్తినైన హరికి
బరతంత్రులైయుండు
జనులు మోక్షమునకు జనుదు రధిప
శా: కామోత్కంఠత గోపికల్, భయమునన్
గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాల ముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్
ప్రేమంమీరలు భక్తి నేము నిదె చక్రింగంటి మెట్లైన ను
ద్దామధ్యానగరిష్టుడై హరినిజెందన్ వచ్చు
ధాత్రీశ్వరా!
ఆయనతో
యేసంబంధం కల్పించుకొని నీవు ధ్యనించినా ఒక్కటే. ఆయనతో నీవు బంధమెర్పరచుకోవడమే
ముఖ్యం. గోపికలు కామంతో,
కంసుడు భయంతో, శిశుపాలాదిరాజులు వైరంతో,
యాదవులు బంధుత్వంతో, ధర్మరాజా! మీరు ప్రేమతో,
నారదుడనైన నేను భక్తితో, యిలా యెదోఒక విధంగా
కృష్ణపరమత్మతో సంబంధమేర్పరచుకొని తరించాము, అన్నాడు.
కురుక్షేత్రంలో నరునకు గీతబోధించి ఉద్దరించాడు. ఆ గీత మనమూవిని
ఉద్దరింపబడుతున్నాము.
గమనించారుగదా!
ఆఖరుకు శత్రుత్వమనే బంధమేర్పరచుకున్నాసరే, అయన తలంపులోవుంటేచాలు
తరించినట్లే. నిజానికి కృస్గ్ణుడువచ్చి చంపుతాడనే భయంతో కంసుడు, కృష్ణునిధ్యాసలోనే వున్నాడు. శిశుపాలుడు యెప్పుడూ నిందిస్తూ
కృష్ణునిమరువకుండా వుండిపోయాడు. అందువల్లనే వారుకూడా తరించారు.
గోరాకుంబరుడు
"నీవెవరయ్యా నేనెవరయ్యా-నువ్వూనేనూ ఒకటేనయ్యా. కుండలుచేసే
కుమ్మరినేను-బ్రహ్మనుచేసిన కుమ్మరివీవు". ఇద్దరం కుమ్మరుల మేనని కులానుబంధం
కుదుర్చుకొని కైవల్యమందుకున్నాడు. ఆలోచించండి. మనకూ యేదోవొక బంధం దొరక్కపోదు. ఆయన
భక్తసులభుడుగదా! మనకు తోచకపోతే ఆయనే ఒక ఉపాయం చూపిస్తాడు. మనసు ఆయనపైకి మరల్చండి, అంతా
ఆయనే చూసుకుంటాడు.
//శుభం//
24. భగవద్గీత - ఒకఆలోచన
భగవద్గీత
ఉపనిషత్సారము. ఇందులో ప్రశ్నోత్తరముల రూపమున విశ్వ జనీన మైన అనేక ధార్మిక విషయములు
వివరింపబడినవి. సాంఘిక సంబంధ మైన ఒక సందేహాన్ని అర్జునుదు మొదటి అధ్యాయంలో
వెలిబుచ్చాడు. ఆ ఒక్క విషయాన్ని గురించి ప్రస్తుతం విచారద్దాం.
అర్జునుడు
విషాదయోగ నిమగ్నుడై కృష్ణా! యుద్ధము వలన జననష్టము సంభవిస్తుంది. అందునా యువకులు
రణాగ్నిలో దహించుకపోతారు. అందు వల్ల వారి స్త్రీలు అనాధలై పరులనాశ్రయించి
సంతానాన్ని పొందుతారు. అప్పుడు వర్ణసంకరమేర్పడుతుంది. వర్ణసంకరం నరకహేతువు. లోకం
పాపభూయిష్టమైపోతుంది. కనుక నేను యుద్ధంచేయను, అంటాడు. ఇదీ
అర్జుని సంశయ సంక్షిప్తరూపం. ఈ విషయం మొదటి అధ్యాయం 40
నుండి 45వ శ్లోకం వరకూ వివరంగా తెలుపబడింది.
శ్లో: అధర్మాభిభవాత్ కృష్ణ! ప్రదుష్యంతి
కులస్త్రీయః
స్త్రీషు దుష్టాను వార్ష్ణేయ! జాయతే వర్ణసంకరః అ: 1-41.
శ్లో: ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్ధన
నరకేనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. అ: 1-44.
పైరెండు
శ్లోకాలవల్ల, ప్రశ్న ప్రస్పుటమైంది. కానీ యింత
వివరంగానున్న యీ ప్రశ్నకు కృష్ణపరమాత్మ నేరుగా యెక్కడా జవాబుచెప్పినట్లు కనబడదు.
కాక పోతే భగవానుడు
శ్లో: కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్
అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున అ: 2-2.
శ్లో: అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ
భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితా
అ: 2-11.
అని
అర్జునిని మందలించినాడు. తగనిసమయములో నీకేల యీ మోహము. ఇది శ్రేష్ఠమూ, స్వర్గదాయకమూ, కీర్తుదాయకమూ
కాదు. నీవు అనవసరము గా శోకింపదగని విషయమై శోకిస్తున్నావు. పైగా జ్ఞానివలె మాట్లాడు
తున్నావు. పండితులు చచ్చేవారికైగానీ
చావనివారికైగానీ చింతించరు. అని అర్జునుని సమాధానపరచినారు. కానీ అర్జునుని ప్రశ్న
అర్థమైనంత సులువుగా జవాబు అర్థముకాలేదు. ఇందుకోసం మనలో కొంత అంతర్మథనం జరగ
వలసియున్నదనిపిస్తున్నది. ఆ ప్రయత్నంలో నాలో అనేక మైన ఆలోచనలు కలిగాయి. అవి
మీముందుంచుతున్నాను.
వ్యవసాయరంగంలోనూ
పశుపోషణ రంగంలోనూ నేటి శాస్త్ర పరిజ్ఞానం గొప్ప విప్లవాత్మక అభివృద్ధిని
సాధించింది. విత్తనములను, మొక్కలను సంకరపరచుటద్వారా పంటనధికము చేసింది.
అట్లే పశువులలో కూడా సంకరపశువులే బలమైనవి. పాలఉత్పత్తిలోకూడా వాటిదే అగ్రస్థానం.
మానవులలో చాలాదగ్గరి సంబంధములవల్ల బలహీనమైన పిల్లలు పుట్టడం గమనిస్తున్నాం. కనుక
జాతి బలోపేతంకావడం కోసం కృష్ణపరమాత్మ సంకరాన్ని వాంచ్ఛించే అర్జునుని
యుద్ధంచేయమన్నాడేమో. పాడవులు అంత
బలోపేతులు కావడానికి కూడా వారు యమ,వాయు,ఇంద్ర, అశ్వినుల
పుత్రులు కావడమే కారణమేమోననిపిస్తుంది. కానీ మరింత యోచనచేసి చూస్తే యీ భావన
సరికాదేమో ననిపిస్తుంది. పాండవులు మంత్రప్రభావ జనితులు. కనుక దోషరహితులు. ఇకపోతే
అర్జునుని వాదాన్నితీసుకొని ఆ నాటి పరిస్థితులకు యీనాటి పరిశోధనాఫలితాలతో
పోల్చిచూడటం తగ దనిపిస్తుంది. ఆనాటి అర్జునుని ప్రశ్న సరైనదే అయివుండాలి. మరి
కృష్ణు డెందుకు జవాబుచెప్పలేదో తెలియరావడంలేదు. పైగా జవాబుచెప్పలేని ప్రశ్నవేస్తే
చెప్పవలసినవాడు దబాయింపుతో తప్పించుకొన్నట్లుంది
నిజానికి
అర్జునుని యుద్ధానికి భగవాను డెం దుకు ప్రోత్సహించినట్లు. యిది యింకనూ
శేషప్రశ్నగానే మిగిలిపోయింది. ఈదశలో మరోఊహ మనస్సున మెదిలింది. ఒకడు ధూర్తుడై
పదిమంది తలలు నరికివేశాడను కొందాం. అతన్ని న్యాయాధికారి ముందర సాక్షాధారాలతో
నిలబెట్టినారను కొందాం. ఇక న్యాయాధికారి శిక్షప్రకటించడమే మిగిలివుంది. ఈసమయం లో
ఆనిందితుని రోగిష్టిభార్య, గ్రుడ్డికూతురూ, కుంటికొడుకూ
వచ్చి అయ్యా! న్యాయాధిపతీ! యిప్పుడు మీరు మరణదందన విధిస్తే మేము ఆధారం కోల్పోయి
పస్తులతో చచ్చిపోతాము. ఏతప్పుచేయని మమ్ము బ్రతికించండి. అతన్ని వదిలేయండి, అంటే
న్యాయాధిపతి యేంచేస్తారు. దోషిని వదిలితే వాడు మరిన్ని హత్యలు చేస్తాడు.
శిక్షిస్తే వాని భార్యాబిడ్డలు అన్యాయంగా చనిపోతారు. అప్పుడు న్యాయాధిపతి
చట్టప్రకారం శిక్షనే ఖరారుచేస్తాడు. వాని భార్యాబిడ్డల విషయం తర్వాత అలోచిస్తాడు.
వీలైతే మరోపరిష్కారం చూపుతాడు. లేదా ఆదుకొనే
సంబంధితశాఖకు తెలియజేస్తాడు. ఇక్కడా అంతేగదా? రాజులు
ధూర్తులై అధర్మవర్తనులై ధర్మాతిక్రమణ చేయుచున్న సమయంలో వారిని సరైనమార్గానికి
త్రిప్పటానికి చేసిన ప్రయత్నాలను వారే వమ్ముజేసుకొని శిక్షార్హులైనారు. కనుక
ధర్మసంస్థాపనార్థం, శిష్టజనరక్ష నార్థం, యుద్ధయజ్ఞం
లో రాజలోకాన్ని దహించివేయు సమయమాసన్న మైంది. కనుక అర్జునుడు చెప్పే వర్ణసంకర
విషయాన్ని ప్రక్కకునెట్టి, యుద్ధానికి ప్రేరేపించి తాననుకొన్న పనిని
పూర్తిజేసి లోకానికి ధర్మరాజపాలనాన్ని అందించాడు భగవానుడు. పరమాత్మనిర్ణయం
తిరుగులేనిది, శంకింప వీలులేనిదని తేలిపోయింది.
ఇక వర్ణసంకరవిషయం గీతనాధారం చేసుకొని
మరికొంత విచారిద్దాం. కృష్ణపరమత్మ చతుర్వర్ణ వ్యవ స్థ ను
గురించి చెబుతూ
శ్లో: చాతుర్వర్ణ్యం
మయాసృష్టం గుణకర్మ విభాగశః
తస్యకర్తార మసి మాం విద్ద్యకరార మవ్యయం.
అన్నారు.
అంటే నలుగువర్ణములూ వారివారి గుణముల ఆధారంగా నాచే సహజంగా సృష్టించబడ్డాయి. నేను
కర్తాకర్తుత్వములకతీతుడనైన అవినాశిని గావున సహజపరిణామములన్నియూ నా సృష్టియే యగును.
(God is automatic
and man is dogmatic ) అని
తెలుపబడింది.
అర్జునుని
వాదన ప్రకారం వర్ణసంకరం యుద్ధానంతర సమస్య. కానీ కృష్ణ పరమాత్మది అప్పటి ప్రస్తుత
సమస్య. ఎలాగంటే రాజులు మదోన్మత్తులై, నీచులై, అధర్మవర్తనులై
వారికుండవలసిన ప్రజారక్షణాకర్తవ్యానుకూల రజోగుణమున నుండక, పతనమై
తమోగుణులై రెచ్చిపోవుచున్నారు. కనుక గుణవిభాగముదృష్ట్యా సంకరమై పోయారు. వారిని
శిక్షార్హులుగా భావించే యుద్ధమునెపమున వారిని దండించడం జరిగింది. ఈ విషయంలో
అర్జునుని భావమున గలిగే వర్ణసంకర సమస్యవేరు. అది పరమాత్మ సరిదిద్దదగినది గానే
భావించినారు. మహాభారతం ఆశ్రమవాసపర్వంలో ఒకచిత్రంజరిగింది, వ్యాసభగవానుడు
గంగానదినుండి కురుక్షేత్రరణరంగంలో వీరమరణం పొందినవారినందరినీ బయటికి రప్పించినాడు.
వారు సంతోషముగా తమవారితో ఒకరోజంతా ఆనందించినారు. ధృతరష్ట్రునికి చూపు ప్రసా
దింపబడింది. గాంధారి తనకన్నులకు కట్టుకొన్న కాశికట్టు విప్పుకొనింది. కుంతి, పాండవులూ
అందరూకూడా ఆరోజు పండుగ చేసుకున్నారు. ఇరువైపులవారూ అరమరికలులేకుండా సంతోషంగా
గడిపారు. మరుదినం గంగానదినుండి బయల్వెడలివచ్చిన వీరులంతా తిరిగీ గంగాతరంగములలో
కలిసి ఉత్తమలోకాలకు వెళ్ళవలసిన సమయమాసన్నమైంది. అప్పుడు వ్యాస భగవానుడు ఒక
యేర్పాటుచేశాడు. అది యిలావుంది.
"....... అచ్చటనుండి
పతులననుగమింపవలసిన యంగనలు గ్రుంకుటకు రండనిన విని విధవలగు వీరభార్యలెల్లరును
ధృతరాష్ట్ర గంధారీ కుంతీ ధర్మ నందనుల యనుజ్ఞలుగొని రయంబునంజని భగీరథీసలిల మగ్నులై
మనుష దేహంబులు విడచి దేవతనువులు దాల్చి దివ్యాలంకార సమలంకృతమూర్తులై
మగలంగలసిరవ్విశేషంబు చూచి సర్వజను లత్యంతాశ్చర్య సంతోషాధీన మానసులైరి. .. ఆశ్ర-ద్వి-127 వ
గద్యం.
ఈవిధంగా
విధవలైన వీరనరీమణులంతా వారివారి భర్తలతో సంతోషంగా పైలోకాలకు వెళ్ళిపోయారు.
వర్ణసంకరమనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా పోయింది. తర్వత ధర్మరాజు పాలన నవ్యనూతన లోకమై, ప్రజానురంజకమై, ధర్మబద్ధంగా
సాగిపోయింది. పరమత్మ తన అవతార ప్రయోజనాన్ని సులువు గాసాధించారు. అర్జునుని
సందేహానికి రణభూమిలో మాటలలో చెప్పడనికి వీలులేదు గనుక, ఆవిషయం
తప్పించి మాట్లాడారు. సమధానం వ్యాస భగవానుని చేతలద్వారా చూపించారు. వ్యాసుడుకూడా
మహవిష్ణువు అవతర మే గదా! భగవంతుని తీర్పుకు తిరుగుండదు. ఆయనసర్వసమర్థుడు.
v
విజయం వరించిందని విర్రవీగాకు,
ఓటమి ఎదురైందని నిరాశచెందకు. విజయమే అంతం కాదు, ఓటమి
తుదిమెట్టు కాదు
... స్వామి వివేకానంద.
ప్రేమగుణం బాగా పెరిగితే, లభించే సంపద పవిత్రత.
......రవీంద్రనాథ్ ఠాగూర్
25.మీరాబాయి
మథుర సఖ్యభావములతోనూ, ప్రేమాతిశయముతోనూ
భగవంతుని శరణుబొంది తరించుటన్నది, శ్రీకృష్ణపరమాత్మ స్వయంగా
చూపిన మోక్ష మార్గమనిన్నీ, అది విద్యావిహీనులైన అమాయక
గోపగోపీజనము నంతటినీ యీ మార్గముననే పరమాత్మ ఉద్ధరించెననిన్నే పెద్దలు చెప్పుదురు.
ఈ మార్గమునే తులసీదాసు, వల్లభాచార్యులు, చైతన్యమహాప్రభువు వంటి మహాత్ములు పరమాత్మను సేవించి తరించారు.
ఈకోవకుచెందినదే భక్తకవయిత్రి మీరబాయి. ఈమె రాజపుత్రవనిత. క్షత్రియవంశజనిత. పుట్టుక
యెక్కడైనా, సామాన్యులకు జన్మ బంధకారకమే, దుఃఖభాజనమే. "ఏచెట్టు కంత గాలి" యన్నట్లుంటాయి యిడుములు. కానీ
భగవంతునకు తమ్ముతా మర్పించుకొన్న భక్తులవిషయంవేరు. వారికేకష్టమూలేదు, సుఖమూలేదు. వారి ధ్యాసంతా భగవనునియందే. వారిది ప్రాపంచిక సుఖదుఃఖముల కావలి
మరో లోకం. ఇక ప్రస్తుత విషయానికొద్దాం. మీరాబాయి కాలము నాటికి రాజస్థాన్‍లో
వీరత్వమునకే ప్రాధాన్యత. భక్తికీప్రాంతమునందు అట్టే గుర్తింపులేదు, అది నామమాత్రమే యైయుండెను. మీరాబాయితో భక్తి ఉద్యమం రాజస్థాన్‍లో
చిగురించిందనడం నిర్వివాదాంశం.
మీరాబాయి రాజస్థన్‍లోని అజ్మీర్‍సమీప గ్రామమైన "కుర్కి" లో
క్రీ.శ 1498 లో జన్మించింది. రాథోడ్‍రాజవంశీయుడైన రావు రతన్‍సింగ్, వీరకుమారిల గారాల పుత్రిక మీరాబాయి. తండ్రి విష్ణుభక్తుడు. ఇంటిసమీపంలోని
వైష్ణ వాలయానికి కుమార్తెను తీసుకువెళుతూవుండేవాడు. తల్లి కూడా పుత్రికి భక్తి
నూరిపోసేది. అలా చిన్నతనంలోనే మీరాలో భక్తి అంకురించింది. మీరా ఐదేళ్ళవయస్సులో ఒక
పెళ్ళివూరేగింపుచూసి, ఆపెళ్ళి విషయాలన్నీ ఆసక్తిగా విని.
తల్లిదగ్గరకు వెళ్ళి నాకూ వివాహంచెయ్యండి, నాకూ ఒక పతి
కావాలి అని మారాంచేసిందట. తల్లి యింట్లోవున్న కృష్ణప్రతిమను చూపించి,
"ఇడుగో యీయనే నీ నాథుడు" అన్నదట. అంతే ఆపసిహృదయంలో
కృష్ణుడు నాథుడై విరాజిల్లాడు. మీరా వద్దగల గల ఆ కృష్ణవిగ్రహం ఒకసారి ఒక
సాధుభిక్షువు ఆమెకిచ్చి వెళ్ళాడని ఆమె చరిత్రలో వ్రాయబడివుంది. ఏమైతేనేం చాలా
చిన్న వయస్సులోనే మీరా శ్రీకృష్ణుని తన పతిగా స్వీకరించి ఆరాదించటం మొదలు పెట్టింది.
ఈమె చిన్నతనంలోనే తల్లి మరణించింది. తండ్రి ఆనాటి డిల్లీ సుల్తానులతో తరచూ
జరుగుచున్న హిందూముస్లిం యుద్ధతంత్రాలతో తనమునకలై యుండిపోయాడు. మీరా తన పితామహుడైన
"దూదా" వద్ద పెరిగింది.
మీరా హృదయపూర్వకంగా కృష్ణుడే తన భర్తయని నమ్మింది. కానీ అప్పటి రాజస్థన్‍లోని
రాజ్యాలమధ్య మైత్రి, బలగాలపెంపు, ముస్లిందండయత్రలకు
రాజపుత్రులు ఒక్కటయ్యే నెపంతో పిల్లలయిష్టాయిష్టాలకతీతంగా వివాహ బంధాలు
రాజకీయప్రాధాన్యత సంతరించుకొని మాత్రమే జరిగేవి. మీరా వివాహంకూడా యీ ప్రాతిపదికనే
మీరాకేమాత్రం యిష్టంలేకపోయినా క్రీ.శ 1516 లో మేవాడ్‍రాజైన రణాసంగ్రామసింహ (రాణా
సాంగా) కుమారుడైన భోజరాజ్‍తో జరిగింది. రాణివాసంలోని ఠీవి, దర్పము,
ఆచారవ్యవహారాలు మీరాకు నచ్చలేదు. అసలు భోజరాజ్‍ను ఆమెమనసులో భర్తగా
స్వీకరించనే లేదు. కృష్ణుడే తనభర్తయని బహిరంగంగా ప్రకటించేసింది. రాజకుటుంబం మీరా
ప్రవర్తనకు విసిగిపోయింది. రాచమర్యాదలకు భంగం వాటిల్లుతున్న దని మీరాను
కట్టాడిచేసేకొద్ది రాజకుటుంబంలోనూ, మీరాలోను అసహనం
పెరిగిపోయింది.
రాజకీయంగా ఆనాటి పరిస్థితులు జఠిలంకాజొచ్చాయి. డిల్లీ మొగల్‍చక్ర వర్తుల
రాజ్యవిస్తరణాకాంక్ష వల్ల, హిందూ ముస్లిం మతవిభేదాలవల్ల యుద్ధాలు తీవ్రరూపందాల్చాయి.
క్రీ.శ 1518 లో జరిగిన యుద్ధంలో భోజరాజ్ గాయపడ్డాడు. క్రీ.శ 1521 లో తిరిగి యుద్ధంజరిగింది.
ఆయుద్ధంలో భోజరాజ్ మరణించాడు. మీరాను సతీసహగమనం చేయాల్సిందిగా రాజకుటుంబం
ఒత్తిడితెచ్చింది. మీరా తనభర్త కృష్ణుడు నిత్యజీవనుడు, సతీసహగమనం
అన్న మాటే తనకు వర్తించదన్నది. మొగలులతో జరిగిన తర్వాతి యుద్ధంలో మీరాతండ్రి
బావగారుకూడా వీరమరణంపొందారు. ఆనాటికి మేవాడుకు వీరవిక్రమసింగ్ రాజయ్యాడు. మీరాపై
ఒత్తిడి పెరిగింది. ఆమెనుచంపి కుటుంబగౌరవం కాపాడుకోవాలనే నిశ్చయానికి
రాజకుటుంబంవచ్చింది. పూజకొఱకు పూలమాల పంపిస్తు న్నట్లు చెప్పి బుట్టలో విషనాగును
పెట్టి పంపించారు. కానీ ఆ పామును మీరా పూలమాలగా ధరించింది. పాలలో విషంకలిపి
యిచ్చారు. కానీ ఆ విషం ఆమెనేమీ
చెయ్యలేకపోయింది. స్వయంగా నీవే నదిలో దూకి చావమని ఆజ్ఞాపించారు. మీరా నీళ్ళలో
దూకింది, గానీ ఆమె మునిగిపోలేదు. నీటిపై తేలుతూ గట్టుకు
వచ్చేసింది. కుటుంబంతో కలిసివుండటం కుదరదని భావించి తులసీదాస్‍వారికి కబురంపి
సలహానడిగింది. ఆయన యిక అంతఃపురం విడచి స్వేచ్ఛాప్రపంచంలోనికి వచ్చేయమన్నాడు. క్రీ.శ 1527 లో ఆమె రాజమహల్
విడచి బయటకు నడిచింది. ఒకసారి తిరిగి యింటికి వెళ్ళింది. కానీ మెట్టినిల్లు,
పుట్టినిల్లు కూడా మీరాను తిరస్కరించాయి. ఆనాటినుండి ఆమె
ఉత్తరభారతమంతా నిరాడంబరంగా ఆడింది, పాడింది. కృష్ణభక్తిలో
ఓలలాడింది. ఆమె కృష్ణభజనలు జనాదరణ పొందాయి. ఆమెతో పాటు భక్తజనమంతా అడింది పాడింది.
అలా దేశంతిరుగుతూ బృందావనం చేరింది. అక్కడ చైతన్యమహాప్రభు శిష్యుడు రూపాగోస్వామిని
దర్శించాలని అనుమతి నభ్యర్థించింది. ఆయన నేనుయే స్త్రీనీ కలవనని వర్తమానం పంపాడు.
అప్పుడామె "ఇంతవరకూ నేను కృష్ణుడొక్కడే పురుషుడు, అనుకొన్నాను.
మిగిలిన విశ్వమంతా ప్రకృతిస్వరూపమే, అది స్త్రీకి ప్రతీక.
జీవరాసులన్నీ ప్రకృతిలోని భాగమేగదా! అటువంటప్పుడు మరొక పురుషుడా? బృందావనంలో మరొక పురుషుడున్నాడని
యిప్పుడే తెలిసింది" అన్నది. ఆమాట స్వామివరకు చేరింది. వెంటనే అయన క్షమాపణ
తెలిపి, అమెను రమ్మని ఆహ్వనం పంపాడు. అలా ఆమె భక్తశిఖామణుల
దర్శనం చేసుకొంటూ, ప్రేమవల్ల అభేదభావన్ని పొంది, అస్థితియొక్క పరకాష్టలో భగవానునిలో లీనమై పోవడమే నిజమైన భక్తి యని
గ్రహించింది. మీరా తన ఆట పాటలతో
తానుపరవశించి, భక్తసందోహాన్ని పరవశింపజేస్తూ జీవితం గడిపి,
ఆఖరుకు క్రీ.శ 1546 లో గుజరాత్ ద్వారక నందలి "రణఛోడా"
చేరుకొంది. అక్కడ కృష్ణాలయం లో కృష్ణునిముందు నిలబడటానికి అనుమతిని పొంది. వెళ్ళి
పారవశ్యంతో ఆడి పాడి అంతర్ధానమైపోయింది. కృష్ణపరమాత్మలో మీరా లీనమైపోయింది.
మీరా భజనలు భారతదేశమంతటా ప్రాచుర్యంపొందాయి.
"పాయోజీ మైనే రామ్‍రతన్ ధన్ పాయో" అనే మీరాగీతం గాంధీజీ చాలా యిష్టంగా
వినేవాడట." మేరే గిరిధర్ గొపాల దూసరకోయీ" వంటి గీతాలు విశేషాకర్షణతో
భక్తులనోలలాడించాయి. భక్తి ప్రకంపనలతో మీరాపాటలు జనాలను పరవశులగావించేవి.
లిఖితప్రతులు లభ్యముకాలేదు. ఓ రెండు వందల నుండి నలుగువందలదాకా ఆ భజనలుండవచ్చు.
కానీ యిప్పుడు వేలపాటలు ఆమెవిగా చెప్పబడుతూ పాడుకొంటున్నారు. ఇతరభాషలలోనికి కూడా
అనువదింపబడ్డాయి. నిజానికి మీరబాయి రాజస్థాన్ వ్రజ భాషలో పాడింది. శ్రీ రామచంద్ర
కౌండిన్య గారు 28 పాటలను తెనుగులోనికి "తెలుగు మీరా" పేర అనువదించారు.
శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు స్వర పరిచారు. వాటిలో ఒకటిరెండైనా గమనించడం
అవసరమనుకుంటాను. చూడండి.
మీరా
భజన గీతములు
(ఆనందభైరవి—మిశ్రచాపు)
కనులలో
కొలువుండురా గోపాల |
కనులలో
కొలువుండు, ననందన నాదు ||
శ్రావణమేఘములు సౌరు సుభగ
మోహనమౌ మేనితీరు
చారడేసి కనుల చిలిపి చూపు లులర
సుధజిందు మోవిపై సొబగొందు మురళితో ||
(కాపీ –
ఆది)
వింతలు
వింటివటే చెలీ
వింతలు
వింటివటే!
వ్రేపల్లియలో
ముసిముసినవ్వుల ||
గొల్లభామ పెరుగమ్మబోయనే
గోవిందుడు దారి తారసిలెనే !
అవునే అమ్మెడి దధినే మరచి
" కొనుడో శ్వామసుందరు కొను"
డనెనే||
బృదావనిలో కుంజకుంజమున
మన మోహను లోకనము లెగసెనే!
మీరాప్రభు గిరిధారి నాగరుని
కన్నుల ప్రణయ మాథురులు నిండెనే ||
(తిలకామోద్
– రూపక)
ఎవరే
నేనెవరే గిరిధరగోపాలుడు గా
కెవరే
నాకెవరే||
తాత మాత
భ్రాత బంధువెవ్వరు నావారెవరే
ఎవనిమౌళి
శిఖిపింఛము ఎనయునతడె నాపతిగాకెవడే||
కులము కట్టులెగద్రోచితి, నేమిసేతు రెవరేనిక
సాధుసంగమున లోకము సిగ్గు లెక్కసేయనినా|| కె||
చీనిదుకూలముల
రోసి ముదుకచేల మాసజేసి
ముత్తెసరులగాదని
వనమాల సంకలింపగ నా || నా || కె ||
అశ్రుజలము
చిలికి చిలికి పెంచితినొక ప్రేమతీవ
సాధులతాంతముల
ఫలము లానందములందగింప ||
ప్రణయమల్లడిగొనగా, మురిసి తరచి, తరచి మురసి
సంతరింతు
వెన్ననెల్ల, చల్లతో పనేమి, సామి||
అవ్యక్తాద్యత
ఏతద్వ్యక్తం జాతమశేషమ్
యద్ధత్తే
తదజస్రం యత్రాంతేలయమేతి సర్వసమర్థుడు.
ఓం
తత్ సత్
జీవితమంటే ఒకసమస్య
నుండి మరొక సమస్యకి ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలూ లేని జీవితమంటూ ఉండదు.
....... ప్రాచీన సూక్తి.
అంతరాత్మ “ఇది తప్పు” అని చెప్పినా,
ఇతరుల మెప్పుకోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి
అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం.
...మహాత్మా గాంధీ
కష్టాలు
నిన్ను నాశనం చేసేందుకు రాలేదు నీ
శక్తిసామర్థ్యాలను బయటకు తీసి
నిన్నునీవు నిరూపించుకొనేందుకే
వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను
సాధించడం కష్టమని. ....A.P.J
అబ్దుల్ కలాం.
భగవంతునికి నీవు
ఎంతదూరంలో వుంటే ,
భగవంతుడు నీకు అంతే
దూరంలో ఉంటాడు. .
....రమణ మహర్షి
26.డొక్కాసీతమ్మ
భర్త
డొక్కాజోగన్న పండితులు --- భార్య సీతమ్మ
అన్నిదానములలో అన్నదానమే మిన్న యన్నది ఆర్యోక్తి. ఈమాటను
నూటికినూరుపాళ్ళు నమ్మి ఆచరణలో పెట్టిన మహాయిల్లాలు శ్రీమతి డోక్కా సీతమ్మ. ఈమె
1841 వ సంవత్సరం అక్టోబర్ రెండవవారంలో తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురంతాలూకా
మండపేట గ్రామంలో జన్మించింది. తండ్రి అనప్పిండి భవానీశంకరం. తల్లి నరసమ్మ. తల్లి
చిన్న తనంలోనే మరణించింది. తండ్రి అన్నీతానేయై సీతమ్మను క్రమశిక్షణతో పెంచాడు.
భవానీశంకరంగారు అన్నదాత. అందరూ ఆయన్ను బువ్వన్న అని పిలిచేవారు. ఇదే దానగుణం
కూతురికీ అబ్బింది. ఒకసారి డొక్కాజోగన్న పంతులు పండితసభకు వెళ్ళివస్తూ మధ్యాహ్నం
కావడంతో మండపేటలోని భవానీశంకరంగారిటికి స్వయంపాకం నిమిత్తం వెళ్ళారు. ఆయనను అమిత గౌరవంతో
ఆహ్వనించి సీతమ్మ స్వయంపాకంయిచ్చి భోజనానికి సహకరిం చింది. సీతమ్మచూపిన
అతిథిమర్యాదలూ, గౌరవం గమనించి జోగన్న ఆమెను వివాహమాడటానికి
యిష్టపడ్డాడు. భవానీశకరంగారుకూడా జోగన్న పాండిత్యాన్ని, సాముద్రికశాస్త్రనిపుణతను
గుర్తించి, అంతటి గొప్ప వారు అల్లుడౌతున్నందుకు సంతోషించి
1850 లో వివాహంజరిపిం చారు. జోగన్నగారికిది మూడవవివాహం. తొలుత వివాహమైన యిద్దరు
భార్యలూ చనిపోయారు. సీతమ్మకు వివాహంజరిగేనాటికి ఆమె వయస్సు తొమ్మిదేళ్ళు మాత్రమే.
తత్కారణంగా సీతమ్మ పెద్దగా చదువుకోలేదు. ఈమె దానగుణం తెలిసిన భర్త జోగన్నగారు
ఆమెను ప్రోత్సహించారు. డొక్కావారింటి యిల్లాలు గా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని
నిరాటంకంగా నిర్వహించింది. జోగన్న గారిది గోదావరి మధ్యస్థంగావున్న డెల్టాగన్నవరం.
దాన్నే లంకలగన్నవరం అనికూడా అంటారు. అదే సీతమ్మ అన్నదానవ్రతానికి వేదికయ్యింది.
చుట్టు ప్రక్కల గ్రామాలు వరదలు, అతివృష్టి, అనావృష్టి కారణంగా పలువిధముల యిబ్బందులు పడేవారు. సీతమ్మ అన్నదానం
వారందరికీ గొప్పఆధార మయ్యింది. అచిరకాలంలోనే సీతమ్మ అపరఅన్నపూర్ణగా
పేరుగడించింది.
సీతమ్మగారి జీవితంలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసు కున్నాయి.
వాటిలో కొన్నింటినైనా మనం తెలుసుకోవాలి. అవేమిటో చూద్దాం. సీతమ్మ అన్నదానాలతో
తీరుబడిలేని జీవితంగడుపుతుండేది. ఒకరోజు యెలగో తీరుబడిచేసుకొని, ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని అంతర్వేదికి మేనాలో
బయలుదేరింది. దారిలో బోయీలు సేదదీరటానికి ఆగారు. అక్కడికి ఒక పెళ్ళిబృందంకూడా
వచ్చి ఆగింది. ఆపెళ్ళి వారిలో పిల్లలు ఆకలికితాళలేక యెడుస్తున్నారు. వాళ్ళను
సముదాయిస్తూ పెద్దలు ఓ అరగంట ఆగండి గన్నవరంచేరుకుంటాం. అక్కడ సీతమ్మ అన్నం పెడుతుందని
తెబుతున్నారు. అదివిన్న సీతమ్మ వెంటనే పల్లకీ వెనక్కుత్రిప్పి వూరుచేరుకొని,
పెళ్ళివారి అకలి తీర్చటానికి ప్రయత్నంచేయసాగింది. వారి కోసం తొలుత
బెల్లంపానకం, మామిడిపళ్ళముక్కలు తయరుగావుంచి, అన్నంవండే పనిలో నిమగ్నమైపోయిందంట. అలా ఆమె పుణ్యక్షేత్రంలోని దైవంకన్నా
ఆకలిగొన్నవారిలోనే దైవాన్ని చూసింది.
ఒక బ్రిటీష్‍కలెక్టరు దంపతులు సీతమ్మ గొప్పతనంవిని వారు
సీతమ్మయింట అన్నప్రసాదం స్వీకరించారు.
అప్పటివరకు బిడ్డలులేని కలెక్టరువారికి కుమారుడు జన్మించాడు. ఈ విషయం పీఠాపురం
జమీందారుగారైన శ్రీరాజా రావుమహీపతి గంగాధరరామారావుబహద్దూర్ గారికి కలెక్టరువారు మాటలసందర్భంలో
చెప్పారు. రాజావారు ఆశ్చర్యపోయారు. చూదవలసిందే సీతమ్మ దాతృత్వమని తన దివాన్‍ను
వెంటతీసుకొని లంకలగన్నవరంవెళ్ళి, సీతమ్మయింటిచెంత అరుగుపై
కూర్చున్నారు. సీతమ్మ అందరినీ పలుకరిస్తూ వీరిచెంతకువచ్చి, యింకా
భోంచేయలేదా? రండిరండి భోంచేసి తర్వత విశ్రాంతి తీసుకోవచ్చని,
వెంటతీసుకొనిపోయింది. దివాన్‍గారు తనకు జ్వరంగావుందనీ అన్నం
సహించడంలేదని చెప్పగానే సీతమ్మ అతనికి
పథ్య భోజనంగా చింతకాయపచ్చడి, నిమ్మకాయఊరగాయతో అన్నపెట్టి,
కాసే పటికి బీరకాయ నేతిపోపుపెట్టి కూరవడ్డించి వేడివేడిపాలుకూడా
యిచ్చింది. రాజుగారుమాత్రం అన్నం, రుచికరమైన కూరలు, పెరుగుతో భోజనం కానిచ్చారు. భోజనానంతరం వారు నిద్రించటానికి ప్రత్యేకమైన
వసతికూడా చూపింది. మరునాడు వారు తమనుతాము తెలియజేసుకొని సీతమ్మకు ధన్య వాదాలు
తెలిపి, ఆమెఅన్నదాననికి కొంతపొలం వ్రాసిస్తామన్నారు. కానీ
ఆమెవారి దానాన్ని స్వీకరించలేదు. తన అన్నదానం నారాయణార్పితమని వినయంగా
తెలియజేసింది.
సీతమ్మ అన్నదానానికి ఒకవేళంటూ యేమీలేదు. ఎప్పుడు వచ్చినా ఆమె యింట
అన్నందొరికేది. ఒకనాటి రాత్రి బాగా వర్షంకురుస్తూవుంది. గోదావరి
పరవళ్ళుత్రొక్కుతూవుంది. దూరంగావున్న గోదావరిదిబ్బలవైపు నుండి ఒక అకలికేక
వినబడింది. సీతమ్మ వెంటనే స్పందించి భర్తచేతికి రెండుబొంతలు, ఒకపంచె, భోజనం సిద్దంచేసియిచ్చి, అ అకలిగొన్న వానిని ఆదుకోమన్నది. ఇప్పుడు గోదావరిదాటడానికి యెవ్వరూ
బోటుతియ్యరు, ప్రొద్దున వెళతా నన్నారు భర్త. అతడు
ఆపదలోవున్నాడు, మనం ఆదుకొనితీరాలి, మీరు
వెళ్ళనంటే నేనే వెళతానన్నది సీతమ్మ. గత్యంతరంలేక భర్త యెలాగోవెళ్ళి చూస్తే అతడొక
దళితుడు. కులమతాలకతీతంగా వ్యవహరించే సీతమ్మ కుటుంబం అతన్ని ఆదుకొని ఆకలితీర్చి
సంతృప్తిపడింది.
సీతమ్మ అన్నదానమేకాదు ఉన్నవారు లేనివారు అన్న తేడాలేకుండా కష్టంలో
వున్నవారి నెవరినైనా దయతో ఆదుకొనేది. ఒకసారి కోడూరుపాడు రాజు గారు గర్భవతియైన
తకుమార్తెను ప్రసవానికి తనయింటికి తీసుకవెళు తుండగా కోడేరు దాటగానే పురిటినొప్పులు
వచ్చాయి. సీతమ్మకు విషయం తెలిసి తనయింటికి
తీసుకొనిపోయి పురుడుపోసి, నెలరోజులు తనవద్దనే వుంచుకొని, చీరెసారె పెట్టిపంపించింది. ఒకసారి ఒకబ్రాహ్మణ యువకుడు సీతమ్మయింటికివచ్చి
తనకు పెళ్ళికుదిరిందనీ, కానీ వధువుతండ్రి యేదైనా బంగారునగ
తెచ్చియిస్తేనేగాని, ముహూర్తం పెట్టించనని తెబుతున్నాడు. నా వద్ద
బంగారులేదు. మీ మెడలోని నగయిస్తే నా పెండ్లిజరుగుతుందని బ్రతిమ లాడాడు. అతడు
అన్నంతినమన్నా తినలేదు. విషయంతెలిసి భర్త, ఉన్న ఆనగ
యిచ్చేస్తేయెలా? వద్దు. అన్నంపెట్టడంవరకే పరిమితమౌదాం. అని
సర్ది చెప్పాడు. కానీ సీతమ్మ, ఒకపెళ్ళిచేద్దాం.
ఇల్లునిలబెడదాం. నాకీ నగ లేకున్నా పరవలేదని భర్తను ఒప్పించి, నగయిచ్చి, భోజనంపెట్టింది సీతమ్మ. ఆ యువకుడు
వెళ్ళినతర్వాత చూస్తే నగ అతడు కూర్చున్న పీటక్రిందేవున్నది. రాత్రికి సీతమ్మకలలో
హరి దర్శనమిచ్చి, సీతమ్మతల్లీ యువకుని రూపంలో వచ్చింది నేనే.
నాకుచాలసంతోషమైనది. నీవుకడుధన్యురలవు. అని దీవించి నాడట. సీతమ్మ భర్తకీ
విషయంచెప్పి పరమానంద భరితురాల యిందట.
విజయనగరం గ్రామం ముదునూరు కృష్ణమరాజు భార్య ప్రసవించిన తర్వాత
బారసాలనాడు కేకపెట్టి క్రిందపడిపోయింది. వైద్యులు జబ్బేమిటో తెలియడం లేదన్నారు.
జపతపాలూ, యాగాలూ చేయించారు. వీబూదిపట్టించారు. అప్పుడామెను
బ్రహ్మరాక్షసుడావహించాడని తేలింది. డొక్కాసీతమ్మ దళిత దాసరికి అన్నంపెట్టి
బ్రతికించింది, ఆమె ఆ పుణ్యఫలందారపోస్తే బ్రహ్మ రాక్షసుడు
వదలిపోతానని చెప్పడంతో, వెళ్ళి సీతమ్మను ప్రార్థించారు.
అదేనిజమైతే ఇప్పుడే అ రాక్షసునికి కోరిన పుణ్యఫలం దారపోస్తున్నానని దారపోసింది
సీతమ్మ. బ్రహ్మరాక్షసుడు వదలిపోయాడు. పోతూపోతూ తా నొక బ్రహ్మణుడననీ, ఆస్తికోసం సొంతతమ్ముడిని వేరేవూరికి తీసుకొని వెళ్ళి విషమిచ్చి చంపాననీ,
ఊరివారికి తనతమ్ముడు విషజ్వరంతోచనిపోయాడని చెప్పి నమ్మించాననీ,
ఆపాపంవల్లనే బ్రహ్మరాక్షసుడనయ్యాననీ, ఇప్పుడు
సీతమ్మ పుణ్యంధారపోయడంతో నా రాక్షసత్వం పోయిందనీ చెప్పాడట.
పోడూరురాజుగారి పశువులకు గాళ్ళవ్యధిసోకి వ్యవసాయానికి యిబ్బంది
కలిగిందట. రాజుగారు సీతమ్మకు తెలియజేస్తే, ఆమె తమపశువులు
వారికి పంపి సహాయపడిందట. ఒకసారి కరువుయేర్పడి, అన్నదానానికి
యిబ్బదిపడే పరిస్థితి యేర్పడగా, సీతమ్మ ధాన్యంకోసం
పోడూరురాజువద్దకు తమ్ముడు సుబ్బరాయుడిని, గన్నవరపులింగమూర్తినీ
పంపిందట. ఆయన వారిద్దరికీ మర్యాదచేసి, తనయింట ఆతిథ్యమిచ్చి
కొన్నిరోజులుంచుకొని పంపించారట. వారు తిరిగివస్తూ రాజావారు బాగా గౌరవంగా చూశారు,
కానీ ధాన్యం మాట మాత్లాడనేలేదే! అనుకుంటూ వచ్చారు. తీరా యింటికి
వచ్చి విచారిస్తే, ధాన్యం వీళ్ళురాజుగారిని కలిసిన మరురోజే
సీతమ్మయింటికి చేరిందట. తర్వత సీతమ్మ పంటయింటికిరాగనే ధాన్యం రాజుగారికి
త్రిప్పిపంపి సమయా నికి సహాయపడినందుకు ధన్యవాదాలు తెలియజేసిందట. అలా సీతమ్మ
అందరితో సత్సంబంధాలు కలిగియుండేది. సీతమ్మ పేదలయెడ దయగలిగి యెన్నో శుభకార్యాలకు,
కల్యాణాలకు విరివిగా విరాళాలిచ్చింది. చాలా పెళ్ళిళ్ళు ఆమె
యింటిముందే పందిళ్ళువేసి జరిపించి అక్షతలువేసి దీవించింది.
నెల్లూరుజిల్లా కుల్లూరు
వ్యాపారులు ముత్యాలు, పగడాలు అమ్ముకోవడానికి లంకలగన్నవరంవచ్చి, అక్కడ మశుచివ్యాధి సోకి డీలాపడిపోయారు. వారి వ్యాధితీవ్రతచూచి యెవ్వరూ
దగ్గరకు రానివ్వలేదు. సీతమ్మ వారిపై జాలిపడి, వారికి ప్రత్యేకవసతి
కల్పించి, వైద్యముచేయించి బాగాకోలుకున్నతర్వాత వారుతిరిగీ
సొంతగ్రామానికి క్షేమంగా చేరుకొనే యేర్పాట్లు చేసింది సీతమ్మ. వారు అమెకు పగడాలూ,
ముత్యాలూ యివ్వజూపగా, ఆమె సున్నితంగా
తిరస్కరించింది. సీతమ్మ మూర్తీభవించిన మానవత్వమని గుర్తించి, ఆ వ్యాపారస్తులు సీతమ్మకొడుకును వారివూరికి పిలిపించుకొని, సన్మానించి ఊరేగించారట.
పేరూరులో నీటియెద్దడి యేర్పడితే సీతమ్మ స్పందించి, ఆ కాలంలో యాబై రూపాయలు వెచ్చించి, బావిత్రవ్వించింది.
ఆ బావిలో కొబ్బరినీళ్ళవంటి తియ్యని నీళ్ళుపడ్డాయి. దప్పికతీరిన ఆ గ్రామవాసులు
సీతమ్మను వేనోళ్ళ శ్లాఘించారు.
వరహాలశెట్టీ అనే వ్యాపారి బొంబాయిలోవుండి దుర్వ్యసనాలకు లోనై దివాలాతీసి, కడకు సీతమ్మయింటివద్దచేరి ఆమెపెట్టే అన్నంతిని అక్కడక్కడే
తిరుగాడుతూవుండేవాదు. ఒకరోజు సీతమ్మ ఆరవేసిన పట్టుచీర దొంగలించి తీసుకవెళుతుండగా
గ్రామస్తులు పట్టుకున్నారు. సీతమ్మ విషయంతెలిసివచ్చి అతన్ని కొట్టకుండా ఆపి,
పట్టుచేర తనే అతనికిచ్చాననిచెప్పి, మరో యాభై రూపాయలు
చేతిలోపెట్టి, నీతిగాబ్రతకమని హితబోధచేసి పంపింది.
వరహాలశెట్టి మారిపోయి, నిజాయితీతో తిరిగి వ్యాపారంచేసుకొంటూ
సలక్షణంగా జీవించాడు. వీలుదొరికినప్పుడల్లా లంకలగన్నవరంవచ్చి సీతమ్మను దర్శించి,
అమెచేతి అన్నంతిని, నమస్కరించి, వెళుతుండేవాడు. ఇలా సీతమ్మ యెందరినో వక్రమార్గంతప్పించి సక్రమమార్గంలో
నడిపించింది.
ఇలా అన్నదానాలు చేస్తూ సీతమ్మ అలసిపోయింది. భర్త అదిగమనించి
పనిమనుషులను నియమించాడు. సీతమ్మ వారిని వంటవండనిచ్చేది కానీ వడ్డానమాత్రం
తనేచేసేది. అదే తనకు సంతృప్తినిస్తుందనేది. అలా అన్నదానం నిరంతరంచేయడంవల్ల సంపద
తరిగిపోయింది. భర్త యీఅన్నదానం చేయ లేమేమోనన్నాడు. సీతమ్మమాత్రం అధైర్యపడలేదు.
మనంచేసే అన్నదానం శ్రీహరిసేవ. ఆయనే చూసుకుంటాడన్నది. మరునాడు సీతమ్మభర్త జోగన్న గారు
పొలంలో పనిచేయిస్తూ, తనూ గునపంతో త్రవ్వుతున్నాడు. గునపానికి యేదో ఖనేళ్
మని తగిలింది. పనివారిని యింటికిపంపించి, లోతుకు త్రవ్వాడు.
ఒక మద్దెలఆకారంలోవున్న కంచుపాత్ర బయటపడింది. దానినిండా బంగారుకాసులున్నాయి.
పాత్రను యిల్లుచేర్చి సీతమ్మకు చూపాడు. సీతమ్మ ఆ శ్రీహరే మన అన్నదానకార్యక్రమం
ఆగిపోకుండా బంగారంపంపాడని చెప్పి, తనదానాలను కొనసాగించింది.
భర్త జోగన్న పండితులు 1881 లో పరమపదించారు. ఆ తర్వాతకూడ సీతమ్మ యధా తధంగా అన్నదానం
చేసుకొంటూ పోయింది. ఆమె పుత్రులు సుబ్బరాయుడు, గోపాలం,
కూతుళ్ళు నరసమ్మ, సోదెమ్మ కూడా తల్లికి
సహకరించారు. సీతమ్మ తజీవితంలో యేనాడూ యెవరినీ యేమీ అడగలేదు. విరాళాలు
స్వీకరించలేదు.
సీతమ్మ కీర్తిచంద్రికలు భారతరాజధాని డిల్లీ వరకూ వ్యాపించాయి. ఆమె
దాతృత్వాన్ని బ్రిటీష్‍గౌర్నమెంటు గుర్తించింది. ఏడవ ఏడ్వర్డ్‍చక్రవర్తి
ప్రతిసంవత్సరం జరుపుకొనే పట్టాభిషేక వేడుకలకు సపరివారంగా రమ్మని 1902 డిశంబరు
నెలలో సీతమ్మకు ఆహ్వానంపంపారు. ఛీఫ్‍సెక్రటరీ మద్రాసు వారిని యీపనికి నియమించి, గౌరవముగా సీతమ్మగారిని పిలుచుక రమ్మన్నారు. కానీ సీతమ్మ రాలేనన్నది. తాను
ప్రచారంకోసం అన్నదానం చేయడంలేదు. ఇది కృష్ణార్పణ బుద్దితో, భగవత్సేవగా
భావించి చేస్తున్నాను. నేనే సన్మానం కోరుకోవడంలేదని సున్నితంగా చెప్పిపంపింది.
చక్రవర్తి ఆమె ఫోటోను తీసిపంపమని అధికారులను ఆదేశించించారు. సీతమ్మ అవసరము లేదన్నది.
కానీ అధికారులు అమ్మా! మేము ఫోటో తీసిపంపకపోతే మా ఉద్యోగంపోతుందని బ్రతిమలాడారు.
అలాగైతే తీసుకొండి నాయనా అన్నది. వారు ఫోటో తీసి డిల్లీపంపారు. 1903 జనవరి
ఒకటవతేది ఏడవ ఎడ్వర్డ చక్రవర్తి సీతమ్మఫోటోను ఆమెకై కేటాయించిన సోఫాలో పెట్టించి
పట్టాభి షేకం చేయించుకున్నారు. ఆవిధంగా బ్రిటీష్‍చక్రవర్తి ఆమెను గౌరవించారు. ఆ
సందర్భంగా ఒక యోగ్యతాపత్రాన్ని సీతమ్మపేరున విడుదలచేసి, శివకోడు
తహశిల్దార్ శ్రీ వి.పి. పద్మనాభరాజుగారి ద్వారా 1903 మార్చి 15 వ తారీఖున
సీతమ్మకందజేశారు.( ఆ పత్రం నకలు యీవ్యాసం చివరన యివ్వ బడింది )..
సితమ్మగారి జీవితచరమాంకంలో చేతిమీద క్యాంసర్‍వ్రణం లేచి శరీరంలోని
సత్తాను హరించింది. సీతమ్మ కుమారుడు సుబ్బరాయుడుగారు వైద్యం చేయించడానికి
ప్రయత్నించాడు. సీతమ్మ వద్దన్నది. ఇది తన జన్మ జన్మాంతరాల కర్మఫలమనీ, అది అనుభవించాల్సిందేనంటూ బాధభరిం చింది. తుదకు1909 ఏప్రిల్ 28 వ తేదీ
వైశాఖశుద్ద నవమి బుధవారం మధ్యహాన్నం 12 గంటలకు కొడుకు సుబ్బరాయునితో అన్నదానం
ఆపవద్దని మాటతీసుకొని తుదిశ్వాస విడిచింది. ఆ సమయంలో ఇందుపల్లిగ్రామంలో శ్రీమంథ
నరసింహమూర్తిగారి యింటివద్ద, శ్రీ కులనాథభట్ల వెంకయ్యగారు
పఠాను ఏకపాత్రాభినయం చేస్తుండగా, మహాపండితులు శ్రీ వెంపరాల
సూర్యనారాయణశాస్త్రిగారు చూస్తున్నారు. ఇంతలో ఆకాశంలో ఒకగొప్ప తేజస్సు పడమరనుండి
తూర్పుకు ఒక గుండ్రనిబంతివలె వేగంగా వెళ్ళడం చూశారట. అది డొక్కాసీతమ్మ దివ్యాత్మగా
ఆయన నిర్ధారించారు.
ఈమె చరిత్ర సెకండరీపాఠశాల పాఠ్యాంశంగా కొన్నాళ్ళున్నది. తిరిగి
యిప్పుడు యేదోఒక తరగతికి పాఠ్యాంశంగా పెట్టి విద్యార్థులకు స్ఫూర్తి కలిగించవలసిన
అవసరమున్నది. "నిరతాన్నదాత్రి శ్రీమతి డొక్కాసీతమ్మ" అనుపేర 1959 లో
శ్రీ మిర్తిపాటి సీతారామచయనులు ఒకగ్రంథం వ్రాసి వెలువరించారు. వారి కుమారులు
మిర్తిపాటి నారాయణ, మాచరిబాబు, వెంకట్రామయ్యగార్లు
1009 లో పునర్ముద్రించి ఉచితంగా పంచిపెట్టారు. సీతమ్మమనవడి మనవడు శ్రీ డొక్కా
శ్రీనివాసఫణికుమార్ అమెరికా లోని అట్లాంటాలో వుంటున్నారు. ఆయన సీతమ్మకు సంబంధించిన
అనేక చారిత్రక అంశాలు సేకరించి ఒకమంచి వ్యాసం ప్రచురించారు.
సీతమ్మ గౌరవార్థం కాకినాడనగరం లోని వివేకానంద ఉద్యానవనంలో ఆమె
విగ్రహం నెలకొల్పారు. వైనతేయనదిపై నిర్మించిన అక్విడక్టుకు 2000 సంవత్సరంలో
సీతమ్మపేరుపెట్టి, పైభాగాన ఆమె విగ్రహం స్థాపించారు. శ్రీమతి
డొక్కాసీతమ్మ చరిత్ర తెలుగునాట చిరస్మరనీయంగా ఆచంద్రతారర్కం నిలచివుంటుంది.
CERTIFICATE
By command of His
Excellency the viceroy and Governor-general in council of this certificate is
presented in the name of his gracious Majesty King Edward v11 emperor of India
to Dokka Sitamma garu of Gannavaram, in recognition of her well known charity.
MADRAS Sd-Stoks
1st January 1903. Chief Secretary to the
Government of MADRAS
దోమా
వెంకటస్వామి గుప్తా సాహిత్యపీఠం వారు రచయితకు చేసిన సన్మానం
* ధర్మమువలన సుఖం, అధర్మమువలన దుఃఖము. మంచి పనులు
చేసేవాళ్ళకి భగవంతుడు ఉత్సాహము, సంతోషము, తృప్తి ఇస్తాడు. చెడ్డ పనులు చేసేవాళ్ళకి లజ్జ, భయము
కల్పిస్తాడు.
* కుతూహలం అవగాహనకు, అవగాహన ఆచరణకు, ఆచరణ అనుభవమును అందించును.
* ధర్మో రక్షితి రక్షితః అంటే ధర్మమును ఎవరు రక్షించుదురో వారు ధర్మముచే
రక్షింపబడుదురు.
* ఈత తెలిసినవాడు మునిగిపోతున్న వ్యక్తిని ఫలాపేక్ష లేకుండా రక్షిస్తాడు.
కారణము లేకుండా మహాత్ములు మనల్ని తరింపజేస్తారు. మూల్యాన్ని ఆశించకుండా అమూల్యమైన
అక్షయ సంపదను మన హృదయంలో దించుతారు.
* విషయాసక్తులకు కర్మలు రుచిస్తాయి. వివేకస్తులకు జ్ఞానం రుచిస్తుంది.
* 'మౌనవాఖ్యా ప్రకటిత
పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం
మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది.
·
భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం దీనిని
మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది,
అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది.
No comments:
Post a Comment