సూనృతసుధ
రచన
పి. సుబ్బరాయుడు
42/490. N.G.O కాలని
కడప-516002
సెల్: 9966504951.
(పద్యములు)
1. క: శ్రీ రామచంద్ర గురువర!
నేరని నను చెంతనిలువ నిచ్చితివి. సదా
ప్రేరణ నొసగి, బరపిన కృ
పారసదృక్మహిమ దెలిసె పరమార్థంబుల్
2. క: తెలియుననుకొంటి పెక్కులు
తెలియనివాడనని తెలిసె. తిమిరము వాసెన్
తలబిరుసుతనము తగ్గెను
కలిగెను దీనత్వమించుక తమకరుణచేన్.
3. క: చదివితి కొంతపురాణము
వదరితి రానివియునాకు వచ్చునటంచున్
మదిజొచ్చిన గర్వము మీ
పదకంజయుగంబు సోకి వదలెను దేవా!
4. క: కోరగవలసినదేదో,
కోరగరానట్టిదేదొ గుర్తింపంగన్
తెరువరయలేని వాడను,
సరియైనదె యిత్తువుగద! సర్వాధీశా!
5. క: తెలిపితివి సహజమార్గము
వెలయంగా విధివిధాన వివరములెల్లన్
సులభంబంటివి యైనన్
నిలకడలేదయ్య నాకు నీదయలేకన్.
6. క: ఆలోచన లెన్నెన్నో
నాలో కలిగెను కుదరదు నాధ్యాన మనన్
యేలా నీకావెత లా
యాలోచనలన్ని నావి యనుకొన మనవే
7. క: శ్రీరామచంద్ర గురువర!
తీరిచి దిద్దితిరి నన్ను తిరుమార్గమునన్
మీరే నాకిహము పరము
సారెకు మ్రొక్కెదను మిమ్ము సమ్మతితోడన్.
8. క: మరణసమయమున కనబడి
తరగని సంస్కారచయము దగ్ఢముచేయన్
సరగున ప్రాణాహుతి నిడి
మరుజన్మరహిత పథమున మమ్మంపుగురూ!.
9. క: ఇదినాది అదియునాదని
పదేపదే పలికిచెడితి భావములోనన్
యిదియది యంతయు మీదని
మదినెంచిననాడె వదెలె మాయయు భ్రమయున్.
10. క: ఇవియన్నియు తెలియబడెను
ప్రవిమలరూపా! నినుగని పాదములంటన్
అవివేకమంతరించెను
సవరింపంబడితినిగద! సద్గురు దేవా!
11. క: ధ్యానములో నున్న యపుడు
మానస మాహ్లాదపడునొ మరికలతౌనో
దానిన మేలే కలదని
ప్రాణాహుతినిడి నిలుపవె ప్రగతిన మమ్మున్.
12.క: మలినపు ఆలోచనలను
సలలితముగ శుభ్రపరచు సద్గురుడొదవన్
తొలగును పశులక్షణములు
ఇల గురువే దైవమనుచు నిలుపగ మదిలోన్.
13. క: అణగి పశుత్వం బాపై
యనునయముగ మానవత్వ మంకురితంబై
యనుదిన వృద్ధిన్ బొందుచు
ననుపమదివ్యత్వమంది యదియును దాటన్
14. క: ఆవల మిగిలిన మనుజుడు
జీవన్ముక్తుండనబడు, చిన్మయుడగుచున్
దైవేచ్ఛయె తనయిచ్ఛగ
జీవనమును గడుపుచుండు చెదరని మదితోన్.
15. క: జీవించియుండ నీస్థితి
దైవానుగ్రహముగలుగ, తగుసాధనచే
నావంతయు సందేహం
బేవేళనులేక పొందిరిది సత్యంబౌ
16. క: ఇదియంతయు సులభమగును
పదిలంబుగ సద్గురువరు పాదములకడన్
మదినిల్పి శరణుజొచ్చిన
హృదయంబర్పింప సర్వమయ్యదె గూర్చున్
17. క: కారాగారము గృహమని
దారాసుతశృంఖలముల తా బంధీయై
యారాటపడగనేటికి
సారమతుల్ తేల్చిరి యిది సరిగాదనుచున్.
18. క: అందరు దేవునిబిడ్డలె
అందున నీసతియు సుతుల కాధారముగన్
నుందువు సమ్మతితోడన్
బంధములేదీ విధమున బ్రతుకుటవలనన్.
19. క: మనమాశపడినదందదు
మనకు లభించినదదేమొ మదిమెచ్చదు. ఈ
మనసొప్పిన, నొప్పకయు
న్నను రెంటికతీతమైన. నదె మోక్షంబౌ
20. క: కలిగిన దదియేదైనను
తలచుచు దైవంబె నుంచె తనకడననుచున్
పలువిధసత్కార్యంబులు
లలిజేయుచు ధర్మకర్తలాగుండవలెన్
21. క: చేసిన పనులన్నియు నే
చేసితిననుకొనక దైవ చెయిదము లనుచున్
దాసుని రీతిగ మెలగుచు
కాసైనను నడుగరాదు కావలెననుచున్
22. క: పరతత్వవిదులు తలుపన్
త్వరితంబుగ పూర్తియగును ధరకార్యంబుల్
నెరవేరిన విధమిట్లని
యెఱుగంగా తరముగాదు నెవ్వరికైనన్.
23. క: ధ్వనులన్ని యుడిగినంతట
వినిపించును దైవావాణి, వేదంబదియై
విని ముందునకరుగగ నా
వాణియు శాంతించు. నరుడు బడయును ముక్తిన్
24. క: భావతీతము బ్రహ్మము
కావలె గమ్యము మనకది కాననిదైనన్
మీవెంట గురుడు కలడిక
వేవేగమెసాగుడింక విజయము మీదే.
25. క: జనులందర ప్రేమించుచు
ననునయమున దరికిజేర్చు నాతడె గురుడౌ
వినయంబున ప్రేమింపుడ
తనిని మదిమరువక తలచి తన్మయుడగుడీ
26 క: హృదితాకెన్ ప్రాణాహుతి.
ఇది గమ్యము దరికిజేర్చు. హితమును గూర్చున్.
ఇదియే సులువగు మార్గము
వదలుడు, అలసత్వమింక వడిగా చనుడీ.
27. క: సత్యము సత్యంబెయగు, న
సత్యముగూడ నొకయెడల సత్యమనబడున్
సత్యాసత్యము కావల
నత్యంతమగు నెఱుకగల దయ్యది గనుమా!
28. క: తెలివి మితిమీరినయతడు
తెలివియె లేనియతడు భువిదెత్తురు బాధల్
తెలివిని తగువిధి వాడన్
గలుగును సుఖశాంతులు మరి గలుగవు వెతలున్.
29. క: ఉన్నతలక్ష్యంబు గలిగి
తిన్నగ నద్దానిజేర్చు తెరువును మరియున్
నున్నతుడగు మార్గదర్శియు
నున్నపుడే పొందు మనుజుడుత్తమగతులన్.
30. క: సభలో మాటాడుటకళ
సభనాకర్షించగలిగి సముచిత మృదుభా
వ భరిత పదవిన్యాసత
నభిరామంబవ్వగవలె నాధ్యంతంబుల్.
31. క: వినవలె శ్రోతై శ్రద్ధగ
అనవసరముగ విసిగించి యడ్డము పడుచున్
పనిగట్టుక వక్త మన-
స్సు నొవ్వబలుకంగరాదు. శోభింపదదిన్.
32. క: పరుషములు వక్త బలికిన
నిరసన దెలుపుటకు బదులు నిలువక సభలోన్
సరగున బయటకు నడచుటె
సరియగు విధమని పలికిరి సభ్యజనంబుల్.
33. క: నేనున్న తావులందున
ఓ నిముషంబైన వూరకుండరు జనముల్
వీనుల రొదయై యున్నది
ధ్యానము కుదరదని యనుట తగదేనాడున్.
34. క: మనకై యేరొదయైనన్
పనిగట్టుకజేయ రెవరు, పదపడి మనమే
రొదపై మనసిడి వగతుము
మనకయ్యది యడ్డమనెడు మాటలు కల్లౌ.
35. క: హృదయమున గమ్యము నిలిపి
ముదమారగ సాధనమున మునిగిన తేలున్
రొదగాదు నిన్ను పట్టెను
వదలక పట్టినది నీవె వాస్తవమనుచున్..
36. క: తప్పులు లోపములున్నను
ఒప్పిదము గలుగ మనసుల, నుద్వాహంబౌ
ఒప్పని జంట వివాహము
నిప్పులకుంపటియె యౌను నియతిగ నైనన్.
37. క: మనసైనవాని సతియై
యనుకూలత మెట్టినింట నన్నియు తానై
యనురాగసుధల పంచుచు
తనజన్మము ధన్యమంద తరుణి చరించున్.
38. క: ఆదర్శగృహిణి తానై
ఆదరణన్ జూచు కోడలై, సన్మాతై
పాదుకొని మెట్టినింటను
శ్రీదేవియనన్ మెలగుచు శ్రేయముగూర్చున్.
39.క: సతిపతులు సమమని తలుప
జతగట్టి తరింపవచ్చు సంసారాబ్దిన్
సుతరాము గిట్టకుండిన
జతనెవ్వరు బాగుచేయజాలరు జగతిన్
40. క: తనసంపాదన శ్రేష్ఠము
కనికరమొక్కింతలేక కానుక కట్నం
బని గైకొన చెఱుపు గలుగు.
అనువంశిక ధనము దెచ్చు నఱకొర ఫలముల్.
41. క: మనిషికి కృతజ్ఞత సొబగు
తినదు శునకమున్ కృతఘ్నుదేహ పలలముల్
మునుచెప్పె భారతంబిది
చనదగదెప్పుడు కృతఘ్ను ఛాయలకేనిన్.
42.క: ఫలితంబుబొందు యోగ్యుడు
తలచి గురుపదముల వ్రాల దాసుని రీతిన్
సులభముగ గలుగు యోగ్యత
తలుప సదాచరణె యోగ్యతకు సాక్ష్యమగున్.
43. క: భగవత్కార్యంబు జరుగు
సుగమంబుగ నర్హులైన సుమతుల వలనన్
కనిపించు దైవము మరియు
నిగమాకారంబువారె నిక్కమెఱుంగన్.
44.క: పసిడియగు పరుసవేదిన
మసియౌ నగ్నిబడినంత, మరి గురుమహిమన్
వసుధ గురువులు వెలుబడి
మసలుదురు మహాత్ములగుచు మానవ హితులై.
45.క: తుహినము తొలగిన పిదపన్
మహిమాన్వితుడై వెలుగు మార్తాండు విధిన్
యహమును విడిచిన యంతనె
రహి నాత్మానుభవ దీప్తి రాజిలు నరుడున్.
46. క: నీలోని నిర్మలత్వమె
నీ లోగిలిలోన నిలుపు నిజమగు గురునిన్
తేలికయగు సాయుజ్యము
ఆలోకింపగ నినునత డనుకంపమెయిన్.
47.క: కానగవచ్చున్ గురువును
దానిన మేల్గలుగుననుట తథ్యంబైనన్
పూనిక గురువే శిష్యుని
కానగ చనుదెంచుటరయ కడునుత్తమమౌ.
48.క: ఇది సాధ్యంబగు, శిష్యుడు
వదలక హృదిలో గురువును భక్తిశ్రద్ధన్
పదిలముగ నిల్పినప్పుడు.
నిదియది యడ్డుకొననేర వెవ్విధినతనిన్.
49. క: జరుగును దైవము తలచిన
నెరవేరవు మనమె తలుప, నిజమిది యైనన్.
కొరగానివెన్నొ కోరుచు
నిరకాటములోన బడగనేటికి మనకున్.
50. క: ఇచ్చినదంతయు దేవా!
యిచ్చితివది నాకు మిగుల హితమగుననుచున్
ఇచ్చకమొదవన్ గైకొని
సొచ్చితి నీ శరణమయ్య శుభ్రజ్యోత్స్నా!
51. క: కనిపించు పరుల దోషము
మునుముందది మనకుసోకి ముదిరిన వెనుకన్
మనసుండన్ స్వచ్ఛముగను
కనరారిల దోషయుతులు కలలోనైనన్.
52. క: పరులను తప్పులు బట్టుట
మరిమరి పనిగట్టుకొనుచు, మానక జేయన్
జెరచున్ యలవాటైయది.
పరనింద వదలి మసలుము పరహితమతివై.
53. క: కామోద్రేకమునాపుట
యేమంతపనియని నిక్కి యెవ్వండైనన్
ధీమంతుడనన నొప్పదు
భీమంబై నెగయు నదియు పెనగిన కొలదిన్.
54. క: పెనగెడు మాట యటుంచుము
పనివడి యే కాముకి నిను వంచించుటకున్
వెనుగొన నేరదు. దైవము
నిను కృపగన, కయ్యమేల నీకాపిదపన్.
55. క: మనతోనయ్యెడు కార్యము
కనరాదొక్కటియుగాని క్రమగతి జూడన్
వినయవిధేయత తోడన్
పని కర్తవ్యముగనెంచి వదలుమహంబున్.
56. క: తను చనిపోయిన పిదపన్
తనదారాసుతుల బ్రతుకు దయనీయంబౌ
ననుచు వగచి మరణించిన
వెనుకనె తీరెను తనయుల వెతలన్ని ధరన్
57. క: పితరుడు పితరునిభాద్యత
సుతుకర్తవ్యము సుతుండు సూనృతవృత్తిన్
సతతము నిర్వర్తించుచు
బ్రతుకంగవలయు బలమగు బంధములేకన్.
58. క: ధర్మానుసారముగ ధర
కర్మఫలానుభవముండు. కరమరయంగా
మర్మములేదిందేమియు
నర్మిలి కర్మమరువియ్య నగునేయెందున్.
59. క: ఎప్పటికిని కర్మఫలము
తప్పించుకొనుట జరుగదు. తప్పెనటన్నన్
యిప్పటికి మాత్రమె సుమీ
తప్పదు మరుజన్మనైన తగజుట్టుకొనున్.
60. క: మరుజన్మ వలదనుకొనిన
త్వరితముగా కూడుకొన్న పలువిధ కర్మల్
హరియింపననుభవించియు
మరికర్మలు జేయకుండ మసలగవలయున్.
61. క: ఫలితంబాసించని పని
వలన కలుగదు మరుజన్మ. పనిముట్టౌదున్
వలనుగ దైవమున కనుచు
కలుషములంటని విధమున గరపుము పనులన్.
62. క: పనిముట్టువు నీవనుకొన
పనిఫలితములన్ని జేరు పనిమంతునకే
పనిముట్టు కెట్టి ఫలితము
కనుగొందుమె కలిగినట్టి ఘట్టములెందున్.
63. క: ఇది నిజమాయని కొందరు
మది శంకింతురు మరిమరి, మాయకు లోనై.
కదలి పనిచేయ రంగము-
న దిగిన మాయ విడిపోయి నమ్మిక కలుగున్.
64.క: క్రమముగ చేయన్ ధ్యానము
సుముఖముగ గడచి హృదయము శూన్యతజెందన్.
శమియించగ నొడిదుడుకులు
సమగతి దివ్యత్వ మలమి సద్గతి జూపున్.
65. క: ఎన్నెన్ని జన్మలయ్యెనొ
ఉన్నామిచ్చోట నిపుడు నొకరికి నొకరై
పిన్నెవరో పెద్దెవరో
ఎన్నేళ్ళో మన ఉనికికి యెఱుగ మెవరమున్.
66. క: కనుక వయసెంత యనియెడు
గణియింపువదలి సుగతుడు కడవాడైనన్
వినవలె నాతని బోధలు
అనుకొనరాదతడు పిన్న, అధముడటంచున్
67. క: గౌరవముగ జూచు వయసు
మీరినపెద్దలను జగతి. మీరారీతిన్
వారియెడ లోకనీతి న
వారితముగ సాగనియ్యవలె సవ్యగతిన్.
68. క: ధనమున్నయప్పుడు మరియు
ధనమసలే లేనపుడును తప్పవు వెతలున్
ధనమున్నను లేకున్నను
అనిశము నొకరీతి గడుపు నాతడె సుఖియౌ
69 క: గిట్టి ధనవంతుడొక్కడు
పుట్టి దరిద్రుడుగ, పూర్వ పుట్టుక విషయం
బెట్టిదొ యెఱిగియు, నప్పటి
బొట్టొకటైనను తనదనబోవగ నగునే
70. క: అటువంటి ధనము కొఱకై
యెటుజూచిన మేలులేదు హింసకు బూనన్.
కటువుగమారక ధర్మము
నెటులైనను నిల్పుమిలను హితకరివగుచున్.
71. క: నేనేమి యీకజచ్చిన
ఆనక నాకొడుకులిత్తురనుకొన దగునే
నీవెర్రిగాక యీపని
నీవే జేయగవలెనని, నీవెరుగవటే!
72. క: గతజన్మల తండ్రులు మరి
సుతులెందరు గలిగిచనిరొ? చుట్టములెవరో
సుతరామెరుంగమెవరము
పితరుల తలపోతలేల? పెంచుడు మంచిన్.
73. క: వచ్చితి మెచ్చటినుండియొ
చచ్చినతర్వాతెచటకు జనెదమొయేమో?
చచ్చుట పుట్టుటటుంచుము
స్వచ్చముగా బ్రతుకుదమిట వంచనలేకన్.
74. క: నేనే మొనగాడననుచు
నేనేమనిన యెదురాడ నేరరటంచున్
పోనాడరాదు నెవరిన్
నేనేయన యహమటంచు నిజమెఱుగవలెన్.
75. క: నావలననె యీ పనులగు
కావెవరివలన యనియన కావరమదియౌ.
నావిధి యిదియని తలచుచు
జీవనయానంబు సాగ, చేయుట శుభమౌ.
76. క: జన్మ మనచేతనుండిన
జన్మించడెవండు హీనజన్ముని యింటన్.
జన్మము కర్మానుగతము
సన్మార్గమునందు నడువ సద్గతి గలుగున్.
77. క: మెలిగెదమిల నీతిగనని
పలుకుట సులభము. పదపడి పనిచేయంగన్
వలనవ్వదటంచందురు
విలువలు పాటించి బ్రతుక, విధమేదనుచున్.
78. క: కొందరు తప్పన్నది మా
యందేమియులేదు, లోకమందందరిదే
చందంబున బోవగ మే
మిందుకు భిన్నముగ నడువ నేమౌ ననరే.
79. క: ఈమాత్రమైన చేయక
నేమాత్రము బ్రతకలేము యిలలో ననుచున్
సామాన్యంబిది పొమ్మని
తామసవృత్తిన్ విడువక తప్పిరి నీతిన్.
80. క: తప్పనునొకండు జూదము
తప్పేకాదను నొకండు తలదరుగుటయున్
ఒప్పగు త్రాగుడను నొకడు
తప్పొప్పుల మాటలెల్ల తలకొకటయెన్.
81. క: మనసున్న మానిసెరుగును
తనుచేయదగినది మరియు తగనిది యేదో
మనసున మలినము తొలగిన
కననగు సన్మార్గమదియె గమ్యము జేర్చున్.
82. క: ధనమెంతగూడియున్నను
తనలోపలగల యభద్రతాభావమునన్
ధనమింతియె చాలదనుచు
ననయము చింతించు ప్రాకులాడుచు నుండున్.
83. క: పరులపహరింతురనుకొను
మరియొకడుండంగరాదు మముమించియనున్
తరగక హెచ్చౌటెట్లను
నిరతము ధనము ధనమనుచు నియతిని దప్పున్.
84. క: అంతర్గత ఘర్షణయే
యింతకు కారణ మశాంతి యేర్పడ లోలోన్.
సుంత వివేకము గలుగన్
నంతంబగు కలత. శాంతమలమును హృదిలోన్.
85. క: కలుగ వివేకము మానిసి
కలతల దరిజేరనీక కడుశాంతమతిన్
వలదేది వలయునేదియొ
తెలిసి చరించును నిరతము ధీమంతుండై.
86. క: మనకై మారదు లోకము
మనమే సహనము వహించి మసలగ వలయున్.
కనమితర మార్గమేదియు
జనమును నిందింప మేలు సమకూరదిలన్.
87. క: లేదానందం బిలలో
కాదని వాదింపవచ్చు గాని జనంబుల్
వేదన, వేదనకు నడుమ
శోధన లేనట్టి యడమె సుఖమనెదరిలన్.
88. క: వేదికపై జనము పొగడ
వాదింతురు హేతువాద వైనము దెలియన్
కాదనక భార్యమాటలు
పూదండల జేతురింట పురహరు పూజల్.
89. క: ఇదెయేమి హేతువాదము
అదియెట్లగు దైవపూజ. అంతయు నటనే
తుదకాతడు చెడి రెంటికి
పదుగురెదుట పలుచనగును, పరువును పోవున్.
90. క: శ్రీవాసుదేవుడన మరి
శ్రీవామబ్రహ్మమనగ, రెండును సమమే
దేవతరుల ‘సు’ ‘మ’(సుమ) భేదమె
చూవె! ఫలములొకటె తరచి చూడగనెందున్.
91. కం: నడవడి యే సంకేతము
కడునుత్తముడితడని కనుగొనుటకునై
నడవడి సరిజేసుకొనక
నడయాడెడువాడు దూర్తనరుడనవచ్చున్.
92 కం: యోగులుగ మారి యందరు
సాగించగ లేరు బ్రతుకు సదమలరీతిన్
యోగం బటుంచుడు. నిరుప-
యోగులు కారాదెవరన యుక్తము సుమ్మీ
93.క. నదిదాటించెడు పడవయె
గద! గురువని తలుప దగదు. కనుగొన నతడున్
నది పోటెత్తిన యపుడును
పదిలముగా సాగి మనల వదలక గాచున్.
94 క. చావనిన భయము గలుగును
చావును తప్పించుకొనుట జరుగనిదైనన్
చావును జయించితిమనగ
చావన్న భయంబువీడి చరియించుటయే.
95.క: పుట్టుటకు ముందు సంగతి
గిట్టినతర్వాతి గతియు కించిత్తైనన్
యిట్టిట్టని యెరుగనతడు
దిట్టయు, పరతత్త్వవేత్త, దివ్యుండగునే.
96.క: కవులు సరస్సులు చూడన్
ప్రవిమలముగతోచు గాని పరికింపగలోన్
అవిమల పంకమె సుమ్మీ!
అవసరమే అంతలోతు లరయగ మనకున్.
97.క: పరమాత్మ కలడు లేడని
మరిమరి వాదించుకొనుచు మరతురు విధులన్
కరమరయక లేడనియన
నరులకు కట్టడియె లేక నడవడి చెడదే.
98.క: కొందరు కలడంతటయన
కొందరు గోలోకమందు కొలువుండనగన్
కొందరు నేనే బ్రహ్మం
బందురు. సందిగ్దమయ్యె నర్థముగాకన్.
99.క: ధ్యానంబున తన ఉనికిన్
స్థానము సమయంబు మరచి తన్మయుడగుచున్
తానెవరొ?యేమో? యెరుగని
వాని ననుసరింప వలయు. వలదితరంబున్.
100 క: అదిశూన్యమునకు శూన్యం
బదెమన గమ్యంబు. దైవమగుననె గురుడున్
అదియిట్టిదనగ వశమె
మది మెదలదు శూన్యమనెడి మాటయు నచటన్.
101 క: నినునీవు తెలుసుకొమ్మని
యననచ్చట నీవుగలవు. అది యహమేగా!
కనుక నినునీవు మరచిన
యనుభూతుల కావల గల యదె నీవనవే!
---
*** sunrutasudha
No comments:
Post a Comment