ఉపన్యాస త్రయి-2
(వివిధ సదస్సులలో సుబ్బరాయకవి చేసిన మూడు ప్రసంగములు)
పాండురంగ మహత్మ్యము- ఒకపరిశీలన
హరిస్తుతి
సీ: పొదలు నీ పొక్కిటి పువ్వుకాన్పునఁ గదా
పెనుమాయ పిల్లలఁ బెట్టు టెల్లఁ !
బొడము నీ మొదలి యూర్పుల నేర్పులనకదా
చదువు సంధ్యలు గల్గి జగము మనుట!
కెరలు నీ యడుగుఁదామరల తేనియఁ గదా
పాపంపుఁ బెనురొంపి పలుచనగుట!
పొసగు నీ తెలిచూపు పసఁ గదా యిది రాత్రి
యిది పగలను మేరలెఱుఁకఁ బడుట!
తే: భవనఘటనకు మొదలి కంబమును బోలె
భువనములకెల్ల నీ వాది భూతివగుచు
నిట్ట నిలుచున్కి చేఁ గాదె నెట్టుకొనియె
గెంటుఁ గుంటునులేక లక్ష్మీకళత్ర!
పాండురంగ మహాత్మ్యము- 2-55.
పాండురంగ మహత్మ్యము- ఒకపరిశీలన
పాడురంగమహత్మ్య కర్త తెనాలి రామకృష్ణుడు. తొలుత కవినిగూర్చి సంక్షిప్తంగానైనా తెలుసుకుందాం. రామకృష్ణుడు, రామలింగడు ఒకరేనని పండితులు తేల్చి చెప్పినారు. వారిలో ముఖ్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. రామలింగడే వైష్ణవము స్వీకరించి రామకృష్ణుడైనాడు. ఇదంతయు ఆనాటి రాజశ్రయమునకై పడిన పాట్లలో ఒకటై యుండవచ్చును. జీవిత కాలం క్రీ.శ 1505-1575/80 వరకూ ఉండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం. ఈకవి రామలింగడు గానున్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్రమును రామకృష్ణుడైనతర్వాత ఘటికాచల మహాత్మ్యమును, పాండురంగమహాత్మ్యమును వ్రాసినాడు. ఇవిగాక హరిలీలావిశేషము, కందర్పకేతువిలాసము కూడా వ్రాసినా డందురు. వేటూరువారు యీ గ్రంథములలోని కొన్ని పద్యములు మాత్రము చూపిరి. పూర్తిగ్రంథములు అలభ్యము. తెనాలినుండి విజయనగరము వచ్చిన వారగుటచే తెనాలి వారనుచున్నాము గానీ వీరింటిపేరు గార్లపాటి. వీరి గురువులు రామలింగడుగా నున్నప్పుడు ఏలేశ్వరుడు, రామకృష్ణుడైనతర్వత భట్టరు చిక్కాచార్యులు. పాండురంగమహత్మ్యమును పొత్తపినాటిలో కృష్ణరాయల తర్వాత సదాశివరాయలకు లోబడి రాజ్యముచేయుచుండిన మహా మండలేశ్వరుడైన మంగయ గురవరాజు కుమారుడు సంగరాజు చేతిక్రింద రాయసము చేయుచున్న విరూరి వేదాద్రికి అంకితమిచ్చినాడు. ఈ వేదాద్రి ఒక వ్రాయసకాడని కొందరి అభిప్రాయము. ఇతడుకూడా వైష్ణవము స్వీకరించినవాడే. ఆవిధమగు అభిమానము వల్లనే గొప్ప రాజుకాకపోయినా అంకితమిచ్చియుండునని విశ్లేషకుల అభిప్రాయము. ఎందునకన ప్రార్థనా పద్యముననే
శా: శ్రీకాంతామణి కన్మొరంగి, మది ధాత్రిన్ మంచినన్, దద్రుచి
శ్రీకాదంబిని మీదికుబ్బెననగా శ్రీవత్సమున్ దాల్చి ము
ల్లోకంబుల్ పొదలించు కృష్ణుడు, దయాళుండేలు శ్రీవైష్ణవ
స్వీకారార్హు, విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్. - అంటాడు.
కృతిపతి శ్రీవైష్ణవ స్వీకారార్హునిగా చూపినాడు. శ్రీహరి లక్ష్మీదేవి కన్నిగప్పి ఉరముపై భూదేవిని దాచుకున్నాడు. ఆభూదేవి మేఘమాలవలెనున్న నల్లని కాంతియై పైకుబ్బి హరివక్షపు మచ్చయై ప్రకశిస్తున్నది. అట్టి మచ్చగల శ్రీహరి, నల్లనివాడు కృతిపతిని దయాళువై యేలవలెనని ప్రార్థన.
ఈకవి రచనలన్నింటిలో పాండురంగమహాత్మ్యమే మిన్న. ఇది సుమారు క్రీ.శ 1565 లో అనగా ముదిమిలో వ్రాసిన గ్రంథము. అందుకే యిది భాషా జ్ఞానానుభవము ప్రౌఢత సంతరించుకొన్నది. కవి రాయలవారి అష్టదిగ్గ జములలో ఒకడని ప్రతీతి. చారిత్రక ఆధారములు చూపుట కష్టము. ఒకవేళ వుండివుండిననూ లేతవయస్సులో వుండి వుండ వచ్చును.
ఇక గ్రంథవిశ్లేషణకు వత్తము. పంచకావ్యములలలో ఒకటైన యీ గ్రంథము ప్రౌఢిమచే నగ్రగణ్యము. గ్రంథము
ఉ: స్కందపురాణ నీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ
నందను సత్కతోదయము. నవ్యకవిత్వ కళా కలాపమున్
గుందనమున్ ఘటించి కడుక్రొత్తగు సొమ్మొనరించి విష్ణు సే
వం దులకించు నప్పరమ వైష్ణవకోటి నలంకరింపుమా!- అని
కృతిభర్త చెప్పినట్లు వ్రాయుటచే, యీకథ స్కందపు రాణమునుండి
గ్రహించినదని తెలియు చున్నది. అందులోని ఉత్తరసంహిత లోని నవమధ్యాయములోని ఉమామహేశుల సంవాదమని బులుసు వెంకట రమణయ్యగారనిరి. కానీ అది సరిగాదనీ, పద్మపురాణములో కొంత వరకున్నదని పరిశీలకులు దెలిపిరి. ఏదియేమైననూ యిది ఐదశ్వాసముల శాంతరస గ్రంథము. ఇందులో సాంతమొక కథ సాగదు. అనేక భక్తిరస గాథలతో నిండిన గంథము. పుండరీకముని చరిత్రము, రాధా చరిత్రము, నిగమశర్మోపాఖ్యానము, సుశీలకథ, ఆయుతనియతుల చరిత్రలు, యిందులోనున్నవి. వీటన్నిటిలో నిగమశర్మోపాఖ్యానము మేలైనది. ఇదేకవిచే రచింపబడిన ఉద్భటారాధ్యచరిత్రములోని మదాలసుడు, శ్రీనాథుని కాశీఖండాంతర్గత గుణనిధి కథ, శివరాత్రి మహత్మ్యములోని సుకుమారకథ, కందుకూరి రుద్రకవి నిరంకుశో పాఖ్యానకథ యిదే కోవలోనివే యైననూ వీటన్నిటికన్న నిగమశర్మో పాఖ్యనమే రసనిష్యందియై నిలచినది. కవి " అభ్యుదయపరంపరా భివృద్ధిగా నా యొనర్పంబూనిన పౌండరీక మహాత్మ్యంబునకుం కథావిధానం బెట్టిదనిన" అని కథకుపక్రమించినాడు. కానీ అభ్యుదయమన్న పదమునకు నేడు మనమనుకొంటున్న అర్థంలో యీగ్రంథము సరిపడదు. కేవలం ఆనాడు అందరు కవులూ ఆనాడు అనుసరించిన ఒక సాంప్రదాయమనుకొని సరిపెట్టుకొనవలసినదే. ఒకటి మాత్రము గమనింపవలసివుంది. ఇందలి కథాంశముకన్నా కల్పనా చాతుర్యము ప్రౌఢకవిత్వపటిమ, అద్భుత శయ్యాలంకారములకే ప్రాధాన్య మియ్యవలసియున్నది. కవిచెప్పిన కొన్ని అభిప్రాయములనూ గమనించవలసి యున్నది.
ఉ: చాటుకవిత్వతత్వ రససాగరపారగులయ్యు సత్కవుల్
పాటిగబట్టి విందురొకపాటివి కావనకన్యకావ్యముల్
కైటభవైరి యౌవతశిఖామణి శ్రీసతి బేరురంబునన్
మాటియు నీటికెంపు బహుమానమునం బతకంబు సేయడే.
కావ్యం ఒకమోస్తరుదైనా చాటుకవిత్వరససాగర పారగులైన గొప్పకవులు గౌరవము జూపి వింటారు. హరి లక్ష్మీపతియైగూడా, నీటికెంపైన కౌస్తుభాన్ని మన్నించి తనయెద దాల్చినాడు. ఒకమంచి ఉపమ. ఇది నిజమైన పెద్దవారి తత్త్వం. అంటే రామకృష్ణుడు యెవర్నీ చిన్నచూపు చూడని వ్యక్తి.
తే: తప్పుగలిగిన చోటనే యొ ప్పుగలుగు
సరసకవితా వశోక్తుల సరణియందు
గప్పు గలిగిన నీహారకరుని యందు
నమృతధారా ప్రవాహంబు లడరుగాదే!
తే: కాన దోషాత్ములైన దుష్కవులకతన
గరిమ వహియించు గవిరాజు కావ్యమహిమ.
బహుళపక్షంబు చీకటి బహుళమగుట
జాయవెన్నెల తరితీపు సేయు కరణి.
దుష్కవుల కవిత్వంతో పోల్చినప్పుడు, సత్కవికి గౌరవం పెంపొందుతుంది. అదెలాగంటే కృష్ణపక్షంలోని చీకటివల్లనే పండువెన్నెల మరింత హాయి గొల్పుతుంది. అంతందుకూ చంద్రునిలో మబ్బుమచ్చలున్నవి. అయినా అమృతం కురిపించడంలేదా? కనుక చూడగల్గితే యెందులోనైనా
కొంత మంచి కనబడకపోదంటారు. ఇది రామకృష్ణుని విశాల హృదయానికి సాక్ష్యం.
ఇటువంటి కవిని "వికటకవిని జేసి అనేక అసభ్యహాస్యకథలు
అంట గట్టడం అన్యాయం. ఆయనకు "సరస కవితానాథుడు", కుమారభారతి", "ఫ్రౌఢకవి", "భక్తకవి" యనుపేర్లుకలవు. అవి సమంజసముగా తోచును.
పాండురంగమహాత్మ్యము లోని కథలను, వాటి తాత్త్వికతనూ మనం అంగీకరించకపోవచ్చును. అది మనిష్టం. కథలను మాత్రం సృజింపక తప్పదుకదా? ఆపని కానిద్దాం.
బ్రహ్మమానస పుత్రుడైన సూతమహర్షిని శౌనకాదిమునులు, స్వామీ! క్షేత్ర దైవత తీర్థములనదగు యీమూడూ సమప్రధానంగల క్షేత్రమేది? అని ప్రశ్నిస్తారు. ఆయన దీనికి జవాబుగా అగస్త్యముని విషయం చెబుతాడు. ఆయన వింధ్యను కట్టడిచేసి దక్షిణభారతానికి రావడం, కొల్హాపురి లక్ష్మీదేవిని పూజించడం, తర్వాత తుంగభద్ర దాటి కుమారస్వామి మలకు రావడం, స్వామిని మహర్షి క్షేత్ర దైవత తీర్థములు ఒకేచోట సమప్రాధాన్యత గలదా? యని అడుగగా కుమారస్వామి యీవిషయం ఈశ్వరునే అడుగవలయునని కైలాసమువెళ్ళి పార్వతీసమేతుడైన శివుని గలసి అడగటం, ఆయన పండరియే అట్టి స్థలమని తెలుయజేయటం జరుగుతుంది. ఆతర్వాత నారదుడు కూడా వచ్చి శివునిద్వారా విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. శివుడు అగస్త్య షణ్ముగ నారదులకు చెప్పిన పౌండరీక క్షేత్ర మహిమల కూర్పే యీ పాండు రంగమహాత్మ్యము. శివుడు వేరువేరుగా అగస్త్యకుమారస్వాములకూ, నారదునకూ, పార్వతికి చెప్పుటవలన కథలు పునరుక్తములైనవి. గ్రంథము పేరు ఆశ్వాసాంతమున పాండురంగమహత్మ్యమని పేర్కొనెను. కానీ కృతిభర్త కోరికగా
కం: యశము కలిగించు నీ మృదు
విశదోక్తుల బౌండరీకవిభు చరిత్ర చతు
ర్దశభువన విదితముగ శుభ
వశమతి నాపేర నుడువు పరతత్త్వనిధీ-- యనిపించినాడు.
అంతేగాక, నాయొనర్పంబూనిన పౌండరీక మహాత్త్యంబునకు కథా విధానంబెట్టిదనిన అని తొలుతనే నుడివినాడు. కనుక దీనిని పౌండరీక మహాత్త్మ్యమనికూడా అనవచ్చును. అనగా పుండరీకునకిందు ప్రాధాన్య మున్నది. పుండరీకుడు భక్తితో మాతాపితలను సేవించినవాడు. అతడు
సీ: తనువుతో జరియించు ధర్మదేవతబోలె
మొలపున వనవాటి కలయదిరుగు
గణనమీరిన శౌరి గుణముల హృదయసం-
పుటినించుక్రియ విరుల్ బుట్టబెట్టి
తనకు పవిత్ర వర్ధనమె కృత్యంబను
కరణి నూతన కుశోత్కరముముల గూర్చి
యపవర్గ ఫలసిద్ధి హదనైన జేపట్టు-
కైవడి బహుఫలోత్కరములొడిచి
తే: యోగయాగంబు సల్పుచో నూర్మిపశుని-
శనమొనరించుటకు యూపసమితి దెచ్చు-
భాతి సమిధలుగొని మహాప్రాజ్ఞుడతడు
వచ్చు లేబగటికి నిజావాసమునకు
అనును. ఇక్కడ ఊర్మి పశునిశనమన షడూర్ము లైన జరామరణములు, క్షుత్పిపాస, శోకమోహము లనే పశువుల బలి యని యర్థము.
సీ: చలిచీమ నేనియు జాదొక్క శంకించు
పలుకడెన్నడు మృషాభాషణములు
కలుషవర్తనులున్న పొలముపొంత జనడు.
కలిమికుబ్బడు లేమి గలయదాత్మ
దలయెత్తిచూడ డెవ్వలన పరస్త్రీల
ధైర్యంబువిడడెట్టి ధర్దరముల
నొరుల సంపదకునై యుపతసింపడు లోన
నిగమ ఘంటాపదైకాద్వనీన బుద్ధి
తే: మిన్నకయె చూడడాకలిగొన్న కడుపు
సర్వభూతదయోత్సవమొనర్చు
నిగమ ఘంటాపదైకాద్వనీన బుద్ధి
బ్రహ్మ విద్యానవధ్యుండు బ్రాహ్మనుండు.
అని కొనియాడినాడు. పెద్దన ప్రవరాఖ్యునకు దీసిపోని గుణములు గల వానిగా పుండరీకుని తీర్చిద్ధినాడు.
అనేక కార్యముల నిర్వహణ నిమిత్త మవతరించినాడు శ్రీకృష్ణుడు. అందులో పుండరీకముని ననుగ్రహించుట గూడా ఒకపనియైనది పాండురంగ మహాత్మ్యమున. అతని తపమునకు మెచ్చి, అతని కోరికప్రకారం అక్కడే బాలకృష్ణరూపమున చేతులు నడుమున కానించుకొని యిటుకపై నిలచి ఆ క్షేత్రమును పౌండరీకమహాక్షేత్రము గావించినాడు.
కృష్ణావతారమున ఆయన సంతోషమునకై బ్రహ్మ శక్తిని భూమికి పంపినాడు. ఆశక్తి నందుని మరిందియగు శతగోపుని పుత్రి రాధగా జన్మించినది. ఆమె ఆరు ఋతువులలో కలుగు ప్రకృతిక్లేశములకోర్చి ఋణవిమోచన తీర్థమున గోవర్దనగిరి చెంత తపమాచరించి శరదృతువున కృష్ణుని ప్రత్యక్షమొన రించుకొని తనప్రేమలు పంచినది. సందర్భానుకూలముగా రాధను, ఋతువులనూ కవి హృద్యముగా వర్ణించినాడు... రాధ
కం: వలరాజు కేలి వాలుం
బలుకయుబలె నలరు వేణి పాణింధమమై
లలితాంగి వెన్నుపట్టియ
తళతళమను కుందనంపు దగడున్ దెగడున్.
శా: ఈ ధారన్ భునైక మోహన కళాహేలా విలాసంబులన్
రాధాకన్యక ధన్యకాంతి దనరారన్ దద్వశాశారతిన్
గోధుర్బాలక దివ్యమూర్తియగు శ్రీగోవిందుడంభోజినీ
మాధుర్యంబున కగ్గలించు నళిసమ్రాడాకృతిం గైకొనున్.
ఇంకా..
తే: వాసుదేవ నానాశక్తి వైభవంబు
రుక్మిణిసత్యభామల రూపురేఖ
యిదియె వహియించెనని నల్వయిడిన పదనొ-
కంటి లెక్కన కనుబొమ్మ లువిదకమరు.-- అంటాడు.
రధాదేవి మన్మథుని కత్తీ డాలై మెరిసిందట. అదేవిధంగ భువనైకమోహన కళా హేళావిలాసినియైన రాధ పువ్వై, అందలి తేనియకాకర్షితమైన గండుతుమ్మెదయైనాడట కృష్ణుడు. అంతేగాదు ఆమెకన్బొమలు తెలుగులో ౧౧ గా అమరాయట ఆ పదకొండును మనం వసుదేవుని నవశక్తులైన ఇచ్చా, జ్ఞాన, క్రియా, ఉత్సాహ, ప్రభుత్వ, మంత్ర, సత్త్వ, రజ, తమః శక్తులు, మరిరెండు రుక్మిణీసత్యభామల రూపురేఖలు కలసి పదకొండై రాధ కనుబొమ లయ్యా యట. ఇటువంటి అద్భుత వర్ణనలకు కొదువేలేదు పాండురంగ మహాత్త్మంలో. పండరి ద్యైతక్షేత్రం. వారు రాధాదేవి ప్రణయము నొప్పుకొనరు. కానీ రామ కృష్ణుడు విశిష్టాద్యైతుడు. అందులో తెంగలతెగయో వడగల తెగయో సరిగా తెలియదు. తెంగలయని నారాయణాచర్యులు, వడగలయని అనంతకృష్ణ శర్మతెలిపినారు. ఏదియేమైనా రామకృష్ణునకు ఆ పట్టింపులు అంతగలేవని తేలినది.
పాండురంగమహాత్త్మంలో అనేక భక్తకథ లున్నవని ముందుగనే అనుకొంటిమి. అందులో ఒక భక్తురాలు కలదు. ఆమె స్వామికై కుండలతీర్థమున తపించినది. అశ్వత్థ రూపమున నరసింహు డక్కడున్నాడు. స్వామి ప్రత్యక్షమైనంతనే ఆమె, కాళ్ళపై బడినది. ఆమెకేశబంధమాసమయమున విడిపోయినది. స్వామి కనికరించి ఆప్రదేశమును ముక్తకేశినీ క్షేత్రముగా వెలుగొందజేసి, ముక్తకేశినికి మోక్షమొసంగినాడు. ఈవిధంగా తపించి మోక్షమొందిన భక్తులేకాదు. ఏదో కాకతాళీయంగా జరిగిన సంఘటనలకుగూడా యిక్కడి స్వామి సేవగానే స్వీకరించి గోవు, కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగలకు ఉత్తమమనదగు మానవజన్మ ప్రసాదించి, తర్వాత ఉత్తమగతులు కల్పించి నాడు. అంతగొప్పదనంగలదీ క్షేత్రం. ఆవు మురళీగానం వింటూ పాలు కార్చింది. అందులో ఒక బిందువు గాలివాటమున స్వామిపైబడినది. ఆగోవు క్షీరాభిషేక పుణ్యము వడసి సుశీలయను భక్తురాలై పుట్టింది. కాకి దాని రెక్కలగాలివల్ల గుడి శుభ్రమైనది. అదిఒక పుణ్యకార్యమై మరుజన్మలో సుశీలకొడుకై పుట్టింది. హంస కొలనిలోమునిగి నీటిని గుడిలో విదిల్చినది. దానితో గుడి స్వచ్ఛమైనది. దానికి ప్రతిగా అదియూ సుశీలకొడుకైనది. చిలుకదాని యజమానురాలైన హరిదాసి ముత్యాల హారము గొనిపోవు చుండ గుడిప్రాంగణమున జారిపడి ముత్యాలురాలి అవి ముత్యాలముగ్గ య్యెను. ఆపుణ్యమునకు అదియూ సుశీల కొడుకయ్యెను. పాము యెలుకను వెంబడించి అన్యాపదేశముగా స్వామిపైనున్న మొగలి పువ్వు సువాసన నాఘ్రాణించి సంతసమున పడగవిప్పియాడెను. దాని పడగపైనున్న రత్న కాంతులు దీపకాంతులైనవి. అదీ సుశీల పుత్రుడయ్యెను. ఇక తేనెటీగ. ఇది స్వామిని పూజించిన తీర్థం పువ్వుపై బడగా ఆతీర్థాన్ని మకరందంతో సహా త్రాగింది. దానికి తీర్థసేవన పుణ్యంగలిగి, సుశీలకొడుకై పుట్టింది.
ఇలా మనుజజన్మమెత్తిన సుశీల వద్దకు వటువు రూపమున స్వామి బిక్షా టనకువచ్చి, చద్దన్నముతిని, యింకా ఆకలి తీరలేదంటే తనఆహారాన్నీ, తుదకు తనభర్తకై దాచిన ఆహారాన్ని కూడా పెట్టి పరీక్షలో నెగ్గింది. స్వామి ఆమె భక్తికీ పాతివ్రత్యానికి మెచ్చి, కఠినుడైన ఆమె భర్తను సజ్జనునిగా మార్చి కడకు సాయుజ్య మొందునట్లు వరమిచ్చినాడు.
ఉ: తాళి విభుండు గట్టిన మొదల్ పతి దేవత. యా సుశీల పెన్
గోలతనంబునన్ మగడు కొట్టిన దిట్టిన రట్టుపెట్టినన్
దాళి దినంబు దచ్చరణ తామరసంబులు గొల్చు నేలయున్
బోలునె యీపెకంచు గృతబుద్ధులు వృద్ధులు ప్రస్తుతింపగన్.
సీ: రూపహీనుడు మహాక్రోధనుడతిలోభి
బద్ధమత్సరు డన్యబుద్ధి మాయి
చంచలస్వాంతుండు సకలబంధువిరోధి
బహుళపదోక్తి లంపటుడు శఠుడు
సంతతావిశ్వాస సస్యప్రరోహుండు.
గర్వపర్వత మస్తక స్థితుండు
కలహాశనుండు కుతర్కక్రియాకుశలుండు.
సంగతోన్మాదోత్తమాంగకుండు.
తే: నగునయేనియు నటువంటి మగనితోడ
కాపురముసేయు సతి దొడ్డ గరిత యగుచు
గడిసికోతలకోర్చి లో విసిగి కొనక
ధాతదూరక తండ్రి చేతకు వగవక
పతిసేవచేసిందట. ధాతదూరుట, తండ్రిచేతకు వగచుట అనుమాటలు ప్రత్యక్షంగా కవి గమనించినవై యుండును. అంతేగాదు ఆమె మును సూర్యుని వేడిమికి తాళి సంసారముచేసిన ఛాయాదేవిగా భాసిల్లినదట. చూడుడు.
శా: ఆ తీవ్రాంశుని వేడికోర్చి మును ఛాయాదేవియుంబోలె స
త్పాతివ్రత్య గుణాభిరామయగు నా భామాలలామంబు సం ప్రీతుంజేయు నసహ్యదర్శనములన్ బీర్వీకులంబెట్టు దు
ర్జాతుం వీతదయున్ బ్రియున్ దదుచితాచారంబుల నిచ్చలున్.
ఈ పాతీవ్రత్య లక్షణంబులు ఆకాలనికి గొప్పలైనవేమోగానీ, నేటికి వర్తించవు. స్త్రీవాదులసలొప్పుకొనరు. కానీ కవి ప్రతిభ ఆనాటి ఆదర్శస్త్రీ లక్షణములు మాత్రము గుర్తించదగ్గవి. ఆనాటి కాలానుగుణముగా అట్లు వ్రాయవలసినదేగదా? ఆవిధమైన నడవడితో సుశీలతరించినది. కొడుకులకు హితబోధ చేసినది. వారినీ తరింపజేసినది.
ఈ క్షేత్రతీర్థ మహిమలు మరిన్ని కథలలో విపరీతముగా గొనియాడినాడు కవి. ఒక బోయవానిచేత గాయపడిన జింక యిచ్చటి సంగమతీర్థమునబడి విద్యాధరరాజైనది. వేటాడిన బోయవాడు ఆతీర్థమున స్నానమాడి దివ్యత్వమును బొందినాడు. సుశర్మయను పరమకిరాతుడు యిక్కడి పద్మతీర్థ మున నీరుద్రావి పాపరహితుడైనాడు. చిత్రగుప్తుని చిట్టాలో యితని పాపము లను సాక్షాత్తూ విష్ణువే తొలగించి వేసినాడు. ధర్మరాజు తనతమ్ముల తో సనందుని సహామేరకువచ్చి పండరి దర్శించినమాత్రమున జ్ఞాతుల జంపిన పాపము తొలగిపోయెను. ఈకథలన్నీ గమనించిన యిక కర్మసిద్ధాంతము లకు తిలోదకములిచ్చినట్లైపోయెను. ఈ క్షేత్రమువల్ల ఫలిత మనుభవింపకనే పాపముల బాపికొనుట అతిసులభమై పోయెను. ఇక అతిముఖ్యమైన నిగమశర్మోపాఖ్యానమూ అటువంటిదే.
సభాపతియను సద్బ్రాహ్మణుని కొడుకు నిగమశర్మ. నిగమమంటే వేదం. ఇతడు పేరుకే నిగమశర్మ.
సీ: ఉహ్హున హోమాగ్ని యూదనొల్లడుగాని
విరహజ్వరార్తుడై వెచ్చనూర్చు
సంధ్యకు ప్రార్థనాంజలి ఘటింపడుగాని
యెరగు నీర్షాకషాయిత కర్థి
ఆగమవాదంబు లౌకాదనడుగాని
విటవాదములె దీర్చు వేగిలేచి
కంబుకృత్పాదోదకంబు గ్రోలడుగాని
యౌవతాధర శీధు వానిచొక్కు
తే: బుణ్యచిహ్నంబు లపఘనంబున ఘటింప
సిగ్గువడుగాని కరనఖ శిఖర విఖన
జాతనూత్న క్షతాంకముల్ సమ్మతించు
నారజముమీరి యాదుర్విహార హారి.
తే: నిగమశర్మాభిదానంబు నేతిబీర
కాయయునుబోలె నయదార్థ గాథ దాల్ప
వైదికాచార దూర ప్రవర్తనముల
వీటి విహరించు చుండు నవ్వీటి ప్రోగు.
ఇతడు పక్కా తిరుగుబోతు. కులభ్రష్టుండు. వీనిని బాగుచేయుటకు వీని అక్క భర్తాపిల్లలతో వచ్చి నయాన భయానా బుద్ధిచెబుతుంది. ఈమె తమ్మునికి చేసిన హితబోధ గ్రంథమున అతిప్రాశస్త్యము నందుకొన్నది.
సీ: పరమేష్ఠి నుండి నీతరముదాక విశుద్ధ
తరమైన వంశంబు తలచవైతి
దరిద్రొక్కియున్న యీ తల్లిదండ్రులజాల
బఱచవై సంతోష బఱచవైతి
అగ్నిసాక్షిగ బెండ్లియాడిన యిల్లాలి
నిల్లాలితాకార నొల్లవైతి
ధర్మశాస్త్రార్థవిత్తముల విత్తములచే
నలరించి విఖ్యాతి నందవైతి
తే: శీలమఖిలంబు పిల్లిశీలమగుచు
చదువులన్నియు నివి చిల్క చదవులగుచు
దోడివారలు నవ్వ నాతోడయేల
బేలవైతివి యీగుణమేల నీకు.
చం: విడుమికనైన యిట్టి యవివేకము మామకబుద్ధి పద్ధతిన్
నడువుము నీకు గావలసెనా హరికౌస్తుభమైన దెచ్చెదన్
గడుసరి యచ్చకూళ పలుగాకుల వీడుము చేయిమీదుగా నడచిన పూర్ణకాముడవు నాయనుజన్ముడ నిట్లుసేయదే!
యని మందలించి బుద్ధి గరపిన అక్కమాటవినినట్లు నటించి, ఒకరాత్రి యింటివారిని మోసగించి భార్యసొమ్ములతో, యింటిలోని వారికున్నదంతా సంగ్రహించి పారిపోతాడు. దొంగలబారినపడి సొమ్ముపోగొట్టుకొని దెబ్బలు తింటాడు. ఒకరైతు కాపాడి దగ్గరకుతీస్తే గంగజాతర సంబరాలలో యింటివారు మునిగియున్న సమయము జూచుకొని రైతుకోడలిని లేపుకపోతాడు. ఆమె కొన్నాళకు చనిపోతుంది. ఆతర్వాత అడవిలో ఒక ఆటవికస్త్రీని వశపరచుకొని ఆమెకొఱకు వేటనేర్చి మాంసాహారియై కుదురుగా సంసారంచేసి పిల్లల్ని గంటాడు. ఎవరేమనుకున్నా సిగ్గు లజ్జ లేకుండా తిరుగుతుంటాడు.
ఉ: ఈ కడజాతినాతి కిహిహీ మహీదేవుడు చిక్కెనంచున్
రాకకుబోకకున్ జనపరంపర కెంపగుచూడ్కి జూచి యం
బూకృత మాచరించుటకు బుద్ధి దలంక కలంకముక్త చం
ద్రాకృతి బొల్చు నీముఖమునందమృతస్థితిగాంచి మించుటన్.
అంటూ ఆమె ముఖమునందమృతస్థితి గాంచినాడట. ఏమిరాయిదియని ముఖంపై ఉమ్మినా పట్టించుకోలేదట. ఇటువంటిస్థితిలో ఒకరోజు వేటనుండి రాగానే వాని భార్యాబిడ్డలు యిండ్లు తగలబడి కాలి చనిపోయి వుండటం చూచి వాని మనసు వికలమైపోయింది. అన్నపానదులుమాని నేరుగా పండరిలోని నరసింహక్షేత్రంలో బడి గుడిలోని స్వామినేచూస్తూ మరణిం చాడు. యమభటులూ హరిభటులూ వచ్చారు. వారిలోవారు వాదించుకొని వాడు పుణ్యాత్ముడేనని హరిభటులు వైకుంఠము తీసుకెళ్ళినారు. ఎంతపాపి కైనా మోక్షం ప్రసాదిస్తుందీ క్షేత్రమంటాడు కవి. ఈ క్షేత్రమహిమను ఉమ యెదుట శివుడే ఘనంగా శ్లాఘించినాడు.
ఉ: ఆయదుభర్త నాహలధరానుజు నా నవనీతచోరు నే
బాయనిభక్తితో గొలుతు బ్రత్యహమున్ గృహదైవతంబుగా
నో యరవిందకోరక సహోదరా! చారుపయోధరాడ్యా! ని
శ్రేయసకాంక్ష దక్కితరులు చేరి భజింతురనంగ నేటికిన్ .
అని యీక్షేత్రమహిమను ద్రువపరుస్తాడు. అదీమరి యీక్షేత్ర మహిమ. అంతేగాదు భీముడనగా శివుడు. ఆశివుడు త్రిపురాసురసంహార శ్రమతో చెమటగార్చాడట అది భైమినది యైనది. అదే భీమరథి యై కృష్ణకు ఉపనదిగా పవిత్రతీర్థమై యిచ్చట పారుచున్నది. కనుక యిది పాండురంగక్షేత్రమేగాదు, పాడురాంగక్షేత్రము అంటె పాండుర అంగ పాడురాంగ, తెల్లని దేహము గలవాడు, శివుడు గనుక శివక్షేతమూనైనది.
ఇక అయుతనియతులున్నారు. వీరు అగస్త్యమునిశిష్యులు. వీరికి పెండ్లిచేయదలచి గురువు బ్రహ్మపుత్రికలైన గాయత్రి సావిత్రులను తీసుకవ స్తాడు. ఆయుతుడు తాను సంసారలంపటములో పడనని తపస్సుకుపోతాడు. నియతుడే యిద్దరు కన్యలనూ వివాహమాడతాడు. ఆయుతునికి బుద్ధిచెప్ప నెంచి ఇంద్రుడు వచ్చి హితబోధచేస్తాడు. కానీ వినడు. తుదకు ఇంద్రుడు, కామధేనువును ముసలిఆవు రూపంలో ఆయుతుని ఆశమంలో విడిచి వెళతాడు. ఆయుతుడు ఆగోవు బాధ చూడలేక పోషిస్తాడు. ఒకరోజు విసుగెత్తి దీనివల్ల నాతపం పాడౌతున్నదని ఆవును తరుముతాడు. అది ప్రయాసకులోనై వాధూలమునిని త్రొక్కుతుంది. ముని ఆయుతుడుచేసిన పనికి కోపగించి కప్పవై పొమ్మని శపిస్తాడు. ఆకప్ప పుండరీకక్షేత్రంలో రంగురంగులకప్పగా కొలనిలోజీవిస్తూ వుంటుంది. ఒకరోజు ఆ దేశపురాకుమారి చెలులతోవచ్చి యీ కొలని కప్పనిజూచి దానితో ఆడుకొంటూ ఒక బ్రాహ్మణునిపై విసరి వేస్తుంది. భయపడిన ఆ బ్రాహ్మణుడు ఆమెనూ కప్పవుగమ్మని శపిస్తాడు. ఆకప్ప యీకప్ప కలిసి సంసారంజేసి పిల్లలనుగంటాయి. అందువల్ల అనపత్య దోషంపోయి కప్పలు కైవల్యంపొందుతాయి. ఈకథలో సంసారజీవనం విశిష్ఠమైనదని, సన్యాసజీవనం ప్రకృతివిరుద్ధమని నిరూపించినాడు కవి. ఈకథ సమంజసముగా వుందనిపిస్తుంది.
రామకృష్ణునికి హాస్యప్రియుడన్న పేరున్నది. అది కొంతవరకు నిజమేనని పాడురంగమహాత్త్మ్యం నిరూపిస్తున్నది. నిగమశర్మ భార్యబిడ్డల వియోగంలోసహితం
ఉ: ఎల్లరునెల్లచో ధనము లిచ్చి మృగాక్షులగొండ్రు గాని యో
పల్లవపాణి యే పరమపావన వంశము నిచ్చి కొంటి నీ
నల్లనిరూపు నిక్కమని నమ్మి దృవంబదిగాక నేడు వి
ద్యుల్లతికాధికాభినయ దుర్వహమౌట యెఱుంగ నింతకున్.
అంటాడు. నీనల్లనిరూపు నిక్కమనినమ్మి నాపరమపావనవంశము వోలిగా జేసి నిన్ను పొందితి ననడంలో హాస్యమున్నది. నిగమశర్మ తన స్థితిపై తానే హాస్యమాడినాడు. అయినా ఆసమయంలో జాలికంటే హాస్యమే అతికినాడు కవి. అంతేగాదు నిగమశర్మ యిల్లు గుల్లచేసి వున్న సొమ్మంతా దోచుకొనిపోతే
సీ: శోకించు వృద్ధభూసురుడాత్మ పితృదత్త
దర్భముద్రికకు. జిత్తముగలగి
అత్తవారిచ్చిన హరిసు దర్శన పు బే
రునకు ముత్తైదువ నవటబొందు.
క్రొత్తగా జేయించుకొన్న ముక్కరకునై
యడలు దుర్వారయై ఆడుబిద్ద.
జామతవెతనొందు వ్యామోహియై నవ
గ్రహ కర్ణవేష్టనభ్రంశమునకు.
తే: నెంతదుర్బుద్ధి యెంత దుర్భ్రాంతి యహహ
సర్వధనములు నద్దురాచారశీలు
మూచముట్టగు నిలుదోచి యురికి చనుట
యెరుగరోగాక యవ్వేళ యెఱుక గలదే.
కొడుకు పాడై దూరమై పనికిరాకుండాపోయాడే యనిగాక చిన్నచిన్న వస్తువు లయిన దర్భముద్రిక, చెవికమ్మలు,ముక్కెరా పోయాయని యేడ్చారట. ఇది హాస్యమేగదా! ఇక బాలకరూపముననున్న పాండు రంగస్వామిని పట్టుకొని యెన్నియేడ్లు గడచినా వేవేలేండ్ల వెలయుప్రాయంపుగల కొయ్య విఠ్ఠలయ్య యని హాస్యమాడతాడు. ఇలా అనడంతో భక్తిరసభంగం కలుగదా! యని యనుకొనవచ్చును. కానీ రామకృష్ణుడు భక్తిరసంలో మునగడు, మనలనూ మునగనీయడు. ఇట్లే యితని రచన సాగుతుంది. ఈ కొయ్య విగ్రహాన్ని రామకృష్ణుడు చూచియుండవచ్చును. కృష్ణరాయలు అక్కడి విగ్రహం తరలించగా తాత్కలికంగా యీదారుశిల్పం నిలిపి తర్వాత శిలావిగ్రహం నెలకొల్పి యుండవచ్చును. రామకృష్ణుడు
కం: కవి యల్లసాని పెద్దన
కవి తిక్కనసోమయాజి గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ
కవియను నామము నీటికాకికి లేదే?
అనడంలో ఒకరకంగాజూస్తే అనగా గణుతింపంగా వరకు నిలిపి చదివితే, కవియనునామము నీటికాకికి లేదే? నేనూ కవినేనా? అది నీటికాకిని కవి యని పిలిచినట్లే నన్న అర్థము వస్తుంది. అంటే తనపైతానే జోక్ వేసుకొన్నట్లేగదా! ఇటువంతి వింకనూ జూపవచ్చును. కవి హాస్యము సున్నితము. అంతేగానీ మనం వింటున్న హేయహాస్యమితనిది గాదు. ఇతనిపై రుద్దినది మాత్రమే.
కవి తనరచనలో సమకాలీనవ్యవస్థను, కట్టు బొట్టు ఆచారాలను సమయను కూలంగా వర్ణించినాడు. గా లిగంగల జాతరలలో పర్వదినాలలో ఆడవారి అలంకారాలు చక్కగా వర్ణించినాడు.
సీ: గోర్వెచ్చ చమురటుకొనిరి మస్తకముల.
జలకమాడిరి నిశా మిళిత వారి
కట్టిరి చిఱుతచౌకముల క్రొంబుట్టముల్
కాటుకదిద్దిరి కన్నుగవల
దిద్దిరి సిందూర తిలకంబు బటువుగా
నిక్కుగొప్పులవిరుల్ గ్రుక్కి రర్థి
నింబప్రవాళ మాల్యంబులు వైచిరి
చిట్టిబొట్టు ధరించి రిట్టునట్టు.
తే: దరుణ ధావన ధ గ ధగ ధశన మణుల
హత్తుకొలిపిరి లేత వీఢ్యములడాలు
పర్వదినముల బామర ప్రమద లుదిత
నియమ సంభావనారంభ నిభృత బుద్ధి.
అని తెలిపినాడు. ఇక యువకులతీరు నిగమశర్మ బలదూర్ తిరుగు సందర్భమున వర్ణించినాడు.
చ: తలగడు గంగమర్థనము దౌతపటావరణంబు సంస్కృతో
జ్వల కలమాన్నభోజనము చందనచర్చ ప్రసూనదాయకం
బులు గప్పురపు వీడ్యము భూషణపంక్తులు గల్గి నిచ్చలున్
బులుగడుగంగబడ్డ నునుముత్యము బోలుచు వాలుచుంబురిన్
సీ: కలదులేదను వాదములకోర్చి మీనుమీ
సము వోలెనుండు జందెము మెఱవగ
బహు సంకుమదపంక పాణింధమంబైన
తాళి గోణపుజుంకు నేలజీర
గడలేని వీడ్యంపు గప్పుచుందురు గావి
మోవిపల్లొత్తుల ముసురుదన్న
సానతాకులు గల్గు సూనాస్త్ర శంఖంబు
గతి నఖరేకాంక గళముదనర
తే: సఖులు పరిహాసకులు వెంట జనగ యువతి
భుక్త నిర్ముక్త పరిధాన యుక్తుడగుచు
నగర ఘంటాపథంబున నగుచు దిరుగు
నొఱపుగల ఠీవి జాతిమాత్రోపజీవి.
అదీ ఆనాటి యువకుల ఠీవి.
పాడురంగమహాత్మ్యంలో కవి కొన్ని క్రొత్తపదాలు కల్పించి ప్రతిభచాటినాడు. ఉదాహరణకు శివుణ్ని కద్రూజాంగదుడు, కృష్ణుని మందపోయాండ్ర కూరిమి మిత్రుడు, నాగకన్యలను చక్షుశ్రోత్ర కన్యలు, నారదుని వీణాముని, కౌస్తుభమును నీటికెంపు అన్నాడు. ఎద్దును కొమ్ముతేజు, పశువులద్రోలు కర్రను ధేనుదండమన్నాడు. చక్రాన్ని చుట్టుంగత్తి, కప్పను రాతికొడుకు, బ్రహ్మచారిని గోచికట్టు, జోలెసంచిని క్షుల్లకాశిక్యము అన్నడు యింకా యిటువంటివి చాలానేవున్నాయి.
అడుగులకు మడుగులోత్తు, ఆకుమరంగుపిందె, పొన్నాకుపైతేనె, తనకుబోదు నాకుబోదని, కంపలబడ్డకాకి, తేనెపూసినకత్తి, యేనుంగు మీదనున్నవాని మేరమీరి సున్నమడుగజూచుచున్నారు, వంటి జాతీయాలు విరివిగా వాడుకొన్నారు. అంతేగాక స్వంతపదప్రయోగాలూ చాలానే జేశారు. మాదిరిని మాద్రి అన్నారు. పలుకులవంటి కి పల్కుల్వంటి అన్నారు. నిరుపేదను నిర్పేద, కొలనిలో అనుటకు కొల్నిలో, ఎడమను ఎడ్మ, పొలతుకను పొల్తుక అని వాడారు.
ఇలా ప్రౌఢమైన రచనాతీరు, క్రోత్తపదాలూ, స్వతంత్రసమాసాల కూర్పుతో చదువరులకు చాలచోట్ల అర్థముతెగక తమకుతోచిన రీతిని పాఠాంతరముల కల్పించి అర్థము చెప్పిన సంఘటనలు యీ గ్రంథామున గలవు. మచ్చునకొకటి చూతము.
మాలిని: సరసగుణ రతీశా షట్సహస్రాన్వయేశా
నిరవధిక గుణాబ్ధీ నిత్య సత్యోపలబ్ధీ
హరిహయ సమభోగా యాచమానామరాగా
కరగత నిగమాళీ కావ్యకృత్పద్మహేళీ
అన్నారు. "షట్సహస్రాన్వయేశా" అంటే ఆరువేలనియోగి బ్రాహ్మణేశా అని అర్థం చేసుకోవాలి. ఇక "యాచమానామరాగా" అంటే యచమాన అమర అగా గావిడదీసుకోవాలి. అగా అంటే అగము అంటే చెట్టు లేక కొండ. గమించ లేనిది, కదలలేనిది. అమర అగా అంటే దేవవృక్షము కల్పవృక్షము అనుకోవాలి. యాచకులకు కల్పవృక్షము వంటివాడా అన్నది అసలుఅర్థం. ఇది అర్థముగాక ఆ సమాసాన్ని "యాచమానానురాగా" గా మార్చుకొని యావకులపై ప్రేమగలవాడా అని అర్థము వ్రాసినారు. ఇట్టి సవరణలు పాండురంగమహాత్మ్యమునందు అనేకములున్నవి. అంతెందులకు యిది సామాన్య చదువరులకు నిజంగా కొంత కష్టతరమైన గ్రంథమే.
పాండురంగమహాత్మ్యమునకు సంస్కృతానువాదం పూనా భండాకర్ పరిశోధనాలయంలోనూ, కాకినాడ ఆధ్రసాహిత్య పరిషత్తులోనూ లభించు చున్నది. తొలుత యిదే మూలగ్రంథమనుకొనిరి. కానీ రామకృష్ణుని తెలుగు పాండురంగమహాత్మ్యమే అసలుదని తేలినది. మరియొకమాట "పాండురంగ మహాత్మ్యం" తెలుగు సినిమాలో అసలీకథలేవిలేవు. కానీ తెలుగు "వైతాళికులు" రచయిత డి.ముద్దుకృష్ణయ్యగారు పుండరీకుడే నిగమశర్మ యని వ్రాసెను. తొలి నిగమశర్మ తర్వాత పుండరీకుడుగా పరివర్తన చెందినా డని అతని వూహ కావచ్చును. దీనివలన సినిమాకథకు అసలుకథకు కొంత సామ్యము కుదిరినది.
ఇక రామకృష్ణుని ప్రస్తుతిస్తూ పాండురంగమహాత్మ్యము ప్రౌఢశైలీ నిర్మాణము చేత కైలాసశిఖరము వంటిది. భాషాలో తర్వాతి కవులందరికీ ప్రౌఢీసంపాదన కితని రచన యొరవడియని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారన్నారు. ఆచార్య దివాకర్లవెంకటావధాని వర్ణనావైవిధ్యము భాషా పాటవము కల్పనాచమత్కారమూ వీటిచేత యీకావ్యము చక్కగా హృద్యముగా రూపొందిందన్నారు. ..... నమస్తే!.
ఆవె: విష్ణుభక్తులై, వివేకులై, తృష్ణా వి-
దూరులై, స్వకుక్షిపూరణంబు
సమయసంభృతర్థి సంతృప్తిగాఁ గొని
నడచువారు భయముఁ గడచువారు.
పాండురంగ మహాత్మ్యము- 5-319.
సాహిత్యా కాడమి బెంగళూరు వారి తరపున, గడియారం సాహితీ పీఠం జమ్మలమడుగు వారు 12-02-2017 న జరిపిన సదస్సులో యిచ్చిన ఉపన్యాసము.
శ్రీ శ్రీధర తిరుపతయ్య జీవితం - కవితావైదుష్యం
శ్రీ శ్రీధర తిరుపతయ్య గారు వీరపునాయుని పల్లె మండలం (కమలాపురం తాలూక) లోని పాలగిరి గ్రామంలో1905 లో జన్మించారు. తనకు 65 సంవత్సరాలు దాటినతర్వాత తన "రాణా యమరసింహ చరిత్ర" తల్లిదండ్రులకు అంకితమిస్తూ తన్ను గురించి ఇలా వ్రాసుకున్నారు.
సీ: శ్రీధర వంశాబ్ధి శీతమయూఖుడౌ
"వెంకట సుబ్బయా"భిఖ్యు పితను,
జనని "శ్రీరామలక్ష్మాంబ " ను, సంతతం
బవిరళ భక్తి మదాత్మనిల్పి
పరలోకవాసులౌ చిరకీర్తనీయుల
బూజింప నర్హమౌ పుష్పసమితి
బరికింపగానకే, బలుకష్టములకోర్చి
రచియించినట్టి మద్గ్రంథరాజ
గీ: మంకితమ్మిడి పద్యమ్ము లనెడి సుమల
వారి పదపీఠి నర్పింప వాంఛ వొడమ
బూజనొనరించి సంతృప్తి బొందినాడ
నరువదియునైదు దాటెడి యపర దశను.
దీనితోపాటు యిదే గ్రంథములో ఆశ్వాసాంత గద్యంగా కూడా వివరాలు తెలియజేశారు.
“ ఇది శ్రీమద్ఘటికాచల నారసింహ కరుణాకటాక్షవీక్షా సమానాధిత సుకవిజనవిధేయ, శ్రీధరవంశ సుధాంబోధి పూర్ణిమాశశాంక, హరితస పవిత్రగోత్ర, సత్కవిజనానుగ్రహపాత్ర, వేంకట సుబ్బయాభిఖ్య, రామ లక్ష్మాంబా తనూభవ, తిరుపతి నామధేయ, విరచితంబైన "శ్రీరాణా యమరసింహ చరిత్రం" బను పద్యకావ్యంబున ఫలానా ఆశ్వాసము అని వివరంగా వ్రాసుకొన్నారు.
వీరు పుట్టి పెరిగిన పాలగిరిలో బ్రాహ్మణులే పెద్దభూస్వాములు. వీరి భూములనే చాలామంది రైతులు కోరుకో, గుత్తకో తీసుకొని వ్యయసాయం చేసుకొనేవారు. బ్రాహ్మణులు కూడా స్వంతంగా వ్యవసాయం చేసేవారు. నిజానికి రచయిత తండ్రి శ్రీధర వెంకట సుబ్బయ్యగారు పాలగిరిలో
రామలక్ష్మమ్మను వివాహం చేసుకొని యిల్లరికపుటల్లుడయ్యాడు. దాంతో శ్రీధరవారు పాలగిరివాసులయ్యారు. అసలు వీరిది ప్రొద్దుటూరు దగ్గరి చిన్నశెట్టిపల్లె. అక్కడ శ్రీధర శేషం భట్టు, ఎల్లమ్మ దంపతులకు జన్మించినవాడే వెంకటసుబ్బయ్య.40 ఎకరాల ఆసామి. వెంకటసుబ్బయ్య అమరం, ఆంధ్రనామసంగ్రహం, వేదం, భారత భాగవత రామాయణాదులు బాగా చదువుకున్నవారు. రామాయణం హృద్యంగా వినిపిస్తూ చుట్టుప్రక్కల గ్రామాల్లో పేరుకెక్కారు. అసలాయన్ని రామాయణం వెంకటసుబ్బయ్యని పిలిచేవారు. రామాయణం ప్రవచనం చేయడానికే వారు పాలగిరికివచ్చి, సుస్వర రామాయణ గానంతో ఆకట్టుకొని పాలగిరి యిల్లరికపు టల్లుడయ్యాడు. మామగారికి పెద్దభవంతి, 60 ఎకరాల సుక్షేత్రమైన మెట్టభూమి, రెండు గాండ్ల సేద్యం, పాలగిరి చుట్టుప్రక్కగ్రామాల పౌరోహిత్యం వుండేది. వెంకట సుబ్బయ్య స్వగ్రామమైన చిన్నశెట్టిపల్లెకు తల్లిదండ్రులున్నంత వరకూ వస్తూ పోతూ వుండేవాడు. తర్వాత అక్కడిఆస్తిని అమ్మేసి పాలగిరి లోనే స్థిరపడి పోయాడు. ఈయన పాలగిరి చెన్నకేశవాలయంలో రామయణంపై చర్చజరిపేవారు. ఆచర్చలో తననోడించిన వారికి ఒక పురస్కారం ప్రకటించారు. కానీ దానినెవరూ అందుకోలేకపోయారు. అదీ ఆయన ఘనత. ఆయన నాల్గవ కుమారుడే మన గ్రంథకర్త తిరుపతయ్య. పెద్దగా చదువుకోలేదు. ప్రొద్దుటూరు నేషనల్ హైస్కూలులో 4వ తరగతి చదువుకున్నారు. 6వ తరగతి పబ్లిక్ పరిక్షవ్రాసి చదువు కొనసాగించా లనుకొన్నారు. కానీ రెండు సార్లు ప్రయత్నించి ఉత్తీర్ణులు కాలేకపోయారు. పాలగిరి భీమేశ్వరాలయం పూజారిగా స్థిరపడిపోయారు. చెన్నకేశ వాలయం దగ్గరున్న శివాలయం పాడుబడిపోగా అక్కడి పంచలోహ విగ్రహాలు తన పలుకుబడితో భీమేశ్వరాలయానికి తెప్పించుకొని ఊరేగింపులు జరిపించారు. గ్రామంలో మంచి పేరుప్రతిష్టలు సంపాదించారు. మనిషి పొట్టి. సన్నగావుండే వారు. నత్తికూడా వుండేది. ధారాళంగా మాట్లాడలేకపోయేవాడు. కానీ కలమే ఆయన బలం.
తెలుగుపై మంచి అభిరుచి వుండటంవల్ల, తరచూ ప్రొద్దుటూరువెళ్ళి దుర్భాక రాజశేఖర శతవధాని గారిని కలిసేవాడు. దుర్భాకవారి "రాణాప్రతాపసింహ చరిత్ర"కు ఆకర్షితుడై దాని తర్వతి కథయైన రాణాయమరసింహచరిత్ర వ్రాయడానికి ఆయన సహాయ మర్థించాడు. ఆయన యీయన సామర్థ్యం పట్టుదల గుర్తించి అడిగిన సహాయాన్ని అందించారు.10 సంవత్సరాలు శ్రమించి ముదిమిన గ్రంథాన్ని పూర్తిచేశారు. మథురపదజాలం, నానుడులు, పలుకుబడులతో ఒకవినూత్న శైలిలో రచన సాగి పండితుల ప్రశంశలందు కొన్నదీ గ్రంథం. ఇదికాక యీయన దీనికి ముందే మరిన్ని గ్రంథాలు వ్రాశానని యీగ్రంథం తొలిపేజీలలో శ్రీనాథుడు చిన్నరి పొన్నారి చిరుతకూకటినాడు రచించితి మరుత్తరాట్చరిత్ర అన్నతీరున...
సీ : పూపప్రాయమ్మున "పుండరీకా" భిఖ్య
భక్తుచరిత్రము వ్రాయనాయె
దృశ్య ప్రబంథము తీరున "లవకుశ"
న్వ్రాసి బహూకృతుల్వడయనాయె
మును సలాముద్దీను ముట్టడిసల్పిన
చిత్తూరు దుర్గము రచింపనాయె
మును కమలాబాయి నను గోరగా జగ
న్మోహన నాటకమ్మెసగ నాయె
గీ: ప్రొద్దుతిరిగెను బుద్ధికి మొద్దుతనము
హెచ్చె; నారోగ్యదశచాల నొచ్చెజూడ
నరువదియునాయె బరువాయె నమరసింహు
కథ; నృహరి! యెట్టు కలమెట్టు కదల గలదొ.
అని తన రచనలను తెలియజేశారు. ఇవేగాక "చంద్రశేఖరశతకం" "మళయాళస్వామిచరితం" "పాలగిరి భీమేశ్వరశతకం" కూడా వ్రాశారు. తిరుపతయ్యగారు మంచి విలాసపురుషులు, బాగా దుబారాఖర్చు చేసేవారు. కనుక ఆస్తి తరిగిపోయింది. రాణాయమరసింహ చరిత్ర ముద్రణకు దాతలపై ఆధారపడ్డారు. వారి సహయం మరచిపోకుండా పుస్తకంలో వారిపేర్లు ముద్రింపజేశారు. పాలగిరి భీమేశ్వరశతకాన్ని కోడూరు పుల్లారెడ్డి సూపరెంటెండింగ్ ఇంజనీర్ (ఎలక్‍ట్రికల్) గారు కవి అభ్యర్థన మేరకు ముద్రించి యిచ్చినారు. మలిముద్రణ వారి తమ్ముడు
డా: ప్రభాకర్‍రెడ్డి శిశువైద్య నిపుణులు సాహితీవేత్తయైన, వారు 2003లో ముద్రించినారు. వీరూ పాలగిరి వాసులే కనుక వారి పురోహితులమీద అభిమానంచూపినారు. మిగిలిన గ్రంథాలు ఆయన జీవితకాలంలో అముద్రితాలే. కానీ వాటిలో కొన్ని తర్వాత ముద్రణకు నోచుకున్నాయని డా: మూలమల్లికార్జునరెడ్డిగారు తెలిపారు. లవకుశ నాటకం వారు చదివామని కూడాచెప్పారు.
తిరుపతయ్యగారికి నలుగురు సంతానం జయమ్మ, వెంకట సుబ్బయ్య, వసుంధర, రాధాకృష్ణమూర్తి. తిరుపతయ్యగారు కడప మోచంపేటలో ఒక ఇల్లు కేసీకెనాల్ క్రిందబాగాపండే రెండెకరాల భూమి కొనడంవల్ల మలిదశలో అది ఆయనకు బాగా ఉపయోగపడింది. భూమిని మంచి ధరకుఅమ్ముకోగలిగారు. చిన్నకుమారుడు తను నిర్వహించిన భీమేశ్వరాలయ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఏదియేమైనా పాలగిరి తొలికవి తిరుపతయ్యగారే.
నేనుచూచినంతలో రాణాఅమరసింహచరిత్రలు రెండున్నాయి. ఒకటి పర్లపాడు కసిరెడ్డివెంకటసుబ్బారెడ్డి గారిది, రెండవది తిరుపతయ్య గారిది. వారు గ్రంథంలో వ్రాసుకొన్న దాన్నిబట్టి చూస్తే వెంకటసుబ్బరెడ్డి గారి పుస్తకం ముందు వ్రాయబడినదై యుంటుంది. ఆ పుస్తకం 1967లో ముద్రిత మైనా 1940లోనే చళ్ళపిళ్ళవేంకటశాస్త్రిగారు దీనికి పీఠిక వ్రాశారు. తిరుపతయ్యగారి పుస్తకంలో యేవివరాలూ లేవు. ఇంజనీర్ కోడూరుపుల్లారెడ్ది 1965 లో తితుపతయ్య పుస్తకం ముద్రించబడిందని వ్రాశారు. కానీ కవి వ్రాసుకొన్న వారి వయస్సును, పూర్తిచేసినకాలం లెక్కవేస్తే పొంతనకుదరదు. అదలావుంచితే వెంకటసుబ్బారెడ్డి పుస్తకం కేవలం 107 పేజీలు. 476 పద్యాల పైన ఒక శాంతిగీతిక. తిరుపతయ్య గ్రంథం488 పెజీలలో 1840 పద్యాలతో వ్రాసిన ఒక ఉద్గ్రంథం. గ్రంథనామం కూడా "రాణాయమరసింహచరిత్ర"గా అంటే అమరలోని "అ" ను యడాగమంచేసి పెట్టారు. ఇక ఆయన రచనలను
పరిశీలిద్దాం. "పాలగిరి భీమేశ్వరశతకం" తను అర్చకత్వం నెరపిన శివునిపై 103 సీసపద్యాలతో శతకం పూర్తిచేశారు. ఇందులో కవి శివమహాత్మ్యము, శివభక్తిప్రకటన, శివకేశవ అభేదాన్ని ఆత్మాశ్రయ కవితాత్మకంగా, నివేదనగా వ్రాసుకున్నారు. కవి తన రచనలను అచ్చువేయించుకోలేని దుస్థితిని మున్నుడి లో వ్రాస్తూ "బిడ్డను కనడంకాదు, సంరక్షణాబాధ్యత తల్లిదండ్రులకెంత భారమో యిదీ అంతే" నన్నారు. కళాభిమానము గలవారు లేకపోవడం కవి దురదృష్టమన్నారు. సాంఘికసమస్యలూ, ప్రేమకథల పేరుతో పౌరాణిక చారిత్రక గాథలనే కొంతమార్చి వ్రాసుకొని గొప్పలు వెప్పుకొనేకాలంలో నిజమైన కవికి గలుగు నిరాదరణకు చింతిస్తూ..
సీ : గణయతిప్రాస లక్షణమె నేర్వనివాడు
కవిరాజ నామ మెక్కరణి దాల్చు
ఓనమాల్ చక్కగా నూని నేర్వనివాడు
గ్రంథానువాద మెక్కరణి సేయు
కాలుగదపలేక గడపదాటనివాడు
కదనోర్వి శత్రునే గతిన దాకు
ఏ బి సీ డీ లన నే మటం చనువాడు
సల్పునే నాంగ్లప్రసంగ మొకటి
గీ: యింటిపేరున గస్తూరి. యిల్లుజూడ
గబ్బిలపుపెంట కంపును కరణి నరుడు
శక్తిలేకున్న వ్యర్థప్రసంగ మేల
పాలగిరివాస! భీమేశ! భక్తపోష! .... 6
అంటారు. ఇంటిపేరేమో కస్తూరి, ఇంటిలో గబ్బిలాలపెంట కంపని కుకవి నిందచేశారు. "ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపలనుండు" నన్నరీతిలో భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని దెలుపుతూ ..
సీ: అణువాది మేరుపర్యంతంబు సమరీతి
వెలుగొందుచుండెడు వెలుగెవండు?
సర్వపిపీలికా జంగమ స్థావర
నిఖిలప్రపంచాధినేత యెవడు?
పంచభూతోత్పత్తి బరగించి నిఖిల జీ
వాళిలో నిడిన నియంత యెవడు?
క్షితి సర్వజీవాళి సృష్టిస్థితిలయాది
కర్తయై భువనాళి గాచునెవడు?
గీ: పాలలోవెన్న, దారము పూలమాల
వెలయు పోలిక నిందందు వెలితివడక
జగతి సర్వాన వెలుగొందు స్వామియెవడు?
పాలగిరివాస! భీమేశ! భక్తపోష! .... 7
అంటూ పాలగిరివాసుని స్తుతించినాడు. మనిషి తెలిసి తెలిసీ మాయలో బడతాడు. నాగతీ అంతేనని తపొప్పుకొని దీనంగా యిలా ప్రార్థించాడు.
సీ: ఘనభక్తి ననిశంబు నినుగొల్చుచుండెడి
వారిదౌ కొంగుబంగార మనుచు
భవవార్థి తరగల బడి దరిగనని పా
మరులను దరిజేర్చు తరణి వనుచు
తనవారిపై నాస దవులు యజ్ఞానాంధ
కారులకును దీపకళిక వనుచు
పాపపంకనిమగ్న బాధిత నరకోటి
కాలూనుటకు నూతకోల వనుచు
గీ: సర్వజగములు నిను సదా సంస్తుతింప
తెలిసి తెలిసియు కలుషముల్ సల్పియుంటి
నంత్యదశనుంటి చెయిజాచి యర్థి నంటి
పాలగిరివాస! భీమేశ! భక్తపోష! .... 10
భగవద్భక్తిని పాటించడానికి యేఆశ్రమధర్మంలో వున్నా ఒక్కటే. యేదీ భగవదనుగ్రహానికి తక్కువది కాదంటూ...
సీ: బ్రహ్మచర్యాశ్రమపథము తత్సేవన
మాచరించుటదెంతొ యధికమండ్రు
హరిపదసేవన కమితయోగ్యము గృహ
స్థాశ్రమమంచను జనుడొకండు
వసుధ వానప్రస్థ వానాశ్రమ మదెంతొ
శ్రేష్ఠతమంబని చెప్పు నొకడు
క్షితి జపతపములుసేయ సన్యాసాశ్ర
మదెంతొ మేలని మనుజులండ్రు
గీ: ఆశ్రమావళి యెల్ల నీకరయ నొకటె
యెవని హృదయంబు నీయెడ నవగతంబొ
యట్టి వానిని బోషింతువభవనీవు
పాలగిరివాస! భీమేశ! భక్తపోష! .... 15
అన్నారు. నితాంతాపారభూతదయయు, ఓర్పు, స్నేహతత్పరత గావాలి స్వామీ! నాకింకేమీ వద్దంటూ
సీ: దూషణభూషణల్ తోషమ్ముగా జూడ
జాలిన శాంత మొసంగుమయ్య!
కష్టసుఖంబుల గాంచంగ సమదృష్టి
శాశ్వతసహన మొసంగుమయ్య
కలిమి లేమి సతంబు క్షమనూని సమతమై
భరియింపగల యోర్పు గరపుమయ్య
బీదసాదలయెడ బ్రీతిమై నెనరూని
సాయమొనర్పగ సల్పుమయ్య
గీ : నిజము వచియింప జగమెల్ల నీవ సృష్టి
బూనిసల్పుట నీదు సంతానమెగద!
జనకుడెన్నడు దనయుల జంపగలడె
పాలగిరివాస! భీమేశ! భక్తపోష! .... 56
అని బలుల నిరసించి వేడుకొన్నాడు. అట్లే ముందుకు సాగుతూ..
సీ: పరకాంతలన్ మాతృభావన బరికించ
జాలెడి బుద్ధినొసంగుమయ్య
జగము సర్వంబు మత్సమమంచు దలపోయ
సమబుద్ధి నిత్య మొసంగుమయ్య
భవదీయ కీర్తనాపరతయు సతతమ్ము
నీపూజయెడ బుద్ధి నిలుపుమయ్య
అవసానదశను రోగార్తి నాయాస మ
పస్మార మొగినన్ను పట్టకుండ
గీ: మోహపాశాల దవులుగా బోవనీక
కావవేడుదు నిను సదా కాలకంఠ
దయను కాపాడవయ్య యో దానవారి
పాలగిరివాస! భీమేశ! భక్తపోష! .... 59
అని ప్రార్ధించారు. దేవుడొక్కడే పేర్లువేరు. హరిహరభేదాలు పనికిరావంటూ
సీ: ఎన్నిభంగుల నిన్నదెన్ని నామంబుల
వ్యవహరించిన మూలమరయ నొకడె
శర్కర, చక్కెర, స్వాదువంచనిన స
ర్వంబు సమానమై వరలుగాదె
అభవుడన్నను, విష్ణువంచన నొకరూప
మని లోకతతి సర్వమరయ గాదె
పాషండులగు వీరవైష్ణవుల్ శైవులు
వరలుట వాదముల్ ప్రబలి తుదకు
గీ: హరికి హరునకు వైషమ్యమయిన యటుల
పలికి తెరచాటు లిడుట లేర్పడియె కాన
వీరిలో మార్పు సేకూర్ప వేడువాడ
పాలగిరివాస! భీమేశ! భక్తపోష! .... 14
అని సమతను చాటినారు.
ఇక ఆయన వ్రాసుకున్న వాటన్నింటిలో గొప్పపేరు గడించిపెట్టినది "రాణాయమరసింహచరిత్ర"మే. దానినొకించుక పరిశీలింతము. కథ చాలాచిన్నది. మొదట భారతదేశ పూర్వచరిత్ర వ్రాసినారు. విషయవిపులీకరణ మొక్కొకచోట మిక్కుటమై కథ ముందుకు నడవని స్థితులూ యేర్పడ్డాయి. యుద్ధవర్ణనలూ, మొగలుచక్రవర్తుల కుటుంబకలహాలూ యెక్కువ ప్రాధాన్యత వహించాయి. ఇవి కథా నాయకుడైన అమరసింహుని కథనుండి దూరముం చాయనిపిస్తుంది. కథాపరంగా చూస్తే, అమరసింహుడు తన తండ్రి ప్రతాప సింహుని తర్వాత మేవాడ రాజైనాడు. తన హితబాంధవులు శాంతినీ యుద్ధవిముఖతనూ బోధించగా అమరసింహుడు భోగలాలసుడయ్యాడు. కర్తవ్యాన్ని విస్మరించాడు. అతన్ని సలుంబ్రాకృష్ణసింహుడు దండించి అంతః పురంనుండి యీడ్చుకొనివచ్చి సింహాసనంపై కూర్చుండబెట్టి హితబోధచేసి నాడు. అమరసింహుడు మేల్కొని కర్తవ్యదీక్షాతత్పరుడైనాడు. అప్పటినుండి అతని కత్తికెదురేలేదు. మొగలులు మేవాడను తిరిగీ వశపరచుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ వమ్ముగావించినాడు. అగ్బరునూ, అతనికొడుకు సలీమునూ యుద్ధాలలో ఓడించి చీకకుపరచినాడు. సలీం అంటే జహంగీర్. అతని కొడుకు షాజహాన్ మాత్రం అమరసింహుని ధైర్యాన్ని వీరత్వాన్ని మెచ్చుకొని, జయించడానికి వీలైన పరిస్థితులు యేర్పడినా యుద్ధం నిలుపుదలచేసి గౌరవప్రదమైన సంధిజేసుకొని శాంతిని నెలకొల్పాడు. అమరసింహుడు శాంతియుతమైన తనరాజ్యాన్ని కొడుకుకప్పజెప్పి, తపోవనానికెళ్ళిపోయాడు. కథ యింతమాత్రమే. కవి కవితావైదుష్యం వల్ల గ్రంథం విస్తారమైంది.
ప్రథమాశ్వాసంలో కావ్యమెట్లుండాలో చెబుతూ..
చం: పదములగూర్చు సౌష్టవము భావము దేల్చెడి సౌకుమార్యమున్
హృదయము పాఠకోత్తముల కెంతయు దద్రసమందు లీనమై
వదలక నుండజేయగల భవ్యరసంబిమిడించి గ్రంథమున్
ముదమొదవంగ వ్రాయునది మోయును సత్కవితాఖ్య ధాత్రిపై
అంటూ కేవలం యతిప్రాసల కూర్పుతో కవిత్వం కానేరదన్నాడు. అంతేగాక పద్యంపై మక్కువజాటుతూ..
సీ: వర్డ్సువర్తాదులౌ పాశ్చాత్య కవివరుల్
పద్యకావ్యంబులే హృద్యమనిరి
కాళిదాసాదులౌ కవితల్లజులు గూడ
పద్యరచనమ్ముకే ప్రతిభ నిడిరి
పెద్దనార్యాదులు వెయినోళ్ళ పద్యకా
వ్యాళి నెంతయు గొనియాడినారు
ఇప్పటికిన్ భువి నెల్లకవీశులు
తొలిపూజ వీటికే సలిపినారు
గీ: నాటికిని నేటికినిగూడ నవ్యయుగము
నందు నీ పద్యకవితకే ముందుపూజ
సలిపి యీ పద్యకావ్యాళి నిలిపి నార
లటుల గాకున్న మాన్యత నంద తరమె... 1-20
అంటారు. ఈయన మాత్రాఛందస్సు, శ్లోకాలూ కూడా పద్యాలుగా భావించినారనిపిస్తుంది. లేకపోతే వర్డ్సువర్త్ కాళిదాసాదులను పేర్కొని యుండరుగదా! అది ఆయనతీర్పు. లోకో భిన్నరుచిః అనిఅను కుంటేసరి. పద్యమైనా గద్యమైనా గేయమైనా కవిత్వాంశముండాలన్నది మన ఆకాంక్ష.
మొదటిఆశ్వాసం భారతదేశ పూర్వచరిత్ర చెప్పుకుంటూ అలెగ్జాండరు దండయాత్రలనుండి ఘోరీ, గజనీలనుదాటి మొగలులలో అక్బరు వరకూ సంక్షిప్తంగా చెప్పుకుంటూ అమరసింహుని తండ్రి ప్రతాపసింహుని వరకు వచ్చినాడు. మధ్యమధ్యలో వాస్కోడిగామానూ, పొర్చుగీసువారినిగూడా స్పృజించినాడు. ఆశ్వాసం ముగియనుండగా అమరసింహుడు కథలోనికి ప్రవేసించినాడు. ప్రతాపుని స్తుతిస్తూ అతని మరణవార్తను సూచిస్తూ..
సీ: ధాత్రి మేవాణ్మాత దాస్యశృఖలముల
బాపగా జాలిన యట్టి భాగ్యమూర్తి
పృధ్వి మోగలురాజ్యవృక్షమ్ము గూకటి
వేళ్ళతో నూచిన వీరమూర్తి
యిరువదియైదేడు లెవసి యగ్బరుధరా
విభుని మార్కొన్న గంభీరమూర్తి
దేశమంతట తన దివ్యకీర్తి జ్యొత్స్న
తతినిల్పి నట్టి సౌందర్యమూర్తి
గీ: క్షోణి స్వాతంత్ర్య దేవతన్ గొల్చినట్టి
ధర్మసంస్థాపనుండు ప్రతాపమూర్తి
యవనిగలయట్టి సర్వసౌఖ్యముల రోసి
స్వర్గసౌఖ్యమ్మె సతమని నిర్గమించె.... 1-408
అనితెలిపి, తర్వాత కృష్ణసింహుడు అమరసింహుని పట్టభిషిక్తుని చేయడంతో మొదటిఆశ్వాసం ముగుస్తుంది. అప్పటికే 146 పుటలు 822 పద్యాలతో సుమారైన కావ్యమైంది. ద్వితీయాశ్వాసంలో అమరసింహుని పినతండ్రి జగమల్లుడు యుద్ధములు చేటని, అనర్థదాయకములని....
చం: శివశివ! యెట్టి కష్టముల జెందును దేశము యుద్ధమైన ను
ద్భవమగు గాటకంబు జనతండము పిడ్గులుబడ్డ శాల్మలీ
ప్రవిమల వృక్షరాజివలె వ్రాలును, కోశములెల్ల వట్టివౌ
నవినయబుద్ధి వీడి విను మాదరమూన్చుమ నాహితోక్తులన్- 2-25
గీ: ఆజియందున మనకె జయంబుగల్గు
ననుచు బల్కగ నెవ్వరికిని తరంబు
విను జయాపజయమ్ములా విధికృతమ్ము
లెపుడదేరికి యొదవునో యెఱుగరాదు... 2-26
అని తలకెక్క బల్కినాడు. మరికొందరు బంధువులూ దీనికి తాళంవేసినారు. ఇంకేముందీ, అమరసింహుడు బాగున్నదని అంగనాలోలుడై రాజ్య పరిపాలనముగూడా విస్మరించినాడు.
సీ : పతులచే నెక్కుడు పనులు గైకొనువాడు
సతులచే నుపచార తతినిగాంచె
నీ సభాభవనమందెలమి నుండెడివాడు
శయనగృహాలి విశ్రాంతిగాంచె
విగ్రహోచిత కార్యవితతి దీర్చెడువాడు
ప్రణయవిగ్రహకార్య పరతినుండె
నధిపులు కేల్మోడ్చ నలరుచుండెడివాడు
తరుణులకైమోడ్పు నరయసాగె
గీ : గలశవారాశి నొదవిన గరళమనగ
భానువంశమదెల్లను పాడువడగ
నా ప్రతాపేంద్రుగర్భాబ్ధి నవతరించి
యెల్లరకు నేడు దుష్కీర్తి బెల్లుగూర్చె... 2-160
ఇలా అమరసింహుడు చెడ్డపేరుతెచ్చుకోగా అక్కడ అగ్బరు..
సీ: తనకత్తి కెదురేమి గనకుండ సకలావ
నీతలంబఖిలంబు ఖ్యాతినేలె
నపజయంబొందిన యవనీధవాళి న
త్యంత గౌరవమున జెంతజేర్చె
దనయాజ్ఞ మకుటాన దాల్చు రాజుల రాజ్య
మెల్లవారికివెన్కకిచ్చు, మరియు
గొంతరాజ్యంబిచ్చి కూర్మి చెంతనుజేర్చి
నెయ్యంబునకు తోడు వియ్యమొసగు
గీ: తన్ను శరణనిచేరు భూధవులకేమి
కొఱత వడనీక సకలము గూర్చుచుండు
రాష్ట్రమేకాదు మరితన ప్రాణమేని
యొసగు వాడిల నగ్బరుకుపమలేదు.. 2-50
అన్నట్లు వెలిగిపోసాగాడు ఆసమయంలో చేటువాటిల్ల నున్నదని అమరసింహిని మేల్కొల్పుమని సామంతులు ప్రార్థించగా సలుంబ్రాపతియైన కృష్ణసింహుడు
ఉ: పన్నగవైరి సర్పమును బట్టుక వేగ వియత్తలంబునన్
జన్నటులా సలుంబ్రాపతి క్ష్మాపతి నీడ్చుక రాజకోటి కూ
ర్చున్న సభాస్థలిన్ విడువ జూపరులెల్లను సంతసించుచున్
సన్నుతిసల్ప బల్మరు బ్రశంసనొనర్చిరి కృష్ణశక్తినిన్.. 2-204
అప్పుడు అమరసింహుడు కన్నుదెరచినాడు. కర్తవ్యపాలన కుపక్రమించినాడు. ఊహించినట్లే అగ్బరు కయ్యమునకు సేనను పురికొల్పినాడు. మేల్కొన్న పులులిప్పుడు మేవాడు రాజపుత్రులు.
సీ: జయజయధ్వని సర్వసర్వంసహా స్థలి
బ్రతిశబ్దమొదవు నార్భటులు సెలగ
ఝాళాభటాళిచే శ్యామసింహుండొక
వైపున యవనభటులదాక
జోండావతుల గూడి కొండొకవైపున
నరుల మార్కొనె సలుంబ్రాపతియు
నా శిశోదియకులు లందరగొనుచు నా
రాయణదాసు తురకల దాకె
గీ: ఆ ప్రతాపేశుసుతుడైన యమరసింహ
పతియు సైన్యాళి ముంగల వారువమున
దా రవిధ్వజ మొక్క హస్తమున దాల్చి
యవన సైన్యాళి బెగడొంద నట్టెదాకె.. 2-250
ఇంకేముందీ విజయం అమరసింహునే వరించింది. అగ్బరుకొడుకు సలీం ఢీలాపడినాడు. తనకు పిల్లనిచ్చిన మామ మాన్‍సింగ్ వద్ద వాపోయి నాడు. వంగభూపతి మాన్‍సింగ్ అక్బరు ఆంతరంగికుడు. ఆప్తుడు. అయినా తాను పేరుప్రతిష్టలకోసం ముస్లింలపంచజేరి బంధుత్వం నెరపినందులకు చింతిస్తున్నానని తనమనసులోని వ్యధను వ్యక్తపరచి నాడు. ఐనా అగ్బరుకు ద్రోహంచేయబోనన్నాడు. అగ్బరుసేవ తనవిధిగా భావిస్తానన్నాడు. అప్పటినుండి సలీం అతనిపై విశ్వాసాన్ని గోల్పోయాడు. మేవాడులో యుద్ధం పరిణామంగా సూక్తుడనురాజు వీరమరణం పొందాడు. కుటుంబం దీనస్థితికి చేరింది, కొడుకులు చీలిపోయి కొందరు బ్రతుకుదెరువుకై పరదేశగతు లైనారు. ఐనా వారు రాజుపై రాజ్యంపై గౌరవంవీడలేదు. కృష్ణసింహుడు ఒకసారి పరదేశంలో గాలీవానలో కుటుంబంతోసహా చిక్కుకొనిపోగా వీరే కాపాడినారు. అప్పుడు విషయంతెలిసి అభిమానధనులై తమ దీనస్థితిని రాజుకు తెలియనివ్వని సూక్తునికొడుకులను రాజువద్దకు కృష్ణసింహుడు చేర్చి కష్టాల గట్టెక్కించినాడు. ఆవిధంగా రాజపుత్రులు బలపడసాగారు. ఇక్కడ అగ్బరు కొడుకు సలీంతో సరిపడక నానా యిబ్బందులూ పడసాగారు. ఈ కుటుంబకలహాలతో అగ్బరుతల్లీ భార్య మనస్తాపంతో మరణించారు. కడకు అగ్బరు దూర్తుడని తెలిసి తెలిసి సలీంపై గల పుత్రదురభిమానంతో మాన్‍సింగ్‍ను కూడా ఒప్పించి అతన్నే రాజుగా ఖరారుచేశారు.1605 లో అగ్బర్ మరణించడంతో సలీం జహంగీర్ పేరుతో ఢిల్లీసుల్తానయ్యడు. సలీమే తండ్రిని విషమిచ్చి చంపాడన్న వార్తకూడా రాజ్యంలో గుప్పుమంది. ఈ మొగలుల చరిత్ర తోనే మూడవ అశ్వాసం నిండిపోయింది. అదలావుంటే యిక్కడ మేవాడసీమ అమరసింహుని పాలనలో..
సీ: బహుభోగభాగ్య సంపదలచే నలరారి
వాసిజెందినది మేవాడసీమ
రజతపు స్వర్ణపు రాసులీనెడి ఖని
భ్రాజితంబగును మేవాడసీమ
అగ్నిశిఖోపమలై యంటరానట్టి
వనితల నొప్పు మేవాడసీమ
ప్రతిపక్ష సైన్యవిధ్వస్త పారీణులౌ
భటులచే నలరు మేవాడసీమ
గీ: భానుకుల రాజమణిగణ భ్రాజితంబు
యవనసైన్యబ్ధి ముంపగా నలవికాని
యున్నతోన్నత పదవిన నొప్పి మిగుల
వాసిగాంచినసీమ మేవాడసీమ.... 4-5
ఇలా మేవాడసీమ ఘనతను యినుమడింప జేసుకొన్నది. జహంగీర్ ఢిల్లీ సుల్తానైన తర్వాత మేవాడపై పగను మరింత పెంచుకొన్నాడు. పదహారుసార్లు తీవ్రదండయాత్రలుసాగించినాడు. కానీ మాటిమాటికీ పరాజయాలే మూట గట్టుకొన్నాడు. ఇక్కడ యుద్ధవర్ణనలు తిరుపతయ్య గారు భీకరంగానూ, హృదయవిదారకంగాను వ్రాసి తన ప్రతిభ చూపినారు.
మ: ప్రళయాగ్నిప్రభనొప్పు లోచనములం బర్వంజాలె క్రోధారుణో
జ్వలదగ్నిస్ఫుట విస్ఫులింగములు దివ్యద్ఘోర దర్వీకర
జ్వలజిహ్వోపమ భీకరాసిగొని రాజశ్రేష్ఠుడా యవనా
ళిపై నట్టె హయంబు పోనడిపె కుప్పల్‍గాగ దున్మాడుచున్.. 3-32
ఇది వీరరసం. ఇక యుద్ధభూమి హృదయవిదారక దృష్యం..
సీ: కాలుసేతులుదెగి కదలమెదలలేక
మూలమూలలబడి మూల్గువారు
ప్రేవులు నరములు బ్రోవులై వెలిరాగ
నడవజాలక నేలబడినవారు
ఈటెపోటునసోలి యిలనున్న నరియన్న
కత్తికై చెయిజాప దడగువారు
క్షుత్పిపాసాదుల శోషించి ప్రవహించు
నెత్తుటికై దోసిలెత్తువారు
గీ : అరచువారును పoడులగొఱుకువారు
పఱచు వారును వెన్నంటి పఱచువారు
యేడజూచిన జమువంటయింటి కరణి
నొప్పె హారావ ళీ మధ్య యు ర్వి యెల్ల.. 3-30
రాజపుత్రుల్లోగూడా కొంత అంతర్గత అలజడి చోటుచేసుకోకపోలేదు. చోoడావంతులూ సూక్తావతులూ సైనికోన్నతపదవి కోసం కత్తులు దూయబూనారు. కానీ వారిని అమరసింహుదు చాకచక్యంగా శాంతబర చారు. వారు పదవికంటే రాజ్యస్వాతంత్ర్యమే మిన్నగాభావించి ప్రాణాలకు సైతం లెక్కసేయక పోటీబడి పోరి "అంతల్లా" కోటను జయించారు. ఐకమత్యం విలువను చాటారు. జహంగీర్ సాగర సింహుడను రాజపుత్రుని చిత్తుర్‍కోట కధిపతినిజేసి పోరుసాగించాలనుకొన్నాడు. కానీ యతడు తాను రాజపుత్రుడనైయుండి బంధువులగు రాజపుత్రులకు తాను మునుపుజేసిన ద్రోహాన్ని తలచుకొని చింతించి జహంగీర్ తనకిచ్చిన చిత్తుర్‍కోటను నేరుగా అమర సింహున కప్పజెప్పేశాడు. జహంగీర్ రాజాస్థానంలో సూటిపోటి మాటలకు జవాబిచ్చి తనకత్తితో తానే పొడుచుకొని సాగరసింహుడు మరణించాడు.
జహంగీర్ మేవాడు తనవశం కాకపోవడంతో చాలా అసహనానికి గురయ్యాడు. తాను మేవాడు ప్రజాక్షేమం కోరే దాన్ని వశపరచు కోవాలను కుంటున్నానని నీతులు పలికాడు. తనపరిపాలన ఉత్తమమైనదనీ అది వారికందించి మేలుచేయాలన్నదే తన ధ్యేయమన్నాడు. తన్నుతాను సమర్థించుకొనుట లో జహంగీరుకు సాటి జహంగీరే ననిపించుకొన్నాడు.
సీ: సప్తవ్యసనముల జగతి బేర్కొనినట్టి
కల్లు జూదము మన్పగల్గినాడ
స్వల్పనేరముసల్ప శాసించు ముక్కుసె
వులకోత బూర్తిగా నిలిపినాడ
యవనులు హైందవు లన్నదమ్ములవోలె
మెలగు కార్యములెన్నొ సలిపినాడ
రాజు గద్ధియనెక్కు రోజుల బందిగా
బందీలవిడునాజ్ఞ బరపినాడ
గీ: దేశదేశాలనెంతొ సత్కీర్తిగన్న
రాజ్యమును మున్ను నేలిన రాజులందు
భరతఖండాన నెవరు సల్పంగలేని
కార్యములనెన్నొ సలుపగా గలిగినాడ.. 4-366
సీ: పరమతసహనము వదలి మాలోజేరు
మను బాధలిడు పని మాన్పినాడ
రణమునగెల్చిన రాజ్యాల మఱివారి
కొసగి వారలమైత్రి నెసగినాడ
నమితమౌ పన్నుల నలయించుటది కూడ
దంచును శాసనాలుంచినాడ
బీదసాదల కెంతొ ప్రీతి భోజనమిడు
నట్టి సత్రములెన్నొ కట్టినాడ
గీ: నాదు పాలనలో ప్రజ ఖేదమొంది
భేదభావాలు నొందని వివిధ వసతు
లమితముగ గూర్చి రాజపుత్రాళి నటులె
పాలన నొనర్ప గోర నా పాపమేమొ... 4-367
ఆ అమరసింహున కర్థంగావడంలేదని వాపోయినాడు. కానీ మేవాడు రాజపుత్రులు మా ఆత్మాభిమానం స్వాతంత్ర్యవాంఛ తిరుగులేనిది. వాటిని భంగపరచజూడడం తప్పు. అది యేనాటికీ జరుగనీయమన్న పట్టుదలవారిది. ఎవరివాదనవారిది. పర్యవసానం యుద్ధం మీద యుద్ధం. 17 సంవత్సరాల యెడతెగని పోరు. జహంగీరుది విశాలరాజ్యం. పెద్దసైన్యం. గొప్పసంపద. అమరసింహునిది చిన్నరాజ్యం పరిమితమైన సైన్యం. ఢిల్లీ సుల్తానులతో పోటీపడలేని సంపద. ఐనా అమరసింహునిదే విజయం. దీనికీ ఒక హద్దుంటుందిగదా? మేవాడు సైన్యం వెయ్యికి తగ్గింది జవసత్వాలుగల వీరాధివీరులు వీరస్వర్గమలంకరించారు. ఎదురుగా లక్షలాదిసైన్యం. కొదువలేనన్ని ఫిరంగులు. దానికితోడు యిప్పుడు రాకుమారుడు ఖుర్రం ముందుండి సైన్యాన్ని నడుపుతున్నాడు. ఇక మేవాడుకు ఓటమి తప్పదన్న పరిస్థితి. ఆనాటిరాత్రి అమరసింహుని భార్య రుక్మిణి భర్తతోపల్కిన పల్కులు యీ రచనకే తురాయి వంటివి.
సీ: ప్రతిపక్షబలముచే భటవర్గమదియెల్ల
బిక్కమొగములూని వెడలిపోని
సేనాధిపతితతి క్షితిగూలిపోవనీ
కష్టపరంపర క్రమ్ముకొనని
జీవానిలములున్న జిత్తురుపురములో
యవనులంఘ్రుల నిడ నరయరాదు
సాత్రజితియు తొల్లి సంగ్రామక్షితి గృష్ణు
వెన్నంటి చనినట్టి విధిన నీదు
గీ: దండ నిలిచియు రిపుకోటి జెండివైతు
మనకుబుట్టిన తుదిగర్భజునకు సహిత
మరయ నూపిరి గళమున నాడుచున్న
దేవ! నీదీక్ష సాగించి తీరవలయు.. 5-190
గీ: అద్వితీయ ప్రతాపుడవైన నిన్ను
యనుసరించెద సంగరావనిని రిపుల
చివరకొక యంగుళంబేని చిత్తురుపురి
రక్తపాతమ్ము లేకుండ రాకనుండ... 5-192
గీ: వైరిసంహార మెనరించి భూరిసంగ
రంపుదుర్గకు సంతానరాసిని బలి
నిడియు యా వనోత్సవమును నడిపి రుధిర
మను వసంతమ్ముల స్నానమాడవలయు... 5-164
మ: ధరనే బుట్టువునొందినందులకు నిన్ ధన్యాత్ము వీరాగ్రణిన్
గరముబట్టుట వీరపత్ని నయితిన్ గర్భమ్మున వీరులౌ
వరపుత్రోద్భవమౌట వీరజననీ ప్రఖ్యాతినిన్ గంటి నీ
యరిసందోహము గూర్పరాదగు యశంబార్జింప నిన్వేడెదన్. 5-194
అని భర్తనుత్సాహపరచింది. ఈపద్యములు మహిళలపై గల రచయిత గౌరవాన్ని దెల్పుచున్నది. అంతేగాదు దాన్ని నిరూపిస్తూ తన ఉపసంహార పద్యములలోకూడా స్త్రీ ఔన్నత్యాన్ని వేనోళ్ళ పొగిడాడు కవి
సీ: ధరణి పేరుప్రతిష్ఠ ధవునికీవలెనన్న
కాంతలే ముఖ్యమౌ కారణములు
కులగౌరవమ్మును నిలుపుకోవలెనన్న
కాంతలే ముఖ్యమౌ కారణములు
తమమానధనరక్ష లాగిపోకను నిల్ప
కాంతలే ముఖ్యమౌ కారణములు
వీరసంతానమౌ పృద్వి వర్ధిలుటకు
కాంతలే ముఖ్యమౌ కారణములు
గీ: బాలభటసంఘ మిలలోన వర్థిలంగ
బుడమి ప్రజలను స్వాతంత్ర్య భూరిశక్తి
తగ్గకుండగ గాపాడు దైవతములు
కాంతలేగాదె తలపోయగా ధరిత్రి... ఉ.సం. 11
సీ: అలశివాజీమాత తొలి ఖడ్గవిద్యను
సుతునకునేర్పి సన్నుతికినెక్కె
బతివెంటజని యుద్ధక్షితిని సంయుక్తతా
జెండదేరిపుల నుద్ధండశక్తి
వీరమతీసతి విపులదోశ్శక్తిచే
మానరక్షణ తానె పూనలేదె
సాత్రాజితియు తొల్లి సంగ్రామక్షితి బతి
వెన్నంటికూల్పదే విమతకోటి
గీ: పేర్కొనగనేల కోట్లకీ భారతోర్వి
గలువకంటులు సంగ్రామ తలమునందు
బగర గూల్చిరి ప్రాణాలబాసినార
లతివ తెగబడ ముమ్మూర్తులైన నిలరు.. ఉ.సం. 12
అన్నరు. ఇకప్రస్తుతానికి వస్తే ఓటమిఅంచునున్నా ధైర్యమువిడక తనకున్నకొద్దిసైన్యంతో సాగరమంత మొగలుసైన్యాన్ని యెదిరించ గంభీరవదనుడై నిల్చిన అమరసింహుని సాహసమునకు ఆశ్చర్యమంది యుద్ధమునాపివేసినాడు ఖుర్రం అదే షాజహాన్. అతని దృష్టిలో అమర సింహుడు వీరావతారుడై నిలిచినాడు. ఇంతపెద్దసైన్యంతో అతన్నివధించడం అన్యాయంగా భావించాడు. అది జయమే కాదనుకొన్నాడు. సంధికి పిలిపించు కున్నాడు. ఏషరతులూ లేకుండా యుద్ధన్నాపి మేవాడు ఢిల్లీ స్నేహంగా, శాంతిగా వుండేటట్లు సంధికుదిరింది. ఇరవై సంవత్సరముల అమరసింహ కుమారుడు కర్ణసింహుని ఢిల్లీకి గౌరవంగా ఆహ్వానించి గొప్పసైనిక
పదవిలో నియమించి జహంగీర్ గౌరవించినాడు. అమరసింహుడు శాంతి గానున్న మేవాడురాజ్యమునుగని సంతోషించి కడకు తనకుమారుడు కర్ణ సింహుని రాజుగా నియమించి "కర్ణు ఘనంపుభక్తి భావముతో గొల్వుడని పల్కువాడ-
కం: అనియాడుచు జనపతితా
జనియెను వ్యాఘ్రాఖ్యగిరిని శైలేంద్రసుతా
మనసిజు గొలువంగ నంతట
జనపతి కొనేండ్లకరిగె శివసన్నిధికిన్.. 5-304
ఈవిధంగా అమరసింహుడు తొలుత భోగలాలసుడైనా తర్వాత తెలివిగలిగి ఘోరయుద్ధాలుసల్పి జన్మభూమి రక్షణలో వెనుకంజవేయక నిల్చినాడు. తండ్రి జయమొంది సాధించి యిచ్చిన మేవాడ రక్షణకు యుద్ధముకొనసా గించినా తుదకు గౌరవప్రదమైన సంధితో శాశ్వతశాంతిని ప్రజలకు ప్రసాదించి తపోవనములకుపోయి తపస్సుచేసుకొంటూ తనువు చాలించినారు. చూడగా నితడు తండ్రినిమించిన కొడుకైనాడు. తిరుపతయ్యగారు యీ చరిత్రనువ్రాస్తూ అనేక సంఘటనలలో తన కవితాచాతుర్యమును చాటినారు. ఉపమలూ, రూపకములూ, అంత్యప్రాసలేగాకుండ ముక్తపదగ్రస్తా లంకారాలూ వాడినాడు. సత్కవి లక్షణాలు తెలుపుతూ ముక్తపదగ్రస్తాలంకారం వాడిన తీరు చూడండి ..
గీ: జుంటితేనియ మరిపించు సొబగు పల్కు
పల్కుకుందగు రసపుష్టి పరిఢవిల్లి
రసమునకుతగ్గ భావంబు పొసగుగూర్చు
నరుడె సత్కవి యనదగు ధరణియందు
సొబగుపల్కు-పల్కుకున్‍దగు. రసపుష్టి పరిఢవిల్లి - రసమునకుదగ్గ భావంబు అంటూ ముక్తపదగ్రస్తాలంకారం చక్కగాప్రయోగించాడు. కాంతలే ముఖ్య కారణములు అంటూ స్త్రీ ఔనత్యంమీద చెప్పినపద్యం అంత్యప్రాసకు మంచి ఉదాహరణ. అట్లే గ్రంథములో అనేకచోట్ల నానుడులూ పలుకు బళ్ళు యదేఛ్చగా వాడుకున్నారు.
గుణహీనమైన కవిత్వాన్ని - "వృధా గహనంబునగాయు జోత్స్నయౌ" అన్నారు.
అనుకరణలతో గొప్పవాడనుకోవడం- "మెయి వాతలు దాల్చిన బక్కనక్కయౌ" అంటారు.
గజనీ సృష్టించిన ఘోరకలిని పోలుస్తూ- "పులియు జొరబడ్డ పెనుసంతనోలె" "మదపుటేనుగు జొరబడ్డ మడువువోలె" ఆన్నారు. యుద్ధం వినాశకరం అని జగమల్లుడు చెబుతూ- "హిమకరునియందు మచ్చతా నెసగి నటుల" "పాలకడలిని గరళము దేలినటుల" అనెడి ఉపమలు ప్రయోగించినాడు. ఇంకా "తెలిసి తెలిసి రోటిలో తలను జొన్పినటుల, "కంపలనుబడ్డ కాకులగతిగ నౌను"అంటారు.
అగ్బరును చెనికితే సర్వనాశన మౌతుందంటూ-"తీవ గదిలింప బోదెయెల్ల నూగు కరణి"అన్నారు.
రాజే భోగలలసుడైతే యేoచేద్దాం అంటూ- "కంచెయేచేనుమేయగా గడగినపుడు చేయుటెమను భంగి"అన్నాడు.
ప్రతాపుని కడుపున ఆమరసింహుడు చెడబుట్టినాడనునప్పుడు-"కలశవారాశి నొదవిన గరళమనగ" "వ్యాఘ్రపు గర్భమందు బుట్టొందెడు మేకవోలు"అన్నాడు.
రాజపుత్రుల పౌరుషాన్ని వర్ణిస్తూ-"ఈనినశార్దూలముల పోలిక"అన్నారు.
జహంగీరుతో యుద్ధం యెలాగుందంటే- "ప్రతియేటా కాన్పువోలె"అంటాడు.
సమయానికి మాన్‍సింగ్ అగ్బరుకు కనిపిస్తే- "మ్రొక్కవోయెడు దేవుడే చిక్కె చేతికన్న నుడి వోలె" అన్నాడు.
సంధి అనానుకూలమైతే నేడు జరగల్సిన యుద్ధం రేపౌతుందంటూ- "విదియరానట్టి చంద్రుడు తదియరాడె" అంటాడు.
ఇలా సందర్భాన్నిబట్టి గోముఖవ్యాఘ్రము, ముందుకు మూరడుజని వెన్కకు బారెడేగుసరణి, వీనితోపొత్తెపుడు పాముతోపొత్తు, నదిని దాటెడి వరకు నవనెక్కి తీరముచేర నిప్పిడు వోలె, పులబుట్టన నిప్పులుబోసినట్లు, క్షీరపాత్రమున విషమును చిలికినట్లు, తిని లెక్కిడి వారలు దంతెలింటికిన్, పన్నగము పన్పుపైనుండ పవ్వళించి కన్నుగూర్చు, నీట లిఖించిన వ్రాలుగానయెన్, అగ్నికణమది దూదికొండైనగాల్చు, బొగ్గులకు కల్పతరువున కగ్గినిడుట వంటి నానుడులు వాడుకొని కవిత్వానికి పదునుపెట్టాడు కవి.
అంతేగాకుండా అన్యదేశ్యాలైన ఫ్యాషన్, సెహబాస్, షోకు, వంటి పదాలేగాకుండా "అంతల్లా" కోటలో ముస్లింలు జూదరులై రాజపుత్రుల దాడిని గమనించకుండా డౌనాట, మనీఆఫ్, రెమ్మీ, బిడ్జి ఆటలు ఆదమరచి ఆడుకుంటూ వున్నారట. ఈ ఇంగ్లీషు పేకాటపేర్లు పద్యలలో వాడేశారు కవి. అంతేగాక స్త్రీ పురుష వీరలక్షణాలతోపాటూ ఉత్తమవిద్యార్థుల గురించి కూడా చెబుతూ "ఎట్టి ప్రశ్నలనీయ నెనసి యుత్తరమిచ్చి ప్యాసగు వాడె విద్యార్థివరుడు" అంటూ "ప్యాస్" ఆంగ్ల పదం వడేశారు. అంతెందుకు "సేతువునాది జేసుకొని శీతనగోపరి భూమి దాక నౌ భూస్తలి నేలుచుండినను పుట్టదు యాసకు పుల్సుటాపు" అని ఆంగ్లపదం వాడారు. ఇది యెంతవరకు సబబో ఆలోచించాలి. పోనీ యివి చూడండి
నాకు చావు దగ్గరపడిందని అగ్బర్ మాన్‍సింగ్ తో చెబుతూ "భూతలంబున బుట్టు ప్రాణిచనదా హరిసన్నిధి కెన్ని యేండ్లకున్" అంటాడు. మన్‍సింగును అగ్భరు మెచ్చుకొంటూ " శ్రీ మా న్ యంబరు సింహుడనగా
శ్రీవిష్ణువంచనెన్". అదేవిధంగా జహంగీరు ఓటముల భారంతో " నుదుర బ్రహ్మ మేవాడ బాలింప వ్రాయలేదు" అంటాడు. ఇలా ముస్లింసుల్తానులు హరిసన్నిధి, శ్రీవిష్ణువంచనెన్, బ్రహ్మవ్రాయలేదు వంటి హిందూదేవుళ్ళను మరియూ నమ్మకాలను మాటవరుసకైనా వాడుతారా? అన్న సందేహం పాఠకులకు కలుగుతుందనుకుంటాను. ఏదియేమైనా మొత్తంమీద ఒక రస వత్తరగ్రంథం "రాణాయమరసింహచరిత్ర". అది వ్రాసిన శ్రీధర తిరుపతయ్య గారు ధన్యులు.
(నెలనెలా కడపజిల్లా సాహిత్య సభలో 20-08-2017 న బ్రౌను లైబ్రరీ లో యిచ్చిన ఉపన్యాసము.)
శ్రీ A.C. దస్తగిరి గారి జీవితం - కవిత్వం
శ్రీదస్తగిరికవి గారి స్వస్థలం ప్రొద్దుటూరు. వీరు 15-06-1939 న ఖాదర్‍బీ, మహబూబ్ సాహెబ్ దంపతులకు రాజుపాలెం మండలం దద్దనాల గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం అనిబిసెంట్ పురపాలకోన్నత పాఠశాల ప్రొద్దుటూర్‍లోనూ, ఆంధ్రనలంద ప్రాచ్యకళాశాల లో సంస్కృతాంధ్రాలు చదివి భాషాప్రవీణులయ్యారు. తమ P.O.L ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందారు. ప్రస్తుతం విశ్రాంత తెలుగు పండితులు. ప్రొద్దుటూరు నవ్యసాహితీసమితి కార్యదర్శిగా విశేషసాహితీ సేవలందిస్తున్నారు. శ్రీఊటుకూరు ఛారిటబుల్ సొసైటీ వారి పురస్కారం 1992 లోనూ, శారదహైస్కూల్ వారి విశిష్ట పురస్కారం 2004 లోనూ, శ్రీవశిష్ఠ విద్యపీఠం వారి ఆత్మీయ పురస్కారం 2006 లోనూ, శ్రీఆశావాది సాహితీ సాహితీ కుటుంబం పెనుగొండవారి పద్యకవితా పురస్కారం 2015 లోనూ అందుకొని కడపజిల్లా పద్యకవులలో ఒక విశిష్ఠస్థానాన్నలంకరించారు.
ఈయన తొలుత 1965 లో "వర్తమానం" అను పద్యరచన సర్కరుజిల్లావాస్తవ్యులైన ప్రతాప వెంకటకొండయ్య శాస్త్రిగారితో కలసి జంటకవిత్వంగా వెలువరించారు. 1976 లో మణిమంజూష, 1984 లో అమృతమూర్తి, 1999 లో కవితా భారతి, 2017 లో అంటే యీ సంవత్సరం స్వాతంత్ర్యసమర యోధుడు టిప్పూసుల్తాన్ అను పద్యకావ్యాలు రచించారు.
ఈయన చక్కటి పద్యకవి మత్రమేకాదు. గొప్ప ఆధ్యాత్మికవేత్త కూడా. కడప కమలాపురం శ్రీజహరుద్దీన్‍షాఖాద్రి గారిని తమఆధ్యత్మిక గురువుగా పేర్కొన్నారు.
మ: ఇహమందాత్మవిచారమున్ దెలిపి, యోగీంద్రుడుగా వెల్గి. తా
మహనీయంబగు తత్త్వబోధనను, ప్రేమానన్ నివేదించి, యీ
మహి, కారుణ్యము రూపుగొన్న ఘనుడై, మహాత్మ్యమున్ జూపు శ్రీ
జహిరుద్దీన్ గురుదేవు నాత్మగొలుతున్ నద్దేశికోత్తంసునిన్.
అనిస్తుతించారు, వారి గురువర్యులను. వారు గురువునుండి గ్రహించిన విషయాలు చాలావరకు వారిపద్యాలలో ప్రతిఫలించాయి.
సీ: ఏడనుండి యిటకు నేతెంచినారమో
యేడికి పోదుమో యేరికెరుక.
ఉన్ననాలుగునాళ్ళు నుపకారబుద్ధితో
మసలవలయు ననుమాట మరచి
యిదినాది అదినాది, యితడునావాడని
తాపత్రయంబుల దగులు కొనుచు
క్షణబంగురంబైన సౌఖ్యములకు జిక్కి
కడతేరుమార్గంబు కానలేక
తే:గీ: మానవత్వమును మరచిన మనిషి నేడు
బాహ్యవేషములకు జిక్కి భక్తిదక్కి
సృష్టియంతట విషమును చిమ్ముచుండె
విశ్వసంరక్షకా! ప్రభూ! వినుము మనవి.
తే:గీ: అవని మాయాతమస్సు సంహర్తవీవు
జ్ఞానదీప్తుల్ వెదజల్లు స్వామివీవు
చెంతజేరిన భక్తుల జీవమీవు
సర్వజనులను బ్రోవుమా! శాంతిదాత.-- కవితాభారతి-ప్రభూ.
అని ప్రార్థించారు. ఇటువంటి భక్తిరసపద్యాలు మనకక్కడక్కడ యీకవి రచనల్లో కనిపించి మనశ్శాంతిని కలిగిస్తాయి. అసలు దస్తగిరి, మనిషే సాత్వికుడు, మృదుస్వభావుడు. కనుక అది రచనలో కనబడకపోదుకదా!
ఈ కవి తొలుత శ్రీప్రతాప వెంకటకొండయ్యశాస్త్రిగారితో జంటకవిత్వము వ్రాసిన "వర్తమానం" గ్రంథం లో కొండయ్యశాస్త్రిగారు, దస్తగిరిగారిపై చూపిన ప్రేమచూడండి.
ఆ:వె: విదితముగ ప్రతాపవెంకటకొండయ్య
శాస్త్రినగుదు నేను సఖ్యమలర
నీత డాత్మబంధు డేసి దస్తగిరియు
దనువులగు రెండు మనము నొకటే.
అంటారు. ఇద్దరూ కొండలేమరి. తనువులేవేరట. ఇద్దరి మనసులు ఒకటేనట. సరిపోయింది. దస్తగిరికి గురుసమానులైన కాండూరి నరసింహాచార్యులు వీరిని మెచ్చుకొంటూ, వీరి "వర్తమనము" లోకమునకు వర్తమానమన్నరు. ప్రకృతికి బరిణామము, ప్రజానాయకుల ప్రతిష్ఠాపాకము, శత్రుమూకల కంకుశపుపోటు, యువతీయువకులకుత్సాహ జనకమునై యున్నదీ కావ్యమన్నారు. వీరిది ప్రాచీన, సాంప్రదాయ, శుద్ధమైన చక్కని రచనయని శ్లాఘించారు. నిజమేమరి.
ఉ: భారతరాజ్యలక్ష్మి బహువర్ణమయాంచిత భర్మచేల, శృ
గార విమోహితాత్ములయి కన్నులు గానక నేడు వచ్చుచు
న్నారు తదంచలమ్ములగొనం సరిహద్దులదాటి, ధర్మసం
హార మహాపకార మలినాత్ములు పాకధినేతలెంతయున్. పుట-20-5.
భారతమాత అందాల పైటకొంగైన కాశ్మీరము నాక్రమింపజూచు పాకిస్తాన్ పాలకులనెట్లు నిందించిరో చూచితిమి. అట్లే వీరు పలికిన హితవు జూడుము యెంత సమంజసముగానున్నదో-
శా: పాకిస్థానము భారతంబనెడు నీ భాగంబు లీనాడుగా
రేకెత్తెన్ యివి మొన్నదాక, ఒకదారిద్ర్యంబు భాగ్యంబొకే
నౌకాయానము, పాలనంబుగల యన్నల్దమ్ములే. వారి కా
త్యైకీభావము గల్గుచో జగములం దవ్వారి కడ్డున్నదే!
ఆత్మీయతాభావముతో అన్నదమ్ములు, నిజమైన అన్నదమ్ములవలె భారత పాకిస్తాన్ లుంటే, యెదురేలేదుగదా! అన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
ఇక వీరి "మణిమంజూష" జూతము. మణులపేటిక పేరు బహుబాగున్నది. ఇందులోని పద్యాలూ అట్లే భాసిల్లుచున్నవి. ఈ గ్రంథమున తొలుత తన సాహిత్యగురువైన తిరువెంగళాచార్యులకు నతులర్పిస్తూ-
తే:గీ: కొలుతు మద్గురు వాత్సల్యనిలయు, ప్రచుర
సంస్కృతాంధ్ర సత్కవితావిశారదు, బుధు,
మహిత కోగంటి వంశాబ్ధి తుహిన కిరణు
ఆర్యనుతు తిరువెంగళాచార్యవర్యు.
తే:గీ: పెద్దకొడుకంచు నెనలేని ప్రేమజూపి
కన్న సంతానమునకంటె మిన్నజూచి
నేటి కింతవానిగ నన్ను నిలిపినట్టి
నాదు గురుపదయుగళికి నతులొనర్తు.
నని గొప్పగా వ్రాసుకొన్నాడు. తిరువెంగళాచార్యులవారు యీ యన్ను కన్నకొడుకుకన్నా మిన్నగా పెద్దకొడుకుగా వాత్సల్యం జుపినారట. ఆహా యిదిగదా, గురుశిష్యబాంధవ్యమంటే. ఈ పుస్తకములో భరతమాతను శ్లాఘిస్తూ
సీ: వింధ్య హిమాలయమ్ములే
గుణవల్లి నివసించు కోటలయ్యె
మూడుపార్శ్వముల సముద్రంబులే
భవ్యజళకేళి సవరించు కొలకులయ్యె
కన్యాకుమారియే ధన్యపాదమున సిం
గారంపు గండపెండార మయ్యె
ప్రాక్పశ్చిమ మహీధరరమలే శు
భాంగి నారాధించు వింజామరంబులయ్యె
తే:గీ: సింధు గంగా తటినులే ప్రసిద్ధ, కంధ
రమునదాల్చు ముత్యాల హారమ్ములయ్యె
అట్టి నాతల్లి శ్రీభరతాంబ దలతు
పరమకల్యాణి దివ్యసంపదల ద్రోణి. మణి-2.
అన్నారు. కవి సున్నితహృదయుడు. అన్యాయం సహించలేడు. ఇతరుల బాధలకు సులభంగా స్పందిస్తారు.
ఉ: సజ్జనులైనవారు బలుసాకు భుజించుచు క్రుంగుచుండ బూ
సెజ్జలపై బరుండి తమసేమమె నిత్యము చింతగాగ నే
పజ్జొ, చరించుచున్ పొరుగువారి తలంపక, గంగ దుర్జనుల్
మజ్జనమాడిరేని పలుమారులు తత్ఫల మేమి బాపుజీ.
అని తన స్వప్నవృత్తాంతంలో వాపోయారు. మరొకచోట నిర్వేదపూరితులై
తే:గీ: నందనోధ్యాన వాసంత నవ్యశోభ
నాదుజీవితసీమలో పాదుకొలిపి
సురనదీవీచికాడోల దరిసి తిరుగ
బోవు నాదు బ్రతుకు మరుభూమి యాయె -- -బ్రతుకు.
తే:గీ: జ్ఞానహీనుడ మును. సుంతజ్ఞాని నిపుడు
భోగభాగ్యమ్ము లడుగనో యోగివంధ్య
నీదు పాదాలచెంతనే నాదు బ్రతుకు
గడపనీయవె స్వామి మోక్షంబుపొంద.
అని వేడుకుంటాడు. ఇక తన "అమృతమూర్తి" కావ్యం జహంగీరు చక్రవర్తి దయార్ద్రహృదయాన్ని ఆవిష్కరించిన కథ. ఒక పేదబ్రాహ్మణ బాలికను పెంచి పెద్దచేసి సంతోషంగా, వైభవంగా ఒక విప్రవరునకిచ్చి వివాహము చేసిన వృత్తాంతమిది. ఇందులో కొన్ని పద్యాలు కథలో భాగంగా వుంటూనే ఖండకావ్యాల్లాగా భాసిల్లుతాయి. మచ్చునకీ పద్యం చూడండి.
తే:గీ: ప్రభువు పర్యవేక్షణ లేని పాలనంబు
ప్రజల కన్నీరు తుడువని రాజపదము
న్యాయరక్షణ లేని న్యాయాలయమ్ము
నడవి గాచిన వెన్నెలయౌ సవిత్రి. ప-62.
అడవిగాచిన వెన్నెల. చక్కనిపోలిక. ఇక తన కథనాయకుడు జహంగీరు ఘనతను చాటుతూ యెంత హృద్యమైన పద్యమల్లారో చూడండి.
సీ: అలుక వహించుచో ననిసేయబైకెత్తు
జమునిపై దొడగొట్టు సాహసంబు
కళలతుష్టి గనుచో కనకవృష్టిని గళా
కారుల దనుపు సంస్కారగరిమ
తీర్పునొసగుచో నధికులల్పులను మాట
దలపని నిర్మల ధర్మదృష్టి
ప్రజలయార్తి గనుచో పసిపాపవలె గంట
దడివెట్టెడు నవనీతపు మనసు
తే:గీ: పాండితీ విభవంబు నపార కరుణ
సంఘనిర్మాణ పటిమంబు సత్యవర్త
నమ్ముగలిగి రాజపదమ్ము వమ్ముసేయ
కా జహంగీరు చల్లగా నవనినేలె.
అదీ వారి పద్యరచనా గరిమ. ఇక ఆ జహంగీరు తనుపెంచుకొన్న విప్రకన్యను తండ్రిగా పెళ్ళిచేసి అత్తవారింటికి పంపుతూ చెప్పినపద్యం, కాళిదాసు కణ్వునిచేత అత్తవారింటికి వెళుతున్న శకుంతలకు చేసిన బోధను జ్ఞాపక0చేస్తున్నది.
సీ: తల్లిదండ్రులవోలె తనకుపూజ్యులటంచు
నత్తమామలసేవ జిత్తమిడుము
భర్తమాటకు ప్రతీపవుగాక యాతని
మానసము నెఱింగి మసలుకొనుము
అతిథికభ్యాగతి కాదట నమృతాన్న
మన్నపూర్ణవలె లేదనక యిడుము
పరిచారకులపట్ల బనిగొను వేళల
తల్లితెరంగున దయనుజూపు
తే:గీ: మిట్టి యిల్లాండ్రకు సుకీర్తి యెసగునమ్మ
అత్తమామలు పతియు నిన్నాదరింప
జగతి స్త్రీలోక సుప్రశస్తి గనుము
దీప్ర రూప విప్రకుల ప్రదీప! రూప!
అంటారు. ఈ సుక్తులు నేటికీ ప్రతితల్లిదండ్రులకు పాఠాలేసుమా! ఇక కవితాభారతిలో అనేక ముక్తకాలు అలువుగా దొర్లించారు.
ఉ: కామము క్రోధము క్రౌర్యము లోభము మోహమత్సరా
లేమది వాసమున్ సలుప, లేశము స్వచ్ఛత లేనివారలై
ఈమహి బాహ్యవేషము లనేకము చాటెడు ధూర్తమనవుల్
స్వామీ! త్వదీయపాదజలజాతములన్ స్మరియింప నేర్తురే! -- ప్రభూ.
ట్లే-
తే:గీ: రాముడు రహీము నీశుడు ప్రభువుకీస్తు
నామమేదయినను సమతామమతల
నాదరింపనౌనను సూక్తి నవని వీడి
నరుల కుత్తుకల్ కత్తుల తరుగ హితమె? -- ప్రభూ.
ఇలా యెన్నోసూక్తులందించారు కవితా భారతిలో. అంతేగాక యీ పుస్తకంలో తనకు తారసపడిన సజ్జనులూ, మాన్యులూ, హితులైన వారిని శ్లాఘిస్తూ చక్కని పద్యాలు వ్రాశారు. ఈ పుస్తకంలోనే గాకుండా యితర పుస్తకాల్లో కూడా హితులైన కొందరిని ప్రస్తుతించారు. వారిలో సుకవి బండ్లవెంకట రమణయ్య, గడియారంశేషశాస్త్రి, తూమాటి దోణప్ప , నండూరిరామ కృష్ణమాచార్య, దృష్టిప్రదాత డా:శివరెడ్డి, కలెక్టర్ సంజీవరెడ్డి, హితుడు గంగిరెడ్డిగారూ వున్నారు. ఇక యీ సంవత్సరమే వ్రాసిన "స్వాతంత్ర్యసమర యోధుడు టిప్పూసుల్తాన్ "ను గురించికూడా కొంత చర్చిదాం -
ఇది పూర్తిపద్యకావ్యంగా వెలసిన టిప్పూసుల్తాన్ జీవితచరిత్ర. దక్షిణభారత దేశంలోని మైసూర్ ప్రాంత అశాంతిని అణచివేయడంలో టిప్పూసుల్తాన్ తండ్రి చూపిన సాహసం. అతడు నంజిరాజుల సర్వసైన్యాధ్యక్షుడు కావడం. తర్వత రాజరికంలోని అసమర్థతవల్ల తనే సుల్తాన్ కావడం, అనేకయుద్ధాలు, సంతానం లేకపోవడంతో ఆర్కాట్ జిల్లాలోని "టిప్పూమస్తాన్ ఔలియా దర్గాను సేవించి, పుత్రవంతుడవ్వడం. ఆ బాలుడే టిప్పూసుస్తాన్ గా పేరొందడం జరుగుతుంది. టిప్పూను చాలా కట్టుదిట్టంగా పెంచాడు తండ్రి. మత సామరస్యం భాషాసామరస్యం ఉగ్గుపాలతో నూరిపోశారు. హిందూగురువు, ఇస్లాంగురువులతో విద్యనేర్పించారు. చిన్నతనంలోనే రాజకీయ కుట్రలతో కష్టాల నెదుర్కొన్నాడు టిప్పూ. అసలు టిప్పూ మన కడపకోట రక్షకుడైన మీర్‍మెయినుద్దీన్ కుతురు ఫకురున్నీస్సా కుమారుడన్న విషయం యీ పుస్తకం ద్వారనే నాకు తెలిసింది. టిప్పూ యీగడ్డ ఆడబిడ్డ కుమారుడైనందుకు మనంకూడా గర్వించాలి. బాలుడుగానుండగానే తమకోటలోనే బందీయైనప్పుడు, తప్పించుకొన్న తర్వాత తనకు అత్యంతసాహసంతో సహాయపడిన రుఖయాను పెండ్లిచేసుకొన్నాడు టిప్పూ. హిందూ ముస్లిం సాహిత్యన్ని బాగా అధ్యయనంచేసినాడు. నీతిధర్మం జీవితంలో నూటికినూరుపాళ్ళూ పాటించినాడు. ఒక స్త్రీ తనభర్త బ్రిటీషుసైనికుడని, యిప్పుడేమైనాడో తెలియరావడంలేదనీ, సహాయంచేయమనీ దీనంగా విన్నవించుకొంటే, వెదికీ తనదగ్గర బందీగా వున్నడని తెలిసి, విడిపించి యే శిక్షాలేకుండా విడిచి పెట్టాడు. సాయమర్థించిన స్త్రీని సోదరిగా చూచిన దయాపరుడు టిప్పూ. అతని ఆప్తులలో హిందూముస్లింలిద్దరూ కూడా వున్నారు. అయితే రాజ్యకాంక్షతో సన్నిహితులే కుట్రపన్నారు. అట్టివారిలో మీర్‍సాదిక్ ముఖ్యుడు.
తే:గీ: రాజ్యకాంక్ష, పదవులపై రక్తి, కాంత
కనకములపైని మోహంబు కతన మాతృ
భూమికి ప్రభునకున్ ద్రోహము తలపెట్టు
స్వార్థపరుల బుద్ధి నెఱుగ సాధ్యమగునె.
అన్నట్లు, టిప్పు మీర్‍సాదిక్ చేతిలో మోసపోయాడు. కుట్రగ్రహించలేక
కార్న్వాలిస్‍తో సంధిచేసుకొన్నాడు. సంధిలో భాగంగా వారు విధించిన అసాధారణ అసాధ్య నిబంధనలను తీర్చడానికి సమయం కావాల్సివచ్చింది. ఆందుకోసం తన కొడుకులను, 5, 8 సంవత్సరముల బాలురను బిటీషువారి చెంత వుంచవలసి వచ్చింది. వారు సంధినిబంధనలకు విరుద్ధంగా పిల్లలను బాధించారు. టిప్పూ వేదనకు గురయ్యాడు.
తే:గీ: మిత్రవంచకుల్ కుటిలురు శాత్రవులకు
సాయపడు ప్రభుద్రోహులు స్వార్థపరులు
పెచ్చుపెరిగిన దేశాన చిచ్చులేక
యసెగలు నలుదెసంగుల నలుముకొనుము.
అన్నట్లు తనవారే తనను వెన్నుపోటు పొడిచారు. కుట్రను పసిగట్టలేక కోటరక్షకునిగా, ద్రోహి మీర్‍సాదిక్‍ను నియమించాడు. వాడు ఆంగ్లేయులకు కోటలో చొరబడే దారిచూపించాడు. అది గ్రహించి టిప్పూసుల్తన్ మిత్రుడు శేఖర్
తే:గీ: అతడు విశ్వాసఘాతకుండని యెరుగమి
మేటియోధుడని తలచి కోటరక్ష
ణాభరమ్మును సాదికునకిడె రేడు
తస్కరునిచేతనుంచిన తాళమట్లు.
అని గ్రహించి సాదిక్‍ను హతమార్చాడు.
తే:గీ: ఖలమతియు, తేనెబూసినకత్తి మేక
వన్నెపులియైన సాదికు వంచకునకు
తగిన ఫలమబ్బెననుచు సంతసము నందె
శేఖరు డతని చావు వీక్షించినంత.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అబ్దుల్‍శుకూర్, మీర్‍నదీమ్, వంటి రాజద్రోహులు బ్రిటీష్‍దొర వెల్లస్లీకి చేయవలసినంత సాయంచేసి కోటను ఆంగ్లేయులు సులువుగా ముట్టడించేటట్లు చేశారు. టిప్పూ ధైర్యసాహసాలు వదలలేదు. తనభార్య రుఖయా చిన్నతనంలోనేగాదు, ఇప్పటి క్లిష్టపరిస్థితులలోనూ సహాయపడింది. గాయపడిన తమ సైనికులకు సేవలందించి, ఆసేవలో వుండగానే తుపాకీగుండుకు గురై మరణించింది. అయినా టిప్పూ బలహీనపడలేదు. సాహసవీరునివలె స్వతహాగా పోరాటానికి దిగినాడేగానీ, వీలున్నా పారిపోలేదు.
తే:గీ: కదనమున నధిక క్షతగాత్రుడయ్యు
ఖడ్గమునుబూని కరము విక్రమము రూపు
దాల్చి శౌర్యమురకలెత్త దాయ గుణము
ఛిద్రమొనరింప దొడగెను క్షితివిభుండు.
అలా తెగించి పోరాడి పోరాడి తుదకు-
తే:గీ: అకట ఒక ప్రతాపార్కుడు నస్తమించె
నొక మహాదేశభక్తుడు నుసురు విడచె
నొక్క స్వాతంత్ర్య యోధుని యుక్కడంగె
లౌకికవిభు డొకడిలాతలమ్ము వీడె.
అట్టి మహావీరుని స్తుతిస్తూ దస్తగిరిగారు -
ఉ: ఒక్క మహాప్రతాపశిఖి యుజ్వల శౌర్య దేశభక్తిమై
నొక్కట రూపమెత్తి మహితోర్వర దాస్యము బాపబూని తా
నొక్కెడ తెల్లవారి యెద లుక్కిరిబిక్కిరి జేసి ప్రాణముల్
స్రుక్కగ వీడినట్టి ఘను స్తోత్రము జేయుదు టిప్పుభూపతిన్.
ఇలా టిప్పూసుల్తాన్ కథ ముగించాడు రచయిత. ఈయన రచన ద్రాక్షాపాకములో అనవసరమైన, అతిగా యుద్ధవర్ణనలతో కథను సాగదీయకుండా, అక్కడక్కడా చక్కని ఉపమలు, లోకోక్తులతో కథ రక్తిగట్టించారు. "తస్కరుని చేతనుంచిన తాళమట్లు", తేనెబూసిన కత్తి"," మేకవన్నెపులి", "చిచ్చులేకనె సెగలు", "అడవిగాచిన వెన్నెల", దివ్యసంపదలద్రోణి "వంటి నానుడులు యెంత చక్కగా అతికారో ఇప్పటికే గమనించివుంటారు. సీసాలు అందంగా అల్లారు. కొన్నియెడల అంత్యప్రాసల తో అలరించారు. తనకు కంద, గీత, సీసపద్యాలు యిష్టమని చెప్పుకున్నా, వృత్తాలనుగూడా సందర్భోచితంగా ప్రయోగించారు. యెక్కడ యే పద్యం వాడాలో తెలిసినవారు దస్తగిరికవి. వీరి సహితీసేవ శ్లాఘించదగ్గది, ఆధ్యత్మికచింతన మార్గదర్శకమైనది, సంఘక్షేమమునెడ వీరికున్న ఆవేదన మెచ్చుకొనదగ్గది.
కం: మృదులంబగు పద్యంబుల
హృదయంబలరింపజేయు కృతులల్లి కడున్
కుదురుగ సూక్తుల నుడివిన
సదయుం, దస్తగిరికవిని సంస్తుతిజేతున్.
నమస్తే
No comments:
Post a Comment