వ్యాసలహరి-2
రచన
పి. సుబ్బరాయుడు
42/490, ఎన్.జి.ఓ కాలనీ
కడప - 516002
సెల్ - 9966504951
విషయసూచిక
1. అవతార్ మెహర్‍బాబా
2. స్వామీ దయానంద సరస్వతి
3. కబీరు
4. గురునానక్
5. వర్ధమాన మహావీరుడు
6. తుకారమ్
7. వాల్మీకి
8. నాభాగుడు
9. వాలివధ ధర్మమా?
10. ఏదిగొప్పా
11. శైవాచారనిష్ట
12. అంబరీషుడు
13.వామనావతారం
v
1.అవతార్ మెహర్‍బాబా
మానవసముద్ధరణకు మహాత్ములవతరిస్తారు. వారు కాలానుగుణ మైన మార్పులు జనులలోతెచ్చి
ధర్మరక్షణచేస్తుంటారు. అటువంటి మహనీయు లలో అవతార్‍మెహర్‍బాబా ముందు వరుస లో
నిలుస్తారు. ఈయన 1894 వ సంవత్సరం ఫిబ్రవరి 25 న పూనాలో ఒక ఇరానీ కుటుంబంలో జన్మించారు.
వీరు జొరాష్ట్రియన్‍మతానికి చెందినవారు.
తండ్రి షరియర్‍ఇరానీ శ్రద్ధా సక్తులుగల భగవదన్వేషి (దర్వేష్) పూనాలో స్థిరపడ్డారు. తల్లిషరీన్‍ఇరాని. వీరి రెండవ కుమారుడే మెహర్‍బాబ. మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు "మెర్విన్‍షరియార్‍ఇరాని".
ఈయన తన 19 వ, ఏట చదువుకొనే సమయంలోనే ఆధ్యాత్మికరంగప్రవేశం చేశాడు.
"హజరత్‍బాబా జాన్"
అనే నూరుసంవత్సరాల ఒకముస్లిం యోగిని,
మెహర్‍బాబా విద్యాలయానికివెళ్ళే దారిలో ఒకవేపచెట్టు క్రింద
వుండేది. ఆమె పిలిచి మెహర్ నొసటిపై ముద్దుపెట్టుకొన్నది. అప్పుడే మెహర్‍బాబా కు ఆధ్యాత్మికయానం ప్రారంభమైంది.
భగవంతునివైపు ఆయన మరల్చ బడ్డాడు. అది ఆయనకీయబడిన మొదటిదీక్ష. ఆతర్వాత ఆయన సుమారు 9 నెలలు అచేతనస్థితిలో కాలంగడిపాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొని, ఒకసూత్రము ప్రకారము తను ఐదు గురు పరిపూర్ణగురువుల నుండి దైవీయ
శక్తిప్రసారాన్ని గ్రహించ వలసివుందనీ, అందులో తొలిగురువే హజరత్ బాబాజాన్ అని తెలుసుకొని మిగిలిన
నలుగురికోసం అన్వేషణ ప్రారంభించి, గేద్‍గావ్ లోవుండే నారాయణమహరాజ్ అంతటివాడని గ్రహించి
ఆయననుండి దీక్షతీసుకున్నారు. అట్లే నాగపూర్ లోని
తాజు
ద్దీన్‍బాబా, శిర్దీసాయిబాబా వద్దకూడా దీక్షగైకొన్నారు.
శిర్దీ సాయి బాబా యీయన్ను చూసినప్పుడు యితడు సామాన్యుడుకాదు
"పర్వర్దిగార్"
అన్నాడు. అంటే భగవత్కార్యనిర్వాహకుడని అర్థం. ఆతర్వాత ఆఖరుగా సకోరి నివాసియైన ఉపాసినిమహరాజ్ శిష్యరికంలో
పరిపూర్ణ ఆధ్యాత్మికగురువయ్యారు.
1922
లో తనే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించి శిష్యులను చేర్చుకొని
శిక్షణనియ్యసాగారు. ఆదశలోనే ఆయనశిష్యబృందం ఆయనను మెహర్‍బాబా అని పిలిచింది.
అంటే "కారుణ్యతండ్రి" అని అర్థం. మెహర్‍బాబా తననుతాను అవతారుడనని ప్రకటించు కున్నాడు.
అప్పటినుండి ఆయన అవతార్‍మెహర్‍బాబా అయ్యారు.
ఆయనకు 27 సంవత్సరాలు వచ్చేసరికి అనేకమంది శిష్యులేర్పడ్డారు.
విస్తృతంగా
పర్యటించి బహిరంగసమావేశాలు నిర్వహించి జనులను ఉత్తేజపరచారు.
అతర్వాత ఆయన 1925 జూలై 10 న మౌనదీక్ష బూని అక్షరాలపలక సహాయ0తోనూ, చేతిసైగలతోనూ, సన్నిహిత భక్తబృందంతో సంభాషించేవారు.
క్రమంగా అక్షరపలకనుకూడా వదలి సంజ్ఙలకే పరిమితమయ్యారు.
జనాలకు దూరంగావుంటూ ఉపవాసాలతో యెక్కువ కాలం గడిపేవారు.
దానికి సమాధానంగా ఆయన, రామ, కృష్ణ, జొరాష్టర్, బుద్ధ, క్రీస్తు, వంటి అవతార పురుషుడను. నేను కేవలం బోధించుటకుకాదు, మేల్కొల్పుటకు, జాగృతపరచుటకు వచ్చినవాడను, అసలైనభగవత్‍తత్త్వాన్ని నేను ప్రసారంచేయడం,
అది గ్రహించేవాళ్ళు గ్రహించడం నిశ్శబ్దం ద్వారా నే
జరుగుతుంది అని చెప్పారు. ఆయన సిద్ధాంతం ప్రకారం ప్రగతి యేడు ఆవర్తాలలో జరుగుతుంది.
మొదట శిల లేక లోహంగానూ, తర్వాత కూరగాయలుగానూ, చేపలుగానూ, పక్షులుగా నూ, పశువులు గానూ కొనసాగి ఆఖరున మానవుడౌతాడు.
పూర్వ రూపములలో పేరుకపోయిన జడత్వమంతా మానవుడై జ్ఙానసము
పార్జనము ద్వారా వదిలించుకొని పరిపూర్ణుడౌతాడు. ఇది గ్రహించని మానవుడు తనమోక్షాన్ని ఆలస్యంచేసుకొంటాడు.
ఆ ఆలస్యం జన్మజన్మలు కావచ్చునని బాబా వివరించారు.
1931
లో మెహర్‍బాబా విదేశాల్లో పర్యటించారు.
పశ్చిమదేశాల వారిని విరివిగా తనశిష్యబృందంలో చేర్చుకున్నారు.
1940 దశక మంతా సూఫీ లోభాగమైన మాస్ట్స్
వర్గానికి చెందిన సాధకులతో కలిసిపనిచేశారు. వారు తాము బాబాసాహచర్యంతో చైతన్య వ0తులమైనామని గొప్పగా చెప్పారు.
1949 లో కొంత మంది శిష్యులను
యెంపికచేసుకొని అనామకుడుగా దేశమంతా పర్య టించారు. అది నాజీవితంలో నిగూఢ అధ్యాయమన్నారాయన.
కేవలం ఆధ్యాత్మిక బోధలకే పరిమితంగాకుండా ఆయన అనేక సేవా
కార్యక్రమాలు నిర్వర్తించారు. దళితులకూ, పేదలకూ, మానసిక రోగులకూ సేవలందించాడు. దళితులమరుగుదొడ్లు కడిగాడు. కుష్టురోగులకు స్నానంచేయించి వారిపుండ్లకు కట్లుకట్టారు.
మనిషిలో ఆధ్యాత్మికత నెలకొనిందంటే వారిలో సేవాభావం
ప్రకటితమౌతుందని ప్రత్యక్ష్యంగా నిరూపించిన మహానుభావు డాయన.
ఆయన రెండుసార్లు ప్రమాదానికి గురయ్యారు.
1952 లో అమెరికాలో ఒకసారి,
1956 లో మనదేశంలోనే ఒకసారి రోడ్డు
ప్రమాదంజరిగి సరిగ్గా నడవలేకపోయారు. ప్రయాణాలు చేయలేని పరీస్థితులలో తనపాశ్చాత్యశిష్యులను భారత
దేశానికే రప్పించు కున్నారు. దాన్ని ఆయన తూర్పుపడమరల సంగమంగా అభి వర్ణించారు.
ఆరోగ్యం బాగాలేకున్నా మౌనం, ఏకాంతం, ఉపవాసం, లాంటి సార్వత్రిక కార్యక్రమాలు ఆఖరువరకు ఆయన కొనసాగించారు.
ఎల్లప్పుడూ ఆయన సంతోషంగావుంటూ, నవ్వుముఖంతో పలకరిస్తూ, చింతించకండి, ఆనందంగావుండండి అని శిష్యులను ఉత్సాహపరుస్తూ కాలంగడిపారు.
అవతార్‍మెహర్‍బాబా బోధలు:- ప్రపంచం
మిథ్య, భగవంతు డొక్కడే సత్యం. ప్రతిఒక్కరూ తమలోని పరమాత్మను తెలుసు కోవాలి.
చావు పుట్టుకలవలయం నుండి బయటపడే ప్రయత్నం చేయాలి.
అందుకు ఆత్మజ్ఙానం అవసరం. నేనూనాదనే స్వార్థం అన్నిబంధాలకూ, పతనానికీ హేతువు. నిన్నునేవు ప్రేమించినంతగా నీతోటిమనిషిని ప్రేమించు.
అదే పరమాత్మనుచేరే దరౌతుంది. ఇతరులలోపాలు చూడటంకన్నా మన లోపాలను సవరించుకొనే ప్రయత్నం
చేయాలి. ఒకమాటలోచెప్పాలంటే, ఇతరులకు కీడుచేయక పోవడమే ముందుమనం చేయగలిగే మంచిపని.
భౌతికవిషయము లకై మనంపడే తపనకు రెట్టింపుతపన భగవత్‍సా
క్షాత్కారానికి కనబరచాలి. ఆధ్యాత్మికత మనిషిని పరమోన్నతస్థితికి గొని పోయేందుకు ఆలంబన
కావాలి. విశ్వాసం, విధేయత, నిస్వార్థం, ఫలాపేక్షలేకుండటం, భగవదర్పణాభావం గలిగి నిజాయితీగుణం గలవాడే భగవంతున కిష్టుడు.
నమ్మినదానిని స్వచ్చంగా ఆచరించాలి, అంతేగాని ఇతరులమెప్పుకోసం కాదు. అట్టివారికి పరమాత్మ దూరం. మత్తుపదార్థాలతో పొందే ఉన్మత్తత ఆధ్యాత్మికత కాదు,
అంటూ బోధించడమేగాకుండా గురువెలావుండాలో,
అట్టిగురువు తానుబోధించినవాటిని యెలా సుసాధ్యంచేయ గలుగుతాడో
కూడా తెలిపి, అందుకు తానే ఉదాహరణగా నిలిచారు. ఇవన్నీ డిస్కోర్సెస్, గాడ్‍స్పీక్స్ అనే పుస్తకాలలో విపులంగా వివరించారు.
1969
జనవరి 31 న ఆయన దేహయాత్ర చాలించారు. మహారాష్ట్రలోని అహమ్మద్‍నగర్ దగ్గర మెహరాబాద్‍లో ఆయన సమాధి
వుంది. అవతార్‍మెహర్‍బాబా సంగీతసాహిత్యములందు అభిలాష మెండుగా గలిగినవారు.
ఆయన శిష్యులు సంగీతసాహిత్య మాధ్యమంగా ఆయన్ను కీర్తిస్తూ,
మెహరాబాద్‍ను యాత్రాస్థలంగా తీర్చిదిద్దారు.
గొప్పతాత్త్విక సంస్థనేర్పరచి తద్వారా అనేక విద్యా,
వైద్య,సేవా కార్యక్రమాలు కొన సాగిస్తూ గురుభక్తిని
ప్రదర్శిస్తున్నారు. జాతి, మత, కుల, తెగ ప్రసక్తిలేని స్వచ్చమైన ఆధ్యాత్మికగురువులు అరుదు.
అట్టివారిలో మెహర్‍బాబా ప్రధమగణ్యుడు.
అనేకమార్పులు సంతరించుకున్న నేటి సమజము నుద్ధరించుటకు
వచ్చిన అవతార పురుషుడు మెహర్‍బాబా.
2.స్వామి దయానంద సరస్వతి
19
వ శతాబ్దపు భారతీయ సంస్కర్తలలో దయానందసరస్వతి ప్రముఖుడు.
ఈయన గుజరాత్‍లోని రాజ్‍కోట్ నగరమునకు 44
కి.మీ దూరంలోనున్న టంకారా గ్రామంలో యశోదాబాయ్,
కర్షణ్‍జీలాల్ తివారి దంపతులకు 1824 ఫిబ్రవరి
12 న
జన్మించారు. తల్లిదండ్రులు యీయనకు పెట్టినపేరు మూలశంకర్. వీరిది శివభక్తిపరాయణత్వంగలిగిన బ్రాహ్మణకుటుంబం.
వ్యాపారం వీరి జీవనాధారం. చిన్నతనంనుండి తాత్త్వికదృష్టితో లోతుగా పరిశీలించే తత్త్వం
యీయనది. బాల్యంలో ఒకసారి యీయన, శివరాత్రినాడు రాత్రి భక్తులు భజనచేసి విశ్రమించిన సమయంలో
ఒక ఎలుక శివలింగంపై యెక్కిదిగి రోతచేసి, పూజావస్తువులు చెల్లాచెదురుగా వెదజల్లి ప్రసాదాలు సగంతిని
వదిలేసి వెళ్ళడం చూశాడు. శివుడు సర్వశక్తిమంతుడని యిందాక భజనచేశారు.
కానీ ఒక చిట్టెలుకను అదిలించలేని అశక్తుని యెలా
సర్వశక్తిమంతు డనగలం? అన్న ప్రశ్న ఉదయించింది. అతనిప్రశ్నకు సమధానం దొరకలేదు.
1846 లో సమాధానంకోసం దేశసంచారం
ప్రారంభించాడు. ఎందరో యోగులను, సన్యాసులను కలిశాడు, వనాలు, ఆశ్రమాలు సందర్శించాడు. ఈ సంచారసమయంలోనే ఆయన దయానందనామం ధరించాడు.
మధురలో విరజానంద సరస్వతి వద్ద కుదుటబడి,
ఆయన బోధలకు తృప్తిజెంది వేదో పనిషత్తులను ఔపోసనపట్టి,
గుర్వాజ్ఞతో ప్రవచించుటకు పూనుకొని ప్రబోధిస్తూ
దేశపరిస్థితులను గమనిస్తూతిరిగారు. అది బ్రిటీషు పరిపాలన. పూర్వం విశ్వమానవసామ్రాజ్యమునకు, ధర్మసంస్కృతు లకు కేంద్రమైన భారతదేశం,
అందునా హిందూమతం కులవర్గ విభేదాలతో అంధవిశ్వాసాలతో
అంటరానితనం, బాల్యవివాహాలు, సతీసహగమనం, వరకట్నం వంటి అనేక జాడ్యాలతో పేదరికంతో మతమార్పిడులతో
దీనావస్థకు జేరుకొనివుండటం ఆయన గమనించారు. అనేక దురాచారాలు ధర్మంపేరున జరగడం ఆయన చూచి నిరసించారు.
దేశరక్షణకోసం, హిందూసమాజోద్ధరణ కోసం, ఆయన రంగంలోనికి దిగారు.
"పాఖండఖండిని"
అన్న పతాకాన్ని ఆవిష్కరించి దాని ఆధారంగా తన సంస్కరణలను
ప్రారంభించారు.
భారతదేశం భారతీయులచేతనే పరిపాలింపబడాలన్న మాటను "స్వరాజ్"
స్వయంపాలన అన్న పిలుపును తొలుత అనగా 1857 లోనే నొక్కివక్కణించారాయన. ఆతర్వాతనే
చాలామంది దేశభక్తులు యీ బాటలోనడిచారు. వారిలో లోకమాన్య బాలగంగాధర్‍తిలక్ ముఖ్యులు. లాలాలజపతిరాయ్, రాంప్రసాద్‍బిస్మిల్,
చంద్ర శేఖర్‍ఆజాద్
వంటి స్వాతంత్ర్యయోధులు యీయననుండి ప్రేరణపొందారు.
స్వామి దయానందసరస్వతి 1875
లో ఏప్రిల్ 7 న ఆర్యసమాజాన్ని బొంబాయిలోని గిర్గావ్‍లో స్థాపించారు.
ఆనాటి సభ్యుల సమక్షంలో వారిసమ్మతితో 28
సూత్రాలను ఆర్యసమాజంలోపొందుపరి
చారు.
అందులో ముఖ్యంగా హిందూధర్మాన్ని వేదాలకు దగ్గరగా
మూఢవిశ్వాసాలకు దూరంగా వుండే సమసమాజస్థాపనే ధ్యేయం గా ఉంచుకొన్నారు.
మూర్తిపూజను వదలాలన్నారు. దళితులకూ, స్త్రీలకు హిందూసమాజంలో సమాన హక్కులను ప్రతి పాదించారు.
వేదాధ్యయనం, యజ్ఞనిర్వహణలో వారికీ భాగం కల్పించారు.
యువకులనుత్తేజపరచడానికి ఆర్యవీరదళాలను నిర్మించి వారికి
జ్ఙానాన్ని, ధ్యైర్యాన్నీ నూరిపోశారు. ఆత్మరక్షణా మార్గాలు, యోగా వారికి నేర్పారు. స్త్రీవిద్యకు ప్రాధాన్యతనిచ్చి మామూలు గురు కులాలతోపాటు
కన్యాగురుకులాలు స్థాపించారు. అవతారాలను, మతపరయాత్రలనూ వారు ఖండించారు. స్వర్గం నరకం అదృష్టం వంటి నమ్మకాలను వదిలివేశారు.
బ్రాహ్మణాధిక్యత ను, కుల వ్యవస్థనూ నిరసించారు. బహుభార్యత్వం, పరదా పద్దతిని వ్యతి రేకించారు. వేదాల సక్రమస్వీకరణే సత్యాన్వేషణకు యేకైక ఆధార మనినమ్మి
దినచర్యలో భాగంగా ప్రాతఃస్మరణ, ఓంకార నినాదం, గాయత్రితోమొదలయ్యే సంధ్యావందనం, హవనం, భజనలు, సత్సంగాలు వీరు ప్రధానంగా స్వీకరించారు.
ఆర్యసమాజం దినదినాభివృద్ధిచెందింది. స్వామీరామానందతీర్థ, పండిత గోపదేవ్‍శాస్త్రి. పండితనరేంద్రజీ వంటి విజ్ఞానవేత్తలు యీ మార్గాన్ని
అవలంభించి వ్యాప్తికి తోడ్పడ్డారు. ఈసమాజం మరో ముఖ్యమైన పనినికూడా చేపట్టింది.
అదే శుద్ధి ఉద్యమం. ఈ ఉద్యమంద్వారా అన్యమతం స్వీకరించిన హిందువులను తమబోధద్వారా
మేల్కొలిపి తిరిగీ హైందవంలో చేర్చడం. ఈవిధంగా హైందవం క్షీణించకుండా అడ్డుకట్ట వేయగలిగింది
ఆర్యసమాజం. స్వామీదయానందసరస్వతి రచించిన "సత్యార్థప్రకాశిక" చాలాప్రాచుర్యం పొందింది. గొప్పగా చెప్పబడుతున్న అనేక తాత్త్వికవిషయాలు యిందులో
నిర్మొగ మాటంగా విమర్శింపబడి, సత్యం నిగ్గుతేల్చబడింది. ఈ గ్రంథమేగాక స్వామీజీ "వేదాంగప్రకాశ్" "రత్నమాల" "శంకర్‍విధి" వంటి గ్రంథాలు వ్రాసి జనులను జాగృతపరిచారు.
అధర్వణ, యజుర్‍వేదాలకు చక్కని భాష్యంకూడా స్వామీజీ రచించి
ప్రసిద్ధిజెందారు.
1883
లో దీపావళిరోజు జోద్‍పూర్‍మహారాజు జస్వంత్‍సింగ్ తన
రాజభవనానికి స్వామీ దయానందసరస్వతిని ఆహ్వానించారు. ఆసమయంలో స్వామి, రాజావారు ఆస్థాననర్తకితో సహజీవనం చేయడం మంచిదికాదని
మందలించి ధర్మోపదేశం చేశారు. దాని తో నర్తకి కోపించి వంటమనిషిని లోబరచుకొని,
ఆమెతో గాజు పెంకులపొడిని పాలలోకలిపి స్వామికిప్పించింది.
ఆపాలుత్రాగి స్వామి జబ్బుపడ్డారు. స్వామీజీకి విషప్రయోగం క్రొత్తేమీకాదు,
ఈయన బోధలు తమ ఘనతను తగ్గిస్తున్నాయన్న కక్షతో మత
ఛాందసవాదులు 7 సార్లు విషప్రయోగం చేశారు.
కానీ బస్తీ, న్యోళి అనే యోగప్రక్రియలద్వారా ప్రేగులను
ప్రక్షాళనగావించుకొని ప్రాణాలను రక్షించుకొన్నారు. కానీ యీసారి ఆయనకు మరణం తప్పలేదు.
1883 అక్టోబర్ ౩౦న ఆయన తనమరణానికి
కారణమైన వంటమనిషి అజ్ఞానాన్ని క్షమించి ప్రశాంతంగా ఓంకారనినదంతో తనువుచాలించారు.
ఆతర్వాత
ఆయనశిష్యులు "ఆంగ్లోవేదిక్ కాలేజ్‍ట్రస్ట్ మరియు మేనెజ్‍మెంట్ సొసైటీని
స్థాపించి దయానందుల ఆశయాలను ముందుకు తీసుకెళ్ళారు. ఈసంస్థకు సంబంధించిన దయానంద్ ఆంగ్లోవేదిక్ (డి.ఎ.వి )స్కూల్ తొలుత 1886 జూన్ 18 న
లహన్నాహన్స్‍రాజ్ ప్రధానహెడ్‍గా లాహోర్‍లో స్థాపింపబడింది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంనలుమూలలా యీ స్కూల్స్ వెలిశాయి. ఆర్యసమాజంకూడా దేశవిదేశాల్లో విరివిగా వ్యాప్తిజెందింది.
3.కబీరు
మహాత్ములు అకారణంగా జన్మింపరు. వారి అవసరం యీ భూమ్మీదిప్రజల కవసరమైనప్పుడే వారు
జన్మిస్తారు. కబీరు మహశయుడు కూడా సరిగ్గా ఆఅవసరానికే జన్మించారు. హిందూముస్లింలు వారి మతాచారాల వైరుధ్యాలతో కలహించు కొంటున్న
సమయమది. మతాచారాలు మానవునిలో మానవత్వం మేల్కొల్పడానికేగాని, కలహించుకోవడానికికాదని, ఆచారాలు కేవలం ఆమతంపుట్టిన ప్రదేశం, కాలాన్ని బట్టి మనిషిని సరిదిద్ద డానికేర్పడినవేగానీ అవే
సర్వస్వంగావనీ, మతాన్నిఅధిగమించి మనిషి ఆధ్యాత్మికతలోనికి ప్రవేశించాలనీ,
బోధించిన మహ నీయుడు కబీరు. ఆయన క్రీ.శ. 1440 లో జేష్ఠమాస పూర్ణిమనాడు కాశీలో జన్మించారు.
ఈయన జననం నుండి మరణంవరకు లోకంలో అనేక చిత్రాతిచిత్రకథలు
యీయన జీవితవిశేషాలుగా ప్రచారంలో వున్నాయి. వాటిలో చాలామటుకు నమ్మశక్యము కానివి గాకూడావున్నాయి.
ఆయన భక్తులు అత్యుత్సాహముతో వీటిని కల్పించియుండవచ్చును.
అయిననూ మహాత్ముల విషయములలో మనమేదియూ కాదనలేము.
కానీ వారు ప్రపంచమునకు చేసిన మేలు మాత్రము మరువలేనిది.
కబీరుదాసు ఒక ముస్లిందంపతులకు దొరికినబిడ్డ.
వారిపేర్లు నీరూ, నీమా. పిల్లలులేనివారగటచే అల్లారుముద్దుగా పెంచుకొనిరి.
నీరూ నేతపనివాడు కావడంతో కబీరుకూడా వృత్తిరీత్యా నేతపని
వాడయ్యాడు. చిన్నతనంనుండి తను పేదవాడయ్యునూ పేదలయెడ జాలి, కరుణ మిక్కుటముగా గలిగియుండెను. తండ్రి గతించిన తర్వాత కుటుంబభారం తనే మోయవలసి వచ్చింది.
తల్లి యెన్ని జాగ్రత్తలు చెప్పినా కబీరు తనునేసిన బట్టలను
అనేకమార్లు పేదలకిచ్చేసి ఖాళీ చేతులతో మిగిలిపోయేవాడు. ఒకరోజు తల్లికి యేమిచెప్పలో అర్థం గాక, ఖళీచేతులతో యింటికిపోలేక ఒక ఆలయంలో కూర్చొండి పోయాడట.
అప్పుడు రామప్రభువే ఒకసేవకుని రూపంలో యింటికి వెళ్ళి
కబీరుతల్లిని పిలిచి ధాన్యపుమూటలు కబీరుపంపాడని చెప్పి, దింపి వెళ్ళాడట. అది ఆయన భక్తికీ, కరుణా, దయాగుణానికీ నిదర్శనంగాచెబుతారు.
కబీరు రామానందుల శిష్యుడు. కబీరు ముస్లిం గనుక మనకు వద్దు. అతన్ని శిష్యునిగాస్వీకరించవద్దని మిగిలిన శిష్యులు రామానందుల
వారిని అడ్డగించారట.
కానీ కబీరు ఒకదినం తెల్లవారు ఝామున గంగాతీరంలోని మెటికలపై పరుండివున్నాడట,
రామానందుల వారు గంగాస్నానానికివస్తూ,
చీకటిలో పొరబాటున కబీరుపై అడుగేశారు.
కాలికి శరీరం మెత్తగాతగిలేసరికి ఆయన "రామా" అన్నారట. అంతే కబీరులేచి నమస్కరించి స్వామీ మీరు అనుగ్రహించి "రామ" మంత్రాన్ని ఉపదేశించి నన్ను శిష్యునిగా అంగీకరించారని
ఆనందపరవశుడయ్యాడట. ఆవిధంగా కబీరు
రామమంత్రదీక్ష గురువునుండి గైకొన్నాడు. కబీరు ఆరాధించిన రాముడు మతా తీతుడు. రామము ఆయనకు దైవమునకు పర్యాయపదము. అంతేగానీ జనులారాధించే విగ్రహరూపముకాదు.
హిందూమతంలోని విగ్రహారాధనను ఆయన అంగీకరించలేదు.
సహజయోగమను విధానమున హిందూ ముస్లిం మతాలలోని మంచిని
వైషమ్యరహితంగా గ్రహించి బోధించాడు. హిందూమతం లోని కర్మసిద్ధాంతాన్ని వాస్తవమని అంగీకరించాడు.
ఇస్లాంలోని సర్వజనసమానత్వాన్ని అంగీకరించి దేవునియెదుట
అందరూ సమానమని నమ్మి చరించాడు. భక్తులెవరైనా కులమతాల కతీతంగా దగ్గరదీసి వారితో తనయింట
సహపంక్తిబోజనం చేసి నాడు. గురువును గొప్పగా భావించినాడు. గురువూ దైవం ఒక్కసారే దర్శనమిస్తే గురువుకే తనతొలి నమస్కారం
చేస్తానన్నాడు. రామ్‍రహీం ఏక్‍హై. అసలువిషయం అర్థమైనవానికి భగవంతుడు వేరుగాలేడు.
అతనిలోనే వున్నట్లు అనుభూతి చెందుతాడన్నాడు.
కస్తూరిమృగం సువాసన తనబొడ్డు నుండే వస్తున్నా అది అడవంతా
గాలించినట్లు, మనం పొరబడుతున్నాం. విషయం గ్రహించిననాడది యిక పరుగిడదు. మనమూ అంతే. పువ్వు వాసనా ఒకటిగా వున్నాయి. మనమూభగవంతుడూ ఆరీతిననేవున్నాం. అని ఆయన బోధించాడు.
నిజానికాయన ఆచరించింది బోధించింది ఒక్కటే.
అది భగవంతుని పై సంపూర్ణవిశ్వాసం. నీ సమస్తాన్ని భగవంతుని పరంచెయ్యి. ఆయన నీ పూర్తిభాధ్యతను తనదిగా స్వీకరుస్తాడు,
అన్నాడు. నీ తలకు మారుగా భగవంతుడు లభిస్తాడంటే అది చాలా చౌక
బేరమన్నాడాయన. అంటే నీ తలవిలువ చాలాచాలా తక్కువ తెలుసుకో అన్నాడాయన. అలాగేజీవించాడు. పేదరికం అయన్ను కదిలించలేకపోయింది స్వార్జితంకానిదేదీ ఆయన
స్వీకరించలేదు. వేషధారణకాయన ప్రాధాన్యతనివ్వలేదు. మనస్సునదుపులో నుంచుకోవడమే మాయను జయించడమని నిజజీవితములో
నిరూపించాడాయన. ఆయనది మానవతావాదం. మనందరిలోనూ భగవంతుడున్నాడని నమ్మి, ప్రేమ, సేవాభావాలతో జనులనందరినీ తనతో సమానులని తలచి సేవించి
తరించిన మహానుభావు డాయన.
శ్రీరామచంద్రజీ మహరాజ్ వారు కబీరును గురించి చెబుతూ నేను
గమనించినంతలో కబీరువంటి ఆధ్యాత్మికవేత్త సుదూర, భూత వర్తమాన కాలాల్లో లేడని కితాబిచ్చారు.
మతాచారాలనాయన యేనాడూ గణించలేదు. ఒకసారి గురువుగారి ఆశ్రమంలో పితృ దేవతలకు తర్పణ లివ్వాలని
కబీరును పాలు దెమ్మన్నారట, ఆయన చచ్చినఆవు పొదుగు దగ్గర పాత్రనుంచి కూర్చున్నాడట.
ఇతర శిష్యులు యిదేమి? చచ్చినఆవు పాలిస్తుందా? అంటే కబీరు యెప్పుడోచచ్చిన పితరులు
పాలుత్రాగుతారంటున్నారుగదా! మరి కాసేపటి ముందే చచ్చిన యీ ఆవు పాలియ్యదా?
అన్నాడట. అలా ఆయన మూఢాచారాలను ఖండించారు. అందరూ చచ్చే సమయా నికి కాశీకి చేరుకొని అక్కడ తుదిశ్వాస
విడుస్తారు. అది పుణ్యమనీ, పాపాలన్నీ ఊరికే పోతాయనీ, కాశీలో చస్తేచాలనే నమ్మకాన్ని శుష్కవాదంగా కొట్టిపారేసి,
హిందూమతం గట్టిగానొక్కిచెప్పిన కర్మసిద్ధాంతమే సరైనదని
నమ్మి తను కాశీపురవాసియైనప్పటికీ అక్కడేమరణించడానికి వీలున్నప్పటికీ,
కబీరుమహనీయుడు, కాశీప్రక్కనున్న, "మఘర్" లో తుదిశ్వాసవిడిచారు. అప్పుడు హిందూ ముస్లింలు ఆయన పార్థివశరీరంకోసం వాదులాడారు.
ఆ క్షణంలో ఆయన దేహం పుష్పాలుగా మారిపోయింది.
ఆ పుష్పాలను హిందూ ముస్లింలు చెరిసగం పంచుకొనిపోయి వారివారి
మతానుసారం అంత్యక్రియలు చేసుకొన్నారు.
యీ మహనీయుడు పెద్దగాచదువుకోక పోయినప్పటికీ జన సామాన్యాన్ని
తనబోధనలతో ప్రభావితంచేసి శాంతికి పట్టంగట్టాడు. తను నమ్మిన సత్యాలనన్నింటినీ దోహాలరూపంలో రచించి ప్రచారం
చేసినాడు. మచ్చునకొక దోహా అర్థాన్ని పరిశీలిద్దాం. విగ్రహారాధన ను నిరశిస్తూ కబీరుదాసు తన దోహాలో "రాతినిపూజించడం మహత్తరమైన విషయమైతే యింతెందుకూ నేను కొండనే
పూజిస్తాను. కానీ నా దృష్టిలో యీ రాళన్నిటికంటే యిసుర్రాయి (తిరుగలి రాయి) మేలు. ఎందుకంటే దానిలో ధాన్యంపోసి త్రిప్పితే తినడానికి పిండైనా
వస్తుంది. ఇలా ఆయన దోహాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఉత్తరభారతంలో
భక్తి ఉద్యమానికి యీయనే ఆధ్యుడు. ఈయనబోధనలను "కబీర్‍బీజక్" లను పేరున గౌరవ భావంతో స్వీకరించి ఆచరించడానికి
సిద్ధమయ్యేవారు. మేము కబీరు అనుయాయులమని చెప్పుకొనుటకు ఉత్సాహపడేవారు. ఇప్పటికీ భారతావనిలో అట్టివారు అనేకులున్నారు.
యీయన
దోహాలు శిక్కుమతగురువైన నానక్‍మహాశయున్నికూడా ప్రభావితంచేశాయి.
అందుకు స్దాక్ష్యం శిక్కుల పరమపవిత్ర గ్రంథ మైన "గ్రంథసాహెబ్" లో కూడా కబీరుదాసు బోధ లుండటమే.
4.గురునానక్
అవి 15 వ శతాబ్దపు చివరి సంవత్సరాలు భారతావనిలో హిందూ ముస్లిం
మతవిభేదాలతో అశాంతి రాజ్యమేలుతున్న కాలం. ఆరెండు మతాలలోని సారాన్ని విద్వేషరహితంగా అర్థంచేసుకొని,
తదను గుణంగా సూత్రములేర్పరచి, బోధించి శాంతి సహనం నెలకొల్పిన మహనీయుడు గురునానక్.
నానక్ క్రీ.శ. 1469 లో "రాయ్‍బోయ్ కీ తల్వండి"
గ్రామంలో కల్యాణ్‍చాంద్‍దాస్ బేడి, త్రిప్‍తా దంపతులకు జన్మించారు. ఈ గ్రామం ప్రసుతం పాకిస్తాన్ లోని లాహోర్‍నగరాని కి 65
కి.మీ. దూరంలోవుంది. తండ్రి పన్నులు వసూలుచేసే ఉద్యోగి. బేడీ తెగకు చెందిన క్షత్రియుడు. బేడి అనగా వేదాధ్యయనం చేసినవాడని అర్థం.
నానక్ సనాతనహిందూధర్మాలను, ఇస్లాం సూత్రాలను అధ్యయనంచేశారు. సూఫీ సిద్ధాంతాలకు ఆకర్షితు లయ్యారు.
అప్పటికే బాగాప్రచారంలోవున్న, కబీర్ బోధన లకు స్పందించారు. చిన్నతనంనుండి పవిత్రమూర్తులతో సన్నిహితం గా మెలిగేవారు.
కొన్నాళ్ళు అఫ్ఘన్ లోని సుల్తాన్‍పూర్ సైనికాధికారి వద్ద
పద్దులువ్రాసే గణికుడుగా పనిచేశారు. చాలా సంవత్సరాలు ఒక ధాన్యాగారంలో కూడా పనిచేశారు.
అప్పట్లో మర్దాన అనే ముస్లిం మిత్రుడు,
ఆయన స్వగ్రామంలోనే వుండేవాడు. నానక్‍కంటే పదేళ్ళు పెద్దవాడుకూడా. అతడు
ఫిడేలు లాగావుండే ఒకవాద్యాన్ని బాగా వాయించేవాడు. దానిపై రాగాలు (బాణీలు) కట్టేవాడు. నానక్ వ్రాసిన గీతాలకు అతడు బాణీలు కట్టి పాడేవాడు.
ఇద్దరూకలసి భక్తి కీర్తనలు ఆలపించేవారు.
సుల్తాన్‍పూర్‍లో వారు హిందూ ముస్లింలు కలిసి భోంచేయగలిగే
ఫలహారశాల నొకదానిని నవడిపేవారు. ఆ మిత్రుడు నానక్ కు మొదటి శిష్యుడు.
పవిత్ర హృదయుడైన నానక్‍కు ఒకనాడు దైవదర్శనమై ప్రజలను
సరియైనమార్గ0లో నడవడానికి బోధించమని ఆజ్ఞాపించాడట.
ఒకనాడాయన నదిలో స్నానంచేస్తూ అందరూచూస్తుండగా మునిగిపోయాడట.
మూడురోజులతర్వాత బయటికివచ్చి హిందువూలేడు,
ముస్లిమూ లేడుపొమ్మన్నాడట. అప్పటికే ఆయనకు యిద్దరు కుమారులున్నారు.
ఆయనభార్యపేరు సులాఖిని. ఆయన
గురువై బోధించటం మొదలుపెట్టారు. ఆయన బోధ కేవలం ప్రసంగమేగాక అనుభవాలతోకూడినదై శిష్యులను
ఆలోచింపజేసేదిగావుండేది. దైవమే సత్యం. దైవానికి అనేక నామాలున్నాయ్. ఆయన సర్వాంతర్యామి. సర్వశక్తిమంతుడు. నిరాకారుడు. సృష్టికర్త అని బోధించేవాడు. నానక్ యెక్కువగా పలికే భగవన్నామాలు, సత్‍కర్తార్ (నిజమైన సృష్టికర్త) సత్నామ్, వాయ్‍గురు (పవిత్ర గురువు). భగవంతుడు మన ఊహకందనివాడు. కనుక విగ్రహరూపపూజలు వద్దన్నాడు. నదీనదాలు, వృక్షాలు, పుట్టలు, గుట్టలు పూజావస్తువులు కాదన్నాడు. నామజపము, తదనంతరధ్యానమే మోక్షమార్గమన్నాడు. మరుజన్మసిద్ధాంతాన్ని నమ్మాలన్నాడు. భగవద్భక్తిలో ఆయన సులభంగా లీనమై పోయే వాడు.
ఒకసారి ఆయన ధాన్యపుపిండిని కొలుస్తూ 12
సోలల
తర్వాత 13 వ సోలకొలుస్తూ "తేరా" అన్నాడు. అంతే యిక తేరా,తేరా అంటూ కొలుస్తూనేపోయడు. తేరా అంటే నీవాడనూ అని. దేవా! నేను నీ వాడను అనే ధ్యాసలో మునిగిపోయాడు. ప్రక్కనున్న వారు తట్టి మనలోకానికి తెచ్చారాయన్ని.
ఒకరోజు నదిలో ఒకవ్యక్తి తూర్పుముఖంగాతిరిగి సూర్యునికి
నీళ్ళు దోసిళ్ళతో అర్ఘ్యమిస్తున్నాడట. నానక్ అదేనదిలో స్నానంచేస్తూ పడమరకు తిరిగి దోసిళ్ళతో నీళ్ళు
యెత్తిపోస్తున్నాడు. తనపూజ ముగిసినతర్వాత అక్కడి వ్యక్తి "మీరేమిటి పడమరకు తిరిగి అర్ఘ్య మిస్తున్నారు.
తప్పుగదా!" అన్నారు. అతనికి బదులిస్తూ నానక్ నేను నాచెట్లకు నీళ్ళుపోస్తున్నాను.
సూర్యునికి కాదు అన్నారు. అదెలా నదిలోనీరు నదిలోపోస్తే చెట్లకెలా అందుతాయన్నారు.
మీరు సూర్యునికి చేరవేస్తున్నారుగదా!
ఈ దగ్గరలోవుండేచెట్లకు నేనుపోసే నీళ్ళు చేరవా!
అన్నారట. ఆవిధంగా ఉదాహరణలతో బోధించి గ్రహాలను,
సూర్యచంద్రాదులనూ పుజించడం అర్థరహితమన్నా రాయన.
ఒకేఒక్కడైయున్న భగవంతుని నామమే శరణ్యమన్నారు.
ఆయన తన శిష్యుల హృదయాన్ని, మనసును కూడా చదువగల ధీమంతుడు.
ఒకనాడొకవ్యక్తి ప్రార్థనాలయంనుండి పూజానంతరం బయటకు రాగానే
నానక్ పిలిచి, యింతవరకు చెప్పులధ్యానం బాగానే చేశావే? అన్నాడట. వెంటనే చెంపలేసుకొని నిజమే మహత్మా, ప్రార్థనయ్యే వరకు నాకొత్తచెప్పులమీదే ధ్యాస.
అవి దొంగిలిస్తారనే ఆలోచనే. అని అతడొప్పుకున్నాడట. నానక్ అటువంటి శ్రద్ధారహిత పూజలు వ్యర్థ మని భోదించాడు.
ఆయనే శిక్కుమతానికి మొదటిగురువు. పంజాబీ భాషలో "శిక్" అంటే శిష్యుడనిఅర్థం. శిక్కులకు గురువే అన్నింటి కంటే ముఖ్యం.
ప్రధానం. ఒకదీపం మరోదీపాన్ని వెలిగించినట్లు శిక్కుమతంలో గురుపరంపర
కొనసాగింది. అలా పదిమంది గురువులు యెర్పడ్డారు. గురునానక్ తన జీవితకాలంలో నాలుగు యానాలు (ప్రయాణాలు) చేసి శిష్యపరంపరను వృద్ధిచేశారు. తూర్పున అస్సాం, దక్షిణాన తమిళదేశందాటి, శ్రీలంక వరకు వెళ్ళారు. ఉత్తరాన లడక్, ఆతర్వాత టిబెట్ వరకు వెళ్ళారు. పడమర మక్కా, మదీనా, బగ్దాద్‍ను సందర్శించారు. తర్వత కర్తార్‍పూర్‍లో శిక్కుల ఆలయం నిర్మించారు.
అది దాదాపు హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే నిర్మింపబడింది.
కర్తార్‍పూర్‍లోనే ఆయన క్రీ.శ. 1539 లో పరమపదించారు. శరీరంచాలించేముందు "అంగద్"ను తన వారసునిగా అంటే రెండవగురువుగా నియమించారు.
ఆతర్వాత వరుసగా అమర్‍దాస్ (1552-74)
అతనిఅల్లుడు రామ్‍దాస్‍సోది (1574-81)
అతని చిన్నకుమారుడు
అర్జున్‍మాల్ (1581-1606) గురువులయ్యారు. ఇతన్ని ఢిల్లీ ముస్లింసుల్తానులు వేధించి చంపే శారు.
మరణానికిముందే ఆయన తన కుమారుడు హరగోవింద్ (1606-44)
ను గురువును చేశాడు. ఆ తర్వాత హర్‍రాజ్ (1644
-61) ఏడవ గురువయ్యాడు.
ఈయన హర్‍గోవింద్ మనుమడు. అతనికుమారుడు హర్‍కిషన్ (1661-64)
గురువై యెనిమిదవ యేటనే మశూచితో మరణించాడు.
తదనంతరం హర్‍గోవింద్ కుమారుడైన తేజ్‍బహద్దూర్ (1664-
75) గురువయ్యారు.
ఈయనకు 1675 నవంబర్ 11 న ఢీల్లీసుల్తాన్ మరణశిక్ష విధించాడు.
ఆయనకొడుకు గోవింద్‍రాజ్ (1675-1708)
పదవ గురువయ్యాడు. ఆయనతర్వాత గురుపరంపర నిలిపివేశారు.
గురు అర్జున్, తేజ్బహద్దుర్ గురువులు మొగలుల దౌర్జన్యానికి హతులై నందున,
పదవగురువైన గోవింద్‍రాజ్ శిష్యులకు రాజసం నూరి పోశారు.
ఖల్సా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఖల్సా పర్షియన్ పదం. అంటే స్వచ్ఛమైనవాడు అని అర్థం. మొదట 1699 ఏప్రిల్ 13 న అనగా ఉగాదినాడు, ఐదుమందికి ఖల్సాలుగా దీక్ష నిచ్చారు.
వారు కృపాణు ధారులయ్యారు. తలవెంట్రుకలు, గడ్డం మీసాలు తీసివేయకుండా అలాగే వుంచుకున్నారు.
ఈ దీక్షను ఆ తర్వాత అనేకమంది తీసు కున్నారు.
మగవారిపేరుకు "సింగ్" ఆడవారిపేరుకు "కౌర్" చేర్చి పెట్టుకున్నారు. సింగ్ అంటే మగసింహం. కౌర్ అంటే ఆడసింహం అని అర్థం. శిక్కులు ధర్మయుద్ధానికి, ఆత్మరక్షణకు సాయుధు లయ్యారు. కానీ ఆనాడు వారికి అపజయమే యెదురయ్యింది.
గురుగోవింద్‍రాజ్‍సింగ్ అనుయాయులతోపాటు అతని నలుగురు
కొడుకులూ హతులయ్యారు. క్రీ.శ.1708 లో అక్టోబర్ యేడున ఆయన్నుకూడా మొగలులు నాందేడ్ (మహరాష్ట్ర)
లో చంపేశారు. గురుపరంపర ఆయనతో ఆగిపోయింది. కానీ బందాసింగ్ బహదూర్ తో సైనికపోరాటం యెనిమిది సంవత్సరాలు
కొనసా గించారు. కాని ఆయన్ను ఆయన సైనికులను యేడువందలమందిని, మొగలులు క్రీశ. 1716 వేసవిలో ఉరితీశారు. నివురుగప్పిననిప్పులా శిక్కులు అణగివుండిపోయి,
మొగలులు బలహీనపడగానే యెగసి పడి తుదకు పంజాబ్ పాలకులయ్యారు.
వారిలో ప్రముఖుడు రంజిత్‍సింగ్ (1780-1839).
పదవగురువు తర్వాత శిక్కులకు "ఆదిగ్రంథం" (గ్రంథ్‍సాహెబ్) గురుస్థానానికి వచ్చింది. ఈ గ్రంథం రెండువిడతలుగా తయా రయింది. మొదట క్రీ.శ1604 లో ఐదవ గురువైన అర్జున్ అమృత్‍సర్ లో తన మరియు
తనపూర్వగురువుల గీతాలు, బోధలు, హిందు ఇస్లామ్ తత్వగీతాలు, కొన్ని కబీర్‍గీతాలు కలిపి సంకలన పరిచారు.
క్రీ.శ.1704 లో పదవగురువైన గురుగోవింద్‍సింగ్ తనపూర్వగురువైన తేజ్‍బహదూర్
గీతాలు జమచేశారు. (6,7,8 వ గురువుల గీతాలు యి0దులో కానరావు) ఇంతటితో గ్రంథం పూర్తి చేయబడింది. గురునానక్ మూలమంత్రం, సత్యమే దైవమనే బోధన, దైవనామజపంతో ప్రారంభమై తర్వాతి గీతాలు సంగీత పరంగా రాగాల వరుసలో
అమర్చబడ్డాయి. చాలాభాగం హిందీ, పంజాబి భాషల్లోవుంది. అక్కడక్కడా మరాఠీ, పరిషియన్, అరబిక్ పదాలు అందులో కలిసివున్నాయి. పదవగురువు గోవింద్‍సింగ్ గీతాలు, ఇంకొన్ని యితర రచనలు, సంకలనంచేసి ధర్మగ్రంథంగా రూపొందించారు.
ఇది వ్రజభాష లోవుంది. శిక్కుమతానుసారం గురువు భగవంతుని ఛాయామాత్రుడు.
ఆయన మార్గదర్శకత్వం లోనే మోక్షం సాధ్యం.
ఆయన శిష్యులకిచ్చేది "నామ్‍ధన్" అనే నామజపం.
శిక్కుల ఆలయాలను గురుద్వారాలంటారు. గురుద్వారాలలో గ్రంథసాహెబ్ గురుస్ఠానంలో వుంటుండి,
ఆరాధింపబడుతూ వుంటుంది. ఆ గ్రంథమే యిప్పుడు మార్గదర్శి. ముఖ్యపర్వదినాలలో, మొత్తంగ్రంథం రెండుపగళ్ళూ రెండు రాత్రులలో పఠిస్తారు.
దీన్ని అఖండపఠనమంటారు. అన్ని శుభాశుభకార్యాలలో యీ గ్రంథ పఠనము అందులోని గీతాలాపనే
వారి ముఖ్యవిధిగా భావిస్తారు. గ్రంథపఠనానికి శిక్కులందరూ అర్హులే. వారికాగ్రంథమే సందేహ నివృత్తిచేసి ముందుకు నడుపుతుందని విశ్వాసం.
ముఖ్యంగావీరు సామూహికభోజనాలుచేస్తూ కుల,
జాతి వ్యత్యాసాలను పాటించ కుండా మెలగుతారు.
***
5.వర్ధమాన మహావీరుడు
వర్ధమానమహావీరుడు జైనమత వ్యాపకుడు. జైనులు యీయనను 24వ తీర్థంకరుడని నమ్ముతారు. ఈయన తనకంటే ముందుటి అనగా 25
వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని బోధనల నాధారముగా చేసుకొని
జైనమును వృద్ధిచేసెనందురు. తండ్రి సిద్ధార్థమహారాజు. తల్లి త్రిశల. నాటరాజ్యంలో జంత్రీవంశపు రాజులువీరు.
వర్ధమాన మహావీరుడు క్రీ.పూ. 599 లో వైశాలీ వద్దగల కుండ గ్రామం (బీహార్) లో రాజుకు చిన్నకుమారుడుగా జన్మించారు.
యశోదాదేవితో వివాహమయ్యింది. వీరికొక కుమార్తెకూడా కలిగింది. ఆతర్వాత ౩౦వ యేట సాంసారిక బంధములను వదిలించుకొని బయటపడ్డాడు. ఒకసంవత్సరంపాటు ధరించిన వస్త్రం మార్చలేదు.
ఆవస్త్రం జీర్ణించిన తర్వాత మళ్ళీ వస్త్రం ధరించలేదు.
దిగంబరంగానే జీవించారు. అతనివద్ద ఆఖరుకు బిక్షాపాత్రగానీ కమండలువుగానీ వుంచుకోలేదు.
తిండిమీదకూడా ధ్యాసలేదు. చాలాదినాలు పస్తులుకూడా వున్నాడు. చలి, గాలి, వానలు కూడా పట్టించుకోకుండా చెట్లక్రింద పల్లెల్లో
పట్టణాల్లో కాలంగడిపాడు. చీమలు, దోమలు, కీటకములు, పురుగులు కుట్టి కరిచి బాధించినా వాటిజోలికి పోలేదు.
మిన్నకుండిపోయాడు. దిగంబరుడై దేహసంస్కారాలు వదలి తిరగడంద్వారా ఆయన్ను ప్రజలు
అసహ్యించుకున్నారు. తరిమికొట్టారు. దూషించారు. ఆయన మాత్రం ప్రతీకారమన్న మాటేలేక అత్యంతసహనంతో మెలిగారు.
రాత్రింబవళ్ళు ధ్యానంలో గడిపారు. అలా 12 సంవత్సరాలు తపించి "కేవల" అను పరిపూర్ణస్థితిని పొందారు.
23 వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని
తర్వాత 250 సంవత్సరములకు యీయన తీర్థం కరులయ్యారు.
అసలు మహావీరుడుకూడా క్రీ.పూ.599 లో కాక అంతకు నూరేళ్ళక్రితమే పుట్టాడని కొందరిజైనుల నమ్మకం.
అంటే బౌద్ధంకంటె జైనం పురాతనమైనది. వర్ధమానమహావీరుడు తన క్రమబద్ధబోధనలను 32
సంవత్సరములు కొనసాగించి
తన 72 వ యేట పరమపదించారు. జైనమతం భారతదేశంలోని మగధ (బీహార్) గుజరాత్, మాళవ, రాజస్థాన్, కర్నాటక మరియూ యింకొన్ని దక్షిణభారతప్రాంతాలలో
వ్యాప్తిజెందింది. ఆరావళి పర్వతప్రాంతమున, ఆబూశిఖరప్రాంతమున యీమతము యెక్కువగా కన్పించుచున్నది.
జైనమతవిశ్వాసములు, ప్రవర్తన:- గుణస్ఠనములనబడు14
స్థితులు మోక్షసిద్ధికి సోపానములని జైనుల విశ్వాసము.
అవి 1) మిథ్య 2) సస్వదన (సత్యంమీద యిష్టం) 3) మిశ్ర (సత్యాసత్యవిచక్షణలోని తొ ట్రూపాటు) 4) అవిరత లేక సమ్యక్తవ (సరియైన అవగాహన)
5) దేశవిరతి
(ప్రాపంచికబంధనముల
విముక్తి) 6) ప్రమత్తవిరతి (పతనావస్థ రాకుండా జాగ్రత్తపడు స్థితి)
7) అప్రమత్తవిరతి (స్థిరత్వం) ధ్యానసాధనద్వారా యింతవరకూ వచ్చినవారు ధన్యత్ములు.
కానీ యింకాముందుకు సాగవలసియున్నది. తర్వాతిస్థితులు 8) అపూర్వ కరణ (అవ్యక్తమైన దానికోసం అన్వేషణ)
9) అనివిత్తీకరణ (జనన మరణముల కతీతంగా పయనించు యత్నం)
10) సూక్ష్మసంపరాయ (సూక్ష్మవిషయావగాహన)11)
క్షీణమోహత 12) అంతరాయో పాశంతి (మార్గములోని ప్రతిబంధకములను తొలగించుకొనుట)
యీస్థితి తర్వాత సామన్యమైన జైనుడు మరణిస్తాడు.
కానీ తీర్థంకరపదవి కర్హుడైన మహనీయుడు మాత్రం జీవిస్తాడు.
ఆయన జీవిస్తూ 13 వ స్థితియైన సయోగకైవల్యస్థితి (సశరీరమోక్షం) ననుభవిస్తూ తీర్థంకరులై మతబోధచేస్తారు.
జనులు తమతమ ఆత్మలు మలినంకాకుండా కాపాడుకోవడంకోసం యీ
తీర్థంకరుల సహాయం పొందుతారు. అందుకే వీరు జైనుల రక్షకులు. ఇక ఆఖరుది14 వది యైన స్థితి మోక్షం. దీనినే అయోగకైవల్యం అని కూడా అంటారు.
ఈస్థితి నందుకొన్నవాడు సిద్ధుడు. అతడిక జన్మించుటన్నది జరుగదు. అతడీ విశ్వమునకుపైన మహోన్నత స్థితి లో స్థిరంగా వుండిపోతాడు.
వర్ధమానమహావీరుడు త్రిశలాదేవి గర్భస్థశిశువై వుండగా ఆమె యీ 14 స్థితులను
కలలోగాంచినదట. అది ఒక తీర్థంకరుడుదయించుటకు సంకేతమని జైనులపెద్దలు చెప్పుదురు.
ఈస్థితులు కష్టసాధ్యములుగనుక సామన్యులైన జైనులు మాలిన్య
రహితులై స్వచ్ఛముగా నుండుటకు ఐదు అనుసూత్రములు చెప్పబడి నవి.
అవి 1) స్ఠూలహింసకు పాల్పడకపోవడం, అంటే యితరజీవు లను చంపడం, బాధించకపోవడం 2) స్థూలంగా నిజాయితీగలిగి కల్లలాడకపోవడం.
3) ఇతరుల సొత్తు దొంగిలించకుండావుండటం.
4) ఉన్నదానితో తృప్తిపడటం.
తనభార్యనుతప్ప యితరస్ట్రీలను కామ దృష్టితో చూడకపోవడం 5) మితమునుపాటించడం. అంటే యేదీ అతిగా కావాలని కోరుకోకపోవడం.
వీటిని ప్రతిజైనుడు తప్పక పాటించాలి.
ఇవిగాక మరింతనియమనిష్టలుగల జైనులు తమకొక స్థలాన్ని పరిధిగా
నియమించుకొని అందులోనే స్థిరంగా జీవిస్తారు. ఇతరులయెడ ఖఠినంగావ్యవహరించరు. తప్పులకుసైతం కఠిన శిక్షలు వేయరు. విలాసవస్తువులు వాడుకొనరు. అందరియెడల సమతతో మెలగుతారు. సాత్వికాహారం మితంగా భుజిస్తారు. సాధుసేవ, సామాజికసేవ విధిగా చేస్తారు. శరీరం తమవిధులు చేయడానికి సహకరించని సమయంలో "సల్లేఖనం" అంటే అన్నపానాదులు మాని ప్రాణంవిడుస్తారు.
ఇవన్నీ గమనిస్తే జైనజీవనం చాలా నియమనిబంధనలతో
గడుస్తుందనడంలో సందేహంలేదు.
జైనసిద్ధాంతములు:-
జైనసిద్ధంతరీత్య లోకముఅనాదినుండి వుంటూనేవుంది.
అలాగేకొనసాగుతుంది. దీనికిఅంతంలేదు. దీనినెవరూ సృష్టించలేదు. జగంమిథ్య అనువాదనను జైనం ఒప్పుకొనదు.
యజ్ఞయాగాదులపై విశ్వాసంలేదు. కులాధిక్యం అనుమతించదు. అసలు బ్రాహ్మణాధిక్యతను ధిక్కరించే జైనం పుట్టిందని
కొందరివాదన. జన్మరాహిత్యమే మోక్షమని జైన విశ్వాసం. అందుకందరూ అర్హులే. విశ్వాసము, జ్ఞానము, ఆచరణ అనే త్రిరత్నాలు వీరికి అనుల్లంఘనీయములు.
సర్వసామాన్యంగా జైనులు భాద్రపదమాసం బహుళత్రయోదశి నుండి 8
రోజులు ప్రతి సంవత్సరం పండుగదినాలుగా "పరుష్యణ " (పజ్జసన) జరుపు కుంటారు. ఆఖరుదినం హిందూపంచాంగం ప్రకారం ఋషిపంచమి ఔతుంది.
ఆదినం జైనులు ఉపవాసముంటారు. ఈపండుగలో నాల్గవరోజు వర్ధమానమహావీరుని జన్మదినమౌతుంది.
ఆదినాన్ని "పోషద" అంటారు. ఆరోజు ఆయన జ్ఞాపకాలతో పవిత్రంగా వుంటారు.
అయితే యీ పండుగదినాలను కేవలం శ్వేతంబరులే జరుపుకుంటారు.
దిగంబరులు, పంచమితో యీపండుగ ముగిసినతర్వాత అదేవిధంగా వీరూ యీపండుగ జరుపుకుంటారు.
ఇవిగాక జైనులు 12 సంవత్సరములకొకసారి "బాహుబలి" (గోమఠేశ్వర) అభిషేకం గొప్పగాచేస్తారు. బాహుబలి మొదటి తీర్థంకరుడైన "ఋషభనాథ" (ఆదినాథ) కుమారుడు, మహా యోధుడు. అతడు శత్రువుల జయించి, కడకు రా జ్యాధికారంకోసం
తనసవతిసోదరునితోనే పోరాడాడు. కానీ ఆయుద్ధాలలో జరిగిన హింస, రక్తపాతానికి మదిచలించి, ఆశాపాశములన్నీ త్రెంచుకొని "కాయోత్సరగ" అంటే
శరీరవ్యామోహం పూర్తిగావిడచి నిట్ట నిలువున (సావధాన్‍స్థితిలో) నిలబడి ఒకసంవత్సరం ధ్యానంలో లీనమైపోయాడు.
కాళ్ళక్రింద చీమలు పుట్టలుపెట్టాయి. శరీరంలో కాళుచేతులకు తీగలుచుట్టుక పెరిగాయి.
కానీ ఆయన స్థిరంగా అట్లే వుండిపోయాడు.
ఈకల్పంలో మోక్షంపొందిన మొదటిమహ నీయుడుగా జైనునులు ఆయన్ను
గుర్తిస్తారు. ఈయన విగహాలలో ఒకటి 6 వ శతాబ్దపు కంచువిగ్రహం బొంబాయిలోని వేల్స్‍రాజ పురావస్తు
మ్యూజియంలోవుంది. రెండవది 10 వ శతాబ్దమునాటిది శ్రావణబెళగొళ (కర్నాటక) లో వున్నది. దిగంబరమైన ఆ రాతి విగ్రహం 57
అడుగులు (17.5 మీటర్ల) యెత్తువున్నది. దిగంబర జైనులు పాలూ, పెరుగు, నెయ్యి, నీళ్ళతో యీ విగ్రహానికి మహా మస్తకాభిషేకంచేస్తారు.
12 సవత్సరములకొకసారి జరిగే అభిషేకం గనుక జైనులు యీ అభిషేకంచూడటానికి తండోపతండాలుగా విచ్చేస్తారు.
***
6.తుకారామ్
మహారాష్ట్ర లోని పూనా
ప్రాంతంలో ఇంద్రాణి నదీతీరాన "దేహూ" గ్రామంలో సంత్‍తుకారామ్ 1608
లో జన్మించారు. తల్లిదండ్రులు బోహ్లూబామోరే, కనకబాయి. వీరు శూద్రులైన కుంబి కులస్తులు, నిజాయితీగా వ్యాపారం చేసులొనేవారు. ఇలవేల్పయిన విఠోబా (పాండురంగ) స్వామిని భయభక్తులతో కొలిచేవారు. వీరికి యేడు తరముల ముందువాడైన విశ్వంబరుడు ప్రతిసంవత్సరం
ఏకాదశికి పాదచారియై పండరిపురంవెళ్ళి స్వామిని సేవించేవాడు. అలా పదహారుసార్లు వెళ్ళివచ్చిన తర్వాత,
ఒకనాడు స్వామి కలలోకనబడి, మీవూరి మామిడితోటలో నా విగ్రహంవుంది.
గుడికట్టి సేవించు, అదే నీకు పండరి, అన్నాడట. ఆ ప్రకారమే విగ్రహం దొరికింది. దేహూగ్రామంలోనే గుడికట్టి విగ్రహప్రతిష్ట చేసి తరతరాలుగా అ
కుటుంబంవారు దేహూవిఠోబాను పూజిస్తూ వస్తున్నారు.
తుకారామ్,
వారి తల్లిదండ్రులకు రెండవకుమారుడు. అన్నపేరు శాజి, శాజి లేకలేక గలిగిన సంతానం. తుకారామ్ తర్వాత యింకో తమ్ముడు, చెల్లెలు కూడా పుట్టారు. తండ్రి పిల్లలందరకూ పెండ్లిండ్లు చేసి వానప్రస్థాశ్రమం
స్వీకరించారు. ఆయన వ్యాపారం అన్నశాజి చేపట్టలేనన్నాడు. ఇక రెండవవాడైన తుకారామ్ వ్యాపారబాధ్యతలు స్వీకరించి చక్కగా
నిర్వర్తించసాగాడు. అప్పుడాయనకు కేవలం పదమూడేండ్లే.
తుకారామ్ మొదటిభార్య
శ్వాసకాసరోగి కావడంవల్ల, జిజిబాయిని రెండవపెండ్లి చేసుకున్నాడు.
సంసారం సజావుగానే సాగుతూ వుంది. వున్నట్లుండి తుకారామ్ ౧౭ వ యేట తల్లిదండ్రులు చనిపోయారు.
మరికొద్దికాలానికే వదినగారూ మరణించారు.
అన్న విరక్తుడై తీర్థయాత్రలపేరుతో వూరువిడచి వెళ్ళిపోయాడు.
తుకారామ్ లో వైరాగ్యభావం నెలకొంది. నేనూ నావారను మమకారం పనికిరాదు. ఎవరూ స్థిరంకాదు. ఈ జన్మకు పరమావధి యేది? మరుజన్మ కలుగనిమార్గంవెతుక్కోవాలి. ఇన్నిటికి దైవారాధనే ముఖ్యము. అయితే యెవరు దైవము? ఎక్కడున్నాడు? ఎట్లావుంటాడు, అనే తపన ఆయనలో అధికమైంది. రానురాను వివేకంవృద్ధిచెంది నేను నీవన్న వ్యత్యాసం వుండరాదు.
భగవంతుని దృష్టిలో సర్వంసమానం, చీమ దోమ చెట్టూ చేమా అన్నీ సమమే.
"ఆత్మవత్సర్వభూతాని"
అన్నమాటకర్థం బోధపడింది. ఆకలి గొన్నవానినిచూచి బాధపడ్డాడు, స్పందించాడు. వ్యపారంలో లాభంకంటే యెదుటివారి అవసరం ముఖ్యమనుకోసాగాడు.
లాభాలు తగ్గిపోయాయి. శేఠ్‍తుకారామ్ భక్తతుకారామ్‍గా మరిపోయాడు.
పెద్దవ్యాపారం చిల్లరవ్యాపారమైపోయింది.
ఆఖరుకు అదికూడావదలి యెద్దులపై ధాన్యం తీసుకెళ్ళి పల్లెల్లో
అమ్ముకోసాగాడు. అందులోనూ యీయన ఉదరస్వాభావంవల్ల నష్టాలు మూటగట్టుకున్నాడు.
వ్యాపారం కంటే అతనికి భగవ ధ్యానమే ముఖ్యమైపోయింది.
ధ్యానంలో వేళాపళా లేకుండా మునిగిపోయెవాడు.
ఎదుటివారి దీనస్థితికి కరిగిపోయి ధాన్యం పంచేసేవాడు.
సాటి వ్యపారస్తులు మందలించారు. భార్య కోపగించుకొన్నది. కాని యితనిలో మార్పురాలేదు. కలిసి పనిచేసే వ్యాపారులు వదలి వెళ్ళిపోయారు.
ఒకసారి నాలుగుయెద్దుల్లో ఒకటి అదవిలో మెత్తబడి కూలబడింది.
దేవునిమీద భారంవేసి కూర్చున్నాడు. ఒక దృఢకాయుడొచ్చి ధాన్యం తరలించి కాపాడాడు.
తుకారామ్ పాండురంగడేవచ్చి తన్ను కాపాడాడనుకొన్నాడు.
మొత్తముమీద అతని దయగుణానికి వ్యాపారానికి పొంతన కుదరలేదు.
వ్యాపారంతప్ప వేరేపని తనచేతగాదు. తప్పదుగదా! మిరపకాయల వ్యాపారం ఒకగుడిదగ్గర పెట్టుకున్నాడు.
అమ్మిన కాడికమ్మాడు. అప్పుడొక బ్రహ్మణుడొచ్చి, యింట్లో శుభకార్యం పెట్టుకొన్నాను, అంటూ కంటతడిపెట్టుకున్నాడు. తుకారామ్ కరిగిపోయాడు. ఆ బ్రాహ్మణునివద్ద సంచిలేకపోవడంతో సంచితో సహా మిరపకాయలన్నీ
యిచ్చేశాడు. మళ్ళీ నష్టమే. భార్య జిజిబాయి యెంతగానో నచ్చజెప్పి రెండువందల రూపాయలు తన
పుట్టీంటి వారి కలిమి సాయంతో అప్పు పుట్టించుకొని తుకారామ్‍కిచ్చి నీవు స్వంతంగా
కాకుండా, నీ స్నేహితులైన యితర వ్యాపారులు చెప్పి నట్లు వ్యాపరం చేయమంది.
అలగేనని "వాలేఘాట్" వెళ్ళి వ్యాపారం చేశాడు. తోటివ్యపారులు, బాగా భయంపెట్టారు. భార్యనేడిపించకు రౌరవాది నరకం ప్రాప్తిస్తుందని,
బాగానే వ్యాపారంచేసేట్టు చూశారు. రు.50/- లాభంవచ్చింది. అంతలో ఒక అప్పుతీర్చని బ్రాహ్మణుని రాజభటులు నిర్భందించి
లాక్కెల్లడం, అతనిభార్య విలపిస్తుండటం గమనించాడు. వెంటనే చేతనున్నడబ్బు రాజభటుల కిచ్చి బ్రాహ్మణుని
విడిపించాడు. ఖాళీచేతులతో వచ్చిన భర్తను యేమనాలో తెలియక విలవిలలాడిపోయింది.
మహారాష్ట్రలో 1630-1632
లో పెద్దకఱువు సంభవించింది. ప్రజలు అన్నానికి తల్లడిల్లిపోయరు. తుకారమ్ ఆస్తులు కరిగిపోయాయి. మొదటిభార్య, ఆమెకుమారుడు చనిపోయారు. తండ్రికి వ్రాసి యిచ్చిన అప్పుపత్రాలలో సగం తమ్ముడు
పట్టుబట్టగా యిచ్చెసి, మిగిలినవి నదిలోపారవేశాడు. విరాగియై భాంతూర్ పర్వత శిఖరాలపై పగలు భగవత్‍చింతన,
రాత్రులు గ్రామంలో భజనలు చేసుకోవడం అతని దినచర్యగా
మారిపోయింది. ఒకరైతు యిదిచూచి సహాయంచేద్దామని తన జొన్నచేనికి కాపలావుంచి,
కాపలాకాస్తూ భజనచేసుకోమన్నాడు. తుకారామ్ సరేనన్నాడుకానీ జొన్నలుతినిపోతున్న పక్షులను
తోలలేదు. పైగా అవి యేరోజు కారోజు తింటున్నాయేకానీ మనిషివలె దాచుకోవడంలేదు,
యెంత మంచివి, అనుకున్నాడు. రైతువచ్చిచూచి లబోదిబోమని పనినుండి తొలగించాడు.
కానీ పంటకోసిచూసుకుంటే రెండింతలు పంటచేతి కొచ్చింది.
రైతు అశ్చర్యపోయి క్షమాపణచెప్పి తుకారామ్‍కు నాల్గో వంతు
ధాన్యం యిచ్చాడు.
తనపూర్వీకులు కట్టించిన
విఠోబాఆలయం పాడుబడిపోయింది. తుకారామ్ తనే స్వయంగా మట్టిచెచ్చి ఆలయప్రాకారం బాగు చేయడం
ప్రారంభించాడు. అదిచూచి వూరివారు ముందుకొచ్చి ఆలయం మరమ్మత్తులు పూర్తిచేశారు.
ఆ ఆలయంలోనే తుకారామ్ ఆడుతూ పాడుతూ కాలం గడపసాగాడు.
నామదేవుని అభంగాలు వల్లించేవాడు. కబీరుకీర్తనలు పాడాడు. జ్జానేశ్వరుని గీతా వ్యాఖ్యానం, ఏకనాథస్వామి భావార్థరామాయణం, యోగవాసిష్టం, శ్రీమద్భాగవతవ్యాక్యానం చదివాడు. భూతదయగలిగి చీమల పుట్టలలో పిండి, శర్కర పోశాడు. పశువులకు, పక్షులకు మేతతెచ్చి పెట్టాడు. తీర్థయాత్రికులకు సేవలుచేశాడు. వాళ్ళపాదములకు నూనెరాసి వొత్తిచేవించాడు.
ఒకరోజు ఒక పండుముసలమ్మ
నడవలేకపోవుటచే ఆమెకు కావలసిన నూనె కొనితెచ్చియిచ్చి సహాయముచేసినాడు.
ఆనూనె చలారోజులవరకు అయిపోలేదు. ఈ విషయం ఆమె వూరందరికీ చెప్పింది. ఊరివారందరూ సరకులు తుకారామ్ చేతనే తెప్పించు కోవడం
మొదలుపెట్టారు. తుకారామ్ విసుగుచెందక అందరి పనులూ చేయుచూవచ్చెను. తుకారామ్ పండరియాత్ర చేసివచ్చిన తర్వాత విఠోబా కలలోకనిపించి
నామదేవుని వలెనే నీవూ అభంగములు రచించి పనిపూర్తిచేయమని ఆజ్ఞాపించెనట.
దైవాజ్ఞను తలదల్చి తుకారామ్ అభంగములను రచించెను.
అందులకు దేహూలోనే వివాసమున్న "మాస్వాజీబాబా" అసూయ పడెను. అది మనసులోనుంచుకొని తుకారామ్‍గేదె తనతోటలోపడి
పంటపాడుచేసెనని కోపముతో ముళ్ళకంచె వేయించెను. ఆ కంచె గుడికడ్డమై ముళ్ళు దారిలోపడి భక్తులకు
గ్రుచ్చుకొనజొచ్చెను. తుకారామ్ వాటిని యేరివేసి కంచె దారికడ్డపడకుండా తొల గించెను.
మాస్వాజీ తగిన అవకాశము దొరికెనని తుకారామ్‍ను ముళ్ళకర్రతో
బాదెను. తుకారామ్ వీపున ముళ్ళుగ్రుచ్చుకొని నొప్పితో చాలాబాధ పడెను,
గానీ మస్వాజీని నిందించలేదు. సాయంత్రము మస్వాజీ భజనకురాలేదు. తుకారామ్ వెళ్ళి, అయ్యా! నన్నుకొట్టి మీచేతులు నొచ్చెను. క్షమింపుడు. నేనుమిమ్ము తీసుకొని వెళ్ళెదను భజనకు విచ్చేయండని
ప్రార్థించెను. మాస్వాజీ తనతప్పు గ్రహించి, తుకారామ్ యెడ వైరభావము విడనాడెను. తుకారామ్ తనకు గురువు లభించలేదేయని, చింతిస్తూ పరుండెను. కలలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, తుకారామ్! రాఘవచైతన్యులవారికి కేశవచైతన్యులు శిష్యులు.
వారికి నేను శిష్యుడను. నా పేరు బాబాజీచైతన్య. నేనునీకు మంత్రోపదేశము చేయడానికి వచ్చానని చెప్పి,
శిరముపై చేయుంచి "రామకృష్ణ హరి" యని మంత్రోపదేశం చేశారు. తుకారామ్ ఆనందంగా ఆయనకు మ్రొక్కి. యింటికి భోజనమునకు రమ్మని పిలుచుకవచ్చాడు.
భార్య వారిని నిందించి కలహానికి దిగింది.
అంతలో తుకారామ్‍కు మెలకువవచ్చింది. ఆ బ్రాహ్మనుడే విఠోబాయని తనకు గురూపదేశం చేశాడని భావిం చాడు,
తుకారామ్. భార్య ప్రవర్తనకు విసిగి తుకారామ్ యిల్లు విడచి వెళ్ళాడు.
పగలు నిర్జనాటవిలో దైవచింతలో మునిగి,
తెల్లవారి ఇంద్రాణీనదిలో స్నానంచేసి గుడిలో భజనలుచేసుకొంటూ,
భక్తులు పెట్టిన ప్రసాదంతో ఆకలితీర్చుకొంటున్నాడు.
భార్య ఒకరోజు ఉదయాన్నే ఇంద్రణీనదీతీరానికివచ్చి,
బ్రతిమలాడి భర్తను యింటికి తీసుకెళ్ళింది.
మీమాట జవదాటనని భర్తకు మాటయిచ్చింది.
తుకారామ్, రేపు శుభదినం దానాలుచేయాలన్నాడు. సరేనని వున్నవన్నీ యిచ్చేసింది. యిక కట్టుకొన్న పాతచీరకాక ఒకేఒక చీరమిగిలింది.
అదికూడా ఒక నిరుపేదవస్తే యిచ్చేయమన్నాడు.
ఆమెకిక ఓర్పునశించి తిరిగికోపిష్టిగా మారిపోయింది.
ఒక వర్తకునికి
జ్ఞానేశ్వరుడు కలలో కనిపించి తుకారామ్ కష్టాల్లో వున్నాడు, ధనమిచ్చిరమ్మన్నాడట. అతడు తుకారామ్ స్వీకరించడని తెలిసి, ఒక టెంకాయలో రత్నాలు, ముత్యాలు చొప్పించి తోసు కొండని యిచ్చాడట.
తుకారామ్ తీసుకున్నాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు, తనను జ్ఞానేశ్వరుని సమధివద్దకేగుమని విఠోబా కలలోచెప్పగా
వెళ్ళితిననీ, వెళ్ళివచ్చినతర్వాత స్వామి మీవద్దకు కూడావెళ్ళమని చెప్పగా వచ్చితినని చెప్పాడు.
తుకారామ్ అతన్ని గౌరవించి, రత్నాలు, ముత్యాలున్న టెంకాయ నాయనకిస్తూ, పదకొండు అభంగాలు కూడా యిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు అభంగాలు సంస్కృతంలోకాక మరాఠీలో వున్నందుకు
చీదరించు కొని, టెంకాయతోసహా వాటిని పారవైచి వెళ్ళిపోయాడు. అవి తిరిగి గ్రహించి తుకారామ్ ఖండోబా అను భక్తునకిచ్చాడు.
అతడు భక్తితోతీసుకొని వెళ్ళాడు.
భార్య,
పెద్దకుమార్తెకు వివహంచేయాలని తొందరపెట్టసాగింది.
సరేనని తుకారామ్ సామాన్యయువకులకిచ్చి ముగ్గురుకూతుళ్ళకు
పెండ్లిళ్ళు చేసినాడు. లేనివాడగుటచే అల్లుళ్ళకు పిండివంటలకు బదులు జొన్నరొట్టెలు
పెట్టాడు. భార్యనొచ్చుకొంది. కానీ వియ్యంకులు, తుకారామ్‍తో సంబంధం కుదిరినందుకే ఆనందపడి,
ఆయన కానుకలేమియూ యివ్వనవసరము లేదన్నారు.
తుకారామ్ శూద్రుడని,
అభంగాలపేరుతో దైవకీర్తనలు వ్రాయడం నేరమని,
రామచంద్రభట్ అను పండితుడొకడు రాజుదృష్టికి తీసుకొనిపోయి,
గ్రామబహిష్కరణ ఉత్తర్వులు తెప్పించెను.
తుకారామ్ ఆ పండితుని వేడుకొని, దైవాజ్ఞగా అభంగాలు వ్రాసితి నని, ఇకవ్రాయనని, తాము తరతరలుగా దేహూ వాసుల మని ఉత్తర్వులు రద్దుచేయించమని
బ్రతిమలాడెను. ఆయన సరే! నీ అభంగాలన్నీ నదిలో పారవేస్తే ఉత్తర్వులు రద్దుచేయిస్తాననెను.
తుకారామ్ చేయునదిలేక అభంగాలను కట్టగట్టి నదిలో పారవైచి,
పదమూడు దినములు గుడిలో తులసికోటవద్దగల అరుగుపై పరుండి
దుఃఖించుచుండెను. ఇంతలో భక్తులుచచ్చి అభంగములు భద్రముగా గట్టుకు చేరినవని,
రామచంద్రభట్టుకు శరీరమంతా మంటలుపుట్టెనని,
తెలిపిరి. తుకారామ్ ఆ భట్టును క్షమించి అతని బాధలు దైవప్రార్థనతో
మాన్పెను. ఆ భట్టుకూడ అప్పటినుండి సానుకూలుడాయెను.
తుకారామ్ "లోహా" గ్రామంలో నుండగా శివాజీ ఛత్రచామరాందోళి కాదులు పంపి
గౌరవింపనెంచెను. కానీ, వాటిని తుకారామ్ గ్రహింపలేదు. శివాజీని దీవించి వాటిని త్రిప్పిపంపెను.
తర్వాత శివాజీయేవచ్చి తుకారామ్‍ను దర్శించి ప్రభావితుడై
సన్యసించ నెంచెను. కనీ తుకారామ్ కర్తవ్యబోధచేసి, క్షాత్రముయొక్క ఆవస్యగతను తెలిపి, సమర్థరామదాసును గురువుగా చేసుకొని ముందుకుసాగమనెను.
తుకారామ్ ఆరోగ్యము
రానురాను క్షీణించసాగెను. భక్తులతోకూడి పండరి వెళ్ళలేకపోయినందుకు బాధపడెను.
భక్తులతో తన అశక్తతను అభంగములుగా రచించి పంపి నివేదించమనెను.
వారట్లేచేసి స్వాంతనముచేకూర్చిరి. లోహా గ్రామంలో శ్రీకృష్ణ మహోత్సవాలు జరిగాయి.
వాటిలో తుకారామ్ భక్తిశ్రద్ధలతో పాల్గొని నూతన అభంగాలు
వ్రాసి స్వామికి సమర్పించెను. ఆ విధంగా ఆయన సుమరు నలుగువేల అభంగాలు తన జీవితంలో
రచించినారట. ఆఖరుగా అయన వైకుంఠం వెళ్ళుచున్నానని భక్తులకుచెప్పి, తనభార్యను రమ్మని కబురుపంపారు. ఆమె యేదో మరోవూరికి వెళుతున్నారనుకొని,
నాకు తీరుబడిలేదు అయన్నే వెళ్ళమని చెప్పిపంపింది.
తుకారామ్ భక్తులతో చెబుతూ, ఆమె కుటుంబభారంతో అలసిపోయి కఠినంగా మాట్లాడుతుందేకాని
మంచిహృదయంకలిగినదని ఆమెను మేరే కాపాడండని చెప్పి ఇందాణీనదిలో దిగి ఆప్రవాహంలో
మునిగి వైకుంఠం చేరు కున్నాడు. కనీ కొందరు భక్తులు ఆయన విష్ణువు పంపిన గరుడ వాహనమెక్కి
సశరీరుడై వైకుంఠం వెళ్ళాడని చెబుతారు. ఆయన గరుడవహన మధిరోహించిన స్థలమిదేనని దేహూగ్రామంలో
యిప్పటికీ యాత్రికులకు చూపుతున్నారు. ఆయన 1649 లో
వైకుంఠయత్ర వెళ్ళినట్లు తెలియుచున్నది. అప్పటికాయనకు 41 సంవత్సరములే!
సంసారిగావుంటూ,
యీతిబాధలకోర్చి, భగవంతునికే సర్వం సమర్పించి. సాంసారికబంధములకు చిక్కక, వైకుంఠవాసుని గలసిన సంత్‍తుకారామ్ ఆదర్శపురుషుడు.
మహత్ముడు.
***
7.వాల్మీకి
ముందుగా సాహితీలోకస్రష్ట యైన శ్రీవాల్మీకిభగవానుని స్మరించి
ఆయన చరిత్రను స్పృజిద్దాం.
శ్లో: కూజంతం రామరామేతి
మధురం
మధురాక్షరం
ఆరూహ్య
కవితాశాఖాం
వందే
వాల్మీకికోకిలం.
వాల్మీకికి సంబంధించిన వివరములు మనపురాణములలో స్పష్టముగా
కానరావు. వివిధ కథనాలు కనిపిస్తాయి. సత్యయుగం నాటిమాట. బ్రహ్మ స్వర్గందర్శింపవచ్చి, అక్కడ రంభాది అప్సరల నృత్యముచూచి వారి సౌందర్యమునకు చలించి
రేతఃపతనము గావించుకొనెనట. ఆరేతస్సు క్రిందబడి, అందుండి, బాలు
డుదయించి, అంతలోనే పెద్దవాడై బ్రహ్మతప్పిదమును గుర్తుచేసి తనకాహారము సమకూర్చమని
నిలదీసెనట. అంత బ్రహ్మ కుపితుండై "భూమిపైబడి బోయలలో కలసి హింసాప్రవృత్తితో ఆహారము వడయు"మని శపించెనట. ఆతర్వాత శాంతించి రామ మంత్ర జపమున నిర్మలుడవై
పూజింపబడుదువనెనట. అతడే వాల్మీకి. అదియొకకథ. మరియొక కథప్రకారము అతడు ప్రచేతసుని కుమారుడు.
లీలావతి భర్త. ఇంకొక కథ ననుసరించి అతడు చర్షిణి, వరుణుల కుమారుడు. ఏదియేమైనను ఒకబోయ, వాల్మీకిమహర్షి గా మారిన కథ మాత్రము లోకవిదితము.
రఘునాథనాయకుడు సంస్కృతధర్మఖండము నుండి గ్రహించిన కథనాధారము
చేసుకొని వాల్మీకి చరిత్రము రచించినాడు. ఆకథలో వాల్మీకి తొలినామము వ్రాయలేదు.
కొన్నిచోట్ల రత్నాకరుడని, మరికొన్ని చోట్ల బుక్కుడని వ్రాయబడియున్నది.
ఉండనిండు. ప్రస్తుతమునకు ఆటవికుడు గనుక బుక్కుడనే అనికొందము.
ఒకసారిసప్తర్షులు భూలోక తీర్థముల దర్శించుచూ తమసానదీతీర
అరణ్యప్రా0తమున పయనించుచుండిరి ఆ అటవీప్రాంతమున వారికి ఒక బోయపల్లె
తటస్థపడెను. ఆపల్లెలో వీధులన్నీ మాంసపు తోరణాలు కట్టబడి వున్నాయి. వాటినుండి గాలికి నీచువాసన గుప్పు మంటూవుంది.
అక్కడి కుక్కలు పచ్చిచర్మాలు యెముకలు నమలుతూ దుర్వాసనలు
వెదజల్లుతున్నాయి. ఊరబందులు బురదలోద్రొల్లుతూ, కంపుగొడుతున్నాయి. వీటికితోడు చేపల గంపలనుండి వచ్చేవాసనకు,
బాటసారులైన ఆమునులకు కడుపు లోత్రిప్పి
వాంతికిజేసుకొనేంతపనైంది. ఎలాగోలాగున ఆ ప్రాంతం నుండి తొందరగా నడవసాగారు.
పల్లెదాటారోలేదో వారియెదుట బుక్కుడు ప్రత్యక్షమైనాడు.
చ: కటినటియించు
నీలిబలుకాశయు నల్లనిమేను చిమ్మచీ
కటి ఘటియింప చేత
విలుగైకొని మేఘముపిల్లవోలె న
ట్టిటు శరపంక్తులడ్డముగ
నేయుచు డాయుచు వచ్చివచ్చి య
జ్జటికుల
సార్వభౌములను సాగగనీకరికట్టి నిల్చుచున్
క: నిలునిలువుడు
మీచేతన్
గల సొమ్ములనెల్ల
నిచ్చి కదలుడు నాతో
జలపట్టిన మిము
నందర
బలుచుట్టలమీద
నుతికి పారన్‍వైతున్.--- అని గద్దించాడు.
వారు తమదగ్గర యేమీ లేదన్నారు. బుక్కునకు కోపం పెల్లుబికింది తనవింటిబద్దతో వారిని
వాయించేశాడు. మోచేత్తోనూ, పిడికిలితోనూ గుద్దాడు. వారిజోలెలు లాక్కొని వెతికాడు. ఏమీ దొరకలేదు. దరిద్రపుముఖాలు యెదురుపడ్డాయని తిట్టి వారి యెదురుగా బండపై
కూర్చొన్నాడు. కాసేపాగి మునులు మెల్లగా బుక్కునితో యిలా అన్నారు. నాయనా మమ్మల్ని అన్యాయంగా తిట్టావు కొట్టావు.
సరే! మేమొక్కమాట అడుగుతాము అడగ మంటావా? అన్నారు. పనివృధాయైపోయిందన్న చింతతోవున్న బుక్కుడు "ఎలాగూ పనిచెడిపోయింది సరే! అడగండన్నాడు. అప్పుడా స్వాములు
క: ప్రాయము
జలకల్లోల
ప్రాయము కాయంబు
నస్థిరం బిందులకై
రోయక దురితమె
మతమని
పాయక చేసెదవు
నింద పరగ పులిందా!
వయసులోవున్నావ్. బలవంతుడివి అయినా యీవయసు, బలం అశాశ్వతంగదా! రవ్వంతైనా ఆలోచించకుండా పాపం చేస్తున్నావు.
నీశక్తియుక్తులు యేటికొచ్చిన వెల్లువలాంటివి.
అణగిపోవా! అన్నారు. వెంటనే బుక్కుడు, "వెఱ్ఱిస్వాములూ యీ ఆయుధాలు విడిచిపెట్టి దోపిడీలు మానేస్తే
నా భార్యాబిడ్డలనెట్లా
సాకుతాను, నావృత్తే యిదిగదా! ఇదినా ఒక్కనికోసం గాదుగదా!"
అన్నాడు. అప్పుడు స్వాములు
క: ఓరోరీ నీవుచేసిన
ఘోరపు పాపములు
నీవు కొడుకులు నాలున్
జేరబడి
పంచుకొందురొ
వారికి బనిలేక
నీక వచ్చునొ చెపుమా?
అనగానే "అదేంది స్వాములూ, అందరికోసం చేసిన పనిగదా! యిది. పాపమో పుణ్యమో! అందరం పంచుకుంటాం దీంట్లో అనుమానం దేనికి?"
అన్నాడు బుక్కుడు. "ఎందుకైనా మంచిది ఒక్కమాట భార్యా పిల్లలను అడిగిచూడు.
మేమిక్కడేవుంటాం. వెళ్లి అడిగిరా" అన్నారు స్వాములు. "సరే! దాందేముంది అడిగివస్తా"నని యింటికివెళ్ళి భార్యను పిలిచి
క: ఓపడతి
తానొనర్చిన
పాపంబులు దలప నీకు
పనిగలదో నా
కేపనియో కాక
చెరిసగ
మై పరగునొ నాకు
దాచ కంతయు జెపుమా!
అని అడిగాడు. ఆమె నవ్వి యీ మాత్రం మీకుదెలియదా! పాప పుణ్యాలకు నేనెలా బాధ్యురాలను, నాబాధ్యత కేవలం నీకు అనుకూలంగా ప్రవర్తించటం మాత్రమే
చ: తవులగువారి
కెవ్వరికికతంబున సాకెద వప్పుదీసితె
త్తువొ
కొనితెట్టూవో తెరువుదోచుచు తెట్టువొ జూదమాడి తె
త్తువొ
చనితెత్తువో యదియు దోసమొ పున్నెమొ నాకు నేటికా
ఠవఠవ
నీవుదెచ్చినవి దాచక వండగ బాడి నిచ్చలున్.
నీవు తెచ్చినవి వండిపెట్టడమే నాపని నేవెలా సంపాదించావన్న
విషయం తో సంబంధం లేదు. అని ఆమె ఖరాఖండిగా చె ప్పి0ది. కొడుకులూ తల్లిమాటే సరైన దన్నారు. బుక్కుని మనస్సు చివ్వుక్కు మన్నది. నేనుతెచ్చేసొమ్ము తింటారట. ఆసొమ్ముతేవడానికి నేను పాపంచేస్తే అదిమాత్రం వీళ్ళకు
వర్తించదట. ఎంతమోసం. చాలిక యీ బంధాలు. వీరికోసం నేనుపాటుపడటం వృథా!
క: దోసమునకు
పనిలేదట
నాసొమ్ములు
వీరికిన్ దినంపనిగలదే
రోసితి సంసారము
దెగ
గోసితి మొదలంట
బంధుగుల తగులెల్లన్.
అని ఒకదృఢనిశ్చయానికొచ్చి, వెంటనేవెళ్లి సప్తర్షుల కాళ్ళాపై బడి,
జరిగిన విషయం, త న నిశ్చయం తెలిపి, తనకు దారిచూపమని వేడు కున్నాడు. వారు కరుణించి, సర్వవర్ణధారణంబును, నిఖిల మంత్ర ఫలదంబును, లోకాపాది దోషరహితంబును, దేశకాల నియమాను పేతంబును, సత్యకామంబును, శ్రుత్యాభిరామంబును, మనుసార్వ భౌమంబును అగు రామంబు ప్రతిలోమంబుగా అనగా "మరా" అని ఉపదేశమిచ్చి సప్తర్షులు వారిదారిన వారు వెళ్ళిపోయారు.
బుక్కుడు స్థిరంగా "మరా" మంత్రం జపిస్తూ దీక్షలో మునిగిపోయాడు.
ప్రొద్దు క్రుంకినా భర్త యింటికి రాకపోయేసరికి కొడుకుల్ని
పంపి వెతక మన్నది. వారు వెతికివెతికి మరునాడు ఉదయానికి తండ్రిని కను గొన్నారు.
భార్యాసుతులు వెళ్ళి యింటికిరమ్మని బ్రతిమలాడారు.
ఉన్నవిషయం చెప్పితిమేగాని నీపై ప్రేమలేకకాదు.
మమ్ముమన్నించి లేచిరమ్మని మరీ మరీ వేడుకున్నారు.
కానీ బుక్కుడు లేవలేదు.
క: సతులెవ్వరు
సుతులెవ్వరు
హితులెవ్వారేటి
వరద నెందేనొకచో
జతగూడిన
కాష్టంబుల
గతి నించుక
విచ్చి కదలుదు రవలన్.
భార్యా, బిడ్డలు, తనవారు, పెరవారు యిదంతా భ్రమ. నదీ ప్రవాహం లో కొట్టుకొనివచ్చే కట్టెలు కాసేపు నదిలో కలిసి
కొంత దూరం వచ్చి ఒక్కసుడితిరిగి ఒక్కోకట్టె ఒక్కోప్రక్కకు వెళ్ళిపోతుంది.
మన సంబధమూ యింతే. ఇంక యింటికి తిరిగివచ్చే ప్రసక్తేలేదు వెళ్ళమన్నాడు.
సీ: దినము మరామరా
యని పల్క అంతంత
అది
రామనామ పర్యాయమయ్యె
ఆరామనామ జపానుభావంబున
అంతర్ముఖతజూడ నల్లనల్ల
నల్లనిమొగులొండు
నానాట గనిపించె
నదియు
గోదండ కాండాంకితమగు
సగుణభావంబునొందె
సగుణరూపంబెల్ల
రూపింప
నిర్గుణరూప మగుచు
తే: గోటి
రవిచంద్రరూపమై కొమరు మిగిలె
నట్టి
తేజంబునందును నంతరంగ
మిట్టటు చలింప
నీయక గట్టిగాగ
బూదె గరగిన గతి
నేకముగ ఘటించె.
అలా ఆమునులిచ్చిన మంత్రప్రభావంవల్ల ప్రత్యక్షానుభూతులను
పొందుతూ వుండగా అతనిచుట్టూ పుట్ట(వల్మీకం) బెరిగింది. అయినా చెదరక బెదరక దీక్షలో అట్లే వుండిపోయాడు.
చాలాకాలం గడిచింది. సప్తర్షులు తిరుగుప్రయాణంలో మళ్ళీ అదేదారిన యీ ప్రదేశానికి
వచ్చారు. వారు పరిస్థితులు మారిపోయినట్లు గమనించారు. వనం ఫలపుష్పాదులతో రమణీయంగావుంది. పుట్టలోనుండి "రామ" శబ్దం హృద్యంగా వినబడుతూవుంది. సంతోషించారు. బుక్కుని తపం ఫలించిందని గ్రహించారు.
పుట్టపై అమృతవర్షం కురిపించారు. అందుండి మహర్షి బయల్పడ్డారు. వల్మీకంనుండి ఉద్భవమైనాడు గనుక ఆయన వాల్మీకి యయ్యాడు.
సప్తర్షులు దీవించి వెళ్ళిపోయారు. అక్కడ వాల్మీకిఆశ్రమం వెలిసింది. భరద్వాజాది శిష్యులేర్పడ్డారు. ఆప్రదేశం ఆధ్యాత్మిక తరంగాలతో నిండి ప్రశాంతతను
సంతరించుకొన్నది. ఇదీ రఘునాథరాయల వాల్మీకిచరిత్ర. ఇందులోని సంఘటనల గురించి కొంత ఆలోచించవలసియున్నది.
బుక్కుడు అంతగాబాధించినా సప్తర్షులు యెందుకు కోపగించుకొని
అతన్ని శపించలేదన్నది ఒక సందేహం. ఆలోచిస్తే ఆ బుక్కునిలో భావివాల్మీకిమహర్షిని వారు దర్శించారేమోననిపిస్తుంది.
అందుకే వారు శాంతంవహించారు. వారి దివ్యశక్తితో వానిలో ఆలోచించే శక్తిని ఉత్పన్నంచేశారు.
వైరాగ్యం కలుగజేసే వాతావరణం కలుగ జేశారు.
వారప్పుడు అతడున్నస్థితికి అనుగుణంగా రామాన్ని ప్రతి లోమంగా
"మరా"
అని దీక్షనిచ్చారు. అది "రామా" గా మార్పు జెందుతుందని, ఆతర్వాత అది ఆధ్యాత్మిక ప్రత్యక్షానుభవం కలుగ జేస్తుందని
వారికి ముందేతెలుసు ననిపిస్తున్నది. రామమంత్రం అగ్నిబీజసహితం. అది దోషాలను దగ్ధంచేస్తుంది. అందుకే సప్తర్షులు ఆమంత్రం బుక్కునకుపదేశించారు.
అంతేగాని అప్పటికింకా అవతరించని శ్రీరామచంద్రుని నామంగా మనం
గ్రహించడానికి వీలులేదనిపిస్తుంది.
ఇంకొక సందేహం, బుక్కునిభార్య యెందుకు తాను భర్తపాపంలో పాలుపంచుకోవడానికి
వీలులేదన్నది? ఆలోచిస్తే ఇదీ నిజమే ననిపిస్తున్నది. భార్య తనకు భర్తే దిక్కనుకుంటుంది. మానసికంగా శారీరకంగా అతన్నే ఆరాధిస్తుంది,
ప్రేమిస్తుంది ఆమెవిశ్వాసంలో నిజాయితీ,
స్వచ్ఛత, పవిత్రతావుంది. భర్తలో తాను సగమను కుంటుంది. కనుకనే ఆమె భర్తపుణ్యాలలో సగం గ్రహించ గలుగు తుంది.
ఆమెప్రేమలోని పవిత్రత పాపాలను దరిచేరనీయదు,
పుణ్యాలను మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ భర్తవిషయం అలాకాదు, భార్యపై అతడంతగా ఆధారపడడు. ఒకవేళ ఆమె చనిపోతే రెండవ పెళ్ళికి వెంటనే సిద్ధమౌతాడు.
అందుకే అతడు భార్యపుణ్యా లను గ్రహించలేడు.
కనుక బుక్కునిభార్య నిజమే వచించింది.
ఇదంతా సాంప్రదాయస్త్రీని దృష్టిలో నుంచులొని చెప్పబడిందని
ముఖ్యంగా మనం గ్రహించాలి. ఇక రామాయణ రచన కెలా అంకురార్పణ జరిగిందో తెలుసుకొందాం.
రావణాసురుని దుండగములు మితిమీరిపోయాయి.
రామావ తారానికి సమయమాసన్నమయింది. ఈ విషయం శ్రీహరి నారదునకు తెలియజేశారు.
అయితే నారదున్ని అప్పుడే యీ విషయం ప్రచారంచేయొద్దని
చెప్పాడు హరి. నారదుడు తెలిసిన విషయం చెప్పకుండా ఉండలేడు. ఆయనకు విషయం కడుపులో దాచుకొని ఆ కడుపుబ్బరం భరించడం
కష్టమైంది. కనుక వెళ్ళి బుక్కుడు తపంలోవుండగా
పెరిగిన పుట్టబిళంలో విషయం ఊదే శాడు. వల్మీకంలోవున్న బుక్కుడు వాల్మీకిగా బయటపడిన తర్వాత,
నారదముని చెప్పిన విషయాన్ని రామాయణకావ్యంగా రచిచాడు.
అందుకే రామాయణం రామునికంటే ముందే పుట్టిందంటారు.
ఇది ఒక ఐతిహాస్యం. కానీ రంగనాథరామయణకథ చాలా సబబుగా వుంది.
రాముడు, వాల్మీకి ఒకేకాలంలో జీవించినవారు. కనుక రామచరితం వాల్మీకి వాస్తవాలను స్వతహాగా కని,
విని తెలిసుకొనే వ్రాసివుండవచ్చు. ఆ కథనాన్నికూడా తెలుసుకొందాం.
ఒకనాడు నారదమునీంద్రులు వాల్మీకిఆశ్రమానికొచ్చారు.
వచ్చి వాల్మీకిమహర్షిని కావ్యరచన చేయమన్నారు.
వాల్మీకి ఆలోచనలో పడ్డారు. నారదమునీంద్రా! నా కావ్యానికి తగిన నాయకుడు కావాలిగదా!
అతడు శ్రీమంతుడు, పుణ్యుడు, నీతిజ్ఞుడు, దుర్దముడు, జితకాముడు, నిరసూయుడు, సువ్రతుడు, సుచరిత్రుడు, శాంతుడు, అజేయుడు, ఉత్తముడు ఉదారుడు అయివుండాలిగదా౧ అట్టివాడు భూత భవిష్యత్
వర్తమానాలలో కలడేమో మనదృష్టికందాలికదా! అన్నాడు. అందుకు
నారదుడు మహర్షీ! మీకా శ్రమ అక్కరలేదు.
ద్విపద
ఈమహి శ్రీవిష్ణు - విపుడు జన్మించె
రాముడై దశరథ - రాజున కతడు
నియతాత్ము డతిశౌర్య - నిధిజలా జలధి
జయశాలి స్వజన ర - క్షణ విచక్షణుడు
కంభుకంధరుడు చ _ క్కనిమేనివాడు
బింబారుణోష్ఠుడు - పీనవక్షుండు
వెడదకన్నులవాడు - విపులాంసతలుడు
నిడుదచేతులవాడు - నియతవర్తనుడు
వేదవేదాంగ కో - విదుడు కోదండ
వేదవిద్వరుడు వి - వేక భూషణుడు
కమలాప్తతేజంబు - కడలి గాంభీర్య
మమరాద్రి ధైర్యంబు - అవని సైరణయు
ధనదుని త్యాగంబు - తనయందు మిగుల
అనువొందు నిత్య - కల్యాణ విగ్రహుడు
కౌసల్యకానంద - కరుడు శ్రీకరుడు
భాసురత్రైలోక్య - పావన మూర్తి
రాముడై యిలబుట్టె - రాజశేఖరుడు.
అతడే నీ కథానాయకుడు. ఇక కావ్యరచనకు తమరుపక్రమించ వచ్చునని వెళ్ళిపోయాడు నారదముని.
వాల్మీకులవారు ఆవిషయమై ఆలోచిస్తున్నారు,
దినాలు గడుస్తున్నాయి. ఒకనాడు వాల్మీకిమహర్షి శిష్యులతో గలసి తమసానదికి స్నానానికి
బయలుదేరాడు. అక్కడ ఒకబోయవాడు చెట్టుకొమ్మనున్న జంటక్రౌంచపక్షులలో ఒకదానిని బాణంవేసి
పడగొట్టాడు. రెండవపక్షి పడిపోయినపక్షికై విలపించ సాగింది. ఆదుఃఖము చూచి చలించిపోయాడు వాల్మీకి.
వెంటనే శపించాడాబోయవానిని. ఆ శాపం అనుష్టుప్ ఛందస్సులో శ్లోక రూపంగా వెలువడింది
వాల్మీకి నోటినుండి. అది
శ్లో: మానిషాద
ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీస్సమాః
యత్‍క్రౌంచమిధునాదేక
మవధీః కామమోహితం.
ప్రేమానురాగాలతో కూడియున్న పక్షిజంటలో నొకదానిని కూల్చిన
కిరాతుడా! నీకు చిరకాలమపకీర్తి కలుగుగాక! లేదా ఆ పక్షులవలెనే నీవునూ నశింతువు గాక!
అని అర్థం. అక్కడనుండి వాల్మీకి ఆశ్రమం చేరుకున్నాడు.
సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆశ్రమం ప్రవేశించాడు.
వాల్మీకి బ్రహ్మనాహ్వానించి మ్రొక్కి,
తననోట సహజంగా ద్రొల్లిన శాపశ్లోకం వినిపించి దేవా!
యేమిటిది? అన్నాడు. బ్రహ్మదీవించి వాల్మీకిమునీంద్రా! శారద నీ నాలుకపై నిలిచి పలికించిన శ్లోకమిది.
ఇది ఆలంబనముగా శ్రీరామచరితము లిఖించుము.
నారదుడు నీకు రామకథ సంక్షిప్తముగా చెప్పినాడుగదా!
దానిని నీవు విస్తరించి వివరముగాజెప్పుము.
విషయములన్నీ నీ మనస్సునకు స్పష్టముగా గోచరించగలవు.
అని బ్రహ్మ అంతర్హితుండయ్యాడు.
వాల్మీకి చతుర్వింశత్‍సహస్రికాత్మకమైన రామాయణకావ్యము
రచించినాడు. అది సంస్కృతవాఙ్మయలోకమున కుషయైనది. ధ్వని ప్రాధాన్యమై, భరతఖండవిశిష్టసంస్కృతిని, గార్హస్థ్యధర్మాన్నీ లోకానికి ప్రబోధిస్తూ శ్రీరాముని
పరబ్రహ్మతత్త్వాన్ని సూక్ష్మముగాను, ఆయన ప్రవృత్తి ధర్మము సర్వమానవులకాదర్శమగునట్లును రచించి "ఋషిదర్శనాత్" అను వేదవాక్కును నిజంచేసిన క్రాంతదర్శి వాల్మీకి.
ఆయనకు సాహితీలోకమంతా ఋణపడిపోయింది. ఆయన స్తుతి పాత్రుడయ్యాడు.
కవికోకిల దువ్వూరిరామిరెడ్డిగారు చేసిన వాల్మీకిస్తుతి
చూడండి యెంతహృద్యముగా నున్నదో-
ప్రకృతిభాండారంపు ద్వారంబుదెరచి
గుప్త రత్నంబుల కొల్లగొట్టితివి
ఆకాశమునగల అన్నితారకలు
కడలి గర్భమునందు గలజీవమణులు
సరితూగలేవునీ సౌభాగ్యమునకు
భావవారధి పూలపడవ నడిపించి
ముత్యాలరేవులో మునిగి యడుగంటి
పలురంగుమణులను వలనీడ్చితెచ్చి
నవ్యమౌ కావ్యమండన మొండొనర్చి
విశ్వసాహిత్యంబు వెలయించినావు.
ఈవిధంగానే పూర్వకవిశేఖరులెందరో వాల్మీకి మహర్షిని వేనోళ్ళ
బొగడినారు.
శా: శ్లోకంబుల్
శతకోటి కాండములుగా సూత్రించి రామాయణం
బేకైకాక్షర మెల్లపాపముల
మాయింపంగ నిర్మించి సు
శ్లోకుండైన
పురాణసంయమివరున్ జూతున్ మనోవీధి వా
ల్మీకిం
బ్రహ్మపదావతీర్ణు కవితా లీలావతీ వల్లభున్.
చ: సరసిజగర్భనిర్మిత
లచచ్ఛతకోటి విశాల రాఘవే
శ్వర చరితంబు
లోకహితసంగతి నిర్వదినాల్గువేలుగా
వరుస
రచించినట్టి మునివల్లభు నాదికవీంద్రు యోగవి
స్ఫురితు
విరించినాంశభవు బుణ్యు ప్రచేతసపుత్రు గొల్చెదన్.
ఉ: ఏకవి జిహ్వ
దొల్త నటించె సరస్వతి పాదనూపురో
దేక ఝళం ఝళా
ర్భటులు దిక్కులు బిక్కటిలంగ నేశుభ
శ్లోకుని
మానసాబ్జమున శోభిలె దారకహంసమట్టి వా
ల్మీకిమహర్షిశేఖరు నమేయగుణాకరు నాశ్రయించెదన్.
శా: శ్రీరామాయణకావ్య
సారలలిత శ్రీకల్పశాఖాగ్రమం
దారూఢస్థితి
బొల్చి భాసుర జనాహ్లాదంబుగా మాధూరీ
చారుప్రౌఢిమ రామ
రామ యనుచున్ సమ్యగ్‍వచోవైఖరుల్
మీరంబల్కు
పికంబు నాబరగు వాల్మీకిన్ బ్రశంశించెదన్.
8.నాభాగుడు
ధర్మమునకు కట్టుబడి, పరులకు నావలన బాధకలగరాదని తలచి తనజీవితమును మలచుకొని
జీవించువాడు ధన్యుడు. అతడు భగవంతునకిష్టుడు. తొలుత అతడు కష్టములపాలైనట్లు లోకము నకు అనిపించవచ్చునుగానీ
అతనికియ్యక భగవంతుడు తనవద్ద యేదియునూ మిగుల్చుకొనడు. అప్పుడతడు అందరికంటే భాగ్య వంతుడేకదా!
ఇది తెలియక కొందరు, తెలిసియు నమ్మక కొందరు అధర్మమునకు పాల్పడుచుందురు.
అట్టివారిని భగవంతుడుకాక, వారినివారే రక్షించుకొనవలసివచ్చును. అది భగవంతుని రక్షణకు సమానమగునా? ఎన్నటికినీకాదు. ఈవిషయమును తెలిపే ఒక భాగవతవృత్తాంతమున్నది.
అది తెలుసుకొని మనమూ మేల్కొందముగాక.
భాగవత నవమస్కందములో వైవస్వతమనువంశ కథనము చెప్పబడినది.
ఆవంశక్రమములో నాభాగుని చరిత్ర వివరింప బడియున్నది.
ఈ నాభాగుడు పరమధార్మికుడు. ఇతడు నభగుడనే రాజుకుమారుడు గనుక నాభాగుడని పిలువబడ్డాడు.
ఇతడు చాలా కాలం బ్రహ్మచర్యంపాటిస్తూ గురుకులంలో
విద్యాభ్యాసంచేస్తూ వుండిపోయాడు. ఇంతలో యితనిఅన్నలు యితనికి తెలియకుండానే తండ్రిఆస్తిని
పంచేసుకున్నారు. ఇతడు విద్యాభ్యాసము పూర్తిచేసుకొని తిరిగివచ్చి, అన్నలను తనభాగమడిగాడు. వారు సరైన సమాధానమియ్యక "నీవువెళ్ళి మనతండ్రిగారి నడుగుము మమ్ములనుకాదు.
ఆయనేమి చెప్పునోచూతము"
వెళ్ళుమనిరి. నాభాగుడు వారుచెప్పినట్లే అడవిలో ఆశ్రమవాసము చేయుచున్న
తండ్రివద్దకు వెళ్ళి తనభాగము ఆస్తి నిప్పింపుమని యడిగెను. తండ్రి కొంతయోచించి "కుమారా! నీఅన్నలు ధర్మమువీడి చరించు చున్నారు.
నామాటవినరు. కనుక వారినుండి యేమి ఆశించిననూ ఫలితముశూన్యము"
కనుక నీవు అంగిరసులు చేయు సత్రయాగము వద్దకు వెళ్ళుము.
వారు నిజమునకు చాలా విజ్ఞానవంతులే అయి నప్పటికినీ ఆరవరోజు
క్రతునిర్వహణావిధానము తెలియక సతమత మౌచున్నారు. నీవు సుదీర్ఘవిద్యాభ్యాసముచేత సర్వమెఱుంగుదువు.
వారికి తగిన సలహాలనొసగి సత్రయాగము సక్రమముగా పూర్తిచే
యింపుము, వారు మెచ్చి నీకు యాగానంతరము మిగిలిన సంభా రములు, ధనము యిచ్చి ఉత్తమలోకములకు వెళ్ళుదురు.
ఆధనము తో నీవు జీవనముసాగింపుమని హితవుచెప్పి కొడుకును
పంపెను.
నాభాగుడు తండ్రిమాటను పాటింపదలచెనేగాని,
అన్నలతో వివాదముపడి వారిమనస్సులను నొప్పింపదలచలేదు.
సరాసరి సత్రయాగము చేయుచున్న అంగిరసులను గలసికొని,
వారిసందేహములను దీర్చి, సత్రయాగసమాప్తికి సహకరించి, వారి అనుగ్రహమునకు పాత్రుడయ్యెను. వారునూ సంతోషించి, తండ్రిచెప్పినట్లే యాగానంతరం మిగిలిన ద్రవ్యమునంతయూ
నాభాగునకిచ్చి నీవు కవివై వెలుంగుమని వరమిచ్చి స్వర్గము జేరుకొనిరి.
నాభాగుడు మిగిలిన ద్రవ్యధనాదులను సేకరించు కొనుచుండాగా ఒక
దీర్ఘశరీరుడు వచ్చి అడ్డుపడ్డాడు.
క: అంగిరసులిచ్చు
పసిడికి
మంగళమతి జేరు
నృపునిమానిచి యొకడు-
త్తుంగుడు
గృష్ణాంగుడు దగ
ముంగల నిలుచుండి
విత్తము జేకొనియెన్---భాగ-9-77.
ఆనల్లని బలాఢ్యుడు నాభాగుడు సేకరించుకొన్న ధనాన్ని లాగేసు
కొని, ఇదినాది, వెళ్ళుమన్నాడు. నాభాగుడు వినయంగా అయ్యా! ఈధనము అంగిరసులు యజ్ఞానంతరము నాకిచ్చి వెళ్ళారు,
కనుక నాది. నాధనము నాకిచ్చేయండి అని ప్రాధేయపడ్డాడు.
అట్లైతే వెళ్ళు, వెళ్ళి మీతండ్రినడుగు నాదికాదు, ఇది నీదంటే చూద్దాం. ముందువెళ్ళి మీతండ్రినడుగు అన్నాడా బలాఢ్యుడు.
నాభాగుడు అలాగేనని వినయంగా తలూపి తండ్రివద్దకొచ్చాడు.
జరిగినసంగతి విన్నవిం చాడు. తండ్రి కాస్తాదీర్ఘంగా ఆలోచించి, కుమారా! యజ్ఞమందిర గతంబై ఉచ్ఛిష్టంబగు ధనంబు దొల్లి మహామునులు
రుద్రునకిచ్చి రది కారణముగా, అది రుద్రునకుజెందుతుంది. ఆవచ్చిన దీర్ఘకాయుడు వేరెవ్వరోకాదు సాక్షాత్తు శివుడు.
కనుక కుమారా! వెళ్ళి ఆధనము మీదే తీసుకొనండని, ఆమహాపురుషునకు క్షమాపణచెప్పి నమస్క రించిరా!
అన్నాడు. నాభాగుడు మారుమాటాడలేదు. నాగతి యేమని ప్రశ్నించలేదు. నేరుగావెళ్ళి దేవా! నీవు సాక్షాత్తూ
పరమేశ్వరుడవు.
ఈసొమ్ముమీది, నాతప్పు క్షమింపుడని పాదాభి వందనంచేసి ముకుళితహస్తుడై,దీనుడై నిలబడ్డాడు. ఆస్థితి లోనున్న నాభాగునిచూచి శివుడు ప్రసన్నుడై నాభాగా!
నీ ప్రవర్తన, నీత్యాగ బుద్ధి, నీ నిరాడంబరత, నీవిద్యకు, నేనానంద భరితుడనయ్యాను. నీ కన్నాభాగ్యవంతుడు మరొకడుండదగడు. ఇదిగో! ఈధనాన్ని స్వీక రించు, అంతర్దర్శితత్వంబును, సనాతనంబగు బ్రహ్మజ్ఞానంబు ను నీకు అనిగ్రహించుచున్నాను
స్వీకరింపుము. తాపత్రయ రహి తుడవై, హితుడవై యశస్వివై చిరకాలము జీవించి తుదకు నాయందే లీన
మగుదువు. శుభం అని దీవించి పరమేశ్వరుడు అంతర్హితు డయ్యాడు.
క: భువిలో
నాభాగునికథ
దవిలి మతిన్
రేపుమాపు దలచిన మాత్రన్
గవియగు, మంత్రజ్ఞుండగు
బ్రవిమలగతి బొందు నరుడు భద్రాత్ముండై--భాగ-9-79.
9.వాలివధ సమ్మతమా?
శ్రీరాముడు సీతను వెదుకుచూ తమ్ముడూతానూ ఋష్యమూక పర్వతం
చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు తారసపడి, వాలి సుగ్రీవుల విషయం వివరించి సుగ్రీవునకు సహాయముచేసి
అతనితో స్నేహంచేయమన్నాడు. రాముడంగీకరించి అగ్నిసాక్షిగా సుగ్రీవ మిత్రుదయ్యాడు.
సుగ్రీవుడు అన్నచే అవమానింపబడి, విచారణ చేయకనే దోషిగా నిర్ధారింపబడి,
రాజ్యమునుండి తరిమివేయ బడ్డాడు. అతని భార్యను అన్నవాలి తన అధీనంలోవుంచుకొని
అనుభవిస్తున్నాడు. ఇప్పుడు స్నేహధర్మంగా రాముడు వాలిని చంపి
సుగ్రీవుని కిష్కిందారాజును చేయాలి. తర్వాత సుగ్రీవుడు తన బలగం తో సీతజాడ వెదికి తెలుసుకోవాలి.
అపహరించినవానిని దండించి సీతారాములను కలపాలి.
ఈప్రక్రియలో మొదట వాలి సంహారం జరగాలి.
వాలి మహాబలవంతుడు. అందునా అతనికి యెదురునిల్చి పోరాడే వీరుని సగంశక్తి వాలిలో
చేరిపోతుంది. అది అతడు పొందినవరం. కనుక అతనికెదురునిల్చి పోరాడి గెలవడం అసాధ్యం.
అయినా రాముడతన్ని వధించాలి. ఈ పరిస్థితులలో సుగ్రీవుని యుద్ధంలోదించి వాలితో
పోరాడమన్నాడు రాముడు. అనుకున్నట్లే సుగ్రీవుడు ఓడి, గాయపడి పారిపోయివచ్చి రాముని నిందించాడు.
రాముడు ఓదార్చి మీరిద్దరూ ఒకేరూపంలో వున్నారు.
నేనెవర్ని శిక్షించాలో అర్థంకాలేదు, మెడలో పూలదండధరించి వాలితో మరోసారి పోరాడు.
ఈసారి నీదేవిజయం వెళ్ళమన్నాడు. సరే! మళ్ళీ వాలి సుగ్రీవుల యుద్ధంజరుగుతుండగా రాముడు
చెట్టుచాటునుండి బాణంసంధించి వాలిని పడగొట్టాడు. పడి పోయిన వాలి రాముని చేరబిలిచి రామా!
నీది అధర్మమని వాదించాడు.
ద్విపద:- శరభకాంఠీరవ శార్దూలకోల
కరి
హరిణాదుల ఖండీంపగోరి
వసుధ
రాజులు వేట వత్తురూగాక
యెసగ
కోతులబట్టి యెందు జంపుదురు
వంచన
జంపిన ప్లవగంబు దినరు
పొంచినన్నిట్లేసి పొలయించితేల?
- రంగనాధ రామాయణం.
రాజులు వేటాడవచ్చుగానీ, కౄరజంతువులైన శరభాలనూ, సింహా లను, పులులనూ, యేనుగులనూ, వేటాడిచంపుతారు. లేదా మాంసాహారంకొరకు జింకలను వధిస్తారు.
వాటిని వెంటాడి, చాటు నుండి కూడా చంపుతారు. కానీ కోతులను వేటాడు రాజు లుంటారా, కోతిమాంసం కూడా రాజులు తింటారా? అయినా రామా!
ఉ: పుట్టితివీవు
హేళి పరిపూతకులంబున దండ్రియానతిన్
గట్టితివీవు
వల్కలము గర్మఫలంబును దాటలేమి, చే
పట్టితివీవు
క్షతియులపాడిని నిల్పగ వింటి, అట్టి నీ
వెట్టుల
జంపబూనితివి వృక్షచరున్ నను మోసగాడవై.
- రమణీయరామాయణము.
గొప్పవంశంలోబుట్టి, తండ్రి యాజ్ఞమేరకు నారబట్టలుగట్టి యడవి కేతెంచి,
క్షత్రియధర్మం నిల్పడానికి విల్లుబట్టి యీ విధమైన అధర్మ
వృత్తితో మోసగాడివై నన్ను చంపాలనుకోవడం నీవంటివానికి తగునా?
అయినా
ఉ: భూవరవర్య
యెవ్వని సముద్ధతి జంపుటకై గడంగి సు
గ్రీవునితో
నెయ్యమొనరించి తదీప్సితసిద్ధిగోరి న
న్నీవిధి జంపి
తట్టి దనుజేంద్రుని రావణు గీటడంచి నీ
దేవిని నెందు
డాచినను దెచ్చి యొసంగనె యొక్కవ్రేల్మిడిన్.
- గోపీనాథరామాయణం
రామా! నీసతిసీతను తిరిగిపొందుటకోసం అల్పుడైన సుగ్రీవునితో
స్నేహంచేశావు. నన్ను పడగొట్టావు. అదే నాతో కలసివుంటే,
సీతాపహరణదోషియైన రావణుని శిక్షించి వాడెక్కడదాచినా కనుగొని
దెచ్చి నీసతిని సులువుగానీకు నే న ప్పజెప్పియుందును గదా!
పొరబాటుచేశావు, మా అన్నదమ్ముల వైరంలో అనవసరము గా తలదూర్చి అధర్మానికొడిగట్టావు.
తే: ఏమి వైరము నాతోడ రామ నీకు
చెట్టుచాటున
నిలుచుండి గుట్టుచెడక
విల్లునెక్కిడి
బాణంబు వేడుకమెయి
నాయెదను నాటినాడ
వనాదరమున.
రమణీయరామాయణము.
అని నిందించాడు. వాలినిందను శ్రీరామచంద్రుడు సావధానంగా విని,
వాలీ!
ఆ: పరమధర్మవిధుడు భరతుడధీశు డే
మతనియాజ్ఞబూని యలరు వార
మీవు సాధుధర్మహీన వర్తనుడ వు
పేక్ష సేయవచ్చుటెట్లు మాకు.
తే: ధర్మసంస్థాపనంబు, నధర్మనిగ్ర
హంబు భరతునకివిపను లతని యాజ్ఞ
బూని చరియించెదము మిముబోటి దుష్ట
వర్తనులబట్టి తునిమెడు వాంచ్ఛజేసి.
- గోపీనాథరామాయణం.
ధర్మాత్ముడైన నాతమ్ముడు భరతుడు రాజు.
ఆయన ఆజ్ఞమేరకు దోషులను శిక్షించడం మా విధి.
నీవు దుర్మార్గుడవు.
మ: అనుజన్ము
ప్రియపత్నియైన "రుమ"
గామాంధుడవై కాంక్షతో
ననిశంబున్
రమించె,
దీ దురితమింపారన్ వినంగూడునే
యనుజస్త్రీరతు, బాపకర్ము నిను దుష్టాచారు, రాజైన యే
ననిలో జంపిన యీ
యఘంబునకు బ్రాయశ్చిత్త మేపారునే
- భాస్కరరామాయణం.
తమ్ముడు బ్రతికుండగనే అతనిభార్యననుభవించిన పాపాత్మునివి.
మీ వానరజాతిలో సోదరుడు మరణించినతర్వాత అతని భార్యనేలుకోవడం
మీ ఆచారం. కానీ నీవు తమ్ముడుండగనే ఆమెతో రమించావు. దీన్ని మీజాతికూడా అధర్మంగానే భావిస్తుంది.
అందుకే నీవు శిక్షార్హుడవు. ఇక నీవు నాతోస్నేహం చేసివుండొచ్చుగదా!
అన్నావు. నేను నీతో స్నేహమెలా చేయగలను? నాతో నీకు యేపనీ లేదు. నేను యాచకుడనై నాపని నిమిత్తమే నీదరి చేరాలి.
ఇది స్నేహానికి అనువుగాదు. అందునా సూర్యవంశపురాజునైన నేనెట్లు చేయగలను.
అదియునూగాక రావణుడు నాసతి నపహరించి దోషి యైనాడు.
మరినీవూ అదేపనిచేసినావు. తమ్మునిభార్య నపహరించి నావు. కనుక నాదృష్తిలో నీవూ దోషీవే. కనుక స్నేహం మనమధ్య కుదరదు.
క: పరకాంతను
జేపట్టిన
నరభోజను శిక్షసేయ నలవియెనీకున్
బరదారచోరునకు? నా
కరయన్ నీసాయ మెట్టు లర్థింపనగున్
ఆ: పడసియుండవచ్చు వాలి! నీసాయాన
శ్రమయెలేక నాదు ప్రాణసఖిని
కాని యాచకుండగాను నిన్నర్థింప
నీతిహీను చెలిమి నేనుకోర.
ఉ: ఏనునరుండ నే హితున కేర్పడ సాయము సేయనెంచి త
న్మానిని బట్టి వాని కవమానముచేసిన నిన్ను
ద్రుంచితిన్
మానిత జిష్ణుదత్త మణిమండన భూషితవక్షు బోరిలో
బూని జయింపరాని వరముం గలనిన్ను వనాటశేఖరా!
- రమణీయరామాయణము
కనుక స్నేహధర్మాన్ని పాటించి నిన్ను పడగొట్టాను.
అంతేగాదు యిందులో మరొక రహస్యమున్నది.
క: ఘనతర పాపంబులు సే
సినవారలు రాజుచేత శిక్షితులయి తా
రనిమిషలోకము గాంతురు
సునిశిత ధర్మంబు చేత సుజనులు వోలెన్.
క: కావున నాశరమున
దెగి
నీ వఘములనెల్లబాసి నిర్మలతర పు
ణ్యావాసంబగు దివిజేం
ద్రా వాసంబునకు బోయె దంచిత మహిమన్.
- భాస్కరరామాయణము
నేను రాజునై నిన్నుదండించి నీపాపములకు శిక్ష ఇలపైనే
అనుభవింపజేసినాను. రాజదండన అనుభవించినవానికి యమదండనలేదన్నది ధర్మశాస్త్రవిదితం.
సరాసరి నీవు స్వర్గమునకు వెళ్ళెదవు. నిన్ను దండించి నీకునేను మేలే చేసినాడను.
ఆలోచించు మని వాలిని రాముడు ఓదార్చినాడు.
వాలి వాస్తవము గ్రహించి రాముడు చేసిన మేలును గుర్తించి
క్షమింపుమని రాముని శరణువేడి స్వర్గస్తుడైనాడు.
కనుక వాలివధ సమ్మతమే అది వాలికూడా అంగీకరించినాడు.
"రామో విగ్రహవాన్ ధర్మః"
అన్నమాట అక్షరసత్యం.
10.ఏది గొప్ప
ధర్మరాజు రాజ్యాభిషిక్తుడై గొప్పగా అశ్వమేధయాగం చేసినాడు,
ఆయాగం భకి, శ్రద్ధ, శౌచము, దానాలతో గొప్పగా అతిశయిల్లిన దని విబుధులందరు యజ్ఞానంతరం
ప్రశంశిస్తూ వుండగా
సీ: ఒక్కబిలంబుననుండి
వెల్వడియొక్క
నకులంబు విప్రజనంబు నడుమ
నిలిచి సక్తుప్రస్థు నలఘు ధర్మంబు నే
మియుబోల దీయశ్వమేధ మనిన
నవ్విప్రులతి విస్మయం బంది యమ్ముంగి
గనుగొని మంత్రవర్తనము దంత్ర
గమనికయును వివిధములైన దానవి
ధుల బహుళ త్యాగములును లోక
తే: సంస్తుతములయ్యె భక్తియు శ్రద్ధయు బ్రి
యంబు వినయంబు సురముని హర్షమావ
హిల్ల జేసె నీవేమిట నిమ్మహాధ్య
రంబు గీడంటి చెప్పుమ ప్రస్పుటముగ.. భార-
అశ్వ- 4-218.
ఒకకన్నంనుండి ముంగిసొకటి బయటికి వచ్చి యీయజ్ఞం
సక్తుప్రస్థుని త్యాగమంత గొప్పదికాదు. అని నిర్భయంగా మానవ భాషలో చెప్పింది.
ఆ ముంగిస ముఖము ఒకపార్శ్వము స్వర్ణ మయ మై మెరుస్తూవుంది.
దానిని చూచి అక్కడిపెద్దలు, నీవెందుకలా అంటున్నావు. ఇంతగొప్పగా జరిగిన ధర్మజయాగాన్ని తక్కువజేసి,
సక్తుప్రస్థుని త్యాగాన్ని పొగుడుతున్నావెందుకని
ప్రశ్నించారు. అయితే వినండని సక్తుప్రస్థుని కథచెప్పనారంభించిందా ముంగిస.
సక్తుప్రస్థుడు కురుక్షేత్రంలో నివాసముండిన బ్రాహ్మణుడు.
కరువు కాలంలో అతడు పొలాలకువెళ్ళి రైతులు కోసికొనిపోగా
మిగిలిపడి యున్న తాలు తరకగింజలనేరుకొని, వాటితో పేలపిండిచేసుకొని తనూ, తనభార్య, కొడుకూకోడలు పంచుకొని తినడానికి సిద్ధ మయ్యారు.
(ఇలాజీవించడాన్ని ఉంఛవృత్తి అంటారు)
అదే సమయా నికి ఆకలిగొన్న పేదవిప్రుడు వచ్చి చేయిచాచాడు.
సక్తుప్రస్థుడు తన భాగం పేలపిండి పెట్టి తినమన్నాడు.
కానీ అంతటితో అతని ఆకలి తీరలేదు. అది గమనించి సక్తుప్రస్థుని భార్య,కొడుకూ కోడలు కూడా వారివారి పేలపిండిని అతిథికే పెట్టేశారు.
అప్పుడా అతిథి ధర్మదేవత రూపుదాల్చి, నేను మీ త్యాగబుద్ధిని పరీక్షించడానికి బ్రహ్మపంపగా వచ్చాను.
రండి వెళదాం బ్రహ్మలోకానికి. మనకోసం ప్రత్యేకంగా బ్రహ్మ దివ్యరథాన్ని పంపాడు.
అదిగో మీవాకిట వచ్చి వాలింది, అని చెప్పి, ఒప్పించి సక్తుప్రస్థుని కుటుంబసమేతంగా బ్రహ్మలోకంతీసు
కెళ్ళాడు. అప్పుడక్కడేవుండి గమనిస్తున్న ముంగిసనైన నేను అతిథి పేలపిండితిని
చేయిగడిగినచోట పొర్లాడాను. ఆశ్చర్యం. నా ముఖమూ నేనుపొర్లాడిన ఒకవైపు శరీరం బంగారువర్ణం లోనికి
మారిపోయాయి. నేను నాశరీర రెండవభాగం కూడా బంగారంగా మార్చుకుందామని యజ్ఞాలు,
దానాలు, వ్రతాలు జరిగే చోట్లెన్నో తిరిగి అక్కడ పొర్లాడాను.
కానీ నా కోరిక తీరలేదు. ధర్మరాజు గొప్ప వాడుకదా! ఆయనచేసే యజ్ఞంలో నాకోరిక నెరవేరుతుందని యెంతో ఆశతోవచ్చాను,
కానీ ప్రయోజనము సిద్ధించలేదు. కనుకనే సక్తుప్రస్థుని దానయజ్ఞం గొప్పదన్నానని చెప్పి,
ఆనకులం అంతర్ధానమైపోయింది. అప్పుడక్కడున్న పెద్దలందరు నకులవాక్యం సత్యమని
ఒప్పుకున్నారు. ఎందుకంటే
చ: వినుము
ప్రభూతదానములు విశ్రుత యజ్ఞములున్ సధర్మతా
వినుతికి నెక్కజాలవు వివేకనిధీ! పరిశుద్ధశోభితా
ర్జనమున దెచ్చికొన్నది వరంబగు బాత్రము నర్హకాలముం
గని లఘువస్తువేని నొసగంగనుటుజ్వలధర్మమారయన్.
-- భార- అశ్వ- 4- 246.
దానాలు, యజ్ఞాలూ చేయవచ్చుగానీ సన్మార్గంలో కష్టించి సంపాదించిన
దేదైనా యోగ్యతగలవానికి, వాని అవసరాన్ని గుర్తించి యివ్వడం, అదీ తనవసరాన్నీకూడా లెక్కచేయకుండా యివ్వడంగొప్పగానీ అది
అల్పమా, అధికమా అన్నదికాదు ముఖ్యం. అంతేకాదు సత్కార్యమేదైనా యజ్ఞమే. అందులో స్వార్థముండరాదు. హింసకు అసలే తావుండరాదు. అశ్వమేధం అహింసాయుత మన లేముగదా! అందుకే సక్తుప్రస్థుని దానయజ్ఞం గొప్పదయింది.
ఇందుకు తార్కాణంగా స్వర్గంలో జరిగిన ఒక సంఘటన జ్జాపకం
చేసుకొనితీరాలి.
సీ: అమరాధిపతితొల్లి
యాగంబు సేయంగ
దొడగ
మహాముని స్తోమములును
సురసంఘములుగూడి
కురుముఖ్య ఋత్విగ్గ
ణముల
నేర్పరచి సొంపమర వేది
గల్పించి తగ
నగ్నికార్యంబు నడపంగ
నర్హులు
పశునిచయంబుదేర
నమ్మునుల్
గనుగొని యధిక దయార్థ్రంబు
లగుచిత్తములతోడ నమ్మహేంద్రు
ఆ; నాననంబుచూచి యక్కట హింస ధ
ర్మంబుగాదు
కృతయుగంబు సొచ్చె
ననఘ
వత్సరత్రయముప్రాతగిలిన బీ
జంబు లిపుడు యజన
సాధనములు.
- భార- అశ్వ-
4-255.
ఇంద్రుడు యాగం చేయసంకల్పించి తగినయేర్పాట్లు పూర్తిచేసి,
బలిపశువులను తెప్పిస్తున్నాడు. అప్పుడు దయార్ద్రహృదయులైన మునులు, మహేంద్రా! హింసవద్దు. అజం అంటే మేకే గాదు మూడు సంవత్సరములు నిలువ వుంచిన
ధాన్యంకూడా అజమే. అవి మొల కెత్తేగుణం కోల్పోతాయి. అజమైపోతాయి. వాటితో యజ్ఞంచేయి, సరిపోతుంది అన్నారు. కానీ అక్కడేవున్న కర్మకాండవిధుడైన ఉపరిచరవసువు,
పశుబలి అవసరమేనని వాదించాడు. తత్ఫలితంగా అతడు అథఃపాతాళానికి పడిపోయాడు.
కనుక హింసారహితమైన యజ్ఞమే శ్రేష్ఠమని తేలిపోయింది.
కష్టించి న్యాయసమ్మతముగా సంపాదించినదానితో స్వార్థానికి
కాకుండా పరహితార్థం తగినసమయంలో తగురీతిన వ్యయంచేసి కార్యనిర్వహణ చేయడమే యజ్ఞమని
బోధించిన ఆ నకులముకూడా యెవరో తెలుసుకోవలసిన అవసరంవుంది. ఆముంగిస సాక్షాత్తూ జమదగ్నిమహర్షియే.
ఆయన ఒకనాడు పితృయజ్ఞార్థము పాలు పితికి,
క్షీరపాత్రము నొకచోటనుంచెను. ఈయన భృగువంశము వాడుకదా! వీరికి కోపము యెక్కువ. ఇతన్ని పరీక్షింతమని క్రోధ దేవత ఆపాలను ఒలకబోసెను.
జమదగ్ని శాంతచిత్తుడై ఊర కుండెను. కానీ శ్రాద్ధకర్మలకు ఆటంకము కలిగినందులకు పితృ దేవతలకు
కోపమువచ్చి, జమదగ్నీ! క్రోధమేలబూనవైతివని నిందించి నకులముకమ్మని శపించిరి. పితృదేవతలు తర్వాత శాంతించి, జమదగ్నీ! నీవేనాడు నిర్భీతిగా పెద్దచిన్నాయన్న తేడా లేకుండా
ఉన్నదున్నట్లు ఖచ్చితముగా పదిమందిముందు వాస్తవము
పలుకుదువో ఆనాడు నీకు శాపవిముక్తి కలుగునని,
సెలవిచ్చిరి. అందుకే నకులరూపముననున్న జమదగ్ని, ధర్మరాజ అశ్వమేధ యాగాంతంలో ధర్మజుని యజ్ఞం
అనేకులపొగడ్తలందుకున్నా, అది యెంతగొప్పదైనా, సక్తుప్రస్థుని పేలపిండిదానయజ్ఞంకన్నా గొప్పది కాదు.
సక్తుప్రస్ఠుని దానయజ్ఞమే ప్రశంసాపాత్రమైనదని ఉన్నదున్నట్లు
నిర్భీతిగా పలికి శాపవిముక్తుడాయెను.
కనుక నిజమైన గొప్పదనమేమితో మనకీవిధంగా ప్రస్ఫుటంగా మహాభారతం
తెలియజేస్తున్నది. ఓం తత్ సత్.
***
11.శైవాచారనిష్ఠ
శివుని పరమదైవముగా భావించు శైవులనిష్ఠాదీక్షలు బహు
చిత్రముగా నుండును. అందునా వీరశైవనిష్ఠలు మరింత కఠినముగా నుండును.
వారు ప్రాణమును సహితము లెక్కచేయరు. వారికి సర్వము రుద్రమే. వీరశైవ మహత్తరకథ నొకదానిని తెలుసుకొందము.
బదరికాశ్రమమున దుర్వాసు డున్నాడు. ఒకనాడాయన ఆశ్రమము లోని జింకపిల్లలకు మిగిలిన యజ్ఞప్రసాదములు
ప్రేమతో తినిపిస్తు న్నాడు. అదేసమయంలో ఆకాశగమనం చేస్తున్న తుంబురుడు అదిచూచి సంతోషించి
ఆ ఉత్సాహమున చిటుక్కున చిటికవేసి నాడు. ఆ చిటిక శబ్దమునకు జింకపిల్లలు బెదరినవి.
అంతే దుర్వాసుడు ఆగ్రహించి ఓరీ తుంబురా!
నీవు మానవుడవై పుట్టుమని శపించేశాడు.
తుంబురుడు ఋషి కాళ్ళపైబడి వేడుకున్నాడు.
ఋషి శాంతించి నీవు శివగణములలోని వాడవు గనుక శివభక్తులయింట
బుట్టి తరింతువు పొమ్మనెను.
తుంబురుడు కంచిలోని వైశ్యకుటుంబమున చిరుతొండనంబిగా జన్మించి
శైవాచారనిష్ఠతో జీవించుచుండెను. అతడు వీరశైవ జంగములు కోరినదేదైననూ తీర్చును.
అది తెలిసి ఒకజంగము శివాభిషేకమునకై తూమెడు చెరకురసము
కావలెనని కోరెను. కాదనరాదు గదా! చిరుతొండడు వెళ్ళి చెరకురసమునకై చెరకులు కొని కట్టగట్టి
నెత్తికెత్తుకొననెంచెను గానీ, అతని వల్లకాలేదు. అప్పుడు భక్తవశంకరుడైన శివుడే మారురూపమున వచ్చి కష్టపడి
భక్తుని నెత్తికెత్తెను. ఆ ప్రయత్నమున శివుడు అలసిపోయెను. మేన చెమటలు పట్టెను. శివుడు నిజమునకప్పుడు అప్సరసల నాట్యము తిలకించుచుండెను.
భక్తునికష్టమునకు జాలిపడి వచ్చి చెరకుల కట్టను భక్తుని
నెత్తికెత్తెను. ప్రక్కనేయున్న పార్వతి, శివునికి చెమట లేలపట్టెను? అన్యస్త్రీలోలుడయ్యెనా? అని అనుమానించెను. శివుడు అసలుకారణము పార్వతికిజెప్పి ఆమెశంకదీర్చెను.
ఆమె అబ్బుర మంది శివునికంతప్రీతిపాత్రుడా!
ఆ చిరుతొండనంబి? అని అనుమానించి పరీక్షింపదలచెను. శివుడు సరియనెను. ఇంద్రుని పిలిపించి కంచిలో వారముదినములు యెడతెరపిలేని వానలు
కురిపింపజేసెను. మనుషులు బయటదిరుగవెఱచి యిండ్లకే పరిమితమై పోయిరి. చిరుతొండడు జంగములకు భోజన సదు పాయము జేసెను.
కట్టెలులేకపోయినను గుడ్డలు నూనెలోముంచి అంటించి వంటలు
వండించి పెట్టెను. వారమునకు తెరపిచ్చెను. జంగములు స్వేచ్ఛాప్రియులై యిచ్చవచ్చిన చోటికి వెళ్ళిపోయిరి.
మన శ్రేష్ఠి జంగములకు పెట్టిగాని ముద్దముట్టడు.
గమనించగా జంగములు కానరాలేదు. చేయునదిలేక వారినివెతుకుతూ వెళ్ళి ఊరిబయట ఒక ముసలిజంగమయ్య
అతని గ్రుడ్డిభార్య సత్రములో కనిపించిరి. వారిని శ్రేష్టి భోజనమునకాహ్వానించెను.
ఆ ముసలి జంగమదంపతులు యెవరోకాదు చిరుతొండనంబిని పరీక్షింప
వచ్చిన శినపార్వతులే.
జంగమదంపతులు సరే! భోజనమునకు వచ్చెదముకానీ ...
అంటూ మెలిక పెట్టిరి. శ్రేష్ఠి సందేహింపక అడుగుమనెను. జంగమయ్య నోరు విప్పి సరే! వినుము, మేము నిరాహార దీక్షలోనున్నాము. దీక్ష విరమించవలెనన్న మాకు సద్గోత్రుని మాంసముతో కూడిన
భోజనము పెట్టవలెను. అట్లయినచో వచ్చెదమనెను. శ్రేష్ఠి అట్లే కానిండు, రమ్మనెను. వారిని తీసుకొనివచ్చి భార్యకు విషయము వివరించెను.
ఆమెయు సరే మంచిదనెను. తమకొడుకు సిరియాళుని బలివెట్టి, జంగమదంపతులకు భోజనముపెట్టుటకు నిశ్చయించుకొనిరి.
జంగమదంపతుల రూపముననున్న శివ పార్వతులు పరీక్షను మరింత
తీవ్రతరము చేయనెంచిరి. సిరియాళుడు చదువుకుంటున్న పాఠశాలకు, శివుడు మారురూపం లోపోయి, సిరియాళా! నీతల్లిదండ్రులునిన్ను చంపి ఒక జంగం దేవరకు నీ మాంసంతో
భోజనము పెట్టుటకు సిద్ధమౌతున్నారు, జాగ్రత్త! అనెను. ఆ బాలుడు సంతోషముతో మంచిది, అంతకంటే భాగ్యమా! నాజన్మ ధన్యముగానున్నది. ఇది గొప్పశుభవార్తగదా! అనెను. శివుడు వానిభక్తికి ఆశ్చర్యపోయెను. ఇక పార్వతి బాలెంత వేషమున శ్రేష్ఠి యింటిగడపకడకు వచ్చి
బిడ్డకు పాలు యాచించెను. శ్రేష్ఠిభార్య పాలుబోయుచుండగా వచ్చిన బాలెంత,
ఇదేమి భక్తితల్లీ కన్నబిడ్డను బలివెట్టనెంచినారట,
మీకుజాలి, దయలేవా? యని మనస్సు కలవరపరుప ప్రయత్నించెను. కానీ శ్రేష్ఠిభార్య, జంగ మయ్యకు శివునకు భేదములేదు. శివారాధన మాకు అవశ్యక ర్తవ్యమని చెప్పెనేగానీ మనసు
మార్చుకోలేదు.
బాలుడు పాఠశాలనుండి రాగానే తల్లిదండ్రులకు నమస్కరించి
నాకంతా తెలుసు. తండ్రీ! నన్ను త్వరగా శివలోకమునకు పంపుడని వేడుకొనెను. శ్రేష్ఠి, భార్యఒడిలో పిల్లవానినుంచి శివశివా అంటూ గొంతుకోసి తలను
మాత్రము మరల మరల చూచుకొనుటకు అనువుగా దాచిపెట్టుకొని, బాలుని మాంసమునకు మిరియాలు, ఉల్లి, పసుపు, మెంతి, ఇంగువ జీలకర్ర, నేయి, పెరుగు పంచదార మిశ్రమములతో వంటకములుచేసి జంగమదంపతులకు
వడ్డించిరి. జంగమయ్య తలమాంసము లేదని తగవుబెట్టుకొని భోంచేయ ననెను. శ్రేష్ఠిదంపతులు వినయముగా నచ్చజెప్పి దాచుకొన్న తలను కూడా
రోటదంచి కూరవండి వడ్డించిరి. మరలా జంగమయ్య మీ పిళ్ళవాణ్ని కూడా పిలవండి కలిసిభోంచేద్దాం.
పిల్లలులేనివారింట భోంచేయనని, మారాముచేయనారంభించెను. ఇంకెక్కడి కుమారుడు, మీకు వంటకమయ్యెనుగదా! అని మనసులోచింతించి మారుమాటాడక కంటనీరొలక,
నిశ్చేష్టులై శ్రేష్ఠిదంపతులు నిలబడిరి.
జంగమయ్య మరింతరెచ్చిపోయి బాలుని పిలవండి,
ఊరక నిలుచున్నారెందుకు? పిలవండని గద్దించాడు. యిక గత్యంతరము లేక శ్రేష్ఠిభార్య తిరువెంగనాంచి,
కొడుకా! సిరియాళా! రారా! అని దుఃఖపూరిత అశ్రునయనాలతో కొడుకును పిలిచింది.
ఇక నేమున్నది ఆశ్చర్యం. సిరియాళుడు అమ్మా అంటూ వచ్చి అక్కున జేరాడు.
శివపార్వతులు నిజరూపమున దర్శనమిచ్చి,
ఇక మీరు కైలాసమునకువచ్చి శివగణములలో కలసి మమ్ముసేవింపుడని
ఆనతిచ్చారు. అప్పుడు చిరుతొండనంబి స్వామీ! కంచిలో వైశ్య కులస్తులమైనమేము వెయ్యిగోత్రనామములతో
ధార్మికజీవనము గడుపుచున్నాము. వారిని విడచి మేముమాత్రమే రాజాలము. క్షమింపుడనెను. స్వామి మీ వెయ్యిగోత్రములవారికి కైలాసమునకు స్వాగతమని పలికి
అంతర్హితుడాయెను. ఆవిధంగా కంచిలోని వేయి గోత్రముల వైశ్యులందరికీ
శివలోకప్రాప్తి కలిగింది. ఈ కథ శ్రీనాథుని హరవిలాసములో అద్భుతముగా తీర్చిదిద్దబడింది.
ఆవె: కులములోన నొకడు గుణవంతుడుండెనా
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజ మున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ.
సూచన:- ఈ కథలోని భగవద్భక్తి, త్యాగము, ఆరాధన, అన్నదానము మన కాదర్శములే కానీ, భక్తిపేరున నరబలి నేటి సామజికపరిస్థితులకు సరిపడదు.
ఇది హింసాత్మకముగనుక
ఆచరణీయముకాదు. కాలానుగుణ ధర్మమునే పాటించుట సర్వశ్రేయోదాయకన్నన్నశుభం.
v
12.అంబరీషుడు
అంబరీషమహారాజు మహావిష్ణభక్తుడు. అతడు
క: హరియని
సంభావించును
హరియని దర్శించు
నంటు నాఘ్రానించున్
హరియని
రుచిగొనదలచును
హరిహరి ఘను నంబరీషు నలవియె
పొగడన్.-భాగ-
9- 86.
అట్టివాడు, ఏకాదశివ్రతం పూర్తిచేశాడు. ఇక ద్వాదశిరాగానే ప్రసాదం స్వీకరించి వ్రతం పరిపూర్ణం
గావించాలనుకున్నాడు. ఇంత లో దుర్వాసమహర్షి శిష్యబృందంతో విచ్చేసి,
మేము నదీస్నానం చేసి వస్తాము కలిసి పారణచేసి,
వ్రతంపూర్తిచేద్దువుగాని, వెళ్ళీవస్తా మని నదికి బయలుదేరాడు. రాజు వారికోసం నిరీక్షిస్తున్నాడు. ద్వాదశి ఘడియలు దాటిపోయే సమయమాసన్నమౌతున్నది.
అయినా ముని జాడలేదు. తన పురోహితులను పిలిచి మార్గాంతరం చెప్పమన్నాడు.
వారు రాజా! ద్వాదశిదాటకముందే మీరు పారణచేసి దీక్ష విర
మించకతప్పదు. కానీ ముని రాకుండా మీరు ప్రసాదం స్వీకరించ రాదు.
కనుక శాస్త్రసమ్మతంగా ఇలా నడుచుకుందాం.
అని,
ఆ:వె: అతిథివోయి రామి నధిప యీ ద్వాదశి
పారణంబు మాన
బాడిగాదు
గుడువకుంటగాదు
కుడుచుటయునుగాదు.
సలిలభక్షణంబు
సమ్మతంబు------భాగ-9-99.
రాజా! మంచినీళ్ళు త్రాగి దీక్షవిరమించండి. అందువల్ల మీరు మునిని విడచి భోంచేసినట్లుకాదు.
సరిపోతుందన్నారు. సరే! అలాగేచేద్దా మని మంచితీర్థం అలారాజు సేవించాడోలేదో యిలా
శిష్యులతో సహా దిగబడ్డాడు ముని. దుర్వాసుడంటేనే మహాకోపిష్టి. ఇకనే ముంది ఆ నీళ్ళుత్రాగడంకూడా తన్నవమానించినట్టేనని మండి
పడ్డాడు. తనతలలోని ఒక జడను పెరికి మంత్రించి కృత్య అనబడే రాక్షసుని సృష్టించి
అంబరీషమహారాజుపైకి పంపాడు. అంబరీష మహారాజు మారుమాటాడక హరి హరి యని కళ్ళుమూసుకున్నాడు.
అంతే విష్ణుచక్రం రివ్వునవచ్చి రక్కసుని చంపి,
మునివెంటబడింది. మునికి కంపరమెత్తింది. పారిపోవడానికి ప్రయత్నించాడు. చక్రం విడువకుండా వెంటాడింది.
మ: భువిదూఱన్
భువిదూఱు నబ్దిజొర నబ్దుల్ సొచ్చు నుద్వేగియై
దివిబ్రాకన్
దివిబ్రాకు దిక్కులకు బో దిగ్వీధులం బోవు జి
క్కి వెసం
గ్రుంకిన గ్రుంకు నిల్వ నిలుచుం గ్రేడింప గ్రేడించు నొ
క్కవడిన్ దాపసు
వెంటనంటె హరిచక్రం బన్యదుర్వక్రమై.
-భాగ-9-
107.
ముని తిరిగితిరిగి అలసిపోయి సత్యలోకంవెళ్ళి బ్రహ్మను
ప్రార్దించాడు. బ్రహ్మ తను కాపాడలేనన్నాడు. కైలాసంవెళ్ళి శివుడ్ని వేడుకున్నాడు.
శివుడుకూడ చక్రధాటిని నిలువరించడం తనవల్ల కాదన్నాడు.
ఇక సరాసరి వైకుంఠం వెళ్ళి హరినివేడుకొన్నాడు.
హరి
క: సాధుల హృదయము
నాయది
సాధుల హృదయంబు నేను జగములనెల్లన్
సాధుల నేన యెఱుంగుదు
సాధులెఱుంగుదురు నాదు చరితము విప్రా! - భాగ-9-123.
కనుక, మునివరా! నేను భక్తపరాధీనుడను. చక్రానలజ్వాలలనుండి నేనుకూడానిన్ను కాపాడజాలను. వెళ్ళు, వెళ్ళి వెంటనే భక్తాగ్ర
గణ్యుడు, నాభాగసుతుడూ నైన అంబరీషునే శరణువేడమన్నాడు.
క: అదెపో బ్రాహ్మణ నీకును
సదయుడు
నాభాగసుతుడు జనవినుతగుణా
స్పదు డిచ్చు
నభయ మాతని
మది సంతసపరచి
వేడుమా శరణంబున్. --భాగ-9-126.
హరి ఆవిధంగా పలుకగానే, యిక చేయునదిలేక వెళ్ళి, అంబరీషుని కాపాడమని శరణువేడాడు. అంబరీషుడు మహాభక్తుడు, శాంతుడు, సాత్వికుడు కనుక దుర్వాసుని మన్నించి,
క: అఖిల గుణాశ్రయుడగు హరి
సుఖియై
నాకొలువు వలన జొక్కెడినేనిన్
నిఖిలాత్మమయుండగుటకు
సుఖమందుంగాక
భూమిసురు డివ్వేళన్.-భాగ-9-138.
అని హరిసుదర్శచక్రాన్ని ప్రార్థించి దుర్వాసమునిని
కాపాడినాడు. ముని రాజును దీవించి నిజాశ్రమానికి ఆనందంగా వెళ్ళిపోయాడు.
పరమాత్మ తన్ను నిందించినవానిని సైతం సైరించి ఊరకుంటా
డేమోగాని, భక్తుని బాధించిన వానిని తక్షణం శిక్షించక వదలడనియు, ఏకాదశి వ్రతం హరినారాదించుటకు శ్రేష్టతమ మనియు యీ కథ వలన
తెలియుచున్నది.
క: ఈ యంబరీషు చరితము
తీయంబున విన్న జదువ ధీసంపన్నుం
డై యుండును భోగపరుం
డై యుండును నరుడు పుణ్యుడై యుండు నృపా!- -భాగ-9-153
v
13.వామనావతారం
బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యం
వహిస్తున్నాడు.
దేవతలు స్వర్గం కోల్పోయి అడవుల పాలయ్యారు. వారి దీనస్థితికి దేవతల తల్లి అదితి తల్లడిల్లి పోయింది. వెళ్ళి భర్త కశ్యపప్రజాపతిని
వేడుకొని,
తన బిడ్డలకు స్వర్గంయిప్పించమంది. కానీ ఆయన రాక్షసులకూ తండ్రే. రాక్షసులు దితి,కశ్యప పుత్రులు. ఇప్పుడు
ఒకభార్యబిడ్డలను దించి, మరొక భార్యబిడ్డలకు
పట్టం గట్టగలరా! అదీ అకారణంగా? కనుక ఆయన అదితికి "పయోబక్షణ వ్రతంచెయ్యి, విష్ణువు
అనుగహిస్తాడు"
అన్నాడు. ఆమె ఆ
వ్రతనియమానుసారం 12 దినాలు కేవలం నీరు
మాత్రమే సేవించి వ్రతం పూర్తిచేసింది. హరి ప్రత్యక్షమై ఆమె కోరికను మన్నించి తిరిగి ఇంద్రుని స్వర్గాధిపతిని
చేస్తానని వరమిచ్చాడు.
విష్ణువు వరమైతే యిచ్చాడుకానీ, నెరవేర్చడమెలా? అన్నది ప్రశ్న. బలిచక్రవర్తి ధర్మాత్ముడు. అతన్ని అకారణగా అన్యాయంగా దండించడం చేయకూడని పని. ఎందుకంటే
విష్ణువు వైషమ్య రహితుడు. రాక్షసులపై, వారి రాజుపై భేదభావం చూపించలేడు
కదా?
అందుకే ఆయన అదితి గర్భముననే వామనుడై జన్మించి
వైషమ్యరహితంగా ఇంద్రునికి
పదవిలభించేటట్లుగా చేశాడు.
అదే చిత్రం. అదే భగవంతుని లీల. ఆయనతీరు అద్బుతం.
వామనుడు బయలుదేరి బలిచక్రవర్తి
చేస్తున్న విశ్వజిద్యాగభూమికి చేరుకున్నాడు. వామనరూపుడైన విష్ణువును చూసి అక్కడి మునులు సంభ్రమాశ్చర్యాలకు గురియయ్యారు.
శా: శంభుడో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో
దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడీ
శుంభద్ధ్యోతను డీ మనోజ్ఞతను డంచున్
విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తస్సభ్యుల్ రహస్యంబునన్.
-
--భాగ-8-533.
బలిచక్రవర్తిగూడా ఆ బాలుని
తేజస్సును గని అమితానంద భరితుడయ్యాడు. దగ్గరకు పిలిపించుకొని మంచిమాటలతో పలుకరించాడు. నీవు రావడంతో నాయజ్ఞం పూర్తిగాకముందే ఫలితం లభించినట్లయింది. నీవేమికావాలన్నా యిస్తాను, కోరుకో, లేదనకుండా యిస్తాను. అన్నాడు. నిజమే!
యెదురుగానున్నది సామాన్యుడా!
మ: ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది
క్పతి గర్వాపనయప్రవర్తి. గతలోభస్ఫూర్తి నానామఖ
వ్రత దాన ప్రవణానువర్తి సుమనోరామా మనోభేదనో
ద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి దాన్
బాగ-8-545.
అంతటి ఘనుడైన బలిచక్రవర్తి ముచ్చటపడి యెన్నెన్నో విశేషమైన వాటిని చెప్పి, కోరుకో,
యేదైనాసరే యిస్తానన్నాడు. కాని వామన మూర్తిమాత్రం, మూడడుగుల నేల
యిస్తేచాలు,
అంతకు మించి నాకు అవసరంలేదు, నేను సతోషిస్తానన్నాడు. నాగొప్ప దనాన్ని
చూచైనా తగినట్లు కోరుకోవాలిగదా! ఇంకా యేంకావాలో
కోరుకో,
అన్నాడు బలి. అయినా నా అవసరం
మూడడుగులే,
మూడడుగులనేలచాలునన్నాడు వామనుడు. ఇదంతా గమనిస్తున్న రాక్షసగురువు శుక్రాచార్యుడు, వచ్చినవాడు శ్రీహరి యని తెలుసు కున్నాడు. బలిచక్రవర్తిని హెచ్చరించాడు. దానంయివ్వొద్దు. ఈ దానం నీకు కీడుకలిగిస్తుంది, ఇట్టిదనం
యిస్తానని యివ్వక పోయినా చెఱుపు లేదు. ధర్మవిరుద్ధంకాదు.
ఆ.వె:
వారిజాక్షులందు వైవాహికములందు
బ్రాణవిత్తమాన భంగమందు
జకితగోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప. - భాగ-8-585.
అని హితవు పలికాడు. కానీ బలిచక్రవర్తి గురువుమాట వినలేదు.
ఆ.వె: బ్రతుకవచ్చుగాక
బహుబంధములనైన
వచ్చుగాక లేమి వచ్చుగాక
జీవధనములైన జెడుగాక పడుగాక
మాటదిరుగలేరు మానధనులు. -భాగ-8-599.
అని, తెలిసి తెలిసి, తనకు రాబోయే ఆపదను
లెఖ్ఖచేయకుండా,
దానంచేయడానికి కలశంతో
నీళ్ళుతెప్పించి భార్యాసమేతుడై దాన మిచ్చే ప్రక్రియలో భాగంగా నీరు
ధారపోయడానికి సిద్దపడ్డాడు. శుక్రాచార్యులు
కలశంలోని నీటిద్వారానికి అడ్డుపడి ఆపాలను కున్నాడు. వామనుడు దర్భతో ద్వారంగుండా పొడవడంతో శుక్రాఛార్యుడు ఒకకన్ను పోగొట్టు
కున్నాడు.
బలిమాత్రం దాన మిచ్చేశాడు.
దానమిచ్చినదే తడవుగా, విశ్వారూపందాల్చి వామనమూర్తి ఒక అడుగుతో పైలోకాలను, రెండవ అడుగు కొలుస్తూ భూలోకంతో సహా క్రిందిలోకాలనూ ఆక్రమించేశాడు. ఇక మూడవ ఆడుగు యెక్కడిస్తావు అనగానే బలిచక్రవర్తి తనతలను చూపించాడు. ఆ మహాదాత తలపై అడుగుమోపి, సుతలమునకు
త్రొక్కివేశాడు వామనమూర్తి. ఆ విధంగా
బలిచక్రవర్తిని తొలగించి, దేవమాత కోరిక
ప్రకారం ఇంద్రునికి స్వర్గాధిపత్యం లభింపజేశాడు హరి. ఇంతటితో ఒకకార్యం మాత్రమే నెరవేరింది.
ఇక అడిగిన దానం లేదనకుండా
యివ్వడమేగాదు,
అది వినాశన కరమని తెలిసినా భయపడక ఆడినమాటకు కట్టుబడి మహా
ధర్మాత్ముడని నిరూపించుకున్న బలిచక్రవర్తికి లభించిందేమిటి. విష్ణువు చేసిందేమిటి అన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబుగా శ్రీహరి
ఆ.వె: లోకపాలకులకు
లోనుగావక్కడ
నన్యులెంతవార లచట నిన్ను
నెల్లప్రొద్దు వచ్చి యేను రక్షించెద
గరుణతోడ నీకు గానవత్తు -భాగ-8-667.
నన్నాడు అంతేగాదు యింకా ఆనతిస్తూ-
క: సావర్ణి మనువువేళను
దేవేంద్రుండగు నితండు దేవతలకు దు
ర్భావితమగు నాచోటికి
రావించెద నంత మీద రక్షింతు దయన్.-భాగ-8-664.
క: వ్యాధులు దప్పులు నొప్పులు
బాధలుచెడి విశ్వకర్మ భావిత దనుజా
రాధిత సుతలాలయమున
నేధిత విభవమున నుండు నితడందాకన్ -భాగ-8-665.
బలిచక్రవర్తి విశ్వకర్మ నిర్మితమైన
సుతలాలయములో హయిగా యేబాధలు, వ్యాధులు
లేకుండా జీవిస్తాడు. నేనే అతనికి రక్షకుడనై
వుంటాను.
అక్కడ అతనికి ఆపద సంభవించదని మాటయిచ్చి ఆ తర్వాత
బలిచక్రవర్తే సావర్ణిమనువుకాలానికి ఇంద్రపదవి నధిరో హిస్తాడని శ్రీహరి ఆనతిచ్చారు.
అంతేకాదు,
ఒకసారి రావణుడు సుతలవెళ్ళి బలిని జయిద్దా మనుకున్నాడు.
ముందు తనమేనమామ, సైన్యాధ్యక్షుడు నైన ప్రహస్తుని పంపాడు.
అతడు యేడవవాకిట ఒకబలాఢ్యుడైన దివ్యమూర్తి ఉక్కుగదను చేబూని
కావలికాస్తూవుండటం చూచి ఆతని భీకరరూపమునకు భయపడి, రావణుని వద్దకు పరుగెత్తి పోయి, విషయం తెలియజేశాడు. అయితే తనేవెళతాని వెళ్ళి, ఆ దివ్యపురుషునిజూచి నివ్వెరపోయు నిలబడిపోయడు.
ఎందు కొచ్చావని ఆదివ్యపురుషుడు గద్దించి అడగ్గా,
భయపడి బలిచక్రవర్తి దర్శనమునకు వచ్చితినని బొంకినాడు.
సరే! ఆగమని, బలిఆజ్ఞ గైకొని లోపలికి పంపించాడు ఆ ద్వారపాలకుడు.
లోపలికి వెళ్ళి రావణుడు, బలిచక్రవర్తిని దర్శించి, బలిచక్రవర్తీ! నిన్ను హరి యిక్కడ బంధించాడు. అతన్ని జయిద్దాం. నేనునీకు సాయంచేసి విడిపిస్తా నని, నయవంచన పలుకులు పలికాడు. అప్పుడు బలి చక్రవర్తి నవ్వి రావణా! హరి అంటే యెవరో తెలిసే మాత్లాడుతున్నావా?
నా యేడవవాకిటనున్న కావలివానిని చూచి గడగడ వణికితివిగదా!
అతడే శ్రీహరి. అర్థమైనదా? అన్నాడు బలి. అవాక్కై మారుమాటాడక తిరిగివెళ్ళీపోయాడు రావణుడు.
ఆవిధంగా శ్రీహరి
బలిచక్రవర్తి వాకిట కపలాదారుడై నిత్యం రక్షిస్తూ వుండిపోయాడు సుతలంలో.
ఇప్పుడు మనం ఆలోచిస్తే, దేవమాత అదితి కోరికవల్ల ఇంద్రునకు స్వర్గసింహాసనం దక్కింది.
కానీ బలిచక్రవర్తికి శ్రీమహావిష్ణువుపైనే అధికారం దక్కింది.
సుతలంలో ప్రభువు బలిచక్రవర్తి, దాసుడు శ్రీమహవిష్ణువు. అంటే శ్రీహరి, బలిచక్రవర్తికి అన్యాయం చేశాడనగలమా? లేదు. శ్రీహరి వైషమ్యరహితుడే. జగన్నాథునికి సర్వులూ సమానులే. ఆయన పాలనలో యేపొరపాటూ వుండదు. ఉండుటకు వీలులేదు. పొరపాటేమైమావుంటే అది మన ఆలోచనలోనేనని గ్రహించి
సరిదిద్దుకోవాలి. అదీ ఆయన దయవల్లే జరగాలి. అందరం ఆయన దయకు పాత్రులయ్యెదముగాక!
// శుభం భూయాత్//
No comments:
Post a Comment