పాండురంగ మహత్మ్యము-ఒకపరిశీలన
హరిస్తుతి
సీ: పొదలు నీ పొక్కిటి పువ్వుకాన్పునఁ గదా
పెనుమాయ పిల్లలఁ బెట్టు టెల్లఁ !
బొడము నీ మొదలి యూర్పుల నేర్పులనకదా
చదువు సంధ్యలు గల్గి జగము మనుట!
కెరలు నీ యడుగుఁదామరల తేనియఁ గదా
పాపంపుఁ బెనురొంపి పలుచనగుట!
పొసగు నీ తెలిచూపు పసఁ గదా యిది రాత్రి
యిది పగలను మేరలెఱుఁకఁ బడుట!
తే: భవనఘటనకు మొదలి కంబమును బోలె
భువనములకెల్ల నీ వాది భూతివగుచు
నిట్ట నిలుచున్కి చేఁ గాదె నెట్టుకొనియె
గెంటుఁ గుంటునులేక లక్ష్మీకళత్ర!
పాండురంగ మహాత్మ్యము- 2-55.
పాండురంగ మహత్మ్యము- ఒకపరిశీలన
పాడురంగమహత్మ్య కర్త తెనాలి రామకృష్ణుడు. తొలుత కవినిగూర్చి సంక్షిప్తంగానైనా తెలుసుకుందాం. రామకృష్ణుడు, రామలింగడు ఒకరేనని పండితులు తేల్చి చెప్పినారు. వారిలో ముఖ్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. రామలింగడే వైష్ణవము స్వీకరించి రామకృష్ణుడైనాడు. ఇదంతయు ఆనాటి రాజశ్రయమునకై పడిన పాట్లలో ఒకటై యుండవచ్చును. జీవిత కాలం క్రీ.శ 1505-1575/80 వరకూ ఉండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం. ఈకవి రామలింగడు గానున్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్రమును రామకృష్ణుడైనతర్వాత ఘటికాచల మహాత్మ్యమును, పాండురంగమహాత్మ్యమును వ్రాసినాడు. ఇవిగాక హరిలీలావిశేషము, కందర్పకేతువిలాసము కూడా వ్రాసినాడందురు. వేటూరువారు యీ గ్రంథములలోని కొన్ని పద్యములు మాత్రము చూపిరి. పూర్తిగ్రంథములు అలభ్యము. తెనాలినుండి విజయనగరము వచ్చిన వారగుటచే తెనాలి వారనుచున్నాము గానీ వీరింటిపేరు గార్లపాటి. వీరి గురువులు రామలింగడుగా నున్నప్పుడు ఏలేశ్వరుడు,రామకృష్ణుడైనతర్వతభట్టరుచిక్కాచార్యులు. పాండురంగమహత్మ్యమును పొత్తపినాటిలో కృష్ణరాయల తర్వాత సదాశివరాయలకు లోబడి రాజ్యముచేయుచుండిన మహా మండలేశ్వరుడైన మంగయ గురవరాజు కుమారుడు సంగరాజు చేతిక్రింద రాయసము చేయుచున్న విరూరి వేదాద్రికి అంకితమిచ్చినాడు. ఈ వేదాద్రి ఒక వ్రాయసకాడని కొందరి అభిప్రాయము. ఇతడుకూడా వైష్ణవము స్వీకరించినవాడే. ఆవిధమగు అభిమానము వల్లనే గొప్ప రాజుకాకపోయినా అంకితమిచ్చియుండునని విశ్లేషకుల అభిప్రాయము. ఎందునకన ప్రార్థనా పద్యముననే
శా: శ్రీకాంతామణి కన్మొరంగి, మది ధాత్రిన్ మంచినన్, దద్రుచి
శ్రీకాదంబిని మీదికుబ్బెననగా శ్రీవత్సమున్ దాల్చి ము
ల్లోకంబుల్ పొదలించు కృష్ణుడు, దయాళుండేలు శ్రీవైష్ణవ
స్వీకారార్హు, విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్. - అంటాడు.
కృతిపతి శ్రీవైష్ణవ స్వీకారార్హునిగా చూపినాడు. శ్రీహరి లక్ష్మీదేవి కన్నిగప్పి ఉరముపై భూదేవిని దాచుకున్నాడు. ఆభూదేవి మేఘమాలవలెనున్న నల్లని కాంతియై పైకుబ్బి హరివక్షపు మచ్చయై ప్రకశిస్తున్నది. అట్టి మచ్చగల శ్రీహరి, నల్లనివాడు కృతిపతిని దయాళువై యేలవలెనని ప్రార్థన.
ఈకవి రచనలన్నింటిలో పాండురంగమహాత్మ్యమే మిన్న. ఇది సుమారు క్రీ.శ 1565 లో అనగా ముదిమిలో వ్రాసిన గ్రంథము. అందుకే యిది భాషాజ్ఞానానుభవము ప్రౌఢత సంతరించుకొన్నది. కవి రాయలవారి అష్టదిగ్గజములలో ఒకడని ప్రతీతి. చారిత్రక ఆధారములు చూపుట కష్టము. ఒకవేళ వుండివుండిననూ లేతవయస్సులో వుండి వుండ వచ్చును.
ఇక గ్రంథవిశ్లేషణకు వత్తము. పంచకావ్యములలలో ఒకటైన యీ గ్రంథము ప్రౌఢిమచే నగ్రగణ్యము. గ్రంథము
ఉ: స్కందపురాణ నీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ
నందను సత్కతోదయము. నవ్యకవిత్వ కళా కలాపమున్
గుందనమున్ ఘటించి కడుక్రొత్తగు సొమ్మొనరించి విష్ణు సే
వం దులకించు నప్పరమ వైష్ణవకోటి నలంకరింపుమా!- అని
కృతిభర్త చెప్పినట్లు వ్రాయుటచే, యీకథ స్కందపు రాణమునుండి
గ్రహించినదని తెలియు చున్నది. అందులోని ఉత్తరసంహిత లోని నవమధ్యాయములోని ఉమామహేశుల సంవాదమని బులుసు వెంకటరమణయ్యగారనిరి. కానీ అది సరిగాదనీ, పద్మపురాణములో కొంతవరకున్నదని పరిశీలకులు దెలిపిరి. ఏదియేమైననూ యిది ఐదశ్వాసముల శాంతరస గ్రంథము. ఇందులో సాంతమొక కథ సాగదు. అనేక భక్తిరస గాథలతో నిండిన గంథము. పుండరీకముని చరిత్రము, రాధా చరిత్రము, నిగమశర్మోపాఖ్యానము, సుశీలకథ, ఆయుతనియతుల చరిత్రలు, యిందులోనున్నవి. వీటన్నిటిలో నిగమశర్మోపాఖ్యానము మేలైనది. ఇదేకవిచే రచింపబడిన ఉద్భటారాధ్యచరిత్రములోని మదాలసుడు, శ్రీనాథుని కాశీఖండాంతర్గత గుణనిధి కథ, శివరాత్రి మహత్మ్యములోని సుకుమారకథ, కందుకూరి రుద్రకవి నిరంకుశో పాఖ్యానకథ యిదే కోవలోనివే యైననూ వీటన్నిటికన్న నిగమశర్మోపాఖ్యనమే రసనిష్యందియై నిలచినది. కవి " అభ్యుదయపరంపరా భివృద్ధిగా నా యొనర్పంబూనిన పౌండరీకమహాత్మ్యంబునకుం కథావిధానం బెట్టిదనిన" అని కథకుపక్రమించినాడు. కానీ అభ్యుదయమన్న పదమునకు నేడు మనమనుకొంటున్న అర్థంలో యీగ్రంథము సరిపడదు. కేవలం ఆనాడు అందరు కవులూ ఆనాడు అనుసరించిన ఒక సాంప్రదాయమనుకొని సరిపెట్టుకొనవలసినదే. ఒకటి మాత్రము గమనింపవలసివుంది. ఇందలి కథాంశముకన్నా కల్పనాచాతుర్యము ప్రౌఢకవిత్వపటిమ, అద్భుత శయ్యాలంకారములకే ప్రాధాన్య మియ్యవలసియున్నది. కవిచెప్పిన కొన్ని అభిప్రాయములనూ గమనించవలసి యున్నది.
ఉ: చాటుకవిత్వతత్వ రససాగరపారగులయ్యు సత్కవుల్
పాటిగబట్టి విందురొకపాటివి కావనకన్యకావ్యముల్
కైటభవైరి యౌవతశిఖామణి శ్రీసతి బేరురంబునన్
మాటియు నీటికెంపు బహుమానమునం బతకంబు సేయడే.
కావ్యం ఒకమోస్తరుదైనా చాటుకవిత్వరససాగర పారగులైన గొప్పకవులు గౌరవము జూపి వింటారు. హరి లక్ష్మీపతియైగూడా, నీటికెంపైన కౌస్తుభాన్ని మన్నించి తనయెద దాల్చినాడు. ఒకమంచి ఉపమ. ఇది నిజమైన పెద్దవారి తత్త్వం. అంటే రామకృష్ణుడు యెవర్నీ చిన్నచూపు చూడని వ్యక్తి.
తే: తప్పుగలిగిన చోటనే యొ ప్పుగలుగు
సరసకవితా వశోక్తుల సరణియందు
గప్పు గలిగిన నీహారకరుని యందు
నమృతధారా ప్రవాహంబు లడరుగాదే!
తే: కాన దోషాత్ములైన దుష్కవులకతన
గరిమ వహియించు గవిరాజు కావ్యమహిమ.
బహుళపక్షంబు చీకటి బహుళమగుట
జాయవెన్నెల తరితీపు సేయు కరణి.
దుష్కవుల కవిత్వంతో పోల్చినప్పుడు, సత్కవికి గౌరవం పెంపొందుతుంది. అదెలాగంటే కృష్ణపక్షంలోని చీకటివల్లనే పండువెన్నెల మరింత హాయి గొల్పుతుంది. అంతందుకూ చంద్రునిలో మబ్బుమచ్చలున్నవి. అయినా అమృతం కురిపించడంలేదా? కనుక చూడగల్గితే యెందులోనైనా కొంత మంచి కనబడకపోదంటారు.ఇది రామకృష్ణుని విశాల
హృదయానికి సాక్ష్యం.ఇటువంటి కవిని "వికటకవిని జేసి అనేక అసభ్యహాస్యకథలు
అంట గట్టడం అన్యాయం. ఆయనకు "సరస కవితానాథుడు", కుమారభారతి", "ఫ్రౌఢకవి", "భక్తకవి" యనుపేర్లుకలవు. అవి సమంజసముగా తోచును.
పాండురంగమహాత్మ్యము లోని కథలను, వాటి తాత్త్వికతనూ మనం అంగీకరించకపోవచ్చును. అది మనిష్టం. కథలను మాత్రం సృజింపక తప్పదుకదా? ఆపని కానిద్దాం.
బ్రహ్మమానస పుత్రుడైన సూతమహర్షిని శౌనకాదిమునులు, స్వామీ! క్షేత్ర దైవత తీర్థములనదగు యీమూడూ సమప్రధానంగల క్షేత్రమేది? అని ప్రశ్నిస్తారు. ఆయన దీనికి జవాబుగా అగస్త్యముని విషయం చెబుతాడు. ఆయన వింధ్యను కట్టడిచేసి దక్షిణ భారతానికి రావడం, కొల్హాపురి లక్ష్మీదేవిని పూజించడం, తర్వాత తుంగభద్ర దాటి కుమారస్వామి మలకు రావడం, స్వామిని మహర్షి క్షేత్ర దైవత తీర్థములు ఒకేచోట సమప్రాధాన్యత గలదా? యని అడుగగా కుమారస్వామి యీవిషయం ఈశ్వరునే అడుగవలయునని కైలాసమువెళ్ళి పార్వతీసమేతుడైన శివుని గలసి అడగటం, ఆయన పండరియే అట్టి స్థలమని తెలుయజేయటం జరుగుతుంది. ఆతర్వాత నారదుడు కూడా వచ్చి శివునిద్వారా విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. శివుడు అగస్త్య షణ్ముగ నారదులకు చెప్పిన పౌండరీక క్షేత్ర మహిమల కూర్పే యీ పాండురంగమహాత్మ్యము. శివుడు వేరువేరుగా అగస్త్యకుమారస్వాములకూ, నారదునకూ, పార్వతికి చెప్పుటవలన కథలు పునరుక్తములైనవి. గ్రంథము పేరు ఆశ్వాసాంతమున పాండురంగమహత్మ్యమని పేర్కొనెను. కానీ కృతిభర్త కోరికగా
కం: యశము కలిగించు నీ మృదు
విశదోక్తుల బౌండరీకవిభు చరిత్ర చతు
ర్దశభువన విదితముగ శుభ
వశమతి నాపేర నుడువు పరతత్త్వనిధీ-- యనిపించినాడు.
అంతేగాక, నాయొనర్పంబూనిన పౌండరీక మహాత్త్యంబునకు కథావిధానంబెట్టిదనిన అని తొలుతనే నుడివినాడు. కనుక దీనిని పౌండరీకమహాత్త్మ్యమనికూడా అనవచ్చును. అనగా పుండరీకునకిందు ప్రాధాన్యమున్నది. పుండరీకుడు భక్తితో మాతాపితలను సేవించినవాడు. అతడు
సీ: తనువుతో జరియించు ధర్మదేవతబోలె
మొలపున వనవాటి కలయదిరుగు
గణనమీరిన శౌరి గుణముల హృదయసం-
పుటినించుక్రియ విరుల్ బుట్టబెట్టి
తనకు పవిత్ర వర్ధనమె కృత్యంబను
కరణి నూతన కుశోత్కరముముల గూర్చి
యపవర్గ ఫలసిద్ధి హదనైన జేపట్టు-
కైవడి బహుఫలోత్కరములొడిచి
తే: యోగయాగంబు సల్పుచో నూర్మిపశుని-
శనమొనరించుటకు యూపసమితి దెచ్చు-
భాతి సమిధలుగొని మహాప్రాజ్ఞుడతడు
వచ్చు లేబగటికి నిజావాసమునకు
అనును. ఇక్కడ ఊర్మి పశునిశనమన షడూర్ము లైన జరామరణములు, క్షుత్పిపాస, శోకమోహము లనే పశువుల బలి యని యర్థము.
సీ: చలిచీమనేనియు జాదొక్క శంకించు
పలుకడెన్నడు మృషాభాషణములు
కలుషవర్తనులున్న పొలముపొంత జనడు.
కలిమికుబ్బడు లేమి గలయదాత్మ
దలయెత్తిచూడ డెవ్వలన పరస్త్రీల
ధైర్యంబువిడడెట్టి ధర్దరముల
నొరుల సంపదకునై యుపతసింపడు లోన
నిగమ ఘంటాపదైకాద్వనీన బుద్ధి
తే: మిన్నకయె చూడడాకలిగొన్న కడుపు
సర్వభూతదయోత్సవమొనర్చు
నిగమ ఘంటాపదైకాద్వనీన బుద్ధి
బ్రహ్మ విద్యానవధ్యుండు బ్రాహ్మనుండు.
అని కొనియాడినాడు. పెద్దన ప్రవరాఖ్యునకు దీసిపోని గుణములు గల వానిగా పుండరీకుని తీర్చిద్ధినాడు.
అనేక కార్యముల నిర్వహణ నిమిత్త మవతరించినాడు శ్రీకృష్ణుడు. అందులో పుండరీకముని ననుగ్రహించుట గూడా ఒకపనియైనది పాండురంగమహాత్మ్యమున. అతని తపమునకు మెచ్చి, అతని కోరికప్రకారం అక్కడే బాలకృష్ణరూపమున చేతులు నడుమున కానించుకొని యిటుకపై నిలచి ఆ క్షేత్రమును పౌండరీకమహాక్షేత్రము గావించినాడు.
కృష్ణావతారమున ఆయన సంతోషమునకై బ్రహ్మ శక్తిని భూమికి పంపినాడు. ఆశక్తి నందుని మరిందియగు శతగోపుని పుత్రి రాధగా జన్మించినది. ఆమె ఆరు ఋతువులలో కలుగు ప్రకృతిక్లేశములకోర్చి ఋణవిమోచన తీర్థమున గోవర్దనగిరి చెంత తపమాచరించి శరదృతువున కృష్ణుని ప్రత్యక్షమొనరించుకొని తనప్రేమలు పంచినది. సందర్భానుకూలముగా రాధను, ఋతువులనూ కవి హృద్యముగా వర్ణించినాడు... రాధ
కం: వలరాజు కేలి వాలుం
బలుకయుబలె నలరు వేణి పాణింధమమై
లలితాంగి వెన్నుపట్టియ
తళతళమను కుందనంపు దగడున్ దెగడున్.
శా: ఈ ధారన్ భునైక మోహన కళాహేలా విలాసంబులన్
రాధాకన్యక ధన్యకాంతి దనరారన్ దద్వశాశారతిన్
గోధుర్బాలక దివ్యమూర్తియగు శ్రీగోవిందుడంభోజినీ
మాధుర్యంబున కగ్గలించు నళిసమ్రాడాకృతిం గైకొనున్.
ఇంకా..
తే: వాసుదేవ నానాశక్తి వైభవంబు
రుక్మిణిసత్యభామల రూపురేఖ
యిదియె వహియించెనని నల్వయిడిన పదనొ-
కంటి లెక్కన కనుబొమ్మ లువిదకమరు.-- అంటాడు.
రధాదేవి మన్మథుని కత్తీ డాలై మెరిసిందట. అదేవిధంగ భువనైకమోహన కళా హేళావిలాసినియైన రాధ పువ్వై, అందలి తేనియ కాకర్షితమైన గండుతుమ్మెదయైనాడట కృష్ణుడు. అంతేగాదు ఆమె కన్బొమలు తెలుగులో ౧౧ గా అమరాయట ఆ పదకొండును మనం వసుదేవుని నవశక్తులైన ఇచ్చా, జ్ఞాన, క్రియా, ఉత్సాహ, ప్రభుత్వ, మంత్ర, సత్త్వ, రజ, తమః శక్తులు, మరిరెండు రుక్మిణీసత్యభామల రూపురేఖలు కలసి పదకొండై రాధ కనుబొమలయ్యాయట. ఇటువంటి అద్భుత వర్ణనలకు కొదువేలేదు పాండురంగమహాత్త్మంలో. పండరి ద్యైతక్షేత్రం. వారు రాధాదేవి ప్రణయము నొప్పుకొనరు. కానీ రామకృష్ణుడు విశిష్టాద్యైతుడు. అందులో తెంగలతెగయో వడగలతెగయో సరిగాతెలియదు. తెంగలయని నారాయణాచర్యులు, వడగలయని అనంతకృష్ణశర్మతెలిపినారు. ఏదియేమైనా రామకృష్ణునకు ఆ పట్టింపులు అంతగలేవని తేలినది.
పాండురంగమహాత్త్మంలో అనేక భక్తకథ లున్నవని ముందుగనే అనుకొంటిమి. అందులో ఒక భక్తురాలు కలదు. ఆమె స్వామికై కుండలతీర్థమున తపించినది. అశ్వత్థ రూపమున నరసింహు డక్కడున్నాడు. స్వామి ప్రత్యక్షమైనంతనే ఆమె, కాళ్ళపై బడినది. ఆమెకేశబంధమాసమయమున విడిపోయినది. స్వామి కనికరించి ఆప్రదేశమును ముక్తకేశినీ క్షేత్రముగా వెలుగొందజేసి, ముక్తకేశినికి మోక్షమొసంగినాడు. ఈవిధంగా తపించి మోక్షమొందిన భక్తులేకాదు. ఏదో కాకతాళీయంగా జరిగిన సంఘటనలకుగూడా యిక్కడి స్వామి సేవగానే స్వీకరించి గోవు, కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగలకు ఉత్తమమనదగు మానవజన్మ ప్రసాదించి, తర్వాత ఉత్తమగతులు కల్పించినాడు. అంతగొప్పదనంగలదీ క్షేత్రం. ఆవు మురళీగానం వింటూ పాలుకార్చింది. అందులో ఒక బిందువు గాలివాటమున స్వామిపైబడినది. ఆగోవు క్షీరాభిషేక పుణ్యము వడసి సుశీలయను భక్తురాలై పుట్టింది. కాకి దాని రెక్కలగాలివల్ల గుడి శుభ్రమైనది. అదిఒక పుణ్యకార్యమై మరుజన్మలో సుశీలకొడుకై పుట్టింది. హంస కొలనిలోమునిగి నీటిని గుడిలో విదిల్చినది. దానితో గుడి స్వచ్ఛమైనది. దానికి ప్రతిగా అదియూ సుశీలకొడుకైనది. చిలుకదాని యజమానురాలైన హరిదాసి ముత్యాల హారము గొనిపోవుచుండ గుడిప్రాంగణమున జారిపడి ముత్యాలురాలి అవి ముత్యాలముగ్గయ్యెను. ఆపుణ్యమునకు అదియూ సుశీల కొడుకయ్యెను. పాము యెలుకను వెంబడించి అన్యాపదేశముగా స్వామిపైనున్న మొగలి పువ్వు సువాసననాఘ్రాణించి సంతసమున పడగవిప్పియాడెను. దాని పడగపైనున్న రత్నకాంతులు దీపకాంతులైనవి. అదీ సుశీల పుత్రుడయ్యెను. ఇక తేనెటీగ. ఇది స్వామిని పూజించిన తీర్థం పువ్వుపై బడగా ఆతీర్థాన్ని మకరందంతో సహా త్రాగింది. దానికి తీర్థసేవన పుణ్యంగలిగి, సుశీలకొడుకై పుట్టింది.
ఇలా మనుజజన్మమెత్తిన సుశీల వద్దకు వటువు రూపమున స్వామి బిక్షాటనకువచ్చి, చద్దన్నముతిని, యింకా ఆకలి తీరలేదంటే తనఆహారాన్నీ, తుదకు తనభర్తకై దాచిన ఆహారాన్ని కూడా పెట్టి పరీక్షలో నెగ్గింది. స్వామి ఆమె భక్తికీ పాతివ్రత్యానికి మెచ్చి, కఠినుడైన ఆమె భర్తను సజ్జనునిగా మార్చి కడకు సాయుజ్య మొందునట్లు వరమిచ్చినాడు.
ఉ: తాళి విభుండు గట్టిన మొదల్ పతి దేవత. యా సుశీల పెన్
గోలతనంబునన్ మగడు కొట్టిన దిట్టిన రట్టుపెట్టినన్
దాళి దినంబు దచ్చరణ తామరసంబులు గొల్చు నేలయున్
బోలునె యీపెకంచు గృతబుద్ధులు వృద్ధులు ప్రస్తుతింపగన్.
సీ: రూపహీనుడు మహాక్రోధనుడతిలోభి
బద్ధమత్సరు డన్యబుద్ధి మాయి
చంచలస్వాంతుండు సకలబంధువిరోధి
బహుళపదోక్తి లంపటుడు శఠుడు
సంతతావిశ్వాస సస్యప్రరోహుండు.
గర్వపర్వత మస్తక స్థితుండు
కలహాశనుండు కుతర్కక్రియాకుశలుండు.
సంగతోన్మాదోత్తమాంగకుండు.
తే: నగునయేనియు నటువంటి మగనితోడ
కాపురముసేయు సతి దొడ్డ గరిత యగుచు
గడిసికోతలకోర్చి లో విసిగి కొనక
ధాతదూరక తండ్రి చేతకు వగవక
పతిసేవచేసిందట. ధాతదూరుట, తండ్రిచేతకు వగచుట అనుమాటలు ప్రత్యక్షంగా కవి గమనించినవై యుండును. అంతేగాదు ఆమె మును సూర్యుని వేడిమికి తాళి సంసారముచేసిన ఛాయాదేవిగా భాసిల్లినదట. చూడుడు.
శా: ఆ తీవ్రాంశుని వేడికోర్చి మును ఛాయాదేవియుంబోలె స
త్పాతీవ్రత్య గుణాభిరామయగు నా భామాలలామంబు సం
ప్రీతుంజేయు నసహ్యదర్శనములన్ బీర్వీకులంబెట్టు దు
ర్జాతుం వీతదయున్ బ్రియున్ దదుచితాచారంబుల నిచ్చలున్.
ఈ పాతీవ్రత్య లక్షణంబులు ఆకాలనికి గొప్పలైనవేమోగానీ, నేటికి వర్తించవు. స్త్రీవాదులసలొప్పుకొనరు. కానీ కవి ప్రతిభ ఆనాటి ఆదర్శస్త్రీ లక్షణములు మాత్రము గుర్తించదగ్గవి. ఆనాటి కాలానుగుణముగా అట్లు వ్రాయవలసినదేగదా? ఆవిధమైన నడవడితో సుశీలతరించినది. కొడుకులకు హితబోధ చేసినది. వారినీ తరింపజేసినది.
ఈ క్షేత్రతీర్థ మహిమలు మరిన్ని కథలలో విపరీతముగా గొనియాడినాడు కవి. ఒక బోయవానిచేత గాయపడిన జింక యిచ్చటి సంగమతీర్థమునబడి విద్యాధరరాజైనది. వేటాడిన బోయవాడు ఆతీర్థమున స్నానమాడి దివ్యత్వమును బొందినాడు. సుశర్మయను పరమకిరాతుడు యిక్కడి పద్మతీర్థమున నీరుద్రావి పాపరహితుడైనాడు. చిత్రగుప్తుని చిట్టాలో యితని పాపములను సాక్షాత్తూ విష్ణువే తొలగించి వేసినాడు. ధర్మరాజు తనతమ్ములతో సనందుని సహామేరకువచ్చి పండరి దర్శించినమాత్రమున జ్ఞాతుల జంపిన పాపము తొలగిపోయెను. ఈకథలన్నీ గమనించిన యిక కర్మసిద్ధాంతములకు తిలోదకములిచ్చినట్లైపోయెను. ఈ క్షేత్రమువల్ల ఫలిత మనుభవింపకనే పాపముల బాపికొనుట అతిసులభమై పోయెను. ఇక అతిముఖ్యమైన నిగమశర్మోపాఖ్యానమూ అటువంటిదే.
సభాపతియను సద్బ్రాహ్మణుని కొడుకు నిగమశర్మ. నిగమమంటే వేదం. ఇతడు పేరుకే నిగమశర్మ.
సీ: ఉహ్హున హోమాగ్ని యూదనొల్లడుగాని
విరహజ్వరార్తుడై వెచ్చనూర్చు
సంధ్యకు ప్రార్థనాంజలి ఘటింపడుగాని
యెరగు నీర్షాకషాయిత కర్థి
ఆగమవాదంబు లౌకాదనడుగాని
విటవాదములె దీర్చు వేగిలేచి
కంబుకృత్పాదోదకంబు గ్రోలడుగాని
యౌవతాధర శీధు వానిచొక్కు
తే: బుణ్యచిహ్నంబు లపఘనంబున ఘటింప
సిగ్గువడుగాని కరనఖ శిఖర విఖన
జాతనూత్న క్షతాంకముల్ సమ్మతించు
నారజముమీరి యాదుర్విహార హారి.
తే: నిగమశర్మాభిదానంబు నేతిబీర
కాయయునుబోలె నయదార్థ గాథ దాల్ప
వైదికాచార దూర ప్రవర్తనముల
వీటి విహరించు చుండు నవ్వీటి ప్రోగు.
ఇతడు పక్కా తిరుగుబోతు. కులభ్రష్టుండు. వీనిని బాగుచేయుటకు వీని అక్క భర్తాపిల్లలతో వచ్చి నయాన భయానా బుద్ధిచెబుతుంది. ఈమె తమ్మునికి చేసిన హితబోధ గ్రంథమున అతిప్రాశస్త్యము నందుకొన్నది.
సీ: పరమేష్ఠి నుండి నీతరముదాక విశుద్ధ
తరమైన వంశంబు తలచవైతి
దరిద్రొక్కియున్న యీ తల్లిదండ్రులజాల
బఱచవై సంతోష బఱచవైతి
అగ్నిసాక్షిగ బెండ్లియాడిన యిల్లాలి
నిల్లాలితాకార నొల్లవైతి
ధర్మశాస్త్రార్థవిత్తముల విత్తములచే
నలరించి విఖ్యాతి నందవైతి
తే: శీలమఖిలంబు పిల్లిశీలమగుచు
చదువులన్నియు నివి చిల్క చదవులగుచు
దోడివారలు నవ్వ నాతోడయేల
బేలవైతివి యీగుణమేల నీకు.
చం: విడుమికనైన యిట్టి యవివేకము మామకబుద్ధి పద్ధతిన్
నడువుము నీకు గావలసెనా హరికౌస్తుభమైన దెచ్చెదన్
గడుసరి యచ్చకూళ పలుగాకుల వీడుము చేయిమీదుగా
నడచిన పూర్ణకాముడవు నాయనుజన్ముడ నిట్లుసేయదే!
యని మందలించి బుద్ధి గరపిన అక్కమాటవినినట్లు నటించి, ఒకరాత్రి యింటివారిని మోసగించి భార్యసొమ్ములతో, యింటిలోని వారికున్నదంతా సంగ్రహించి పారిపోతాడు. దొంగలబారినపడి సొమ్ముపోగొట్టుకొని దెబ్బలుతింటాడు. ఒకరైతు కాపాడి దగ్గరకుతీస్తే గంగజాతర సంబరాలలో యింటివారు మునిగియున్న సమయము జూచుకొని రైతుకోడలిని లేపుకపోతాడు. ఆమె కొన్నాళకు చనిపోతుంది. ఆతర్వాత అడవిలో ఒక ఆటవికస్త్రీని వశపరచుకొని ఆమెకొఱకు వేటనేర్చి మాంసాహారియై కుదురుగా సంసారంచేసి పిల్లల్ని గంటాడు. ఎవరేమనుకున్నా సిగ్గు లజ్జ లేకుండా తిరుగుతుంటాడు.
ఉ: ఈ కడజాతినాతి కిహిహీ మహీదేవుడు చిక్కెనంచున్
రాకకుబోకకున్ జనపరంపర కెంపగుచూడ్కి జూచి యం
బూకృత మాచరించుటకు బుద్ధి దలంక కలంకముక్త చం
ద్రాకృతి బొల్చు నీముఖమునందమృతస్థితిగాంచి మించుటన్.
అంటూ ఆమె ముఖమునందమృతస్థితి గాంచినాడట. ఏమిరాయిదియని ముఖంపై ఉమ్మినా పట్టించుకోలేదట. ఇటువంటిస్థితిలో ఒకరోజు వేటనుండి రాగానే వాని భార్యాబిడ్డలు యిండ్లు తగలబడి కాలి చనిపోయి వుండటంచూచి వాని మనసు వికలమైపోయింది. అన్నపానదులుమాని నేరుగా పండరిలోని నరసింహక్షేత్రంలో బడి గుడిలోని స్వామినేచూస్తూ మరణించాడు. యమభటులూ హరిభటులూ వచ్చారు. వారిలోవారు వాదించుకొని వాడు పుణ్యాత్ముడేనని హరిభటులు వైకుంఠము తీసుకెళ్ళినారు. ఎంతపాపికైనా మోక్షం ప్రసాదిస్తుందీ క్షేత్రమంటాడు కవి. ఈ క్షేత్రమహిమను ఉమ యెదుట శివుడే ఘనంగా శ్లాఘించినాడు.
ఉ: ఆయదుభర్త నాహలధరానుజు నా నవనీతచోరు నే
బాయనిభక్తితో గొలుతు బ్రత్యహమున్ గృహదైవతంబుగా
నో యరవిందకోరక సహోదరా! చారుపయోధరాడ్యా! ని
శ్రేయసకాంక్ష దక్కితరులు చేరి భజింతురనంగ నేటికిన్ .
అని యీక్షేత్రమహిమను ద్రువపరుస్తాడు. అదీమరి యీక్షేత్ర మహిమ. అంతేగాదు భీముడనగా శివుడు. ఆశివుడు త్రిపురాసురసంహార శ్రమతో చెమటగార్చాడట అది భైమినది యైనది. అదే భీమరథి యై కృష్ణకు ఉపనదిగా పవిత్రతీర్థమై యిచ్చట పారుచున్నది. కనుక యిది పాండురంగక్షేత్రమేగాదు, పాండురాంగక్షేత్రము అంటె పాండుర+అంగ పాడురాంగ, తెల్లని దేహముగలవాడు, శివుడు గనుక శివక్షేతమూ నైనది.
ఇక అయుతనియతులున్నారు. వీరు అగస్త్యమునిశిష్యులు. వీరికి పెండ్లిచేయదలచి గురువు బ్రహ్మపుత్రికలైన గాయత్రి సావిత్రులను తీసుకవస్తాడు. ఆయుతుడు తాను సంసారలంపటములో పడనని తపస్సుకుపోతాడు. నియతుడే యిద్దరు కన్యలనూ వివాహమాడతాడు. ఆయుతునికి బుద్ధిచెప్పనెంచి ఇంద్రుడు వచ్చి హితబోధచేస్తాడు. కానీ వినడు. తుదకు ఇంద్రుడు, కామధేనువును ముసలిఆవు రూపంలో ఆయుతుని ఆశమంలో విడిచి వెళతాడు. ఆయుతుడు ఆగోవు బాధ చూడలేక పోషిస్తాడు. ఒకరోజు విసుగెత్తి దీనివల్ల నాతపం పాడౌతున్నదని ఆవును తరుముతాడు. అది ప్రయాసకులోనై వాధూలమునిని త్రొక్కుతుంది. ముని ఆయుతుడుచేసిన పనికి కోపగించి కప్పవై పొమ్మని శపిస్తాడు. ఆకప్ప పుండరీకక్షేత్రంలో రంగురంగులకప్పగా కొలనిలోజీవిస్తూ వుంటుంది. ఒకరోజు ఆ దేశపురాకుమారి చెలులతోవచ్చి యీ కొలని కప్పనిజూచి దానితో ఆడుకొంటూ ఒక బ్రాహ్మణునిపై విసరివేస్తుంది. భయపడిన ఆ బ్రాహ్మణుడు ఆమెనూ కప్పవుగమ్మని శపిస్తాడు. ఆకప్ప యీకప్ప కలిసి సంసారంజేసి పిల్లలనుగంటాయి. అందువల్ల అనపత్య దోషంపోయి కప్పలు కైవల్యంపొందుతాయి. ఈకథలో సంసారజీవనం విశిష్ఠమైనదని, సన్యాసజీవనం ప్రకృతివిరుద్ధమని నిరూపించినాడు కవి. ఈకథ సమంజసముగా వుందనిపిస్తుంది.
రామకృష్ణునికి హాస్యప్రియుడన్న పేరున్నది. అది కొంతవరకు నిజమేనని పాడురంగమహాత్త్మ్యం నిరూపిస్తున్నది. నిగమశర్మ భార్యబిడ్డల వియోగంలోసహితం
ఉ: ఎల్లరునెల్లచో ధనము లిచ్చి మృగాక్షులగొండ్రు గాని యో
పల్లవపాణి యే పరమపావన వంశము నిచ్చి కొంటి నీ
నల్లనిరూపు నిక్కమని నమ్మి దృవంబదిగాక నేడు వి
ద్యుల్లతికాధికాభినయ దుర్వహమౌట యెఱుంగ నింతకున్.
అంటాడు. నీనల్లనిరూపు నిక్కమనినమ్మి నాపరమపావనవంశము వోలిగా జేసి నిన్ను పొందితి ననడంలో హాస్యమున్నది. నిగమశర్మ తన స్థితిపై తానే హాస్యమాడినాడు. అయినా ఆసమయంలో జాలికంటే హాస్యమే అతికినాడు కవి. అంతేగాదు నిగమశర్మ యిల్లు గుల్లచేసి వున్న సొమ్మంతా దోచుకొనిపోతే
సీ: శోకించు వృద్ధభూసురుడాత్మ పితృదత్త
దర్భముద్రికకు. జిత్తముగలగి
అత్తవారిచ్చిన హరిసు దర్శన పు బే
రునకు ముత్తైదువ నవటబొందు.
క్రొత్తగా జేయించుకొన్న ముక్కరకునై
యడలు దుర్వారయై ఆడుబిద్ద.
జామతవెతనొందు వ్యామోహియై నవ
గ్రహ కర్ణవేష్టనభ్రంశమునకు.
తే: నెంతదుర్బుద్ధి యెంత దుర్భ్రాంతి యహహ
సర్వధనములు నద్దురాచారశీలు
మూచముట్టగు నిలుదోచి యురికి చనుట
యెరుగరోగాక యవ్వేళ యెఱుక గలదే.
కొడుకు పాడై దూరమై పనికిరాకుండాపోయాడే యనిగాక చిన్నచిన్న వస్తువులయిన దర్భముద్రిక, చెవికమ్మలు,ముక్కెరా పోయాయని యేడ్చారట. ఇదిహాస్యమేగదా! ఇక బాలకరూపముననున్న పాండు రంగస్వామిని పట్టుకొని యెన్నియేడ్లు గడచినా వేవేలేండ్ల వెలయుప్రాయంపుగల కొయ్య విఠ్ఠలయ్య యని హాస్యమాడతాడు. ఇలా అనడంతో భక్తిరసభంగం కలుగదా! యని యనుకొనవచ్చును. కానీ రామకృష్ణుడు భక్తిరసంలో మునగడు, మనలనూ మునగనీయడు. ఇట్లే యితని రచన సాగుతుంది. ఈ కొయ్య విగ్రహాన్ని రామకృష్ణుడు చూచియుండవచ్చును. కృష్ణరాయలు అక్కడి విగ్రహం తరలించగా తాత్కలికంగా యీదారుశిల్పం నిలిపి తర్వాత శిలావిగ్రహం నెలకొల్పి యుండవచ్చును. రామకృష్ణుడు
కం: కవి యల్లసాని పెద్దన
కవి తిక్కనసోమయాజి గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ
కవియను నామము నీటికాకికి లేదే?
అనడంలో ఒకరకంగాజూస్తే అనగా గణుతింపంగా వరకు నిలిపి చదివితే, కవియనునామము నీటికాకికి లేదే? నేనూ కవినేనా? అది నీటికాకిని కవి యని పిలిచినట్లే నన్న అర్థము వస్తుంది. అంటే తనపైతానే జోక్ వేసుకొన్నట్లేగదా! ఇటువంతి వింకనూ జూపవచ్చును. కవి హాస్యము సున్నితము. అంతేగానీ మనం వింటున్న హేయహాస్యమితనిది గాదు. ఇతనిపై రుద్దినది మాత్రమే.
కవి తనరచనలో సమకాలీనవ్యవస్థను, కట్టు బొట్టు ఆచారాలను సమయనుకూలంగా వర్ణించినాడు. గా లిగంగల జాతరలలో పర్వదినాలలో ఆడవారి అలంకారాలు చక్కగా వర్ణించినాడు.
సీ: గోర్వెచ్చ చమురటుకొనిరి మస్తకముల.
జలకమాడిరి నిశా మిళిత వారి
కట్టిరి చిఱుతచౌకముల క్రొంబుట్టముల్
కాటుకదిద్దిరి కన్నుగవల
దిద్దిరి సిందూర తిలకంబు బటువుగా
నిక్కుగొప్పులవిరుల్ గ్రుక్కి రర్థి
నింబప్రవాళ మాల్యంబులు వైచిరి
చిట్టిబొట్టు ధరించి రిట్టునట్టు.
తే: దరుణ ధావన ధ గ ధగ ధశన మణుల
హత్తుకొలిపిరి లేత వీఢ్యములడాలు
పర్వదినముల బామర ప్రమద లుదిత
నియమ సంభావనారంభ నిభృత బుద్ధి.
అని తెలిపినాడు. ఇక యువకులతీరు నిగమశర్మ బలదూర్ తిరుగు సందర్భమున వర్ణించినాడు.
చ: తలగడు గంగమర్థనము దౌతపటావరణంబు సంస్కృతో
జ్వల కలమాన్నభోజనము చందనచర్చ ప్రసూనదాయకం
బులు గప్పురపు వీడ్యము భూషణపంక్తులు గల్గి నిచ్చలున్
బులుగడుగంగబడ్డ నునుముత్యము బోలుచు వాలుచుంబురిన్
సీ: కలదులేదను వాదములకోర్చి మీనుమీ
సము వోలెనుండు జందెము మెఱవగ
బహు సంకుమదపంక పాణింధమంబైన
తాళి గోణపుజుంకు నేలజీర
గడలేని వీడ్యంపు గప్పుచుందురు గావి
మోవిపల్లొత్తుల ముసురుదన్న
సానతాకులు గల్గు సూనాస్త్ర శంఖంబు
గతి నఖరేకాంక గళముదనర
తే: సఖులు పరిహాసకులు వెంట జనగ యువతి
భుక్త నిర్ముక్త పరిధాన యుక్తుడగుచు
నగర ఘంటాపథంబున నగుచు దిరుగు
నొఱపుగల ఠీవి జాతిమాత్రోపజీవి.
అదీ ఆనాటి యువకుల ఠీవి.
పాడురంగమహాత్మ్యంలో కవి కొన్ని క్రొత్తపదాలు కల్పించి ప్రతిభచాటినాడు. ఉదాహరణకు శివుణ్ని కద్రూజాంగదుడు, కృష్ణుని మందపోయాండ్ర కూరిమి మిత్రుడు, నాగకన్యలను చక్షుశ్రోత్ర కన్యలు, నారదుని వీణాముని, కౌస్తుభమును నీటికెంపు అన్నాడు. ఎద్దును కొమ్ముతేజు, పశువులద్రోలు కర్రను ధేనుదండమన్నాడు. చక్రాన్ని చుట్టుంగత్తి, కప్పను రాతికొడుకు, బ్రహ్మచారిని గోచికట్టు, జోలెసంచిని క్షుల్లకాశిక్యము అన్నడు యింకా యిటువంటివి చాలానేవున్నాయి.
అడుగులకు మడుగులోత్తు, ఆకుమరంగుపిందె, పొన్నాకుపైతేనె, తనకుబోదు నాకుబోదని, కంపలబడ్డకాకి, తేనెపూసినకత్తి, యేనుంగు మీదనున్నవాని మేరమీరి సున్నమడుగజూచుచున్నారు, వంటి జాతీయాలు విరివిగా వాడుకొన్నారు. అంతేగాక స్వంతపదప్రయోగాలూ చాలానే జేశారు. మాదిరిని మాద్రి అన్నారు. పలుకులవంటి కి పల్కుల్వంటి అన్నారు. నిరుపేదను నిర్పేద, కొలనిలో అనుటకు కొల్నిలో, ఎడమను ఎడ్మ, పొలతుకను పొల్తుక అని వాడారు.
ఇలా ప్రౌఢమైన రచనాతీరు, క్రోత్తపదాలూ, స్వతంత్రసమాసాల కూర్పుతో చదువరులకు చాలచోట్ల అర్థముతెగక తమకుతోచిన రీతిని పాఠాంతరముల కల్పించి అర్థము చెప్పిన సంఘటనలు యీ గ్రంథామున గలవు. మచ్చునకొకటి చూతము.
మాలిని: సరసగుణ రతీశా షట్సహస్రాన్వయేశా
నిరవధిక గుణాబ్ధీ నిత్య సత్యోపలబ్ధీ
హరిహయ సమభోగా యాచమానామరాగా
కరగత నిగమాళీ కావ్యకృత్పద్మహేళీ
అన్నారు. "షట్సహస్రాన్వయేశా" అంటే ఆరువేలనియోగి బ్రాహ్మణేశా అని అర్థం చేసుకోవాలి. ఇక "యాచమానామరాగా" అంటే యచమాన అమర అగా గావిడదీసుకోవాలి. అగా అంటే అగము అంటే చెట్టు లేక కొండ. గమించలేనిది, కదలలేనిది. అమర అగా అంటే దేవవృక్షము కల్పవృక్షము అనుకోవాలి. యాచకులకు కల్పవృక్షము వంటివాడా అన్నది అసలుఅర్థం. ఇది అర్థముగాక ఆ సమాసాన్ని "యాచమానానురాగా" గా మార్చుకొని యావకులపై ప్రేమగలవాడా అని అర్థము వ్రాసినారు. ఇట్టి సవరణలు పాండురంగమహాత్మ్యమునందు అనేకములున్నవి. అంతెందులకు యిది సామాన్య చదువరులకు నిజంగా కొంత కష్టతరమైన గ్రంథమే.
పాండురంగమహాత్మ్యమునకు సంస్కృతానువాదం పూనా భండాకర్ పరిశోధనాలయంలోనూ, కాకినాడ ఆధ్రసాహిత్య పరిషత్తులోనూ లభించుచున్నది. తొలుత యిదే మూలగ్రంథమనుకొనిరి. కానీ రామకృష్ణుని తెలుగు పాండురంగమహాత్మ్యమే అసలుదని తేలినది. మరియొకమాట "పాండురంగమహాత్మ్యం" తెలుగు సినిమాలో అసలీకథలేవిలేవు. కానీ తెలుగు "వైతాళికులు" రచయిత డి.ముద్దుకృష్ణయ్యగారు పుండరీకుడే నిగమశర్మయని వ్రాసెను. తొలి నిగమశర్మ తర్వాత పుండరీకుడుగా పరివర్తన చెందినాడని అతని వూహ కావచ్చును. దీనివలన సినిమాకథకు అసలుకథకు కొంత సామ్యము కుదిరినది.
ఇక రామకృష్ణుని ప్రస్తుతిస్తూ పాండురంగమహాత్మ్యము ప్రౌఢశైలీ నిర్మాణముచేత కైలాసశిఖరము వంటిది. భాషాలో తర్వాతి కవులందరికీ ప్రౌఢీసంపాదన కితని రచన యొరవడియని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారన్నారు. ఆచార్య దివాకర్లవెంకటావధాని వర్ణనావైవిధ్యము భాషాపాటవము కల్పనాచమత్కారమూ వీటిచేత యీకావ్యము చక్కగా హృద్యముగా రూపొందిందన్నారు. ..... నమస్తే!.
ఆవె: విష్ణుభక్తులై, వివేకులై, తృష్ణా వి-
దూరులై, స్వకుక్షిపూరణంబు
సమయసంభృతర్థి సంతృప్తిగాఁ గొని
నడచువారు భయముఁ గడచువారు.
పాండురంగ మహాత్మ్యము- 5-319.
No comments:
Post a Comment