వ్యాసలహరి-1
రచన
పి. సుబ్బరాయుడు
42/490, ఎన్.జి.ఓ కాలనీ
కడప - 516002
సెల్ – 9966504951
v
1. కమనీయం సీతారాములకల్యాణం
శ్లో: శ్రీరాఘవం
దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం
రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు
మరవిందదళాయతాక్షం
రామం
నిశాచర వినాశకరం నమామీ.
శ్రీరాముడు సర్వసుగుణాభిరాముడు. సీత మహాసధ్వీమణి. వీరు
సాక్షాత్తూ ధర్మసంస్థాపనార్థం అవతరించిన నారాయణరమలు. వీరి కల్యాణము జరుపుట, తిలకించుటా
మహాశుభప్రదము,
సర్వపాపనాశ
కరము.
విశ్వామిత్రుడు స్వతహాగా శస్త్రాస్త్ర కోవిదుడు.
తనుయజ్ఞదీక్షలో నున్నందున ఆయుధములజోలికి పోరాదు. కాన దశరథరాజపుత్రులైన
రామలక్ష్మణులను తన యాగమును భంగపరుస్తున్న రాక్షస సంహారానికై వెంటగొనివచ్చాడు.
రామలక్ష్మనులు విశ్వామిత్రునివద్ద మహాస్త్రములు నేర్చి, తాటకను
సంహ రించి, సుభాహుని
వధించి,
మారీచుని
తరిమేశారు. యజ్జము నిరాటంకంగా పరిపూర్ణమయింది. రావణ సంహారానికి కావలసిన
అస్త్రవిద్య నేర్పడానికే విశ్వామిత్రుడీ యజ్ఞం తలపెట్టాడా! అనిపిస్తుంది.
యజ్ఞానంతరం విశ్వామిత్రు నివెంట రామ లక్ష్మణులు బయలుదేరారు. మార్గమధ్యంలో రాముడు
అహల్యా శాప విమోచనంగావించి, గౌతమముని కాపురం నిలబెట్టాడు. ఆ
తర్వాత మిథిలకుచేరవచ్చారు. రామలక్ష్మణుల ముఖాలలో కల్యాణకాంతులు వికసిం చాయి.
శ్రీరామచంద్రుని దివ్యమంగళ రూపంచూచి పురకాంతలు యిలా అనుకున్నారట.
సీ: హరినీలకాంతికి హరువును సకూర్చు
నిబిడ
తనుద్యుతి నెగడువాడు
యజ్ఞరక్షార్థమై యసురుల దునుమాడి
విశ్రుతిగాంచిన
వీరవరుడు
పురవైరికార్ముకవర మెక్కుపెట్టంగ
నాజానుబాహుల
నడరువాడు.
సీతమ్మమోమున
జెన్నొందు వన్నెకు
తిలకంబుదిద్దంగ
దివురువాడు.
గీ: ఎగుభుజమ్ములవాడు మదేభగమన
వైభవమువాడు
సకల దిక్పాలకుండు.
భువనమోహన
రూపుండు పురుషవరుడు
వచ్చుచున్నాడు కనరండు వనితలార!
రమణీయ రామాయణం-బాల- 92.
కం: మనసీతమ్మకు
తగునీ
మనసిజరూపుం డితండు మగువను వలచున్
కనకంపుబొమ్మ వీనిం
బెనగొను
మేఘాంతరాళవిద్యుల్లీలన్. ర.రా-బాల-95.
మన సీతమ్మ బంగారుబొమ్మ. ఈ నీలమేఘశ్వాముని పెండ్లాడుతుంది.
వారిరువురు మేఘమధ్యంలో మెఱుపుతీగవలె చూడచక్కనిజంటౌతుంది. అని మనస్ఫూర్తిగా
శుభంపలికారు. మూడుపురుషార్థములవలె, త్రేతాగ్నులవలె
వెలుగొందుతున్న విశ్వామిత్ర రామలక్ష్మణులను జూచి
జనకమహారాజు వారికెదురేగి, సవినయంగా వారిని
అంతఃపురానికాహ్వానించాడు. తగు మర్యాదలుచేసి, సుందరాకారులూ, యవ్వనులూ, బలవంతులూ,
ఖడ్గధనుర్ధారులూ, సుర్యచంద్రుల
వలె చూడనొప్పు యీ రాలపుత్రులెవ్వరు? మీతో కలసి పాదచారులై వచ్చుటకు
కారణమేమి?
అని
ప్రశ్నించారు జనక మహారాజు. విశ్వామిత్రుడు సర్వం వివరించి మీయింటనున్న
శివకార్ముకాన్ని చూపించండి, రాకుమారులు చూడాలని
ముచ్చటపడుచున్నారన్నాడు. దాని కేంభాగ్యం యిప్పుడే తెపిస్తానని మంత్రులకాజ్ఞాపించి
శివధనస్సును యీ సభామంటపానికి తెప్పించి పెట్టించ మన్నాడు. ఈ లోగ ఆ ధనుస్సు
పూర్వోత్తరాలు ఇలా వివరించారు. విశ్వామిత్ర మునీంద్రా! దక్షుడు నిరీశ్వరీయ యాగం
తలపెట్టాడు. ఆ విషయం మీకుతెలియనిదికాదు. సతీదేవి ఆ యాగంలో అవమానింపబడి, యోగాగ్ని
దగ్ధ యయ్యింది. శివుడు అగ్ర హోదగ్రుడయ్యాడు. ఆ యాగనికి వెళ్ళిన దేవతలపై కోపించి
తలలు తీస్తానని యీ ధనువు చేబట్టాడు. దేవతలు గడగడా వణుకుచూ శివుని పదములపై బడ్డారు.
శివుడు శాంతించి ధనువును దేవతలకే యిచ్చివేశాడు. వారు మా వంశ మూలపురుషుడైన
నిమిమహరాజు చెంత భద్రపరచారు. నిమికి ఆరవ తరము వాడైన దేవరాతుడు దీన్ని గ్రహించి
దీనికి పూజలుచేశాడు. అప్పటి నుండి యిప్పటివరకూ యీ విల్లు మాయింట
పూజలందుకుంటూనేవుంది. మరొక్కవిషయం మీకు విన్నవించాలి. నేను యజ్ఞక్షేత్రాన్ని
శాస్త్రోక్తంగా దున్నుచుండగా నాగేటిచాలులో ఒక పేటిక బయల్పడింది. అందులో ఒక
ఆడుబిడ్డ కనబడింది. నాగేటిచాలులో నాకు దక్కినదిగనుక సీతయని పేరిడి పెంచుకొన్నాను.
సీత బాలికగా యుండగా ఆట్లాడుకొనుచూ తన బంతిని యెంతోబరువైన యీవిల్లునుంచిన పేటిక
క్రిందకు జరవిడుచుకొన్నది. కానీ చాలాసులువుగా నలుగురు చూచుచుండగనే ఆ విల్లుగల
పేటికను ప్రక్కకు నెట్టి బంతినిగైకొన్నది. నిజమునకది అసాధ్యము. అయినా నాబిడ్డ
చాలతేలికగా విల్లును పేటికతోసహా ప్రక్కకు నెట్టినది. కనుకనే, నేను నా
బిడ్డనిప్పుడు యీ విల్లునెక్కుపెట్టగల ధీరునకే యిత్తునని, అదే
వారునాకిచ్చు కన్యాశుల్కమని ప్రకటించి స్వయంవరము నెర్పాటుచేసితిని. కానీ అంతటి
శక్తిమంతుడైన వీరుడు లభింపలేదు. వచ్చిన రాజ కుమారులు
కం: విల్లా యిది కొండాయని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదులగు నృపనందను
లెల్లరు దౌదవుల నుండి రెంతయు భీతిన్.
కం: కొందరు
దగ్గర నోడిరి
కొందరు
సాహసముచేసి కోదండముతో
నందంద
పెనగిపారిరి,
సందులగొందులను
సత్త్వములేమిన్. మొల్ల రా-బాల -72,73.
ఈవిధంగా భంగపడిన రాజులు, తమ్మవమానించుటకే
యీ పరీక్ష పెట్టిరని ఆగ్రహించి నాపై యుద్ధంప్రకటించినారు. వారిని నా బలిమిచే
దండించి తరిమి వైచితిని. అని అంటుండగా విల్లు సభలో ప్రవేశపెట్టినారు. రాముడు తాను
ప్రయత్నింతునా! యనునట్లు మునివైపు చూపు సారించినారు. విశ్వామిత్ర ముని సరియని
తలనూచినారు. జనకమహారాజు అనుమతిగైకొని రాముడు విల్లుసంధించదలచి లేచి నిలబడ్డాడు.
అప్పుడు
మ: ఒక
మున్నూరు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బా
లకరీంద్రము సులీలమై జెరకు గోలం ద్రుంచు
చందంబునన్
సకలోర్వీశుల మిన్నయై విఱిచె దోశ్శక్తిన్
విదేహక్షమా
పకగేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్. భాగ-9-262.
మూడువందల బలాఢ్యులు దెచ్చిపెట్టిన ఆ విల్లును రాముడు
చెరకుగడను యేనుగుగున్న ద్రుంచినంతసులువుగా ద్రుంచినాడు. అప్పుడు వెలుబడిన
ధనుష్టంకారము
కం: ఆ రమణీయ
ధనుష్టం
కారము సీతాకుమారికా కల్యాణ
ప్రారంభ వాద్య నిరవ
ద్వారవమై యెసగె సకల హర్షప్రదమై. రామాభ్యుదయం-4-92.
కం: బ్రహ్మకు
బ్రహ్మయును బర
బ్రహ్మముతానైన దాశరథి విలువిరువం
బ్రహ్మాండ చయము నాద
బ్రహ్మచయంబయ్యె మునివర ప్రియకరమై . రా.భ్యు-4-94.
ఆహా! ఆ ధ్వని కల్యాణప్రారభానికి వాయించిన మంగళ వాధ్యమై
వినిపించిం దట. బ్రహ్మకే బ్రహ్మ రామబ్రహ్మము, గనుక ఆ
ధ్వని మునులకు ప్రీతికరమై, నాదబ్రహ్మమై బ్రహ్మాండము నిండిందట.
జనకమహరాజు అమితానంద భరితుడై, దశరథమహారాజునకు కబురంపి పిలిపించి
ఉత్తరఫల్గుణీ నక్షత్ర యుక్త శుభముహూర్తమున, సకలమునివర, బంధువర్గ
సమక్షమున సీతా రాములతోపాటు జనకుని తమ్ముడు
కుశద్వజుని కుమార్తెలు ఊర్మిళను లక్ష్మణునకూ,
మాండవ్యను భరతునకూ, శ్రుతకీర్తిని శత్రుఘ్నునకూ యిచ్చి వైభవంగా
పెండ్లిజరిపించారు. జనకుడు, రామునకు సీతనప్పగిస్తూ రామా!
కం: ఇక్కన్నెసీత నీకగు
జక్కని సహధర్మచరి యశంబొనగూర్చున్
నిక్కమిది యీమె పాణిని
గ్రక్కునగైకొనుము శుభము గల్గును నీకున్. ర.రా-బాల-25.
అని పాణిగ్రహణం చేయించాడు.
కం: కురిసె
విరిసోన వానలు
దొరసె సుధాంథోవధూ మధుర గానంబుల్
నెరసె దివి దూర్యరవములు
విరిసెన్ మునిమానసారవిందము లంతన్. రా.భ్యు-4-95.
అప్పుడు పూలవర్షం కురిసింది. ఆకాశంలో దేవకాంతలు మధురగానం
చేశారు. మంగళవాయిద్యాలు వాయించారు మునులమానసకమలాలు వికసించాయి. కల్యాణాలు
మహావైభవంగా జరిగాయి.
శ్రీరామునిలోని "రాం" అగ్నిబీజము. అది పాపములను
దగ్ధముచేస్తుంది. అంతేగాదు, "రాం" అను
మంత్రరాజము, సర్వవర్ణధారణము, నిఖిలమంత్ర
ఫలప్రదము. లోకాపాది దోషరహితము, దేశకాల నియమానుపేతము, సత్య
కామము,
శ్రుత్యాభిరామమము, మనుసార్వభౌమము.
కనుక కుల,
వర్ణ, జాతులకతీతంగా
అందరూ జపింపదగిన మహామంత్రము "రామము".
శ్లో: ఆపదామపహర్తారం
దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం.
v
2. దేవుని గడప మన దేవునికడప
ఇది గడప. ఏడుకొండలస్వామిని దర్శించు కోవడానికి వెళ్ళే
భక్తులకిది గడప. గడపైన యీ కడపలో వెలసిన వెంకటేశ్వరుని కడపరాయునిగా కీర్తించినాడు
అన్నమయ్య. తొలుత కడపరాయుని దర్శించే తిరుమలరాయుని దరిచేరడం యీవైపువారి సాంప్రదాయం.
అన్నమయ్య యీ కడపరాయునిపై 12 పాటలు వ్రాసినాడు.
తిరుమల
వరాహక్షేత్రం. కడప హనుమత్‍క్షేత్రం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంవెనుక
ఆంజనేయస్వామి విగ్రహం వుంది. ఈ వెంకటేశ్వరుడు కృపాచార్యుల ప్రతిష్టితుడని ప్రతీతి.
అందుకే కడపను కృపానగరమని కూడా అంటారారు. కృపాపురమే కడపగా మారిందన్నది ఒక వాదన.
క్రీ.శ "టాలమీ" అనే విదేశీ యాత్రికుడు దర్శించి యీవూరిపేరు
"కరిపె" గా వ్రాసుకొనినాడు. ఆ "కరిపె" కడపగా మారివుండవచ్చునని కొందరి చరిత్రకారుల
భావన.
14 వ
శతాబ్ధానికి చెందిన శ్రీవైష్ణవాచార్యులగు వేదాంతదేశికులు యీ స్వామిని నుతించి ధన్యులయ్యారు. హరిహరరాయలూ, బుక్కరాయలు, సాళ్వ
నరసింహరాయలూ,
శ్రీకృష్ణదేవరాయలూ
కడపరాయునికి మడి మాన్యాలూ, ఆభరణాలూ సమర్పించుకున్నారు.
శాలివాహనశకం
1396 లో
మహామండలేశ్వర తిమ్మయదేవ మహారాజు ఉదయగిరి సీమలోని ఒక గ్రామరాబడిని యీ గుడికి
వ్రాసిచ్చి నాడు. క్రీ.శ 1476 లో మహామండలేశ్వర
ఓబులరాజు యీ గుడికి మాన్యము లిచ్చినాడు. యిదే సంవత్సరము చిన్న అహోబళరాజు స్వామి
పూదోటకై భూదానంచేసినాడు. మరి నలుగురు భక్తులు కూడా యీసంవత్సరమే స్వామివారిగుడికి
భూములు మాన్యములుగా వ్రాసిచ్చినారు. శా.శ 1484 లో నంద్యాల అహోబలేశ్వరదేవ మహారాజు
యీ స్వామి కైంకర్యానికి భూదానం చేశాడు.
శా.శ 1629 లో అరణం
సర్వప్ప స్వామికి కిరీటం చేయించినాడు. ఈ వివరాలన్నీ ఆలయ గోడలపై చెక్కబడి వున్నాయి.
శాలివాహనశకానికి 78 సంవత్సరాలు కలిపితే క్రీస్తుశకమౌతుంది అలా మనం
లెక్కతేల్చుకోవచ్చు.
విశాలమైన
యీ ఆలయమందలి శిల్పము రమణీయంగావుంది. స్వామిసన్నిధి లో నున్న మంటపము విజయనగర రాలులు
కట్టించినారు. యిందలి తాండవ గణపతి విగ్రహమునకు ఒక ప్రత్యేకత వుంది. గణపతి పార్వతీ
నందనుడు. శైవసంబంధీకుడు, కనుక అడ్డనామాలు అనగా
విభూదిరేఖలుండాలి. కానీ యీ గణపతికి నిలువునామాలుండటం అదే ఊర్ధ్వపుండ్రాలుండటం
విశేషం.
ఆలయగోపురం
మట్లిరాజుల కాలంలో పునర్నిర్మితమైనది. గోపుర ద్వారమున కిరువైపులా రాయల వంశీకుల
శిల్పములున్నవి. ఆలయస్థంభ మొకదానిపై నున్న దంపతుల మూర్తులు ఆలయనిర్మాణం చేసిన రాజ
కుటుంబీకులవిగా భావింపబడుచున్నవి.
ఇచ్చటి
గోపురము తిరుపతి గోవిందరాజస్వామి ఆలయగోపురము ఒకే కాలమున నిర్మింపబడినట్లు
తెలుస్తున్నది. కడప కలెక్టర్ సర్‍థామస్‍మన్రో దొర యీ దేవుని సేవించినట్లు, మరమ్మత్తులకు
సహయము చేసినట్లు చెబుతారు.
చిరునవ్వుల
వెంకటేశ్వరస్వామి ప్రసన్నవదనంతో భక్తులపాలిటి చింతామణియై పూజలందుకుంటున్నారు.
ఆంజనేయమూర్తికి ముందువైపున స్వామివారి మూలవిరాట్టు పడమటి ముఖమై విరాజిల్లుతున్నది.
స్వామివక్ష స్థలముపై కుడివైపున శ్రీవత్సచిహ్నముతో గూడిన శ్రీమహాలక్ష్మి
చెక్కబడివుంది. అందుచేత యీ స్వామిని శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు.
స్వామివారి శిలామూర్తిపై యజ్ఞోపవీతము నాలుగు కంఠాభరణములు సుందరముగా చెక్కబడి
యున్నవి.
స్వామివారి
మందిరమునకు యెడమవైపు శ్రీమహాలక్ష్మీదేవి మందిరమున్నది. అమ్మవారి ఆలయంపైకప్పునకు
రాతి బల్లులు చెక్కబడి యున్నవి. కంచిలోవలె యీ బల్లులు తాకినవారికి
బల్లిపాటుదోషములు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. అమ్మవారి మూర్తి దుండగుల దాడిలో
సుత్తిదెబ్బలకు గురై విరిగిపోయిందట. ఇప్పుడున్న విగ్రహం రెండుమూడు శతాబ్దాలకు
పూర్వం పునర్ప్రతిష్ట జరిగినట్లు చెబుతున్నారు.
విశాలమైన
ప్రాంగణంలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాలమ్మ
మందిరం,
శమీవృక్షం, ధనుర్మాస
మంటపం,
బావి, పాకశాల, రథవాహనశాల, యాగశాల, ఆళ్వార్లసన్నిధి, వాహనమంటపం, అలంకార
మంటపం,
గరుడాళ్వార్లసన్నిధి, తులసీ
బృందావనము,
బలిపీఠము, భరత
మంటపము,
కల్యాణమంటపమూ
వున్నాయి. కల్యాణమంటపము పైకప్పు మరియూ నాల్గువైపులావున్న శిలాస్థంభాలు, భరతమంటపము
చక్కటి శిల్ప కళాఖండాలతో ఆకర్షణీయంగావున్నాయి. ఆలయప్రాంగణమంతటా పెండ్లిండ్లు
జరుగుతుంటాయి. ముహూర్తాలతో సంబంధంలేకుండా అనుదినం యిక్కడ పెండిండ్లు జరగడం ఒక
విశేషం. ఆలయంలోని అధికారిక పురోహితులూ భజంత్రీలతోనే యిక్కడ వివాహాలు జరుగుతాయి.
గ్రామంలోనే వివాహభోజనాలు యేర్పాటు చేసే సదుపాయాలుకూడా వున్నాయి. ఇది అక్కడున్న
కొందరికి ఉపాధికూడా.
ఆలయ
సమీపంలో హనుమత్‍పుష్కరణివుంది. దీనికి నీరు కర్నూల్-కడప కాలువనుండి
వచ్చివెళుతుంది. పుష్కరణిమధ్య నిరయమంటపం కూడావుంది.1930 వరకూ
తెప్పోత్సవాలు జరిగేవి. పుష్కరణిపూడి పోవడం తో పనికిరాకుండా పోయింది. కడప కలెక్టర్‍గా
పనిచేసిన పి.యల్ సంజీవ రెడ్డిగారు కల్పించుకొని తగిన ఆర్థికవనరులనేర్పరచి పుష్కరణి
పూడిక తీయించి బాగుచేయించి తెప్పోత్సవాలు వైభవంగా జరగడానికి తోడ్పడ్డారు. యిప్పుడు
మరింతవైభవంగా ప్రతియేటా తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయం, తిరుమల
తిరుపతిదేవస్థానం వారి అధీనంలోనికి వచ్చింది గనుక, బ్రహ్మోత్సవాలు
కూడా అతివైభవంగా జరుగుతున్నాయి.
చరిత్రప్రకారం
యీ ఆలయం రెండవ శతాబ్దానిదని చెప్పబడతున్నా, పురాణగాథలుమాత్రం
త్రేతాయుగం వరకు తీసుకెళుతున్నాయి. ఇది దండ కారణ్యం కావటంచేత రక్షససంచారం
యెక్కువనీ,
అందుచేత
శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో పలుచోట్ల హనుమంతుని రూపాలు నిలుపుతూవెళ్ళారని, అందులో
ఒకటే యీ ఆలయంలోని హనుమంతుడనీ ప్రజల విశ్వాసం.
ద్వాపరయుగంలో
కురుక్షేతం యుద్ధంతర్వాత కలియుగం ప్రవేశించి, ధర్మం
సన్నగిల్లుతూ వచ్చింది. అది గమనించి కురుకులగురువైన కృపాచార్యులవారు కలియుగదైవమైన
శ్రీవేంకటేశ్వరుని దర్శించుకొందామని విధ్యపర్వతాలు దాటుకొని కాలినడకన తిరుమల
బయలుదేరారు. అలా బయలుదేరి వచ్చిన కృపాచర్యులు, హనుమత్‍క్షేత్రమైన
యీ ప్రదేశంలో అలసి సొలసి నిలచిపోయారు. మహాయోధుడనైన తనకే యింత శ్రమ గలిగితే, యిక
సామాన్యుని గతి యేమని చింతించి, శ్రీవేంకటేశ్వరుని ధ్యానించి యిక్కడే
దైవసాక్షాత్కారం పొందారట. ఆతర్వత ఆయన నిర్ణయం ప్రకారమే యిది దేవుని తొలిగడప
అయింది. తిరుమలరాయడు భక్తులకు నాటినుండి నేటివరకూ కడపరాయుడై తొలిదర్శనమిచ్చి
రక్షిస్తున్నాడు.
ఈ ఆలయ
చతుర్ద్వార గోపుర మహాకుంభాభిషేక మహోత్సవం
06 -06 -1997 నుండి 08 -06 - 1997 వరకు
జరిగింది. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ పరమపూజ్య 45 వ జీయర్ శ్రీమదహోబల పీఠాధిపతులు
శఠకోప నారయణయతీంద్ర స్వాముల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది.
ప్రతిసంవత్సరము
రథసప్తమినాడు వేంకటేశ్వరస్వామి రథంపై ఊరేగింపు, తిరుణాల
జరుగుతుంది. భక్తులు తండోపతండాలుగా యీ తిరుణాలకు తరలి వస్తారు. ఈ ప్రాంతానికే యిది
అతిపెద్ద తిరుణాల.
వైకుంఠయేకాదశినాడు
స్వామివారి ఉత్తర ద్వారదర్శనానికి భక్తులు అర్థరాత్రినుండే బారులుతీరడం గమనార్హం.
పూర్వంనుండి దత్తమండలాలైన కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, బళ్ళారి
ప్రాంతాలనుండి ఆయా ప్రభువులేగాక ఉత్తరభారతదేశంనుండి కూడా రాజులెందరోవచ్చి యీ కడప
రాయని సేవించుకున్న దాఖలాలున్నాయి.
ముఖ్యమైన
పర్వదినాలలో స్వామిని సేవించుకోవడానికి ముస్లిం మతస్తులు కూడా రావడం యిక్కడి
విశేషం.
ఆలయంలో
పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాన్ని పాటించి పూజలూ ఉత్సవాలూ చేస్తారు.
పాంచరాత్ర ఆగమ శాస్త్రం
తపశ్శక్తితో సాధించిన మహనీయనిధులతో నిండిన సంపద, పాంచరాత్ర
శాస్త్రము. దేవాలయ వ్యవస్థకు మూలమైన యీ పాంచ రాత్రాగమం అపూర్వం. వైష్ణవ దేవాలయ
నిర్మాణం యెలా జరపాలి? ఉత్సవాలు యెలా నిర్వహించాలి? అనే
విషయాలను తెలియజేసేదే, యీ శ్రీపాంచరాత్ర శాస్త్రం.
శ్రీమన్నారాయణుడు
మొదట ఐదు రాత్రులలో శ్రీదేవి, బ్రహ్మదేవుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్ణు
సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనునకు "ఏకాయన" మనుపేరున ఉపదేశంచేసినారు. ఐదు
రాత్రులలో చేసిన ఉపదేశం గనుక "ఏకాయన వేదం" పాంచరాత్రమని ప్రసిద్ధి
గాంచింది.
ఈ
ఏకయనశ్రుతి కాలక్రమంలో బహుదా వ్యాప్తి జెందింది. శాండిల్య, జాపగాయన, మౌంజాయన, కౌశిక, భరద్వాజ
మహర్షుల నుద్ధ్యేశించి నిర్విరామంగా రాత్రింబవళ్ళు సర్వేశ్వరుడు యీ శాస్త్రాన్ని
ఐదు రోజులు ఉపదేశించడంవల్ల పాంచరాత్రమైందని ఈశ్వరసంహిత చెబుతోంది.
ఈ
పాంచరాత్రముగాక "వైఖానస" మనునది కూడా ఒక ఆగమమే. ఇదియూ చలా ప్రాచీనమైనదే.
కానీ పాంచరాత్రము స్వయంగానారాయణుడు
బ్రహ్మాదులకు ఉపదేశించడంద్వారా ప్రశస్తమైనది. మహాభారత శాంతిపర్వం దీనికి
ఆధారం. సాక్షాత్తూ భగవంతుడే చెప్పడంవల్ల యిది ఆగమమైందని శ్రీపురుషోత్తమ సంహిత
తెలియజేస్తున్నది.
లౌకిక, అలౌకిక, విషయాలతోపాటు
వాస్తూ,
జ్యోతిష, ఆయుర్వేద, గాంధర్వ, సంగీత, నృత్య, శిల్ప, పాకయంత్ర, మంత్రయోగ, సాంఖ్యాది
శాస్త్రవిషయాలెన్నో యీ ఆగమంలో చర్చింపబడ్డాయి.
కడపరాయుని
ఆలయంలో 1.
మూలబేరము 2.
ఉత్సవబేరం
3. స్థానబేరం 4.
తీర్థబేరం 5.
బలిబేరం 6.
శయనబేరం అను పాంచ రాత్రాగమ షడ్‍బేరముల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇది చాలా అరుదైన విశేషమైన సాంప్రదాయంగా ప్రస్థుతింపబడుచున్నది.
ఆలయానికి
సమీపంలోనే ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, దుర్గాలయం
వున్నాయి. ఈ ఆలయాలన్నీకూడా బాగు చేయింపబడి యిప్పుడు భక్తసందోహంతో కళకళ
లాడుచున్నవి.
చెన్నై-ముంబాయ్
రైలుమార్గంలో కడపస్టేషన్ వుంది. అక్కడనుండి నగరమధ్యభాగానికి రెండు కిలోమీటర్ల
దూరంవుంది. తిరిగీ అక్కడనుండి మూడుకిలోమీటర్ల దూరంలో దేవినికడప వుంది. ఆటోలో
సులభంగా ఆలయంచేరుకోవచ్చు. ఆలయ సమీపంలో గల చెఱువుకు కర్నూల్-కడప కాలువ ద్వారా నీరు
చేరుతుంది. ఈ చెఱువు కట్టను వెడల్పు చేయించి పర్యాటకస్థలంగా రూపొందించాలన్న
కార్యక్రక్రమం ప్రభుత్వ ఆలోచనలో వుంది. ఇది నెరవేరితే యీ పుణ్యక్షేత్రం మరింత
శోభాయమానంగా వెలుగొందుతుంది. ఈ పని తొందరగా కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం.
|| శుభం
భూయాత్ ||
3. మహనీయుడు మన్రోదొర
ఇది సాధికారకమైన కడప గజటీర్ కెక్కిన గ్రామచరిత్ర. కనుక
తప్పక తెలుసుకోదగ్గది. కడప కలెక్టర్ మన్రోదొర పెన్నపేరూరులో గ్రామయినాముల
కాలపరిమితులను పరిశీలించడానికి వచ్చారు. ఊరిలోని పనివాండ్రు మరియు సేవకావృత్తుల
వారి ఈనాములన్నీ పరిశీలించి పునరుద్ధరించినారు. కానీ శ్రీనరసింహస్వామిగుడి ఇనాము
మాత్రం కొనసాగించడానికి తిరస్కరించినారు. కానీ ఆవూరి కరణము, అది
సత్యముగల దేవునికై కేటాయించినదనీ, దానిని
తిరస్కరించవద్దని వేడుకున్నాడు. అయితే ఆదేవుడు కనబడమనుము, పరిశీలించెదనని, మన్రోదొర
గ్రామమునందే ఢేరా వేయించుకొని ఆ గ్రామములోనే ఆరోజు బసచేసినారు. సాయంత్ర మైనంతనే
దొరవారికి గుఱ్ఱపుడెక్కల సవ్వడి వినిపించింది. దొర బటికివచ్చి యెవరా? అని
చూపుసారించెను. ఒక తెల్లటి గుఱ్ఱముపై శ్రీనరసింహస్వామి వేగముగా తనయెదుటనే
వెళ్ళుటను గమనించినారు. కాసేపటికి స్వామీ, గుఱ్ఱమూ
మాయమైపోవుటనూ గమనించినారు. ఆయన తన కనులారా దర్శించిన దైవమును నమ్మి ఇనామును
పునరుద్ధరించి వెళ్ళెను.
ఈ పెన్నపేరూరు సిద్ధవటం నుండి గంగపేరూరు ద్వారా
ఒంటిమిట్టకు వెళ్ళేదారి కి కొద్దిదూరములో తూర్పుదిశలో నున్నది. ఈ గ్రామానికి
ఉత్తరాన పినాకినీ (పెన్నా) నది ప్రవహించడంవల్ల, పవిత్రత
సంతరించుకొన్నది. ఊరికి తూర్పున శ్రీనరసింహస్వామిగుడి, కొండపైన
చిన్నగుహలో వున్నది. కొండదిగువన ఒక కల్యాణమంటపమున్నది. అక్కడొక కోనేరు కూడా
వున్నది. దానిచెంతనే మరొక చిన్నగుడికూడావున్నది. ఇక్కడి కొండరాతిపగుళ్ళ నుండి
ధారగానీరు యెళ్ళవేళల ముప్పై అడుగుల యెత్తునుండి స్రవిస్తూనే వుంటుంది. మంచి
యెండాకాలంలో కూడా యీ ధార యెండిపోకుండా వుండటం ఒక విశేషం.
గ0డిక్షేత్రంలో రెండుకొండలమధ్య ఒక
పసిడితోరణం మన్రోదొర దర్శించి తరించిన విషయం కూడా లోకవిదితం. మన్రోదొర మహనీయుడనీ, ధర్మాత్ముడని
లోకానికి వెల్లడి చేసిన విషయం1915 నాటి సి.ఎఫ్
బ్రాకంబరి కడప గజిటీర్ నుండి గ్రహించి, సవరించిన 1967 గజిటీర్‍లో
తిరిగీ ముద్రించటం గమనించదగ్గ విషయం.
v
4. ఎవరిలోకం
వారిది
శిష్యా! లోకమెట్లుందిరా? అని
దేశాటన చేసివచ్చిన శిష్యుని ప్రశ్నించాడొక గురువు. అందుకు సమాధానంగా శిష్యుడు, గురుదేవా
యెవరికోకంవారిది అన్నాడట. నిజమే యెవరేమి చెప్పినా వినేవాని
గ్రాహకశక్తినిబట్టి అది అర్థ మౌతూవుంటుంది
అంతే. ఒక అర్థంకాని తత్త్వనికి చిత్రాతిచిత్రమైన అర్థాలు వెలువడాతాయి. ఒక
మర్మగర్భిత పద్యానికి ఊహకందని వ్యాఖ్యానాలు పుట్టుకొస్తాయి. నిజానికవి వ్రాసిన కవిని
సైతం ఆశ్చర్య పరుస్తాయి. ఒక మాడరన్ ఆర్టిష్టు కావాలనే అటూయిటూ కొన్ని పిచ్చిగీతలు
కాన్వాస్‍పై గీసి చూద్దాం సందర్శకులేమంటారోనని గ్యాలరీలోవుంచి, మామూలు
సందర్శకులతో కలసిపోయి ఆచిత్రంవద్ద నిలబడ్డాడట. తను కనివిని యెఱుగని, తన
ఊహకందని అర్థాలెన్నో వెలిబుచ్చారట సందర్శకులు. ఆశ్చర్య పోవడం చిత్రకారుని వంతైంది.
ఇటువంటిదే ఓ కథ నా చిన్నతనంలో విన్నాను.
మీరూ వినండిమరి.
ఒకరాజుగారి కొలువుకు ఒక గొప్పపండితుడు, తత్త్వవేత్త
వచ్చి తనతో యే విషయంలోనైనా పోటీపడగలవారు మీ కొలువులోవుంటే వచ్చి పోటీ పడమనండి.
లేకపోతే ఓటమినంగీకరించి, నేనే గొప్పమేధావినని ఒప్పుకొని
సత్కరించి పంపండి అన్నాడట. రాజుగారు ఆస్థాన పండితులవైపు చూశాడట. వచ్చినవాని
వాగ్ధాటి దర్పం చూసి పండితులెవ్వరూ ముందుకు రాలేదట. రాజు పరిస్థితి గమనించి రేపు
మీసవాలునెదుర్కుంటాం. అప్పటి వరకూ మాఅతిధి గృహంలో విశ్రాంతి తీసుకోండి, అని
పంపించాడట ఆపండితున్ని.
రాజుగారు మంత్రిని పిలిచి, మనగౌరవం
నిలబడే మార్గమేలేదా? అంటూ ఆలోచించారు. ఆలోచించి ఆలోచించి యిక లాభంలేదని, చివరకు
ఒక ప్రయోగం చేయాలనే నిశ్చయానికొచ్చారు. ఊరికే ఓటమినంగీకరించడం కంటే ఓ ఉపాయంతో మన
అదృష్టాన్ని పరీక్షిద్దామని, గంభీరంగా కనబడే ఒక పామరుని రంగంలోనికి
దించాలనుకున్నారు. వెదికి ఒక గొర్రెలకాపరిని యెంపికచేశారు. అతడు గంభీరంగా
వున్నాడు. కానీ ఒకకన్నులేదు. అయినా యితడేమేలని, అతనికి
గొప్పపండితుని వేషం వేసి, మరుసటిరోజు సభా ప్రవేశం చేయించి ఒక
ఉన్నతాసనంపై కూర్చొండబెట్టారు. సవాలువిసిరిన పండితుడు సభలోనికి రాగానే యితన్ని
చూసి జడుసుకొన్నాడు. అంత గంభీరంగావున్నాడు యీ వేషగాడు. ఇక యిద్దరూ యెదురెదురుగా
కూర్చొ నేట్లు యేర్పాట్లుచేసి, పోటీ ప్రారభిస్తామన్నారు రాజు.
సరేనన్నారు పోటీ దారులు. బహుజాగ్రత్తగా విషయనిర్ణయం చేశారు రాజుగారు. పండితు
లిద్దరూ నోరుతెరచి మాట్లాడరాదు. కేవలం సైగలూ సంజ్ఞలద్వారా మాత్రమే వారి వాదన
సాగాలి. అంటే కేవలం మూగభాష ద్వారా వాదనన్నమాట. రాజు వాదన మొదట సవాలువిసిరిన
పండితున్నే ప్రారంభించమన్నాడు.
పండితుడు చేయిపైకెత్తి ఒక చూపుడువ్రేలు మాత్రం చూపాడు.
దానికి సమాధానంగా ఒంటికన్ను మిటకరించి యీ పండితుడు రెండువ్రేళ్ళు చూపాడు. అవతలి
పండితుడు కొంత ఆలోచించి తలూపి మూడువ్రేళ్ళు చూపాడు. ఇక పండితవేషగాడు లేచి
చేయిపైకెత్తి పిడికిలి బిగించాడు. అంతే యేమర్థమైందో యేమో ఆపండితుడు లేచి
నమస్కరించి ఓడిపోయానని ఒప్పుకున్నాడు. సభంతా ఒక్కసారి అశ్చర్యంతో నిండిపోయింది.
తర్వత కరతాళద్వనులతో మారుమ్రోగిపోయింది.
రాజు పరమానందభరితుడై ఒంటికంటి జానపదునకు ఘనసత్కారం
గావించి వంద బంగారు మొహరీలు బహూకరించి వెంటనే పల్లెకు పంపించివేశాడు. వచ్చిన
ఘనపండితుడు రాజుకు నమస్కరించి వెళ్ళివచ్చెదనని బయలుదేర బోయాడు. రాజు అతనిని
ఆగుమనిచెప్పి,
తగిన
మర్యాదచేసి,
పండితోత్తమా!
మీరు యే విషయమై వాదోపవాదములు చేసిరో మాకుకాస్తా అర్థమైయ్యేట్లు వివరించండని
అడిగాడు.
అప్పుడా పండితుడు మహారాజా! మామధ్య గొప్పతాత్త్విక
వాదోపవాదమే జరిగింది. నేను దేవుడొక్కడేనని అద్వైతభావనతో ఒకవ్రేలు చూపించాను.
మీపండితులవారు,
అలా
యెలా యేకపక్షంగా నిర్ణయిస్తారు. దేవుడూ జీవుడూ యిద్దరూ సనాతనులే నని ద్వైతవాదాన్ని
లేవదీశారు. అప్పుడు నేను అలా వాదనకొస్తే దేవుడూ జీవుడూ ప్రకృతీ కూడా మూడూ
వున్నాయనవలసి వస్తుందని విశిష్టాద్వైతం తెలియజేశాను. మీపండితుడిక లాభంలేదని, యీవాదనలు
ప్రక్కనబెటండని,
ఒకటిలేదు
రెండూలేదు మూడసలేలేదు. ఉన్నది శూన్యం. అదే భూమా,
అంతేనంతేటూ పిడికిలిమూసి శూన్యవాదాన్ని ప్రకటించాడు. ఇక వారితో వాదించలేమని, ఆయనవాదంముందు
యే వాదమూ నిలువదని గ్రహించి ఓటమి నంగీకరించాను. ఇది మహారాజా మీపండితుని ప్రతిభ, అని
వివరించి సెలవుగైకొని వెళ్ళిపోయాడా పండితుడు. రాజుగారు ఔరా! మనవాడు యింత
వాదనచేశాడా అనుకొని అబ్బురపడ్డాడు.
మరునాడు ఒంటికంటి గొర్రెలకాపరిని పిలిపించి మహారాజు, నీవూ
ఆపండితుడూ యేం చర్చించుకున్నారో చెప్పుచూద్దాం అనడిగారు. యేముంది మహారాజా! అతగాడు
నీకున్నది ఒకకన్నేగదా అని నన్ను గేలిచేస్తూ ఒక వేలు చూపించాడు. సరె..సరె నీకు
రెండుకళ్ళుంటే మాత్రం ఒకటి రెండుగా కనబడ తయా? అని
రెండు వేళ్ళు చూపించాను. అతడు దానిదేముందిలే నీఒకటి నా రెండూ కలిసి మూడైనాయిలే అని
మళ్ళీ యెగతాళి చేసినాడు. ఇక నేను ఊరు కోలేక మారాజ్యానికొచ్చి నన్నెగతాళి చేస్తావా? గుద్దుతే
ముద్దయి పోతా వని పిడికిలి బిగించాను. అంతే బెదిరిపోయాడు. ఓడిపోయానని
తోకముడిచాడు. తప్పుంటే క్షమించండి
మహారాజా! అంటూ వివరణ నిచ్చాడు, మన యేకాక్షి. రాజుకు మంత్రికి
సభలోనివారికీ నోటమాట రాలేదు. ఔరా! వీడనుకున్న దేమిటీ, ఆపండితుడూహించిందేమిటి, యెంతచిత్రం
అనుకున్నారందరు.
అదండి కథ . కొంతమంది వేషగాండ్రు బాబాల అవతారమెత్తి అనేక
వికృత చేష్టలు చేస్తుంటారు. అంటే కనిగ్రుడ్లు చిత్రంగా త్రిప్పడం, గాలిలో
చేతు లూపడం,
పిచ్చిపిచ్చి
అర్థరహితవ్యాఖ్యలు చేయటం, వెలికివవ్వులు నవ్వడం, దిగంబరులై
తిరగడం చేస్తుంటారు, అవిచూసి కొందరు పండితులు వారి మాయలోబడి, వారి
వికృతచేష్టలకు వేదాంతార్థాలు చెబుతూ, వారు
మోసపోవడమేగాకుండా జనాన్నీ తప్పుద్రోవపట్టిస్తారు. కాస్తా ఆలోచించండి.
జాగ్రత్తగావుండండి.
నమస్తే!
5. వృద్ధాప్యం
వృద్ధాప్యాన్ని సామాన్యంగా శాపంగానే భావిస్తాం. కానీ
వృద్ధుల పాదాలంటి దీవెనలకై ప్రార్థిస్తాం. మరి వృద్ధులు శాపగ్రస్తులైతే, అట్టి
శాపగ్రస్తుల దీవెనలకు విలువలేదు గదా? కనుక యీ విషయం కొంత
విచారించదగ్గదే. అందుకు మనపురాణాలేమంటున్నాయో గమనిద్దాం.
శా: కాంతాహేయము, దుర్వికారము, దురాకండూతిమిశ్రంబు
హృ
చ్చింతామూలము, పీనసాన్వితము, ప్రస్వేదవ్రణాకంపన
శ్రాంతిస్ఫోటకయుక్తమీ
ముదిమి. వాంచ్ఛం దాల్చి నానా సుఖో
పాంతంబైన
వయోనిధానమిది యయ్యా తేర యీవచ్చునే?
అంటాడు యదువు.
ఆడువారు అసహ్యించుకుంటారు, ఆకారం వక్ర మౌతుంది, శరీరంలో
దురదలు కలుగుతాయి, చింతలు క్రమ్ము కుంటాయి, ఆయాసంకలుగుతుంది, దుర్వాసనగల
చెమట పోస్తుంది,
కురుపులు
లేస్తాయి,
వణుకు
వస్తుంది,
దేహంపై
స్పోటకపుమచ్చలు వస్తాయి. ఇటువంటి జరాభారాన్ని తీసుకొని, సకల
సౌఖ్యాలకూ ఆలవాలమైన యవ్వనాన్ని, తేరగా యెవరిస్తారయ్యా? అని
తండ్రియైన యయాతి మహారాజుతో అంటాడు.
యయాతి శుక్రాచార్యుల అల్లుడు. తనకూతురు దేవయాని యుండగా, దాస్యముచేయుచున్న
శర్మిష్ఠనుగూడి పుత్రులవడసిన అల్లుని ముసలి వాడవగుమని శపించినాడు. తదుపరి శాంతించి, ఒకవెసులుబాటు
కలిగించినాడు. నీపుత్రులలో యెవరైనా నీ ముసలితనం తీసుకొని, తనయవ్వనం
నీ కివ్వవచ్చునన్నాడు. యయాతి పుత్రులనాశ్రయించినాడు. ఆ సందర్భములో అగ్రతనూజుడూ, దేవయాని
తనయుడైన యదువు పలికిన పలుకులే పై పద్యము. సరే తదనంతరం శర్మిష్ఠకొడుకైన పూరుడు తన
యవ్వనం ధారపోసి ముసలితనం తను గ్రహిస్తాడు. అది తదనంతర కథ.
ఇక్కడ మాత్రం యయాతికి ప్రాప్తించిన ముసలితనం శాపకారణమే.
అది సహజంగా వచ్చిన ముసలితనంకాదు. కనుక సహజంగా వయస్సుపైబడి వచ్చిన ముసలితనం
శాపమనడానికి వీలులేదు. కానీ ముసలితనం దుర్భరం కాబట్టి శాపంగా భావిస్తున్నాం.
దుర్భరం కాబట్టే శుక్రుడు అట్టి శాపమిచ్చాడు
మరి. ముసలితనాన్ని భాగవతంలో కాలపుత్రికగా
వ్యావహరించబడింది. ఈ కాలపుత్రిక యయాతికుమారుడైన పూరుచేత వరింపగాబడి, వలనొప్ప
అతనికి వరమిచ్చి, విడచి వెళ్ళినదట. అంటే జరాపీడితుడైన పూరుడు
కనిష్ఠుడైనప్పటికిని రాజ్యార్హత పొందడమేగాక కాలపుత్రికనుండి వరము కూడా పొందినాడు.
అంటే వృద్ధాప్యం వరదాయకమనికూడా గ్రహించ వలసివుంది.
ప్రస్తుతవిషయమే కాబట్టి యీ కాలపుత్రిక (ముసలితనం) గురించి
కూడా కొంత తెలుసుకొనవలసి వుంది. "దౌర్భాగ్యవశత నొంది ప్రఖ్యాతిగనుట దుర్భగ
యను పేర బరగు" నట. ఈ కాలపుత్రిక బ్రహ్మలోకంనుండి దిగివచ్చి, పూరుమహారాజును
వదిలివేసిన తర్వాత నారదముని వద్దకు వెళ్ళి నాతో జతకట్టమని కోరినదట. అందుకు నారదుడు
భయపడి నిరాకరించినాడట. కాలపుత్రికకు కోపమువచ్చి, "మదీయాశా
విముఖుండవైన నీకు ఒక స్థానంబున నిలకడ లేక తిరుగుచుందువుగాక!" అని శపించినదట.
అందుకే నారదుడు సదాసంచారియైయ్యాడట. నారదుడు ముసలితనాన్ని కాదన్నందుకు
శాపగ్రస్తుడవటం గమనించదగ్గ విషయం.
తర్వత కాలపుత్రిక భయుడు, ప్రజ్వారుడు
అనువారితోకలిసి,
తనువారికి
సోదరియై పురంజనుని వరించి, వాని పురాన్ని దహించి బయటకు
లాగివేసింది. అంటే మనిషికి ప్రతీకయైన పురంజనున్ని భయము, జ్వరముతో
కలిసి వృద్ధాప్యం ఆక్రమించి కడకు శరీరమనే పురంనుండి పెగలించి మరణానికి
గురిచేసిందని భావం. ముసలితనం భరింపరానిదని, శాపమని
భావిస్తాడు. కానీ ఆదురవస్థ నుండి బయటపడి చావడానికి మాత్రం ఒప్పుకోడు.
కం: తనపుత్రులు తనపౌత్రులు
ననయముదా
జనిన యెడ నిరాశ్రయులనుచున్
వననిధి
మధ్యంబున నవి
సిన
కలముంబోలె నెట్లు జీవించెదరో!
అని పెనుగులాడుతాడేకాని శరీరాన్ని విడవటానికి ససేమిరా
అంగీకరించడు. కొడుకులు. మనవళ్ళు, తనవారంతా నేనులేకుంటే యేమైపోతారో? సముద్రంలో
పగిలిపోయిననావలోని వారివలె నాశనమైపోతారని దిగులు పడి పోతాడు. నిజానికి అది
యేమాత్రం నిజంకాదు. వాడు పోయిన తర్వత బాగుపడిన సంసారాలెన్నో మనకు లోకంలో
కనిపిస్తాయి. మాయంటే యిదే మరి. ఇవన్నీ మహాభారతంలోని నాల్గవ మరియు తొమ్మిదవ స్కందాల
లో వివరింపబడి యున్నాయి.
మహాభారతంలో భీష్మాచార్యులున్నారు. వారు చాలాకాలము జీవించి
వృద్ధాప్యంలో తను పెంచిపెద్దచేసిన బిడ్డలు, మనుమలు
మాటవినక,
అవాంచ్ఛనీయసంఘటనలెన్నో
చూస్తూ,
నివారించలేక
వూరకుండి పోయాడు. మానసికవ్యధకులోనయ్యాడు. ఇతడూ శాపగ్రస్తుడే. ఉరురత్న రాజిత సుమేరు
మహీధర కంధరంలో వశిష్ఠాశ్రమం వుంది. అక్కడికి అష్టవసువులు భార్యలతో కలసి
వ్యాహ్యాళికెళ్ళారు. అందులో కడపటివాడు ప్రభాసుడు. వానిభార్య ఆశ్రమగోవు నందినిని
చూచింది. అది కామధేనువు కూతురనీ గొప్పమహత్తు కలదని తెలుసుకొన్నది.
ఆ:వె: దీని పాలుద్రావి మానవుల్ పదియువే
లేండ్లు
జరయు రుజయు నెఱుగకమర
భావమున
సుఖంబు జీవింతురటగదే
దీని
నేలగనిన వాడ యెందుబెద్ద.
అని గ్రహించింది. భర్తను బలవంతముగా ఒప్పించి, తనస్నేహితురాలైన
ఉసీనరపతి తనయ జతవతికి యీ గోవును కనుకగా యివ్వదలచింది. భార్యమాటలకు లోబడి ప్రభాసుడు
గోవును ఆశ్రమం దాటించేశాడు. విషయం ఆఖరుకు వసిష్ఠుడు దివ్యదృష్టితో గ్రహించి
అగ్రహోదగ్రుడయ్యాడు. వ్యాహ్యాళికి తన ఆశ్రమం వచ్చిన వసువులందరిని మానవులై
జన్మించండని శపించాడు. వసువుల ప్రార్థనను మన్నించి, అష్టముడైన
ప్రభాసుడు అసలు దోషి గనుక అతన్ని మాత్రం దీర్ఘాయుష్కునిగా వుండనిచ్చి, మిగిలిన
యేడుగురు పుట్టిన వెంటనే మరణించి తమ స్వస్థానములకు చేరునట్లు శాపపరిహారము
సూచించినారు.
కనుకనే వారు గంగాశంతనులకు జన్మించి, గంగచేత
మొదటి యేడుగురు పుట్టిన వెంటనే గంగలో విడువబడి మరణించినారు. అష్టముడుమాత్రము భీష్మ
నామధేయమున మహాభారతమున ముఖ్య భూమిక నిర్వహించినాడు. తను ప్రభాసుడుగా చేసిన
మునిద్రోహము భీష్ముడై జన్మించి వ్యధలపాలైనాడు.
అనగా బహుకాలము జీవించి వృద్ధుడై మానసిక శారీరక క్షోభ ననుభవించడంద్వారా
తన పాపమును కడిగివేసుకున్నాడు. తద్వారా స్వచ్ఛతనొంది తరించాడు. అంటే వృద్ధాప్యము
మన తొలిపాపములను బాధలరూపమున అనుభవించుటద్వారా ప్రక్షాళన గావించుకొనుటకు మన
కొసగబడిన మంచిసమయమన్నమాట. అప్పుడు అనుభవించడంతప్ప చేసేదేమీ వుండదుగదా! మరోమాటలో
చెప్పాలంటే వృద్ధాప్యం గొప్ప ప్రయోజనకరమైన కాలమన్నమాట. అంటే మన జన్మజన్మలపాపములను
బాపుకోవడానికి భగవంతుడిచ్చిన వరమన్నమాట. ఈ దృక్పదంతో చూడ గలిగే సుమతులకు
వృద్ధాప్యం శాపం కానేకాదు. వారు వ్యధకు లోనైనప్పు డల్లా పరిశుభ్రపడుతున్నట్లు
గ్రహిస్తారు. తద్వారా వారు సంతృప్తినికూడా అనుభవిస్తారు. సంతృప్తమానవుడు
ఒడిదుడుకులను సమర్థవంతంగా యెదుర్కుంటాడు. కలతలతన్ని బాధించలేవుకూడా. జీవనాన్ని
యీవిధంగా మలచుకొన్నవాడు నిజంగా ధన్యుడు.
మాయానిర్మితమైన యీ జగతిసర్వస్వానికి సృష్టిస్థితిలయములు
వరుసగా సంభవిస్తూవుండవలసిందే. మహాప్రళయంలో సర్వం భగవంతునిలో "ఎవ్వనియందు
డిందులీనమై" అన్నట్లు విలీనమైపోతుంది. మనంకూడా భగవంతునిలో లీనంకావాలంటే
మహప్రళయం మాదిరే మనవ్యక్తిగత ప్రళయంకూడా అవసరమైవుంది. ఆవ్యక్తిగత ప్రళయమే
వృద్ధప్యం. జనన మరణచక్రభ్రమణం నుండి బయటపడి భగవస్సాయుజ్యం పొందడానికిది తగిన
తపోకాలం. లేకుంటే మహాప్రళయం వరకూ అవస్తలు పడుతూ వుండవలసిందే. కనుక వృద్ధాప్యంలో
కలిగిన తపనలన్నీ తపస్సులో భాగమని గుర్తించినవారు నిజమైన వివేకులు, జ్ఞానులు.
గౌతమబుద్ధుడు పపంచానికి మూడుహెచ్చరికలుచేశాడు. అందులో
మొదటిది ముసలితనం. "మీరు వయస్సుపైబడి యెనబై తొంబై నూరుదాటి దుర్బలమైన శరీరం
నిలువలేక వంగి వంకరలై ఊతకర్రపై ఆధారపడి, నడవలేక నడుస్తూ, ఆయాసపడుతూ
ఊడినపళ్ళు నెరసినవెంట్రుకలతో, ముడుతలుబడిన ముఖంతో వ్యధజెందుతున్న
మనుజుని చూడలేదా? ఆ దశమ నకునూ కలుగనున్నదని అనిపించడంలేదా? ఇది
తప్పించుకొనవీలులేదని తెలియదా? అంటూ హెచ్చరిస్తారు. తరువాతి
రెండుహెచ్చరికలూ రోగం మరణం గురించి చేసినవి. అవి అప్రస్తుతం గనుక వివరాలలోనికి
వెళ్ళకుండా ఆగుదాం.
ఈ హెచ్చరికలు ఎఱుకతో గ్రహించమని సంసిద్ధులుకమ్మని
మేలుకొలుపు పలికారు బుద్ధభగవానులు. అవి మనపై తమప్రభావము చూపకముందే, జగరూకులమై
వాటిని సంయమనంతో, ఓర్పుతో, శాంతితో
నిబ్బరంగా భరించగల్గిన నిర్వాణస్థితికి సమాయత్తంకావాలని
బుద్ధం శరణం గచ్ఛామి
సంఘం
శరణం గచ్ఛామి
ధర్మం
శరణం గచ్ఛామి. అని ప్రబోధించారు.
కనుక వృద్ధాప్యం వరముగా మార్చుకుంటారో, లేక
శాపమని దుఃఖిస్తారో అది యెవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం. సరియైన ఆలోచనతో
అందరూ చక్కని జీవనం గడపాలని ఆశిద్దాం.
//సర్వేజనా
సుఖినోభవంతు//
6. తప్పెవరిది
కం:
ఇరువర్గంబులవారిని
తరచి
విచారించి తెలిసి ధర్మము నెపుడున్
తరతమభేదములు
మరచి
తిరముగ
పలుకంగవలయు తీర్పది యెపుడున్.
అన్నది ఆర్యోక్తి. ఇరుపక్షములనుండి విషయములు గ్రహించి
పక్షపాత రహితంగా విచారించి తీర్పు ప్రకటించాలి. మనం సామాన్యంగా చూస్తూ వున్నాం.
పిల్లలందరి విషయంలో పత్రికలన్నీ యేకపక్షంగా వ్రాస్తున్నాయి. కొడుకులు విదేశాలకూ, దూరప్రదేశాలకు
వెళ్ళి ధనార్జనకు ప్రాధాన్యతనిచ్చి, తల్లిదండ్రులను గాలికి
వదిలేస్తున్నారని యేకపక్ష నిర్ణయం చేస్తున్నారు. ఇందులో తల్లిదండ్రులు అనేక
యింబ్బందులకు గురౌతున్నారన్నది నిర్వివా దాంశం. కానీ దీనికి కారణం
నూటికినూరుపాళ్ళూ బిడ్డలేనా? అన్నది ఆలోచించదగ్గవిషయం.
లోతుకు వెళ్ళిచూస్తే తల్లిదండ్రుల దోషం కూడా మిక్కుటంగానే
కనబడుతుంది. అసలు పిల్లలు అలాకావడానికి అసలుకారణం తల్లిదండ్రుల పెంపకం. పిల్లలను
బడిలో చేర్పించింది మొదలు వారిపై విపరీతమైన ఒత్తిడిపెంచి, విదేశాలకు
వెళ్ళిడబ్బుసంపాదించగలిగే చదువులే చదవమని బలవంతంచేసి, శక్తికి
మించిన శ్రమకులోనుచేసి, మానసికంగా హింసించి, వానిలో
మానవత్వం మచ్చుకైనా పొడసూపకుండా చేసి, డబ్బుతయారుచేసే
యంత్రాలుగా మార్చింది తల్లిదండ్రులేకదా! ఇట్టి స్థితిలో బిడ్డలనుండి యింతకంటే
యేమాసించగలం.
తే:గీ: ఏది
సత్యమో నిత్యమో యెన్నటికిని
మార్పులేనట్టి స్థితిలోన మనునదేదొ
అదియె
తెలుసుకొనగవలయు నట్లుగాక
విద్యలితరంబు లెన్నైన వృధయె సుమ్ము.
అన్నారు పెద్దలు. డబ్బుసంపాదించే విద్యలు చదవవచ్చు. మంచి
ఉద్యోగము సంపదించవచ్చు. ధనికులు కావచ్చు. తప్పులేదు. కానీ పైపద్యంలో చెప్పిన
అసలువిద్య,
అదే
మానవత్వం,
దైవత్వం
మనిషిలో నింపే విద్యను మరీ దారుణంగా నిర్లక్ష్యంచేయడం వల్లనే అపకారం జరుగుచున్నది.
ఒకసారి నాకుతెలిసిన ఒక తెలుగుబోధకుడు మహాభారతంలోని ధర్మప్రతిపాదితమైన
పాఠంచెబుతున్నాడు. కానీ విద్యార్థులు గంభీరంగా లెక్కలుచేసుకొంటున్నారు. అది గమనించిన
యీ ఉపాధ్యాయుడు,
తన
కఠశోషకు తననే నిందించుకొని బోధించడంచాలించి కూర్చొన్నాడు. పాపం ఆయన పాఠం పిల్లలకు
అనవసరం. వారు కాలం వృధాకాకుండా వారికి కావలసిన చదువు వారు అభ్యసిస్తున్నా రు.
బాగానేవుంది. కానీ మరి వీరికి మానవవిలువలు, నీతి, నియమం, ధర్మం
యెవరునేర్పాలి.
ఆ:వె: తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదాగిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ.
అన్న పద్యం వారి దృక్పథంలో యెలా పడుతుంది. ఇవన్నీ
శేషప్రశ్నలే. ఇంతకూ చెప్పదలచుకున్నదేమంటే తప్పు కేవలం బిడ్డలదేకాదు, తల్లిదండ్రులదికూడా
అని.
దీనికి బలంచేకూర్చే విషయం మరొకటికూడా వుంది. బాధపడుతున్న
తల్లి దండ్రుల నడగండి. యేమండీ! మీబిడ్డ మీకోసం విదేశాలు, విశేష
సంపాదనా వదలి రావాలని నిజంగా కోరుకుంటున్నారా! అని. దీనికి జవాబు దాదాపు
అందరిదగ్గరనుండి లెదనే వస్తుంది. వారిబిడ్డలపై గల మమకారంతో వారు, వారి
బిడ్డలు సుఖంగా ధనవంతులుగా అందరికంటే మిన్నగా వుండా లనే కోరుకుంటారు. అది తప్పుకూడాకాదు. కానీ సమయం
దొరికి నప్పుడల్లా, యితరుల సానుభూతికోసం బిడ్డలను వూరికే
నిందిస్తారు. ఈమాట నూటికి నూరుపాళ్ళు నిజంకాకపోవచ్చు. కానీ యిందులోనూ కొంతైనా నిజ
మున్న
దని గ్రహించాలి.
ఇకపోతే స్వదేశంలో స్వంతయింట్లో వున్న మాతాపితరులుసైతం
బిడ్డలచేత నిరాదరింపబడటం చూస్తున్నాం. దీనికిసైతం ముందుచర్చించినట్లు విద్యా
విధానంలోని లోపమే కారణం. ఆ విషయమట్లుంచి ఆలోచిస్తే
బిడ్డలదే యీ విషయంలో యెక్కువతప్పు కనబడుతుంది. పెంచిపెద్దచేసిన తల్లిదండ్రులయెడ
కొంత ఓర్పు,
సహనం
కనబరచి,
వారిని
ఆదరించడం న్యాయం. అందుకు పెద్దలైన తల్లిదండ్రులు కూడా సహకరించాలి. కొంత
పట్టువిడుపు ప్రదర్శిం చాలి. సంసారం వీధినపడకుండా రెండువైపులనుండి సర్దుబాటు ధోరని
కనబరచాలి.
ఇంకోవిషయం. మనపూర్వీకులు వృద్ధాప్యంలో పూర్తిగా పెద్దరికం
బిడ్డల కప్పగించి వానప్రస్థం స్వీకరించేవారు. సంసారవ్యామోహంనుండి విడివడి అడవిలోని
ఆశ్రమాలలో దైవచింతనతో శేషజీవితం గడిపేవారు. తమతెలివి తేటలూ, నేర్పు
మారిపోయిన యిప్పటికాలానికి ఉపయోగపడవనీ, పిల్లలకు వాటితో
పనిలేదని గ్రహించి, సంసారంలో నిలదొక్కుకొని తమ జీవితం తామే
విజయవంతం చేసుకొనే స్థాయిలో బిడ్డలుండాలని కోరుకొనేవారు.
కాలంమారింది. నేటికది సరిపడకపోవచ్చు. ఆశ్రమాలస్థానే
వూర్లలోనే వృద్ధాశ్రమాలు వెలిశాయి. ఇవి నేటికాలానికి యేర్పడ్డ సౌకర్యంగా భావిస్తే
తప్పులేదు. సాధ్యమైనంతవరకూ బిడ్డలూ, తల్లిదండ్రులూ హాయిగా కలిసి
జీవించాలనే కోరుకొందాం. కానీ అది యేకారణం చేతనైనా కుదరక పోతే, వృద్ధాశ్రమాల
నాశ్రయించడం శ్రేయస్కరం. కుదరకపోవడమంటే, ఒక్కొ క్కప్పుదు
ఆప్యాతలకు కొదువలేకున్నా పరీస్థితులు అనికూలించక వృద్ధా శ్రమాలకు
వెళ్ళవలసివస్తుంది. అప్పుడు మాత్రం అది నేటికాలనికి సమకూరిన గొప్ప సౌకర్యమే
ఔతుంది.
వయసు పైబడిన వారికి వృద్ధాశ్రమాలు ఒకరకంగా బగానేవుంటాయి.
పిల్లలు దూరంగావుండడం బాధాకరమేయైనా, అక్కడుండే సమవయస్కులతో కాలంగడపడం
సంతోషకరమే. సమవయస్కుల ఆలోచనల్లో తేడ లెక్కు వుండవు. దాదాపు సమంగానేవుంటాయి. దాంతో
మంచిస్నేహం యేర్పడు తుంది. స్నేహంకన్నా తియ్యనిబంధం ప్రపంచంలో యింకేముంటుంది
చెప్పండి. అందులో ఆధ్యాత్మికచర్చా బాగా సాగవచ్చు. ప్రశాంతత కలుగవచ్చు. లేదంటే వృద్ధులకు ఆరోగ్యసమస్యలెక్కువ. వాటికి
తగిన చికిత్సా సదుపాయా లుంటే సరిపోతుంది.
వృద్ధులు బిడ్డలవద్దే హయిగావుండాలని కోరుకొందాం. లేకపోతే
వృద్ధా శ్రమాలలో వుండనిద్దాం. బాధతోకాదు, ఆప్యాతలున్నా
సదుపాయం లేనప్పుడు మాత్రమే సుమా!
//ఓం తత్
సత్//
7. బాలసాహిత్యం
- సామాజిక బాధ్యత
సాహిత్యం అంటే హితంతో కూడినది. హితం రుచించనూ వచ్చును.
రుచించక పోవచ్చునుకూడా. రుచించకపోయినా మేలుచేసేదే హితం. బాలసాహిత్య మట్లుకాదు. బాలసాహిత్యం
మేలుచేసేదేకాకుండా రుచించేదైకూడా వుండాలి. పిల్లలకది యిష్టమైనదై వుండితీరాలి.
లేనియెడల అది లేతహృదయములపై భారంమోపి, విసుగు కలిగించి, అసలుప్రయోజనాన్నే
దెబ్బతీస్తుంది.
నేటి విద్యావిధానంలో బాలలమనోవికాసానికి సంబంధించిన విద్య
పూర్తిగా వదిలిపెట్టబడింది. పిల్లలు పెద్దవారై కేవలం ధనమార్జించు యంత్రాలుగా
మార్చుటయందే విద్యాలయాలు, తల్లిదండ్రులూ నిమగ్నమైపోయారు. యిది
చాలాదురదృష్టకరమైన పరిస్థితి. ఇది యిలాగే కొనసాగితే భావిభారతంలో మానవతావిలువలు
నశించి,
హింస, దౌర్జన్యం
చెలరేగేప్రమాదముంది. మంచిచెడ్డ విచక్షణ కోల్పోయి, నీతీ, న్యాయం
విడచి కేవలం స్వలాభాపేక్షకే ప్రాధాన్యమిచ్చు తరం వచ్చిపడుతుంది. యాంత్రికజీవనం
అలవాటై ఆటవిక న్యాయం తిరిగి ప్రవేశిస్తుంది. ఇప్పటికేఅది వచ్చిందేమోకూడా.
మొక్కైవంగనిది మనైవంగదుకదా! కనుక బాల్యంనందే మానవతా
విలువల బోధ జరగాలి. మనిషి మనిషిగాజీవించే పద్ధతి నేర్పాలి. త్యాగం, దానం, సేవ, ప్రియభాషణం, మర్యాదాప్రదమైనట్టి
నడవడి అలవర్చాలి. అప్పుడే దేశం "సారే జహాసె అచ్ఛా" అవుతుంది. అందుకోసం
బాలసాహిత్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలి. నేటిబాలలేకదా! రేపటిపౌరులు. వారికోసం చేసే
ఖర్చును,
ఖర్చు
గాకాక,
భావిభారతనిర్మానానికి
పెట్టిన పెట్టుబడిగా భావించాలి.
బాలసాహిత్యంలో జానపదాలకు సముచితస్థానం వుండాలి. అవి
పిల్లలకు ఊల్లాసాన్నిస్తాయి. జానపదకథలద్వారా పాటలద్వారా పిల్లల్లో సహజంగా
మానవతాబీజాలు నాటవచ్చు. నీతి సులభంగా బోధించవచ్చు. అయితే యిందులో అభూతకల్పనలపై
కాస్తా జగ్రత్తవహించాలి. అభూతకల్పనలు వాస్త వికతకు దూరంకాబట్టి, నిజజీవితంలో
అన్వయించుకోవడానికి పనికి రావనే భావన కలిగిస్తాయి. కనుక వాటిని తొలగించాలి. లేదా
వాటి లోని నీతిని వివరించిచెప్పాలి. సరైనదృక్పదంతో గ్రహించి ఉపయోగించు కుంటే, యింత
కంటే మంచిసాధనం మరొకటి వుండదు. పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రభేదం
కథలు గమనించదగ్గవి. వాటిని సరళభాషలోనికి మార్చుకోవాలి. చెడిపోయిన రాకుమారులను
సరిదిద్దడం కోసమే అవి రచించబడ్డట్టు చెప్పడం గమనించేవుంటారు.
ఇవికాక మన "వేమన" "సుమతి" వంటి
శతకాలున్నాయి. చాలాసులువైన భాషలోవుండి కంఠస్తం చేయడానికి అనువుగావుంటాయి. బాలలకు
ఉపయోగపడేవాటిని సేకరించి వాటికి చిన్నచిన్న టీకాలు కూడా వ్రాయించి బాలలకునేర్పితే
అవి జీవితాంతం ఉపయోగపడతాయి.
ప్రతిసంవత్సరం భారతప్రభుత్వం సాహసబాలలకు
అవార్దులందిస్తున్నది. ఆ సాహసగాథలను చిన్నచిన్నకథలుగా, గేయలుగా
మలచి అందిస్తేచాలా ఉపయోగకరంగా వుంటాయి. అవి వాస్తవాలు కనుక పిల్లలమనసుపై ముద్ర
వేయగలుగుతాయి. వారిని ప్రభావితం చేయగలుగుతాయి. ఈపద్ధతిలో మరిన్నికథలు కూడా
వ్రాయించి పిల్లలమనస్సుకు హత్తుకొనేటట్లు ఆలోచింప జేసేట్లు చేయవచ్చు.
పురాణపురుషులగాథలు, మహాత్ములబోధలూ, త్యాగ
ధనులైన దేశనాయకుల చరిత్రలూ బాలలకు తగినరీతిలో సులభగ్రహ్య మయ్యేట్లు రచింపజేసి
అందుబాటులోనికి తేవాల్సివుంటుంది.
బాలలకోసంచేసే రచనల్లో చిన్నచిన్నవాక్యాలుండాలి. నాలుగైదు
పదాలకు మించకుండ వాక్యనిర్మాణంజరగాలి. నిఘంటువులు అవసరంలేని సరళభాష వాడాలి.
దిత్వాలూ,
సయుక్తాక్షరాలు
పొదుపుగావాడాలి. రచనలన్నిటికి ముచ్చటైన రంగులబొమ్మలూ, కార్టూన్లూ
గీయించాలి. కథచదువుతున్నప్పుడే భావంతెలిసిపోవాలి. బొమ్మలకోసమైనా పుస్తకం
తెరవాలనిపించాలి. వ్రాతల కన్నా బొమ్మలప్రభావం పిల్లలపై యెక్కువగా వుంటుందన్న విషయం
మరువరానిది.
ప్రస్తుతం ఆడియో వీడియోల కాలం వచ్చేసింది. మాధ్యమం
చాలావేగంగా మారిపోతున్నది. కనుక చెప్పదలచుకొన్నదంతా టెలివిజన్ ద్వారా చూడ టానికి
వీడియోలు,
క్యాసెట్లు, సి.డిలు
కూడా తయారుచేయించాలి.
ఇన్నీచేసినా అవి పిల్లలదగ్గరకు చేర్చడం యెలా? అన్నదొక
పెద్దసమస్య. ఇందుకోసం విద్యాలయాలూ, గ్రంథాలయాలే పనిలోనికి దిగాలి. తల్లి
దండ్రులు యిందుకు సహకరించాలి. తొంబైశాతం విద్యాలయలే యీపని తమ భుజాలపై వేసుకోవాలి.
పాఠ్యాంశాలలో,
క్రీడలలో
ముందున్నపిల్లలను అభినందించినట్లూగానే ఒక ముసలమ్మను బాలుడు రోడ్డు దాటించినప్పుడు
కూడా అభినందించాలి, ఉత్సాహపరచాలి. సేవానిరతికి, మానవతకు
పెద్ద పేటవేయాలి. ఇది తల్లిదంద్రులు ఉపాద్యాయులూ చేయవలసిన ముఖ్యమైన పని. ఇందుకు
అవసరమైతే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‍లు
యేర్పాటు చేయాలి. ఇవి పిల్లలుచదివే పాఠశాలల్లోనే యెర్పాటు చేసుకోవచ్చు.
ప్రచురణకర్తలూ, పంపిణీదారులూ
బాలురకు అందుబాటులోని ధరలో బాలసాహిత్యం అందించగలగలగాలి. ఈ విషయంలో ప్రభుత్వసహాయం
తప్పనిసరి. ప్రభుత్వం తొలుత విద్యాలయాలపై, గ్రంథాలయాలపై
కొంత ఒత్తిడి తీసుకరవాలసిన అవసరంవుంది. విద్యాలయల్లో యిందుకోసం కొన్ని పిరియడ్ల
సమయం కేటాయించేట్లు ఆంక్షవిధించాలి. రానురాను పని సానుకూలమౌతుంది. ఫలితాలనివ్వటం
మొదలౌతుంది.
గ్రంథాలయాలు బాలలకు తరచుగా వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం
వంటి పోటీలు నిర్వహించి వారికి మంచిబహుమతుల నివ్వడంద్వారా ఆకర్షించాలి.
ఆబహుమతులతోపాటు బాలసాహిత్యంకూడా అందజేయాలి. చిన్నచిన్నగా గ్రంథాలయంలోని
బాలసాహిత్యవిభాగంవైపు పిల్లలదృష్టిని మరల్చాలి. ఇందుకు మెండుగా బాలసాహిత్యం జమచేసి
ప్రత్యేక విభాగం యేర్పాటు చేయడం కూడ అవసరం. ఇందుకు ప్రభుత్వం తగిన కేటాయింపులు
చేయాలి. సచ్ఛందసంస్థలుకూడా యిందుకు ఉదారంగా తోడ్పడాలి.
ప్రచురణకర్తలు, రచయితలూ బాలసాహిత్యం
తమబాధ్యతగా స్వీకరించాలి. ప్రజలు కోరుకొన్నది మేమందిస్తామన్న దోరణితోగాక, సమాజశ్రేయస్సును
దృష్టిలోపెట్టుకొని బాలసాహిత్యాన్ని వ్యాప్తిజేసే సంకల్పంతో ప్రచురణలు వెలువడాలి.
మంచివైపుకు మనమే జనాన్ని ఆకర్షించే పనీ కొంత యిష్టంతో చేయాలి. అందుకు
గురజాడవారన్నట్లు “సొంతలాభం కొంతమానుక” పనిజేయాల్సివుంటుంది. అందరి తోడ్పాటూ దీని
కవసరమే. శ్రీశ్రీగారి మహాప్రస్థన శైశవగీతంతో యికముగింపు పలుకుదాం.
పాపంపుణ్యం
ప్రపంచమార్గం
కష్టం
సౌఖ్యం శ్లేషార్థాలు
ఏమీయెరుగని
పువ్వుల్లారా
మెఱుపు
మెరిస్తే వానకురిస్తే
ఆకసాన
హరివిల్లు విరిస్తే
అవి
మీకేనని ఆనందించే
కూనల్లారా
నోళుల
ప్రేశుల పాలబుగ్గలూ
ఎక్కడచూస్తే
అక్కడ మీరే
విశ్వరూపమున
విహరిస్తుండే
పరమాత్మలు
ఓచిరుతల్లారా!
మీదే
మీదే సమస్త విశ్వం
మీరేలోకపు
భాగ్యవిధాతలు.
v
8. సంక్రాంతి
తెలుగువారి పండుగలలో అతి ప్రాధాన్యమైనది సంక్రాంతి పండుగ.
మన పండుగలు చాలా వరకు చాంద్రమానం ప్రకారం జరుగుతాయి. ఈ పండుగ మాత్రం సూర్యునితో
సంబంధమున్న పండుగ. అందుకే ప్రతిసంవత్సరం జనవరి 14,15 తేదీలకు
యీ పండుగ సరిగ్గా వస్తుంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం సూర్యుడు మకరరాశిలో కలియుటనే
మకరసంక్రాంతి అంటారు. అదే మన సంక్రాంతిపండుగ. దీనితో ఉత్తరాయణం ప్రారంభమౌతుంది.
ఉత్తరాయణాన్ని పవిత్రకాలంగా భావిస్తాము. ఈ సమయంలో పితరుల పేరున దానధర్మాలు చేయడం, క్రొత్తబట్టలు
సమర్పించడం,
తర్పణాలు
వదలడం,
శ్రాద్ధకర్మలు
చేయడం ద్వారా మన దివంగత పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయన్నది శాస్త్రవక్యం.
తమిళనాట యీ పండుగను పొంగల్ అంటారు. క్రొత్తబియ్యం పంచదార పాలతో పొంగలి తయారుచేసి
దేవునికి నైవేద్యం సమర్పించి, గోవులకు పెట్టి తర్వాత
యింట్లోనివారంతా ప్రసాదంగా సేవిస్తారు. అదీ వారి ఆచారం.
తెలుగువాళ్ళం ఈ పండుగను మూడురోజులు చేసుకుంటాము.
మొదటిరోజు భోగి,
రెండవరోజు
మకరసంక్రాంతి,
మూడవరోజు
కనుమ లేక పశువుల పండుగగా చేసుకుంటాము. మొదటిరోజు తెల్లవారకముందే భోగిమంటలతో యీ
పండుగ ప్రారంభమౌతుంది. కొన్నిప్రాంతాలలో స్నానాదులు పుర్తిచేసు కొని పొంగలిప్రసాదం
యీ మంటలందే తయారుచేస్తారు. కొన్నిచోట్ల యీ మంటలప్రక్కన నీటిబానలుంచి ఆ మంటకుకాగిన
నీళ్ళతో స్నానంచేస్తారు. మంచి చలికాలంగనుక వేడినీటిస్నానం తప్పనిసరి. ఈ భోగినాడే
శ్రీమహా విష్ణువు వామనావతారుడై బలిచక్రవర్తిని పాతళానికి త్రొక్కేశాడని ప్రతీతి. ఆ
సందర్భంగా దేవతలు తిరిగి స్వర్గంప్రవేసించి రాక్షసులువాడిన వస్తువులను
అగ్నిలోదహించివేసి, వాటిని వదిలించుకొని క్రొత్తజీవితం
మొదలుపెట్టారు. దీనికి సంకేతంగానే మనం పాతసామాన్లను భోగిమంటల్లో తగులబెట్టి
క్రొత్తవి తెచ్చుకుంటాము.
భోగిపండుగనాడు పిల్లలకు భోగిపడ్లు పోస్తారు. అంటే రేగుపండ్లు, చెరుకు
ముక్కలు,
నానబెట్టిన
శనగలు,
చిల్లరడబ్బులు
కలిపి పిల్లలతలపై పోస్తారు. దీనితో పిల్లల పీడపిశాచుల బాధలు, దృష్టిదోషాలు
తొలగి పోతా యని మనవారి నమ్మకం. భోగిపోసినతర్వాత పేరంటాలకు తాంబూలం పళ్ళు వస్త్రాలు
సమర్పించి వారి దీవెనలు పొందుతారు. ముఖ్యంగా యీ కార్యం పిల్లలచేత చేయిస్తారు.
ఇక రెండవరోజు సంక్రాంతి. సంక్రాంతి సంబరాలు ఘనంగా
చేసుకోవడానిలి ముఖ్యకారణం, పంటలన్నీపండి, ఫలం, ధాన్యం
యింటినిండావుంటాయి. కూతుళ్ళూఅల్లుళ్ళతో యిండ్లు కళకళలాడుతుంటాయి. ధాన్యం
గాదెలనిండుగా వుంటుందిగనుక గంగిరెద్దులవాండ్లు, హరిదాసులు
యిల్లిల్లుతిరిగి సందడిచేసి తగినంత ధాన్యం సంపాదించుకుంటారు. ఇప్పటి రోజుల్లో
సంబరాలు తగ్గి పోయాయిగాని, పాతరోజుల్లో గంగిరెద్దులాటలు జనం
గుంపులు గుంపులు గా గూడి కేరింతలతో ఆనందించేవారు. “ హరిలొరంగహరి
” అంటూ
హరి దాసులపాటలు వీనులవిందుచేసేవి. కొత్తబట్టలు అందునా పట్టుపావడాలతో ఆడపిల్లలు
తిరుగాడుతూ వుంటేచూడముచ్చటగా తెలుగుదనం ఉట్టిపడుతూ వుండేది. ఆ రోజు విందులో
పూర్ణంతో చేసిన ఓలిగలు నేయి కలిపి ఆర గించడం అదో ఆనందం.
ఇక మూడవదినం కనుమపండుగ. ఈదినం పశువుల పండుగగా చేస్తారు.
తమ అభివృద్ధికితోడ్పడే ఆవులు, యెద్దులకు యీదినం స్నానాలుచేయించి
పూజిస్తారు. పచ్చికతో మేపుతారు. వాటికొమ్ములకు రంగులువేస్తారు. వాటికి ఉల్లన్‍దారాలతో
అల్లిన చిన్నచిన్న బంతులహారాలతో, పులతో అలంకరిస్తారు. రైతులు పశువులఋణం
యీవిధంగా తీర్చుకుంటున్నారా అనిపిస్తుంది. కానీ అదేరోజున ప్రజలు కాస్తా
రెచ్చిపోతారు. కోడిపందాలు హింసాత్మకంగా ఆడతారు. మాంసాహారులైతే వడలు కోడిమాంసంతో
విందులు చేసు కొంటారు. మిగతా సాంప్రదాయాలు మరచిపోతున్నారుగానీ, కోడిపందాలు
మాత్రం వికృతరూపం దాలుస్తున్నాయి. పందాల పేరుతో జూదం విచ్చలవిడిగ సాగి పెదరైతులు
ఆనాడే దివాలతీస్తున్నారు. అసలు సంక్రాంతి అంటే కోడి పందాలే అనే రీతికిప్పుడు
మారిపోయాయి.
పారువేటచేయడం కూడా యీ పండుగ సాంప్రదాయమే. తిరుపతి శ్రీ
వెంకటే శ్వరస్వామికూడా పారువేట చేస్తాడు. ఈ వేటకకర్థం మనలోని అరిషడ్వర్గాలను ఆయన వేటాడి నిర్మూలిస్తాడని గ్రహించమంటారు.
కానీ మనవారు మూగజీవాలను వికృతంగా తరిమి వేటాడి హింసించి చంపితినడం
సరికాదనిపిస్తుంది.
ఈ పండుగకు సుమారు పక్షందినాలముందే ప్రారభమయ్యే ముచ్చటైన
సంప్రదాయమొకటుంది. అది రంగవల్లులు (ముగ్గులు) గొబ్బిళ్ళు. ఇంటిముందు రంగురంగుల
ముగ్గులు తీర్చిదిద్ది, మధ్యలో పేడగొబ్బెమ్మ (గౌరమ్మ) ను
పెట్టి,
నెత్తిపై
గుమ్మడి లేక తంగేడు పూలు పెడతారు. ఈ దినాలలో లోగిళ్ళు చూడ ముచ్చటగావుంటాయి.
ప్రొద్దుకుంకగానే కన్నెపిల్లలు జల్లెడలలో పూలు పరచి పైన గొబ్బెమ్మలుపెట్టి, దీపాలు
వెలిగించుకొని ప్రతియింటి ముందు దించి చుట్టూగుండ్రంగాతిరుగుతూ గౌరిపాటలు పాడతారు.
ఇవి చూడచక్కని సన్నివేశాలు. ఆఖరురోజైన కనుమనాడు, గొబ్బెమ్మలను
జలధిలో కలుపు తారు. అప్పుడుకూడా యేటినీటిలో తేలియాడజేసి ఉయ్యలలూపి గొబ్బెమ్మలను
నిద్రపుచ్చుతూ జోలపాటలు పాడి నీటిలోనికి వదిలేస్తారు. ఆడపిల్లలకు మంచిభర్తలు
రావడానికి చేసే పవిత్రవ్రతంగా దీన్ని భావిస్తారు. ఇట్లే తెలంగాణా లో
బతుకమ్మపండుగచేస్తారు. కానీ అది దసరాదినాలలో చేస్తారు.
సంక్రాంతి ఆనందదాయకమైన పండుగ. రైతులు ఆరుగాలము శ్రమించి
పండినపంట చేతికొచ్చి సంతోషంగా చేసుకొనే పండుగ. అందునా పుణ్యకాలం ప్రవేశించే పండుగ.
ఈ పండుగను కోడిపందాలపేరుతో జూదగాళ్ళపరం గాకుండా, సాంప్రదాయపద్దతులతో
జరుపుకొని ఆనందిద్దాం. అంతేగానీ విషాదాన్నిమిగిల్చే జూదగాళ్ళ పండుగగా మారిపోకుండా
జాగ్రత్తపడుదాం.
// శుభంభూయాత్
//
9. ఉగాది
మనపండుగలు మన సంస్కృతికి ప్రతీకలు. మన ఆచారవ్యవహారములకు
దర్పణములు. ఉగాది కాలకొలమానానికి సంబంధించిన పండుగ. బ్రహ్మ దేవుడు సృష్టిని
ప్రారంభించిన సమయన్ని సృష్ట్యది అంటున్నాం. బ్రహ్మ సృష్టికి శ్రీకారంచుట్టిన
సంవత్సర మొదటిమాసం మోదటిదినం యుగానికి ఆది. ఆదినాన్నే మనం ప్రతిసంవత్సరం ఉగాదిగా
జరుపుకుంటున్నాం. ఈ విషయం "చతుర్వర్గ చింతామణి"లో ప్రస్పుటంగా
లిఖింపబడివుంది.
మొదటివత్సరమైన ప్రభవలో మొదటిమాసమైన చైత్రంలో మొదటిఋతువైన
వసంతంలో మొదటితిథియైన పాడ్యమిన మొదటివారమైన అదివారంనాడు మొదటినక్షత్రమైన అశ్వనిలో
ప్రభవించిన యీ సృష్టిని బ్రహ్మకల్పారంభంగా జ్ఞాపకంచేసుకొంటూ, ప్రతియేటా
సంవత్సరాదిగా ఉగాదిపండుగ చేసు కొంటున్నాం.
కృతయుగం17 లక్షలా 28 వేల
సంవత్సరాలు. త్రేతాయుగం 12 లక్షలా 96 వేల
సంవత్సరాలు. ద్వాపరం 8 లక్షలా 64 వేల
సంవత్సరాలు. ఇక కలి యుగం 4 లక్షలా 32 వేల
సంవత్సరాలు. మొత్తం 43 లక్షలా 20వేల
సంవత్సరాలు. ఈ మొత్తంకాలం ఒక మహాయుగం. ఇట్టి వెయ్యి మహా యుగాలు బ్రహ్మకు ఒకపగలు.
ఇంతే కాలం ఒకరాత్రి. ఈ రాత్రికాలమే మహాప్రళయకాలం. మహాప్రళయంలో సర్వం జలమయమై, తిరిగీ
బ్రహ్మకు పగలుకాగానే సృష్టిమొదలౌతుంది. ఇప్పటికి అలాంటి 27
మహాయుగాలు గడచి ప్రస్తుతం 28వ, మహాయుగంలో
ఆఖరుదైన కలియుగంలో 5 వేలా 120
సంవత్సరాలు గడిచాయని జ్యోతిషశాస్త్రజ్ఞుల లెక్క(2018). కాలము
భగవద్స్వరూపము. కాలగణనకు సంబంధించిన పండుగ గనుకనే ఉగాది అత్యంతప్రాధాన్యతను
సంతరించుకొన్నది.
శలివహన చక్రవర్తి క్రీ.శ. 79 లో
పట్టభిషిక్తుడయ్యడు. అప్పటినుండి
శాలివాహనశకం
మొదలయింది. తెలుగువాళ్ళం శాలివహనశకాన్నే పాటిస్తున్నాం. శాలివాహనశకంలో చాంద్రమానన్ని అనుసరించి మాసగణన
చేయబడుతుంది. శుక్లపక్షంతో నెలను లెక్కించాలని కమలాకరభట్టు నిర్దేశం, కనుక మన
తెలుగుసంవత్సరాది, అదే మన ఉగాది చైత్రశుద్ధ పాడ్యమినాడు
మొదలౌతుంది.
ఇది మధుమాసారంభం, ఆమని.
యజుర్వేదంలో "మధుశ్చ మధవశ్చ వాసవన్తికావృతూ" అనిచెప్పబడింది. అంటే
మధుమాసం,
మధవమాసాలలో
వసంతఋతువుంటుందని భావం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చైత్ర, వైశాఖ
మాసాలే ఆ మధుమాధవమాసాలు. చిత్తానక్షత్రముతో సంబంధమున్నం దుననే అది చైత్రమయింది.
ఇది శ్రీరామరాజ్య మేర్పడిన కాలం గనుక పవిత్రం. వసంతంలో సహకారాలు చిగుర్చుతాయి. ఆ
కిసలయాలు మేసి కోయిలలు పంచమంలో వీనులవిందుగా
కూస్తాయి. వనాలన్నీ పూతాపిందెలతో కళకళలడుతూ శృంగారరసాభిరామంగా
వర్ధిల్లుతుంటాయి. కవులకిది అత్యంతప్రియమైన పండుగ. కవిసమ్మేళనాలతో వేదికలు
కళకళలాడుతాయి. క్రొత్తసంవత్సరానికి ఆహ్వానంపలికి శుభాలుతెమ్మని కవులు కవితాగానం
చేస్తారు. ఈ వసంతారంభసమయాన మన పూర్వకవులెలా స్పందించరో మచ్చునకొకటిరెండు పద్యాలు
చూద్దాం.
ఉ: పొన్నలుపూచె పొన్నలవి పూవకముందర పూచె గోగులా
పొన్నలు
కొండగోగులును పూవకముందర పూచె బూరుగుల్
పొన్నలు కొండగోగులును
బూరుగులున్నొగి పూవకుండగా
మున్న వనంబునం
గలయ మోదుగులొప్పుగ పూచె నామనిన్
అంటారు ముక్తపదగ్రస్తాలంకారంలో కవిరాజశిరోమణి రాజకవి
నన్నెచోడుడు.
ఉ: పూచినపువ్వులెల్ల నుతిబొందె మనోభవు నంపకోలలై
వీచినగాడ్పులెల్ల బొదివెన్ మలయాచల
మారుతంబులై
యేచినపల్కులెల్ల
దగియెన్ పికబృంగ శుకస్వరంబులై
చూచినరూపమెల్ల మదచుంబితమై విలసిల్లెనామనిన్.
అంటూ మురిపించాడు. అపూర్వవిరచనా చాతుర్యుడు, సకుసాల
నృసింహకవి.
శా: ఏతెంచెన్ మధుమాసలక్ష్మి తరుణీ హిందోళరాగధ్వనుల్
వీతెంచెన్
బటుమీనకేతనముతో విల్లంది పూదేరిపై
దోతెంచెన్
దలిరాకు గైదువులు దోడ్తో దాల్మి లేదీగలన్
వేతెంచెన్
జగదేకవిక్రమ కళా వీరుండు మారుండొగిన్.
అంటూ అలరించాడు వాణినారాణి యని సగర్వంగా చెప్పుకొన్న
పిల్లలమర్రి పినవీరభద్రుడు.
ఈ పండుగకే ఒకప్రత్యేకం, షడ్రసోపేతమైన
ఉగదిపచ్చడి. సూర్యో దయాత్పూర్వమే మేల్కాంచి తలంటుస్నానంచేసి క్రొత్తబట్టలు ధరించి, సూర్యనమస్కారంచేసి, అర్ఘ్య, ధూపదీపాలతో
దైవారాధానచేసి " సంకల్పాదౌ నూతన వత్సర నామకీర్తనం " అన్నట్టు
నూతనసంవత్సర పేరుచెబుతూ సంకల్పంచెప్పాలని ధర్మసింధువు చెబుతూంది. తదనంతరం
ఉగాదిపచ్చడి సేవించాలి. దీన్నే నింబకుసుమభక్షణం అంటారు. వేపపూత, కొత్తబెల్లం, కొత్తచింతపండు
లేక మామిడిపిందెలు, నేయి, మిరియాలు, ఉప్పువేసి
యీ పచ్చడి చేస్తారు. ఇది శాస్త్రోక్తం.
శ్లో: అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతే ర్యుతం
భక్షితం
పూర్వయామేతు తద్వర్షం సౌఖ్యదాయకం.
అన్నది శాస్త్రవాఖ్యం.
ఆరురుచులుగల యీ పచ్చడి " జీవనగమనం సుఖ దుఃఖమయం" అని గుర్తు
చేస్తుంది. అంతేగాకుండా వసంతకాలంలో వచ్చే రుగ్మతలకు యిది దివ్యౌషదం.
శ్లో: శతాయుర్వజ్రదేహయుః సకలసంపత్కరాయ
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమభక్షణం. -అన్నది ఆర్యోక్తి.
ఈ పండుగరోజున ప్రపాదానం అంటే పూర్ణకుంభదానం చెయ్యడం
శ్రేయస్కర మంటారు. నూతనవస్త్రాలతోపాటు యధాశక్తి రాగి, వెండి, పంచలోహపాత్ర
లేదా క్రొత్తకుండను కలశంగా తీర్చిదిద్ది, పురోహితునికి లేదా
గురువుకు దానంచేసి వారి ఆశీస్సులు పొందాలి.
ఈ పండుగనాడు చేయవలసిన మరొక అతిముఖ్యమైనకార్యం పంచాంగ
శ్రవణం. తిథి వార నక్షత్ర యోగ కరణాలు కలసి పంచాంగమౌతుంది.
శ్లో: తిథేశ్చశ్రియ మాప్నోతి వారాత్ ఆయుష్య వర్ధనమ్
నక్షత్రాత్ తరతేపాపం యోగాత్
రోగనివారణమ్
శ్లో: కరణాత్ కార్యసిద్ధిస్తు పంచాంగమ్ ఫలముత్తమమ్
కాలవిత్
కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహమ్ లభేత్.
అని పంచాంగశ్రవణ ఫలితం చెప్పబడింది. తిథి శ్రేయస్సును, వారం
ఆయుర్ధాయన్ని పెంచుతుంది. నక్షత్రం పాపాన్ని హరిస్తుంది. యోగం రోగనివారణనూ, కరణం
కార్యసిద్ధిని కలిగిస్తాయి. మొత్తంమీద పంచాంగశ్రవణం కార్యానుకులతనూ, దైవానుగ్రహాన్ని
ప్రాసాదిస్తుంది.
నూతనసంవత్సరంలో కలిగే ఆదాయవ్యయములు, గ్రహసంచారాలు
ముందుగా తెలుసుకొని జాగ్రత్తగా మెలగడానికి పంచాంగం ఉపయోగ పడుతుంది.
సంవత్సరాధిపతులైన రాజాదినవనాయకుల ప్రభావాలను వినుటవల్ల గ్రహదోషములు తొలగిపోతాయని
ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని హిందువుల విశ్వాసం.
// శుభంభూయత్
//
10. శరన్నవరత్రులు
- దసరా
శ్లో: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే
త్ర్యంబకే గౌరీ నారయణీ నమోస్తుతే.
శరన్నవరత్రులలో వర్షాలు వెలిసి ఆకాశంలో చంద్రుడు
ప్రకాశవంతంగా వెలుగుతాడు. వెన్నెల విరియగాస్తుంది. ఆ దినాలలోనే దసరాపండుగ
వస్తుంది. దసరాముందు తొమ్మిదిరత్రులనూ నవరాత్రులంటారు. ఈ రాత్రులలో దేవిని
పూజిస్తారు. ఆశ్వయుజమాసం శుక్లపాడ్యమినుండి దశమివరకు పదిరోజులు యీ పండుగ
భారతదేశమంతా వైభవంగా జరుపుకుంటారు.
ఈ పండుగ జరుపుకోవడానికి కారణం మాత్రం ఒక్కోప్రాంతంలో
ఒక్కోవిధంగా వుంటుంది. దేవి మహిషాసురునితో తొమ్మిది దినాలు పోరాడిచంపి దశమినాడు
విజయోత్సవం జరుపుకొన్నది కనుక,
ఆ సందర్భ మును పురస్కరించుకొని యీ పండుగ కొన్నిప్రాంతాలలో
చేస్తారు. శ్రీరాముడు రావణునితోపోరి విజయం సాధించినదినంగా కొన్నిచోట్ల యీ పండుగ
చేస్తారు. మరికొన్నిప్రాంతాలలో పాండవమధ్యముడైన అర్జునుడు శమీవృక్షంపైనున్న తన
గాండీవం గ్రహించి ఉత్తరగోగ్రహణంచేసి కౌరవులపై విజయంసాధించిన దినంగా యీ
పండుగచేస్తారు. దశమినాడు అందుకే శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) పూజిస్తారు.
శ్లో: శమీ శమయతేపాపం. శమీ శత్రువినాశినీ
అర్జునస్య
ధనుర్ధారీ. రామస్య ప్రియదర్శిని.
జమ్మిచెట్టు పాపాలను హరిస్తుంది. పగవారిని నాశనం
చేస్తుంది. అందుకే అర్జునునికీ, శ్రీరామునికీ అది ప్రియదర్శిని
అయింది.
మన ప్రాంతంలో యీ పండుగ మహిషాసురమర్ధినియైన
దుర్గాదేవిపూజగా జరుపుకుంటారు. దేవతలచేతిలో దైత్యులు అంతరించిపోయారు. అందులకు
దుఃఖించి,
దైత్యులతల్లి
దితి దేవతలనుజయింపగల్గిన కొడుకుకోసం సుపార్శ్వుడి ఆశమప్రాంతంలో బ్రహ్మనుగూర్చి తపస్సుచేస్తుంది.
ఆ తపో తాపనికి ఆ ఆశ్రమప్రాంతం శగలుపొగలౌతుంది. సుపార్శ్వముని ఆ శగలకు తాళలేక
దితికి మహిషం జన్మిస్తుందని శపిస్తాడు. కానీ ఆమెతపస్సు ఫలించి బ్రహ్మప్రత్యక్షమై
కొడుకును ప్రసాదిస్తాడు. కానీవాడు మునిశాపంవల్ల దున్నపోతుముఖంగల్గి వుంటాడు. వాడు
శివున్నిగూర్చి తపస్సుచేసి చావులేని వరం కోరుకొంటాడు. శివుడు అది అసాధ్యమని, పుట్టినప్రతిజీవీ
గిట్టక తప్పదని,
వేరొకవరం
కోరుకొమ్మంటాడు. స్త్రీయైతే అబల కనుక తన్నెమీ చేయలేదని తలచి స్త్రీతో తప్ప
యింకెవరితోనూ చావులేకుండా వర మిమ్మంటాడు మహిషాసురుడు. శివుడు తదాస్తని
అంతర్ధానమయ్యాడు.
ఇక మహిషాసురుడు దేవతలను గడగడలాడించాడు. వానిధాటికి తళలేక
దేవతలు బ్రహ్మను వేడుకొన్నారు. బ్రహ్మ, దేవతలారా!
మీశక్తులన్నీ పార్వతీ దేవికి ధారపోయండి. ఆ దేవి మహాశక్తిగామారి మహిషాసురుని సంహ
రిస్తుంది. వెళ్ళి మీరాపని వెంటనేచేయండన్నాడు. దేవతలు బ్రహ్మచెప్పినట్లు
తమశక్తులను పార్వతికి ధారపోసి వేడుకొన్నరు. ఆమె అజేయమైన శక్తి సంపన్నయై
శివశక్తినికుడా మించిపోయి మహిషాసురసంహరం చేసింది.
దుర్గుడనే మరోరాక్షసుడున్నాడు. వాడు కూడా దుర్మార్గుడై
దేవతలను,
మునులను
పీడించసాగాడు. వాణ్ణి హెచ్చరించి సక్రమంగాజీవించమని కాళ రాత్రిని దూతగా పంపింది
పార్వతీదేవి. వాడు దూతగావచ్చిన కళరాత్రినే వెంటబడితరిమాడు. కాళరాత్రి భయముతో
పరుగిడివచ్చి పార్వతీదేవి శరణు జొచ్చింది. కానీ దుర్గుడు వెంటబడివచ్చి
పార్వతీదేవినికూడా దురూక్తులా డాడు. అప్పుడు పార్వతీదేవి అగ్రహోదగ్రురాలై
దుర్గున్ని దును మాడింది. కనుక దేవికి దుర్గ అన్న పేరువచ్చిందని ఒక
ఐతిహాస్యమున్నది. అంతేగకుండా దుర్గ అంటే గమింపరానిదని అర్థం. ఆ దేవినెవరూ అదుపు
చేయలేరు. అందుకే ఆమె దుర్గ. కన్యయనికూడా ఆమెకుపేరున్నది. ఈమెను పూజించిన కన్యలకు
శుభాలు జరుగుతాయని హిందువుల నమ్మకం. వ్యైశ్యుల కులదేవత వాసవీ దేవికికూడా కన్యక
అన్న పేరున్నది. యీమెకూడా దేవీ అవతారమనియే నమ్మిక. కనుకనే కన్యకాపరమేశ్వరీదేవికి
యీ దసరా దినములలో ముఖ్యంగా పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ
రూపాలలోనూ,
మరితర
దేవీరూపాల లోనూ నవరాత్రులు పూజలుజరిపి దశమినాడు ఊరేగిస్తారు. ఉత్తరాదిన, మరియూ
దుర్గాదేవ్యాలయలలో యీ దేవిని శైలపుత్రి, బ్రహ్మచరిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రి, విజయదుర్గారూపాలలో
రోజుకొకరూపంలో పూజిస్తారు.
అర్జునుడు శమీవృక్షాన్ని యీ దినం పూజించి ఉత్తరగోగ్రహణంలో
విజయుడవ్వడమేగకుండా, పాండవులు దేవినిపూజించే అజ్ఞాతవాసం
విజయవంతంగా పూర్తిచేయగలిగారు. శ్రీరాముడు రావణునిసంహరించిన దినంగా ఉత్తరాదిన, ముఖ్యంగా
ఢిల్లీ రాంలీలామైదానంలో రావణాసురుని అట్టబొమ్మలో బాణసంచానుంచి, రామునివేషధారి
అగ్నిబాణంతో దానిని కొట్టి, పెద్దపెద్ద టపాసుల శబ్దాలతో రావణుని
తగలబెడతారు. ఇది మహో త్సాహంగా పిల్లలూ పెద్దలూ ఆనందంగా జరుపుకొంటారు. మైసూరు, అమ్మవారు
మహిషాసురమర్థినిగా అవతరించిన స్థలమని మననమ్మిక. అందుకే అక్కడ సింహవాహినియైన దేవిని
ఘనంగా పూజిస్తారు. ఉత్సవాలు వేడుకగా జరుపుకుంటారు. కడపజిల్లా ప్రొద్దుటూరులో
కన్యకాపరమేస్వరీదేవి పూజలు మైసూరును తలపిస్తాయి. అందుకే దసరా విషయంలో ప్రొద్దుటూరు
రెండవమైసూరంటారు. మొత్తంమీద యీ పండుగ రాక్షసత్వంపై సాత్వికం విజయంసాధించిన
శుభదినాల సూచికగా హిందువులు వైభవంగా జరుపుకుంటారు.
శ్లో: హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం
వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం
వందే
పుస్తక పాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్వలాం
త్వాం
గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్.
v
11. దీపావళి
"దీపావళి " అంటే దీపాలవరుస అని అర్థం. ఆశ్వయుజమాస అమావాస్య
నాడు యీ పండుగ భారతదేశమంతటా జరుపుకుంటారు. అమావాస్య నాడైనా ఆరోజు దీపాలవెలుగులో
కాంతివంతంగా వుంతుంది. చీకటి తొలగి పోయినదినం, కష్టాలు గట్టేక్కినదినంగా
యీ పండుగను భావిస్తారు. లోక కంటకుడైన నరకాసురుడు, శ్రీకృష్ణసత్యాదేవిల
చేతిలో చతుర్దశి తెల్లవారు జామున మరణించినాడు. ఆ సంతోషంలో మరునాడైన అమవాస్య రోజున
యీ పండుగ దక్షిణభారతంలో జరుపుకుంటారు.
నరకాసురుడు భూదేవికి వరహరూపముననుండిన విష్ణువునకు పుట్టిన
కుమారుడు. ఇతడు ప్రాగ్జ్యోతిషపురాధీశుడై రాజ్యపాలనము చేస్తూవుండే వాడు.
మదోన్మత్తుడై దేవతలనుసైతం ఓడించి దేవమాత అదితి కర్ణకుండలాల నూ, వరుణచ్ఛత్రాన్నీ.
ఇంద్రుని మణిపర్వతాన్నీ తనవశం చేసుకుంటాడు. పదహారువేలమంది స్త్రీలను చెరపట్టి
పీడించాడు. వీడు పుట్టినపుడు, భూదేవి మహవిష్ణువునుండి ఒకవరం
కోరుకొన్నది. దానివల్ల వీడు తల్లికారణంగా తప్ప యితరులతో చావడు. తల్లి తనయుని
చంపడానికి పూనుకోవడం జరగదన్న ధీమాతో వీడు మితిమీరి దుండగమలు చేయసాగాడు. వీడు
అజేయుడై ద్వాపరయుగంలోకూడా జీవించియేయున్నాడు. అప్పుడు విష్ణువు కృష్ణావతరుడై యున్నాడు.
ఆయన తనభార్యసత్యదేవి, భూదేవిఅంశతో జన్మించినదని తెలిసి ఆమెను
వెంటదీసుకొని గరుడవహనుడై వచ్చి నరకా సురునితో యుద్ధంచేసినాడు. నరకాసురుని దెబ్బకు
కృష్ణుడు మూర్చపోగా, సత్యభామ నరకాసురుని యెదిరించి వానిపై
బాణపరంపర కురిపించింది. అదేసమయంలో కృష్ణుడు మూర్చదేరుకొని చక్రాయుధంతో నరకుని సంహ
రించినాడు. నరకుని కొడుకు భగదత్తుని రాజుగా జేసినాడు. నరకుడు మరణించినదినం ఆశ్వయుజ
బహుళచతుర్దశి,
ఆరోజు
నరకచతుర్దశిగా గుర్తింపుపొందింది. ప్రజలకది చీకటిపాలన అంతరించినరోజు. అందుకే
దీపాలు వెలిగించి మరుదినమైన అమావాస్య నాడు పండుగజేసుకున్నారు. ఆ దినాన్నే దీపావళి
పర్వదినం అంటున్నాం. శ్రీకృష్ణుడు దేవతలసొమ్ము దేవతలకు చేర్చినాడు. పదహారువేలమంది
చెరలోని స్త్రీలను తనే పెండ్లాడి, వారికి పరమాత్మ రక్షణ కల్పించినాడు.
దీపావళి చాలా ఆనందదాయకమైన పండుగ. దీపాలు వెలిగించడమేకాదు, బాణసంచాకాల్చి
పిల్లలూ,
పెద్దలూ
సంబరాలుచేసుకొని మిఠాయిలు పంచుకొంటారు.
ఈ పండుగను కేరళవాసులు మరొక సందర్భాన్ని పురస్కరించుకొని
చేస్తారు. వామనుడు బలిచక్రవర్తిని పాతళానికి త్రొక్కివేసినతర్వాత, బలిమీద
జాలిగలిగి ప్రతిసంవత్సరం మూడురోజులు భూమిని పాలించే వరమిస్తాడు. అవి దీపా వళితోపాటు ముందు వెనుక రోజులు. ఈ
రోజులలో ప్రజలు చీకటిని పోగొట్ట డానికి దీపాలుపెడతారు. పితృదేవతలు యీ రోజులలో
భూమ్మీదికివచ్చి, బలులు స్వీకరించి తమవారిని ఆశీర్వదించి
స్వర్గంవెళతారు. అదీ కేరళవాసుల నమ్మకం.
ఇక బెంగాల్‍లో యీ దీపావళిని కాళీపూజాదినంగా జరుపుకుంటారు.
ఈ దినం రామలక్ష్మణసీతాహనుమంతులు శ్రీరామవనవాసం పూర్తైనతర్వాత, అయోధ్యకు
తిరిగివచ్చినదినం. రామరాజ్యం మొదలైన దినంగా కూడా ఉత్తరభారతదేశంలో యీ పండుగ
చేసుకొంటారు.
దీపవళిమరుదినం కార్తీకంతో విక్రమనామసంవత్సరం మొదలౌతుంది.
ఈదినంనుండి రాజస్థాన్ మార్వాడీలు, జైనులు తమ క్రొత్త ఆర్థికలావదేవీల
పుస్తకాలు తెరుస్తారు. అంటే దీపావళి, సంవత్సరాంతదినమన్నమాట.
అందుకే లక్ష్మీదేవికి పూజచేస్తారు. లక్ష్మీదేవి గౌరవార్థం గోలోకంలో రాధాకృష్ణులు, కైలాసంలో
శివపార్వతులు పాచికలతో జూదమాడతారని ఒకవిశ్వాస ముంది. ఈ పండుగను వారు అమావాస్యకు
ముందు రెండు రోజులూ, అమావాస్య, ఆ
తర్వాతిదినం వెరసి ఐదురోజుల ఘనమైన పండుగగా సంబరాలు చేసుకొంటారు.ఈదినాలలో
జైనకుటుంబాలలో స్త్రీ పురుషులు పాచికలతో సరదాగా జూదమాడుతారు. ఈదినాలలో విజయం
స్త్రీలదే నంటారు. ఈ పండుగనాడే జైనుల ఆఖరి
తీర్థంకరుడైన మహావీరుని నిర్యాణదినంగాకూడా, ఆ
మహాత్ముని వెలుగే పునఃస్థాపితం చేసుకొంటున్నా మన్న నమ్మకంతో దీపాలువెలిగిస్తారు.
ఇక శిక్కుమతస్తులు మరో సందర్భాన్ని పురస్కరించుకొని యీ
పండుగ చేస్తారు. మహాత్మా హర్‍గోవింద్ వారిని డిల్లీసుల్తానైన మొగల్చక్రవర్తి
జహంగీర్,
శత్రువుగా
భావించి పండ్రెండుసంవత్సరాలు గ్వాలియర్ అడవులలో నిర్భందించినాడు. ఆ తర్వాత రాజీపడి
వదలినాడు. గురు హర్‍గోవిద్‍సింగ్ తిరిగి అమృత్‍సర్ వచ్చిచేరినారు. అది శిక్కులకు
ఆనంద దాయకమైన దినం. ఆ దినంకూడా యీ దీపావళిదినమే. అది రాముడు అరణ్యవాసంనుండి
అయోధ్యకు తిరిగివచ్చినంత సంబరంగా వారు గురు హర్‌గోవింద్‍సింగ్ పేరున పండుగచేసుకుంటారు.
ఈ పండుగ పద్దెనిమిదో శతాబ్దంనుండి శిక్కులు జరుపుకుంటున్నారు.
ఇలా హిందువులూ, జైనులూ, శిక్కులూ
కూడా భారతదేశమంతటా యీ పండుగ ఆనందంగా జరుపుకుంటూన్నారు.
v
12.వీరశైవాచార
నిష్ట
శివుని పరమదైవముగా భావించు శైవుల నిష్టాదీక్షలు
బహుచిత్రంముగా నుండును. అందునా వీరశైవనిష్టలు మరింత కఠినముగానుండును. వారు
ప్రాణములను సహితమూ లెక్కచేయరు. వారికి సర్వమూ రుద్రమే. అట్టి వీరశైవమతకథ నొకదానిని
విందము.
బదరికాశ్రమమున దూర్వసుడున్నాడు. ఒకనాడాయన ఆశ్రమములోని
జింకపిల్లలకు మిగిలిన యజ్ఞ ప్రసాదములు ప్రేమతో తినిపిస్తున్నాడు.
అదేసమయంలో ఆకాశగమనం చేస్తున్నతుంబురుడు ఆ దృశ్యముచూసి
సంతోషించి ఆ ఉత్సాహమున చిట్టిక్కున చిటికవేసినాడు. ఆచిటిక శబ్దమునకు జింకపిల్లలు
బెదిరినవి. అంతే! దుర్వాసుడు ఆగ్రహించి ఓరీ! తుంబురా! నీవు మానవుడవై పుట్టుమని
శపించేశాడు. తుంబురుడు ముని కాళ్ళపైబడి వేడు కొన్నాడు. ముని శాంతించి ,, నీవుశివగణముల
లోని వాడవు,,
కనుక
శివభక్తుల యింటబుట్టి తరింతువు బొమ్మనెను.
తుంబురుడు కంచిలోని వైశ్యకుటుంబమున చిరుతొండనంబిగా
జన్మించి శైవాచారనిష్టతో జీవించుచుండెను. అతడు వీరశైవజంగములు కోరిన దేదైననూ
తీర్చును. ఇదియెరిగి ఒక జంగము శివాభిషేకమునకై తూమెడు చెరకురసము కావలెనని కోరెను.
కాదనరాదుగదా! చిరుతొండడు వెళ్ళి రసమునకు చెరకులు కొని కట్టగట్టి
నెత్తికెత్తుకొననెంచెనుగానీ, అతనివల్ల కాలేదు. అప్పుడు
భక్తవశంకరుడైన శివుడే వచ్చికష్టపడి భక్తునినెత్తికెత్తెను. ఆప్రయత్నమున శివుడు
అలసిపోయెను. మేన చెమటలు పట్టెను. శివుడు నిజమునకప్పుడు అప్సరసల నాట్యము
తిలకించుండెను. భక్తుని కష్టమునకు జాలిపడి వచ్చి చెరకులకట్టను
భక్తునినెత్తికెత్తెను. కానీ ప్రక్కనేయున్న పార్వతి శివునికి చెమటలేలపట్టెను?
అన్యస్త్రీలోలుడయ్యనా? అని అనుమానించెను. శివుడు అసలుకారణము
పార్వతుకిజెప్పి ఆమెశంక తీర్చెను. ఆమె అబ్బుర మంది,, శివునకంత
ప్రీతిపాత్రుడా! ఆ చిరుతొడనంబి? అని అనుమానించి పరీక్షింపదలచెను. శివుడును సరియనెను. ఇంద్రుని
పిలిపించి కంచిలో వారముదినములు యెడతెరపిలేని వానలు కురిపింపజేసెను. మనుషులు
బయటదిరుగ వెరచి ఇండ్లకేపరిమితమై పోయిరి. చిరుతొండడు జంగములకు
భోజనసదుపాయములు జేసెను. కట్టెలు లేకపోయిననూ బట్టలు నూనెలో ముంచి అంటించి వంటలు
వండించి పెట్టెను. ఒక వారమునకు తెరపి యిచ్చెను. జంగములు స్వేచ్ఛాప్రియులై
యిచ్ఛవచ్చిన చోటికి వెళ్ళిపోయిరి. మన శ్రేష్ఠి జంగములకు పెట్టిగాని ముద్దముట్టడు.
గమనించగా జంగములు కానరాలేదు. చేయునదిలేక వారిని వెదుకుతూ వెళ్ళి ఊరిబయట ఒకముసలి
జంగమయ్య అతని గ్రుడ్డిభార్య సత్రములో కనిపించిరి. వారిని శ్రేష్ఠి
భోజనమునకాహ్వానించెను. ఆ ముసలి జంగమదంపతులెవరోకాదు, చిరుతొండనంబిని
పరీక్షింపవచ్చిన శివపార్వతులే.
జంగమదంపతులు భోజనమునకు వచ్చెదము కానీ ... అంటూ
మెలికబెట్టిరి. శ్రేష్ఠి సందేహింపక అడుగుమనెను. జంగమయ్య, సరే!
వినుమని యిట్లు చెప్పెను. మేము నిరాహారదీక్షలోనున్నాము. దీక్ష విరమించవలెనన్న మాకు
సద్గోత్రుని మాంసముతోగూడిన భోజనము పెట్టవలెననెను. శ్రేష్ఠి సరే రమ్మనెను. వారిని
దీసుకొనివచ్చి భార్యకు విషయము వివరించెను. ఆమెయూ సరే,
మంచిదనెను. తమకొడుకు సిరియాళుని జంపి జంగమయ్యకు భోజనముపెట్టుటకు నిశ్చయించిరి.
జంగమదంపతుల రూపముననున్న శివపార్వతులు పరీక్షను మరింత తీవ్రతరముజేయనెంచిరి.
సిరియాలుడు చదువుతున్న పాఠశాలకు శివుడు మరొకరూపమున బోయి సిరియాళా! నీతల్లిదండ్రులు
నిన్నుజంపి ఒక జంగమదేవరకు భోజనము పెట్టుటకు సిద్ధమౌతున్నారు జాగ్రత్త! అనెను. ఆ
బాలుడు సంతోషముతో మంచిది, అంతకంటేభాగ్యమా? నాజన్మ
ధన్యమౌతున్నది. ఇది గొప్ప శుభవార్తగదా! అనెను. శివుడు వానిభక్తికి ఆశర్యపోయెను. ఇక
పార్వతి బాలెంతవేషమున శ్రేష్ఠియింటి గడపకడకు వచ్చి బిడ్డకు పాలుయాచించెను.
శ్రేష్ఠిభార్య పాలు బోయుచుండగా, వచ్చిన బాలెంత, ఇదేమిభక్తి
తల్లీ! కన్నబిడ్డను బలిపెట్ట నెంచినారట? మీకు దయా, జాలీ
లేవా?
యని
మనస్సు నొచ్చుకొను నట్లు మాట్లాడినది. కానీ శ్రేష్ఠిభార్య, జంగమయ్యకు
శివునకు భేదము లేదు. శివారాధన మాకు అవస్యకర్తయవ్య మనెనే గానీ, మనసు
మార్చుకోలేదు.
బాలుడు పాఠశాలనుండి రాగానే తల్లిదండ్రులకు నమస్కరించి, నాకంతా
తెలుసు తండ్రీ నన్ను త్వరగా శివలోకమునకు పంపుడని వేడుకొనెను. శ్రేష్ఠి భార్యఒడిలో
పిల్లవానినుంచి శివశివా అంటూ గొంతుకోసి తలను మాత్రము మరల మరల చూచుకొనుటకు అనువుగా
దాచిపెట్టుకొని బాలుని మాంసము నకు మిరియములు, ఉల్లి, పసపు, మెంతి, ఇంగువ, జీలకర్ర, నేయి, పెరుగు, పంచదార
మిశ్రమములతో వంటకములుచేసి జంగమదంపతులకు వడ్డించిరి. జంగమయ్య తలమాంసము లేదని
తగవుబెట్టుకొని భోంచేయ ననెను. శ్రేష్ఠిదంపతులు వినయముగా నచ్చజెప్పి, దాచుకొన్న
తలనుగూడా రోటదంచి కూర వండివడ్డించిరి. మరలా జంగమయ్య, మీపిల్లవాణ్ని
కూడా పిలవండి,
కలసిభోంచేద్దాం, పిల్లలులేనివారింట
భోంచేయనని మారాము చేసెను. ఇంకెక్కడి బాలుడు? మీకు
వంటక మయ్యెనుగదా! అని మనసులో బాధపడుతూ కంటనీరిడి నోటమాటరాక నిశ్చేష్టులై నిలబడిరి.
బాలుని పిలువు మని జంగమయ్య గద్ధించెను. ఇక గత్యంతరము లేక శ్రేష్ఠిభార్యయైన
తిరువెంగనాంచి,
కొడుకా!
సిరియాళా! యని దీనవదనయై యెలుగెత్తి పిలచినది. ఇకనేమున్నది, ఆశ్చర్యం!
సిరియాళుడు మాతా! అంటూ అక్కున వచ్చి జేరినాడు. శివపార్వతులు నిజరూపమున దర్శన
మిచ్చి,
ఇకమీరు
కైలాసమునకు వచ్చి శివగణములలోకలసి మమ్ముసేవింపు డని ఆనతిచ్చిరి. చిరుతొండనంబి, స్వామీ!
కంచిలో వైశ్యకులస్తులమైన మేము వెయ్యి గోత్రములతో ధార్మికజీవనము గడుపుచున్నాము.
వారిని విడచి మేము మాత్రమే కైలాసము రాజాలముక్షమింపుడనెను. స్వామి, మీ
వేయిగోత్రముల వారికీ కైలాసమునకు స్వాగతమని తెలిపి అంతర్హితుడాయెను. ఆ విధముగా
కంచిలోని వేయిగోత్రముల వైశ్యులందరికీ శివలోకప్రాప్తి కలిగెను.
ఈకథ శ్రీనాథుని హరవిలాసములో ప్రఖ్యాతమై యున్నది
ఆ.వె: కులములోన నొకడు గుణవంతుడుండెనా కులము వెలయు
వాని గుణముచేత వెలయు
వనములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినుర వేమ.
సూచన:- ఈ
కథలోని భగవద్భక్తి,దీక్ష, త్యాగము, ఆరాధన, అన్నదానము
మనకాదర్శములే, కానీ
భక్తిపేరున నరబలి నేటి సామాజిక పరిస్థితులకుసరిపడదు. అది హింసాత్మకము. కనుక
అటువంటివాటిని పట్టించుకొనక,కాలానుగుణమైన ధర్మమములనే గ్రహించ మనవి
v
13.ఏకాదశివ్రత
మహాత్మ్యం
అంబరీషమహారాజు మహావిష్ణుభక్తుడు. అతడు
కం: హరియని సంభావించును;
హరియని
దర్శించు; నంటు నాఘ్రానించున్;
హరియని
రుచిగొన దలచును;
హరి హరి; ఘను
నంబరీషు నలవియె పొగడన్.
భాగ-9-86.
అట్టివాడు, ఏకదశివ్రతం పూర్తిచేశాడు. ఇక ద్వాదశి
రాగానే,
ప్రసాదం
స్వీకరించి వ్రతం పరిపూర్ణం గావించాలనుకున్నాడు. ఇంతలో దూర్వాస మహర్షి శిష్యబృదంతో విచ్చేసి, మేము
నదీస్నానముచేసి వస్తాము, కలసి పారణచేసి
వ్రతంపూర్తిచేద్దువుగాని, వెళ్ళివస్తామని నదికి బయలుదేరారు.
రాజు వారికోసం నిరీక్షిస్తున్నాడు. ద్వాదశిఘడియలు దాటిలోయే సమయ మౌతున్నది. ఐనా
మునిజాడ లేదు. తన పురోహితులను పిలచి రాజు మార్గాంతరమడిగాడు. వారు, రాజా!
ద్వాదశిదాటకముందే మీరు పారణచేసి దీక్ష విరమించకతప్పదు. కానీ మనిరాకుండా మీరు
ప్రసాదం స్వీకరించరాదు. కనుక శాస్త్రసమ్మతంగా నడచుకొందాం.. అని
ఆ:వె: అతిథివోయిరామి
నధిప;
యీ
ద్వాదశి
పారణంబు మాన పాడిగాదు
గుడువకుంటగాదు కుడుచుటయునుగాదు
సలిలభక్షణంబు సమ్మతంబు.
భాగ-9-99
రాజా! మంచినీళ్ళు త్రాగి దీక్ష విరమించండి. అందువల్లమీరు
మునిని విడచి భోంచేసినట్లు కాదు. సరిపోతుంది, అన్నారు.
సరే అలాగేచేద్దామని మంచి తీర్థం రాజు అలా సేవించారోలేదో, యిలా
ముని శిష్యులతో దిగబడ్డాడు. దుర్వాసుడంటేనే మహాకోపిష్టి. ఇకనేముందీ, ఆనీళ్ళుత్రాగడం
కూడా తన్నవమానించినట్టేనని మండిపడ్డాడు. తనతలలోని ఒకజడను పెరికి, మంత్రించి
కృత్య అనబడే రాక్షసునిగా మార్చి, అంబరీషమహారాజుపైకి పంపాడు.
అంబరీషమహారాజు మారుమాటాడక, హరి హరీ అంటూ కళ్ళుమూసుకున్నాడు. అంతే
విష్ణుచక్రం రివ్వున వచ్చి రక్కసునిచంపి, మునివెంటబడింది.
మునికి కంపరమెత్తింది. పారిపోవడానికి ప్రయత్నించాడు.
చక్రం విడువకుండా వెంటాడింది.
మ: భువిదూఱన్ భువిదూఱు నబ్దిజొర నబ్దుల్సొచ్చు, నుద్వేగియై
దివిబ్రాకన్ దివిబ్రాకు; దిక్కులకుబో
దిగ్వీథులంబోవు; జి
క్కి
వెసంగ్రుంకిన గ్రుంకు; నిల్వనిలుచు; గ్రేడింప
గ్రేడించు నొ
క్కవడిన్
దాపసు వెంటనంటి హరిచక్రంబన్యదుర్వారమై. భా-9-107.
ముని తిరిగితిరిగి అలసిపోయి, సత్యలోకంవెళ్ళి
బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ, తనుకాపాడలేనన్నాడు. కైలాసంవెళ్ళి
శివుణ్ణి వేడుకున్నాడు. శివుడు కూడా చకధాటిని నిలువరించడం తనవల్లకాదన్నాడు. ఇక సరాసరి
వైకుంఠం వెళ్ళి హరిని వేడుకున్నాడు. హరి
కం: సాధుల
హృదయము నాయది;
సాధుల
హృదయంబు నేను; జగములనెల్లన్
సాధుల
నేన యెఱుంగుదు
సాధులెఱుంగుదురు నాదు చరితము విప్రా! భాగ-9 -123
కనుక మునివరా! నేను భక్తపరాధీనుడను. చక్రానలజ్వాలల నుండి
నేనుకూడా నిన్ను కాపాడజాలను. వెళ్ళు, వెళ్ళి వెంటనే
భక్తాగ్రగణ్యుడు, నాభాగసుతుడూనైన అంబరీషుని శరణువేడమన్నాడు.
కం: అదెపో
బ్రాహ్మణ నీకును
సదయుడు
నాభాగసుతుడు జనవినుతగుణా
స్పదుడిచ్చు నభయ మాతని
మది
సంతసపరచి వేడుమా శరణంబున్
భాగ-9 -126.
హరి ఆవిధంగా పలుకగానే, ఇక
చేయునదిలేక,
వెళ్ళి
అంబరీషుని కాపాడు మని శరణు వేడినాడు. అంబరీషుడు మహాభక్తుడు, శాంతుడు, సాత్వికుడు
కనుక దుర్వాసుని మన్నించి
కం: అఖిలగుణాశ్రయుడగు
హరి
సుఖియై
నా కొలువు వలన జొక్కెడినేనిన్
నిఖిలాత్మమయుండగుటకు
సుఖమందుంగాక భూమిసురుడివ్వేళన్ భా-9 -138
అని హరిని, సుదర్శనచక్రాన్నీ ప్రార్థించి
దుర్వాసమునిని కాపాడినాడు. ముని రాజును దీవించి నిజాశ్రమానికి ఆనందంగా
వెళ్ళిపోయాడు.
పరమాత్మ తన్ను నిందించినవానిని సైతం సైరించి
ఊరుకుంటాడేమోగాని, భక్తుని భాధించిన వానిని తక్షణం శిక్షింపక
వదలడనియు,
ఏకాదశివ్రతం, శ్రేష్ఠతమమనియు
మనము గ్రహించవలసి యున్నది.
కం: ఈ యంబరీషు
చరితము
తీయంబున
విన్న జదువ ధీసంపన్నుం
డై
యుండును భోగపరుం
డై
యుండును నరుడు పుణ్యుండైయుండు నృపా!
భాగ-9 –153
v
14.గౌతమ
బుద్ధుడు
భరతఖండము ఆధ్యాత్మికతకు
పుట్టినిల్లు. ఇందెందరో మహాత్ములు ఉద్భవించి, జనమును
జాగృతపరచి,
ముందుకు
నడిపిరి. అట్టివారిలో గౌతమబుద్ధుడు ప్రసిద్ధుడు. క్రీస్తుకు పూర్వము ఆరవ శతబ్దమునాటి
మాట,
కోసలదేశములోని
" కపిలవస్తు" రాజగు శుద్ధోదనునకు మాయదేవికి జన్మించిన పుత్రుడాయన.
కపిలవస్తు యిప్పటి దక్షిణనేపాల్లో గంగానదికి ఉత్తరకొసలో నున్నది. బుద్ధుని
మొదటిపేరు సిద్ధార్థుడు. అంటే అనుకొన్నది సాధించినవాడని అర్థము. ఈయనతల్లి
ప్రసవమునకు తల్లిగారింటికి వెళుతూ మార్గమధ్యమున "లుంబిని" వనములో
సిద్ధార్థుని గన్నది. కొడుకు కడుపులో పడినప్పుడే తల్లి ఒక తెల్లటియేనుగు తనగర్భమున
ప్రవేశించినట్లు అనిభూతి చెందినది. అదిఒక మహాత్మునిజననమునకు సంకేతమని పెద్దలు
చెప్పుదురు. ఆమె ప్రసవించిన తర్వాత బాలుడు అప్పుడే మాట్లాడుతూ నడుస్తూ ఆశ్చర్య
పరిచాడట. ఆ బాలుడు అడుగుపెట్టిన చోటల్లా కాలు నేలమోయక కమలాలు పుట్టుకొచ్చాయట.
తల్లి బాలుడు జన్మించిన యేడు దినములకే పరమ
పదించింది. ఆతర్వాత తల్లిచెల్లెలు, రాజు రెండవభార్య యైన
"ప్రజాపతిదేవి" యీయన్ను పెంచిపెద్దచేసింది. రాజు కుమారుని జాతకం ఎనిమిదిమంది
జ్యోతిష్యులను చూడమన్నారు. అందులో యేడుగురు, యీతడు
సన్యాసిగానీ లేక చక్రవర్తిగానీ అవుతాడన్నారు. ఒక్కరుమాత్రం సన్యాసము స్వీకరించి
లోకానికి వెలుగునిచ్చే మహాజ్ఞాని అయితీరుతా డన్నాదట. రాజు తనకొడుకు సన్యాసి
కాకుండా చక్రవర్తే కావాలనే ఉద్ద్యేశముతో బాలుని జాగ్రత్తగా పెంచాడు. మనసు
వికలంకాకుండా యే విషాదసంఘటనా కంటబడకుండా యేర్పాట్లు చేశాడు. కానీ దైవఘటన నెవరూ
తప్పింపలేరుగదా! ఒకరోజు పట్టుబట్టి రాకుమారుడు చెన్నుడనే ఆప్తుని, రథసారథిగా
జేసుకొని నగర సందర్శనానికి వెళ్ళాడు. ఉన్నట్టుండి బయలుదేరడంవల్ల నగరంలో కట్టు
దిట్టమైన యేర్పాట్లు చేయలేకపోయారు. ఇకనేముంది జరగవలసింది జరిగిపోయింది. రాకుమారుడు
ఒక పండుముసలివాడిని చూశాడు. అత డెందుకు నడవడానికి అంత ప్రయాసపడుతున్నాడని
చెన్నునడిగాడు. చెన్ను డది సహజమన్నాడు. రాకుమారుడు సంతృప్తిపడలేదు. మరింతదూరం
వెళ్ళగానే ఒకరోగి, ఆతర్వాత శవయాత్ర యెదురుపడ్డాయి. సిద్ధార్థుడు
ప్రశ్నలమీదప్రశ్నలడిగాడు. చెన్నుడు సమధానం చెప్పలేకపోయడు. రాకుమారుడు
వికలమనస్కుడయ్యాడు. మనిషికెందుకీ దుఃఖం. దుఃఖము తొలిగే మార్గమేలేదా? యని
చింతించసాగాడు. తండ్రి, కుమారుడేమై పోతాడోనని దిగులుపడ్డాడు.
అనుకున్నంతా జరిగింది. సిద్ధార్థుడు ఒక రోజురాత్రి తనయింటిని, భార్యను, పొత్తిళ్ళలో
వున్న కుమారునీ విడిచిపెట్టి, ప్రపంచమును పట్టిపీడిస్తున్న దుఃఖమును
పోగొట్టవలెనన్న దీక్షతో వెళ్ళి పోయాడు. తండ్రి కొడుకుపై ఆశతో మహాసౌందర్యవతి, తనబావమరిది
కుమార్తె యైన యశోధరతో సిద్ధార్థుని పదహారోయేటనే పెండ్లిచేశాడు. ఇరయైతొమ్మిదోయేట
ఆమె చూడచక్కని బిడ్డకు జన్మనిచ్చింది. వారినిచూచి రాజు ధైర్యం తెచ్చుకొన్నాడు. ఈ
ఇద్దరి ప్రేమబంధాలు త్రెంచుకొని తనకొడుకు యెక్కడికీ పోలేడనుకొన్నాడు. కానీ యీ
ప్రాపంచికబంధాలేవీ సిద్ధార్థుని బంధించలేక పోయాయి.
ఎవరైనా సంతానం కావాలనో, ముల్లోకధిపత్యం
కావలనో,
మరణం
లేనిజీవనం కావలనో, సంపదకావాలనో తపంచేసేవారు. కానీ యిది
ఆశ్చర్యకరమైన విషయం. సిద్ధార్థుడు లోకంలోని దుఃఖితులకోసం తపిం చాడు. దుఃఖనివారణ
మార్గంకోసం తపించాడు. ఆరుగురు సన్యాసుల తో కలసి ఆహారంమాని తపస్సుచేశాడు.
ప్రయోజనంలేదు. శరీరం కృషించి పోయింది. మార్గాన్వేషణకు ఆలోచించే శక్తికూడా
క్షీణించింది. సుజాత అనే మహిళ యిచ్చిన ఆహారం తీసుకొన్నాదు. అందుకు నిందించి
సహచరులు వదలివెళ్ళారు. అయినా వదలని పట్టుదలతో తన అన్వేషణ సాగించాడు. పూర్తిగా
ఆహారం మానిగానీ,
కడుపుపట్టనంత
తినిగానీ తపం సాగదని గ్రహించాడు. మధ్యమార్గ మవలంభించాడు. ఎందరెందరో మహాత్ములను
కొనే వారిని కలిశాడు. చర్చించాడు. సమాధానం దొరకలేదు. ఆరేళ్ళు గడి చాయి.
గయప్రాంతలోని ఒక రావిచెట్టుక్రింద తూర్పుముఖమై కూర్చున్నాడు. ఒకదృఢదీక్ష
గైకొన్నాడు. నాకు పరిష్కారం దొరికితీరాలి. లేదా ప్రాణమైనా పోవాలి. అంతేగానీ యీ
దీక్షనుండి లేచేదిలేదని దృఢనిశ్చయంతో నిమీలిత నేత్రుడై కూర్చొన్నాడు. అంతే..
తేజస్వంతమైన వెలుగు అతనిలో ప్రవేశించింది. విశ్వమంతా అతనికి తెరచిన పుస్తకమైంది.
జ్ఞానస్వరూపుడయ్యాడు. బుద్ధు డయ్యాడు. కోరికలే సమస్తదుఃఖాలకు కారణమని యెఱుకపడింది.
దుఃఖ నివారణకు మార్గం తెలిసిపోయింది. అందుకు కావలసిన సాధనోపకరణాలు వివరంగా
తెలిసిపోయాయి. ఏడుదినములు అదే చెట్టుక్రింద గడిపాడు. గాలీవానా వచ్చింది కదలలేదు.
ఆతర్వాత యిద్దరు వ్యాపారులు ఆ దారిన వెళుతూ ఆయన్నుచూచి తేనె రొట్టెయిచ్చారు.
బుద్ధునిచేతిలో దిక్పాలుర ప్రభావంతో బిక్షాపాత్ర వెలిసింది. బుద్ధుడు బిక్షస్వీకరించాడు.
ఆ బిక్షకు ప్రతిగా బుద్ధుడు తన శిరోకేశముల కొన్నింటిని దాతలకు
కానుకగాయిచ్చాడు.
సిద్ధార్థుదు బుద్ధుడైనాడు. జ్ఞానబోధ
చేయడానికుపక్రమించాడు. ఇది కూడా నూతనవిధానంలోనే సాగింది. అప్పటివరకూ జనులు
జ్ఞానముకొరకు మహాత్ములనాశ్రయించేవారు. అడవులలోని ఆశ్రమములను వెతుక్కొంటూ వెళ్ళి
వారిని సేవించేవారు. అలాకాకుండా బుద్ధుడు జనంలోనికేవెళ్ళి బోధ చేయాలనుకున్నాడు.
సార్‍నాథ్ లోని హరిణఉద్యానవనంలో మొదటిబోధ గావించాడు. అప్పుడతని శ్రోతలు ఐదుమంది
మాత్రమే. ఆతర్వాత ఆయన బోధలు విసృతము చేసినాడు. సామాన్యులేకాక రాజులుసైతం ఆయన బోధలకు
ప్రభావితులై బౌద్ధము స్వీకరించినారు. మగధనేలు బిందుసారుడు సైతం బౌద్ధుడైనాడు.
అంగుళీమాలునివంటి గజదొంగలూ, హంతకులూ బౌద్ధం స్వీకరించారు.
బౌద్ధారామాలనేర్పరచి, సన్యాసులైన బౌద్ధబోధకులకు ఆవాసం కల్పించారు.
బుద్ధుడు కపిలవస్తునగరాన్ని కూడా సందర్శించాడు. తండ్రి రాజభవనానికి
ఆహ్వానించాడు. కానీ బుద్ధుడు ఒక బౌద్ధబిక్షువుగా బిక్షనర్థిస్తూ తనింటికితాను
యాచకునిగానే వెళ్ళాడు. భార్య యశోధర తన కొడుకునే పతికి బిక్షగా యిచ్చేసింది. కొడుకూ
తండ్రిమార్గాన్ననుసరించాడు. శుద్ధోదనమహరాజు బుద్ధునిబోధనలకు ప్రభావితుడై నిజం
తెలుసుకొన్నాడు. తన కొడుకు విశాల విశ్వంలోని మానవహృదయాలనేలే చక్రవర్తి అయ్యడని
గ్రహించి జ్ఞానియై బౌద్ధం స్వీకరించాడు. తొలిసారిగా పెంచినతల్లి ప్రజాపతీదేవిని
ఆరామం లోనికాహ్వనించి బౌద్ధసన్యాసిని జేయడంతో స్త్రీలకూ బౌద్ధంలో స్థానం
కల్పించాడు బుద్ధుడు. ఇలా బుద్ధుడు తనమతాన్ని వ్యాపింపజేస్తూ యెనవై సంవత్సరాల
సుదీర్ఘ జీవితం గడిపాడు.
బుద్ధుడిక తన జీవనయాత్రను చాలించాలనుకున్నాడు. ఒకరోజు ఒక
కంసలి వృత్తిచేసుకొనే భక్తుడు భోజనానికి
పిలిచి తనకిష్టమైన పందిమాంసంతో చేసిన కూరతో
భోజనంపెట్టాడు (కొందరు పుట్టగొడుగులకూర అంటారు). బుద్ధుడు ఆ భోజనం
తిని జబ్బుపడ్డాడు. ఆ భోజ నాన్ని మరెవరూ
తినకుండా భూమిలో పతిపెట్టించాడు బుద్ధుడు. కొందరు అది పందిమాంసం కాదని పందులకు
ముఖ్యంగా పెట్టే ధాన్యమని కూడా
చెబుతారు. ఏదియేమైనా బుద్ధుడు జబ్బుపడ్డాడు. శిష్యులను పిలిపించుకొని తను తనువు
చాలించే సమయం వచ్చిందని తెలియజేసి, వారికి ఆఖరుసందేశాన్ని కూడా యిచ్చి
తాను సిద్ధమయ్యాడు. అది మగధసామ్రాజ్యంలోని మల్లప్రాంతం దగ్గరి
"కుశీనర"మనే ప్రదేశం. రెండు వృక్షములమధ్య అరుగుపై కుడివైపుతిరిగి
పరుండి. కాళ్ళుచాచి రెండు కాలిబొటనవేళ్ళూ ఒకదానిపై ఒకటి వుంచి, నిర్వాణస్థితికి
జేరి తుదిశ్వాస విడిచారు. ఇరువైపులావున్న చెట్లు కాలంగాని కాలమైనా పుష్పించి
పూలురాల్చాయి. బుద్ధుని ముఖ్యశిష్యుడు మహా కాశ్య పుడు ఆ సమయంలో అక్కడలేడు. ఆయన
యేడు రోజులకు అక్కడకు చేరు కొని దహనకార్యం నిర్వహించాడు. అస్తికలూ చితాభస్మం శిష్యులు
పంచు కోవాలనుకున్నారు. కానీ అందులో వివాదమేర్పడి ఒకస్తూపం లోనే భద్ర పరచారు.
తర్వాతికాలంలో అశోకచక్రవర్తి అనేకచోట్ల స్తూపాలు నిర్మించి అస్తికలూ చితాభస్మం
నిక్షిప్తం చేయించాడు. ఆయన నిర్మించిన స్తూపాలు యెనవైనాలుగువేలని లెక్కతేల్చారు.
బౌద్ధం దక్షిణతూర్పు ఆసియాదేశాలలో వ్యాప్తిజెందింది. శ్రీలంక, బర్మా(మయన్మార్)
టిబెట్టుదేశాలలో యెక్కువగా పాదుకొనింది.
ఒక చిత్రమేమంటే బుద్ధుడు వైశాఖపౌర్ణమినాడు జన్మించాడు.
అదే వైశాఖ పౌర్ణమినాడే ఆయనకు జ్ఞానోదయమయింది. తిరిగీ వైశాఖపున్నమి నాడే ఆయన తనువు
చాలించాడు. కనుక భౌద్ధులకు ఒకేఒక పండుగ అదే వైశాఖపౌర్ణమి.
బుద్ధుని బోధలు
బుద్ధుడుపదేశించిన మూలమంత్రం, బుద్ధం
శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. బుద్ధుడంటే ఆయన అర్థంలో
బుద్ధత్వం పొందిన వాడు. అది ఆయన చెప్పిన నిర్వాణ స్థితిని సాధనద్వారా అందు కోవడమే.
దానికందరూ అర్హులే. ఇక రెండవది సంఘం. నీతీ నిజయితీ గలిగిన సంఘానికి కట్టుబడి
జీవించడం. మూడవది ధర్మానికనుగుణంగా ప్రవర్తించడం. ఇవి వారి మూలసూత్రలు.
బుద్ధుడు అహింసను ప్రబోధించాడు. యజ్ఞయాగాదులలో జంతుబలులను
నిరసించాడు. అడ్డుకున్నాడుకూడా. అంతగా బలివ్వవలసిందేనంటే ముందు తన్ను బలిచ్చి
తర్వాత మేషముల వధించమన్నాడు.
ఆయన దేవునిగురించి మాట్లాడలేదు. నమ్మినా నమ్మకపోయినా
ఋజువర్తన మే ప్రధానమన్నాడు. ఒకవేళ దేవుడున్నాడని నమ్మితే, ఆ దేవుడు
మనిషి మంచి నడవడిని మెచ్చడా? అని ప్రశ్నించాడు. కనుక యెవరూ చూడని
దేవునిగురించిన చర్చ అనవసరమన్నాడు.
కనులకు స్పష్టముగా కనబడుచున్న యీ లోకమూ, మరియూ
లోకములోని బాధాతప్త హృదయులను గమనించక, దీని కతీతముగా
మరోలోక మున్న దనుట అర్థరహితము. దానిని పొందుటకు యజ్ఞయాగాదులుచేయుట నిరర్థక
మన్నాడు. సంఘసేవ, సంఘజీవన ప్రాధాన్యతను వివరించి గజదొంగ
అంగుళీమాలుని బౌద్ధబిక్షువుగా మార్చాడు. అలామారడమే మరుజన్మ మన్నాడు. లోకమున
దుఃఖమున్నదని,
దానికి
కారణము లేకపోలేదని, దుఃఖనివారణకు తనుబోధించిన మధ్యమార్గమే
శరణ్యమన్నారు. హత్య, దొంగతనము, వ్యభిచారము, కల్లలాడడము, సారాయిత్రాగడము
సంఘ జీవనమునకు అడ్డంకులన్నాడు. కోరదగనికోరికలే దుఃఖమునకు కారణ మన్నాడు.
సంఘోద్ధరణకు సమ్యగ్‍దృష్టి, సమ్యగ్‍సంకల్పము, సమ్యగ్‍వాక్కు, సమ్యగ్‍కర్మ, సమ్యగ్‍జీవనము, సమ్యగ్‍వ్యామము
లేక వ్యాపారము,
సమ్యగ్‍స్మృతి, సమ్యగ్‍సమాధి, అను
అష్టాంగ యోగాచరణం అవసర మన్నాడు. మనిషి బౌద్ధమార్గంలో నడచి అందుకొనవలసిన స్థితిని
"నిర్వాణం" లేక "నిబ్బనం" అన్నారాయన. అంటే నిర్వికార నిరామయ
దివ్య స్వచ్ఛస్థితి యని మనమర్థం చేసుకోవాలి. ఆయన దృష్టిలో అదే మానవ జీవనగమ్యం. ఆ
స్థితులను విషయంలో విపులవ్యాఖ్యానం చేయక మౌనం వహించారాయన. కారణం అవి
వ్యాఖ్యానాలకతీతమనీ, సాధనద్వారానే సాధించుకోవాలని ఆయన
ఉద్ద్యేశ్యం.
యజ్ఞయాగాది క్రతువులూ, దేవతలూ, పరలోకముల
ప్రశస్తి లేకపోవుటవలన బౌద్ధం నిరీశ్వరీయమతమన్నారు. కనుక హిందూమతమునకు విరుద్ధమని
కొందరు భావించారు. కానీ అహింస, నీతి, నిజాయితీ, ధర్మం, శీలం
వంటి సుగుణాలకు బౌద్ధం ఆలవాలమైనందున బుద్ధుని కూడా వైష్ణవులు ఒక భగవ దవతారమని
కీర్తించారు. కానీ, ఇది నచ్చనివారు, నిజమే!
యజ్ఞయాగాదు లవల్ల పుణ్యమునార్జించి అందరూ స్వర్గమేచేరుకొంటూ, నరకంవెళ్ళేవాళ్ళు
లేనందున,
విష్ణువు
బుద్ధావతారమెత్తి, మనుషులు యజ్ఞములు చేయకుండా ఆపి, కొందరినైనా
నరకానికి వెళ్ళేట్లు చేశాడని హేళన చేశారు. ఇదిమాత్రం అన్యాయం.
బుద్ధుడు తానే దేవుడనని చెప్పివుంటే అందరూ నమ్మేవారే.
కానీ ఆయన ఆత్మ వంచన చేసుకోలేదు. కేవలం జాతి, కులబేధాలు
లేని ఆరోగ్యకరమైన వర్త మాన సంఘంకోసం, దుఃఖనిర్మూలనంకోసం
తపించిన మహనీయు డాయన. ఊహాకల్పనలకు తావియ్యని నిజాయితీపరుడాయన. ఆయన జన్మించిన, జ్ఞానంపొందిన, తనువుచాలించిన
వైశాఖపౌర్ణమి ప్రతి సంవత్సరం "ఏప్రిల్"
ఆఖరిపక్షంలోనో లేక "మే" మొదటి పక్షం లోనో
వస్తుంది. ఆ దినాన్నైనా మనంబుద్ధభగవానుని హృదయపూర్వకంగా స్మరిద్దాం.
//నమస్తే! //
15.హోలి
"హోలి" రంగుల పండుగ. ఈ పండుగనాడు చిన్నా,పెద్దాయన్న
అరమరికలు మరచి అందరూ రంగులు చల్లుకుంటారు. హిందూదేశంలోనూ, నేపాల్, బంగ్లాదేశ్‍లో
యీ పండుగ సంతోషానందాలతో జరుపుకుంటారు. ప్రవాస భారతీయులున్న చాలాదేశాల్లోనూ యీ
పండుగ యితరమతస్తులతో కలసి జరుపుకుంటారు. పండుగ
రంగులమయం గనుక యువకులకిది ఉత్సాహభరితమైన పండుగ.
ఈ పండుగ జరుపుకోవడానికి మనకనేక పురాణగాథలున్నాయి.
దక్షిణభారతంలో "కామదహనం"గా జరుపుకుంటారు. ఫల్గుణమాస పున్నమినాడు వచ్చే
పండుగ గనుక దీనిని "కామునిపున్నమి"అనికూడా అంటారు. పూర్వం తారకాసురుడు
లోకాలను పీడింపసాగాడు. వాడికి శివపుత్రునితోతప్ప యితరులతో చావులేదు. శివుడేమో
సతీదేవి మరణంతో నిర్వేదానికి గురై తపంలో వున్నాడు. పార్వతి శివునిప్రేమకై
తపిస్తున్నది. పార్వతిపై ప్రేమగలిగి శివుడు వివాహితుడై పుత్రుని గనాలి. ఇది సాధ్యం
చేయ డానికి దేవతలు మన్మథున్ని పంపారు. మన్మథుడు తన పుష్పబాణాలతో శివుణ్ని పరవశుని
చేసి,
పార్వతీకల్యాణానికి
కారణమౌతాడు. కానీ తన్ను మోహితుని జేసిన మన్మథుని శివుడు ఫాలనేత్రంతో కాల్చేస్తాడు.
రతీదేవి,
భర్తమన్మథుని
వియోగానికి దుఃఖించి, శివుణ్ని వేడుకుంటుంది. శివుడు దయ చూపి
మన్మథుని బ్రతికించి అశరీరునిగావుంటూ లోకాలను మోహింప జేస్తూ వుండమంటాడు. రతీదేవికి
మాత్రం సశరీరుడుగానే కనిపించే వరమిస్తాడు. ఈ సందర్భాన్ని పురస్కరిచుకొని కాముని
దహనం పేరిట పెద్దపెద్ద మంటలు వేసుకొని "కామునిపున్నమి" చేసుకుంటారు.
ఇక ఉత్తరభారతంలో, పరమ
భాగవతుడైన ప్రహ్లాదుడు, మంటలనుండి బయటపడి బ్రతికిన సందర్భమును
గుర్తుచేసుకొని పండుగచేసుకుంటారు. హిరణ్యకశిపుడు హరిద్వేషి. కొడుకు ప్రహ్లాదుడు
హరిభక్తుడు. తండ్రిమాట విననందుకు కోపించి ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు
అనేక ప్రయత్నాలు చేస్తాడు. కాని హరిప్రభావంవల్ల అవన్నీ విఫలమౌతాయి. కడకు
హిరణ్యకశిపుడు తన సోదరి "హోలిక"ను పిలిపించి ఆమెకొక శాలువానిచ్చి
"ఇదికప్పుకో నిన్ను అగ్ని దహించలేదు". నీవు ప్రహ్లాదుని యెత్తుకొని
అగ్నిలో దూకు,
తర్వాత
ప్రహ్లాదుని అగ్నిలోనే వదలి నీవుమాత్రం సురక్షితంగా బయటికి రా.. ప్రహ్లాదుడు
కాలిపోతాడు. పీడవిరగడౌతుంది అంటాడు. హోలిక ఒకటి రెండు సార్లు శాలువాతో మంటల్లోకి
వెళ్ళివచ్చి,
భయమేమీలేదని
ప్రహ్లాదుని నమ్మించి, ప్రహ్లాదుని యెత్తుకొమి అగ్నిలో దూకింది.
కానీ హరిమాయ వల్ల శాలువా గాలికి యెగిరిపోయి ప్రహ్లాదునికి చుట్టుకుంటుంది. హోలిక
కాలిపోతుంది,
ప్రహ్లాదుడు
మాత్రం శాలువా కప్పుకొని హాయిగ బయటికి వచ్చేస్తాడు. అందరూ సంతోషిస్తారు పండుగ
చేసుకుంటారు.
ఈ సందర్భాలే గాక కృష్ణుని పరంగా కూడా యీ పండుగ
జేసుకుంటారు. ఈ పండుగదినాన్నే బాలకృష్ణుని ఉయ్యలలోవేసి, యశోదమ్మ, గోపికలూ
పాటలుపాడి ఊయలలూపారట. ఆ జ్ఞాపకాలతో డోలికలో కృష్ణుని విగ్రహ ముంచి, డోలికోత్సవంగా
యీ పండుగచేసుకుంటారు కొన్నిచోట్ల. అలా కాకుండా బాలకృష్ణుడు తాను నల్లగానూ, రాధ
తెల్లగానూ యెందుకుందని అలిగి మారాముచేశాడట. అప్పుడు యశోదాదేవి, యితరబంధువులు
రాధకు నీలంరంగూ,
కృష్ణునికి యెఱ్ఱరంగు పూసి సముదాయించారట. అదీ యీ పండుగకు మూలమంటారు. మరికొందరి
రాధాకృష్ణులు ప్రేమానురాగంతో ఒకరిపైఒకరు రంగులు చల్లుకొని గోపికాజనాన్ని కూడా
కలుపుకొని రంగులలో తేలియాడారట. అందుకే యీ రంగుల పండుగట.
మరికొందరు యీ పండుగ "హోలీ" కాదు
"హేళీ" అనికూడా పిలుస్తారు. హేళి అంటే విలాసం అని అర్థం. ఏది యేమైనా యీ
పండుగ సంతోషంగా,
సంబరంగా
రంగులు పులుముకొని విలాసంగా జరుపుకొనే పండుగే. ఐనా దైవీయమైన సంఘటనలకు జోడించి
పండుగచేసుకోవడం యెంతో ముదాహవం.
No comments:
Post a Comment